ఇరుసుమండ బ్లోఅవుట్‌పై సీఎం చంద్రబాబు సమీక్ష..
డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ఇరుసుమండలో జరిగిన బ్లోఅవుట్ పై సమీక్ష నిర్వహించారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు.. ఇరుసుమండ గ్యాస్ బ్లోఅవుట్ ప్రమాదంపై ఉన్నతాధికారులతో సమావేశమయ్యారు.. అయితే, బ్లోఅవుట్ ప్రాంతంలో గ్యాస్ లీక్‌ను అరికట్టడం, మంటలను నియంత్రించడం కోసం వివిధ శాఖలు చేపడుతున్న చర్యలను రాష్ట్ర ప్రధాన కార్యదర్శి (CS) విజయానంద్, హోంమంత్రి వంగలపూడి అనిత సీఎంకు వివరించారు. బ్లోఅవుట్ ప్రాంతంలో ఇంకా మంటలు ఆరలేదు, భారీగా గ్యాస్ ఎగజిమ్ముతూనే ఉంది. పరిస్థితి అదుపులోకి తీసుకురావడానికి ఢిల్లీ నుంచి RCMT ఇన్‌చార్జ్ శ్రీహరి నేతృత్వంలో నిపుణుల బృందం కోనసీమకు చేరుకుని క్షేత్రస్థాయిలో పరిశీలన, కట్టడి చర్యలు చేపడుతోంది. మంటలను ఆర్పేందుకు ONGC అధికారులు రెండు లారీల్లో కూలెంట్ ఆయిల్, ఇతర శీతలీకరణ ద్రవాలను తీసుకుని బ్లోఅవుట్ ప్రాంతానికి తరలిస్తున్నారు. ప్రస్తుతం నీరు, మడ్డు, మట్టి, బురద ఉపయోగించి మంటలను ఆర్పే ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. అయితే, బ్లోఅవుట్‌ను పూర్తిగా ఆర్పే విషయంలో ఇంకా స్పష్టత రాలేదు. సమీక్ష సందర్భంగా సీఎం చంద్రబాబు పునరావాస కేంద్రాల్లో సహాయ చర్యలు ఎలా కొనసాగుతున్నాయన్న దానిపైనా అధికారులను అడిగి తెలుసుకున్నారు. ప్రజలకు ఎప్పటికప్పుడు వాస్తవ పరిస్థితిని వివరించాలి, వారికి అండగా నిలవాలి అని స్పష్టం చేవారు.. సమస్య పూర్తిగా పరిష్కారమయ్యే వరకు జిల్లా యంత్రాంగంపైనే పూర్తి బాధ్యత ఉంటుందని ఆయన అన్నారు.
తెలంగాణ అసెంబ్లీలో చంద్రబాబు చేసిన మోసం బహిర్గతమైంది..!
రెండు తెలుగు రాష్ట్రాల మధ్య మరోసారి జల వివాదంపై ఆరోపణలు, విమర్శల పర్వం కొనసాగుతోంది.. గత ప్రభుత్వ అసమర్థత వల్లే ఈ పరిస్థితి వచ్చిందని ప్రస్తుత ప్రభుత్వాలు చెబుతుండగా వైసీపీ సీనియర్ నేత ఈ వ్యవహారంపై హాట్ కామెంట్లు చేశారు. తెలంగాణ అసెంబ్లీలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుచేసిన మోసం బహిర్గతం అయ్యిందని దుయ్యబట్టారు వైఎస్పీసీ నేత గడికోట శ్రీకాంత్ రెడ్డి.. సమాజంలో గత రెండు రోజులుగా ఈ విషయంపై సర్వత్రా ఆందోళన కొనసాగుతుండటం గమనార్హమన్నారు. ముఖ్యంగా చంద్రబాబు ఆలోచనను అసెంబ్లీ లో అమలు చేయడంలో మంత్రి రామానాయుడు ఆమోదముద్ర వేసినందుకు ప్రజల్లో కోపం ఉన్నదని శ్రీకాంత్ వ్యాఖ్యానించారు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా చంద్రబాబుపై ఒత్తిడి చేసి రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ పై పనిచేసే కార్యక్రమాల్ని ఆపించించానని తెలిపారు అన్నారు గడికోట శ్రీకాంత్ రెడ్డి.. గతంలో చంద్రబాబు ఎన్నోసారి విభిన్న కారణాలతో పనులను నిలిపివేశారని ఒకసారి ఎన్విరాన్మెంటల్ క్లియరెన్స్ లేకపోవడంతో ఆపామని, మరలా ఇతర కారణాలు చెప్పారని విమర్శించారు. అలమట్టి ప్రాజెక్టు ఎత్తు పెంపును కూడా తిరస్కరించడం గురించి, అలాగే ప్రస్తుతం కర్ణాటక ప్రభుత్వం స్టోరేజ్ స్థాయిని రెండింతలు పెంచుతున్న విషయం పై ఏపీ ప్రభుత్వం స్పందించడానికి సిద్ధంగా లేకపోవడం పై కూడా ప్రశ్నించారు శ్రీకాంత్ రెడ్డి. గత 20 సంవత్సరాల్లో కేవలం నాలుగు సంవత్సరాలకే మాత్రమే నీటి విడుదలను ప్రాధాన్యం ఇచ్చారని అన్నారు. అనేక సంవత్సరాలుగా నీటి సమస్యతో కష్టపడుతున్న రాయలసీమ ప్రజలకు నీటి ఇబ్బంది ఇంకా కొనసాగుతోందని అతడు అభిప్రాయపడ్డారు. అయితే, పోతిరెడ్డిపాడు ప్రాజెక్టు సామర్థ్యం పెంపు వల్ల అనేక ప్రాజెక్టులకు నీళ్లు రావడంలో మార్పులు చూపితే కూడా నిజానికి నీటి విడుదల విషయంలో సరైన సమాధానాలు లేవని వ్యాఖ్యానించారు.
భోగాపురం ఎయిర్‌పోర్ట్‌పై వారిది నీతిమాలిన రాజకీయం..
భోగాపురం ఎయిర్‌పోర్ట్ విషయంలో కూటమి సర్కార్-వైఎస్‌ఆర్ కాంగ్రెస్ మధ్య క్రెడిట్ పంచాయితీ తారాస్థాయికి చేరుకుంది.. అసలు భోగాపురం ఎయిర్‌పోర్ట్‌పై వైసీపీ నీతిమాలిన రాజకీయాలు చేస్తోందని.. ఎవరికో పుట్టిన బిడ్డను తన బిడ్డ అని చెప్పుకునే స్థాయికి ఆ పార్టీ నాయకులు దిగజారరని మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ విమర్శలు గుప్పించారు.. ఇబ్రహీంపట్నం మండలం గుంటుపల్లిలో ప్రాథమిక ఆరోగ్య కేంద్ర నిర్మాణానికి శంకుస్థాపన చేసిన అనంతరం.. మీడియాతో మాట్లాడిన ఆయన.. వైసీపీ నిర్మాణాత్మక ప్రతిపక్షంగా సూచనలు చేస్తే స్వీకరిస్తామని.. అలా కాకుండా ప్రతి విషయాన్ని రాజకీయం చేయడం సరికాదని హితవు పలికారు. మెడికల్ కళాశాలల ద్వారా ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలని కూటమి ప్రభుత్వం కృషి చేస్తుంటే.. వైసీపీ కోటి సంతకాల పేరుతో కుట్ర రాజకీయాలు చేస్తోందని విమర్శించారు. అనవసరమైన రాజకీయాలు చేయకుండా ప్రజల మేలు కోసం పని చేస్తే రాబోయే ఎన్నికల్లో ఎంతో కొంత ప్రజలు ఆదరిస్తారని, ఆ విషయాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు గ్రహించాలని సూచించారు మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్..
అసెంబ్లీ గౌరవ సభలా లేదు.. కౌరవ సభ లా ఉంది..
వరంగల్ జిల్లా జనగామ వేదికగా జరిగిన సర్పంచుల సన్మాన కార్యక్రమంలో కేటీఆర్ తన ప్రసంగంతో రాజకీయ వాతావరణాన్ని ఒక్కసారిగా వేడెక్కించారు. ప్రజాకవి కాళోజీ నారాయణరావు సిద్ధాంతాన్ని గుర్తు చేస్తూ, “కాలం వచ్చినప్పుడు కసిదీర కాటేయాలే” అనే మాటకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని ఆయన ఉద్ఘాటించారు. పార్టీలో ఎటువంటి కీలక పాత్ర లేకపోయినా, కేవలం గౌరవంతో కడియం శ్రీహరిని ఉప ముఖ్యమంత్రిని చేసిన ఘనత బీఆర్ఎస్ పార్టీదేనని, కానీ ఆయన తన కుమార్తె రాజకీయ భవిష్యత్తు కోసం ద్రోహం చేసి రేవంత్ రెడ్డి చెంతకు చేరారని మండిపడ్డారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై వ్యక్తిగత స్థాయిలో తీవ్ర విమర్శలు చేస్తూ, ఆయనకు కనీస భౌగోళిక అవగాహన కూడా లేదని ఎద్దేవా చేశారు. దేవాదుల ప్రాజెక్టు గోదావరిపై ఉందో, కృష్ణాపై ఉందో తెలియని పరిస్థితిలో ముఖ్యమంత్రి ఉన్నారని, బక్రా నంగల్ ప్రాజెక్టు ఎక్కడ ఉందో కూడా తెలియనివాడు రాష్ట్రాన్ని పాలిస్తున్నారని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. గత రెండేళ్ల పాలనలో సిగ్గులేని మాటలు, రోత కోతలు తప్ప రాష్ట్రానికి చేసింది ఏమీ లేదని దుయ్యబట్టారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.. కేసీఆర్‌ను ఉరితీయాలని అనడంపై కేటీఆర్ తీవ్రంగా స్పందించారు. “చావు నోట్లో తలపెట్టి తెలంగాణ తెచ్చినందుకు కేసీఆర్‌ను ఉరి వేస్తావా?” అని ప్రశ్నిస్తూ, 70 లక్షల మంది రైతులను మోసం చేసిన రాహుల్ గాంధీని ఉరితీయాలని డిమాండ్ చేశారు. రాహుల్ గాంధీ ఒక లీడర్ కాదని, కేవలం ‘రీడర్’ అని, ఇక్కడి నాయకులు ఏమి రాసిస్తే అది చదవడమే ఆయన పని అని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్‌లో సీనియర్లను తొక్కేసి, అడ్డదారిలో ముఖ్యమంత్రి అయిన రేవంత్ రెడ్డి, అసెంబ్లీలో , బయటా ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని విమర్శించారు.
JNUలో ‘‘తుక్డే తుక్డే గ్యాంగ్’’ హల్చల్.. మోడీ, అమిత్ షాలపై అభ్యంతరకర వ్యాఖ్యలు..
2020 ఢిల్లీ మత అల్లర్ల కేసులో ప్రధాన నిందితులుగా ఉన్న ఉమర్ ఖలీద్, షర్జీల్ ఇమామ్‌లకు సుప్రీంకోర్టు బెయిల్ నిరాకరించింది. అయితే, దీనిని వ్యతిరేకిస్తూ జవహర్‌లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయం (JNU) విద్యార్థులు ప్రధాని నరేంద్రమోడీ, అమిత్ షా, బీజేపీ, ఆర్ఎస్ఎస్‌లను టార్గెట్ చేస్తూ అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారు. మరోసారి, జేఎన్‌యూలో తుక్డే తుక్డే గ్యాంగ్ హల్చల్ చేసింది. ప్రధాని మోడీ, అమిత్ షాలకు జేఎన్‌యూలో సమాధి తవ్వుతామని విద్వేష వ్యాఖ్యలు చేశారు. సోమవారం రాత్రి జేఎన్‌యూలో నిరసన ప్రదర్శన జరిగింది. ఈ వ్యవహారంపై యూనివర్సిటీ స్టూడెంట్ యూనియన్ అధ్యక్షురాలు అదితి మిశ్రా మాట్లాడుతూ.. జనవరి 5, 2020న క్యాంపస్‌లో జరిగిన హింసను ఖండిస్తూ విద్యార్థులు ప్రతి సంవత్సరం నిరసన ప్రదర్శన నిర్వహిస్తారని అన్నారు. “నిరసన సమయంలో లేవనెత్తిన నినాదాలన్నీ సైద్ధాంతికమైనవి మరియు ఎవరినీ వ్యక్తిగతంగా దాడి చేయలేదు. అవి ఏ వ్యక్తిని లక్ష్యంగా చేసుకోలేదు” అని చెప్పింది.
ఓడియమ్మ ట్యూనా ఫిష్.. వేలంలో రూ.29 కోట్లు పలికిన ట్యూనా ఫిష్.. అంత ప్రత్యేకత ఏంటంటే..!
కొత్త ఏడాది 2026 జపాన్‌లో ప్రపంచ ప్రఖ్యాత టోయోసు ఫిష్ మార్కెట్‌లో ప్రతి ఏడాది జరిగే తొలి ట్యూనా వేలం ఈసారి చరిత్ర సృష్టించింది. ఈ వేలంలో ఒకే ఒక్క బ్లూఫిన్ ట్యూనా ఏకంగా 510 మిలియన్ యెన్‌లు (రూ.29 కోట్లు) ధర పలికి అందరి దృష్టిని ఆకర్షించింది. అంత భారీగా ఉన్న ఈ చేపను ఎత్తేందుకు నలుగురు వ్యక్తులు అవసరమయ్యారు అంటే దాని పరిమాణం ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. ఈ రికార్డు ధరతో ఈ ఏడాది ట్యూనా వేలం కొత్త మైలురాయిని అందుకుంది. 243 కిలోల బరువు కలిగిన ఈ భారీ బ్లూఫిన్ ట్యూనాను జపాన్‌లో ప్రసిద్ధి చెందిన సుషిజన్మై (Sushizanmai) సుషి రెస్టారెంట్ చైన్‌కు మాతృసంస్థ అయిన కియోమురా కార్పొరేషన్ కొనుగోలు చేసింది. ఈ సంస్థ అధినేత కియోషి కిమురా ప్రతీ ఏడాది జరిగే ఈ వేలంలో పాల్గొని అందరి దృష్టిని ఆకర్షిస్తుంటారు. ఇక ఈ వేలం అనంతరం మాట్లాడిన కియోషి కిమురా.. ఈ రికార్డు బిడ్‌ను నూతన సంవత్సరానికి శుభారంభంగా అభివర్ణించారు. ఈ ఏడాది ఆర్థిక వ్యవస్థ మెరుగుపడాలని ఆశిస్తున్నానని.. ప్రధాని సనాయే టకైచి ప్రభుత్వం పని చేయాలని అన్నారు. అదే విధంగా సుషిజన్మై కూడా పనిచేస్తుందని వ్యాఖ్యానించారు.
రిలయన్స్‌కు ట్రంప్ ఎఫెక్ట్.. లక్ష కోట్లు లాస్ అయిన ముఖేష్ అంబానీ
ఆసియాలో అత్యంత ధనవంతుడైన వ్యాపారవేత్త ముఖేష్ అంబానీ. కొన్ని రోజులుగా మార్కెట్ ఆయన రష్యన్ ముడి చమురును కొనుగోలు చేశారా లేదా అనే సందిగ్ధతతో సతమతమవుతోంది. తాజాగా రష్యన్ ముడి చమురును మోసుకెళ్తున్న మూడు నౌకలు ప్రపంచంలోనే అతిపెద్ద శుద్ధి కర్మాగారమైన జామ్‌నగర్‌కు చేరుకున్నాయని కెప్లర్‌ను ఉటంకిస్తూ బ్లూమ్‌బెర్గ్ నివేదించింది. దీని తరువాత జనవరి 5న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ రష్యన్ ముడి చమురు కొనుగోలుపై తన అసంతృప్తిని వ్యక్తం చేశారు. భారతదేశం రష్యన్ ముడి చమురు కొనుగోలును ఆపకపోతే ఇండియాపై మరిన్ని సుంకాలను విధిస్తామని ఆయన తన ప్రకటనలో బెదిరించారు. ఈ ప్రకటన వెలువడిన కొన్ని గంటల్లోనే, రిలయన్స్ ఇండస్ట్రీస్ తన ట్విట్టర్ హ్యాండిల్‌లో రష్యన్ ముడి చమురు కొనుగోలుపై వివరణ జారీ చేసింది. గత మూడు వారాలుగా కంపెనీ రష్యా నుంచి ముడి చమురు కొనుగోలు చేయలేదని, జనవరిలో ముడి చమురు వచ్చే అవకాశం లేదని పేర్కొంది. అలాగే రిలయన్స్ రష్యన్ ముడి చమురు కొనుగోలు చేస్తుందనే అన్ని మీడియా నివేదికలను ఈ ప్రకటనలో తోసిపుచ్చారు. వాస్తవానికి ఈ వివరణ ఇప్పుడు ముఖేష్ అంబానీ కంపెనీపై ప్రత్యక్ష ప్రభావాన్ని చూపుతున్నట్లు కనిపిస్తోంది. తాజాగా ఈ కంపెనీ షేర్లు 5 శాతానికి పైగా పడిపోయాయి. ముఖ్యంగా జూన్ 2024 లోక్‌సభ ఎన్నికల ఫలితాల తర్వాత రిలయన్స్ షేర్లలో అతిపెద్ద క్షీణతను ఇప్పుడే చవిచూశాయి. దీని ఫలితంగా రిలయన్స్ వాల్యుయేషన్ లక్ష కోట్ల రూపాయలకు పైగా పడిపోయింది. నిజానికి ఇది చిన్న సంఘటన కాదు. ఎందుకంటే రిలయన్స్ ఇండస్ట్రీస్ షేర్ల పతనం మొత్తం స్టాక్ మార్కెట్ నష్టానికి దారితీసింది. సెన్సెక్స్ 485 పాయింట్లు పడిపోయింది.
ముస్తాఫిజుర్‌ను తీసేస్తే, బంగ్లాదేశ్ హిందువును కెప్టెన్ చేసింది: జేడీయూ నేత..
కోల్‌కతా నైట్ రైడర్స్(KKR) బంగ్లాదేశ్ స్టార్ బౌలర్ ముస్తాఫిజుర్ రెహ్మాన్‌ను జట్టు నుంచి తీసేయడాన్ని భారత్‌లోని కొందరు రాజకీయ నేతలు ప్రశ్నిస్తున్నారు. బీసీసీఐ (BCCI) నిర్ణయంపై అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. జేడీయూ నేత కేసీ త్యాగి మాట్లాడుతూ.. రాజకీయాలను, క్రీడల్ని ముడిపెట్టొద్దని అన్నారు. బంగ్లాదేశ్‌లో హిందూ మైనారిటీలపై దాడులు జరుగుతున్న సమయంలో, ఐపీఎల్‌లోకి బంగ్లా బౌలర్‌ను తీసుకోవడంపై పలు సంఘాలు, ప్రజల నుంచి తీవ్ర అభ్యంతరం వ్యక్తమైంది. ‘‘ క్రీడలు, రాజకీయాలకు సంబంధం ఉండకూడదు. కానీ భారత్, పాకిస్తాన్, బంగ్లాదేశ్ మధ్య ప్రస్తుత పరిస్థితులు ఉద్రిక్తంగా ఉన్నాయి. బంగ్లాదేశ్‌లో హిందువులపై జరుగుతున్న సంఘటనలతో భారత సమాజం ఆగ్రహంగా ఉంది. ఇది క్రీడా వాతావరణంపై ప్రభావం చూపుతోంది’’ అని అన్నారు. ఇదే సమయంలో బంగ్లాదేశ్ జట్టు హిందూ ఆటగాడు లిట్టన్ దాస్‌ను కెప్టెన్‌గా నియమించిందని, దీనిని కూడా భారత్ పరిగణలోకి తీసుకోవాలని అన్నారు. కాంగ్రెస్ నేత శశిథరూర్, ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఓవైసీ కూడా రాజకీయాలను, క్రికెట్‌ను ముడిపెట్టొద్దని అన్నారు. మరోవైపు, బంగ్లాదేశ్‌లోని మైనారిటీ హిందువులపై హత్యాకాండ ఆగడం లేదు. ఇప్పటికీ 6 మంది హిందువుల్ని అక్కడ మతోన్మాదులు దారుణంగా హత్య చేశారు. గత 48 గంటల్లోనే ఇద్దర్ని హత్య చేశారు. హిందూ మహిళపై అత్యాచారం చేసి, ఆమె జట్టు కత్తిరించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
హైదరాబాద్ క్రికెటర్ ఊచకోత.. 13 సిక్స్‌లు, 12 ఫోర్లతో బౌలర్లకు చుక్కలు
విజయ్ హజారే ట్రోఫీలో హైదరాబాద్ క్రికెటర్ మెరిశాడు.. హైదరాబాద్ ఓపెనర్ అమన్ రావు హిస్టరీ క్రియేట్ చేశాడు.. ఈ రోజు రాజ్‌కోట్‌లోని నిరంజన్ షా స్టేడియంలో అమన్ తన కెరీర్‌లో అతిపెద్ద మైలురాయిని సాధించాడు. అజేయ డబుల్ సెంచరీతో ఆకట్టుకున్నాడు.. అంతేకాదు, ఈ టోర్నమెంట్‌లో డబుల్ సెంచరీ చేసిన తొలి హైదరాబాద్ బ్యాట్స్‌మన్ కూడా అమన్ కావడం మరో విశేషం.. 154 బంతులు ఎదుర్కొన్న అమన్.. 13 సిక్సర్లు, 12 ఫోర్లతో అజేయంగా 200 పరుగులు చేశాడు. చివరి బంతికి సిక్స్ కొట్టడం ద్వారా అమన్ తన డబుల్ సెంచరీని పూర్తి చేశాడు.. అయితే, తొలుత బ్యాటింగ్ చేసిన హైదరాబాద్ జట్టు.. అమన్ రావ్ చారిత్రాత్మక ఇన్నింగ్స్ తో 352/5 పరుగుల భారీ స్కోరు సాధించింది. అమన్ స్టార్ బౌలర్లు మహమ్మద్ షమీ, ముఖేష్ కుమార్ మరియు ఆకాష్ దీప్ లతో కూడిన బెంగాల్ బౌలింగ్ దాడిని పూర్తిగా బద్దలు కొట్టాడు. ఈ ముగ్గురు బౌలర్లు భారతదేశం తరపున అంతర్జాతీయ క్రికెట్‌లో అద్భుతంగా రాణించారు. అమన్ రావ్ ఫాస్ట్ బౌలర్లపై నిర్భయంగా బ్యాటింగ్ చేసి, షమీ, ముఖేష్, ఆకాష్ దీప్‌లపై ఒంటరిగా 120 పరుగులు చేశాడు, ఇందులో 8 సిక్సర్లు ఉన్నాయి. ఆది నుంచి దూకుడుగా ఆడాడు అమన్.. 65 బంతుల్లో అర్ధ సెంచరీ, 108 పరుగుల వద్ద సెంచరీ పూర్తి చేసిన ఈ క్రికెటర్.. ఆ తర్వాత కేవలం 46 బంతుల్లోనే డబుల్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. సీనియర్ క్రికెట్‌లో అమన్ రావుకు ఇది తొలి సెంచరీ కూడా.. టోర్నమెంట్‌లోని మొదటి రెండు మ్యాచ్‌లలో అతను 39 మరియు 13 పరుగులు చేశాడు, కానీ, అతను చరిత్ర సృష్టించినది మూడవ మ్యాచ్‌లోనే. లిస్ట్ ఏ క్రికెట్‌లో హైదరాబాద్ తరపున అమన్ రావ్ చేసిన 200 పరుగులు అత్యధిక వ్యక్తిగత స్కోరు. విజయ్ హజారే ట్రోఫీ చరిత్రలో ఇది తొమ్మిదవ డబుల్ సెంచరీ, ప్రస్తుత విజయ్ హజారే ట్రోఫీ సీజన్‌లో రెండవ డబుల్ సెంచరీ.. గతంలో సౌరాష్ట్రపై ఒడిశాకు చెందిన స్వస్తిక్ సమల్ చేసిన 212 పరుగులు అత్యధికం..
తగ్గేదే లే అంటున్న ‘పెద్ది’.. అనుకున్న డేట్‌కే రిలీజ్
ఆస్కార్ అవార్డు విజేత, సంగీత మాంత్రికుడు ఏఆర్ రెహమాన్ 59వ పుట్టిన రోజు సందర్భంగా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న ‘పెద్ది’ టీమ్ స్పెషల్ పోస్టర్‌తో ఫ్యాన్స్‌ను సర్పైజ్ చేసింది. తాజాగా పెద్ది టీమ్ ఏఆర్ రెహమాన్‌కు బర్త్ డే విషెస్ చెబుతూ పోస్టర్ రిలీజ్ చేసింది. ఆయన నుంచి మరో సింగిల్ కోసం అందరం ఆసక్తిగా ఎదురు చూస్తున్నామని ఈ పోస్టర్‌లో పేర్కొంది. ఉప్పెన ఫేం బుచిబాబు సానా దర్శకత్వంలో రూపొందుతున్న ‘పెద్ది’ ఓ పాన్ ఇండియా స్థాయిలో స్పోర్ట్స్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతుంది. సోషల్ మీడియాలో గత కొద్ది రోజులుగా వినిపిస్తున్న, కనిపిస్తున్న పెద్ది రిలీజ్ వాయిదా అనే ప్రచారానికి చిత్ర బృందం తాజాగా పుల్‌స్టాప్ పెట్టింది. ఏఆర్ రెహమాన్ బర్త్ డే సందర్భంగా రిలీజ్ చేసిన స్పెషల్ పోస్టర్‌లో పెద్ది టీమ్ సినిమా రిలీజ్‌పై క్లారిటీ ఇచ్చింది. ఈ పోస్టర్ గమనిస్తే అందులో పెద్ది సినిమా ముందు నుంచి అనుకున్న టైంకే థియేటర్స్‌లోకి రాబోతుందని అర్థం అవుతుంది. మార్చి 27, 2026న మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ బర్త్‌డే సందర్భంగా పెద్ది గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ ఉంటుందని చిత్ర బృందం మరోసారి అఫిషియల్‌గా ప్రకటించింది. ఈ చిత్రంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ టైటిల్ రోల్‌లో కనిపిస్తుండగా, బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ హీరోయిన్‌గా నటిస్తోంది. కన్నడ సూపర్ స్టార్ శివరాజ్ కుమార్, జగపతి బాబు, దివ్యేందు శర్మ తదితరులు కీలక పాత్రల్లో కనువిందు చేస్తున్నారు. వృద్ధి సినిమాస్ బ్యానర్‌పై వెంకట సతీష్ కిలారు నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ ప్రెజెంట్ చేస్తున్నాయి.
దళపతి ఆఖరి పోరాటం.. ఇంకా రాని సెన్సార్ సర్టిఫికేట్!
తమిళ స్టార్ హీరో దళపతి విజయ్ ఆఖరి చిత్రం ‘జన నాయగన్’ విడుదలకు ముందు ఊహించని అడ్డంకులను ఎదుర్కొంటూ ఉండగా అసలు రిలీజ్ అవుతుందో లేదో తెలియని పరిస్థితి నెలకొంది. ఇప్పటికే షూటింగ్ అంతా పూర్తి చేసుకుని, విడుదలకు కేవలం మూడు రోజుల సమయం మాత్రమే ఉన్న తరుణంలో సెన్సార్ సర్టిఫికేట్ వచ్చే పరిస్థితి కనిపించక పోవడం ఇప్పుడు కోలీవుడ్‌లో సంచలనంగా మారింది. హెచ్. వినోద్ దర్శకత్వంలో విజయ్ నటిస్తున్న ‘జన నాయగన్’ జనవరి 9న సంక్రాంతి కానుకగా విడుదల కావాల్సి ఉంది కానీ సినిమా రివ్యూ ప్రక్రియ పూర్తయినప్పటికీ, సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ (CBFC) నుంచి అధికారికంగా సెన్సార్ సర్టిఫికేట్ ఇంకా అందలేదు. ఈ లేట్ కావాలనే చేస్తున్నారు అంటూ చిత్ర నిర్మాణ సంస్థ KVN ప్రొడక్షన్స్ మద్రాస్ హైకోర్టులో ఎమర్జెన్సీ పిటిషన్ దాఖలు చేసింది. సినిమా యూనిట్ తెలిపిన వివరాల ప్రకారం, గత నెలలోనే సినిమాను సెన్సార్ బోర్డు వీక్షించి కొన్ని సూచనలు, కట్స్ చెప్పింది, బోర్డు సూచించిన మార్పులు (Cuts) మరియు మ్యూట్లను కూడా చిత్ర బృందం పూర్తి చేసి మళ్ళీ సమర్పించింది. అయినప్పటికీ, సర్టిఫికేట్ జారీ చేయడంలో అధికారులు జాప్యం చేస్తున్నారని, దీని వెనుక కొన్ని రాజకీయ కారణాలు ఉండవచ్చని విజయ్ పార్టీ (TVK) వర్గాలు ఆరోపిస్తున్నాయి. సినిమా విడుదలకు ఇంకా కేవలం 3 రోజుల సమయం మాత్రమే ఉంది. సెన్సార్ సర్టిఫికేట్ ఉంటేనే థియేటర్లలో అడ్వాన్స్ బుకింగ్స్ ఓపెన్ చేసే అవకాశం ఉంటుంది. ఈరోజు లేదా రేపటిలోగా సర్టిఫికేట్ రాకపోతే, ప్రపంచవ్యాప్తంగా ప్లాన్ చేసిన గ్రాండ్ రిలీజ్ వాయిదా పడే ప్రమాదం ఉందని అంటున్నారు. ఇప్పటికే కర్ణాటక, కేరళ మరియు ఓవర్సీస్‌లో బుకింగ్స్ ప్రారంభమైనప్పటికీ, తమిళనాడు సహా తెలుగు రాష్ట్రాల్లో సెన్సార్ అడ్డంకుల వల్ల బుకింగ్స్ నిలిచిపోయాయి.
