NTV Telugu Site icon

Top Headlines @ 5 PM: టాప్‌ న్యూస్‌

Top Headlines @ 5 Pm New

Top Headlines @ 5 Pm New

ఏపీ విజన్ డాక్యుమెంట్ 2047పై సర్కార్‌ కసరత్తు..
క్రమంగా రాష్ట్ర అభివృద్ధిపై ఫోకస్‌ పెడుతోంది ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం.. దాని కోసం ఓ విజన్‌తో ముందుకు సాగాలనే నిర్ణయానికి వచ్చారు.. అందులో భాగంగా ఏపీ విజన్ డాక్యుమెంట్- 2047 టార్గెట్‌గా పెట్టుకోనున్నారు.. ఇక, ఏపీ విజన్ డాక్యుమెంట్- 2047 రూపకల్పనపై ప్రభుత్వం కసరత్తు ప్రారంభించింది.. అధికారులతో ప్రణాళికా శాఖ ముఖ్య కార్యదర్శి పీయూష్ కుమార్ సమావేశం అయ్యారు.. విజన్ డాక్యుమెంటులో పొందుపర్చాల్సిన అంశాలపై చర్చించారు.. ప్రధాని నరేంద్ర మోడీ చేతుల మీదుగా ఏపీ విజన్ డాక్సుమెంట్ – 2047 విడుదల చేయించాలని రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆలోచిస్తున్నారని పీయూష్ ఈ సందర్భంగా వెల్లడించారు.. రాష్ట్ర అవసరాలు, ముఖ్యమంత్రి చంద్రబాబు ఆలోచనలకు అనుగుణంగా విజన్ డాక్యుమెంట్ ఉంటుందన్నారు ప్రణాళిక శాఖ ముఖ్య కార్యదర్శి పీయూష్ కుమార్.. విజన్ డాక్యుమెంట్ రూపకల్పనకు అన్ని శాఖల అధికారులు సహకరించాలని సూచించారు.. నీతి ఆయోగ్ ఇప్పటికే ముసాయిదా విజన్ డాక్యుమెంట్ ఇచ్చిందన్నారు.. రాష్ట్రంలో అందుబాటులో ఉన్న వనరులు, పరిస్థితులు, అభివృద్దికి గల అవకాశాలను పేర్కొంటూ విజన్ డాక్యుమెంట్ రాయాలన్నారు.. ఆరోగ్యం, సంక్షేమం, ఆర్థిక వృద్ధి, సామాజిక పురోగతి, పర్యావరణ సుస్థిరత, స్థిరమైన అభివృద్ది, సుపరిపాలన వంటివి విజన్ డాక్యుమెంటులో ఉండాలని అధికారులకు స్పష్టం చేశారు ప్రణాళికా శాఖ ముఖ్య కార్యదర్శి పీయూష్ కుమార్.

ఏపీలో యూట్యూబ్ అకాడమీ.. సీఎం చంద్రబాబు కీలక చర్చలు
ఆంధ్రప్రదేశ్‌లో పెట్టుబడులే లక్ష్యంగా పనిచేస్తోంది కూటమి ప్రభుత్వం.. రాష్ట్రంలో టీడీపీ-జనసేన-బీజేపీ కూటమి సర్కార్‌ ఏర్పడిననాటి నుంచి పెట్టుబడులకు ఉన్న అవకాశాలపై దృష్టిసారిస్తున్నారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు.. డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌.. ఇక, ఏపీలో మరో ప్రతిష్టాత్మక సంస్థ అడుగుపెట్టనుంది.. ఆంధ్రప్రదేశ్‌లో యూట్యూబ్‌ అకాడమీ ఏర్పాటు కాబోతోంది.. ఈ విషయాన్ని సోషల్‌ మీడియా వేదికగా వెల్లడించారు సీఎం చంద్రబాబు.. యూట్యూబ్ గ్లోబల్ సీఈవోతో చర్చలు జరిపిన విషయాన్ని ట్విట్టర్‌ (ఎక్స్‌) వేదికగా వెల్లడించారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు.. ఆన్ లైన్‌లో యూట్యూబ్ గ్లోబల్ సీఈవోతో చర్చలు జరిపినట్లుగా ట్వీట్‌ చేశారు.. యూట్యూబ్ గ్లోబల్ సీఈవో నీల్ మోహన్, గూగుల్ APAC హెడ్ సంజయ్ గుప్తాలతో సమావేశమయ్యాను. లోకల్ పార్టనర్లతో కలిసి యూట్యూబ్ అకాడమీ ఏర్పాటు చేయాలని ఆహ్వానించాం. కంటెంట్, స్కిల్ డెలవప్‌మెంట్, ఏఐ, సర్టిఫికేషన్ ప్రోగ్రామ్స్ వంటి వాటిపై ప్రత్యేకంగా అకాడమీలో పరిశోధనలు చేయవచ్చు అన్నారు.. అందుకే అమరావతిలో భాగమైన మీడియా సిటీలో యూట్యూబ్ అకాడమీని ఏర్పాటు చేయమని కోరినట్టు సోషల్‌ మీడియా వేదికగా పేర్కొన్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు.

సీఎం చంద్రబాబుతో గోనె ప్రకాష్‌ భేటీ.. మాజీ సీఎంలపై హాట్‌ కామెంట్స్..
ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుని కలిసిన తెలంగాణ ప్రాంతానికి చెందిన మాజీ ఎమ్మెల్యే, ఆర్టీసీ మాజీ చైర్మన్‌ గోనె ప్రకాష్‌ రావు.. ఉభయ తెలుగు రాష్ట్రాల మాజీ సీఎంలపై హాట్‌ కామెంట్లు చేశారు.. చంద్రబాబును మర్యాద పూర్వకంగా కలిసిన అనంతరం మీడియాతో మాట్లాడిన ఆయన.. ప్రజాదర్భార్‌లు నిర్వహించి సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్ ప్రజలకు మంచి చేస్తున్నారని ప్రశంసలు కురిపించారు.. ఇక, గత ప్రభుత్వం అసలు ప్రజల సమస్యల గురించి పట్టించుకోలేదని విమర్శించారు.. ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ రాష్ట్రాల్లో రావణాసురుడు, శిశుపాలుడి పాలన పోయిందని కామెంట్‌ చేశారు.. బంధువులే తనకు తెలీదంటూ సీబీఐ కోర్టుకు అబద్దాలు చెప్పిన జగన్ దుర్మార్గుడు అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.. మరోవైపు.. తెలంగాణలో ప్రైవేటు భూమి అయినా కొనుగోలు చేసి ఏపీ మంచి అతిథి గృహం నిర్మించాలని సూచించారు గోనె ప్రకాష్‌.. జన్మభూమి లాంటి కార్యక్రమాలు చంద్రబాబు చేపడితే విదేశీ విరాళాలు ఇప్పించేందుకు కృషి చేస్తానన్న ఆయన.. ఏపీలో 36 మందిని హత్య చేసినట్టుగా చెబుతున్న వైఎస్‌ జగన్.. వాటి వివరాలు బహిర్గతం చేయాలి అని డిమాండ్‌ చేశారు.. దేశంలోని ఏ ముఖ్యమంత్రీ జగన్ లా పరదాలు కట్టుకుని పర్యటించలేదని ఎద్దేవా చేశారు.. రాష్ట్రపతి పాలన అంటూ డిమాండ్ చేసిన జగన్ కు సిగ్గు ఉందా..? అంటూ ఫైర్‌ అయ్యారు.. ప్రజల నుంచి పూర్తి మెజార్టీ వచ్చాక రాష్ట్రపతి పాలన ఎలా అనుమతిస్తారు..? అని ప్రశ్నించారు గోనె ప్రకాష్‌రావు..

ఆగస్టు 15న రూ.2 లక్షల వరకు రుణమాఫీ.. మంత్రి కీలక ప్రకటన
రుణమాఫీపై పత్రికల్లో వచ్చిన వార్తలు, ప్రతిపక్షాలు చేస్తున్న ఆరోపణల్లో వాస్తవాలు లేవని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పేర్కొన్నారు. స్వాతంత్య్ర దినోత్సవం రోజున వైరాలో 2 లక్షల వరకు రుణమాఫీ కార్యక్రమాన్ని సీఎం రేవంత్‌ రెడ్డి ప్రారంభిస్తారని మంత్రి తెలిపారు. కొంత మంది రుణమాఫీపై వాట్సాప్ ద్వారా సమస్యలు చెప్పాలని అంటున్నారని.. అదే వాట్సాప్ ద్వారా గతంలో రుణమాఫీ చేయని రైతుల వివరాలు తీసుకుని మాఫీ చేస్తే బాగుంటుందని పేర్కొ్న్నారు. రైతు రుణమాఫీలో ఏది బాగోలేక పోయినా అందుకు గత ప్రభుత్వమే కారణం కారణమన్నారు. కాంగ్రెస్ పార్టీ వరంగల్ డిక్లరేషన్‌లో రుణమాఫీ చేస్తామని చెప్పి చేసిందని.. ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నా ప్రభుత్వం అన్న మాట నిలబెట్టుకోవడం కోసం రుణమాఫీ చేస్తున్నామని చెప్పారు. ఈ నెలలో మూడో విడత రుణమాఫీ చేస్తామన్నారు. రైతాంగ మనోధైర్యాన్ని దెబ్బతీయ వద్దని మంత్రి సూచించారు. ఇప్పటి వరకు చేసిన రుణమాఫీలో 30 వేల ఖాతాల్లో సాంకేతిక ఇబ్బందులు వచ్చాయని ఆయన చెప్పారు. వాస్తవానికి రాహుల్ గాంధీ ప్రకటన చేసిన మే నెల నుంచే రుణమాఫీ చేయాల్సి ఉంది. కానీ రైతులను దృష్టిలో పెట్టుకుని ఐదు సంవత్సరాలను పరిగణనలోకి తీసుకున్నామన్నారు. పాస్ బుక్ లేకపోయినా తెల్ల రేషన్ కార్డును పరిగణనలోకి తీసుకున్నామన్నారు. ఇప్పటికే 17 వేల ఖాతాలకు సంబంధించి సమస్యలు పరిష్కరించామని.. గతంలో అధికారంలో ఉండి ఏమి చేయలేని వారు కోడిగుడ్డు మీద ఈకలు పీకే ప్రయత్నాలు మానుకోవాలన్నారు.

జయశంకర్‌కు నివాళులు అర్పించిన గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ
తెలంగాణ సిద్ధాంత కర్త, ప్రొఫెసర్ జయశంకర్‌ జయంతి సందర్భంగా రాజ్‌భవన్‌లో కార్యక్రమాన్ని నిర్వహించారు. గవర్నర్‌ జిష్ణు దేవ్‌ వర్మ ఆయన చిత్రపటానికి నివాళులు అర్పించారు. తెలంగాణ రాష్ట్ర ఆకాంక్షను యావత్ ప్రపంచానికి చాటి చెప్పి ప్రత్యేక రాష్ట్ర సాధనకు జీవితాన్ని త్యాగం చేసిన గొప్ప మహనీయుడు జయశంకర్ అని ఆయన అన్నారు. అంతకు ముందు బీఆర్‌ఎస్‌ వర్కింగ్ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ కూడా జయశంకర్‌కు నివాళులు అర్పించారు. ట్విట్టర్‌లో కేటీఆర్‌ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా పుట్టుక మీది.. చావు మీది.. బతుకంతా తెలంగాణది అని జయశంకర్ సార్ చెప్పిన మాటలను గుర్తు చేశారు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం తన జీవితాన్ని ధారబోసిన తెలంగాణ సిద్ధాంతకర్త ప్రొఫెసర్ కొత్తపల్లి జయశంకర్ జయంతి సందర్భంగా ఘన నివాళులు అర్పించారు. ” తెలంగాణ ఉద్యమ భావజాల వ్యాప్తికి జయశంకర్ సార్ చేసిన కృషి అనిర్వచనీయం అంటూ.. స్వరాష్ట్ర సాధనలో ఒక దిక్సూచిగా నిలిచిన వారి కీర్తి అజరామరమైనదని, వారి స్ఫూర్తి మరిచిపోలేనిది అని కొనియాడారు. ఇక సార్ అడుగుజాడల్లోనే తెలంగాణ రాష్ట్ర పోరాటం కొనసాగిందని, తెలంగాణ ప్రగతి ప్రస్థానానికి అడుగులు పడ్డాయని చెబుతూ.. చివరగా జోహార్ జయశంకర్ సార్!, జై తెలంగాణ” అని కేటీఆర్ నినదించారు. కాగా తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఉద్యమంలో ప్రొఫెసర్ జయశంకర్ కీలక పాత్ర పోషించారు. ప్రత్యేక రాష్ట్ర సాధన పోరాటానికి విద్యార్థులను, నాయకులను ఏకం చేస్తూ.. ఉద్యమానికి ఊపిరులు ఊదుతూ.. రాష్ట్ర సాధనే జీవిత లక్ష్యంగా జీవించారు. చివరికి రాష్ట్ర సాధనకు ముందే 2011, జూన్ 21న తుదిశ్వాస విడిచారు.

ఎల్.కే అద్వానీకి మళ్లీ అస్వస్థత.. ఢిల్లీ అపోలో ఆస్పత్రిలో చేరిక
మాజీ ఉప ప్రధాని, బీజేపీ సీనియర్ నేత ఎల్.కే అద్వానీ ఆరోగ్యం మళ్లీ క్షీణించింది. దీంతో.. ఢిల్లీలోని అపోలో ఆస్పత్రిలో చేరారు. ప్రస్తుతం అతని పరిస్థితి నిలకడగా ఉందని సంబంధిత వర్గాలు తెలిపాయి. న్యూరాలజీ విభాగంలో చేరిన ఆయన.. ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని, అబ్జర్వేషన్‌లో ఉంచామని అపోలో ఆస్పత్రి వైద్యులు తెలిపారు. గత వారం కూడా ఎల్.కే అద్వానీ న్యూఢిల్లీలోని ఎయిమ్స్‌లో చేరారు. డాక్టర్ ఫాలోఅప్ కోసం రావాలని సూచించారు. జూన్ 26వ తేదీన ఆయన ఆరోగ్యం క్షీణించడంతో.. ఢిల్లీలోని ఎయిమ్స్‌లో చేరారు. ఆయనను రెండ్రోజుల పాటు ఎయిమ్స్‌లోని వృద్ధాప్య విభాగం వైద్యుల పర్యవేక్షణలో ఉంచారు. అనంతరం.. డిశ్చార్జ్ అయ్యారు. తాజాగా మళ్లీ ఢిల్లీ అపోలో ఆస్పత్రిలో చేరారు. ఎల్.కే అద్వానీ 2014 నుంచి క్రియాశీలక రాజకీయాలకు దూరంగా ఉన్నారు. అద్వానీ 2002 నుండి 2004 వరకు భారత ఉప ప్రధానమంత్రిగా ఉన్నారు. 1999 నుంచి 2004 వరకు కేంద్ర హోంమంత్రిగా కూడా పనిచేశారు. బిజెపి ఏర్పాటులో ముఖ్యమైన పాత్రకు పేరుగాంచిన ఆయన భారత రాజకీయాల్లో ప్రముఖ వ్యక్తి. మరోవైపు.. ఈ ఏడాది మార్చిలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అద్వానీని భారతదేశ అత్యున్నత పౌర పురస్కారం భారతరత్నతో సత్కరించారు.

బంగ్లాదేశ్ ప్రధానిగా ఖలీదా జియా? బ్యాగ్రౌండ్ ఇదే..!
బంగ్లాదేశ్‌లో రాజకీయలు శరవేగంగా మారుతున్నాయి. షేక్ హసీనా.. బంగ్లాదేశ్‌ను విడిచిపెట్టడంతో కొత్త ప్రభుత్వం ఏర్పాటుకు సన్నాహాలు జరుగుతున్నాయి. షేక్ హసీనా రాజకీయ ప్రత్యర్థి, మాజీ ప్రధాని ఖలీదా జియా (78)  మళ్లీ అధికారాన్ని చేపట్టే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం జైల్లో మగ్గుతున్న ఆమెను విడిచిపెట్టాలని అధ్యక్షుడు మహమ్మద్‌ షాబుద్దీన్ ఆదేశాలు ఇవ్వడంతో విడుదలయ్యారు. హసీనా దేశాన్ని విడిచివెళ్లగానే విదేశీ విరాళాల కుంభకోణం కేసులో పదిహేడేళ్ల జైలుశిక్ష అనుభవిస్తున్న జియా విడుదలకు అధ్యక్షుడు మహమ్మద్‌ షాబుద్దీన్ ఆదేశాలు ఇచ్చారు. ఖలీదా జియా మూడుసార్లు ప్రధానిగా పని చేసిన అనుభవం ఉంది. ఖలీదా జియా (78) బంగ్లాదేశ్ మొదటి మహిళా ప్రధానమంత్రి. 1991లో ప్రధాని బాధ్యతలు చేపట్టింది. 1996లో జియా రెండోసారి గెలిచారు. కేవలం 12 రోజులు మాత్రమే ప్రధాని పదవిలో కొనసాగింది. అటు తర్వాత షేక్ హసీనా ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. తిరిగి ఐదేళ్ల తర్వాత ఖలీదా జియా అధికారంలోకి వచ్చింది. 2007లో అవినీతి ఆరోపణలపై జియా అరెస్ట్ అయింది. 2018లో ఆమెను కోర్టు దోషిగా తేల్చడంతో జైలుకెళ్లింది. అనేక ఆరోగ్య సమస్యలు కారణంగా ఎక్కువ కాలంలో ఆస్పత్రిలోనే గడిపింది.

ఫ్లాట్‌గా ముగిసిన స్టాక్ మార్కెట్
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు ఫ్లాట్‌గా ముగిశాయి. మంగళవారం ఉదయం భారీ లాభాలతో ప్రారంభమైన సూచీలు.. చివరికి నష్టాల్లో ముగిశాయి. సోమవారం భారీ నష్టాలను చవిచూసిన సూచీలు.. మంగళవారం అదే ఒరవడి కొనసాగుతుందని ఇన్వెస్టర్లు భావించారు. కానీ ఆసియా-పసిఫిక్ మార్కెట్‌లోని సానుకూలతలు మన మార్కెట్‌కు దన్నుగా నిలిచాయి. కానీ చివరిలో మాత్రం నిరాశ పరిచింది. సెన్సెక్స్ 166 పాయింట్లు నష్టపోయి 78, 593 దగ్గర ముగియగా.. నిఫ్టీ 63 పాయింట్లు నష్టపోయి 23, 992 దగ్గర ముగిసింది. ఇక రూపాయి మారకం విలువ డాలర్‌తో పోలిస్తే 83.95 దగ్గర రికార్డ్ స్థాయి దగ్గర ముగిసింది. నిఫ్టీలో హెచ్‌డిఎఫ్‌సీ లైఫ్, ఎస్‌బీఐ లైఫ్ ఇన్సూరెన్స్, శ్రీరామ్ ఫైనాన్స్, బీపీసీఎల్, ఎస్‌బీఐ నష్టపోగా… బ్రిటానియా ఇండస్ట్రీస్, జెఎస్‌డబ్ల్యు స్టీల్, హెచ్‌యుఎల్, ఎల్ అండ్ టి మరియు టెక్ మహీంద్రా లాభపడ్డాయి. సెక్టార్లలో ఆటో, బ్యాంక్, ఆయిల్ అండ్ గ్యాస్ 0.5 శాతం చొప్పున క్షీణించగా.. ఐటీ, మెటల్, రియాల్టీ 0.3-0.8 శాతం చొప్పున పెరిగాయి. బీఎస్‌ఈ మిడ్‌క్యాప్‌, స్మాల్‌క్యాప్‌ సూచీలు 0.5 శాతం చొప్పున నష్టపోయాయి.

ఫైనల్స్ కు దూసుకెళ్లిన నీరజ్ చోప్రా..
పారిస్ ఒలింపిక్స్ 2024లో భారత స్టార్ జావెలిన్ త్రోయర్ నీరజ్ చోప్రా క్వాలిఫికేషన్‌లో అద్భుత ప్రదర్శన చేసి ఫైనల్స్‌ లోకి ప్రవేశించాడు. గ్రూప్ Bలో ఉన్న నీరజ్ 89.34 మీటర్ల దూరం విసరడంతో ఫైనల్‌ లోకి ప్రవేశించాడు. ఈ ఈవెంట్‌లో 84 మీటర్ల మార్కు నేరుగా ఫైనల్‌ కు అర్హత సాధించేలా సెట్ చేయబడింది. కాగా, భారత్‌కు చెందిన మరో త్రోయర్ కిషోర్ జెనా 80.73 మీటర్ల బెస్ట్ ఎఫర్ట్ సాధించగలిగాడు. దాంతో అతను ఫైనల్ కి అర్హత సాదించలేకపోయాడు. ప్రస్తుతం జరుగుతున్న ప్యారిస్ గేమ్స్‌లో పతకం సాధించడంలో సఫలమైతే నీరజ్ చోప్రా కూడా 2 ఒలింపిక్ పతకాల భారత ఆటగాళ్ల జాబితాలో చేరతాడు. వ్యక్తిగత ఈవెంట్‌లో ఇప్పటివరకు నార్మన్ ప్రిచర్డ్, సుశీల్ కుమార్, పివి సింధు, మను భాకర్ భారతదేశం నుండి 2 ఒలింపిక్ పతకాలు సాధించారు. ఇక గ్రూప్ Aలో ఉన్న కిషోర్ క్వాలిఫికేషన్‌లో తొలి ప్రయత్నంలోనే 80.73 మీటర్ల దూరాన్ని క్లియర్ చేశాడు. దీని తర్వాత అతను తన రెండవ ప్రయత్నాన్ని నమోదు చేయలేదు. ఇక తన మూడవ చివరి ప్రయత్నంలో అతను జావెలిన్‌ను 80.21 మీటర్ల దూరం విసిరాడు. అటువంటి పరిస్థితిలో అతను నేరుగా ఫైనల్స్‌ కు అర్హత సాధించే అవకాశాన్ని కోల్పోయాడు. అతని బృందంలోని నలుగురు ఆటగాళ్ళు జావెలిన్‌ ను 84 మీటర్ల మార్కు కంటే ఎక్కువ విసిరారు.

సెమీస్కు దూసుకెళ్లిన వినేష్ ఫోగట్..
పారిస్ ఒలింపిక్స్లో భారత మహిళా రెజ్లర్ వినేష్ ఫోగట్ అద్భుత ప్రదర్శన కనబరిచింది. క్వార్టర్ ఫైనల్ మ్యాచ్‌లో విజయం సాధించి సెమీ ఫైనల్స్లోకి దూసుకెళ్లింది. ఉక్రెయిన్ కు చెందిన ప్రొవోకేషన్‌ను 7–5తో ఓడించింది. దీంతో.. సెమీస్ లోకి ప్రవేశించింది. ఇప్పుడు తను పతకాన్ని సాధించేందుకు కేవలం ఒక గెలుపు దూరంలో ఉంది. కాగా.. ఈరోజు రాత్రి 10:15 గంటలకు సెమీ ఫైనల్ మ్యాచ్ జరగనుంది. కాగా.. ఇంతకుముందు జరిగిన క్వార్టర్ ఫైనల్స్ మ్యాచ్ లో ప్రపంచ నంబర్ వన్, 2020 టోక్యో ఒలింపిక్స్ ఛాంపియన్ జపాన్ రెజ్లర్ సుసాకితో తలపడి 3-2 తేడాతో విజయం సాధించి.. క్వార్టర్ ఫైనల్స్ లోకి అడుగుపెట్టింది.

‘బిగ్ పవర్’’.. ఇజ్రాయిల్ మారణహోమాన్ని ఆపగలదు..
హమాస్ చీఫ్ ఇస్మాయిల్ హనియే హత్య పశ్చిమాసియా దేశాల్లో ఉద్రిక్తతలకు కారణమైంది. ఇరాన్-ఇజ్రాయిల్ మధ్య ఏక్షణమైనా యుద్ధం జరిగే అవకాశం కనిపిస్తోంది. ఇరాన్ అధ్యక్షుడు ప్రమాణస్వీకార కార్యక్రమానికి టెహ్రాన్ వచ్చిన సమయంలో హనియే హత్య జరిగింది. అయితే, ఈ హత్య చేసింది ఇజ్రాయిల్‌ అని ఇరాన్‌తో పాటు దాని ప్రాక్సీలు హమాస్, హిజ్బుల్లా ఆరోపిస్తున్నాయి. ఈ దాడికి తప్పకుండా పరిణామాలు ఎదుర్కోవాల్సిందే అని ఇజ్రాయిల్‌కి ఇరాన్ వార్నింగ్ కూడా ఇచ్చింది. ఈ నేపథ్యంలో ఇరాన్ యుద్ధానికి సిద్ధపడినట్లు తెలుస్తోంది. ఇప్పటికే హిజ్బుల్లా లెబనాన్ నుంచి ఇజ్రాయిల్ ఉత్తర ప్రాంతంపై వరసగా దాడులకు చేస్తోంది. ఇదిలా ఉంటే భారతదేశంలో ఇరాన్ రాయబారి డాక్టర్ ఇరాజ్ ఎలాహి మాట్లాడుతూ, ఇజ్రాయిల్ మారణహోమాన్ని ఆపే శక్తి భారత్‌కి ఉందని అన్నారు. గాజాలో ఇజ్రాయిల్ దాడులు ప్రారంభమైనప్పటి నుంచి తాను భారత్ ఒక ముఖ్యమైన దేశమని, బిగ్ పవర్ అని, అంతర్జాతీయ సమాజంలో ప్రభావవంతమైన దేశం అని తాను పదేపదే ప్రస్తావించిన విషయాన్ని ఆయన వెల్లడించారు. ఈ ప్రాంతంలో సంక్షోభంలో ఇండియా చురుకైన పాత్ర పోషించగలదని, ఇజ్రాయిల్ పాలక పక్షంతో, ఇజ్రాయిల్ ప్రభుత్వంతో భారత్ మంచి సంబంధాలు కలిగి ఉందని, గాజాలో మారణహోమాన్ని ఆపడానికి, నేరాలు తగ్గించడానికి, పాలస్తీనాలో శాంతిని నెలకొల్పడానికి వారిని ఒప్పేంచే దేశం భారత్ అని ఆయన అన్నారు. ఈ ప్రాంతంలో శాంతిని నెలకొల్పడానికి భారత్ తన ప్రభావాన్ని, శక్తిని ఉపయోగించుకునేలా మేము ఒప్పించేందుకు ప్రయత్నిస్తున్నామని ఆయన చెప్పారు.

లారెన్స్ సినిమా అవకాశం ఇప్పిస్తానని ప్రకటన.. మొత్తం సమర్పించిన మోడల్!
సినిమాలో అవకాశం ఇప్పిస్తానని లక్షలు తీసుకుని మోసం చేసిన ఉదంతం ఒకటి వెలుగులోకి వచ్చింది. ఈ మేరకు ఉన్న ఆన్ లైన్ యాడ్ చూసి యువతి మోసపోయింది. మోడల్ నందితా కె శెట్టిని సురేష్ కుమార్ తమిళ చిత్రం హంటర్‌లో అవకాశం ఇప్పిస్తానని చెప్పి మోసం చేశాడని ఆరోపణలు వచ్చాయి. నందితా కె శెట్టి తాను మోసపోయినట్టు పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఇన్‌స్టాగ్రామ్‌లో హంటర్ సినిమా ప్రకటనను చూసి అప్పుడు నేను అక్కడ ఉన్న కాంటాక్ట్ నంబర్‌కి కాల్ చేసానని నందితా కె శెట్టి పేర్కొంది. సినిమాలో అవకాశం రావాలంటే ఆర్టిస్ట్ కార్డ్ ఉండాలని చెబితే దానికి 12,500 పంపానని ఆమె పేర్కొంది. ఇక అగ్రిమెంట్ స్టాంప్ డ్యూటీగా 35వేలు కూడా ఇచ్చి మోసపోయానని ఆమె పేర్కొంది. ఆ తర్వాత షూటింగ్ కోసం మలేషియా వెళ్లాలి. మీ నాన్నగారి పాస్‌పోర్టు, మీ పాస్‌పోర్టు కావాలని ఫ్లైట్ టికెట్ కోసం సురేష్ 90 వేలు వసూలు చేశాడని ఆమె పేర్కొంది. ఇలా మొత్తం 1.71 లక్షలు పొంది సురేష్ కుమార్ తనను మోసం చేశాడని ఆమె పేర్కొంది. అనుమానం వచ్చిన నందితా కె శెట్టి విచారణ చేయగా అసలు విషయం బయటపడింది. యువతి ఫిర్యాదు మేరకు కోననకుంటె పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసి ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేశారు. పోలీసులు విచారణ కొనసాగిస్తున్నారు. తమిళ నటుడు, దర్శకుడు రాఘవ లారెన్స్ 25వ చిత్రం హంటర్. ఈ హంటర్ సినిమా కోసం నటీమణుల కోసం ఆడిషన్ ఉందని ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్ చూసి నందిత తన వివరాలు పంపి మోసానికి గురైంది.