NTV Telugu Site icon

Top Headlines @ 5 PM: టాప్‌ న్యూస్‌

Top Headlines @ 5 Pm New

Top Headlines @ 5 Pm New

స్వర్ణాంధ్ర సాధనకు తోడ్పాటు ఇవ్వండి.. నీతి ఆయోగ్‌ను కోరిన సీఎం..
స్వర్ణాంధ్ర 2047 సాధనకు తోడ్పాటు అందివ్వాలని నీతి ఆయోగ్‌ వైస్‌ ఛైర్మన్‌ సుమన్‌ బేరిని కోరారు ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు.. ఏపీ లో ఏఐకు సంబంధించి అభివృద్ధిపై పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చారు సీఎం… ఏపీ అభివృద్ధికి అనేక చర్యలు తీసుకుంటున్నాం అని.. నీతి ఆయోగ్ సహకారం కూడా అవసరం అన్నారు. అయితే, ముఖ్యమంత్రి చంద్రబాబుతో నీతి ఆయోగ్ బృందం సమావేశం అయ్యింది.. వైఎస్ ఛైర్మన్ సుమన్ బేరీ నేతృత్వంలోని నీతి ఆయోగ్ బృందానికి రాష్ట్ర ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ స్వాగతం పలకగా.. ఏపీ విజన్ 2047 సహా ఏపీ ఆర్థిక పరిస్థితి, అమరావతి నిర్మాణం నీతి ఆయోగ్ బృందానికి, సీఎం చంద్రబాబు మధ్య చర్చలు సాగాయి.. ఆంధ్రప్రదేశ్ కు ఆర్థికంగా అండగా ఉండేలా నిర్ణయాలు ఈ సందర్భంగా సీఎం కోరారు.. ఏపీకి ఉన్న అప్పులు వాటితో పాటు చేపడుతున్న సంక్షేమ కార్యక్రమాలపై ఈ సమావేశంలో చర్చించారు.. ఇక, కారు వరకు వెళ్లి నీతి ఆయోగ్ వైఎస్ ఛైర్మన్ కు వీడ్కోలు చెప్పారు సీఎం చంద్రబాబు నాయుడు..

విధ్వంసకారుడే.. విధ్వంసం గురించి చెప్పడం ఈ శ‌తాబ్దపు విడ్డూరం..!
విధ్వంసకారుడే విధ్వంసం గురించి, విధ్వంసానికి నిర్వచ‌నం గురించి చెప్పడం ఈ శ‌తాబ్దపు విడ్డూరం అంటూ వైసీపీ అధినేత వైఎస్‌ జగన్ ను ఉద్దేశించి వ్యాఖ్యానించారు మంత్రి నిమ్మల రామానాయుడు. దుష్టపాల‌న‌, తుగ్లక్ పాల‌న‌కు బ‌దులుగా.. జ‌గ‌న్ పాల‌న అని ప్రజ‌లు ఉద‌హరించుకున్నారు. జ‌గ‌న్ ఐదేళ్ల రివ‌ర్స్ పాల‌న చూసి దేశంలోని రాష్ట్రాలే కాదు, ప్రపంచ‌దేశాలే నివ్వెర పోయాయన్నారు. జ‌గ‌న్ నిర్లక్ష్యంతో పోల‌వ‌రం ప్రాజెక్టు ప్రశ్నార్దక‌మైందని.., డయాఫ్రం వాల్ కొట్టుకుపోయిందని.. ఫ‌లితంగా ఇవాళ వెయ్యి కోట్లు అద‌న‌పు వ్యయం అవుతుందన్నారు.. ఆంధ్రుల జీవ‌నాడి పోల‌వ‌రం ఎత్తును 41.15 మీట‌ర్లు అని చెప్పి అణువ‌ణువునా అన్యాయం చేసింది వైఎస్‌ జగన్ కాదా? అని నిలదీశారు రామానాయుడు. చంద్రబాబు ప్రభుత్వ పాల‌న‌పై ఇష్టమొచ్చిన‌ట్లు మాట్లాడిన జ‌గ‌న్ పై ఇరిగేష‌న్ మంత్రి క్యాంపు కార్యాల‌యంలో మాట్లాడిన మంత్రి నిమ్మల రామానాయుడు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.. ఎక్కడి దొంగ‌లు అక్కడే గ‌ప్ చుప్ అన్నట్లుగా జ‌గ‌న్ అరాచ‌క పాల‌న‌లో ఎక్కడి ప‌నులు అక్కడే బంద్ అయ్యాయని విమర్శించారు.. ఎవ‌రి డబ్బులు, ఎవ‌రికి బ‌ట‌న్ నొక్కావు, అప్పులు తెచ్చావు, అడ్డదారులు తొక్కావు. బ‌ట‌న్ నొక్కడం బ్రహ్మాండ‌మైతే, ప్రజ‌లు నీకు ఎందుకు బ్రహ్మర‌ధం ప‌ట్టలేదు..? అని ప్రశ్నించారు.. నీ ఘోర ప‌రాజ‌యానికి, రాజ‌కీయ ప‌త‌నానికి కార‌ణాలు విశ్లేషించుకో అని సలహా ఇచ్చారు. నాలుగు ద‌శాబ్దాల రాజ‌కీయ అనుభ‌వం, పాల‌నా ప‌రిప‌క్వత ఉన్న చంద్రబాబుపై విమ‌ర్శలు చేస్తే సహించబోమని హెచ్చరించారు.. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌, ప్రధాని నరేంద్ర మోడీ మేలు క‌ల‌యిక‌కు విజ‌యం ఆంధ్రుల నిర్ణయం. వీరిపై విమ‌ర్శలు చేస్తే ఆంధ్రుల‌పై చేసిన‌ట్లే అని వ్యాఖ్యానించారు మంత్రి నిమ్మల రామానాయుడు..

24 నుంచి ఏపీ అసెంబ్లీ బడ్జెట్‌ సమావేశాలు..
ఆంధ్రప్రదేశ్‌ బడ్జెట్‌ సెషన్‌కు డేట్‌ ఫిక్స్‌ చేశారు.. ఈ నెల 24వ తేదీ నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి.. మూడు వారాలు పాటు అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలనే ఆలోచనలో కూటమి ప్రభుత్వం ఉన్నట్టుంగా తెలుస్తోంది.. అయితే, మొదటి రోజు బీఏసీ సమావేశం తర్వాత సభ ఎన్ని రోజులు జరపాలి అనే అంశంపై ఓ నిర్ణయానికి రానున్నారు ఏపీ శాసన సభ స్పీకర్‌ నిమ్మకాయల అయ్యన్నపాత్రుడు.. ఈ నెల 28వ తేదీన లేదా వచ్చే నెల 3వ తేదీన ఆంధ్రప్రదేశ్‌ బడ్జెట్‌ 2025-26ను అసెంబ్లీలో ప్రవేశపెట్టే అవకాశం ఉందని అంటున్నారు.. మరోవైపు.. అసెంబ్లీ సమావేశాలకు మంత్రులు పూర్తిస్థాయి సబ్జెక్టుతో హాజరు కావాలంటూ ఇప్పటికే ఆదేశాలు వెళ్లినట్టుగా తెలుస్తోంది..

జగన్‌ నివాసం సమీపంలో వరుస అగ్ని ప్రమాదాలు.. ఘటనా స్థలానికి పోలీసులు
ఏపీ మాజీ ముఖ్యమంత్రి, వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి నివాసం సమీపంలో జరిగిన వరుస అగ్నిప్రమాదాలు తీవ్ర కలకలం సృష్టించాయి.. అయితే, అగ్నిప్రమాద ఘటనా స్థలాన్ని పోలీసులు పరిశీలించారు.. వైఎస్ జగన్ ప్రస్తుతం నివాసంతో పాటు వైసీపీ కేంద్ర కార్యాలయాన్ని కూడా అక్కడే ఏర్పాటు చేసుకున్నారు.. రెండు రోజుల క్రితం మధ్యాహ్నం మూడు గంటల సమయంలో ఓసారి.. రాత్రి ఎనిమిది గంటల సమయంలో మరోసారి జగన్‌ నివాసం ఎదురుగా ఉన్న గ్రీనరీలో మంటలు చెలరేగాయి.. గత ప్రభుత్వ హయాంలో సీఎం అధికారిక నివాసం కావటంతో ఆ రహదారిలో బారికేడ్లతో భద్రతతో పాటు గ్రీనర్ కోసం చెట్లను ఏర్పాటు చేశారు అప్పటి అధికారులు.. కానీ, తాజా పరిణామాల నేపథ్యంలో ఆ రహదారిలో బారికేడ్లను తొలగించడంతో పాటు చెట్లకు కూడా నీరు పోయకుండా వదిలేయడంతో అవి పూర్తిగా ఎండి పోయాయి.. ఈ నేపథ్యంలో ఆ ప్రాంతంలో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది.. జగన్ నివాసం సమీపంలో జరిగిన ఘటన కలకలం రేపటంతో పోలీసులు అప్రమత్తమయ్యారు.. ఘటన స్థలంలో ఆధారాలను సేకరించారు.. ఘటన జరిగిన సమయంలో ఉన్న ప్రత్యక్ష సాక్షుల నుంచి వివరాలను సేకరించారు.. అగ్నిప్రమాదానికి ఆకతాయిలు కావాలనే అక్కడ నిప్పు పెట్టడమే కారణమా..? లేక మరేదైనా కారణమా..? అనే కోణంలో విచారణ చేపట్టారు..

అమెరికాతో మాట్లాడే దమ్ము కేంద్రానికి లేదు
ట్రంప్ ప్రెసిడెంట్ అయ్యాక.. మన దేశానికి లాభం అని అనుకున్నారని, 104 మందిని నిన్న దేశానికి పంపించారన్నారు ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ. జనవరి నుండి… అక్రమంగా అమెరికాలో ఉంటున్న వారిని పంపిస్తాం అంటూనే ఉన్నారని, కానీ కేంద్రం అసలు.. దీనిపై మాట్లాడలేదని ఆయన వ్యాఖ్యానించారు. ఆమెరికా నుండి చేతులు..కాళ్ళు కట్టేసి తెచ్చారని, వాళ్ళను కనీసం ఎయిర్ పోర్ట్ లో రిసీవ్ చేసుకోలేదని ఆయన మండిపడ్డారు. మోడీ అంటే విశ్వగురు అని చెప్పుకునే బీజేపీ నేతలు.. 104 మందిని అమెరికా వెనక్కి పంపితే మోడీ ఎందుకు మాట్లాడటం లేదని, కనీసం అమెరికా ఎంబసీతో.. మన ఎంబసీ కనీసం మాట్లాడలేదని ఆయన వ్యాఖ్యానించారు. 2008లో గల్ఫ్ నుండి 44 వేల మందిని మేము తీసుకువచ్చామని, దుబాయ్ లో ఇండియా ప్రభుత్వం 10 వేల ఖర్చుతోనే తీసుకు వచ్చాం.. డబ్బులు కూడా ప్రభుత్వమే చెల్లించిందన్నారు. మోడీ విశ్వగురు కనీసం ఎందుకు పట్టించుకోవడం లేదని, విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి ఫెయిల్ అయ్యారని షబ్బీర్‌ అలీ ఫైర్‌ అయ్యారు. అమెరికాతో మాట్లాడే దమ్మూ కేంద్రానికి లేదని, ఎందుకు భయపడుతున్నారని ఆయన అన్నారు.

ప్రపంచ బొగ్గు ఉత్పత్తిలో భారత్ రెండో స్థానంలో ఉంది
బొగ్గు శాఖ పురోగతిపై కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ఢిల్లీలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కిషన్‌ రెడ్డి మాట్లాడుతూ.. 2047 వికసిత భారత లక్ష్యాల్లో బొగ్గు రంగం చాలా కీలకమని,
ప్రపంచ బొగ్గు ఉత్పత్తిలో భారత్ రెండో స్థానంలో ఉందన్నారు. బొగ్గు నిల్వల్లో ప్రపంచంలో 5వ స్థానంలో ఉందని ఆయన పేర్కొన్నారు. ప్రపంచంలో రెండో అతిపెద్ద బొగ్గు వినియోగదారుగా భారతదేశం ఉందని, ప్రపంచంలోనే రెండో అతిపెద్ద బొగ్గు గని గెవరా మన దేశంలో ఉందని కిషన్‌ రెడ్డి తెలిపారు. కోలిండియా బొగ్గు మంత్రిత్వ శాఖ కీలకమైన విభాగమని కిషన్‌ రెడ్డి పేర్కొన్నారు. ఈ ఏడాది కోలిండియా స్వర్ణజయంత్యుత్సవాలు జరుపుకుంటోందన్నారు కిషన్‌ రెడ్డి. కోలిండియా ప్రపంచంలోనే అతిపెద్ద బొగ్గు ఉత్పత్తి సంస్థ అని, పవర్, స్టీల్, సిమెంట్, అల్యూమినియం, ఫెర్టిలైజర్, హెవీ ఇండస్ట్రీస్ రంగాల్లో బొగ్గు కీలకమైన అంశమన్నారు. భారతదేశంలో బొగ్గు ద్వారానే 74% విద్యుదుత్పత్తి జరుగుతోందని, రానున్న దశాబ్దాల్లోనూ బొగ్గు ఒక కీలకమైన ఇంధనంగా ప్రత్యేకతను సంతరించుకుందని కిషన్‌ రెడ్డి వెల్లడించారు.

ఫ్రాన్స్ పర్యటనకు మోడీ.. 11న ఏఐ సమ్మిట్‌లో పాల్గొననున్న ప్రధాని
ప్రధాని మోడీ మరో విదేశీ పర్యటనకు వెళ్తున్నారు. ఈ నెల 11, 12 తేదీల్లో ఫ్రాన్స్‌లో ప్రధాని మోడీ పర్యటించనున్నారు. ఫిబ్రవరి 11న పారిస్‌లో జరిగే ఏఐ సమ్మిట్‌కు మోడీ అధ్యక్షత వహించనున్నారు. ఈ కార్యక్రమంలో అమెరికా ఉపాధ్యక్షుడు, చైనా ఉప ప్రధానమంత్రి పాల్గొననున్నారు. ఫ్రెంచ్ కంపెనీల అగ్రశేణి సీఈవోలతో కూడా ప్రధాని మోడీ చర్చలు జరపనున్నారు. ఫిబ్రవరి 12న మార్సెయిల్‌లో అధ్యక్షుడు మాక్రాన్‌తో ప్రధాని మోడీ ద్వైపాక్షిక చర్చలు జరపనున్నారు. ఏఐ సమ్మిట్‌కు అధ్యక్షత వహించాలని భారత్‌ను ఫ్రాన్స్ ఆహ్వానించింది. వారం రోజుల పాటు  ఈ సమావేశాలు జరగనున్నాయి. ఈ కార్యక్రమంలో పరిశ్రమలు, స్టార్టప్‌లు, ప్రధాన వాటాదారులతో పాటు అమెరికా ఉపాధ్యక్షుడు మరియు చైనా ఉప ప్రధాన మంత్రి ప్రాతినిధ్యం వహించనున్నారు. ఫ్రాన్స్‌లో మోడీ పర్యటించడం మోడీకి ఇది ఆరో పర్యటన కావడం విశేషం. ఇదిలా ఉంటే పర్యటనలో భాగంగా ఫిబ్రవరి 12న ఫ్రెంచ్ ప్రభుత్వం నిర్వహించే వీవీఐసీ విందుకు కూడా ప్రధాని మోడీ హాజరవుతారు.

బైక్ లవర్స్‌కు గుడ్ న్యూస్.. ఆ బైకులపై భారీ డిస్కౌంట్
జపనీస్ సూపర్ బైక్ తయారీదారు కవాసకి.. 2025 ఫిబ్రవరిలో భారతదేశంలోని కస్టమర్లకు బంపర్ డిస్కౌంట్లను అందించనుంది. కవాసకి Z900, నింజా 650, నింజా 300, నింజా 500 మోడల్‌లపై ప్రత్యేక డిస్కౌంట్లు అందిస్తున్నట్లు ప్రకటించింది. ఈ ఆఫర్ ఫిబ్రవరి 28 వరకు మాత్రమే అందుబాటులో ఉంటుంది. కవాసకి ఈ మోటార్ సైకిళ్లపై రూ. 15,000 నుండి రూ. 45,000 వరకు డిస్కౌంట్‌ను అందిస్తోంది.

‘కింగ్ కోహ్లీ’ తర్వాత మ్యాచ్‌పై అప్‌డేట్.. ఇంతకీ ఆడుతాడా.. లేదా..?
గురువారం ఇంగ్లాండ్‌తో జరిగిన తొలి వన్డేలో టీమిండియా ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే.. అయితే ఈ మ్యాచ్ లో విరాట్ కోహ్లీ ఆడలేదు. మోకాలి సమస్య వల్ల మొదటి మ్యాచ్ కు దూరమయ్యాడు. అయితే రెండో వన్డేలోనైనా ఆడుతాడా లేదా అన్నది అభిమానుల్లో పెద్ద ప్రశ్న మెదులుతుంది. మొదటి వన్డేలో కోహ్లీ స్థానంలో శ్రేయాస్ అయ్యర్‌కు అవకాశం లభించింది. అతను 59 పరుగులతో అద్భుతంగా రాణించి జట్టుకు విజయాన్ని అందించాడు. కాగా.. ఫిబ్రవరి 9న కటక్‌లో భారత్-ఇంగ్లాండ్ మధ్య రెండో వన్డే జరగనుంది. ఈ మ్యాచ్‌కు ముందు విరాట్ కోహ్లీ ఫిట్‌గా ఉంటాడా..? రెండో వన్డేలో కోహ్లీ ఆడుతాడా లేదా అన్నది భారత వైస్ కెప్టెన్ శుభ్‌మాన్ గిల్ అప్ డేట్ ఇచ్చాడు. అభిమానులకు గిల్ గుడ్ న్యూస్ చెప్పాడు. విరాట్ కోహ్లీ గాయం గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని.. కటక్‌లో జరిగే రెండో వన్డేకు కోహ్లీ తిరిగి జట్టులోకి వస్తాడని ఆయన తెలిపాడు. “బుధ‌వారం ప్రాక్టీస్ సంద‌ర్భంగా విరాట్ కోహ్లి కుడి కాలి మోకాలికి బంతి తాకింది. అయిన‌ప్పటికి అత‌డు త‌న ప్రాక్టీస్‌ను కొన‌సాగించాడు. ప్రాక్టీస్ స‌మ‌యంలో ఎటువంటి ఇబ్బంది త‌లెత్తలేదు. కానీ శిక్షణ తర్వాత హూట‌ల్‌కు వెళ్లాక అత‌డి మోకాలిలో వాపు క‌న్పించింది. దీంతో ముందు జాగ్రత్తగా అత‌డికి విశ్రాంతిని ఇచ్చాము. విరాట్ ప్రస్తుతం బాగానే ఉన్నాడు. అత‌డు కటక్ వన్డేలో ఆడే అవకాశం ఉంది” అని శుభ్‌మాన్ గిల్ స్టార్ స్పోర్ట్స్‌తో చెప్పాడు.

సీఎం చంద్రబాబుతో మ్యూజిక్‌ డైరెక్టర్‌ తమన్‌ భేటీ
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడును కలిశారు మ్యూజిక్‌ డైరెక్టర్‌ ఎస్. తమన్‌.. ఈ నెల 15వ తేదీన విజయవాడలో మ్యూజికల్ నైట్ నిర్వహించబోతున్నారు తమన్.. తలసేమియా బాధితులకు సహాయార్థం ఈ మ్యూజికల్ నైట్ నిర్వహించేందుకు సిద్ధమయ్యారు.. ఈ మ్యూజిల్‌ నైట్‌ ద్వారా వచ్చిన సొమ్మును తలసేమియా బాధితులకు అందజేయనున్నారు.. ఈ నేపథ్యంలో సీఎం చంద్రబాబును కలిశారు.. ఈ భేటీలో సీఎం చంద్రబాబు నాయుడు సతీమణి.. నారా భువేశ్వరి కూడా పాల్గొన్నారు.. ఈ సందర్భంగా తమన్‌ను శాలువా కప్పి సత్కరించి.. కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వర స్వామి ప్రతిమను బహూకరించారు సీఎం చంద్రబాబు..

పాన్ ఇండియా హిట్ కోసం పట్టువదలని విక్రమార్కుడిలా
పాన్ ఇండియన్ హీరోగా మారేందుకు చేసిన ఫస్ట్ ప్రయత్నమే బెడిసి కొట్టింది. స్టార్ దర్శకుడు కథ ఇచ్చినా రిజల్ట్ రివర్సైంది. అయినప్పటికీ పట్టువదలని విక్రమార్కుడిలా మార్కెట్ రేంజ్ పెంచుకునేందుకు రెడీ అయ్యాడు. అప్ కమింగ్ ప్రాజెక్టుల విషయంలోనూ అదే ఫాలో అవుతున్నారు. యష్ తరహాలో తన ఫస్ట్ ఫిల్మ్ హీరో శ్రీ మురళిని పాన్ ఇండియా హీరోను చేసేందుకు గట్టిగానే ప్రయత్నించాడు ప్రశాంత్ నీల్. బఘీరకు కథను అందించాడు. గత ఏడాది అక్టోబర్ చివరిలో రిలీజైన ఈ సినిమా కన్నడిగులు తప్ప.. మరెవ్వరూ తలెత్తి చూడలేదు. దీంతో డిజాస్టర్ టాక్ తెచ్చుకుంది. గ్లోబల్ లెవల్ స్టార్ డమ్ తెచ్చుకుందామకున్న శ్రీమురళి ఆశలపై స్వయానా నీల్ మామే నీళ్లు కుమ్మరించినట్లైంది. బఘీర రిజల్ట్ ఎలా ఉన్నప్పటికీ పట్టువదలని విక్రమార్కుడిలా ఫైట్ చేస్తున్నాడు రోరింగ్ స్టార్ శ్రీమురళి. ఎలాగో రిస్క్ చేశాం కాబట్టి అదే కంటిన్యూ చేయాలనుకుంటున్నాడు. అప్ కమింగ్ ప్రాజెక్ట్ పరాక్ కూడా భారీ స్థాయిలో భారీ బడ్జెట్ ఖర్చు పెట్టిస్తున్నాడట. మార్చిలో సెట్స్ పైకి వెళ్లనున్న ఈ సినిమాకు మ్యూజిక్ డైరెక్టర్ సెట్ అయ్యాడు. న్యూ టాలెంట్, సప్త సాగరాలు దాచే ఎల్లో ఫేం చరణ్ రాజ్ కంపోజర్ గా ఫిక్స్ అయ్యాడు. పరాక్ కాకుండా శ్రీ మురళి చేతిలో మరో క్రేజీయెస్ట్ ప్రాజెక్టు ఉంది. టాలీవుడ్ సక్సెస్ ఫుల్ నిర్మాణ సంస్థ పీపుల్ మీడియా ఫ్యాక్టరీలో మరో మూవీని చేస్తున్నాడు. చూడబోతే ఇది కూడా భారీ బడ్జెట్ చిత్రంగా తెరకెక్కుతోన్నట్లు సమాచారం. మరీ తన మార్కెట్ పెంచుకుని, బాక్సాఫీస్ బెండు తీయాలని ఆశపడుతున్న శ్రీ మురళి  ఎలాంటి సక్సెస్ కొడతాడో చూడాలి.

ప్రధాని మోడీని కలిసిన నాగార్జున కుటుంబం.. ఎందుకంటే ?
టాలీవుడ్ స్టార్ హీరో అక్కినేని నాగార్జున ప్రధానమంత్రి నరేంద్ర మోదీని పార్లమెంట్ హౌస్‌లో కలిశారు. ఈ సందర్భంగా అక్కినేని నాగేశ్వరరావు (ANR) 100వ జయంతిని పురస్కరించుకుని “మహాన్ అభినేత అక్కినేని కా విరాట్ వ్యక్తిత్వ” అనే గ్రంథాన్ని ప్రధాని మోదీకి అందించారు. ఈ పుస్తకాన్ని ప్రముఖ రచయిత, పద్మభూషణ అవార్డు గ్రహీత, మాజీ పార్లమెంట్ సభ్యుడు ప్రొఫెసర్ యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ రచించారు. ఆయన విశ్వ హిందీ పరిషత్ జాతీయ అధ్యక్షుడిగా సేవలు అందిస్తున్నారు. ఈ కార్యక్రమంలో ప్రధానమంత్రి మోదీ అక్కినేని నాగేశ్వరరావు సమగ్ర కృషిని, భారతీయ సినీ రంగానికి చేసిన విశేష సేవలను కొనియాడారు. ప్రత్యేకించి, తెలుగు సినీ పరిశ్రమను చెన్నై నుండి హైదరాబాద్‌కు మళ్లించి.. ప్రస్తుతం అభివృద్ధి చెందే స్థాయికి తీసుకువెళ్లడంలో ఏఎన్ ఆర్ పాత్ర అపూర్వమైనదని కొనియాడారు. ప్రధాని మోదీ మాట్లాడుతూ.. ఏఎన్ఆర్ భారతీయ సంస్కృతి, సంప్రదాయాల‌ను తెరపై అద్భుతంగా ఆవిష్కరించిన మహానటుడు అని పేర్కొన్నారు. ఆయన చేసిన చిత్రాలు తెలుగు సినిమా ప్రత్యేకతను ప్రపంచానికి చాటించాయని ప్రశంసించారు.