NTV Telugu Site icon

Top Headlines @ 5 PM: టాప్‌ న్యూస్‌

Top Headlines @ 5 Pm New

Top Headlines @ 5 Pm New

కొల్లేరుకు బుడమేరు ముంపు గండం..
బుడమేరు కాలువకు గండ్లు పడడంతో.. విజయవాడలోని కొన్ని ప్రాంతాల్లు అతలాకుతలం అయ్యాయి.. అయితే, ఇప్పుడు కొల్లేరు చేపల చెరువులకు బుడమేరు ముంపు గండం పొంచిఉంది.. బుడమేరుకు వరద పెరగటంతో వేల ఎకరాల్లో ఉన్న చెరువులకు ముంపు వాటిల్లే అవకాశం ఉంది అంటున్నారు.. ఇవాళ సాయంత్రానికి బుడమేరు వరద మరింత పెరుగుతుందని హెచ్చరిస్తున్నారు.. మరో రెండు అడుగులు వరద పెరిగితే 10 వేల ఎకరాల్లో చెరువులు నీట మునుగుతాయనే భయంతో వ్యాపారుల ఆందోళన నెలకొంది.. ఇప్పటికే పెనుమాక లంక, నందిగామ లంక, ఇండ్లు పాడు లంక, మనుగులూరు లంకకి రవాణా సంబంధాలు తెగిపోయాయి.. వరద ముంపు భయంతో చెరువుల చుట్టూ వలలు కట్టేందుకు నిర్వాహకులు సిద్ధం అవుతున్నారు.. ఇక, కొల్లేరులో నీటి మట్టం పెరుగుతోంది. కొల్లేరు సరస్సు అంతర్భాగంలో మూడు టీఎంసీల నీటి నిల్వ సామర్ధ్యం ఉండగా.. తమ్మిలేరు, రామిలేరు, బుడమేరు వాగులతోపాటు కృష్ణ కాలువల్లో భారీ వరద కొల్లేరుకు చేరుతోంది. ఈ నీరంతా నేరుగా ఉప్పుటేరులో కలుస్తుంది. భారీ వరదలతో లంక గ్రామాల చుట్టూ ఇప్పటికే పూర్తిగా నీరు చేరింది. కొన్ని లంకలకు రాకపోకలు నిలిచిపోయాయి. మరికొన్నింటికి ప్రమాదం పొంచి ఉంది. పూర్తిగా ఆక్వా రైతులు నష్టపోయారని రైతులు ఆందోళన చెందుతున్నారు.. బుడమేరు, రామిలేరు ఉధృతి తో ఎగువ ప్రాంతాల నుంచి కొల్లేరుకు భారీగా వరద నీరు చేరుతోంది. కొల్లేరు సరస్సులోకి బుడమేరు, తమ్మిలేరు, రామిలేరు చంద్రయ్య కాలువ, పెదపాడు, వట్లూరు, మొండికోడు, పందికోడు, సోల్రాజ్, కైకలూరు స్వాంపు, మాదేపల్లి, రాళ్ళకోడు, దోసపాడు, మోటూరు, పోతునూరు వంటి చానల్స్ నుంచి నీరు చేరుతోంది.

బెజవాడకు కేంద్రమంత్రి శివరాజ్‌సింగ్‌.. వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటన…
ఆంధ్రప్రదేశ్‌లోని వరద ప్రభావిత ప్రాంతాల్లో కేంద్ర మంత్రి శివరాజ్‌సింగ్‌ చౌహాన్‌ పర్యటిస్తున్నారు.. గన్నవరం ఎయిర్ పోర్టుకు చేరుకున్న కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ కు మంత్రి నారా లోకేష్ స్వాగతం పలికారు.. ఆ తర్వాత ఏరియల్ సర్వే ద్వారా బుడమేరు, క్యాచ్‌మెంట్ ఏరియాలను పరిశీలించారు చౌహాన్. అక్కడ నుంచి వరద ప్రభావిత ప్రాంతాలైన జక్కంపూడి మిల్క్ ఫ్యాక్టరీ, కండ్రిక, అజిత్‌సింగ్ నగర్ లను ఏరియల్ సర్వే ద్వారా కేంద్ర మంత్రి పరిశీలించగా… ఆయా ప్రాంతాల్లో జరిగిన నష్టాన్ని కేంద్ర మంత్రికి వివరించారు మంత్రి నారా లోకేష్. ఏరియల్ సర్వే అనంతరం ముఖ్యమంత్రి నివాసంలోని హెలీప్యాడ్ కు చేరుకున్నారు.. ఇక, అక్కడ నుంచి రోడ్డు మార్గంలో వరద కారణంగా దెబ్బతిన్న ప్రకాశం బ్యారేజీ గేట్లను పరిశీలించనున్నారు.. అనంతరం జక్కంపూడి కాలనీ మిల్క్ ఫ్యాక్టర్టీ ప్రాంతాన్ని ఎన్.డీ.ఆర్.ఎఫ్ బోట్‌లో పరిశీలించనున్నారు.. విజయవాడ కలెక్టరేట్‌లోని కమాండ్ కంట్రోల్ రూమ్ కు చేరుకుని, వరద కారణంగా దెబ్బతిన్న ప్రాంతాలపై ఏర్పాటు చేసిన ఫోటో ఎగ్జిబిషన్ ను వీక్షిస్తారు.. ఇక, వరద నష్టంపై సీనియర్ ఐఏఎస్ అధికారులతో కేంద్రమంత్రి చౌహాన్ సమీక్ష నిర్వహించనున్నారు. జరిగిన నష్టాన్ని కేంద్ర మంత్రికి వివరించి, నివేదికలు అందజేయనున్నారు వివిధ శాఖల ఉన్నతాధికారులు.

రేపటి నుంచి వరద బాధితులకు నిత్యావసరాల పంపిణీ.. రేషన్‌కార్డు లేకుంటే ఆధార్‌తో..
వరదలతో అతలాకుతలం అయిన విజయవాడలో సహాయక చర్యలు కొనసాగుతూనే ఉన్నాయి.. ప్రజలకు ప్రభుత్వంతో పాటు.. ప్రజాప్రతినిధులు, రాజకీయ పార్టీలు, స్వచ్చంధ సంస్థలు.. ప్రజలు.. ఇలా తమకు తోచిన సహాయం చేస్తూనే ఉన్నారు.. ఫుడ్‌, వాటర్‌, బిస్కెట్లు.. మందులు ఇలా చేరవేస్తున్నారు.. ఇక, వరద బాధిత కుటుంబాలకు శుక్రవారం నిత్యావసర వస్తువుల పంపిణీ ప్రారంభించనుంది ఏపీ పౌరసరఫరాల శాఖ.. సుమారు 2 లక్షల మంది లబ్ధిదారులకు ఈ పంపిణీ జరగనుంది.. 179 వార్డు,3 గ్రామ సచివాలయాల పరిధిలో పంపిణీ చేపట్టనున్నారు.. ముంపు బాధితులు అందరికీ నిత్యావసర వస్తువులు అందిస్తామని వెల్లడించారు రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్… విజయవాడలో వరద ముంపునకు గురైన బాధితులందరికీ పౌర సరఫరాలు, మార్కెటింగ్ శాఖల ద్వారా శుక్రవారం ఉదయం వివిధ నిత్యావసర సరుకుల పంపిణీ ప్రారంభిస్తామన్నారు మంత్రి నాదెండ్ల మనోహర్.. విజయవాడ కలెక్టరేట్‌లో మీడియాతో మాట్లాడిన ఆయన.. గతంలో ఎన్నో వరదలను చూశామని.. కానీ, ఈసారి వరదలతో ప్రజలు అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నారని చెప్పారు. అయితే బాధితులను ఆదుకునేందుకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్‌ నేతృత్వంలో అధికార యంత్రాంగం అహర్నిశలు పని చేసి సహాయక చర్యలు కొనసాగించడం జరుగుతోందన్నారు. శుక్రవారం ఉదయం నుండి విజయవాడలోని 179 వార్డు, 3 గ్రామ సచివాలయాల పరిధిలో వరద బాధితులకు 25 కిలోల బియ్యం, కిలో కందిపప్పు, కిలో వంట నూనె, కిలో పంచదార, 2 కిలోల ఉల్లి పాయలు, 2 కిలోల బంగాళా దుంపలను రెండు బ్యాగులుగా చేసి పంపిణీ చేస్తామన్నారు.

ఏపీ సీఎంకు తృటిలో తప్పిన పెను ప్రమాదం.. రైలు దూసుకురావడంతో..
ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు తృటిలో పెను ప్రమాదమే తప్పింది.. విజయవాడలోని వరద ప్రభావిత ప్రాంతాల్లో విరామం లేకుండా పర్యటిస్తున్న చంద్రబాబు.. ఎప్పటికప్పుడు.. ఆయా ప్రాంతాల్లోని బాధితులను పరామర్శిస్తూ.. అధికారులను అప్రమత్తం చేస్తున్నారు.. సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నారు.. అయితే, ఈ రోజు మధురానగర్ రైల్వే ట్రాక్ వద్ద సీఎం చంద్రబాబు పర్యటన సందర్భంగా పెద్ద ప్రమాదమే తప్పింది.. వరద పరిస్థితిని చూసేందుకు రైల్వే ట్రాక్ దాటారు సీఎం చంద్రబాబు… అయితే, చంద్రబాబు రైల్వే ట్రాక్ వద్ద ఉండగానే రైలు వచ్చేసింది.. ఇక, రైలును చూసి భద్రతా సిబ్బంది అప్రమత్తం కాగా.. రైల్వే ట్రాక్ అవతలి పక్కకు వెళ్లిపోయారు సీఎం చంద్రబాబు. రెయిలింగ్ కు.. రైలుకు మధ్య ఉన్న చిన్నపాటి గ్యాపులోనే ఉండిపోయారు ముఖ్యమంత్రి.. ఇక, రైలు వెళ్లిన అనంతరం బయటకు వచ్చారు సీఎం చంద్రబాబు. మరోవైపు.. రైలు వెళ్లిపోయిన అనంతరం తన పర్యటనను కొనసాగించారు సీఎం చంద్రబాబు.

సుప్రీంకోర్టులో లభించని ఊరట.. బెయిల్‌పై తీర్పు రిజర్వ్
ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో ముఖ్యమంత్రి కేజ్రీవాల్ బెయిల్ పిటిషన్‌పై తీర్పును సుప్రీంకోర్టు రిజర్వ్ చేసింది. వచ్చే మంగళవారానికి తీర్పును న్యాయస్థానం రిజర్వ్ చేసింది. లిక్కర్ పాలసీ కేసులో బెయిల్ మంజూరు చేయాలంటూ కేజ్రీవాల్ పిటిషన్ వేశారు. గురువారం కేజ్రీవాల్ బెయిల్ పిటిషన్‌పై ధర్మాసనం విచారించింది. బెయిల్ పిటిషన్‌పై ఇరువైపుల నుంచి సుదీర్ఘంగా వాదనలు జరిగాయి. ఇంకా ఏమైనా వాదనలు వినిపించాల్సి ఉంటే.. లిఖిత పూర్వకంగా ఇవ్వాలని న్యాయస్థానం ఆదేశించింది. కేజ్రీవాల్ తరపున సీనియర్ న్యాయవాది అభిషేక్ మను సింఘ్వీ వాదనలు వినిపించగా.. సీబీఐ తరపున అడిషనల్ సొలిసిటర్ జనరల్ ఎస్వీ రాజు వాదనలు వినిపించారు. జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ ఉజ్జల్ భూయాన్ కేసు విచారించారు. ఇరువైపుల నుంచి వాదనలు విన్న తర్వాత తీర్పును సెప్టెంబర్ 10కి వాయిదా వేసింది. ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో మార్చి 21న సీఎం కేజ్రీవాల్‌ను ఈడీ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. అనంతరం ముఖ్యమంత్రిని తీహార్ జైలుకు తరలించారు. అనంతరం పలుమార్లు బెయిల్ పిటిషన్లు అప్లై చేసుకున్నా తిరస్కరణకు గురయ్యాయి. మధ్యలో ట్రయల్ కోర్టు రెగ్యులర్ బెయిల్ మంజూరు చేసినా సీబీఐ రూపంలో నిరాశ ఎదురైంది. హైకోర్టులో పిటిషన్ వేయడంతో బెయిల్‌పై స్టే విధించింది. ఇక లోక్‌సభ ఎన్నికల సమయంలో మాత్రం ప్రచారం కోసం 21 రోజులు సుప్రీంకోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. అనంతరం జూన్ 2న తిరిగి తీహార్ జైల్లో కేజ్రీవాల్ లొంగిపోయారు. ఈ కేసులో అరెస్టైన ఢిల్లీ మాజీ డిప్యూటీ సీఎం సిసోడియా, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు బెయిల్ లభించాయి. జైలు నుంచి విడుదలయ్యారు. ప్రస్తుతం కేజ్రీవాల్ మాత్రమే జైల్లో ఉన్నారు.

“బంగ్లాదేశ్‌లో హిందువులపై దాడులకు అదే కారణం”: మహ్మద్ యూనస్..
బంగ్లాదేశ్‌లో రిజర్వేషన్ కోటా రద్దుని కోరుతూ చేసిన నిరసనలు హింసాత్మకంగా మారి, చివరకు షేక్ హసీనా తన ప్రధాని పదవికి రాజీనామా చేసి, ఇండియాకు పారిపోయి వచ్చిన సంగతి తెలిసిందే. అయితే, ఆమె గద్దె దిగిన తర్వాత బంగ్లా వ్యాప్తంగా హిందువులపై మతోన్మాద మూకలు దాడులకు తెగబడ్డాయి. హిందూ యువతులు, మహిళలపై అఘాయిత్యాలు, కిడ్నాప్‌లు జరిగాయి. హిందూ దేవాలయాల ధ్వంసం జరిగింది. తాత్కాలిక ప్రభుత్వాధినేతగా నోబెల్ విన్నర్ మహ్మద్ యూనస్‌గా పదవి చేపట్టిన తర్వాత కూడా ఈ దాడులు ఆగలేదు. చివరకు, భారత ప్రధాని నరేంద్రమోడీ, బంగ్లాదేశ్‌లో హిందువులపై దాడుల్ని అడ్డు్కోవాలని కోరడంతో దాడులు తగ్గాయి. ఇదిలా ఉంటే, ఈ దాడులకు బంగ్లా చీఫ్ మహ్మద్ యూనస్ కొత్త కారణం చెప్పారు. హిందువులపై జరిగిన దాడులు మతపరమైనవి కావని, రాజకీయ పరమైనవని పేర్కొన్నారు. ఆయన పీటీఐకి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ వ్యాఖ్యలు చేశారు. షేక్ హసీనా పార్టీ అవామీ లీగ్‌కి హిందువులు మద్దతిచ్చారనే అభిప్రాయం ఉన్నందునే, రాజకీయంగా వారిపై దాడులు జరిగినట్లు చెప్పారు. ‘‘ ఈ విషయాన్ని ప్రధాని నరేంద్రమోడీకి కూడా చెప్పాను. ఈ దాడులు అనేక కోణాలను కలిగి ఉంది. హసీనా, అవామీలీగ్ దురాగతాల తర్వాత దేశం ఒక తిరుగుబాటుని ఎదుర్కొన్నప్పుడు, వారికి మద్దతు ఇచ్చిన వారిపై దాడులు జరిగాయి’’ అని చెప్పారు.

నష్టాలతో ముగిసిన స్టాక్ మార్కెట్
దేశీయ స్టాక్ మార్కెట్ వరుస నష్టాల్లో కొనసాగుతోంది. గత వారం సూచీలు రికార్డుల జోరు సాగించగా.. ఈ వారం మాత్రం రివర్స్‌లో ట్రేడ్ అవుతున్నాయి. అంతర్జాతీయ మార్కెట్‌లోని మిశ్రమ సంకేతాలు మన మార్కెట్‌పై తీవ్ర ప్రభావం చూపిస్తున్నాయి. గురువారం ఉదయం స్వల్ప లాభాలతో ప్రారంభమైన సూచీలు.. అనంతరం నష్టాల్లోకి జారుకున్నాయి. సెన్సెక్స్ 151 పాయింట్లు నష్టపోయి 82, 201 దగ్గర ముగియగా.. నిఫ్టీ 53 పాయింట్లు నష్టపోయి 25, 145 దగ్గర ముగిసింది. ఇక రూపాయి మారకం విలువ డాలర్‌తో పోలిస్తే రూ. 83. 97 దగ్గర ముగిసింది. నిఫ్టీలో టైటాన్ కంపెనీ, ఎల్‌టిఐఎండ్‌ట్రీ, విప్రో, బిపిసిఎల్, ఐటిసి లాభపడగా… కోల్ ఇండియా, బ్రిటానియా ఇండస్ట్రీస్, సిప్లా, డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్ మరియు రిలయన్స్ ఇండస్ట్రీస్ నష్టపోయాయి. సెక్టోరల్ ఫ్రంట్‌లో క్యాపిటల్ గూడ్స్, పవర్, ఆయిల్ & గ్యాస్, రియాల్టీలో అమ్మకాలు కనిపించగా.. మెటల్, ఐటీ, టెలికాం మరియు మీడియాలో కొనుగోళ్లు కనిపించాయి. బీఎస్ఈ మిడ్ క్యాప్ ఇండెక్స్ 0.3 శాతం, స్మాల్ క్యాప్ ఇండెక్స్ 0.5 శాతం పెరిగాయి.

బీజేపీలో చేరిన క్రికెటర్ రవీంద్ర జడేజా..
క్రికెటర్ రవీంద్ర జడేజా భారతీయ జనతా పార్టీ(బీజేపీలో) చేరారు. సెప్టెంబర్ 02న బీజేపీ సభ్యత్వ నమోదు కార్యక్రమానికి సంబంధించిన ఫోటోని రవీంద్ర జడేజా భార్య, బీజేపీ ఎమ్మెల్యే రివాబా జడేజీ పంచుకున్నారు. రవీంద్ర జడేజా బీజేపీలో చేరినట్లు ఆమె ఫోటోని పోస్ట్ చేశారు. మెంబర్‌షిప్ డ్రైవ్‌ను ఇటీవలే బిజెపి జాతీయ అధ్యక్షుడు జెపి నడ్డా ప్రారంభించారు, ఆయన సెప్టెంబర్ 2 న ఢిల్లీలో ప్రధాని నరేంద్ర మోడీని సభ్యునిగా చేర్చుకున్నారు. రివాబా 2019లో బీజేపీలో చేరారు. ఆమె 2022 గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో జామ్ ‌నగర్ నుంచి బీజేపీ తరుపున పోటీ చేసి గెలుపొందారు. ఆమె ఆప్ అభ్యర్థి కర్షన్ భాయ్ కర్మూర్‌ని ఓడించారు.

ఇందుకు కదా ఫాన్స్ అయ్యేది.. కొణిదెల హీరోల ‘మెగా’ సాయం!
ఎవరైనా కష్టంలో ఉన్నారని తెలియగానే వారిని ఆదుకోవడానికి ముందుకు వచ్చే వారిలో మెగా ఫ్యామిలీ వారు ఒక్కరైనా ఉంటారు అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఎలాంటి సినిమా బ్యాక్ గ్రౌండ్ లేకుండా వచ్చి సినీ ప్రపంచంలో తనకంటూ ప్రత్యేకమైన అధ్యాయాన్ని సృష్టించుకున్న మెగాస్టార్ చిరంజీవి కేవలం సంపాదన మీదే దృష్టి పెట్టలేదు. ఒకపక్క తాను సామాజిక సేవ చేస్తూనే తన అభిమానులను సైతం సేవ చేసేలా ప్రోత్సహించాడు. అభిమానులనే అంతలా సేవ చేసేందుకు ప్రోత్సహించిన ఆయన కుటుంబ సభ్యులను ఇంకెంత ప్రభావితం చేసి ఉంటారో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అందుకే ఎప్పుడు, ఎక్కడ, ఎలాంటి విపత్తు వచ్చినా సరే సాయం అందించడంలో మెగా కుటుంబ సభ్యులు రెడీగా ఉంటారు. మెగాస్టార్ చిరంజీవి, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, మెగా పవర్ స్టార్ చరణ్ సహా వరుణ్ తేజ్ వంటి వారు సైతం భారీ విరాళాలు అందిస్తు.. పెద్ద మనసు చాటుకుంటున్నారు. కేవలం నెల వ్యవధిలోనే మెగా ఫ్యామిలీ నుంచి దాదాపు 10 కోట్ల సాయం అందించారు అంటే ఆశ్చర్యం కలుగక మానదు. తాజాగా తెలుగు రాష్ట్రాల్లో వరద బాధితులను ఆదుకోవడానికి చిరంజీవి కోటి విరాళం ఇచ్చారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సీఎం రిలీఫ్ ఫండ్‌కు చెరో 50 లక్షల విరాళం అందించారు. ఈ సందర్భంగా.. తెలుగు రాష్ట్రాల్లో వరద ప్రభావం వల్ల ప్రజలకు కలిగిన కష్టాలు తీవ్రంగా కలిచి వేసినట్లు చిరు ఆవేదన వ్యక్తం చేశారు. ఇక తండ్రి బాటలోనే తనయుడు రామ్ చరణ్ కూడా రెండు రాష్ట్రాలకు కోటి రూపాయల భారీ విరాళాన్ని ప్రకటించారు. ఈ సందర్భంగా.. తెలుగు రాష్ట్రాల ప్రజలు ఈ పరిస్థితి నుంచి త్వరగా బయటపడాలని దేవుడిని ప్రార్థిస్తున్నానను.. అంటూ చరణ్ సోషల్ మీడియా వేదికగా రాసుకొచ్చారు. ఇక ఏపీ డిప్యూటీ సీఎం హోదాలో ఉన్న పవర్ స్టార్ పవన్ కళ్యాణ్.. భారీ విరాళాన్ని అందించారు. తనవంతు సాయంగా 6 కోట్లు ఇస్తున్నట్లు చెప్పారు.

దేవర.. అన్నీ రివర్సే అవుతున్నాయే!
అదేందో గానీ.. ఒక్కోసారి సోషల్ మీడియాలో వచ్చే కామెంట్స్ చూస్తే.. నిజమే కదా? అని అనిపించక మానదు. దేవర సినిమా విషయంలో అనిరుధ్ పై వస్తున్న కామెంట్స్ చూస్తే.. అనిరుద్దుడు అనేది ఎక్కువగా హైలెట్ అవుతూ ఉంది. ఫియర్ సాంగ్ నుంచి మొదలైన ఈ కామెంట్.. లేటెస్ట్‌గా వచ్చిన దావుది సాంగ్ వరకు వినిపిస్తునే ఉంది. కానీ ఫైనల్‌గా.. దేవరకు మాత్రం సీన్ రివర్స్ అవుతోంది. ముందుగా పాట బాగాలేదంటూ ట్రోల్ చేస్తారు, కానీ ఆ తర్వాత రీల్స్‌, హుక్ స్టెప్పులు, మిలియన్స్ ఆఫ్ వ్యూస్‌తో అదే సోషల్ మీడియాను షేక్ చేస్తుంది. అందుకు నిదర్శనం చుట్టమల్లె సాంగ్ అనే చెప్పాలి. ఈ పాట రిలీజ్ అయినప్పుడు ఓ శ్రీలంక సాంగ్‌కు కాపీ అని తెగ ట్రోల్ చేశారు. కానీ ఏకంగా.. 100 మిలియన్స్ వ్యూస్‌తో రికార్డ్ క్రియేట్ చేసింది. ఇక ఇంతకుముందు వచ్చిన ఫియర్ సాంగ్ తీసుకుంటే.. అనిరుధ్ డామినేషన్ ఎక్కువైంది. పాటలో ఎన్టీఆర్ కంటే అనిరుద్దే ఎక్కువగా కనిపించాడు. పాట కూడా కాస్త గజిబిజీగా ఉండడంతో.. విమర్శలు వచ్చాయి. ఇక ఇప్పుడు మాస్ బీట్ అని టైగర్ ఫ్యాన్స్ కాస్త కష్టంగానే.. దావూదీ పాటను రిసీవ్ చేసుకుంటున్నట్టుగా ఉంది వ్వవహారం. పాట సెటప్, ఎన్టీఆర్ స్టెప్పులు, జాన్వీ గ్లామర్ ఓకే కానీ.. అనిరుధ్ మాత్రం తన పాటను తనే కాపీ కొట్టినట్టుగా కామెంట్స్ వస్తున్నాయి. గతంలో విజయ్ ‘బీస్ట్’ సినిమాలోని ‘హలమితి హబిబో’ సాంగ్‌నే.. అనిరుధ్ దేవరలో దించేశాడని అంటున్నారు. ట్యూనే కాదు.. హలమితి పాటకు దావుది స్టెప్పులను యాడ్ చేస్తే.. ఏది ఒరిజినలో తేల్చుకోకుండా ఉందంటున్నారు. స్టెప్పులు కూడా హలమితి హబిబో లాగే ఉన్నాయని.. కొందరు ట్రోల్ చేస్తున్నారు. కానీ ఈ పాట మాత్రం సెన్సేషన్ క్రియేట్ చేసేలా ఉంది. రిలీజ్ అయినప్పటి నుంచి.. ఇండియా వైడ్ నెంబర్ 1 ట్రెండింగ్‌లో ఉంటూ.. మిలియన్స్ ఆఫ్ వ్యూస్‌తో దూసుకుపోతోంది. కాబట్టి.. ముందు నెగెటివ్‌గా ట్రెండ్‌ అయినా.. ఈ సాంగ్ కూడా హిట్టే అని చెప్పాలి. కానీ.. అనిరుద్దుడు అనే కామెంట్‌కు చెక్ పడాలంటే.. దేవర నుంచి ఒక సాలిడ్ ఫ్రెష్ సాంగ్ బయటకు రావాల్సిందే.

Show comments