Site icon NTV Telugu

Top Headlines @ 5 PM: టాప్‌ న్యూస్‌

Top Headlines @ 5 Pm New

Top Headlines @ 5 Pm New

వైఎస్ జగన్ పర్యటనలో అపశృతి..
వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌ రెడ్డి నంద్యాల జిల్లా డోన్‌ పర్యటనకు వెళ్లారు.. అయితే, వైఎస్ జగన్ డోన్‌ పర్యటనలో అపశృతి చోటు చేసుకుంది.. వెల్దుర్తి హైవేపై టైరు పేలి ట్రాలీ ఆటో బోల్తా పడింది.. ఈ ప్రమాదంలో ఆరుగురి పరిస్థితి విషమంగా మారగా.. మొత్తం 30 మందికి గాయాలు అయ్యాయి.. క్షతగాత్రులను కర్నూలు ఆసుపత్రికి, వెల్దుర్తి ఆసుపత్రికి తరలించారు.. డోన్‌లో మాజీ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌ రెడ్డి కుమారుని వివాహ రిసెప్షన్ కు హాజరై తిరిగి వెళ్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది.. బాధితులంతా బేతంచర్ల మండలం రుద్రవరంకు చెందిన వారిగా గుర్తించారు పోలీసులు.. కాగా, నంద్యాల జిల్లాలో పర్యటించిన వైఎస్‌ జగన్‌.. మాజీ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌ కుమారుడి వివాహ రిసెప్షన్‌కు హాజరయ్యారు. డోన్‌లో జరిగిన వెడ్డింగ్‌ రిసెప్షన్‌లో నూతన వధూవరులు అనన్య రెడ్డి, బుగ్గన అర్జున్‌ అమర్నాథ్‌లను ఆశీర్వదించారు జగన్.. ఇక, జగన్‌ రాకతో డోన్‌ జనసంద్రమైంది. ప్రియతమ నేతను చూసేందుకు భారీ సంఖ్యలో అభిమానులు, పార్టీ కార్యక​ర్తలు తరలివచ్చారు. వారికి అభివాదం చేస్తూ వైఎస్‌ జగన్‌ ముందుకు సాగారు..

ఏపీ కేబినెట్‌ కీలక నిర్ణయాలు.. వీరికి గుడ్‌న్యూస్‌.. వారికి షాక్‌..!
ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరిగిన కేబినెట్ సమవేశంలో పలు కీలక అంశాలపై చర్చించి నిర్ణయం తీసుకున్నారు.. రాష్ట్రంలోని మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ పథకం అమలుకు కేబినెట్‌ ఆమోదం తెలిపింది.. ఆగస్టు 15 నుండి స్వాతంత్య్ర దినోత్సవ కానుకగా అమలు చేయబోతున్నారు.. ఇక, ఏపీ ల్యాండ్ ఇనిషియేటివ్స్ అండ్ టెక్ హబ్స్ (లిప్ట్) పాలసీ 4.0… 2024-29కి కేబినెట్‌ ఆమోదముద్ర వేసింది.. 22 ఏపీ టూరిజం డెవలప్‌మెంట్‌ హోటళ్లు, ఆరు క్లస్టర్ల పరిధిలోని రిసార్టుల ఆపరేషన్లకు ఏజెన్సీల ఎంపికకు వీసీ అండ్ ఎండీకి అనుమతులు మంజూరు చేసింది.. ఇక, తిరుపతి రూరల్ మండలంలోని పేరురు గ్రామంలో 25 ఎకరాల భూమినికి బదులుగా గతంలో ఓబరాయ్ హోటళ్ల గ్రూపుకు నిర్మాణానికి ఇచ్చిన టీటీడీ ల్యాండ్ బదిలీని రద్దు చేస్తూ కేబినెట్‌ నిర్ణయం తీసుకుంది.. ఎస్బీఐ, యూబీఐ బ్యాంకులకు 900 కోట్లు గ్యారెంటీని పవర్ సెక్టార్‌లో ఇస్తూ తీసుకున్న నిర్ణయానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.. మరోవైపు, హెయిర్ కటింగ్ సెలూన్లకు ఉచిత విద్యుత్ ను 150 యూనిట్ల నుండి 200 యూనిట్లకు పెంచే అంశంపై మంత్రిమండలిలో ఆమోదం లభించింది.. ఏపీఎస్‌పీడీసీఎల్‌, ఏపీ సీపీడీసీఎల్‌లకు 3545 కోట్లు, 1029 కోట్లు వరుసగా గతంలోనే పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ మంజూరు చేసిన బుణానికి గాను ప్రభ్యుత్వ గ్యారెంటీపై కేబినెట్‌లో నిర్ణయం తీసుకున్నారు..

సింగపూర్ పర్యటనపై కేబినెట్‌లో చర్చ.. గత ప్రభుత్వ పెద్దలు అక్కడకు వెళ్లి బెదిరించారు..!
ఏపీ కేబినెట్‌ సమావేశంలో తన సింగపూర్‌ పర్యటనకు సంబంధించిన వివరాలను మంత్రులకు వెల్లడించారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు.. సింగపూర్ పర్యటన వివరాలు గురించి కేబినెట్‌ సమావేశంలో సహచర మంత్రులకు చెప్పారు.. వైఎస్‌ జగన్ దెబ్బకు సింగపూర్ వాళ్లు ఎట్టి పరిస్థితుల్లో ఏపీకి రానని చెప్పారు.. సీడ్ క్యాపిటల్ లో భాగస్వామ్యం కాబోం అన్నారు.. అక్కడకు వెళ్లి సింగపూర్ మంత్రులను ఆనాడు జగన్ ప్రభుత్వ పెద్దలు బెదిరించారు.. కేసులు పెడతాం అని భయపెట్టారు.. వాళ్లను బెదిరించే పరిస్థితి అప్పుడు జరిగింది.. కానీ, పార్టనర్‌షిప్‌ సమ్మిట్ కు వాళ్లను రావాలని చెప్పాం.. సింగపూర్ తో స్నేహ సంబంధాలు కొనసాగించాలని చెప్పామని తెలిపారు సీఎం చంద్రబాబు.

లిక్కర్‌ కేసుపై మంత్రులకు చంద్రబాబు కీలక ఆదేశాలు..
ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరిగిన ఏపీ కేబినెట్‌ సమవేశంలో పలు కీలక అంశాలపై చర్చించి పలు కీలక నిర్ణయాలకు ఆమోదముద్ర వేశారు.. అయితే, కేబినెట్‌లో ఏపీ లిక్కర్ స్కామ్‌ కేసు అంశానికి సంబంధించి సీఎం చంద్రబాబు మంత్రుల తో ప్రస్తావించారు.. ప్రస్తుతం కేసు దర్యాప్తు దశలో ఉందన్నారు సీఎం చంద్రబాబు. దర్యాప్తు ఆధారంగా అరెస్టులు ఉంటాయన్నారు సీఎం చంద్రబాబు.. అయితే, లిక్కర్‌ కేసు విషయంలో మంత్రులు ఆచి తూచి స్పందించాలన్నారు. లిక్కర్ కేస్ సున్నితమైన అంశం కాబట్టి మంత్రులు కూడా.. దానిపై అతి స్పందించవద్దని.. ఏదిపడితే అది మాట్లాడొద్దని.. ఆచి తూచి స్పందించాలి అన్నారు సీఎం చంద్రబాబు.. అదే సమయంలో ఏపీ లిక్కర్‌ స్కామ్‌ కేసు విషయంలో వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ దుష్ప్రచారాన్ని కూడా ఖండించాలి.. ఆ పార్టీ నేతల వ్యాఖ్యలకు తిప్పికొట్టాల్సిన అవసరం ఎంతైనా ఉందని మంత్రులకు దిశానిర్దేశం చేశారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు..

రిజర్వేషన్లు ఇవ్వకపోతే మోడీని గద్దె దించుతాం
బీసీ రిజర్వేషన్లపై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరోసారి కేంద్రంపై తీవ్రంగా మండిపడ్డారు. ఢిల్లీలో మీడియాతో మాట్లాడిన ఆయన, “బీసీ బిల్లును కేంద్రం ఆమోదించకపోతే మోడీని గద్దె దించుతాం” అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. పార్లమెంట్‌లో బీసీ బిల్లుపై చర్చ జరగాలని కోరుతూ, విద్య, ఉద్యోగాలు, స్థానిక సంస్థల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించే బిల్లులను కేంద్రం వెంటనే ఆమోదించాలని రేవంత్ డిమాండ్ చేశారు. “బీసీ కోటా బిల్లులు కేంద్రం దగ్గర పెండింగ్‌లో ఉన్నాయి. నాలుగు నెలలుగా రాష్ట్రపతి దగ్గర కూడా ఈ బిల్లులు పెండింగ్‌లోనే ఉన్నాయి. అపాయింట్‌మెంట్ ఇవ్వమని కోరినా, రాష్ట్రపతి ఇప్పటివరకు సమయం కేటాయించలేదు,” అని ఆయన విమర్శించారు.

మహిళా ఎమ్మెల్యే అవమానం సిగ్గుచేటు.. రేవంత్ రెడ్డి క్షమాపణ చెప్పాలి
బీఆర్ఎస్ సీనియర్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి హరీశ్ రావు కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. మాజీ మంత్రి, సీనియర్ ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డిపై ప్రభుత్వం చూపిన వైఖరి అవమానకరమని, సిగ్గుచేటని ఆయన అన్నారు. ఈ ఘటనకు ముఖ్యమంత్రి ఏ. రేవంత్ రెడ్డి, గృహశాఖ బాధ్యతలు కూడా చేపట్టిన వ్యక్తిగా, నిస్సందేహ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. “మహిళా ఎమ్మెల్యేను బహిరంగంగా అవమానించడానికి, వేధించడానికి ఒక మంత్రి సమక్షంలోనే అనుమతించడం ఏమిటి? అంతేకాదు, పోలీసుల సహకారంతో ఇది జరగడం మరింత దిగజారుడు చర్య,” అని హరీశ్ రావు తీవ్రంగా విమర్శించారు.

ట్రంప్ సుంకాల పెంపు ప్రకటనపై స్పందించిన ఆర్బీఐ గవర్నర్..
భారత్‌పై సుంకాల పెంపు విషయంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ తన స్వరాన్ని మరింత పెంచారు. రానున్న 24 గంటల్లో భారత్‌పై సుంకాలను గణనీయంగా పెంచుతామని ఓ అంతర్జాతీయ వార్తాసంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో పేర్కొన్నారు. సుంకాల పెంపు అంశంపై తాజాగా ఆర్బీఐ గవర్నర్ స్పందించారు. డొనాల్డ్ ట్రంప్ భారతదేశంపై విధించిన సుంకాల ప్రభావాన్ని అంచనా వేయడం కష్టమని ఆర్‌బిఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా బుధవారం సూచించారు. తాజా ద్రవ్య విధాన కమిటీ (MPC) సమావేశం తర్వాత విలేకరుల సమావేశంలో మల్హోత్రా మాట్లాడారు. ట్రంప్ సుంకాల ప్రకటనలు, కొనసాగుతున్న వాణిజ్య చర్చల గురించి ప్రస్తావించారు. ఈ పరిణామాలు భారతదేశ వృద్ధిని ప్రభావితం చేస్తాయని అన్నారు. భారత ఆర్థిక వ్యవస్థ బలంగా ఉన్నప్పటికీ, సుంకాల వంటి ప్రపంచ వాణిజ్య సమస్యలు సవాళ్లను తీసుకురావచ్చన్నారు. “దీర్ఘకాలిక భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు, కొనసాగుతున్న ప్రపంచ అనిశ్చితులు, ప్రపంచ ఆర్థిక మార్కెట్లలో అస్థిరత నుంచి ఉత్పన్నమయ్యే ఎదురుగాలులు వృద్ధికి ఆటంకం కలిగించే అవకాశం ఉంది. అయినప్పటికీ భారత ఆర్థిక వ్యవస్థ స్థిరంగా ముందుకెళ్తోంది. వృద్ధి బలంగా ఉంది.” అని సంజయ్ ప్రకటించారు.

గంభీర్ కోచింగ్‌పై మాజీ క్రికెటర్ మహమ్మద్ కైఫ్ రివ్యూ..!
నరాలు తెగే ఉత్కంఠ మధ్య టీం ఇండియా తెందుల్కర్- అండర్సన్ ట్రోఫీలో ఐదో మ్యాచ్ గెలిచింది. గెలుపు కోసం మైదానంలో ఉన్న ప్లేయర్స్ మాత్రమే మరోకరూ కూడా తీవ్రంగా ఒత్తిడికి గురయ్యారు. ఆయన మరెవరో కాదు టీం ఇండియా చీఫ్ కోచ్ గౌతమ్ గంభీర్. టీమ్ ఇండియా మాజీ క్రికెటర్ మహమ్మద్ కైఫ్ తన యూట్యూబ్ ఛానల్లో ఈ టెస్ట్ సిరీస్ మీద, చీఫ్ కోచ్‌పై తన అభిప్రాయాలను వ్యక్తం చేశారు. కైఫ్ కోచ్‌గా గౌతమ్ గంభీర్ తీసుకున్న నిర్ణయాలపై మాట్లాడుతూ.. ‘మనమంతా బుమ్రా గైర్హాజరీలో కుల్‌దిప్‌ను ఆడించాలన్నాం. కానీ గంభీర్ బ్యాటింగ్ డెప్త్ గురించి ఆలోచించాడు. బ్యాటింగ్లో రవీంద్ర జడేజా, వాషింగ్టన్ సుందర్‌ను చూశాం. బ్యాటింగ్లో డెప్త్ ఉండటం వల్లే టీమ్ ఇండియా భారీ స్కోర్లు చేయగలిగింది. అతడు ఎనిమిదో స్థానం వరకు బ్యాటర్లు ఉండాలని కోరుకున్నాడు. అతడి నిర్ణయమే సరైనదని నిరూపించుకున్నాడు. ఈ కారణంగా భారత్ ఈ సిరీస్‌ను డ్రా చేసుకుందనడంలో సందేహం లేదు. గంభీర్ తీసుకున్న నిర్ణయం సరైనదే అని అభిప్రాయం వ్యక్తం చేశాడు. అంతగా అనుభవం లేని యువ ఆటగాళ్లతో ప్రస్తుతం టీమ్ ఇండియా నిండి ఉంది. ఈ నేపథ్యంలో కోచ్‌గా గంభీర్ మీద ఎంత ఒత్తిడి ఉండి ఉంటుందో నేను అర్థం చేసుకోగలను.. అని పేర్కొన్నాడు.

బ్యాడ్ గర్ల్స్ సినిమాలో రేణూ దేశాయ్
‘30 రోజుల్లో ప్రేమించడం ఎలా’ సినిమాతో మంచి విజయాన్ని అందుకున్న డైరెక్టర్ మున్నా ధులిపూడి నుంచి వస్తున్న మరో చిత్రం ‘బ్యాడ్ గాళ్స్’. ‘కానీ చాలా మంచోళ్లు’ అనేది ట్యాగ్ లైన్. అంచల్ గౌడ, పాయల్ చెంగప్ప, రోషిణి, యష్ణ లీడ్ రోల్స్‌లో నటిస్తున్న ఈ చిత్రంలో రోహన్ సూర్య, మొయిన్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. నీలి నీలి ఆకాశం క్రియేషన్స్, ప్రశ్విత ఎంటర్‌టైన్‌మెంట్, ఎన్‌వీఎల్ క్రియేషన్స్ బ్యానర్స్‌పై శశిధర్ నల్లా, ఎమ్మాడి సోమ నర్సయ్య, రామిశెట్టి రాంబాబు, రావుల రమేష్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఆస్కార్ విన్నర్ లిరిసిస్ట్ చంద్రబోస్ సాహిత్యం అందిస్తున్న ఈ చిత్రానికి అనూప్ రూబెన్స్ సంగీతం అందిస్తున్నారు. ఈ చిత్రం టైటిల్‌ మోషన్ పోస్టర్‌ను ప్రసాద్ ల్యాబ్‌లో నిర్వహించిన గ్రాండ్ ప్రెస్‌మీట్‌లో దర్శకులు చందూ మొండేటి, శివ నిర్వాణ, కృష్ణ చైతన్య ముఖ్య అతిథులుగా పాల్గొని రివీల్ చేశారు.

సంధ్య థియేటర్‌ తొక్కిసలాట ఘటనపై మానవ హక్కుల కమిషన్‌ సీరియస్‌
హైదరాబాద్‌లోని సంధ్య థియేటర్‌లో జరిగిన ‘పుష్ప’ సినిమా ప్రివ్యూ షో సందర్భంగా చోటుచేసుకున్న తొక్కిసలాట ఘటనపై తెలంగాణ రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ (TSHRC) తీవ్రంగా స్పందించింది. ఈ ఘటనలో జరిగిన మానవ హక్కుల ఉల్లంఘనలపై విచారణ చేపట్టిన కమిషన్, రాష్ట్ర చీఫ్ సెక్రటరీకి నోటీసులు జారీ చేసింది. అలాగే, ఈ ఘటనలో ప్రాణాలు కోల్పోయిన బాధితుల కుటుంబాలకు రూ.5 లక్షల చొప్పున పరిహారం చెల్లించాలని ఆదేశించింది. ఈ ఘటనలో పోలీసుల పాత్రపై కూడా సంపూర్ణ నివేదిక సమర్పించాలని కమిషన్ స్పష్టం చేసింది.

బెట్టింగ్ యాప్ అనకండి నేను గేమింగ్ యాప్ ప్రమోట్ చేశా !
హీరో విజయ్ దేవరకొండ బెట్టింగ్ యాప్ కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) విచారణను ఎదుర్కొన్నారు. ఈ కేసులో తన పేరు రావడంతో హైదరాబాద్‌లోని ఈడీ కార్యాలయంలో విచారణకు హాజరైన విజయ్, తాను ప్రమోట్ చేసిన A23 యాప్‌కు సంబంధించి సమగ్ర సమాచారం అందించి, తన వైఖరిని మీడియాకి స్పష్టం చేశారు. విజయ్ దేవరకొండ ఈడీ విచారణలో బెట్టింగ్ యాప్స్ మరియు గేమింగ్ యాప్స్ మధ్య తేడాను స్పష్టంగా వివరించారు. దేశంలో ఈ రెండు రకాల యాప్స్ వేర్వేరు స్వభావం కలిగి ఉన్నాయని, తాను ప్రమోట్ చేసిన A23 యాప్ ఒక గేమింగ్ యాప్ అని ఆయన తెలిపారు. బెట్టింగ్ యాప్స్‌కు, గేమింగ్ యాప్స్‌కు ఎలాంటి సంబంధం లేదని ఆయన నొక్కి చెప్పారు.

Exit mobile version