NTV Telugu Site icon

Top Headlines @ 5 PM: టాప్‌ న్యూస్‌

Top Headlines @ 5 Pm New

Top Headlines @ 5 Pm New

వైసీపీకి మరో బిగ్‌ షాక్‌.. పార్టీ, పదవులకు మాజీ మంత్రి గుడ్‌బై..
ఆంధ్రప్రదేశ్‌లో వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ మరో బిగ్‌ షాక్‌ తగిలింది.. పార్టీకి, పార్టీ పదవులకు కీలక నేత గుడ్‌బై చెప్పేశారు.. గోదావరి జిల్లా రాజకీయాల్లో కీలక నేతగా ఉన్న మాజీ డిప్యూటీ సీఎం ఆళ్ల నాని పార్టీ పదవులకు రాజీనామా చేశారు. ఏలూరు అసెంబ్లీ ఇన్చార్జి పదవితోపాటు ఏలూరు జిల్లా అధ్యక్ష పదవికి కూడా రాజీనామా చేస్తూ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డికి రాజీనామా లేఖ పంపించారు. వైఎస్ కుటుంబంతో మొదటి నుంచి మంచి అనుబంధం ఉన్న నాని.. 2004, 2009 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నుంచి ఏలూరు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 2013లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో అడుగుపెట్టారు..2014లో ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. అప్పటినుంచి పార్టీలో కీలకంగా వ్యవహరిస్తూ 2017లో ఎమ్మెల్సీగా అవకాశం అందుకున్నారు. ఇక, 2019 ఎన్నికల్లో ఏలూరు నుంచి మరోసారి పోటీ చేసి విజయం సాధించిన ఆళ్ల నానికి జగన్ తొలి కేబినెట్‌లో డిప్యూటీ సీఎం పదవితో పాటు వైద్య ఆరోగ్యశాఖ మంత్రిగా అవకాశం దక్కింది. మంత్రివర్గ విస్తరణలో పదవి పోగొట్టుకున్న ఆళ్ల నాని.. ఏలూరు జిల్లా అధ్యక్షుడిగా కొనసాగుతున్నారు. 2024 ఎన్నికల్లో ఏలూరు జిల్లాలో అన్ని స్థానాల్లో వైసీపీ ఘోరంగా ఓడింది. దీంతో జిల్లాలోని వైసీపీ కీలక నేతలు వరుసగా పార్టీని వీడుతూ వస్తున్నారు. ఏలూరు అసెంబ్లీ పరిధిలో వైసీపీ దాదాపుగా ఖాళీ అయిందని చెప్పాలి. ఇదే సమయంలో మాజీ మంత్రి ఆళ్ల నాని తన ఇంచార్జ్‌ పదవితో పాటు జిల్లా అధ్యక్ష పదవికి రాజీనామా చేయడం చర్చనీయాంశంగా మారింది.

ఏపీకి గుడ్‌ న్యూస్‌.. రూ.2,812.98 కోట్లు విడుదల చేసిన కేంద్రం..
ఆంధ్రప్రదేశ్‌కి శుభవార్త చెప్పింది కేంద్ర ప్రభుత్వం.. ఉపాధి హామీ నిధులు రూ.2812.98 కోట్లు మంజూరు చేసింది.. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం అంటే 2024-25లో మదర్ శాంక్షన్ కింద కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ ఉపాధి హామీ వేతనాల చెల్లింపుల నిమిత్తం 21.5 కోట్ల పనిదినాలకుగానూ రూ.5743.90 కోట్లను మంజూరు చేసిందని.. ఏపీ డిప్యూటీ సీఎం, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ వెల్లడించారు.. కాగా, గతంలో ఆమోదించిన 15 కోట్ల పని దినాలకు సంబంధించి వేతన నిధులు రూ.2934.80 కోట్లు మంజూరు చేసి.. విడుదల చేసిందనీ, అదనంగా ఇప్పుడు రూ.2812.98 కోట్లను మంజూరు చేస్తూ కేంద్ర గ్రామీణాభివృద్ది శాఖ ఉత్తర్వులు ఇచ్చిందని పేర్కొన్నారు పవన్‌ కల్యాణ్‌.. ఇక, ఇప్పటి వరకు ఈ ఆర్థిక సంవత్సరంలో రూ.2809.10 కోట్లు రోజువారీ వేతన ఎఫ్.టీ.ఓ.ల అప్ లోడ్ ఆధారంగా నేరుగా వేతనదారుల ఖాతాలకు జమ అయ్యాయని, మిగిలిన మొత్తాలు కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా త్వరలోనే వేతనదారుల ఖాతాలకు జమ అవుతాయని ఓ ప్రకటనలో తెలిపారు ఏపీ డిప్యూటీ సీఎం, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి పవన్‌ కల్యాణ్‌..

హైకోర్టు, సుప్రీంకోర్టు వరకు వెళ్తాం.. సీతారాంపురం ప్రజలను కాపాడుకుంటాం..
హైకోర్టు, సుప్రీంకోర్టు వరకు సీతారాంపురం ఘటన తీసుకెళ్తాం.. గ్రామ ప్రజలను కాపాడుకుంటాం అన్నారు మాజీ సీఎం, వైసీపీ అధినేత వైఎస్‌ జగన్‌.. నంద్యాల జిల్లా సీతారామపురంలో హత్యకు గురైన సుబ్బారాయుడు కుటుంబ సభ్యులను పరామర్శించిన జగన్‌.. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. పోలీసులు రాకుండా ఆపగలిగారు.. అంటే ఏ స్థాయిలో రాజకీయాలు చేస్తున్నారో నిదర్శనం ఇదే అన్నారు.. రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్‌ ఉందా? అని ప్రశ్నించిన ఆయన.. నడి రోడ్డుపై రఫీ అనే వ్యక్తిని నరికేశారు.. హత్య కేసుల్లో చిన్నచిన్నవాళ్లను ఇరికిస్తున్నారని మండిపడ్డారు.. చేయించిన ఎమ్మెల్యేల పేర్లు ఎందుకు రాయడం లేదు..? సుబ్బారాయుడును చంపిన శ్రీనివాసరెడ్డి కాల్ రికార్డ్ చెక్ చేస్తే ఎవరు చేయించారో తడలుస్తుంది కదా? అని ప్రశ్నించారు.. ఇక, ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి ఆత్మకూరులో విజయోత్సవసభలో ఏమి మాట్లాడారో చూడండి అంటూ.. బుడ్డా రాజశేఖర్ రెడ్డి ప్రసంగం ఆడియో వినిపించారు వైఎస్‌ జగన్.. మండలానికి ఇద్దరిని చంపండి, పోలీసులను, కేసులను నేను చూసుకుంటానని అంటారా..? అంటూ ఫైర్‌ అయ్యారు.. ఎమ్మెల్యేలు మీటింగ్ లు పెట్టి దారుణంగా మాట్లాడుతుంటే కేసులు ఎందుకు పెట్టరు? అని నిలదీశారు.. రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్‌ని కాపాడాల్సి ఉంది అన్నారు.. జగన్ ఉంటే విద్య దీవెన, వసతి దీవెన వచ్చేవి.. మహిళలకు సున్నా వడ్డీ ఇవ్వకుండా చంద్రబాబు మోసం చేశాడని విమర్శించారు.. ఎవరు ప్రశ్నించ కూడదని ఏపీలో రెడ్ బుక్ పాలన సాగిస్తున్నాడు.. నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలు, మండల, గ్రామాలలో స్థానిక నేతలు ఆధిపత్యం కోసం దారుణంగా ప్రవర్తిస్తున్నారు.. లా అండ్ ఆర్డర్‌ని నాశనం చేశారని మండిపడ్డారు.. సీతారాంపురంలో ఏజెంట్లుగా కూర్చున్నారని సుబ్బారాయుడు మరి కొందరిని చంపాలని చూసారు.. సుబ్బరాయుడును చంపేశారు.. అసలు సీతారాంపురంలో లా అండ్ ఆర్డర్‌ ఉందా? అంటూ ఆవేదన వ్యక్తం చేశారు..

సుంకిశాల ప్రాజెక్టు విషయంలో కేటీఆర్ చేసిన వ్యాఖ్యలకు భట్టి విక్రమార్క కౌంటర్..
సుంకిశాల ప్రాజెక్టు విషయంలో కేటీఆర్ చేసిన వ్యాఖ్యలకు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కౌంటర్ ఎటాక్ చేశారు. సుంకిశాలకు సంబంధించిన ఘటనలో పొరపాటును ఒప్పుకొని ప్రజలకు క్షమాపణ చెప్పాల్సింది పోయి.. కేటీఆర్ కాంగ్రెస్ ప్రభుత్వంపై ఎదురుదాడి చేయడం సరికాదని అన్నారు. సుంకిశాల ఘటనతో కృష్ణా నదిపై బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో నిర్మించిన ప్రాజెక్టుల నాణ్యత పై విచారణ చేయిస్తామని తెలిపారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలోనే కాళేశ్వరం, సుంకిశాల ప్రాజెక్టులను నిర్మించారని.. నీళ్లు రాకుండానే కాళేశ్వరం కుంగిపోయిందని పేర్కొన్నారు. నీళ్లు వచ్చిన తర్వాత సుంకిశాల ప్రాజెక్టు మునిగిందని భట్టి విక్రమార్క ఆరోపించారు. మేడిగడ్డ, సుందిళ్ల, అన్నారం బ్యారేజీలు అక్కడ కట్టడం సరికాదని కాంగ్రెస్ ముందే చెప్పిన వినకుండా.. బీఆర్ఎస్ ప్రభుత్వం నిర్మించింది.. ఫలితం ఏంటో ఇప్పుడు అందరం చూస్తున్నామన్నారు. ఇంజనీర్లు చెప్పింది కాదని.. కేసీఆర్ సొంత నిర్ణయాలు తీసుకొని కాళేశ్వరం కట్టడం వల్లే కుంగుబాటుకు కారణమైందని భట్టి విక్రమార్క తెలిపారు. ఇంజనీర్లు చేయాల్సిన పని ఇంజనీర్లు చేయాలి.. కానీ, ఇంజనీర్లు చేయాల్సిన పనిని కేసీఆర్ చేయడం వలనే మేడిగడ్డ కుంగిపోయిందని ఆరోపించారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో జరిగిన ప్రాజెక్టు నాణ్యత లోపాల అవినీతిని ఎప్పుడు బయటపెట్టాలని చూస్తున్న తమకు సుంకిశాల ఘటనను దాచి పెట్టాల్సిన అవసరం లేదన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో మొదలు పెట్టిన ప్రాజెక్టులకు రీ డిజైన్ చేసి ఇరిగేషన్ శాఖను బీఆర్ఎస్ ప్రభుత్వం భ్రష్టు పట్టించిందని తెలిపారు. రూ. 1450 కోట్లతో పూర్తయ్యే రాజీవ్, ఇందిరా సాగర్ ప్రాజెక్టులను రీ డిజైన్ చేసి సీతారామ ప్రాజెక్టుగా పేరు మార్చి.. రూ. 23 వేల కోట్లకు అంచనాలు పెంచి రాష్ట్ర ఖజానాను బీఆర్ఎస్ ప్రభుత్వం దోపిడీ చేసిందని మండిపడ్డారు. సీతారామ ప్రాజెక్టుపై ఎనిమిది వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఒక ఎకరానికి కూడా బీఆర్ఎస్ ప్రభుత్వం నీళ్లు ఇవ్వలేదని పేర్కొన్నారు.

అమెరికా పర్యటనలో సీఎం బిజీబిజీ.. అడోబ్ సిస్టమ్స్ సీఈవోతో భేటీ
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అమెరికా పర్యటనలో బిజీబిజీగా గడుపుతున్నారు. పలు కంపెనీల ప్రతినిధులతో చర్చలు జరిపి.. రాష్ట్రానికి వచ్చి పెట్టుబడులు పెట్టాలన్నారు. రాష్ట్రానికి వస్తే తగిన మౌలిక సదుపాయాలు కల్పిస్తామని చెప్పి రాయితీలు ఇస్తున్నారు. సీఎం రేవంత్ రెడ్డితో పాటు మంత్రులు శ్రీధర్ బాబు, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి, ఇతర ఉన్నతాధికారులు అమెరికా పర్యటనలో ఉన్నారు. ఈ సందర్భంగా.. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రఖ్యాత అడోబ్​ సిస్టమ్స్ (Adobe Systems) సీఈవో శంతను నారాయణ్‌తో భేటీ అయ్యారు. ఫ్యూచర్ స్టేట్ తెలంగాణకు పెట్టుబడులు లక్ష్యంగా అమెరికాలో పర్యటిస్తున్న ముఖ్యమంత్రి.. ప్రస్తుతం కాలిఫోర్నియాలోని పలువురు గ్లోబల్ బిజినెస్ లీడర్లతో సమావేశాలు, చర్చలు జరుపుతున్నారు. అడోబ్​ సీఈవోతో సమావేశంలో సీఎంతో పాటు పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు, ఇతర ఉన్నతాధికారులు కూడా పాల్గొన్నారు. తెలంగాణలో ప్రజా ప్రభుత్వం తలపెట్టిన హైదరాబాద్ 4.0 ఫ్యూచర్ సిటీ నిర్మాణం, యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సిటీ ఏర్పాటు ప్రణాళికలపై శంతను నారాయణ్​ ఆసక్తి కనబరిచారు. రాష్ట్రంలో చేపట్టే ప్రాజెక్టుల్లో భాగస్వామ్యం పంచుకునేందుకు అంగీకరించారు. టెక్ విజనరీ శంతను నారాయణ్ను కలుసుకోవటం ఆనందంగా ఉందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు.

రాజ్యసభ చైర్మన్‌పై ‘‘అభిశంసన తీర్మానాని’’కి విపక్షాల ప్లాన్.. ధంఖర్-జయా బచ్చన్ గొడవే కారణం..
పెద్దల సభలో చైర్మన్ జగదీప్ ధంఖర్, సమాజ్‌వాదీ పార్టీ(ఎస్పీ) ఎంపీ జయా బచ్చన్ మధ్య తీవ్రమైన గొడవ జరిగింది. శుక్రవారం వీరిద్దరి మధ్య రాజ్యసభలో తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. దంఖర్ మాట్లాడే విధానం సరిగా లేదని, ఆయన స్వరం ఆమోదయోగ్యం కాదని జయా బచ్చన్ చెప్పడంతో ఒక్కసారిగా సభలో ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. దీంతో ఆగ్రహించిన చైర్మన్ ధంఖర్..‘‘కానీ ప్రతి రోజు, నేను పునరావృతం చేయాలనుకోను, ప్రతి రోజు, నేను చదువు చెప్పాలని కోరుకోను’’ అని అన్నారు. ‘‘మీరు సెలబ్రెటీ కావచ్చు, కానీ సభ అలంకారాన్ని అర్థం చేసుకోవాలి’’ అని ఆగ్రహించారు. దీంతో ఒక్కసారిగా సభలో నిరసనలు వ్యక్తమయ్యాయి. ‘‘ జయాజీ మీరు గొప్ప పేరు సంపాదించారు. దర్శకుడు చెప్పిన దానికి మీరు లోబడి ఉంటారని మీకు తెలుసు. నేను సభాపతి స్థానం నుంచి చూసిన దానిని మీరు చూడలేరని ధంఖర్ అన్నారు. అంతకుముందు జయా బచ్చన్ మాట్లాడుతూ.. ‘‘ సాన్ నేను జయ అమితాబ్ బచ్చన్ మాట్లాడాలనుకుంటున్నాను.. నేను నటిని, నాకు బాడీ లాంగ్వేజ్, ఎక్స్‌ప్రెషన్స్ అర్థం చేసుకోగలను. నన్ను క్షమించండి, కానీ మీ చెప్పే పద్ధతి ఆమోదయోగ్యంగా లేదు. మేం మీ సహ సభా సభ్యులం. మీరు సభాపతి అయి ఉండొచ్చు కానీ నేను స్కూల్‌కి వెళ్లడం నాకు గుర్తింది, మేం స్కూల్ పిల్లలం కాదు’’ అంటూ వ్యాఖ్యానించారు.” జయాజీ, టేక్ యువర్ సీటు… టేక్ యువర్ సీట్…” అని మిస్టర్ ధంఖర్ పదే పదే చెప్పారు.

పూజా ఫ్యామిలీని వెంటాడుతున్న కష్టాలు.. తాజాగా తండ్రిపై ఎఫ్ఐఆర్
వివాదాస్పద మాజీ ట్రైనీ ఐఏఎస్ పూజా ఖేద్కర్ ఫ్యామిలీని కేసులు కష్టాలు వెంటాడుతున్నాయి. పూజా ఇప్పటికే ఉద్యోగాన్ని కోల్పోవడమే కాకుండా క్రిమినల్ కేసులో పీకల్లోతు కష్టాల్లో ఉంది. వివాదాలు వెంటాడుతున్న సమయలోనే పూజా ఖేద్కర్ తల్లి మనోరమ ఓ అన్నదాతను తుపాకీతో బెదిరించిన కేసులో జైలుకెళ్లింది. ఇప్పుడు తండ్రి దిలీప్ ఖేద్కర్ వంతు వచ్చింది. పూణె కలెక్టరేట్‌లో విధి నిర్వహణలో ప్రభుత్వోద్యోగిని బెదిరించి.. పనులకు ఆటంకం కలిగించారన్న ఆరోపణలపై తహసీల్దార్ స్థాయి అధికారి బండ్‌గార్డెన్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. దీంతో దిలీప్ ఖేద్కర్‌పై కేసు నమోదైంది. దిలీప్ ఖేద్కర్‌పై పోలీసులు కేసు నమోదు చేసినట్లు అధికారులు శుక్రవారం తెలిపారు. 2023 ఐఏఎస్ బ్యాచ్‌కు చెందిన పూజా ఖేద్కర్‌కు సొంత ప్రాంతం పూణెలో అసిస్టెంట్‌ కలెక్టర్‌గా పోస్టింగ్ పడింది. ప్రొబేషనరీ సమయంలో రెండేళ్ల పాటు ఎలాంటి సౌకర్యాలు ఉండవు. కానీ పూజా తండ్రి దిలీప్ మాత్రం.. కలెక్టరేట్‌లోకి ఎంట్రీ ఇచ్చి అక్కడ అధికారుల్ని బెదిరించి కుమార్తె‌కు సకల సౌకర్యాలు ఏర్పాట్లు చేయాలని బెదిరింపులకు పాల్పడ్డాడు. దీంతో ఆయనపై తాజాగా తహసీల్దార్‌ దీపక్‌ అకాడే పోలీసులకు ఫిర్యాదు చేశాడు. బెదిరింపుల సమయంలో దురుసుగా ప్రవర్తించారని.. అంతేకాకుండా పరిపాలనా వ్యవహారాల్లో జోక్యం చేసుకునే హక్కు లేకపోయినప్పటికీ కూతురికి క్యాబిన్‌ కేటాయించాలని అడిగారని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఇదిలా ఉంటే ఆ కేసులో దిలీప్ ఖేద్కర్‌ ముందస్తు బెయిల్‌కు అప్లై చేసుకోగా.. ఆయనకు బెయిల్ మంజూరు అయింది. ఇక ఆయన భార్య మనోరమ ఇటీవలే బెయిల్‌పై విడుదలైంది. దిలీప్ ఖేద్కర్ గత లోక్‌సభ ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగారు. ఎన్నికల అఫిడవిట్‌లో రూ.60 కోట్లు ఆస్తులు ఉన్నట్లు పేర్కొన్నారు.

జపాన్ సిద్ధంగా ఉండాలి.. మెగా భూకంపం రాబోతోంది..
జపాన్ వాతావరణ సంఘం(జేఎంఏ) ప్రకారం.. భవిష్యత్తులో వచ్చే భారీ భూకంపాలు పెద్ద సునామీలకు కారణమవుతాయని హెచ్చరించింది. భారీ భూకంపాలు సంభవించే అవకాశం సాధారణం కన్నా ఎక్కువగా ఉందని, ఒక నిర్దిష్ట వ్యవధిలో ఖచ్చితంగా పెద్ద భూకంపం సంభవిస్తుందని చెప్పారు. గతంలో భారీ భూకంపాలు సంభవించిన పసిఫిక్ మహాసముద్రంలోని రెండు టెక్టానిక్ ప్లేట్ల మధ్య ఉన్న నాంకై ట్రఫ్ ‘‘సబ్‌డక్షన్ జోన్’’లోనే భారీ భూకంపం వచ్చే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. 800 కి.మీ సముద్ర గర్భంలో ఉన్న ఈ ప్రాంతం టోక్యోకు పశ్చిమాన ఉన్న షిజుయోకా నుంచి క్యుషు ద్వీపంలోని దక్షిణ కొనవరకు ఉంటుంది. ఇది ప్రతీ శతాబ్ధానికి లేదా రెండు శతాబ్ధాలకు 8 లేదా 9 తీవ్రతతో భూకంపాలు వచ్చే ప్రాంతం. వీటిని ‘‘మెగాథ్రస్ట్ భూకంపాలు’’ అని పిలుస్తారు. తరుచుగా ఇక్కడ సంభవించే భూకంపాలు ప్రమాదకరమైన సునామీలను కలిగిస్తాయి. 1707లో నంకై ట్రఫ్‌లోని అన్ని భాగాలు ఒక్కసారిగా విడిపోయి, భూకంపం సంభవించింది. ఇది ఆ దేశ చరిత్రలోనే రెండో అంత్యంత శక్తివంతమైన భూకంపంగా మిగిలింది. ఇది ఫుజీ అగ్నిపర్వత విస్పోటనానికి కారణమైంది. 1854లో రెండు శక్తివంతమైన నంకై మెగాథ్రస్ట్‌లు వచ్చాయి. ఆ తర్వాత 1944, 1946లో భూకంపాలు సంభించాయి. నంకై ట్రఫ్ వెంబడి 8-9 భారీ భూకంపాలు వచ్చే 30 ఏళ్లలో 70 శాతం సంభవించే అవకాశం ఉన్నట్లు పేర్కొంది. దీని వల్ల 3 లక్షల మంది ప్రాణాలు కోల్పోవచ్చని అంచనా వేస్తున్నారు. 13 ట్రిలియన్ డాలర్ల నష్టం ఏర్పడొచ్చు.

మార్కెట్‌లో జోష్.. లాభాల్లో ముగిసిన అన్ని రంగాల సూచీలు
గురువారం ఆర్బీఐ ద్రవ్య పరపతి విధానాలు ప్రకటించింది. ఆ సమయంలో స్టాక్ మార్కెట్ సూచీలు స్వల్పంగా లాభాల్లోకి వెళ్లినట్లే వెళ్లి నష్టాల్లో ట్రేడ్ అయ్యాయి. శుక్రవారం మాత్రం అందుకు భిన్నంగా కొనుగోళ్లు కనిపించాయి. అంతర్జాతీయ మార్కెట్‌లోని సానుకూల సంకేతాలు కలిసి రావడంతో దేశీయ మార్కెట్ శుక్రవారం ఉదయం భారీ లాభాల్లో ప్రారంభమయ్యాయి. చివరి దాకా అన్ని రంగాల సూచీలు భారీ లాభాల్లో కొనసాగాయి. సెన్సెక్స్ 819 పాయింట్లు లాభపడి 79, 705 దగ్గర ముగియగా.. నిఫ్టీ 250 పాయింట్లు లాభపడి 24, 367 దగ్గర ముగిసింది. ఇక రూపాయి మారకం విలువ డాలర్‌తో పోలిస్తే రూ. 83.96 దగ్గర ఫ్లాట్‌గా ముగిసింది. నిఫ్టీలో ఐషర్ మోటార్స్, ఒఎన్‌జీసీ, టెక్ మహీంద్రా, టాటా మోటార్స్ మరియు శ్రీరామ్ ఫైనాన్స్ టాప్ గెయినర్స్‌గా కొనసాగగా… బీపీసీఎల్, హెచ్‌డీఎఫ్‌సీ లైఫ్, కోటక్ మహీంద్రా బ్యాంక్, దివీస్ ల్యాబ్స్ మరియు సన్ ఫార్మా నష్టపోయాయి.

అబ్బే ఇప్పట్లో లేనట్టే!!
స్టార్ హీరో కమల్ హాసన్ నటించిన లేటెస్ట్ మూవీ “భారతీయుడు 2”. దర్శకుడు శంకర్ చాలా హైప్ తెచ్చి రిలీజ్ చేసిన ఈ సినిమా ప్రేక్షకులను ఆశించిన మేర ఆకట్టుకోలేక పోయింది. అంతే కాదు సినిమా చూసిన ప్రేక్షకులు చాలా మంది ట్రోల్ చేసేలా ఉందంటే పరిస్థితి ఇక ఉందో అర్థం చేసుకోవచ్చు. గత నెలలో రిలీజ్ అయిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ ఫ్లాప్‌గా నిలిచింది. ఈ చిత్రం కమర్షియల్‌గా విఫలం కావడమే కాకుండా.. శంకర్ ఓల్డ్ స్కూల్ ఆలోచనలపై భారీ విమర్శలను కూడా ఎదుర్కోవాల్సి వచ్చింది. భారతీయుడు- 2 సినిమా ప్రమోషన్స్ లో కూడా భారతీయుడు- 3 సినిమాని మరో ఆరు నెలలలో రిలీజ్ చేస్తామని ప్రకటించారు. అయితే ఈ సినిమా దెబ్బకు ఆ మూడో భాగాన్ని రిలీజ్ చేయడం లేదని తెలుస్తోంది. శంకర్‌ రీ వర్క్ చేసి ఆ చిత్రాన్ని మెరుగుపరచడానికి లైకా ప్రొడక్షన్స్ “భారతీయుడు 3” విడుదలను వాయిదా వేయాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. శంకర్ “భారతీయుడు 2”, “భారతీయుడు 3” రెండింటినీ ఒకేసారి చిత్రీకరించారు. “భారతీయుడు 3″ని 2025 సంక్రాంతికి విడుదల చేయాలనేది ముందు ఆలోచన. రెండవ భాగం విజయవంతమైతే.. మూడవ భాగంపై క్రేజ్ భారీగా ఉండేది. కానీ ఇప్పుడు, ఇది పూర్తిగా భిన్నమైన పరిస్థితి ఏర్పడింది. అయితే భారతీయుడు 2 కంటే భారతీయుడు 3 బాగుంటుందని కమల్ హాసన్ ముందు నుంచి చెబుతున్నారు. ఇప్పటికీ మూడవ భాగం ఆకట్టుకునేలా రివర్టింగ్‌గా ఉంటుందని ఆయన భావిస్తున్నారు.