NTV Telugu Site icon

Top Headlines @ 5 PM: టాప్‌ న్యూస్‌

Top Headlines @ 5 Pm New

Top Headlines @ 5 Pm New

ఏపీ బ్రాండ్‌ దెబ్బతీసేలా సోషల్‌ మీడియా పోస్టులు.. సర్కార్‌ సీరియన్‌ యాక్షన్‌..!
ఆంధ్రప్రదేశ్‌లోని కూటమి ప్రభుత్వంపై సోషల్‌ మీడియా వేదికగా విష ప్రచారం జరుగుతుంది.. అంతే కాదు.. ఆంధ్రప్రదేశ్‌ బ్రాండ్‌ను దెబ్బతీసేలా కూడా పోస్టులు పెడుతున్నారట.. అయితే, ఏపీ బ్రాండ్ దెబ్బతీసేలా వస్తున్న కొన్ని సోషల్ మీడియా పోస్టింగులపై చంద్రబాబు ప్రభుత్వం సీరియస్‌గా ఉంది.. ఏపీలో పెట్టుబడులు పెట్టొద్దనే రీతిలో సోషల్ మీడియా పోస్టులు పెడుతున్న వారిపై నిఘా పెట్టింది సర్కార్‌.. యూట్యూబ్ అకాడమీ పెట్టాలన్న ప్రభుత్వ ప్రయత్నాలకు గండి కొట్టేలా.. వైసీపీ అనుకూల సోషల్ మీడియా.. దానికి వ్యతిరేకంగా పోస్టులు పెడుతోందని గుర్తించారట అధికారులు.. ఏపీలో శాంతి భద్రతలు సరిగా లేవంటూ యూట్యూబ్, గూగుల్ సంస్థలను ట్యాగ్ చేస్తూ పోస్టింగులు పెట్టడంపై ప్రభుత్వం గుర్రుగా ఉంది.. పెట్టుబడులు పెట్టాలన్నా, అకాడమీ పెట్టాలన్నా హైదరాబాద్ కు వెళ్లండంటూ సోషల్ మీడియా వేదికగా సలహాలు ఇస్తున్నారు.. రాష్ట్రంలో 36 రాజకీయ హత్యలు జరిగాయి అంటూ ఇప్పటికే వైసీపీ దుష్ప్రచారం చేస్తోందని మండిపడుతోంది ప్రభుత్వం.. తమ అనుమానాలకు బలం చేకూర్చేలా వైసీపీ సోషల్ మీడియా పోస్టింగులున్నాయంటున్నారు ప్రభుత్వ పెద్దలు.. ఏపీకి పెట్టుబడులు రాకుండా, సంపద సృష్టి జరగకుండా వైసీపీ పన్నాగాలు పన్నిందంటూ చంద్రబాబు సర్కార్‌ ఫైర్‌ అవుతోంది.

వీడు అసలు మనిషేనా..? పండు ముసలిపై అఘాయిత్యం.. ఆపై గొంతు నులిమి హత్య..
కామంతో కళ్లుచూసుకుపోయిన కామాంధులు.. చిన్నా చితక.. ముసలి ముతక అనే తేడా లేకుండా.. త వాంఛను తీర్చుకుంటున్నారు.. అంతేకాదు.. వారి ప్రాణాలను కూడా తీస్తున్నారు.. తాజాగా మెదక్‌ జిల్లాలో జరిగిన ఓ ఘటన తీవ్ర కలకలం రేపుతోంది.. మెదక్ జిల్లా టేక్మాల్ మండలం సాలోజి పల్లి గ్రామంలో విషాదం చోటుచేసుకుంది. శ్రీ దత్తాశ్రమంలో ఒంటరిగా నివాసముంటున్న వృద్ధురాలి మెడలో ఉన్న బంగారు గుండ్ల పై కన్నేసిన ఓ దుర్మార్గుడు.. ఆ గుండ్లను కాజేసేందుకు పన్నాగం పన్నాడు. మద్యం మత్తులో అర్ధరాత్రి సమయంలో ఆశ్రమంలోకి చొరబడి వృద్ధురాలు అంజమ్మ (75) పై అఘాయిత్యానికి పాల్పడ్డాడు. ఆ తర్వాత వృద్ధురాలి గొంతు నులిమి మట్టు బెట్టాడు.. అనంతరం వృద్ధురాలి మెడలో ఉన్న బంగారు గుండ్లను అపహరించి ఉడాయించాడు. అయితే, శివకుమార్‌ (28) అనే యువకుడు ఈ దారుణానికి పాల్పడ్డట్టుగా పోలీసులు తేల్చారు. టేక్మాల్ మండలం సాలోజిపల్లి గ్రామానికి చెందిన దుర్గయ్య, అంజమ్మ దంపతులకు నలుగురు సంతానం.. ఇద్దరు కొడుకులు ఇద్దరు కూతుళ్లు. వీరిలో ఇద్దరు కుమారులు మృతి చెందారు. పెద్ద కూతురు సాలోజిపల్లి గ్రామానికి చెందిన ఓ వ్యక్తితో వివాహాన్ని జరిపించారు. అనంతరం దుర్గయ్య అంజమ్మ దంపతులు వారి శేష జీవితాన్ని ప్రశాంతంగా దైవ చింతనలో గడిపేందుకు గత 20 ఏళ్ల క్రితం సాలోజిపల్లి గ్రామా శివారులో శ్రీ దత్తాశ్రమాన్ని ఏర్పాటు చేసి అక్కడే వారి జీవితాన్ని కొనసాగిస్తున్నారు. అనారోగ్య సమస్యలతో దుర్గయ్య గత కొద్ది సంవత్సరాల క్రితం కన్నుమూశాడు.. అయితే, దుర్గయ్య మృతి అనంతరం అంజమ్మ శ్రీ దత్తాశ్రమంలోనే ఒంటరిగా ఉంటూ తన శేష జీవితాన్ని గడుపుతుంది. ఈ నేపథ్యంలోనే అంజమ్మ కూతురు అల్లుడు ఆశ్రమానికి అప్పుడప్పుడు వచ్చి అంజమ్మ యోగక్షేమలపై ఆరా తీసేవారు. తమ వద్దే ఉండాలని కూతురు అల్లుడు ప్రాధేయపడిన అంజమ్మ నిరాకరించేదని అన్నారు. ఈ క్రమంలోనే నిన్న అర్థరాత్రి అంజమ్మ అల్లుడు తన విధులు ముగించుకొని ఆశ్రమంలో ఒంటరిగా ఉంటున్న తన అత్తగారిని రోజువారీగా భోజనం ఇచ్చి పలకరించేందుకు వెళ్లిన సమయంలో అంజమ్మ స్పృహ కోల్పోయి మిగతాజీవిగా పడి ఉండడాన్ని గమనిచాడు. చీకట్లో శివకుమార్ కూడా ఉండడంతో అనుమానంతో నిలదీసేందుకు ప్రయత్నించాడు. ఈ క్రమంలో శివకుమార్ అంజమ్మ అల్లుడుపై కర్రతో దాడి చేసి పారిపోయాడు. ఈ విషయాన్ని పోలీసులకు సమాచారం అందించడంతో ఘటన స్థలికి చేరుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. అనంతరం నిందితుడి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ఈ దారుణ ఘటనతో అంజమ్మ కుటుంబీకులు శోకసంద్రంలో మునిగిపోయారు.

టీడీపీ పొలిట్‌బ్యూరో కీలక నిర్ణయం.. వారికే నామినేటెడ్‌ పోస్టులు..!
టీడీపీ పొలిట్‌బ్యూరో సమవేశంలో కీలక నిర్ణయాలు తీసుకుంది.. మంగళగిరిలోని తెలుగు దేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో సీఎం, టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన పొలిట్ బ్యూరో సమావేశమైంది. ఈ సమావేశం ముగిసిన తర్వాత మీడియాతో మాట్లాడిన ఏపీ టీడీపీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్ రావు.. కార్యకర్తలకు నామినేటెడ్‌ పదవులిచ్చి వారికి సముచిత స్థానం కల్పించాలని పొలిట్‌బ్యూరో నిర్ణయించిందన్నారు.. పార్టీ కోసం పని చేసిన నేతలు.. కార్యకర్తలను ప్రభుత్వంలో భాగస్వామ్యం చేయాలని చంద్రబాబు సూచించారు. పార్టీ కోసం పని చేసినవారి జాబితా ఇప్పటికే పార్టీకి ఉంది. పార్టీ బలోపేతం కోసం పని చేసిన కార్యకర్తలకు మంచి స్థానం కల్పించే దిశగా కసరత్తు చేస్తున్నాం. సభ్యత్వ నమోదు కార్యక్రమం చేపట్టనున్నాం అన్నారు.. ఇక, పోలవరం, అమరావతి నిర్మాణాలపై చర్చ జరిగింది. ఈ రెండు ప్రాజెక్టులను గత ప్రభుత్వం విధ్వంసం చేసింది. నదుల అనుసంధానం ద్వారా రాష్ట్రానికి జరిగే మేలు గురించి చర్చించాం.. కేంద్రం అందించిన సాయంపై పొలిట్‌ బ్యూరో హర్షం వ్యక్తం చేసిందన్నారు.

‘విభజనాత్మక’ వక్ఫ్ సవరణ బిల్లును వ్యతిరేకించిన అసదుద్దీన్ ఒవైసీ
వక్ఫ్ బోర్డు సవరణ బిల్లు 2024ను లోక్‌సభలో ప్రవేశపెట్టడాన్ని ఆల్ ఇండియా మజ్లిస్-ఇ-ఇత్తెహాదుల్ ముస్లిమీన్ (AIMIM) అధ్యక్షుడు, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ గురువారం నాడు వ్యతిరేకించారు. “వక్ఫ్ సవరణ బిల్లును ప్రవేశపెట్టడాన్ని నేను వ్యతిరేకిస్తున్నాను ఎందుకంటే ఈ సవరణలు చేయడానికి ఈ సభకు అర్హత లేదు. ఈ బిల్లు ఆర్టికల్స్ 14, 15, మరియు 25 కింద ఉన్న సూత్రాలను ఉల్లంఘిస్తోంది. ఇది న్యాయవ్యవస్థ స్వతంత్రత మరియు అధికార విభజన సూత్రాలను ఉల్లంఘించినందున ఇది వివక్షత, ఏకపక్షం మరియు రాజ్యాంగ ప్రాథమిక నిర్మాణంపై తీవ్రమైన దాడి. ఆస్తి యొక్క వక్ఫ్ నిర్వహణ ఒక ముస్లింకు అవసరమైన మతపరమైన ఆచారం అని అర్థం చేసుకోవాలి. క్లాజ్ 4 కింద వక్ఫ్-అల్-ఔలాద్‌కు మరియు సెక్షన్ 3 ఆర్1 కింద వక్ఫ్‌కు చట్టపరమైన గుర్తింపును నిరాకరించడం ద్వారా, ముస్లింలు తమ వక్ఫ్ ఆస్తులను ఎలా కఠినంగా నిర్వహించవచ్చో ఆంక్షలు విధించాలని ప్రభుత్వం కోరింది” అని అసదుద్దీన్ ఒవైసీ అన్నారు.

ధరణి మాదిరిగా తప్పులు జరగకుండా కొత్త చట్టం చేయాలని ప్రభుత్వ ఆలోచన
ధరణి మాదిరిగా తప్పులు జరగకుండా కొత్త చట్టం చేయాలని ప్రభుత్వ ఆలోచన అని కిసాన్ కాంగ్రెస్ జాతీయ ఉపాధ్యక్షుడు కోదండ రెడ్డి అన్నారు. కొత్త రెవెన్యూ చట్టంపై ఇవాళ అఖిలపక్ష సమావేశం నిర్వహించింది. హైదరాబాద్ ఫతే మైదాన్ క్లబ్ లో ఈ ఆల్ పార్టీ మీటింగ్ జరిగింది. ఈ సందర్భంగా కోదండ రెడ్డి మాట్లాడుతూ.. 23 వ తేది వరకు అందరి సలహాలు తీసుకుంటామని ఆయన తెలిపారు. ధరణిలో జరిగినవి మాములు తప్పులు కాదని, అన్ని సంఘాలు…పార్టీల నేతలతో అభిప్రాయాలు సేకరించామన్నారు. బీఆర్‌ఎస్‌ వాళ్ళు రెవెన్యూ అధికారులకు ఐనా తమ అభిప్రాయాలు పంపండన్నారు. రుణమాఫీ మాములు నిర్ణయం కాదని ఆయన వ్యాఖ్యానించారు. ధరణి సమస్యల పరిష్కారం విషయంలో రాష్ట్ర ప్రభుత్వం సాహసోపేతమైన నిర్ణయం తీసుకోబోతున్నదని కోదండరెడ్డి అన్నారు. ధరణి సమస్యల కారణంగా అనేక మంది రైతులు ఇబ్బందులు ఎదుర్కొన్నారని తాము అధికారంలోకి వచ్చాక స్పెషల్ డ్రైవ్ నిర్వహించి దాదాపు 2 లక్షల అప్లికేషన్లను పరిష్కరించగలిగామన్నారు. ఆల్ పార్టీ మీటింగ్ అనంతరం ఆయన గాంధీ భవన్ లో మీడియాతో మాట్లాడారు. ఈ విషయంలో ఆల్ పార్టీ మీటింగ్ నిర్వహిస్తే బీజేపీ, బీఆర్ఎస్, ఎంఐఎం పార్టీలు రాలేదని విమర్శించారు. మీటింగ్ కు రాకపోయినా పర్వాలేదు కానీ మీ పార్టీ సలహాలు సూచనలు రెవెన్యూ శాఖ సెక్రటరీకి కనీసం రాతపూర్వకంగానైనా పంపించి సహకరించాలని కోరారు. ఇది ప్రజలకు ఉపయోగపడే అంశం అని అందువల్ల అందరూ సహకరించాలని కోరారు. గతంలో జరిగిన తప్పిదాలు పునరావృతం కావద్దనే ప్రయత్నం అని చెప్పారు.

విపక్షాల ఆందోళనతో “పార్లమెంట్ కమిటీ”కి వక్ఫ్ బిల్లు..
వక్ఫ్ బోర్డు ‘అపరిమిత అధికారాలకు’ కత్తెర వేసేందుకు, మిగిలిన కమ్యూనిటీలకు ప్రాధాన్యత దక్కేలా కేంద్ర ప్రభుత్వం వక్ఫ్ సవరణ బిల్లును ఈ రోజు లోక్‌సభలో ప్రవేశపెట్టింది. కేంద్ర మైనారిటీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు ఈ బిల్లును సభలో ప్రవేశపెట్టారు. అయితే, ఈ బిల్లు రాజ్యంగవ్యతిరేకమని, రాజ్యాంగంపై దాడిగా కాంగ్రెస్‌తో పాటు ప్రతిపక్షాలు ఆరోపించాయి. కాంగ్రెస్‌తో పాటు సమాజ్‌వాదీ పార్టీ, డీఎంకే, ఎన్సీపీ, ఎంఐఎం పార్టీలు బిల్లును తీవ్రంగా వ్యతిరేకించాయి. అయితే, ప్రతిపక్షాలకు కేంద్రం ధీటుగా సమాధానం ఇచ్చింది. ఈ బిల్లు కాంగ్రెస్ హయాంలోని సచార్ కమిటీ సిఫారసుల ఆధారంగా రూపొందించామని, వక్ఫ్ బోర్డు మాఫియా వశమైందని కేంద్రమంత్రి అన్నారు. ముఖ్యంగా కాంగ్రెస్ నేతృత్వంలోని ఇండియా కూటమి బిల్లును తీవ్రంగా వ్యతిరేకించడంతో వక్ఫ్ సవరణ బిల్లు జాయింట్ పార్లమెంట్ కమిటీ(జేపీసీ)కి పంపబడింది. 1995 చట్టంలో సవరణలు చేస్తూ, ముస్లిం మహిళలను వక్ఫ్ బోర్డుల్లో చేర్చడం, ఒక ఆస్తిని వక్ఫ్ ఆస్తిగా ప్రకటించే ముందు భూమిని ధృవీకరించడం వంటి ముఖ్యమైన మార్పులను కొత్తగా తీసుకురాబోతున్న బిల్లు ప్రతిపాదిస్తుంది. వక్ఫ్ బోర్డు ద్వారా వచ్చే డబ్బును ప్రభుత్వం సూచించిన పద్ధతిలో వితంతువులు, విడాకులు తీసుకున్నవారు మరియు అనాథల సంక్షేమానికి ఉపయోగించాలని కూడా నిర్దేశించింది. మహిళల వారసత్వ సంపదకు రక్షణ కల్పించాలన్నది మరో కీలక ప్రతిపాదన. వక్ఫ్ సంస్థల్లో ముస్లిమేతర సభ్యులను చేర్చాలనే నిబంధన ప్రతిపాదిత చట్టంలోని మరో వివాదాస్పద అంశం.

రేపు ఈ మార్గంలో 20 కోచ్ల తొలి వందే భారత్ ట్రయల్ రన్..
దేశ ఆర్థిక రాజధాని ముంబై-అహ్మదాబాద్ మధ్య త్వరలో వందే భారత్ రైలు ప్రారంభం కానుంది. రేపు (ఆగస్టు 9న) 20 కోచ్‌లతో తొలి వందేభారత్ రైలు ట్రయల్‌ని భారతీయ రైల్వే నిర్వహించబోతోంది. 130 కి.మీ వేగంతో ప్రయాణించే ఈ రైలును తొలిసారిగా ట్రయల్ చేయనున్నారు. అహ్మదాబాద్-వడోదర-సూరత్-ముంబై సెంట్రల్ మధ్య రైలు ట్రయల్ రన్ జరుగనుంది. ఉదయం 7 గంటలకు అహ్మదాబాద్ స్టేషన్ నుండి బయలుదేరి మధ్యాహ్నం 12:15 గంటలకు ముంబై సెంట్రల్ చేరుకుంటుంది. ప్రస్తుతం దేశంలోని పెద్ద నగరాల మధ్య 16 కోచ్‌లతో.. చిన్న నగరాల మధ్య 8 కోచ్‌లతో వందే భారత్ రైలును నడుపుతున్నారు. ప్రస్తుతానికి 16-16 కోచ్‌ల రెండు వందేభారత్ రైళ్లు అహ్మదాబాద్-ముంబై మార్గంలో నడుస్తున్నాయి. ఈ రెండు రైళ్లు ఈ దూరాన్ని చేరుకోవడానికి దాదాపు ఐదున్నర గంటల సమయం పడుతుంది. ఈ రెండు రైళ్ల నుంచి 100 శాతం రెస్పాన్స్, ఆక్యుపెన్సీ అందుతుంది. ఈ క్రమంలో దీన్ని దృష్టిలో ఉంచుకుని.. దేశంలోనే మొట్టమొదటి 20 కోచ్‌ల వందే భారత్ రైలును ఈ రెండు నగరాల మధ్య నడపాలని రైల్వేశాఖ భావించింది. ఈ క్రమంలో.. ఈ రైలు ట్రయల్ రన్ కు సన్నాహాలు ప్రారంభమయ్యాయి. రైల్వే మంత్రిత్వ శాఖకు చెందిన రీసెర్చ్ డిజైన్ అండ్ స్టాండర్డ్స్ ఆర్గనైజేషన్ ఆగస్టు 9న అహ్మదాబాద్-వడోదర-సూరత్-ముంబై సెంట్రల్ మధ్య ట్రయల్‌ను ఆమోదించింది. ఈ మేరకు పశ్చిమ రైల్వే జోన్ జనరల్ మేనేజర్ కార్యాలయానికి రైల్వేశాఖ ఆదేశాలు జారీ చేసింది.

సెమీస్‌కి చేరిన భారత రెజ్లర్ అమన్ సెహ్రావత్..
2024 పారిస్ ఒలింపిక్స్‌లో పురుషుల ఫ్రీస్టైల్ 57 కేజీల రెజ్లింగ్‌లో భారత ఆటగాడు అమన్ సెహ్రావత్ సెమీ-ఫైనల్‌కు చేరుకున్నాడు.అల్బేనియాకు చెందిన జెలిమ్‌ఖాన్ అబాకరోవ్‌పై సెహ్రావత్ 12-0తో విజయం సాధించాడు. తన ప్రత్యర్థికి పోరాటాన్ని ప్రారంభించడానికి ఏ మాత్రం సమయం ఇవ్వలేదు. 2024 పారిస్ గేమ్స్‌లో భారతదేశపు పురుష రెజ్లరలో అమన్ అద్భుతమైన ప్రదర్శన కనబరిచాడు. కాగా.. సెమీ ఫైనల్ మ్యాచ్ ఈరోజు రాత్రి 9.45 గంటలకు జరగనుంది.

భారత రెజ్లర్పై చర్యలు.. మూడేళ్ల నిషేధం
ఒలింపిక్ క్రీడల సమయంలో క్రమశిక్షణా రాహిత్యానికి పాల్పడినందుకు భారత రెజ్లర్ అంతిమ్ పంఘల్‌పై ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్ (IOA) చర్యలు తీసుకుంది. మూడేళ్లపాటు నిషేధం విధిస్తూ నిర్ణయం తీసుకుంది. మహిళల 53 కిలోల రెజ్లింగ్ పోటీలో పాల్గొన్న అంతిమ్ పంఘల్ ఓడిపోయింది. ఇంతకుముందు వినేష్ ఫొగట్ పాల్గొనే వెయిట్ కేటగిరీ ఇదే. ఆ తర్వాత కూడా వివాదాల్లో ఇరుక్కోవడం ఆశ్చర్యకరమైన విషయం. అంతిమ్ అక్రిడిటేషన్ తో ఆమె సోదరి నిశా ఒలింపిక్ విలేజీలోకి ప్రవేశించడంతో పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే.. ఈ క్రమంలో.. ఫ్రెంచ్ అధికారులు క్రమశిక్షణా ఉల్లంఘనకు పాల్పడినట్లు ఆరోపణలు రావడంతో భారత ఒలింపిక్ సంఘం దృష్టి సారించింది. ఎట్టకేలకు భారత రెజ్లర్ అంతిమ్ పంఘల్, తన సోదరి.. సహాయక సిబ్బందిని తిరిగి భారతదేశానికి పంపాలని నిర్ణయించారు.

రాజ్ తరుణ్ కు ముందస్తు బెయిల్ మంజూరు..
నేడు (ఆగష్టు 8 ) నార్సింగి కేసులో హీరో రాజ్ తరుణ్ కు భారీ ఊరట లభించింది. ఈ కేసులో ఆయనకు ముందస్తు బెయిల్ హైకోర్టు మంజూరు చేసింది. లావణ్యతో పెళ్లి జరిగినట్లు ఆధారాలు లేకపోవడంతో ముందస్తు బెయిల్ మంజూరు చేసింది తెలంగాణ హైకోర్టు. ఇకపోతే., 30 సినిమాలకు పైగా రాజ్ తరుణ్ నటించాడని.. రాజ్ తరుణ్ తరుపు న్యాయవాది పేర్కొన్నాడు. ఆధారాలు లేకుండా కేసు నమోదు చేశారని రాజ్ తరుణ్ తరుపు న్యాయవాది కోర్టుకు వివరించడంతో ముందస్తు బెయిల్ మంజూరు చేసింది హైకోర్టు. గత కొద్ది రోజుల నుంచి రాజ్ తరుణ్ – లావణ్య సంబంధించిన విషయాలు టాలీవుడ్ ఇండస్ట్రీలో పెను సంచలనం సృష్టించాయి. దీంతో హీరో రాజ్ తరుణ్ కొన్ని రోజులపాటు ఎవరికి కనిపించకుండా అజ్ఞాతం లోకి వెళ్లాడు. తర్వాత కేసు నిమిత్తం పోలీసులు అతడిని పోలీస్ స్టేషన్ హాజరుకావాలని తెలిపిన అతడు రాలేకపోయాడు. ఇక తాజాగా విడుదలైన సినిమాకు సంబంధించి ప్రమోషన్స్ లో ఆయన కనిపించి అనేక ప్రశ్నలకు సమాధానం ఇచ్చిన సంగతి తెలిసిందే. తాజాగా ఇప్పుడు నార్సింగ్ కేసులో ఆయనకు ముందస్తు బెయిల్ కోర్టు మంజూరు చేసింది.

అప్పుడు హీరో అడవులని కాపాడితే ఇప్పుడు చెట్లు నరికి స్మగ్లింగ్ చేస్తున్నాడు
పవర్ స్టార్ , ఇప్పుడు ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సినిమాలలో పాత్రల మీద చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. తాజాగా ఆయన బెంగళూరు వెళ్లారు. అధికారిక పర్యటనలో భాగంగా అక్కడ అధికారులతో మాట్లాడుతూ ఆయన చేసిన వ్యాఖ్యలు కూడా వైరల్ అవుతున్నాయి. 40 సంవత్సరాల క్రితం హీరో అడవులను కాపాడే వాడు, అప్పుడు హీరోలంతా అడవులను కాపాడే పాత్రలు పోషిస్తే ఇప్పుడు మాత్రం కుర్ర హీరోలు మాఫియా, స్మగ్లింగ్ పాత్రలు పోషిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. పరిస్థితి చాలా మారిందని ఒకప్పుడు హీరోలు అడవులను కాపాడే పాత్రలు చేస్తే ఇప్పుడు హీరోలు మాత్రం అడవులను నాశనం చేసి చెట్లను నరికి వాటిని స్మగ్లింగ్ చేసే వారిగా నటిస్తున్నారని ఆయన అన్నారు. కన్నడ కంఠీరవ రాజ్ కుమార్ గందదగుడి అనే సినిమా తనకు చాలా ఇష్టమని అడవిని రక్షించడమే ఆ సినిమా కాన్సెప్ట్ అని చెప్పుకొచ్చారు. డిఎఫ్ఓగా రాజ్ కుమార్ అడవులను కాపాడే తీరు తనకు అప్పట్లో చాలా బాగా నచ్చిందని పవన్ అన్నారు. అయితే పవన్ కళ్యాణ్ వ్యాఖ్యల మీద సోషల్ మీడియాలో రకరకాల చర్చలు అయితే జరుగుతున్నాయి. కర్ణాటక అటవీ శాఖ మంత్రితో పవన్ కళ్యాణ్ సమావేశం అయ్యారు. ఎర్రచందనం అక్రమ రవాణా నివారణకు తీసుకోవాల్సిన చర్యలపై కర్ణాటక అటవీ మంత్రితో పవన్ కళ్యాణ్ చర్చలు జరిపారు. పొరుగు రాష్ట్రాల సహకారంతో ఎర్ర చందనం దోపిడీని అరికట్టేలా ఎర్ర చందనం స్మగ్లింగ్ కట్టడి కలిసి పని చేయాలని అటవీ శాఖ మంత్రిని కోరారు. ఈ సమావేశంలోనే పవన్ కళ్యాణ్ ఈ మేరకు కామెంట్స్ చేశారు.

నాగచైతన్య ఎంగేజ్మెంట్.. ఒంటరి వాళ్ళు కాదని గుర్తుంచుకోవాలంటూ సమంత సంచలన పోస్ట్
చాలాకాలం పాటు ప్రేమించుకుని పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకున్న సమంత నాగచైతన్య విడిపోయారు. ఆ తర్వాత వీరు విడిపోవడానికి కారణాలు అంటూ అనేకం తెరమీదకు వచ్చినా ఏ విషయం మీద ఇప్పటివరకు క్లారిటీ లేదు. ఇక ఇప్పుడు నాగచైతన్య శోభిత ధూళిపాళ్లతో ఏడడుగులు వేసేందుకు సిద్ధమవుతున్నాడు. అందులో ప్రధమ ఘట్టంగా ఈరోజు వీరిద్దరికి సంబంధించిన ఎంగేజ్మెంట్ ఇరు కుటుంబ సభ్యుల మధ్య జరిగింది. ఈ విషయాన్ని స్వయంగా నాగార్జున అధికారికంగా ప్రకటించాడు. అయితే చైతన్య, శోభిత ఎంగేజ్మెంట్‌కు ముందు సమంత చేసిన పోస్ట్‌ ఒకటి ఇప్పుడు వైరల్ అవుతోంది. తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో.. ‘కష్టాలను, ప్రతికూల పరిస్థితులను సమర్ధవంతంగా ఎదుర్కొన్న వాళ్ళు.. ఎప్పుడూ ఒంటరి వాళ్ళు కాదనే విషయాన్ని గుర్తుంచుకోవాలి..’ అంటూ సమంత రాసుకొచ్చింది. అయితే.. సమంత ఈ పోస్ట్‌ వినేష్ ఫోగట్ గురించి పెట్టింది. ఒలింపిక్స్‌లో వినేష్ ఫోగట్ పై అనర్హత వేటు పడిన సంగతి తెలిసిందే. అయితే.. సామ్ ఉద్దేశం వేరే అంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. వినేష్‌ ఫోగట్‌తో పాటు పరోక్షంగా తన జీవితాన్ని ప్రస్తావిస్తూ పోస్ట్ చేసిందని.. చైతన్య, శోభిత ఎంగేజ్మెంట్ నేపథ్యంలోనే సమంత ఈ పోస్ట్ పెట్టినట్టుగా అభిప్రాయపడుతున్నారు. ఏదేమైనా.. చై, శోభిత ఎంగేజ్మెంట్ చేసుకొని షాక్ ఇచ్చారనే చెప్పాలి.