NTV Telugu Site icon

Top Headlines @ 5 PM: టాప్‌ న్యూస్‌

Top Headlines @ 5 Pm New

Top Headlines @ 5 Pm New

దువ్వాడ ఇష్యూలో మరో ట్విస్ట్‌.. వివాదాస్పద ఇంటిలోకి దివ్వెల మాధురి.. ఉద్రిక్తత..
వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ నేత, ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ కుటుంబ వ్యవహారంలో మరో ట్విస్ట్‌ నెలకొంది. దువ్వాడ వివాదాస్పద ఇంటిలోకి వెళ్లేందుకు గత కొంత కాలంగా ఆయన భార్య దువ్వాడ వాణి, కుమార్తెలు యత్నిస్తున్నారు.. అంతేకాదు.. అక్కడే మకాం పెట్టారు.. గత నెల రోజుల నుంచి ఇంటి బయటే ఆందోళన నిర్వహిస్తూ వస్తున్నారు.. అయితే, ఆ ఇంటిలోకి ఈ రోజు దివ్వెల మాధురి ఎంట్రీ ఇచ్చింది.. దీంతో.. ఒక్కసారిగా ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది.. దివ్వెల మాధురి.. దువ్వాడ శ్రీనివాస్‌ ఇంటికి చేరుకోవడంతో.. ఇంటి ఆవరణలో నెలరోజులుగా నిరసన తెలుపుతున్న దువ్వాడ భార్య , బిడ్డల ఆగ్రహం వ్యక్తం చేశారు.. ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ ఇంటిలోకి వెళ్లేందుకు మరోసారి ప్రయత్నించారు.. దీంతో ఎమ్మెల్సీ క్యాంప్ కార్యాలయంగా ప్రకటించుకున్న ఇంటి వద్ద ఉద్రిక్తత నెలకొంది. ఇంట్లోకి ప్రవేశించేందుకు వాణికి కోర్టు అనుమతి ఇవ్వగా. వివాధానికి కేంధ్ర బిందువైన ఇంటిని ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ ప్రియురాలు మాదురి పేరుతో రిజిష్ర్టేషన్ చేసేసారు. గత నెలరోజులుగా అదే ఇంటి బయట అందోళన చేస్తున్న వాణి , దువ్వాడ కుమార్తలు బందువుల సహాయంతో ఇంటిలొకి వెల్లె ప్రయత్నం చెస్తున్నారు.

ప్రకాశం బ్యారేజీని ఢీకొట్టిన పడవల వెనుక కుట్ర కోణం..!
ప్రకాశం బ్యారేజీని పడవలు ఢీకొట్టిన ఘటన వెనుక కుట్ర కోణం ఉందనే అనుమానాలు వ్యక్తం చేశారు మంత్రి నిమ్మల రామానాయుడు.. ఈ రోజు విజయవాడలోని ప్రకాశం బ్యారేజీ గేట్లను పరిశీలించిన మంత్రి నిమ్మల.. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఇప్పటికే చేరుకున్న కౌంటర్ వెయిట్ల అమరిక గురించి అధికారును అడిగి తెలుసుకున్నారు.. ఎటువంటి ఇబ్బంది లేకుండా సజావుగా కౌంటర్ వెయిట్ ల అమరిక పూర్తి చేయాలని అధికారులకు సూచించారు. ఇక, 67, 69 కానాల కౌంటర్ వెయిట్‌లు దెబ్బ తిన్నాయి.. 70 కానా కౌంటర్ వెయిట్ చిన్న పాటి డ్యామేజ్‌ అయ్యిందని వెల్లడించారు.. 67, 69 కానాల కౌంటర్ వెయిట్ ల అమరిక రెండు రోజుల్లో పూర్తవుతుందన్నారు.. మరోవైపు.. కన్నయ్య నాయుడును ఇరిగేషన్ సలహాదారుగా నియమించాం.. కన్నయ్య నాయుడు పర్యవేక్షణలో కౌంటర్ వెయిట్ల అమరిక జరుగుతోందన్నారు.. అయితే, ప్రకాశం బ్యారేజీని గుద్దుకున్న పడవల వెనుక కుట్ర కోణం ఉందనే అనుమానం ఉందన్నారు.. భవిష్యత్తులో పడవలు వచ్చి గుడ్డుకోకుండా చర్యలు తీసుకుంటామని ఈ సందర్భంగా వెల్లడించారు మంత్రి నిమ్మల రామానాయుడు.. కాగా, విజయవాడ నగరాన్ని ముంచెత్తిన బుడమేరు గండ్లను పూడ్చే పనిలో నిమగ్నమైన మంత్రి నిమ్మల.. పూర్తిస్థాయిలో ఆ గండ్లను పూడ్చిన తర్వాతే అక్కడి నుంచి కదలిన విషయం విదితమే..

ప్రకాశం బ్యారేజీ గేట్లు డ్యామేజ్‌.. బోట్లు ఢీకొట్టిన ఘటనపై కేసు నమోదు
ప్రకాశం బ్యారేజ్ గేట్లను బోట్లు ఢీకొట్టిన ఘటనపై కేసు నమోదు చేశారు పోలీసులు.. బెజవాడ వన్‌ టౌన్‌ పోలీసులు ఈ ఘటనపై ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేశారు.. అయితే, ఈ ఘటనపై విచారణ జరపాలని ఇరిగేషన్ ఈఈ కృష్ణారావు శుక్రవారం ఫిర్యాదు చేశారు.. ఇక, ఈ ఫిర్యాదును స్వీకరించిన పోలీసులు.. 336 ర్యాష్ అండ్ నెగ్లిజన్స్ యాక్ట్, పబ్లిక్ ప్రాపర్టీ డ్యామేజ్ యాక్ట్ సేక్షన్లతో కేసు నమోదు చేశారు. గేట్లను ఢీకొన్న బోట్ల వివరాలను.. యజమానుల వివరాలు, కారణాలు విచారణ చేయాలని ఫిర్యాదు చేసింది ప్రభుత్వం.. 5 బోట్లు ఢీ కొనడంతో బ్యారేజ్ 69వ ఖానా దగ్గర డ్యామేజ్ అవడంతో కౌంటర్ వెయిట్ ఏర్పాటు చేస్తోంది ప్రభుత్వం..

ప్రభుత్వానికి, పార్టీకి వారధిగా పని చేస్తా..
ప్రభుత్వానికి, పార్టీకి వారధిగా పని చేస్తానని పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ఎన్టీవీతో ప్రత్యేకగా చెప్పారు. పీసీసీలో 60 శాతం పదవులు బీసీ, ఎస్సీ, ఎస్టీలకే వస్తాయని అన్నారు. పీసీసీ బీసీకి ఇస్తే.. పూర్తి వాటా దక్కింది అనుకోమని చెప్పారు. మరోవైపు.. కష్టపడి పనిచేసే వారికి పదవులు వస్తాయని చెప్పడానికి ఇదొక ఉదాహరణ అని మహేష్ కుమార్ గౌడ్ తెలిపారు. తాను 1983 నుండి వివిధ పదవుల్లో పని చేశారని పేర్కొ్నారు. గత 10 సంవత్సరాల నుండి కాంగ్రెస్ పార్టీలో పని చేస్తు్న్నానని చెప్పారు. పీసీసీ పదవి కోసం చాలా మంది పోటీ పడ్డారని, కానీ.. తాను పార్టీలో కష్టపడి పని చేసిన వ్యక్తిగా ఈ పదవి దక్కిందన్నారు. పార్టీలో తనకున్న గుర్తింపు, పెద్దల వల్లే పీసీసీ పదవి వచ్చిందని తెలిపారు. కార్యకర్తల శ్రమ వల్ల ప్రభుత్వం, పార్టీ నిలబడిందని మహేష్ కుమార్ గౌడ్ చెప్పారు. తన ప్రధమ కర్తవ్యం.. ప్రభుత్వానికి, పార్టీకి వారధిగా పని చేస్తానని అన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ బలంగా ఉందని.. ఇంకా బలోపేతం చేయాల్సిన అవసరముందన్నారు. బూత్ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు పార్టీని బలోపేతం చేసి.. రాబోయే ఎన్నికల్లో అధికారంలోకి వచ్చే విధంగా పని చేస్తామని చెప్పారు. మరోవైపు.. బీసీలకు ఏ విధంగా న్యాయం చేయాలో వీలైనంత వరకూ చేస్తామని చెప్పారు. కాంగ్రెస్ పార్టీ కులం, మతాలకు అతీతంగా పని చేసే పార్టీ. దేశంలో అన్ని సామాజిక వర్గాలను అక్కున చేర్చుకున్న పార్టీ కాంగ్రెస్ అని అన్నారు. బీసీ కులగణన చేస్తాం.. బీసీల వాటా బీసీలకు దక్కాల్సిందేనని తెలిపారు.

ఢిల్లీలో కారు బీభత్సం.. 10 మీటర్లు ఈడ్చుకెళ్లడంతో యువకుడి మృతి
దేశ రాజధాని ఢిల్లీలో ఓ కారు బీభత్సం సృష్టించింది. ఢిల్లీలోని కన్నాట్ ప్లేస్‌లో కారు ఓ వ్యక్తిని ఢీకొట్టి 10 మీటర్లు లాక్కెడంతో చనిపోయాడు. బుధవారం ఈ ఘటన జరిగింది. ప్రమాదం తర్వాత పారిపోయిన కారు డ్రైవర్‌ను మరుసటి రోజు అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు. మధ్యప్రదేశ్‌కు చెందిన దూబే బుధవారం కన్నాట్ ప్లేస్‌లో ఒకరిని కలవడానికి దక్షిణ ఢిల్లీలోని మహిపాల్‌పూర్‌లోని స్నేహితుడి నుంచి కారును తీసుకున్నాడని అధికారి తెలిపారు. మధ్యాహ్నం 3.25 గంటలకు తిరిగి వస్తుండగా కన్నాట్ ప్లేస్ ఔటర్ సర్కిల్ దగ్గర బరాఖంబా రేడియల్ రోడ్డు సమీపంలో రోడ్డు దాటుతున్న లేఖరాజ్‌ (45)ను కారు ఢీకొట్టింది. లేఖరాజ్ కారు చక్రాల కింద ఇరుక్కుపోయాడు. అయితే దూబే కారు ఆపకుండా నడుపుతూనే ఉన్నాడని అధికారి తెలిపారు. సుమారు 10 మీటర్లు ఈడ్చుకెళ్లిన తర్వాత లేఖరాజ్‌ను రోడ్డుపై వదిలి దూబే అక్కడి నుంచి పారిపోయాడు. అతడిని వెంటనే ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారని అధికారి తెలిపారు.

పాకిస్తాన్ పంట పండింది.. భారీగా పెట్రోలియం నిక్షేపాలు గుర్తింపు..
ఆర్థిక సంక్షోభంతో బాధపడుతున్న దాయాది దేశం పాకిస్తాన్ భారీ జాక్‌పాట్ కొట్టింది. పాక్ పంట పండింది. పాకిస్తాన్ ప్రాదేశిక జలాల్లో భారీగా పెట్రోలియం, సహజవాయువు నిక్షేపాలను గుర్తించారు. వీటి ద్వారా పాక్ తన తలరాతను మార్చుకునే అవకాశం ఏర్పడింది. చమురు, గ్యాస్ నిల్వలను కనుగొనేందుకు స్నేహపూర్వక దేశం సహకారంతో మూడేళ్లు సర్వే చేశామని డాన్ న్యూస్ టీవీకి శుక్రవారం సీనియర్ భద్రతా అధికారి చెప్పారు. నివేదికల ప్రకారం.. ప్రపంచంలోనే నాలుగో అతిపెద్ద చమురు, సహజవాయువు నిక్షేపాలు ఉన్నట్లు తెలుస్తోంది. పెట్రోలియం, సమజవాయు నిక్షేపాలను గుర్తించేందుకు జియోగ్రాఫిక్ సర్వేకి పాకిస్తాన్ అనుమతించింది, పాక్ జలాల్లో విస్తారంగా ఉన్న నిల్వల గురించి సంబంధిత అధికారులు పాక్ ప్రభుత్వానికి తెలిపారు. ‘‘బ్లూ వాటర్ ఎకానమీ’’గా పిలిచే ఈ నిక్షేపాల ద్వారా ప్రయోజనం పొందేందుకు అణ్వేషణ, బిడ్డింగ్ ప్రతిపాదన కోసం సమీక్ష నిర్వహిస్తున్నామని, వీటిని వెలికితీయడానికి చాలా ఏళ్లు పట్టొచ్చని, బావులు తవ్వడం, చమురు, సహజవాయువుని వెలికి తీసే ప్రక్రియ దీర్ఘకాలి ప్రయత్నం కావచ్చని, దీనికి మరిన్ని పెట్టుబడులు, మౌలిక సదుపాయాల అభివృద్ధి అవసరమని సదరు అధికారి వెల్లడించారు.

“భారత్‌కి అనుకూలం”.. అమెరికా హిందూ సంస్థ మద్దతు డొనాల్డ్ ట్రంప్‌కే..
‘‘హిందూస్ ఫర్ అమెరికా ఫస్ట్’’ అనే హిందూ సంస్థ వచ్చే అధ్యక్ష ఎన్నికల్లో డొనాల్డ్ ట్రంప్‌కి మద్దతు ప్రకటించింది. ఎన్నికల్లో కీలక రాష్ట్రాలైన పెన్సిల్వేనియా, జార్జియా, నార్త్ కొరోలినాలో డెమొక్రాటిక్ అభ్యర్థి కమలా హారిస్‌కి వ్యతిరేకంగా ప్రచారాన్ని ప్రారంభించనున్నట్లు ప్రకటించింది. గురువారం సంస్థ చైర్మన్, వ్యవస్థాపకుడు ఉత్సవ్ సందుజా ఈ నిర్ణయాన్ని ప్రకటించారు. కమలా హారిస్ ‘‘భారత్-అమెరికా సంబంధాలను చాలా అస్థిరపరుస్తారు’’అని పేర్కొన్నారు. ‘‘కమలా హారిస్ అమెరికా అధ్యక్షురాలైతే, ఆమె తన టీంలో కొంతమంది ఉదారవాద తోడేళ్లను ఉంచవచ్చు. వీరు ఆసియన్-అమెరికన్ ఓటర్లపై ప్రభావం చూపించే విధంగా సుప్రీంకోర్టుని తప్పుదారి పట్టించొచ్చు’’ అని అతను అన్నాడు. బైడెన్-హారిస్ పాలన సరిహద్దును సురక్షితంగా ఉంచలేదని చెప్పారు. ప్రెసిడెంట్ జో బైడెన్ తర్వాత రెండో స్థానంలో ఉన్న కమలా హారిస్ యూఎస్‌లోకి అక్రమ వలసల్ని అడ్డుకోలేదని ఆయన చెప్పారు.

దులీప్ ట్రోఫీలో ఇండియా ‘C’ ఘన విజయం..
దులీప్ ట్రోఫీలో ఇండియా ‘D’ పై ఇండియా ‘C’ ఘన విజయం సాధించింది. నాలుగు వికెట్ల తేడాతో ఇండియా ‘డి’ జట్టుపై రుతురాజ్ గైక్వాడ్ టీం గెలుపొందింది. భారత్ సి నిర్దేశించిన 233 పరుగుల లక్ష్యాన్ని 61 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి సాధించింది. కాగా.. అభిషేక్ పోరెల్ 35 పరుగులతో, మానవ్ సుతార్ 19 పరుగులతో నాటౌట్‌గా నిలిచారు. రెండో ఇన్నింగ్స్లో ఇండియా ‘సి’ జట్టులో ఆర్యన్ జుయల్ అత్యధికంగా (47) పరుగులు చేశాడు. ఆ తర్వాత.. కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ (46), రజత్ పటిదార్ (44), సాయి సుదర్శన్ (22) పరుగులు చేశారు. ఇండియా ‘డి’ బౌలింగ్ లో సారంశ్ జైన్ అత్యధికంగా 4 వికెట్లు పడగొట్టాడు. ఆ తర్వాత.. అర్ష్దీప్ సింగ్, అక్షర్ పటేల్ తలో వికెట్ తీశారు. అంతకుముందు బ్యాటింగ్ చేసిన ఇండియా ‘డి’ జట్టు.. 58.1 ఓవర్లలో 236 పరుగులకు ఆలౌటైంది. ఇండియా ‘డి’ బ్యాటింగ్లో శ్రేయాస్ అయ్యర్ (54), దేవ్దత్ పడిక్కల్ (56), రికీ భుయ్ (44), అక్షర్ పటేల్ (28) పరుగులు చేశారు. ఇండియా ‘సి’ బౌలింగ్ లో మానవ్ సుతార్ అత్యధికంగా 7 వికెట్లతో చెలరేగాడు. ఆ తర్వాత వైశాఖ్ విజయ్ కుమార్ 2, అన్షుల్ కాంబోజ్ ఒక వికెట్ సంపాదించాడు. మొదటి ఇన్నింగ్స్లో ఇండియా ‘డి’ జట్టు 48.3 ఓవర్లలో 164 పరుగులు చేసింది. ఇండియా ‘సి’ జట్టు 62.2 ఓవర్లలో 168 పరుగులు చేసింది. కాగా.. అనంతపురంలోని ఏసీజీ మైదానంలో దులీప్ ట్రోఫీ తొలి మ్యాచ్ మూడు రోజుల పాటు జరిగింది.

తెలుగు ఇండియన్ ఐడల్ 3 కంటెస్టెంట్స్ కు పవన్ కల్యాణ్ ప్రశంసలు
ఆహా తెలుగు ఇండియన్ ఐడల్ 3 ఎంటర్ టైనింగ్ జర్నీ గ్రేట్ జర్నీకి చేరుకుంది, ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఫైనల్ కేవలం రెండు వారాలు మిగిలి ఉన్నాయి. 15,000 మంది ఔత్సాహిక గాయకులతో ప్రారంభమైన ఈ పాటల పోటీ ఇప్పుడు మొదటి ఆరు ఫైనలిస్ట్‌లకు వచ్చింది. మే 4, 2024న న్యూజెర్సీ, హైదరాబాద్‌లో ప్రారంభమైన ప్రారంభ ఆడిషన్‌లలో 5,000 మంది పాల్గొని విశేషమైన ప్రతిభను ప్రదర్శించగా వారి నుండి, భరత్ రాజ్, కీర్తన, కేశవ్ రామ్, హరి ప్రియ, శ్రీ కీర్తి, నసీరుద్దీన్, స్కంద, దువ్వూరి శ్రీధృతి, రజనీ శ్రీ, సాయి వల్లభ, ఖుషాల్ శర్మ, అనిరుధ్ సుస్వరం టాప్ 12 ఫైనలిస్టులు గా ఎంపికయ్యారు. గత 24 ఎపిసోడ్‌లలో ఎలిమినేషన్‌లు, పబ్లిక్ ఓటింగ్ తర్వాత, పోటీ ఇప్పుడు ఆరుగురు ఫైనలిస్టులకు వచ్చింది. అనిరుధ్ సుస్వరం, స్కంద, కీర్తన, శ్రీ కీర్తి, భరత్, నసీరుద్దీన్ అనే ఫైనలిస్ట్‌లు రాబోయే సెమీ-ఫైనల్ ఎపిసోడ్‌లలో తమ ప్రతిభను ప్రదర్శిస్తారు. సెప్టెంబర్ 6 7, 2024న ప్రత్యేకంగా ఆహాలో ప్రసారం చేయబడుతుంది. ఇక సెమీ-ఫైనల్ ఎపిసోడ్ రీసెంట్ ప్రోమోలో, ఫైనలిస్టులు వినాయక చవితి వేడుకలో రాగాలాపనలో సాంప్రదాయ దుస్తులలో అబ్బురపరిచారు. ఆహా తెలుగు ఇండియన్ ఐడల్ 3 సంగీత విద్వాంసులతో కూడిన వారి ప్రదర్శనలు న్యాయనిర్ణేతలను, ప్రేక్షకులను అలరించాయి. ఇక కంటెస్టెంట్స్ నసీరుద్దీన్, భరత్ లు పవన్ కళ్యాణ్ సినిమా ఓజీలో ఓ పాట పాడి స్వయంగా ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రశంసలు అందుకున్నారని న్యాయమూర్తి ఎస్.థమన్ చెప్పారు. జూన్ 14, 2024న ప్రారంభమైన పాటల పోటీలో పబ్లిక్ ఓట్ల ఆధారంగా ఎలిమినేషన్స్ జరిగాయి, వైల్డ్ కార్డ్ ఎంట్రీలు ఉత్సాహాన్ని పెంచాయి. ఆదివారం ఉదయం 7 గంటల వరకు ఆహా తెలుగు ఇండియన్ ఐడల్ సీజన్ 3 విజేతగా ఎవరని పట్టాభిషేకం చేస్తారో ఫైనల్ నిర్ణయిస్తుంది.

రికార్డులు జాగ్రత్తమ్మా.. టైగర్ వేట మొదలవుతోంది!
దూకే ధైర్యమా జాగ్రత్త.. అంటూ ఫియర్ సాంగ్‌తోనే ముందస్తు హెచ్చరిక జారీ చేశాడు కొరటాల శివ. కానీ ఇప్పుడు టైగర్ ఫ్యాన్స్ మాత్రం రికార్డులు జాగ్రత్త అని అంటున్నారు. ఇప్పటికే ఓవర్సీస్‌లో దేవర బుకింగ్స్ ఓపెన్ కాగా.. తక్కువ సమయంలో అత్యధిక బుకింగ్స్ నమోదు చేసి రికార్డ్ క్రియేట్ చేసింది. USAలో అత్యంత ఫాస్ట్‌గా 15 వేల టికెట్స్ బుక్ అయిన చిత్రంగా దేవర రికార్డ్స్ క్రియేట్ చేసింది. ఇక్కడితో దేవర రికార్డుల వేట మొదలైనట్టే. బుకింగ్స్ పరంగానే కాదు.. ట్రైలర్‌తో డిజిటల్ రికార్డ్స్ అన్నీ చెల్లా చెదురు కాబోతున్నాయి. ఇప్పటికే రిలీజ్ అయిన పాటలు మిలియన్స్ ఆఫ్ వ్యూస్‌తో టాప్ ట్రెండ్ అవుతున్నాయి. ఇక సెప్టెంబర్ 10న రానున్న ట్రైలర్‌.. ఇప్పటి వరకున్న టాలీవుడ్ డిజిటల్ రికార్డ్స్ అన్నీ బ్రేక్ చేసే ఛాన్స్ ఉంది. అయితే.. టైగర్ అసలు సిసలైన వేట మాత్రం దేవరతోనే స్టార్ట్ కానుందని చెప్పాలి. ఇప్పటి వరకు ఎన్టీఆర్‌కు వంద కోట్ల ఓపెనింగ్ సినిమా లేదు. ఆర్ఆర్ఆర్ డే వన్ 223 కోట్లు రాబట్టింది.. కానీ, ఆ క్రెడిట్ ఎన్టీఆర్ ఒక్కడికే ఇవ్వలేం. ఆర్ఆర్ఆర్ మల్టీస్టారర్ మూవీ కాబట్టి.. ఏ రికార్డ్ అయినా సరే చరణ్, తారక్‌ ఇద్దరికీ వర్తిస్తుంది. కానీ దేవర నుంచి ఎన్టీఆర్ సోలో రికార్డ్స్ నమోదు కాబోతున్నాయి. ఈ సినిమా పై ఉన్న హైప్ ప్రకారం.. ఫస్ట్ డే ఖచ్చితంగా వంద కోట్లకు పై ఓపెనింగ్స్ అందుకోవడం గ్యారెంటీ. ఇప్పటికే దేవర ఇంత కలెక్ట్ చేస్తుంది, అంత కలెక్ట్ చేస్తుంది అంటూ.. సోషల్ మీడియాలో ప్రిడిక్ట్ చేయడం మొదలు పెట్టారు. ఆ లెక్క ప్రకారం.. దేవర మొదటి రోజు వరల్డ్ వైడ్‌గా 130 నుంచి 150 కోట్ల రేంజ్‌లో గ్రాస్ ఓపెనింగ్స్ రాబట్టే ఛాన్స్ ఉందని అంటున్నారు. అయితే.. అది దేవర ట్రైలర్, ప్రమోషన్స్ పై డిపెండ్ అయి ఉంటుంది. ఎందుకంటే.. తెలుగులో భారీ ఓపెనింగ్స్ వచ్చినా.. హిందీలో గట్టిగా రాబట్టాల్సి ఉంటుంది. అయినా కూడా.. దేవర హైప్‌కు ఇక్కడితో ఎన్టీఆర్ వంద కోట్ల ఓపెనర్‌గా మారబోతున్నాడనే చెప్పాలి. మరి సెప్టెంబర్ 27న రాబోతున్న దేవర ఏం చేస్తుందో చూడాలి.

Show comments