NTV Telugu Site icon

Top Headlines @ 5 PM: టాప్‌ న్యూస్‌

Top Headlines @ 5 Pm New

Top Headlines @ 5 Pm New

పోసాని క్వాష్ పిటిషన్లు.. ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు
సినీ నటుడు పోసాని కృష్ణమురళి హైకోర్టును ఆశ్రయించారు.. తనపై వివిధ జిల్లాలు, ప్రాంతాల్లో నమోదైన కేసులను క్వాష్‌ చేశాయంటూ పిటిషన్‌ వేశారు.. అయితే, పోసాని కృష్ణమురళి క్వాష్ పిటిషన్ల మీద విచారణ జరిపిన ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది.. శ్రీకాకుళం, విశాఖపట్నం, అనంతపురం, చిత్తూరు జిల్లా పోలీసులు నమోదు చేసిన కేసుల్లో 35 BNS ప్రొసీజర్ ఫాలో కావాలని స్పష్టమైన ఆదేశాలు ఇచ్చింది ఏపీ హైకోర్టు.. అయితే, ఈ కేసుల్లో పీటీ వారెంట్లు ఇంకా అమలు చేయలేదని హైకోర్టుకు తెలిపింది ప్రభుత్వం.. దీంతో, నాలుగు పిటిషన్లు డిస్పోజ్ చేసింది న్యాయస్థానం.. అయితే, కర్నూలు జిల్లా పోలీసులు నమోదు చేసిన కేసులో అరెస్టు చేసినట్టు కోర్టుకు తెలిపింది ప్రభుత్వం.. ఆ కేసు క్వాష్ చేయాలని పోసాని కృష్ణమురళి దాఖలు చేసిన పిటిషన్‌ను డిస్మిస్ చేస్తున్నట్టు వెల్లడించిన హైకోర్టు.. 35 BNS ప్రొసీజర్ ఫాలో కావాలని ఆదేశాలు ఇచ్చింది. కాగా, పోసాని కృష్ణ మురళిని వరుసగా కేసులు వెంటాడుతూనే ఉన్నాయి.. ఫిర్యాదులు, పీటీ వారెంట్లు, అరెస్ట్‌లు, జైలు జీవితం, పోలీసుల విచారణ, పోలీసు కస్టడీ.. ఇలా ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు.. ఈ నేపథ్యంలో.. కేసులను క్వాష్‌ చేయాలంటూ హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేసిన విషయం విదితమే.

ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలపై టీడీపీ ఫోకస్.. వారికి ఈ సారి డౌటే..?
ఆంధ్రప్రదేశ్‌లో ఇప్పటికే ఉపాధ్యాయ, పట్టాభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు ముగిసాయి.. ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీగా పేరాబత్తుల రాజశేఖరం, కృష్ణా-గుంటూరు పట్టభద్రుల స్థానంలో ఆలపాటి రాజేంద్రప్రసాద్, ఉత్తరాంధ్ర టీచర్ స్థానంలో గాదె శ్రీనివాసులు విజయం సాధించారు.. ఇక, ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలకు షెడ్యూల్‌ వచ్చేసింది.. దీంతో, ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీ ఎన్నికలపై ఫోకస్‌ పెట్టింది తెలుగుదేశం పార్టీ.. ఇప్పటికే జనసేన పార్టీ నుంచి ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ సోదరుడు నాగబాబు పేరును ఖరారు చేశారు.. అయితే, బీజేపీకి ఈ సారి డౌటే అనే చర్చ సాగుతోంది.. మిగిలిన నాలుగు స్థానాల్లో.. టీడీపీ నుంచి ఇద్దరు బీసీ, ఒక ఎస్సీ, ఒక ఎస్టీ అభ్యర్థులకు అవకాశం కల్పిస్తారని తెలుస్తోంది.. అయితే, మొన్నటి ఎన్నికల్లో టీడీపీ పోటీ చేయని స్థానాల్లో ఉన్న బీసీ నేతలపై పార్టీ అధిష్టానం దృష్టిసారించినట్టుగా చెబుతున్నారు.. ఇప్పటికే టీడీపీ అధినేత, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు.. మంత్రి నారా లోకేష్ ను కలిశారు ఆశావహులు.. మరోవైపు, ఇప్పటికే వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీకి గుడ్‌బై చెప్పి కొందరు నేతలు తెలుగుదేశం పార్టీలో చేరారు.. ఇప్పుడు ఎవరిని మండలికి పంపించాలనేదానిపై టీడీపీ అధిష్టానం కసరత్తు చేస్తోంది.. మొత్తంగా ఈ నెల 8వ తేదీన అధికారికంగా టీడీపీ నుంచి అభ్యర్థుల ప్రకటన వచ్చే అవకాశం ఉన్నట్టుగా సమాచారం.

శ్రీవారి భక్తులకు శుభవార్త.. అన్నప్రసాదం మెనూలో అదనంగా చేరిన గారె..
శ్రీవారి దర్శనానికి తిరుమలకు వెళ్లే భక్తులు అన్నప్రసాదాన్ని స్వీకరించి మురిసిపోతారు.. ఇప్పుడు శ్రీవారి భక్తులకు తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) మరో శుభవార్త చెప్పింది.. తిరుమలలో భక్తులకు ఉచితంగా అందించే అన్నప్రసాదంలో మసాలా వడను చేర్చింది. తిరుమలలోని తరిగొండ వెంగమాంబ అన్నప్రసాద భవనంలో ఈ రోజు భక్తులకు వడ ప్రసాదం అందించే కార్యక్రమాన్ని టీటీడీ చైర్మన్ బీఆర్‌ నాయుడు, టీటీడీ ఈవో శ్యామలరావు, అదనపు ఈవో వెంకయ్య చౌదరిలతో కలిసి అధికారికంగా ప్రారంభించారు. కాగా, ఇప్పటికే శ్రీవారి అన్నప్రసాద మెనులో మసాలా వడను చేర్చింది టీటీడీ.. అవి ఇప్పటి వరకు కొంతమందికే అందుతుండగా.. ఈ రోజు నుంచి పూర్తిస్థాయిలో అమల్లోకి తెచ్చారు.. ఈ సందర్భంగా టీటీడీ చైర్మన్‌ బీఆర్ నాయుడు మాట్లాడుతూ.. తాను టీటీడీ చైర్మన్‌గా పదవీ బాధ్యతలు స్వీకరించిన తర్వాత, అన్నప్రసాద మెనూలో భక్తులకు అదనపు వస్తువును వడ్డించే ఆలోచనను ముందుకు తెచ్చాను అన్నారు.. ఈ విషయాన్ని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకెళ్లినప్పుడు, ఆయన ఆ ఆలోచనకు అంగీకరించి ఆమోదించారని గుర్తుచేసుకున్నారు.. ఆలయ నిర్వహణలో ఇప్పటికే అధిక నాణ్యత గల పదార్థాలతో భక్తులకు అన్నప్రసాదాలను అందిస్తున్నట్లు తెలియజేశారు. భక్తులకు వడ్డించే వడల తయారీలో పప్పు, పచ్చిమిర్చి, అల్లం, కరివేపాకు, కొత్తిమీర, పుదీనా మరియు సోంపులను ఉపయోగిస్తారని వెల్లడించారు.. అన్న ప్రసాద కేంద్రంలో ప్రతిరోజూ ఉదయం 10.30 నుండి సాయంత్రం 4 గంటల వరకు సుమారు 35,000 వడలను భక్తులకు వడ్డిస్తారని.. భవిష్యత్తులో ఈ సంఖ్యను మరింత పెంచుతామని పేర్కొన్నారు..

ట్రంప్ అమెరికా అధ్యక్షుడు అయ్యాక భారతీయులకు రక్షణ లేదు..
ట్రంప్ అమెరికా అధ్యక్షుడు అయ్యాక భారతీయులకు రక్షణ లేదని సీపీఐ నేషనల్ సెక్రటరీ నారాయణ అన్నారు. అమెరికాలో తాజా పరిస్థితిపై ఆయన మీడియాతో మాట్లాడారు. “మోడీ వివిధ దేశాల అధినేతలతో సమావేశాలకే పరిమితం అవుతున్నారు.. ప్రపంచంలో అత్యంత శక్తి వంతమైన దేశం గా ఉన్న అమెరికా బెదిరింపులకు దిగడం సరికాదు.. ఇతర దేశాల సంపదను కొల్ల గొట్టేందుకు అమెరికా ప్రయత్నం చేస్తుంది.. ఎలాన్ మాస్క్ తో డిబేట్ సందర్బంగా విధి రౌడీ లాగ ట్రంప్ ప్రవర్తన ఉంది.. ప్రపంచ వ్యాప్తంగా ట్రంప్ కు వస్తున్నా వ్యతిరేతను భారత్ తరుపున మోడీ ఉపయోగించుకోవాలి.. లేదంటే వంద కోట్ల భారతియుల ప్రయోజనాలను అమెరికా కు తాకట్లు పెట్టినట్లు అవుతుంది.. ప్రపంచ పెట్టుబడి దారులంతా ఏకం అయ్యే ప్రమాదం ఉంది.. దీనిమీద చంద్రబాబు నాయుడు సమాధానం చెప్పి.. మోడీతో ట్రంప్ కు చెప్పించే బాధ్యత చంద్రబాబు తీసుకోవాలి..” అని నారాయణ వ్యాఖ్యానించారు.

ఖాజాగూడలో చెరువులను పరిశీలించిన రంగనాథ్.. అధికారులకు కీలక సూచనలు..
నాన‌క్‌రామ్ గూడ‌లోని ఖాజాగూడ పెద్ద చెరువుతో పాటు.. నెక్నాంపూర్‌ లోని ఇబ్రహీంబాగ్ చెరువును హైడ్రా క‌మిష‌న‌ర్ రంగ‌నాథ్ పరిశీలించారు. ఖాజగూడ చెరువులోకి మురుగు నీరు చేర‌కుండా కాలువ డైవ‌ర్షన్ ప‌నులు చేప‌ట్టాల‌ని అధికారులకు సూచనలు చేశారు. నెక్నాంపూర్ లోని ఇబ్రహీంబాగ్ చెరువు సుందరీకరణ పనులు స్పీడప్ చేయాలని దత్తత తీసుకున్న సంస్థను కోరారు. న‌గ‌రంలో చెరువుల అభివృద్ధి, సుంద‌రీక‌ర‌ణ ప‌నుల‌కు ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తుందని రంగనాథ్ తెలిపారు. చెరువుల అభివృద్ధికి కార్పొరేట్ సంస్థలు సీఎస్ఆర్ నిధుల‌ను అందించాలని కోరారు. చెరువుల ఆక్రమ‌ణ‌ల‌కు ఆస్కారం లేకుండా ప‌టిష్టమైన చ‌ర్యలు తీసుకుంటున్నామ‌ని.. చెరువుల అభివృద్ధి, సుంద‌రీక‌ర‌ణ ప‌నులు పూర్తయితే ఆహ్లాద‌క‌ర‌మైన వాతావ‌ర‌ణం ఏర్పడుతుంద‌ని క‌మిష‌న‌ర్ తెలిపారు.

‘‘భారత్‌కి అప్పగిస్తే నాకు చిత్రహింసలు’’.. ముంబై ఉగ్రదాడి నిందితుడి అప్పగింత ఆలస్యం..
26/11 ముంబై ఉగ్రవాద దాడుల నిందితుడు తహవ్వూర్ రాణాని భారత్‌కి అప్పగించడంలో మరోసారి అడ్డంకులు ఏర్పడ్డాయి. ఇటీవల భారత ప్రధాని నరేంద్రమోడీ, అమెరికా పర్యటన సమయంలో ట్రంప్ రాణాని భారత్‌కి అప్పగిస్తున్నట్లు ప్రకటించారు. ఉగ్రవాదంపై జీరో టాలరెన్స్ విధానాన్ని ఇరు దేశాలు చాటి చెప్పాయి. అయితే, పాక్-అమెరికన్ పౌరుడైన తహవ్వూర్ రాణా మరోసారి అమెరికా సుప్రీంకోర్టుని ఆశ్రయించాడు. దీంతో భారత్‌కి అప్పగింత ప్రక్రియ మరింత ఆలస్యమయ్యేలా కనిపిస్తోంది. అయితే, అప్పగింతపై ఇరు దేశాలు పనిచేస్తున్నట్లు విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిస్రీ అన్నారు. నవంబర్ 26, 2008లో జరిగిన ముంబై ఉగ్ర దాడుల్లో 166 మంది ప్రాణాలు కోల్పోయారు. 09 మంది ఉగ్రవాదుల్ని భద్రతా బలగాలు హతమార్చాయి. పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్ర సంస్థ లష్కరేతోయిబా ఈ దాడికి పాల్పడింది. ఈ కేసులో తహవ్వూర్ రాణా కీలక నిందితుడిగా ఉన్నాడు. గత కొంత కాలంగా ఇతడిని భారత్ తీసుకువచ్చి విచారించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి.

జెలెన్ స్కీకి దెబ్బ మీద దెబ్బ.. ట్రంప్ కీలక నిర్ణయం..
అమెరికా, ఉక్రెయిన్‌ల మధ్య సంబంధాలు పూర్తిగా చెడిపోయిన వాతావరణం కనిపిస్తోంది. గత వారం వైట్‌హౌజ్‌లో ఉక్రెయిన్ అధ్యక్షుడు వొలోడిమిర్ జెలెన్ స్కీ, అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ మధ్య చర్చల్లో తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. ఇరు నేతలు నువ్వా నేనా అన్న రీతిలో మీడియా ముందు లైవ్‌లోనే మాటలనుకున్నారు. దీంతో ప్రతిపాదిత ‘ఖనిజ ఒప్పందం’పై జెలెన్ స్కీ సంతకం చేయకుండానే వైట్ హౌజ్ నుంచి వెనుదిరిగారు. ఇదిలా ఉంటే, ట్రంప్ జెలెన్ స్కీకి తన దెబ్బ చూపిస్తున్నాడు. ఉక్రెయిన్ యుద్ధంలో ఇన్నాళ్లు జెలెన్ స్కీకి అన్ని వేళల సహకారం అందించిన అమెరికా, ఇప్పుడు ట్రంప్ రావడంతో తీరు మార్చుకుంది. ఉక్రెయిన్‌కి అందించే ఆర్థిక సహాయాన్ని ట్రంప్ కట్ చేశాడు. తాజాగా, అమెరికా రష్యాకు సంబంధించిన ఇంటెలిజెన్స్ వివరాలను పంచుకోవడం నిలిపేసినట్లు తెలుస్తోంది. దీంతో, రష్యాతో శాంతి చర్చలకు జెలెన్ స్కీ అమెరికాకు సహకరించాలనే ఒత్తిడి మరింత పెరిగింది. లాంగ్ రేంజ్ డ్రోన్ దాడులను నిర్వహించగలిగే ఉక్రెయిన్ సామర్థ్యం దెబ్బ తీస్తుందని నిపుణులు చెబుతున్నారు.

ప్రపంచంలోనే తక్కువ బరువున్న ల్యాప్‌ట్యాప్‌ లాంచ్..
వివిధ కంపెనీలు తమ ఉత్పత్తులను, ఆవిష్కరణలను వరల్డ్ మొబైల్ కాంగ్రెస్ 2025 (MWC 2025)లో ప్రదర్శిస్తున్నాయి. ఈ ప్రదర్శనలో ఇప్పటికే వివిధ రకాల స్మార్ట్‌ఫోన్‌లు, ల్యాప్‌ట్యాప్‌లు, ఇంకా అనేక ఎలక్ట్రానిక్స్ గాడ్జెట్‌లు విడుదలయ్యాయి. ఈ క్రమంలో ప్రముఖ స్మార్ట్‌ఫోన్‌ తయారీ సంస్థ టెక్నో.. ప్రపంచంలోనే తక్కువ బరువున్న ల్యాప్‌ట్యాప్‌ టెక్నో మెగాబుక్‌ S14 పేరుతో విడుదల చేసింది. టెక్నో ప్రకారం, టెక్నో మెగాబుక్‌ S14 ల్యాప్‌టాప్‌ ప్రపంచంలోనే తక్కువ బరువు కలిగిన 14 అంగుళాల OLED డిస్‌ప్లే కలిగిన ల్యాప్‌ట్యాప్‌. ఈ ల్యాప్‌టాప్‌ బరువు కేవలం 898 గ్రాములు మాత్రమే. ఇదే దీని ప్రధాన ప్రత్యేకతని చెప్పవచ్చు. ఈ ల్యాప్‌టాప్‌ ‘బ్యాక్లిట్’ కీ బోర్డు సపోర్టుతో ఈ ల్యాప్‌ట్యాప్‌ ఆకట్టుకుంటోంది. ఇక ఈ తేలికైన ల్యాప్‌ట్యాప్‌ స్పెసిఫికేషన్లు, ఫీచర్ల పరంగా చూస్తే ఇందులో.. టెక్నో మెగాబుక్‌ S14 ల్యాప్‌టాప్‌లో 14 అంగుళాల 2.8k OLED డిస్‌ప్లే, 2800×1600 పిక్సల్స్‌ రిజల్యూషన్‌, 120Hz రీఫ్రెష్‌ రేట్‌, 440 నిట్స్‌ బ్రైట్‌నెస్‌, 91 శాతం స్క్రీన్‌ టూ బాడీ రేషియో ఉన్నాయి. ఇది విండోస్‌ 11 OS తో పనిచేస్తుంది. ఈ ల్యాప్‌టాప్‌ 12 కోర్‌ స్నాప్‌డ్రాగన్‌ X Elite చిప్‌, Intel Core Ultra 7 ప్రాసెసర్‌తో వస్తుంది. ఇక ఇందులో స్టోరేజ్ కూడా భారీగానే ఉంది. ఇందులో 32GB LPDDR5 ర్యామ్‌, 2TB SSD స్టోరేజీ కలిగి ఉండడంతో వేగవంతమైన పనితీరును అందిస్తుంది.

హార్దిక్ భారీ సిక్సర్‌కు ఫీల్డింగ్ చేసిన ఐసీసీ ఛైర్మెన్..
టీమిండియా 2025 ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్స్‌లోకి గ్రాండ్ ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. దుబాయ్ వేదికగా జరిగిన సెమీ ఫైనల్స్‌లో ఆస్ట్రేలియాపై విజయం సాధించి ఫైనల్ కు దూసుకెళ్లింది. ఈ మ్యాచ్‌లో కోహ్లీ మరోమారు తనదైన శైలిలో బ్యాటింగ్ చేసి టీమిండియాను విజయ తీరాలకు చేర్చాడు. ఇది ఇలా ఉండగా.. మ్యాచ్ చివరిలో హార్దిక్ పాండ్యా తనదైన స్టయిల్‌లో సిక్సర్ల మోత మోగించాడు. అయితే ఆసక్తికరంగా, పాండ్యా కొట్టిన సిక్సర్లకు బంతి రాయల్ బాక్స్‌లో కూర్చొన్న ఐసీసీ ఛైర్మన్ జై షా దగ్గర పడింది. భారత్-ఆస్ట్రేలియా మధ్య జరిగిన ఈ మ్యాచ్‌ను వీక్షించేందుకు వచ్చిన ఐసీసీ ఛైర్మన్ జై షా రాయల్ బాక్స్‌లో కూర్చొని టీమిండియా బ్యాటింగ్‌ను ఆస్వాదించారు. ఇక మ్యాచ్ చివర్లో విరాట్ కోహ్లి అవుట్ అయిన తర్వాత స్టేడియంలో ఒక్కసారిగా సైలెన్స్ నెలకొంది. ఆ సమయంలో హార్దిక్ పాండ్యా క్రీజులోకి రాగా.. తనదైన మార్క్ బ్యాటింగ్ తో అలరించాడు. మొదట మరో వికెట్ పడకుండా స్లోగా ఆడుతున్న పాండ్యా, తన్వీర్ సంఘా వేసిన 45వ ఓవర్‌లో వరుసగా నాలుగు డాట్ బంతులు ఆడాడు. ఆ తర్వాత ఐదో బంతిని పాండ్యా స్ట్రయిట్‌గా గాల్లోకి లేపాడు. చివరకు ఆ బంతి సిక్స్ రూపంలో నేరుగా రాయల్ బాక్స్‌లో పడింది. అప్పటికే అక్కడ ఉన్న జై షా వెంటనే బంతిని అందుకుని గ్రౌండ్‌లోకి విసిరారు. దీనిపై నెటిజన్లు పాండ్యా టార్గెట్ జై షానే అంటూ సరదా కామెంట్లు చేస్తున్నారు.

గోరంట్ల మాధవ్‌కు మరో నోటీసు..
వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్ పార్టీ నేత, మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్‌ ఈరోజు విజయవాడ సైబర్ పోలీస్ స్టేషన్‌లో విచారణకు హాజరయ్యారు. పోలీసుల అడిగిన ప్రతి ప్రశ్నకు సమాధానం ఇచ్చానని, విచారణ ప్రక్రియకు పూర్తి సహకారం అందిస్తున్నానని చెప్పారు. మరోసారి నోటీస్ ఇస్తే కూడా హాజరవుతానని స్పష్టంచేశారు. పోక్సో కేసుకు సంబంధించిన విషయంలో, బాధితురాలి పేర్లు చంద్రబాబు, పవన్ కల్యాణ్, లోకేష్ సహా మరికొందరు రాజకీయ నేతలు ప్రస్తావించారు అన్నారు. ఈ అంశంపై తాను అధికారికంగా ఫిర్యాదు చేస్తానని, చట్టం అందరికీ సమానంగా ఉండాలని అంటున్నారు మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్.. కేసులు అడ్డం పెట్టి వైఎస్‌ జగన్‌ని ఆపాలని చూస్తే.. మూతిని అడ్డం పెట్టి సూర్యుని ఆపాలని చూడడమే వ్యాఖ్యానించారు గోరంట్ల మాధవ్.. 1970లో ఇందిరా గాంధీ పెట్టిన ఎమర్జెన్సీని.. ఇప్పుడు చంద్రబాబు నాయుడు తన పాలనతో గుర్తు చేస్తున్నారని దుయ్యబట్టారు.. కూర్చున్నా.. నిల్చున్నా.. మీటింగ్ పెట్టినా.. మాట్లాడినా.. అరెస్టులు చేస్తున్నారు.. అభివృద్ధిని పక్కన పెట్టి అరెస్టులపై చంద్రబాబు దృష్టి పెడుతున్నారని ఎద్దేవా చేశారు.. బావ ప్రకటన స్వేచ్ఛ ని హరించి వేస్తున్నారన్న ఆయన.. తప్పుడు కేసులు, అరెస్టులకు వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ నేతలు భయపడరని స్పష్టం చేశారు.. ఎన్నికల్లో వైస్సార్సీపీ ఓడింది లేదు.. చంద్రబాబు గెలిచేది లేదన్నారు.. అయితే, ఈ రోజు కేసు విచారణ ముగిసింది.. కానీ, పోలీసులు మరో నోటీసు ఇచ్చినట్టు వెల్లడించారు వైసీపీ నేత, మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్..

అసలైన వింటేజ్ చిరు ఈజ్ బ్యాక్?
మెగాస్టార్ చిరంజీవి హీరోగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో ఒక సినిమా ఫైనల్ అయింది. సంక్రాంతికి వస్తున్నాం లాంటి రీజినల్ బ్లాక్ బస్టర్ తర్వాత అనిల్ రావిపూడి మెగాస్టార్ చిరంజీవితో ప్రాజెక్ట్ సెట్ చేసుకోవడంతోనే ఒక రేంజ్ అంచనాలు ఏర్పడ్డాయి. అయితే అంచనాలు మించి ఉండేలా సినిమాని సిద్ధం చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నారు. ఇప్పటికే అనిల్ రావిపూడి స్క్రిప్ట్ లాక్ చేశారు. డైలాగు వెర్షన్ రాసేందుకు వైజాగ్ కూడా వెళ్ళింది అనిల్ అండ్ టీం. అయితే తాజాగా అందుతున్న సమాచారం మేరకు ఇది పూర్తిస్థాయి కామెడీ ఎంటర్టైనర్ గా ఒకప్పటి శంకర్ దాదా జిందాబాద్ లాంటి సినిమాలో ఉండే వింటేజ్ చిరుని దృష్టిలో పెట్టుకుని రాసుకున్న కథగా చెబుతున్నారు. నిజానికి రీఎంట్రీ దగ్గర్నుంచి మెగాస్టార్ చిరంజీవి గురించి మాట్లాడుతూ ప్రతిసారి వింటేజ్ చిరు ఇస్ బ్యాక్ అంటూ కామెంట్ చేస్తూ వస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. కానీ ఈ సినిమా మాత్రం అసలైన వింటేజ్ చిరు ఇస్ బ్యాక్ అని మాట్లాడుకునేలా ఉంటుందని ఇన్సైడ్ వర్గాల సమాచారం. ముఖ్యంగా చిరంజీవి క్యారెక్టర్ రాసుకున్న తీరు బాగా వర్కౌట్ అయిందని దానికి తోడు కథ కూడా సెట్ అవ్వడంతో ఈ సినిమా కూడా ఎన్నో సంచలనాలకు కేంద్ర బిందువుగా మారనుందని అంటున్నారు. వచ్చే ఏడాది సంక్రాంతి సందర్భంగా రిలీజ్ చేయబోతున్నారు కాబట్టి మెగాస్టార్ చిరంజీవి కెరీర్లో కూడా ఒక మూడు నాలుగు వందల కోట్ల బ్లాక్ బస్టర్ లోడ్ అయినా ఆశ్చర్యం లేదని అంటున్నారు మేకర్లు

రిలీజ్ కు ముందు వివాదం.. అయినా భారీ క్రేజ్
మరాఠా పోరాట యోధుడు ఛత్రపతి శివాజీ కుమారుడు చత్రపతి శంభాజీ మహారాజ్ జీవిత చరిత్ర ఆధారంగా రూపొందించిన చిత్రం ఛావా. తొలుత హిందీలో రిలీజ్ అయిన ఈ చిత్రం తెలుగు ప్రేక్షకులను కూడా ఆకట్టుకుంది. ఎంతోమంది ప్రేక్షకులు ఈ సినిమా తెలుగులో కూడా వస్తే బాగుండు అంటూ సోషల్ మీడియా వేదికగా విజ్ఞప్తులు చేసిన నేపథ్యంలో ఎట్టకేలకు ఈ సినిమాని తెలుగులో తీసుకువచ్చేందుకు గీతా ఆర్ట్స్ సంస్థ ముందుకు వచ్చింది. గీతా ఆర్ట్స్ సినిమా రిలీజ్ చేస్తుందంటేనే సినిమా మీద మామూలుగానే అంచనాలు ఉంటాయి. దానికి తోడు భారీ క్రేజ్ ఉన్న ఈ సినిమా కావడంతో దీన్ని పెద్ద ఎత్తున రిలీజ్ చేస్తున్నారు. తెలుగు రాష్ట్రాలలో దాదాపు 550 కి పైగా స్క్రీన్స్ లో సినిమాలు రిలీజ్ చేస్తున్నారు. లక్ష్మణ్ ఉటేకర్ డైరెక్ట్ చేసిన ఈ సినిమాని మేడాక్ ఫిలిమ్స్ బ్యానర్ మీద దినేష్ విజన్ నిర్మించారు. విక్కీ కౌశల్ శంభాజీ మహారాజ్ గా రష్మిక మందన ఏశుభాయిగా నటించిన ఈ చిత్రం హిందీలో భారీ కలెక్షన్లు రాబట్టి దాదాపు 500 కోట్లకు పైగా నెట్ వసూళ్లు రాబట్టింది. ఇప్పుడు తెలుగులో కూడా ఈ సినిమా భారీ వసూళ్లు రాబట్టే అవకాశం ఉందని గీతా కాంపౌండ్ నమ్ముతుంది. తెలుగు ట్రైలర్ కూడా ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అయింది కాబట్టి తెలుగు వెర్షన్ కోసం ప్రేక్షకులు ఆసక్తికరంగా ఎదురు చూస్తున్నారు.