NTV Telugu Site icon

Top Headlines @ 5 PM: టాప్‌ న్యూస్‌

Top Headlines @ 5 Pm New

Top Headlines @ 5 Pm New

ఢిల్లీ ఎన్నికల ఫలితాలపై స్పందించిన పవన్‌ కల్యాణ్‌.. ఆసక్తికర వ్యాఖ్యలు..
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఘన విజయాన్ని అందుకుంది.. 70 స్థానాలున్న ఢిల్లీలో.. బీజేపీ 47 స్థానాల్లో విజయాన్ని అందుకోగా.. ఆప్‌ 23 స్థానాలకే పరిమితం అయ్యింది.. అయితే, కాంగ్రెస్‌ పార్టీ మాత్రం ఖాతా కూడా తెరవలేదు.. ఇక, ఢిల్లీలో బీజేపీ విజయంపై స్పందించిన జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం.. ప్రధానమంత్రి నరేంద్ర మోడీపై విశ్వాసం మరోమారు రుజువైందన్నారు.. 2047 నాటికి మన దేశం అభివృద్ధి చెందిన దేశంగా నిలిచేలా నరేంద్ర మోడీ చిత్తశుద్ధితో పరిపాలన సాగిస్తున్నారు. సంక్షేమాన్ని విస్మరించని అభివృద్ధి కార్యక్రమాలతో దేశ ఆర్థిక వ్యవస్థకు జవసత్వాలు ఇస్తున్నారు. నరేంద్ర మోడీ నిర్దేశించిన లక్ష్యాన్ని అందుకోవడంలో దేశ రాజధాని ఢిల్లీ పాత్ర అత్యంత కీలకంగా పేర్కొన్నారు.. ఈ తరుణంలో ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ కూటమి ఘన విజయం సాధించడం స్వాగతించదగ్గ పరిణామం అన్నారు పవన్‌ కల్యాణ్‌.. డబుల్ ఇంజన్ సర్కార్ ద్వారా దేశ రాజధానిలో సమ్మిళిత అభివృద్ధి, సంక్షేమం క్షేత్ర స్థాయికి చేరతాయి. ఢిల్లీ అభివృద్ధికి, దేశ రాజధానిలోని ప్రజల శ్రేయస్సు, సంక్షేమం కోసం వికసిత సంకల్ప్ పత్రం ద్వారా బీజేపీ ఇచ్చిన హామీలు ప్రజల మెప్పు పొందాయి. నరేంద్ర మోడీపై ఢిల్లీ ప్రజలు ఉంచిన విశ్వాసానికి ప్రతీక అక్కడి ఘన విజయం. ఆర్థిక అవకతవకలకు ఆస్కారం లేకుండా సంక్షేమ పథకాల అమలు, పరిపాలన సాగుతాయని అక్కడి ప్రజలు విశ్వసించారు. కేంద్ర హోం శాఖామాత్యులు అమిత్ షా.. దేశ రాజధాని ప్రజల ఆకాంక్షలు అర్థం చేసుకొన్నారు. ఆయన రాజకీయ అనుభవం, చాతుర్యం సత్ఫలితాలను ఇచ్చాయి. కేంద్ర ఆరోగ్య శాఖామాత్యులు, బీజేపీ జాతీయ అధ్యక్షులు జేపీ నడ్డా.. కూటమిని ముందుకు తీసుకువెళ్లడంలో సఫలీకృతులయ్యారని పేర్కొన్నారు.. ఇక, ఢిల్లీ శాసన సభ ఎన్నికల్లో విజయానికి మూల కారకులైన ప్రధాని నరేంద్ర మోడీ, అమిత్ షా, జేపీ నడ్డా, బీజేపీ, దాని మిత్ర పక్ష నాయకులకు హృదయపూర్వక అభినందనలు తెలుపుతూ.. జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ ఓ ప్రకటన విడుదల చేశారు..

తగ్గేదేలే..! ఆర్జీవీ మరో వివాదాస్పద ట్వీట్..!
సోషల్‌ మీడియాలో పెట్టిన పోస్టులతో వివాదాలు.. కేసుల్లో ఇరుకున్న సంచలన దర్శకుడు రాంగోపాల్‌ వర్మ.. శుక్రవారం రోజు ప్రకాశం జిల్లా ఒంగోలు రూరల్‌ పోలీస్‌ స్టేషన్‌లో పోలీసు విచారణను ఎదుర్కొన్నారు.. ఆర్జీవీని దాదాపు 9 గంటల పాటు ప్రశ్నించారు పోలీసులు.. అయితే, ఇదే సమయంలో.. మరో కేసులో ఏపీ సీఐడీ పోలీసుల నుంచి నోటీసులు అందుకోవాల్సి వచ్చింది.. డైరెక్టర్ రాంగోపాల్ వర్మకి నోటీసు జారీ చేశారు గుంటూరు సీఐడీ సీఐ తిరుమలరావు. ఇంత జరుగుతున్నా.. వర్మ మాత్రం తగ్గేదేలే అన్నట్టుగా మరో ట్వీట్‌ చేశారు.. ఒంగోలు పోలీస్ స్టేషన్ లో నిన్న విచారణ పూర్తయిన అనంతరం ఎక్స్ లో స్పందించిన ఆర్జీవీ.. ”ఐ లవ్ ఒంగోలు.. ఐ లవ్ ఒంగోలు పోలీస్.. ఈవెన్ మోర్.. 3 ఛీర్స్…” అంటూ రాసుకొచ్చిన వర్మ.. పెగ్గుతో ఉన్న తన ఫొటోను పోస్ట్ చేశారు.. సోషల్‌ మీడియాలో యాక్టివ్‌గా ఉండే ఆర్జీవీ.. ఇలాంటి పోస్టులు పెట్టడం సర్వసాధారణమే.. కానీ, 9 గంటల పాటు పోలీసుల విచారణ ఎదుర్కొని వచ్చిన తర్వాత ఈ పోస్టు పెట్టడం.. చర్చగా మారింది.. కాగా, వైసీపీ ప్రభుత్వ హయాంలో చంద్రబాబు, పవన్ కల్యాణ్‌, నారా లోకేష్‌ ఫొటోలను మార్ఫింగ్ చేసిన సోషల్‌ మీడియాలో పోస్టు చేసిన కేసులో ఆర్మీజీ ఒంగోలు పోలీసుల విచారణ ఎదుర్కొన్న విషయం విదితమే కాగా.. ఒంగోలు రూరల్ పోలీస్ స్టేషన్ లో తొమ్మిది గంటలు విచారించినా బయటకు వచ్చిన తర్వాత తిరిగి మందు తాగుతున్న ఫొటోలను ఎక్స్ లో షేర్ చేశారు.. ఇక, మరో కేసులో ఏపీ సీఐడీ పోలీసుల నుంచి నోటీసులు అందుకోవాల్సి వచ్చింది ఆర్జీవీ.. ఒంగోలు వచ్చిన గుంటూరు సీఐడీ సీఐ తిరుమలరావు.. ఆర్జీవీకి నోటీసులు ఇచ్చారు.. ఈ నెల 10వ తేదీన గుంటూరులోని సీఐడీ కార్యాలయంలో విచారణకు హాజరు కావాలంటూ ఆ నోటీసుల్లో పేర్కొన్నారు.. 2019లో ‘కమ్మ రాజ్యంలో కడప రెడ్లు’ సినిమా తీశారు ఆర్జీవీ.. అయితే, తమ మనో భావాలు దెబ్బ తీసేవిధంగా సినిమా తీశాడంటూ గత ఏడాది నవంబర్ 29వ తేదీన సీఐడీ కార్యాలయంలో ఫిర్యాదు చేశారు తెలుగు యువత రాష్ట్ర అధికార ప్రతినిధి బండారు వంశీకృష్ణ.. దీంతో, శుక్రవారం ఒంగోలు రూరల్ పోలీస్ స్టేషన్ లో వర్మకి నోటీసు ఇచ్చారు సీఐడీ సీఐ తిరుమలరావు.

ఢిల్లీలో బీజేపీ విజయం.. సీఎం చంద్రబాబుకు ధన్యవాదాలు తెలిపిన మంత్రి..
దేశ రాజధాని ఢిల్లీలో కమలం వికసించింది.. బీజేపీ తిరుగులేని విజయాన్ని అందుకోవడంతో ఎన్నికల ప్రచారంలో కీలకంగా వ్యవహరించినవారికి, ప్రచారంలో పాల్గొన్నవారికి ధన్యవాదాలు తెలుపుతున్నారు ఆ పార్టీ నేతలు.. ఇక, ఢిల్లీలో బీజేపీ విజయంపై స్పందించిన ఆంధ్రప్రదేశ్ వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్.. ఢిల్లీ ఎన్నికల్లో బీజేపీ అఖండ విజయం, ప్రధాని నరేంద్ర మోడీ పట్ల ప్రజలకు ఉన్న అచంచల విశ్వాసానికి నిదర్శనంగా అభివర్ణించారు.. ఎన్నికల్లో ప్రచారం చేసి ఈ విజయంలో ముఖ్య పాత్ర పోషించిన ఏపీ సీఎం చంద్రబాబుకి ధన్యవాదాలు తెలిపారు మంత్రి సత్యకుమార్‌.. ఢిల్లీ ఎన్నికల్లో అరవింద్‌ కేజ్రీవాల్‌తో సహా ఆప్ పార్టీ ముఖ్యనాయకుల్ని ఓడించి ప్రజాధనాన్ని దోచుకునే వారిని క్షమించబోమని ఢిల్లీ ప్రజలు స్పష్టమైన తీర్పు ఇచ్చారని పేర్కొన్నారు.. అభివృద్ధి, సంక్షేమానికి అందలం ఎక్కించి, అవినీతి, అబద్ధాలకు ఢిల్లీ ప్రజలు గుణపాఠం నేర్పారన్నారు.. ఇక, కాంగ్రెస్ సమాధిపై ఢిల్లీ ప్రజలు మరో రాయిని పేర్చారు అంటూ ఎద్దేవా చేశారు సత్యకుమార్‌.. బీజేపీకి పట్టం కట్టి దేశ రాజధానిని ఒక వికసిత్ ఢిల్లీగా తీర్చి దిద్దడానికి బాటలు వేసుకున్నారు.. ఢిల్లీ ప్రజలకు, కార్యకర్తలకు, ముఖ్యంగా ఈ సారి బీజేపీని ఆదరించిన దక్షిణ రాష్ట్రాల ప్రజలకు ధన్యవాదాలు.. గెలుపొందిన వారికి హృదయ పూర్వక శుభాకాంక్షలు అంటూ ఓ ప్రకటన విడుదల చేశారు బీజేపీ నేత, ఏపీ మంత్రి సత్యకుమార్‌ యాదవ్..

కేటీఆర్ వాఖ్యలను తిప్పికొట్టిన మంత్రి కోమటిరెడ్డి..
ఢిల్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఓటమితో రాహుల్ గాంధీపై కేటీఆర్ చేసిన వాఖ్యలను మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి తిప్పికొట్టారు. కేటీఆర్ వ్యాఖ్యలపై మంత్రి ఎక్స్‌లో స్పందిస్తూ.. ‘మేము కాంగ్రెస్ పార్టీ యోధులం.. తెలంగాణలో ఓటమి తర్వాత ఎలాగైతే తిరిగి పుంజుకొని విజయం సాధించామో.. అలాగే దేశవ్యాప్తంగా గెలుస్తాం. పార్లమెంటు ఎన్నికల్లో బీజేపీని గెలిపించడం కోసం.. మీ స్వంత పార్టీకి సున్నా సీట్లు అందించిన గొప్ప నాయకత్వం, పార్టీ మీది. తెలంగాణలో బీజేపీకి 8 సీట్లు అందించిన మీకు అభినందనలు. రాష్ట్రంలో బీజేపీ ఎదుగుదలకు ఎవరైనా కారకులైతే అది ముమ్మాటికీ బీఆర్ఎస్ పార్టీ ఘనతనే’ అని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి పేర్కొన్నారు. అంతకుముందు.. ఢిల్లీ ఎన్నికల ఫలితాలపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పందించారు. కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీపై సెటైర్లు వేస్తూ ఎక్స్‌లో పోస్టు చేశారు. కంగ్రాట్స్ రాహుల్ గాంధీ అంటూ కేటీఆర్ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. మరోసారి బీజేపీని గెలిపించిన రాహుల్ గాంధీకి అభినందనలు అంటూ కేటీఆర్ ట్వీ్ట్ చేశారు. మరోవైపు.. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై మాజీ మంత్రి హరీష్ రావు కూడా స్పందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఢిల్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి గాడిద గుడ్డు మిగిలిందని సెటైర్లు వేశారు. మొన్న హర్యానా, నిన్న మహారాష్ట్ర, నేడు ఢిల్లీలో ఘోర పరాజయం చెందడంలో రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డి గార్ల పాత్ర అమోఘం అని హరీష్ రావు చలోక్తులు విసిరారు. ఇక్కడ హామీలు అమలు చేయకుండా, ఇతర రాష్ట్రాల్లో ప్రచారం చేసుకున్నంత మాత్రాన మీకు ఓట్లు పడతాయా? మీ గ్యారెంటీల నిజస్వరూపం దేశవ్యాప్తంగా బట్టబయలైందని పేర్కొన్నారు.

ఢిల్లీలో బీజేపీ ఘన విజయంపై బీజేఎల్పీ నేత హర్షం..
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ విజయం పట్ల బీజేఎల్పీ నేత, ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. దేశ ప్రజలు మోడీ నాయకత్వాన్ని బలపరుస్తున్నారని.. ఈ ఎన్నికలలో స్పష్టం అవుతోందని ఆయన అన్నారు. రోజు రోజుకు కాంగ్రెస్ పార్టీ కనుమరుగవుతోందని ఆరోపించారు. గతంలో ఆప్ పార్టీ తప్పుడు హామీలతో, అవినీతి ఆరోపణలు ఎదుర్కొనడంతో ప్రజలు ఆ పార్టీకి తగిన గుణపాఠం చెప్పారని మహేశ్వర్ రెడ్డి తెలిపారు. ఏ ఒక్క అవినీతి ఆరోపణలు లేకుండా.. స్వచ్చమైన సుపరిపాలన అందిస్తున్న నరేంద్ర మోడీని దేశ ప్రజలు కోరుకుంటున్నారని పేర్కొన్నారు. గతంలో తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ ప్రభుత్వ అవినీతి పట్ల.. ఆ ప్రభుత్వాన్ని ప్రజలు ఎలా గద్దె దించారో, ప్రస్తుతం ఢిల్లీ ఎన్నికల్లో కూడా ప్రజలు అలాంటి తీర్పే ఇచ్చారని మహేశ్వర్ రెడ్డి తెలిపారు. రాబోవు రోజుల్లో తెలంగాణలో కూడా బీజేపీ ప్రభుత్వం ఏర్పడుతుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. రాష్ట్రంలో కూడా ప్రజలు బీజేపీ వైపు చూస్తున్నారని.. గత 10 సంవత్సరాల బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వ అవినీతి పాలన మాదిరిగానే.. కాంగ్రెస్ పాలన కొనసాగుతున్నదని తెలిపారు. ప్రజలు కాంగ్రెస్ పార్టీని చీదరించుకుంటున్నారని అన్నారు. తెలంగాణలో రాబోయేది రామ రాజ్యమే అని ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి పేర్కొన్నారు.

ఆప్‌లో నెం.1, 2కు షాకిచ్చిన ఓటర్లు.. కారణమిదేనా?
ఆమ్ ఆద్మీ పార్టీ అంటే గుర్తుకొచ్చేది కేజ్రీవాల్, మనీష్ సిసోడియానే. ఆప్ పార్టీని స్థాపించిన దగ్గర నుంచి ముందుండి విజయ తీరాలకు నడిపించిన నాయకులు. దశాబ్ద కాలం పాటు హస్తినలో చక్రం తిప్పిన నాయకులు. అంతటి ఉద్దండులు.. ఒక్క లిక్కర్ స్కామ్ వారి క్రెడిబిలిటీ మీద దెబ్బ కొట్టింది. ఇంకేముందు తాజా ఫలితాల్లో నేలకొరిగేలా చేసింది. ఓటర్లు కొట్టిన దెబ్బతో కోలుకోలేని స్థితిలో పడ్డారు. తాజా ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో అరవింద్ కేజ్రీవాల్, మనీష్ సిసోడియా ఘోర పరాజయం పొందారు. నూఢిల్లీ నుంచి కేజ్రీవాల్, జంగ్‌పురా నుంచి సిసోడియా ఓటమి పాలయ్యారు. పర్వేష్ వర్మ చేతిలో కేజ్రీవాల్, తర్విందర్ సింగ్ మార్వా చేతిలో సిసోడియా ఓడిపోయారు. ఆప్ అధినేతను 4,000 ఓట్ల తేడాతో పర్వేష్ వర్మ ఓడించారు. బీజేపీ అభ్యర్థి తర్విందర్ సింగ్ మార్వా చేతిలో సిసోడియా 600 ఓట్ల తేడాతో ఓడిపోయారు. ఇక ఢిల్లీ ముఖ్యమంత్రి అతిషి మాత్రం స్వల్ప మెజార్టీతో గట్టెక్కారు. కల్కాజీలో బీజేపీ అభ్యర్థి రమేశ్ బిధురిపై అతిషి విజయం సాధించారు.

ప్రభుత్వం ప్రకటించిన ఫాస్టాగ్ వార్షిక పాస్ తో ఎలాంటి లాభాలుంటాయి ?
దేశంలో ఫాస్టాగ్‌కు సంబంధించి కొత్త నియమాన్ని త్వరలో ప్రవేశపెట్టవచ్చు. ఫాస్టాగ్ కోసం వార్షిక టోల్ పాస్‌ను ప్రవేశపెట్టాలని భారత ప్రభుత్వం పరిశీలిస్తుంది. తద్వారా ఫాస్టాగ్‌ను మళ్లీ మళ్లీ రీఛార్జ్ చేయవలసిన అవసరం ఉండదు. దీని కోసం ఏడాది పొడవునా ఒకసారి రూ. 3,000 డిపాజిట్ చేయాలి. తద్వారా ఏ ఎక్స్‌ప్రెస్‌వే, జాతీయ రహదారిపై ఒక సంవత్సరం పాటు ఎటువంటి టోల్ చెల్లించాల్సిన అవసరం ఉండదు. ఈ నిబంధనను ప్రైవేట్ వాహనాలకు మాత్రమే తీసుకుని వచ్చే అవకాశం ఉంది. ఈ కొత్త ఫాస్టాగ్ నిబంధనను ప్రవేశపెట్టడం వల్ల రోడ్డు ప్రయాణాలకు వెళ్లాలనుకునే వారికి లేదా వారి వ్యక్తిగత వాహనంలో ప్రయాణించడానికి ఇష్టపడే వారికి ప్రయోజనం చేకూరుతుంది. ఒకసారి టోల్ ఛార్జీలో కనీసం రూ. 200 తగ్గుతుంది. సుదూర ప్రయాణం చేస్తే అప్పుడు రూ. 700-800 కూడా టోల్ ఫీజు తగ్గుతుంది. తరచుగా ప్రయాణించే వారికి టోల్ ఛార్జీల భారం ఎక్కువగా ఉంటుంది. కొత్త నిబంధన అమలులోకి వస్తే కేవలం రూ. 3,000 టోల్ పాస్‌తో ఈ వ్యక్తులు ఏదైనా జాతీయ రహదారి లేదా ఎక్స్‌ప్రెస్‌వేపై ఆపకుండా అనేకసార్లు ప్రయాణించవచ్చు.

రూ.3కోట్ల కారు కొన్న దేశంలోని అతి పిన్న వయస్కుడైన ఎమ్మెల్యే.. దాని ఫీచర్లు ఇవే
మెర్సిడెస్-బెంజ్ ఇండియా మొబిలిటీ గ్లోబల్ ఎక్స్‌పో 2025లో దిగ్గజ G-వాగెన్ ఎలక్ట్రిక్ వెర్షన్, జీ580 ఈక్యూని విడుదల చేసింది. ఈ ఎలక్ట్రిక్ SUV దాని పవర్ ఫుల్ లుక్స్, ఫీచర్ల కారణంగా ప్రజల దృష్టిని ఆకర్షించింది. భారతదేశంలోనే అతి పిన్న వయస్కుడైన ఎమ్మెల్యే రోహిత్ మైనంపల్లి ఈ కారును మొదట కొనుగోలు చేశారు. డాక్టర్ రోహిత్ మైనంపల్లి తెలంగాణ రాజకీయాల్లో చాలా చురుగ్గా ఉంటారు. తెలంగాణ ఎమ్మెల్యే కారు ఫోటో కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. రోహిత్ మైనంపల్లి ఈ ఎలక్ట్రిక్ ఎస్ యూవీని డీప్ బ్లాక్ షేడ్ లో కొనుగోలు చేశాడు. ఈ ఎలక్ట్రిక్ కారు లుక్ G-వాగెన్ ICE వెర్షన్‌ని పోలి ఉంటుంది. ఈ కారు ముందు గ్రిల్, హెడ్‌ల్యాంప్‌లు, బంపర్ G63, G400d లాగా ఉన్నాయి. ఈ ఎస్ యూవీ బాక్సీ డిజైన్‌ను ఆటోమేకర్లు మార్చలేదు. ఈ మెర్సిడెస్ కారు ప్రీమియం ఫీచర్ల గురించి మాట్లాడుకుంటే.. దీనికి రెండు 12.3-అంగుళాల డిస్ప్లేలు ఉన్నాయి. వీటిలో ఒకటి ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ కోసం, మరొకటి ఈ కారు ఇన్ఫోటైన్‌మెంట్ స్క్రీన్ కోసం. ఈ కారులో ఎలక్ట్రిక్ అడ్జస్టబుల్ సీట్లు అందించబడ్డాయి. ఈ ఈవీలో మల్టీ-జోన్ క్లైమేట్ కంట్రోల్, అడాప్టివ్ క్రూయిజ్ కంట్రోల్, హీట్, కూల్ సీట్లు వంటి అనేక ఫీచర్లు అందించారు.

విచారణ తర్వాత జైలు నుంచి హీరోయిన్లు విడుదల
షేక్ హసీనా ప్రధాని పీఠం నుంచి గద్దె దిగిన తర్వాత, బంగ్లాదేశ్‌లోని యూనస్ ప్రభుత్వం ఆమెతో సంబంధం ఉన్న వ్యక్తులపై నిఘా పెట్టింది. ఏ మాత్రం అనుమానం ఉన్నా ఆ ప్రజలను అదుపులోకి తీసుకుంటున్నారు. బంగ్లాదేశ్ నటులు మెహర్ అఫ్రోజ్ షాన్, సోహానా సబాలను గురువారం పోలీసులు అదుపులోకి తీసుకుని శుక్రవారం విడుదల చేశారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా కుట్ర పన్నారనే ఆరోపణలపై ఆ ఇద్దరు నటులను అరెస్టు చేశారు. విచారణ తర్వాత, వారిద్దరినీ నిన్న మధ్యాహ్నం విడుదల చేసి, వారి కుటుంబాలకు అప్పగించినట్లు డీఎంపీ డిప్యూటీ కమిషనర్ బంగ్లాదేశ్ మీడియాకు తెలిపారు. షాన్ తండ్రి మహ్మద్ అలీ గత సంవత్సరం 12వ పార్లమెంటు ఎన్నికలకు ముందు జమాల్పూర్-4 (సదర్) నియోజకవర్గానికి అవామీ లీగ్ నుంచి నామినేషన్ దాఖలు చేశారు. అతని తల్లి బేగం తహురా అలీ కూడా 1996-2001 వరకు, 2009-2014 వరకు మహిళలకు రిజర్వ్ చేయబడిన స్థానం నుండి ఎంపీగా ఎన్నిక అయ్యారు. జమాల్‌పూర్‌లోని వారి ఇంటి నుండి క్రైమ్ బ్రాంచ్ మెహర్ అఫ్రోజ్ షాన్ ను అదుపులోకి తీసుకుంది. ఆ రాత్రి తరువాత, సోహానా సాబాను అదే అభియోగంపై అరెస్టు చేశారు. షేక్ హసీనా పార్టీ అవామీ లీగ్‌తో సంబంధం ఉన్న వ్యక్తులను అరెస్టు చేయడం లేదా నిర్బంధించడం ఇదే మొదటిసారి కాదు. బంగ్లాదేశ్‌లో యూనస్ ప్రభుత్వం అవామీ లీగ్ వ్యక్తులను కేవలం అనుమానంతోనే అరెస్టు చేస్తోంది. అవామీ లీగ్ నాయకులను అల్లరి మూకలు చంపి వారి ఇళ్లకు నిప్పంటిస్తున్నట్లు నివేదికలు ఉన్నాయి.

అఖండ 2లో మరో కుర్ర హీరో.. ఎవరంటే?
నందమూరి బాలకృష్ణ- దర్శకుడు బోయపాటి శ్రీను కాంబినేషన్ టాలీవుడ్ లో హాట్రిక్ విజయాన్ని అందుకుంది. వీరి కాంబోలో తెరకెక్కిన సింహా, లెజెండ్, అఖండ సినిమాలు బ్లాక్ బస్టర్ హిట్స్ గా నిలవడమే కాదు కానీ బాక్సాఫీసు వద్ద కలెక్షన్ల వర్షం కురిపించాయి. ఇక తాజాగా వీరి కాంబోలో తెరకెక్కుతున్న చిత్రం పేరును ‘అఖండ 2-తాండవం’గా ఫిక్స్ చేశారు. ఇక ఈ సినిమాపై అభిమానులకు భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన పూజా కార్యక్రమాలు పూర్తి చేసుకోగా, రెగ్యూలర్‌ షూటింగ్‌ కూడా ప్రస్తుతము అన్నపూర్ణ స్టూడియోలో జరుగుతోంది. ఈ సినిమా అనే కాదు తాను చేసే సినిమాల్లోని నటీనటుల ఎంపికపై దర్శకుడు బోయపాటి చాలా క్లారిటీగా ఉంటాడు. ఇక ‘అఖండ 2’ కోసం కూడా సెర్చింగ్ మొదలు పెట్టాడు. ఆల్ రెడీ, ఇప్పటికే పలు కీలక పాత్రల్లో ఇతర భాషల నటులను తీసుకోవాలని ఫిక్స్ అయ్యారు. కాగా తాజాగా ఈ సినిమాలో ఒక కుర్ర హీరో నటిస్తున్నట్టు అధికారిక ప్రకటన వచ్చేసింది. టాలెంటడ్ హీరో ఆది పినిశెట్టి అఖండ 2లో ఒక కీలక పాత్రలో నటిస్తున్నాడు. ఇక ప్రస్తుతం రామ్ లక్ష్మణ్ మాస్టర్స్ పర్యవేక్షణలో హై ఆక్టేన్ యాక్షన్ సీక్వెన్స్ ని యూనిట్ చిత్రీకరిస్తోంది. అఖండ 2 సెప్టెంబర్ 25, 2025న దసరా సందర్భంగా ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్ గా విడుదల కానుంది.