NTV Telugu Site icon

Top Headlines @ 5 PM: టాప్‌ న్యూస్‌

Top Headlines @ 5 Pm New

Top Headlines @ 5 Pm New

ఆంధ్ర, తెలంగాణ సీఎంల భేటీ.. మాజీ మంత్రి అంబటి సంచలన వ్యాఖ్యలు
ఏపీ, తెలంగాణ ముఖ్యమంత్రుల భేటీపై సంచలన వ్యాఖ్యలు చేశారు మాజీ మంత్రి అంబటి రాంబాబు.. మొన్న హైదరాబాద్‌లో ఆంధ్ర, తెలంగాణ ఇద్దరు సీఎంలు కలిశారు.. సీఎంల మధ్య సమావేశంలో చాలా వాటికి చర్చలు లేవు.. ప్రధానంగా ఈ సమావేశం దేనికి అనేది కూడా వివరణ లేదు. కొన్ని అంశాలపై తెలంగాణ ప్రభుత్వం డిమాండ్ చేస్తుందని కొన్ని మీడియావాళ్లకి లీకులు ఇచ్చారు. ఇద్దరి సీఎంలు మీడియా ముందుకు వచ్చి వివరణ ఇస్తారు అనుకున్నా లేదు.. మాట్లాడిన మంత్రుల మధ్య కూడా క్లారిటీ లేదు అని విమర్శించారు. రాష్ట్ర విభజన జరిగాక అనేక అంశాలు పెడింగ్ లో ఉన్నాయన్న ఆయన.. విభజన జరిగాక మొదటి సీఎంగా చంద్రబాబు పని చేసాడు. మొదటి సీఎంగా పనిచేసిన చంద్రబాబు ఎందుకు ఉమ్మడి రాజధానిని వదిలేసి పారిపోయి వచ్చాడు. తప్పు చేసాడు కాబట్టి మెడ పట్టి చంద్రబాబు హైదరాబాద్ నుండి గెంటేశారు అంటూ ఆరోపణలు గుప్పించారు. చంద్రబాబు గత పాలనలో అన్ని తాత్కాలిక భవనాలను ఎందుకు కట్టారు అని నిలదీశారు. రాష్టాల మధ్య కొన్ని సమస్యలు ఉన్నాయి. 7 వేల కోట్లు విద్యుత్ బకాయిలు మనకి రావాల్సి ఉంది.. శ్రీశైలం, నాగార్జున సాగర్ మధ్య నీటి వాటాల మధ్య చర్చలు జరిగాయా..? దాని మీద మాట్లాడారా…? అని ప్రశ్నించారు అంబటి.. నాగార్జున సాగర్ ప్రాజెక్టు బాధ్యత కూడా తెలంగాణ ప్రభుత్వం చేతికి వెళ్ళింది. ఆంధ్రప్రదేశ్ కి తీర మార్గం ఉంది దాని మీద వాటా కావాలని అడిగారు అని తెలుస్తుంది. టీటీడీలో తెలంగాణకి వాటా కావాలని అడిగినట్టు తెలుస్తుంది.. విలీన మండలాల్లను తెలంగాణలో కలపాలి అని డిమాండ్ చేస్తున్నారు.. దీనికి చంద్రబాబు సమాధానం చెప్పాలి. కృష్ణ జల్లాలో వాటా తెలంగాణ ప్రభుత్వం అడిగిందా..? మీరు సమాధానం చెప్పాలి అని డిమాండ్‌ చేశారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ మంత్రులు సమాధానం చెప్పలేని పరిస్థితిలో ఉన్నారు. చంద్రబాబు రెండు రాష్టాలు రెండు కళ్ళు అంటున్నారు.. అంటే వాళ్లు డిమాండ్ చేసినవి అన్ని నిజాలే అనుకోవాలి అని వ్యాఖ్యానించారు.

ఉచిత ఇసుకపై విధివిధానాలు ఖరారు.. ఉత్తర్వులు విడుదల
గత ప్రభుత్వంలోని ఇసుక విధానాలను రద్దు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది ఆంధ్రప్రదేశ్‌లోని చంద్రబాబు సర్కార్.. 2019, 2021 ఏడాదిల్లో గత ప్రభుత్వం ఇచ్చిన రెండు ఇసుక పాలసీలను రద్దు చేస్తున్నట్టు ఏపీ ప్రభుత్వం ప్రకటించింది.. మరోవైపు.. ఉచిత ఇసుకపై విధి విధానాలు ఖరారు చేస్తూ జీవో విడుదల చేసింది.. 2024 కొత్త ఇసుక విధానాన్ని రూపొందించేంత వరకు అమలు చేయాల్సిన కొత్త మార్గదర్శకాల జారీ చేసింది.. రాష్ట్ర ఖజానాకు రెవెన్యూ లేకుండా ఇసుక సరఫరా జరపాలని తాజా జీవోలో పేర్కొంది. వినియోగదారులకు ఇసుకను అందుబాటులోకి తేవడమే లక్ష్యంగా ఇసుక సరఫరాపై మార్గదర్శకాల విడుదల చేశారు.. ఇసుక తవ్వకాల నిమిత్తం జిల్లా కలెక్టర్ చైర్మన్‌గా జిల్లా స్థాయి కమిటీల ఏర్పాటుకు ఆదేశాలు జారీ చేసింది.. జిల్లా ఇసుక కమిటీల్లో జిల్లా ఎస్పీ, జేసీ సహా వివిధ శాఖలకు చెందిన జిల్లా స్థాయి అధికారులు ఉండాలని.. జిల్లాల్లోని స్టాక్ పాయింట్లను స్వాధీనం చేసుకోవాలని జిల్లా ఇసుక కమిటీలకు సూచించింది ప్రభుత్వం. ఇక, 49 లక్షల మెట్రిక్ టన్నుల మేర ఇసుక రాష్ట్రంలోని వివిధ స్టాక్ పాయింట్లల్లో అందుబాటులో ఉందని పేర్కొంది ఏపీ ప్రభుత్వం.. రిజర్వాయర్లు, చెరువులు, ఇతర నీటి వనరుల్లో డి-సిల్టేషన్ ప్రక్రియకు సర్కార్ ఆదేశాలు జారీ చేసింది.. డి-సిల్టేషన్ ప్రక్రియ ఎక్కడెక్కడ చేపట్టాలనే అంశాలపై నిర్ణయం తీసుకోనున్నాయి జిల్లా స్థాయి కమిటీలు. ఇసుక లోడింగ్, రవాణ ఛార్జీలను నిర్దారించే బాధ్యతను జిల్లా కమిటీకి అప్పగించింది. స్టాక్ పాయింట్ల వద్ద లోడింగ్, రవాణ ఛార్జీల చెల్లింపులను కేవలం డిజిటల్ విధానం ద్వారా జరపాలని స్పష్టం చేసింది ప్రభుత్వం.. ఇసుకను తిరిగి విక్రయించినా.. ఇతర రాష్ట్రాలకు తరలించినా కఠిన చర్యలు ఉంటాయన్న హెచ్చరించింది. భవన నిర్మాణం మినహా ఉచిత ఇసుకను మరే ఇతర అవసరాలకు వినియోగించొద్దని స్పష్టం చేసింది. ఇసుక అక్రమ రవాణ చేపడితే పెనాల్టీలను నిర్ధారిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది చంద్రబాబు ప్రభుత్వం.

టెట్ కొత్త షెడ్యూల్ విడుదల.. పరీక్ష ఎప్పుడంటే..?
టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ (టెట్‌) షెడ్యూల్‌లో మార్పులు చేసింది ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం.. అక్టోబర్ 3 నుంచి అక్టోబర్ 20 మధ్య కాలంలో టెట్ నిర్వహణకు నిర్ణయం తీసుకోగా.. టెట్ పరీక్షల సన్నద్ధతకు సమయం కావాలని తాజాగా మంత్రి నారా లోకేష్‌ను కోరారు టెట్‌ అభ్యర్థులు… ఇక, అభ్యర్థుల అభ్యర్థన మేరకు టెట్ షెడ్యూల్లో మార్పులు చేసింది ప్రభుత్వం.. టెట్‌ నోటిఫికేషన్ నుంచి ఎగ్జామ్‌ నిర్వహణ మధ్య 90 రోజుల వ్యవధి ఉందని షెడ్యూల్‌లో పేర్కొన్నారు. మార్పులు చేస్తూ.. టెట్ నిర్వహణకు కొత్త షెడ్యూల్ విడుదల చేశారు.. ఇక, ప్రభుత్వం తాజాగా విడుదల చేసిన టెట్‌ షెడ్యూల్‌ ప్రకారం.. ఆగస్టు 3వ తేదీ వరకు టెట్‌కు దరఖాస్తులు స్వీకరించనున్నారు.. అక్టోబర్ 3 నుండి అక్టోబర్ 20 వరకు టెట్ పరీక్షలు నిర్వహిస్తారు.. ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు సెషన్‌ వన్.. మధ్యాహ్నం 2.30 నుంచి సాయంత్రం 5 గంటల వరకు సెషన్‌ 2 నిర్వహించనున్నట్టు పేర్కొన్నారు. ఇక, అక్టోబర్‌ 4న కీ విడుదల చేయనున్నారు.. 5వ తేదీ వరకు అభ్యంతరాలు స్వీకరిస్తారు.. ఇక, నవంబర్ 2వ తేదీన టెట్ ఫలితాలు విడుదల చేయనున్నట్టు కొత్త షెడ్యూల్‌లో పేర్కొంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం..

మంత్రి పదవి ఆశిస్తున్నా.. సీఎం సానుకూలంగా స్పందించారు..
తాను మంత్రి పదవి ఆశిస్తున్నానని.. తన అభిప్రాయాన్ని సీఎంకు చెప్పినట్లు ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య వెల్లడించారు. సీఎం కూడా సానుకూలంగా స్పందించినట్లు ఆయన తెలిపారు. మీడియాతో చిట్‌చాట్‌లో పలు విషయాలను ఆయన పంచుకున్నారు. గొల్లకుర్మలకు మంత్రి పదవి ఇవ్వాలని సీఎం, డిప్యూటీ సీఎం, మిగతా మంత్రులను కూడా కలిశానని చెప్పారు. నల్గొండ పార్లమెంట్ పరిధిలో ఇద్దరికి మంత్రి పదవులు వచ్చాయని.. ఉత్తమ్, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి మంత్రులుగా ఉన్నారని ఆయన పేర్కొన్నారు. భువనగిరి పార్లమెంట్ పరిధిలో ఒక్కరూ కూడా మంత్రులుగా లేరని.. భువనగిరి పార్లమెంట్ పరిధిలో తనకు అవకాశం ఇవ్వాలని అడుగుతున్నానని బీర్ల ఐలయ్య చెప్పారు. ఎన్నడూ గొల్లకుర్మలు లేకుండా మంత్రి వర్గం లేదని.. రాష్ట్రవ్యాప్తంగా గొల్ల కుర్మలకు ప్రతినిధిగా మంత్రి వర్గంలో ప్రాతినిధ్యం కల్పించాలన్నారు. మొదటి సారిగా గొల్లకుర్మలకు మంత్రి వర్గంలో ఎవరూ లేరని ఆయన వెల్లడించారు. ఆంధ్రలో ముగ్గురికి మంత్రి వర్గంలో ఛాన్స్ ఇచ్చారని.. ఇక్కడ కూడా మంత్రి వర్గంలో చోటు కల్పించడంతో పాటు ఎమ్మెల్సీ, ఒక అడ్వైజర్ పోస్ట్, ఐదు కార్పొరేషన్లు, పీసీసీ చీఫ్ పోస్ట్, పార్టీలో వర్కింగ్ ప్రెసిడెంట్, రెండు సీఎం పీఆర్ఓ పోస్టులు కావాలన్నారు. 50 లక్షల పైచిలుకు జనాభా ఉన్న గొల్లకుర్మలకు ప్రభుత్వంలో పదవులు ఇవ్వాలన్నారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఎవరు వచ్చినా పార్టీలో చేర్చుకుంటామని బీర్ల ఐలయ్య చెప్పుకొచ్చారు. విభజన అంశాలపై ఇద్దరు సీఎంలు చర్చించారని స్పష్టం చేశారు. కేంద్రం నిధులు కూడా వస్తున్నాయన్నారు. తనకు మంత్రి పదవి వస్తుందని.. సీఎంపై నమ్మకం ఉందని బీర్ల ఐలయ్య అన్నారు.

నీట్ కేసుపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు.. విచారణ వాయిదా
నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్ – అండర్ గ్రాడ్యుయేట్ (NEET UG) 2024ని రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ, నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA)ని తిరిగి నిర్వహించాలని ఆదేశిస్తూ సుప్రీంకోర్టులో దాఖలైన 38 పిటిషన్లపై ఈరోజు విచారణ జరిగింది. ఈ కేసులను సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డి.వై. చంద్రచూడ్ నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం చేపట్టింది. ఈ క్రమంలో సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ఈ పరీక్షలో పేపర్‌ లీకైన మాట వాస్తవమేనని కోర్టు తెలిపింది. కానీ, అది 23 లక్షల మందితో ముడిపడిన అంశం’ అని ధర్మాసనం అభిప్రాయపడింది. పరీక్షను తిరిగి నిర్వహించాలన్నది లాస్ట్‌ ఆప్షన్‌ మాత్రమే అని ఈ సందర్భంగా సీజేఐ అభిప్రాయపడ్డారు. అదే సమయంలో ఎన్ని ఫలితాలను హోల్డ్‌లో పెట్టారని ఆయన కేంద్రాన్ని ప్రశ్నించారు. విచారణలో భాగంగా.. జూలై 10వ తేదీ బుధవారంలోగా డివిజనల్ బెంచ్ ముందు వివరణాత్మక నివేదిక సమర్పించాలని ఎస్జీ తుషార్ మెహతాను కోరారు. మొత్తం ప్రక్రియ ఎలా సాగింది, ఎఫ్‌ఐఆర్‌ తీరు, పేపర్‌ ఎలా లీక్ అయింది, కేంద్రం, ఎన్‌టీఏ ఎలాంటి చర్యలు తీసుకున్నాయో చూడాలని ధర్మాసనం పేర్కొంది. అందుకే.. దీనిపై జాగ్రత్తగా పరిశీలించాకే తీర్పు ఇస్తామని ధర్మాసనం వెల్లడించింది.

జార్ఖండ్‌లో కేబినెట్ విస్తరణ.. మంత్రిగా చంపై ప్రమాణం
జార్ఖండ్‌లో మంత్రివర్గ విస్తరణ జరిగింది. సోమవారం ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ కేబినెట్ విస్తరణ చేశారు. దీంతో మిత్ర పక్షాలతో సహా పలువురు జేఎంఎం నేతలు మంత్రులుగా ప్రమాణం చేశారు. ఇక మాజీ ముఖ్యమంత్రి చంపై సోరెన్‌కు కూడా మంత్రివర్గంలో చోటు లభించింది. రాంచీలోని రాజ్‌భవన్‌లో జరిగిన ఈ కార్యక్రమం అట్టహాసంగా జరిగింది. గవర్నర్ రాధాకృష్ణన్.. మంత్రుల చేత ప్రమాణం చేయించారు. కాంగ్రెస్ నేత రామేశ్వర్ ఓరాన్, ఆర్జేడీ నేత సత్యానంద్ భోక్తా కూడా మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. మనీలాండరింగ్ కేసులో జనవరి 31న హేమంత్ సోరెన్‌ను ఈడీ అధికారులు అరెస్ట్ చేశారు. దాదాపు 5 నెలలు జైల్లో ఉన్నారు. ఆయన స్థానంలో చంపై సోరెన్ ముఖ్యమంత్రిగా కొనసాగారు. అయితే ఇటీవలే హేమంత్ సోరెన్‌కు బెయిల్ లభించింది. దీంతో చంపై సోరెన్ ముఖ్యమంత్రి పదవి నుంచి తప్పుకోవడంతో తిరిగి హేమంత్ సోరెన్‌ సీఎం పీఠాన్ని అధిరోహించారు.

సెల్‌ఫోన్ కొనివ్వలేదని యువకుడు ఆత్మహత్య
ఈ రోజుల్లో ప్రతి ఒక్కరూ సెల్‌ఫోన్‌ వాడుతున్నారు. చిన్నా పెద్దా తేడా లేకుండా అందరూ ఫోన్‌ను వినియోగిస్తున్నారు. సెల్‌ఫోన్‌ లేకుండా ఒక్క నిమిషం కూడా ఉండలేని పరిస్థితి ఏర్పడింది. ఇక సెల్‌ఫోన్‌ లేకుండా ఓ గంట సేపు ఉన్నారంటే పిచ్చిపిచ్చిగా ప్రవర్తించేవాళ్లు కూడా ఉన్నారు. సెల్‌ఫోన్‌ చేతిలో ఉంటే లోకాన్నే మరిచిపోతారు. రోజురోజుకు జనాల్లో సెల్‌ఫోన్‌ పిచ్చి పెరిగిపోతోంది. తాజాగా ఓ యువకుడు సెల్‌ఫోన్‌ కొనివ్వలేదని ఆత్మహత్య చేసుకున్న ఘటన ఆదిలాబాద్ జిల్లాలో చోటుచేసుకుంది. తలమడుగు మండలంలోని ఉమ్రి గ్రామ శివారులో చెట్టుకు ఉరేసుకొని మేస్త్రం కృష్ణ అనే యువకుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మేస్త్రం కృష్ణ సెల్‌ఫోన్‌ కొనివ్వాలని తన తల్లిదండ్రులు అడిగాడు. ఈ క్రమంలోనే తల్లిదండ్రులు అతడిని మందలించారు. సెల్‌ఫోన్‌ కొనివ్వమని తల్లిదండ్రులు మందలించడంతో ఈ నెల 3న మేస్త్రం కృష్ణ ఇంటి నుంచి వెళ్లిపోయాడు. ఊరికి చివరన ఉన్న గుట్టపైన చెట్టుకు ఉరేసుకున్నాడు. స్థానికులు ఈ విషయాన్ని ఇవాళ గమనించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. కొడుకు మరణంతో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపించారు. ఈ రోజుల్లో సెల్‌ఫోన్‌కు యువకులు బానిసలవుతున్నారని.. అందుకే కొనివ్వలేదని తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేశారు.పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టారు.

నేను ముఖ్యమంత్రిగా ఉన్నంత కాలం అన్యాయాన్ని సహించేది లేదు..
ముంబైలోని వర్లీ ప్రాంతంలో ఆదివారం జరిగిన ఘోర బీఎండబ్ల్యూ కారు ప్రమాదంపై ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే ఆందోళన వ్యక్తం చేశారు. మహారాష్ట్రలో హిట్‌ అండ్‌ రన్‌ ఘటనలు పెరిగిపోవడం పట్ల సీఎం ఆందోళన వ్యక్తం చేశారు. హిట్ అండ్ రన్ నేరస్థులను సహించేది లేదని అన్నారు. తాను ముఖ్యమంత్రిగా ఉన్నంత కాలం ధనవంతులైనా, రాజకీయ నాయకులు, వారి పిల్లలు అయినా అన్యాయాన్ని సహించనని తెలిపారు. హిట్ అండ్ రన్ నేరస్థులకు రాష్ట్ర ప్రభుత్వం కఠిన చట్టాలను, కఠిన శిక్షలను అమలు చేస్తోందని షిండే ట్వీట్‌లో పేర్కొన్నారు. ‘సాధారణ ప్రజల జీవితాలు మాకు విలువైనవి. ఈ కేసులను అత్యంత సీరియస్‌గా తీసుకుని.. న్యాయం జరిగేలా చూడాలని రాష్ట్ర పోలీసు శాఖను నేను ఆదేశించాను.’ రాష్ట్ర ప్రజలకు సురక్షితమైన వాతావరణాన్ని కల్పించేందుకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని షిండే చెప్పారు. బాధితులకు, వారి కుటుంబాలకు తన ప్రభుత్వం అండగా ఉంటుందని స్పష్టం చేశారు.

అక్కడ బాల్కనీ అద్దె నెలకు రూ. 80,000..!
ఆస్ట్రేలియాలోని న్యూ సౌత్ వేల్స్ రాష్ట్ర రాజధాని నగరం సిడ్నీ. . ఇది దేశంలోని ఆగ్నేయ తీరంలో ఉంది. ఈ నగరం ఆస్ట్రేలియా లోనే అతిపెద్దది. అద్భుతమైన నౌకాశ్రయం, ఐకానిక్ ల్యాండ్‌మార్క్‌లు, శక్తివంతమైన జీవనశైలికి, పర్యటకానికి ఈ ప్రాంతం ప్రసిద్ధి చెందింది. ఎందరో ప్రయాణికులు ఈ నగరాన్ని సందర్శిస్తుంటారు. కాగా.. సిడ్నీలో అద్దె ధరలు వేగంగా పెరుగుతున్నాయి. రియల్ ఎస్టేట్ పరిశోధన సంస్థ డొమైన్ ప్రకారం.. జూన్ 2024లో సిడ్నీలో సగటు అద్దె వారానికి సుమారు రూ. వేలల్లో ఉంది. కొన్ని ప్రాంతాల్లో ఛార్జీలు కూడా ఎక్కువే. ఉదాహరణకు లకేంబా (Lakemba) లో.. అద్దెలు గత సంవత్సరం కంటే 31.6% పెరిగాయి. మీరు సిడ్నీకి వెళ్లి ఇల్లు అద్దెకు తీసుకోవాలనుకుంటే.. ఇబ్బందులు ఎదుర్కోవచ్చు. మీరు అక్కడ అద్దె మార్కెట్ గురించి తప్పక తెలుసుకోవాలి. ఇటీవల.. అక్కడ ఓ యజమాని తన ఇంటి బాల్కనీని దాదాపు నెలకు రూ. 80,000 లకు అద్దెకు ఇస్తానంటూ.. సోషల్ మీడియాలో పోస్ట చేశారు. అవును మీరు చదివింది నిజమే.. అది కేవలం ఓ ఇంటి బాల్కనీ రెంటు మాత్రమే.. మళ్లీ కరెంట్ , వాటర్ బిల్లు అదనమని రాసుకొచ్చారు. బాల్కనీకే అంత అద్దె ఉంటే.. పూర్తి ఇంటికి ఎంత ఉంటుందో అంచనా వేసుకోండి. ఆయన అద్దెకు ఇస్తానన్న ఈ గది నిజానికి రెండు పడకగదుల అపార్ట్మెంట్కు జోడించబడిన చిన్న బాల్కనీ. ఇందులో ఒకే మంచం, అద్దం, రగ్గు, కొన్ని ప్రాథమిక వస్తువులు ఉన్నాయి. గ్లాస్ స్లైడింగ్ తలుపులు దానిని మిగిలిన అపార్ట్మెంట్కు కనెక్ట్ చేస్తాయి. అలాగే.. మొత్తం స్థలం కావాలంటే.. అదే అపార్ట్‌మెంట్ వారానికి సుమారు రూ. 70,000కి అందుబాటులో ఉంటుంది.

ఫ్లాట్‌గా ముగిసిన స్టాక్ మార్కెట్
దేశీయ స్టాక్ మార్కెట్ ఫ్లాట్‌గా ముగిశాయి. సోమవారం ఉదయం ఆరంభంలోనే సూచీలు నష్టాలతో ప్రారంభమయ్యాయి. ముగింపు వరకు అలానే ట్రేడ్ అయ్యాయి. సెన్సెక్స్ 36 పాయింట్లు నష్టపోయి 79, 960 దగ్గర ముగియగా.. నిఫ్టీ 3 పాయింట్లు నష్టపోయి 24, 320 దగ్గర ముగిసింది. డాలర్ పోలిస్తే రూపాయి మారకం విలువ 83.50 దగ్గర ముగిసింది. నిఫ్టీలో ఒఎన్‌జీసీ, ఐటీసీ, హెచ్‌డీఎఫ్‌సీ లైఫ్, హెచ్‌యుఎల్, టాటా కన్స్యూమర్ ప్రొడక్ట్‌లు లాభపడగా.. దివీస్ ల్యాబ్స్, టైటాన్ కంపెనీ, బిపిసిఎల్, శ్రీరామ్ ఫైనాన్స్, అదానీ పోర్ట్స్ నష్టపోయాయి. రంగాలవారీగా చూస్తే క్యాపిటల్ గూడ్స్, ఎఫ్‌ఎంసీజీ మరియు ఆయిల్ & గ్యాస్ 0.6-1.5 శాతం పెరగగా.. ఆటో, బ్యాంక్, హెల్త్‌కేర్, మెటల్, రియల్టీ, పవర్, టెలికాం 0.4-0.8 శాతం క్షీణించాయి. బీఎస్‌ఈ మిడ్‌క్యాప్‌, స్మాల్‌క్యాప్‌ సూచీలు స్వల్పంగా నష్టాల్లో ముగిశాయి.

బాక్సాఫీస్‌కా బాస్… ఓన్లీ ప్రభాస్
కల్కి2898ఏడీ రికార్డు కలెక్షన్ల దిశగా దూసుకుపోతుంది. నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీ తెలుగుతో పాటు ఓవర్ సీస్ లో అనేక రికార్డులను బద్దలు కొడుతోంది. ఇప్పటికి విడుదలైన అన్నీ సెంటర్లో కలెక్షన్లు స్టడీగా ఉన్నాయి. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ ఇతర ఇండస్ట్రీలు కలిపి దాదాపు రూ. 450 కోట్లు షేర్ వసూలు చేసింది. ఇక ఓవర్సీస్ మార్కెట్‌లో కల్కి చిత్రం తన కలెక్షన్ల ప్రవాహంతో సంచలనం సృష్టిస్తోంది. ఈ చిత్రం నార్త్ అమెరికాలో $16 మిలియన్లు వసూలు చేసి జవాన్, RRR రికార్డులను దాటి $20M వైపు పయనిస్తుంది. నార్త్ అమెరికా అల్ టైమ్ హయ్యెస్ట్ కలెక్షన్లు రాబట్టిన (నాన్ బాహుబలి -2) గా కొనసాగుతుంది. సోమవారం నాటికి కల్కి 2898 ఏడీ ప్రపంచవ్యాప్తంగా రూ. 900 కోట్లకు పైగా కలెక్షన్ల రాబట్టినట్టు వైజయంతి మూవీస్ సంస్థ ప్రకటించింది. నాగ్ అశ్విన్ డైరెక్షన్ కు ప్రతి ఒక్కరూ ఫిదా అవుతున్నారు. మహా భారతంతో పాటు సైన్స్ ఫిక్షన్ కలగలిపి తెరకెక్కించిన విధానానికి, దర్శకుని విజన్ కు హ్యాట్సఫ్ చెప్తూ నాగ్ అశ్విన్ ను స్టార్ హీరోలు, పలు దర్శకులు అభినందించారు. తెలుగు సినిమా స్థాయిని పెంచడని కొనియాడారు. కల్కి 2898 AD హిందీ మార్కెట్‌లో 200 Cr+ గ్రాస్‌తో మరో మైలురాయిని చేరుకుంది. అతి త్వరలో హిందీ వెర్షన్‌లో అత్యధిక వసూళ్లు రాబట్టిన చిత్రంగా ఇది నిలిచిపోతుందని భావిస్తున్నారు. కాగా సెకండ్ పార్ట్ పై ఇప్పటినుండే అంచనాలు భారీ స్థాయిలో ఉన్నాయి. కల్కి -2లో ఇంకెంత మంది స్టార్లు స్క్రీన్ షేర్ చేసుకోబోతున్నారు, ప్రభాస్ ని ఎలా చూపించబోతున్నారోనని ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారు. కాగా కల్కి -2కు సంబంధించి ఇప్పటివరకు 20శాతం మాత్రమే షూట్ చేశామని నాగ్ అశ్విన్ ఇటీవల మీడియా ఇంటరాక్షన్ లో తేలిపారు.