అవినాష్‌రెడ్డి ముందస్తు బెయిల్‌పై విచారణ జూన్ 5కి వాయిదా.. హైకోర్టు కీలక వ్యాఖ్యలు..
మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో సీబీఐ విచారణ కొనసాగుతోంది.. మరోవైపు ఈ కేసులో కడప ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి ముందస్తు బెయిల్ కోసం ప్రయత్నాలు సాగిస్తున్నారు.. ఆయన ముందస్తు బెయిల్‌పై విచారణ సమయంలో హైకోర్టులో కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి.. ఎంపీ అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్ పిటిషన్ విచారణ ఇవాళ సాధ్యం కాదని తెలిపింది తెలంగాణ హైకోర్టు.. వాదనలు విన్నా.. తీర్పు ఇవాళ ఇవ్వలేమని హైకోర్టు వ్యాఖ్యానించింది.. అయితే, అత్యవసరమైతే చీఫ్ కోర్టును అభ్యర్థించండి అంటూ ఎంపీ అవినాష్ రెడ్డి తరపు లాయర్‌కు సూచించింది.. మొదటి వెకేషన్ కోర్టులో విచారించేందుకు చీఫ్ జస్టిస్ దగ్గర మెన్షన్ చేసుకోవాలని సూచించింది హైకోర్టు సింగిల్ బెంచ్.. ఇక, కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్ పిటిషన్‌పై తదుపరి విచారణను జూన్ 5వ తేదీకి వాయిదా వేసింది హైకోర్టు సింగిల్ బెంచ్ .. మరోవైపు.. హైకోర్టు చీఫ్ జస్టిస్ దగ్గర మెన్షన్ చేశారు ఎంపీ అవినాష్‌రెడ్డి తరపు న్యాయవాదులు.. కానీ, అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్ పిటిషన్‌పై వాదనలకు నిరాకరించారు హైకోర్టు చీఫ్ జస్టిస్.. ఇప్పటికిప్పుడు వాదనలు వినాలంటూ కోర్టు మీద ఒత్తిడి చేయొద్దు అని వ్యాఖ్యానించారు.. ఈ రోజు, రేపు, ఎల్లుండి వాదనలు వినాలని మీరు చెప్పడం సరికాదన్నారు సీజే.. ఈ విషయంలో సుప్రీంకోర్టు కూడా సీరియస్ అయ్యిందని ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు సీజే.. కాగా, రేపటి నుంచి హైకోర్టుకు వేసవి సెలవులు ఇప్పటికే ప్రకటించారు.. వెకేషన్ తర్వాతే తీర్పు ఇస్తామని హైకోర్టు పేర్కొంది. కాగా, తెలంగాణ హైకోర్టుకు మే 1వ తేదీ నుండి జూన్ 2వ తేదీ వరకు వేసవి సెలవులు ఉంటాయి.. అయితే, మే నెలలో నాలుగు రోజులు, జూన్ 1 వ తేదీన వెకేషన్ కోర్టులు పనిచేయనున్నాయి.. 5 వెకేషన్ 5 డివిజన్ బెంచ్‌లు, 5 సింగిల్ బెంచ్‌లు పనిచేస్తాయి.. అయితే, ముందస్తు బెయిల్‌పై ఈ రోజు తీర్పు వస్తుందని ఎదురుచూసిన ఎంపీ అవినాష్‌రెడ్డికి ఎదురుదెబ్బ తగిలినట్టు అయ్యింది.. మరి, అవినాష్‌రెడ్డి వెకేషన్ బెంచ్‌ను ఆశ్రయిస్తారా.. ముందుస్తు బెయిల్ కోసం సుప్రీంకోర్టుకు వెళ్తారా? అనేది ఆసక్తికరంగా మారింది.
సీఆర్డీఏ పరిధిలో ఇళ్ల పట్టాల పంపిణీ.. ఏర్పాట్లుకు సీఎం ఆదేశం
సీఆర్డీఏ పరిధిలో పేదలకు ఇళ్ల పట్టాలు పంపిణీ చేసేందుకు సిద్ధం అవుతోంది ప్రభుత్వం.. దీనిపై తగిన ఏర్పాట్లు చేయాలంటూ సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి.. పేదలందరికీ ఇళ్లు కార్యక్రమంపై తాడేపల్లిలోని క్యాంప్ కార్యాలయంలో ఈ రోజు సమీక్ష నిర్వహించిన సీఎం.. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. పేదలందరికీ ఇళ్ల కార్యక్రమానికి సంబంధించి నిధులకు ఎలాంటి లోటు లేదని స్పష్టం చేశారు.. 2022-23 సంవత్సరంలో 10,200 కోట్ల రూపాయలు ఖర్చు చేశాం.. ఈ ఆర్థిక సంవత్సరంలో రూ.15,810 కోట్లు ఖర్చు చేయనున్నాం.. ఎక్కడా బకాయిలు లేవన్నారు. ఇళ్ల నిర్మాణం వల్ల ఆర్థిక వ్యవస్థ బలోపేతం అవుతుందన్నారు సీఎం వైఎస్ జగన్.. పేదలందరికీ ఇళ్ల కార్యక్రమాన్ని చురుగ్గా ముందుకు తీసుకెళ్లాలని ఆదేశించారు. అన్ని జిల్లాల అధికారులు ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు. వేయికి పైగా ఇళ్లు నిర్మిస్తున్న కాలనీలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని స్పష్టం చేశారు.. 10.03 లక్షల లబ్ధిదారులకు రూ.3,534 కోట్లకు పైగా రుణాలు మంజూరు అయ్యాయని.. ప్రతి శనివారం హౌసింగ్ డేగా పరిగణించాలని తెలిపారు.
విద్యార్థులకు గుడ్‌న్యూస్.. స్కూళ్లు తెరిచిన రోజే విద్యాకానుక..
విద్యార్థులకు మరో శుభవార్త చెప్పారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డి.. ఇప్పటికే వేసవి సెలవులు ప్రారంభం కాగా.. స్కూళ్లు జూన్ 12న తిరిగి తెరుస్తారు.. అయితే, అదే రోజు వారికి విద్యాకానుక అందించాలని ఆదేశాలు జారీ చేశారు.. ఇందులో ఎలాంటి ఆలస్యానికి తావుండకూడదని స్పష్టం చేశారు.. తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో పాఠశాలల్లో నాడు – నేడు కార్యక్రమం పై సమీక్ష నిర్వహించారు సీఎం వైఎస్ జగన్.. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. స్కూళ్ళల్లో నాడు – నేడుకు సరిపడా నిధులు ఉన్నాయన్నారు.. తల్లిదండ్రుల కమిటీల ఖాతాల్లో రూ.734.21 కోట్లు ఉన్నాయని తెలిపిన ఆయన.. తదుపరి ఖర్చుల కోసం మరో రూ.1400 కోట్లు కూడా అందుబాటులో ఉన్నాయన్నారు. ఐఎఫ్‌పీ పానెళ్లు బిగించడం పూర్తి కావడంతో 15వేలకు పైగా స్కూళ్లలో చేపట్టిన మొదటి విడత నాడు – నేడు పనులు పూర్తయినట్టే అని వెల్లడించారు. ఇక, పాఠశాలల్లో డిజిటిలీకరణ కూడా పూర్తవుతుందన్నారు సీఎం వైఎస్ జగన్.. జూన్ 12 లోగా ఈ ఐఎఫ్‌ఎప్ ప్యానెళ్ల బిగింపు పూర్తి కావాలని ఆదేశాలు జారీ చేసిన ఆయన.. గ్రామ, వార్డు సచివాలయాల్లోని డిజిటల్ అసిస్టెంట్లు స్కూళ్లకు వెళ్లి ఉపాధ్యాయులు, పిల్లలకు ట్యాబ్‌ల వినియోగంపై అవగాహన కల్పిస్తారని వెల్లడించారు.. నెలకోసారి తప్పనిసరిగా డిజిటల్ డేగా పరిగణించాలని సూచించారు.. స్కూళ్లు జూన్ 12న తిరిగి తెరుస్తారు, అదే రోజు వారికి విద్యాకానుక అందించాలని.. ఇందులో ఎలాంటి ఆలస్యానికి తావుండకూడదని.. దాదాపు 43.01 లక్షల మందికి జగనన్న విద్యాకానుక అందుతుందని పేర్కొన్నారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డి..
మాదక ద్రవ్యాల నివారణపై సీఎం ఫోకస్.. కీలక ఆదేశాలు
మాదక ద్రవ్యాల నివారణపై ఫోకస్ పెట్టారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డి.. మాదక ద్రవ్యాల నివారణపై పోలీసు అధికారులు దృష్టి పెట్టాలని ఆదేశాలు జారీ చేశారు.. ప్రతి కాలేజీలో ఎస్‌ఈబీ టోల్‌ఫ్రీ నంబర్‌ను డిస్‌ప్లే చేయాలని సూచించిన ఆయన.. వీటికి సంబంధించి పెద్ద పెద్ద హోర్డింగ్స్ పెట్టాలన్నారు.. జిల్లాల పోలీసు కార్యాలయాల్లో ప్రత్యేక డివిజన్‌ను ఏర్పాటు చేయాలని స్పష్టం చేశారు.. కాలేజీల్లో ఇంటెలిజెన్స్ వ్యవస్థలను ఏర్పాటు చేసుకోవాలి.. వారి నుంచి నిరంతరం సమాచారం తీసుకోవాలన్నారు.. పిల్లలు వీటి బారిన పడకుండా వారికి కౌన్సెలింగ్ నిర్వహించాలని.. మాదకద్రవ్యాలు తయారి, రవాణా, పంపిణీ చేస్తున్న వారి పై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేశారు.. గ్రామ సచివాలయాల్లో మహిళా పోలీసులకు అవగాహన కల్పించాలని పేర్కొన్నారు సీఎం.. 15 వేల మందికి పైగా మహిళా పోలీసులు ఉన్నారు.. వారు సమర్థవంతంగా పని చేసేలా, వారి నుంచి మంచి సేవలు పొందేలా చూడాలని ఆదేశించారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్.
ఆ ఎమ్మెల్యేల మీద చర్యలెందుకు తీసుకోలేదు..
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన దళితబంధు పథకంపై ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. దళిత బంధు పథకం అమలులో కొంతమంది ఎమ్మెల్యేలు మూడు లక్షల రూపాయలు తీసుకుంటున్నారని చెప్పిన ముఖ్యమంత్రి కేసీఆర్ వాళ్లపైన ఎందుకు చర్యలు తీసుకోవడం లేదో సమాధానం చెప్పాలి అని కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి డిమాండ్ చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఎమ్మెల్యేల అవినీతిని ప్రోత్సహిస్తున్నాడా?.. ఎమ్మెల్యే ల అవినీతి చిట్టా తన దగ్గర ఉంది అన్న సీఎం తన ప్రభుత్వంలో అవినీతిపరులు ఉన్నట్టు ఒప్పుకున్నట్టే కదా..! వారిపై చర్యలు తీసుకోకుండా వారిని ప్రోత్సహిస్తున్నాడా అంటూ ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. 2022- 23 ఆర్థిక సంవత్సరంలో ఎంత మంది లబ్ధిదారులకు దళిత బంధు ఇచ్చారు అని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ప్రశ్నించారు. ఏసీబీ పరిధిలోకి వచ్చే ప్రజాప్రతినిధులపై చర్యలేవీ అంటూ కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి నిలదీశారు. రాజయ్యపై ఆరోపణ వస్తేనే ఉప ముఖ్యమంత్రి పదవి నుంచి తొలగించారని మండిపడ్డారు. దళిత జాతిని కేసీఆర్ అవమానిస్తున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. అవినీతి చేస్తే అడ్డంగా నరకుతా అన్న కేసీఆర్ కు ఎవరు అడ్డొస్తున్నారని అడిగారు. ఎమ్మెల్యేల తాట తీయడానికి కేసీఆర్ కు భయమెందుకు అని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ప్రశ్నించారు.
కాంగ్రెస్‌కు మైండ్ దొబ్బింది.. “విష సర్పం” వ్యాఖ్యలపై ఫైర్
కర్ణాటక ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతోంది. మరోసారి అధికారంలోకి రావాలని బీజేపీ, బీజేపీని గద్దె దించాలని కాంగ్రెస్ హోరాహోరీ ప్రచారాన్ని నిర్వహిస్తున్నాయి. ఇదిలా ఉంటే కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే కలబురిగి సభలో ప్రధాని నరేంద్ర మోడీపై చేసిన వ్యాఖ్యలు ప్రచారాన్ని రసవత్తంగా మార్చాయి. మోడీ ‘విష సర్పం’ అంటూ ఖర్గే వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. దీనిపై బీజేపీ ఘాటుగానే స్పందిస్తోంది. శుక్రవారం కేంద్ర హోంమంత్రి అమిత్ షా మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీకి మతిపోయిందని అన్నారు. ప్రపంచం మొత్తం ప్రధాని మోడీని పొగుడుతుంటే కాంగ్రెస్ మాత్రం విష సర్పం అంటూ పిలుస్తున్నారంటూ కర్ణాటక ఎన్నికల ర్యాలీలో ఆయన మండిపడ్డారు. అంతకుముందు కేంద్రమంత్రి స్మృతి ఇరానీ ఖర్గే వ్యాఖ్యలపై మండిపడ్డారు. కాంగ్రెస్ నిరాశతో ఇలాంటి వ్యాఖ్యలు చేస్తోందని, భారత్ పై దాడి చేస్తున్నారని మండిపడ్డారు. ప్రపంచం మొత్తం మోడీని ఆమోదించిందని, సోనియా గాంధీ ఆదేశాల మేరకే కాంగ్రెస్ నేతలు ఇలా చేస్తున్నారని, ఆమె విషకన్య అంటూ, భారత్ ను నాశనం చేయాలనుకుంటున్న పాకిస్తాన్, చైనాలకు ఆమె ఏజెంట్ అంటూ బీజేపీ ఎమ్మెల్యే బసనగౌడ యత్నాలు సంచలన వ్యాఖ్యలు చేశారు.
మనీష్ సిసోడియాకు మరోసారి బెయిల్ నిరాకరణ..
ఢిల్లీ లిక్కర్ కేసులో మనీస్ సిసోడియాకు మరోసారి చుక్కెదురైంది. బెయిల్ ఇచ్చేందుకు సీబీఐ న్యాయస్థానం నిరాకరించింది. ఢిల్లీ లిక్కర్ పాలసీలో మనీలాండరింగ్, అవినీతికి పాల్పడినట్లు ఢిల్లీ మాజీ డిప్యూటీ సీఎం మనీస్ సిసోడియా అభియోగాలను ఎదుర్కొంటున్నారు. తాజాగా ఆయన బెయిల్ కోసం చేసిన అభ్యర్థనను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED) వ్యతిరేకించింది. దర్యాప్తు కీలక దశలో ఉందని కోర్టుకు విన్నవించింది. సీబీఐ దర్యాప్తు చేస్తున్న ఈ అవినీతి కేసులో సిసోడియాకు మార్చి 31న బెయిల్ తిరస్కరించింది న్యాయస్థానం. ఈ మొత్తం స్కామ్ లో దాదాపుగా రూ. 90-100 కోట్లు కిక్ బ్యాక్ తీసుకునే కుట్రలో సిసోడియా కీలక నిందితుడిగా ఉన్నాడని కేంద్ర ఏజెన్సీలు ఆరోపిస్తున్నాయి. అంతకుముందు రోజు గురువారం సిసోడియా కస్టడీని ఢిల్లీలోని రౌస్ ఎవెన్యూ కోర్టు పొడగించింది. మే 12 వరకు ఆయనకు జ్యుడిషియల్ రిమాండ్ విధించింది. కేసు దర్యాప్తు పురగతివలో ఉందని రిమాండ్ పొడగించాల్సిందిగా సీబీఐ చేసిన అభ్యర్థను కోర్టు అంగీకరించింది. ఈ కేసులో ఫిబ్రవరి 26న సిసోడియాను సీబీఐ అధికారులు అరెస్ట్ చేశార. ప్రస్తుతం అతను తీహార్ జైలులో ఉన్నాడు.
వారి వల్ల దేశం పరువు పోతోంది.. పీటీ ఉష వివాదాస్పద వ్యాఖ్యలు
భారత రెజ్లింగ్ సమాఖ్య అధ్యక్షుడు బ్రిజ్ భూషణ్‌కు వ్యతిరేకంగా రెజ్లర్లు దేశ రాజధాని ఢిల్లీలో ఆందోళనకు దిగిన విషయం తెలిసిందే! రెజర్లపై బ్రిజ్ భూషణ్ లైంగిక వేధింపులకు పాల్పడుతున్నాడని, అతనిపై చర్యలు తీసుకోవాలని జంతర్ మంతర్ వద్ద నిరసన చేపట్టారు. ఈ నిరసనలో భజరంగ్ పూనియా, వినేష్ ఫోగట్, సాక్షి మాలిక్, సహా ఇతర ప్రముఖ రెజ్లర్లు పాల్గొన్నారు. వీరికి ఇతర క్రీడాకారులు మద్దతుగా నిలుస్తుంటే.. భారత ఒలింపిక్ సంఘం (ఐఓఏ) అధ్యక్షురాలు, దిగ్గజ అథ్లెట్ పీటీ ఉష మాత్రం వివాదాస్పద వ్యాఖ్యలు చేసింది. వారు వీధుల్లోకి వెళ్లకుండా ఉండాల్సిందని, తమ వద్దకు వచ్చి ఫిర్యాదు చేసి ఉంటే బాగుండేదని అన్నారు. వాళ్లు చేస్తున్న నిరసనల వల్ల.. దేశం పరువు పోతోందంటే కుండబద్దలు కొట్టారు. పీటీ ఉష మాట్లాడుతూ.. ‘‘లైంగిక వేధింపులపై ఫిర్యాదు చేసేందుకు భారత ఒలంపిక్ సంఘంలో ఒక కమిటీ ఉంది. అలాగే అథ్లెటిక్స్ కమిషన్ కూడా ఉంది. బ్రిజ్ భూషణ్‌కు వ్యతిరేకంగా ఆందోళన చేపట్టిన వారంతా వీధుల్లోకి వెళ్లకుండా మా వద్దకు రావాల్సింది. కానీ వారు అలా చేయలేదు. కొంత క్రమశిక్షణ అనేది అవసరం. ప్రపంచవ్యాప్తంగా భారత్‌కు మంచి పేరుంది. అయితే.. వాళ్లు చేపట్టిన ఇలాంటి నిరసనల వల్ల దేశం పరువు పోతోంది. ఈ తరహా ప్రతికూల ప్రచారం దేశానికి ఏమాత్రం మంచిది కాదు. ఏదైనా చట్టప్రకారం ముందుకు సాగాలి. వారందరూ ధర్నాలో కూర్చొని, రాజకీయ పార్టీల మద్దతు కోరడం నన్ను తీవ్రంగా నిరాశపరుస్తోంది’’ అంటూ చెప్పుకొచ్చారు. ఈ విధంగా పిటి ఉష చేసిన వ్యాఖ్యలపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఆమె వ్యాఖ్యలకు కొందరు మద్దతు తెలిపితే.. మరికొందరు మాత్రం ఫైర్ అవుతున్నారు.
రామలక్ష్మికి చిట్టిబాబు బర్త్ డే విషెస్ భలే చెప్పాడే..
టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత గురించి ప్రత్యేకంగాచెప్పాల్సిన అవసరం లేదు. అమ్మడికి ఎంత ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందంటే.. ఈ మధ్యే ఒక అభిమాని ఆమెకు గుడి కూడా కట్టించాడు. ఇక ఈ ఏడాది శాకుంతలం సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చిన సామ్ కు నిరాశే మిగిలింది. అయినా వాటిని పట్టించుకోకుండా విజయం వైపు అడుగులు వేస్తుంది. ఏ మాయ చేసావే చిత్రంతో తెలుగుతెరకు పరిచయమైన ఈ ముద్దుగుమ్మ జీవితంలో ఎన్నో ఒడిదుడుకులు. సాధారణంగా ఏ హీరోయిన్ ఇలాంటి కష్టాలను అనుభవించి ఉండదు. చై తో విడాకులు అయ్యినప్పటి నుంచి ఇప్పటివరకు సామ్ ను ట్రోల్ చేయడం మాత్రం మానలేదు. ఆ ట్రోల్స్ ను సైతం దైర్యంగా ఎదుర్కొని నిలబడగలిగింది. ఇక మయోసైటిస్ వ్యాధి బారిన పడి నిత్యం మెడికేషన్ తో బతుకుతున్నా ఆమె పెదాలపై చిరునవ్వు మాత్రం చేరగలేదు. స్ట్రాంగెస్ట్ విమెన్ గా జీవితంతో పోరాడుతున్న సామ్ పుట్టినరోజు ఈరోజు. నేడు ఆమె తన 36 వ పుట్టినరోజును జరుపుకుంటుంది. ఇక దీంతో ఉదయం నుంచి సామ్ బర్త్ డే విషెస్ తో ట్విట్టర్ మారుమ్రోగుతోంది.
‘విరూపాక్ష’ అదర్ లాంగ్వేజెస్ హక్కులు ఎవరికంటే….
ఈ మధ్య కాలంలో తెలుగు చిత్రసీమకు కాస్తంత ఊపిరి పోసిన సినిమా ఏదైనా ఉందంటే అది ‘విరూపాక్ష’. సాయిధరమ్ తేజ్, సంయుక్త మీనన్ కీలక పాత్రలు పోషించిన ఈ హారర్ సస్పెన్స్ థ్రిల్లర్ ను దర్శకుడు కార్తీక్ దండు చక్కగా స్క్రీన్ మీద ప్రెజెంట్ చేశాడు. కామెడీ కోసం పక్కదారులు పట్టకుండా… సింగిల్ ఎజెండాతో మూవీని తెరకెక్కించాడు. పాన్ ఇండియా ఈ సినిమాను మొదట్లో రిలీజ్ చేయాలని అనుకున్నా… నిర్మాత బి.వి.యస్.ఎన్. ప్రసాద్ మొదట తెలుగు వర్షన్ మీద దృష్టి పెట్టారు. ఎలాంటి భారీ అంచనాలు లేకుండా విడుదలైన ‘విరూపాక్ష’కు మంచి మంచి ఓపెనింగ్స్ రావడమే కాదు… ఆ తర్వాత కూడా బెటర్ రన్ ను ప్రదర్శిస్తోంది. ఇవాళే రెండో వారంలోకి అడుగుపెట్టిన ‘విరూపాక్ష’ మొదటివారంలో ప్రపంచ వ్యాప్తంగా రూ. 62.5 కోట్ల గ్రాస్ వసూలు చేసిందని నిర్మాత తెలిపారు. విశేషం ఏమంటే… తెలుగులో సక్సెస్ కావడం ఈ సినిమా ఇతర రాష్ట్రాలలో విడుదలకు మార్గాన్ని సుగమం చేసింది. తమిళంలో దీనిని జ్ఞానవేల్ రాజాకు చెందిన స్టూడియో గ్రీన్, హిందీలో ప్రముఖ పంపిణీ సంస్థ గోల్డ్ మైన్, మలయాళంలో ఇ4 సంస్థలు విడుదల చేయబోతున్నాయి. అతి త్వరలోనే ‘విరూపాక్ష’ను ఇతర భాషల్లో ఎప్పుడు విడుదల చేసేది చెబుతామంటున్నారు నిర్మాత బి.వి.ఎస్.ఎన్. ప్రసాద్.