NTV Telugu Site icon

Top Headlines @ 5 PM: టాప్‌ న్యూస్‌

Top Headlines @ 5 Pm New

Top Headlines @ 5 Pm New

కోళ్లకు అంతుచిక్కని వ్యాధి..! రైతుల్లో ఆందోళన.. చికెన్‌ తినొచ్చా..?
కోళ్లకు అంతుచిక్కని వ్యాధిపై గోదావరి జిల్లాల పౌల్ట్రీ రైతులు ఆందోళన చెందుతున్నారు. తూర్పుగోదావరి జిల్లాలోని పౌల్ట్రీలకు ఈ వ్యాధి లేకపోయినా కొన్నిచోట్ల జాడ కనిపిస్తుంది. అంతుచిక్కని వైరస్ కోళ్లకు వ్యాపించడంతో పౌల్ట్రీ రైతులు ఆందోళనలో ఉన్నారు. ఒక్కో కోడి 300 రూపాయలు వరకు ధర ఉండగా.. అవి మృత్యు వాత పడకుండా రక్షించుకునేందుకు టీకాలు వేయిస్తున్నారు. లక్ష కోళ్లు పెంచేందుకు 3 కోట్ల రూపాయలు వరకు పెట్టు బడి అవుతుండగా అధికశాతం రైతులు బ్యాంకుల నుంచి రుణాలు తీసుకున్న వారే.. మాంసం కోసం 45 రోజులపాటు పెంచే బ్రాయిలర్ కోళ్లు ఉమ్మడి గోదావరి జిల్లాలో కోటి వరకు ఉంటాయి. ఒక బ్రాయిలర్ కోడి రెండు కిలోల వరకు తయారయ్యేందుకు 200 రూపాయలు వరకు ఖర్చ వుతుంది. నిన్నమొన్నటి వరకు కిలో చికెన్ ధర 140 రూపాయలు వరకు ఉండడంతో లాభాలపై ఆశలు పెట్టుకున్నారు. అయితే, కొత్త వైరస్ తో ఇప్పుడు ఆందోళనలో ఉన్నారు పౌల్ట్రీ రైులు.. కోళ్ల మృత్యువాతతో నష్టపోతున్న రైతులు సాయం కోసం ఎదురుచూస్తున్నారు. అనపర్తి, కొవ్వూరు ప్రాంతాల్లో కొన్నిచోట్ల కోళ్లలో వైరస్ జాడలు కనిపించాయి. ప్రస్తుతం వైరస్ ప్రభావం వల్ల గుడ్లు, మాంసం తినే ప్రజల ఆరో గ్యానికి ఎటువంటి ఇబ్బంది లేదు. ప్రజలంతా నిశ్చింతగా తినవచ్చు. మన దేశంలో ఉడక బెట్టినవి తినడం అలవాటు. ఇప్పటివరకు ఎవరికీ కోళ్ల వల్ల ఇబ్బందికలిగిన దాఖలాలు లేవు అంటున్నారు పశుసంవర్ధకశాఖ అధికారులు. పెరవలి మండలం కానూరు అగ్రహారంలో 80 కోళ్ల నుంచి నమూనాలు సేకరించి మధ్యప్రదేశ్ లోని భోపాల్ కేంద్రీయ ప్రయో గశాలకు పంపడం జరిగిందని చెబుతున్నారు తూర్పుగోదావరి జిల్లా పశుసంవర్ధకశాఖ అధికారి శ్రీనివాసరావు..

వైఎస్ వివేకా కేసులో కీలక పరిణామం.. నలుగురిపై కేసు నమోదు
సంచలనం సృష్టించిన వైఎస్‌ వివేకానందరెడ్డి హత్య కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది.. వివేకా హత్య కేసులో అప్రూవర్‌గా మారిన డ్రైవర్ దస్తగిరి ఫిర్యాదు మేరకు నలుగురిపై కేసు నమోదు చేశారు.. ఈ కేసులో దేవి రెడ్డి శంకర్ కొడుకు చైతన్య రెడ్డితో పాటు, గతంలో పులివెందుల డీఎస్పీగా పనిచేసిన నాగరాజు, సీఐ ఈశ్వరయ్య, కడప సెంట్రల్ జైలు సూపరింటెండెంట్‌ ప్రకాశంపై కేసు నమోదైంది.. అయితే, ఈ కేసులో తనను ఇబ్బంది పెట్టారని గతంలో కడప జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేశారు దస్తగిరి.. ఇక, దస్తగిరి ఫిర్యాదు మేరకు ఈ నెల మూడో తేదీన ఆ నలుగురిపై కేసు నమోదు చేశారు పులివెందుల పోలీసులు… జీరో ఎఫ్ఐఆర్ కింద కేసు నమోదు చేసి.. వివరాలను గోప్యంగా ఉంచారు పులివెందుల పోలీసులు.. అయితే, రెండో రోజులు ఆలస్యంగా ఈ కేసు నమోదు వ్యవహారం బయటకు వచ్చింది..

జగన్‌ 2.0 వేరుగా ఉంటుంది.. వైసీపీ అధినేత కీలక వ్యాఖ్యలు
వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు.. విజయవాడ వైసీపీ కార్పోరేటర్లతో ప్రత్యేకంగా సమావేశమైన వైఎస్‌ జగన్.. ఆ సమావేశంలో మాట్లాడుతూ.. ఈ సారి జగన్ 2.0ని చూడబోతున్నారు.. ఈ 2.0 వేరేగా ఉంటుందని తెలిపారు.. కార్యకర్తల కోసం జగన్ ఎలా పనిచేస్తాడో చూపిస్తా.. తొలివిడతలో ప్రజల కోసం తాపత్రయం పడ్డాను.. వారికి మంచి చేసే విషయంలో కార్యకర్తలకు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వలేకపోయానన్న ఆయన.. ఇప్పుడు చంద్రబాబు మిమ్మల్ని పెడుతున్న కష్టాలు, బాధలను చూశాను.. మిమ్మల్ని ఇబ్బంది పెట్టిన వారిని వదిలిపెట్టను అంటూ వార్నింగ్‌ ఇచ్చారు.. ఎక్కడ ఉన్నా తీసుకువచ్చి చట్టం ముందు నిలపెడతా.. అక్రమ కేసులు పెట్టిన వారిపై ప్రయివేటు కేసులు వేస్తాం అని వార్నింగ్‌ ఇచ్చారు జగన్‌..

రోడ్ల సమస్యకు ముగింపు పలికే దిశగా శరవేగంగా అడుగులు..
కూటమి ప్రభుత్వంలో డిప్యూటీ సీఎంతో పాటు పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి సహా కీలక శాఖల బాధ్యతలు తీసుకున్న జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌.. అభివృద్ధి పనులపై ఫోకస్‌ పెట్టారు.. క్షేత్రస్థాయిలోనూ పర్యటిస్తూ.. సమస్యల పరిష్కారానికి చొరవ తీసుకుంటున్నారు.. గతంలో ఇచ్చిన హామీల అమలుపై దృష్టిసారించారు.. ఇక, ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో రోడ్ల సమస్యకు ముగింపు పలికే దిశగా శరవేగంగా రాష్ట్ర ప్రభుత్వం అడుగులు వేస్తుందంటూ.. సోషల్‌ మీడియా వేదికగా పేర్కొన్నారు.. ప్రతీ గ్రామంలో నాణ్యమైన రోడ్ల నిర్మాణం చేసి, గుంతలు లేని ఆంధ్రప్రదేశ్ లక్ష్యంగా పని చేస్తున్న సీఎం నారా చంద్రబాబు నాయుడి నేతృత్వంలోని ఏపీ ప్రభుత్వం, డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ నేతృత్వంలోని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన “పల్లె పండుగ” కార్యక్రమం ద్వారా ప్రధాని నరేంద్ర మోడీ సారథ్యంలోని కేంద్ర ప్రభుత్వ MGNREGS నిధులను పూర్తి స్థాయిలో వినియోగించుకుంటూ, ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా పరిధిలోని 3 నూతన జిల్లాల్లో, గత 4 నెలల్లో 1,756 రోడ్ల నిర్మాణం చేపట్టి,‌ 94.50 కోట్ల వ్యయంతో, 273.42 కిలో మీటర్ల మేర సీసీ రోడ్లను కూటమి ప్రభుత్వం పూర్తి చేసిందంటూ ఎక్స్‌ (ట్విట్టర్‌)లో పేర్కొన్నారు..

ఏపీఎస్ఆర్టీసీకి బోర్డు ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం నోటిఫికేషన్
ఏపీఎస్ఆర్టీసీకి బోర్డును ఏర్పాటు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేసింది. మొత్తం 17 మంది సభ్యులతో బోర్డు ఏర్పాటు చేస్తూ నోటిఫికేషన్ జారీ చేసింది. చైర్మన్‌గా కొనకళ్ల నారాయణ సహా ఆరుగురు నామినేటెడ్ సభ్యులు, 11మంది అధికారులతో ఆర్టీసీ బోర్డును ఏర్పాటు చేశారు. ఆర్టీసీ ఎండీ, ఆర్థిక, రవాణా, సాధారణ పరిపాలన శాఖ, ఇతర శాఖలు, విభాగాల ఉన్నతాధికారులతో బోర్డు ఏర్పాటు జరిగింది. బోర్డులో కేంద్ర ప్రభుత్వం నుంచి ప్రాతినిధ్యం వహించేలా అధికారులు ఏర్పాటు చేశారు. రెండేళ్ల పాటు ఆర్టీసీ వ్యవహారాలను పర్యవేక్షించేలా బోర్డును ఏర్పాటు చేస్తూ నోటిఫికేషన్ విడుదల చేశారు.

త్రిషకు రూ.కోటి నజరానా ప్రకటించిన సీఎం రేవంత్ రెడ్డి
తెలంగాణకు చెందిన అండర్-19 మహిళల క్రికెటర్ త్రిష గొంగడి అద్భుత ప్రదర్శనతో ప్రపంచ కప్ గెలుచుకున్న భారత జట్టులో కీలక పాత్ర పోషించింది. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆమెను తన జూబ్లీహిల్స్ నివాసంలో మర్యాదపూర్వకంగా కలుసుకొని అభినందించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి త్రిష భవిష్యత్‌లో దేశం తరఫున మరింత పెద్ద స్థాయిలో రాణించాలని ఆకాంక్షించారు. క్రీడాకారులను ప్రోత్సహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలియజేసిన సీఎం, త్రిష గొంగడికి రూ. 1 కోటి నజరానా ప్రకటించారు. అండర్-19 వరల్డ్ కప్ జట్టు సభ్యురాలైన తెలంగాణ క్రికెటర్ ధృతి కేసరికి రూ. 10 లక్షలు, జట్టు హెడ్ కోచ్ నౌషీన్, ట్రైనర్ షాలినికి రూ. 10 లక్షల చొప్పున నజరానా ప్రకటించారు. ఈ కార్యక్రమంలో మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి, ప్రభుత్వ సలహాదారు వేం నరేందర్ రెడ్డి, శాట్స్ చైర్మన్ శివసేన రెడ్డి, సీఎం కార్యదర్శి షానవాజ్ ఖాసీం తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ ప్రభుత్వం క్రీడలను ప్రోత్సహించేందుకు అన్ని విధాలా తోడ్పాటును అందిస్తుందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.

రేవంత్‌రెడ్డి మాలలకు కొమ్ము కాస్తున్నారు
ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి మాలలకు కొమ్ముకాస్తున్నారని బీఆర్ఎస్ సీనియర్ నేత తాటికొండ రాజయ్య ఆరోపించారు. తెలంగాణ భవన్‌లో రాజయ్య మీడియాతో మాట్లాడారు. ‘‘ఎస్సీలను మూడు కేటగిరీలుగా చేస్తున్నట్లు సీఎం రేవంత్‌రెడ్డి ప్రకటించారు. దేని ప్రకారం ఎస్సీ వర్గీకరణ చేస్తున్నారో ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలి. అంతేకాకుండా ఎస్సీ వర్గీకరణకు చట్టబద్దత కల్పించాలి. జనాభా ప్రకారం అయితే మాదిగలకు 11 శాతం రిజర్వేషన్ ఇవ్వాలి. అభివృద్ధి చెందిన కులాలను వెనుకబడిన కులాల జాబితాలో చేర్చారు. బుడగజంగాలను ఏ గ్రూప్‌లో కలిపారు. నేతకాని సామజిక వర్గం వారిని సీ గ్రూప్‌లో ఉంచారు. ఎస్సీ వర్గీకరణ కేటగిరీల్లో వివేక్ వెంకటస్వామి హస్తం ఉంది. మల్లిఖార్జున ఖర్గే, కొప్పుల రాజు, భట్టి విక్రమార్క, వివేక్ వెంకటస్వామి లాబీయింగ్‌కు రేవంత్ రెడ్డి లొంగారు.’’ అని రాజయ్య ఆరోపించారు.

ఈసారి ఢిల్లీలో ఎవరి ప్రభుత్వం రాబోతుంది.. ఎగ్జిట్ పోల్ ఫలితాలను ఎప్పుడు, ఎక్కడ చూడాలంటే ?
ఢిల్లీని ఎవరు పాలిస్తారు.. ఎవరిని ఎవరు ఓడిస్తారు.. ఢిల్లీ గద్దెపై ఎవరు పట్టాభిషిక్తులు అవుతారు అనే అస్పష్టమైన చిత్రాన్ని ఈ రోజు కాసేపట్లో చూడబోతున్నాం. ఢిల్లీలోని 70 స్థానాలకూ ఈరోజు పోలింగ్ జరుగుతోంది. ఢిల్లీలో ఆమ్ ఆద్మీ పార్టీ, బిజెపి, కాంగ్రెస్ మధ్య త్రిముఖ పోటీ నెలకొంది. 27 ఏళ్ల కరువును అంతం చేయాలని బిజెపి కోరుకుంటుండగా, ఆప్ హ్యాట్రిక్ విజయాన్ని కోరుకుంటోంది. అదే సమయంలో, కాంగ్రెస్ కూడా 2013 తర్వాత మొదటిసారిగా ఒక మలుపు తిరిగిన మూడ్‌లో ఉంది. ఇంతలో, అందరి దృష్టి ఇప్పుడు ఈరోజు విడుదల కానున్న ఎగ్జిట్ పోల్స్ పైనే ఉంది. ఢిల్లీలో ఈరోజు అంటే ఫిబ్రవరి 5న ఒక దశ పోలింగ్ మాత్రమే జరుగుతోంది. ప్రచారం ఫిబ్రవరి 3న ముగిసింది. ఫిబ్రవరి 8న ఓట్ల లెక్కింపు జరుగుతుంది. ఢిల్లీలో ఫలితాలకు ముందు, నేడు ఎగ్జిట్ పోల్ ఫలితాల వంతు. పోలింగ్ ముగిసిన వెంటనే ఎగ్జిట్ పోల్ అంచనాలు వెలువడతాయి. ఈ ఎగ్జిట్ పోల్స్ గెలుపు, ఓటమిని అంచనా వేస్తాయి. ఈసారి ఢిల్లీలో ఎవరి ప్రభుత్వం ఏర్పడుతుందో అనే విషయం స్పష్టంగా కనిపిస్తుంది.

ప్రపంచంలోనే అత్యంత విచిత్రమైన చోరీ.. అమెరికాలో లక్ష గుడ్లు మాయం
అమెరికా ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన దేశం అన్న సంగతి అందరికీ తెలిసిందే.. ప్రస్తుతం ఇక్కడి ప్రజలు గుడ్ల గురించి తీవ్ర ఆందోళన చెందుతున్నారు. గుడ్లు దొంగిలించిన కేసులు కూడా వెలుగులోకి రావడం మొదలయ్యాయి. అమెరికాలోని పెన్సిల్వేనియా నగరంలో గుడ్ల దొంగతనం కేసు వెలుగులోకి వచ్చింది. ఇక్కడ డెలివరీ రిటైలర్ నుండి సుమారు లక్ష గుడ్లు చోరీకి గురయ్యాయి. ఈ దొంగతనంపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రీన్ కాజిల్‌లోని పీట్ & గెర్రీ ఆర్గానిక్స్ ఎల్ఎల్సీలో రాత్రి 8:40 గంటల ప్రాంతంలో దొంగతనం జరిగింది. దొంగిలించబడిన గుడ్ల విలువ సుమారు 40,000డాలర్లు ఉంటుందని అంచనా. . ఇలాంటి వార్తల నడుమ అమెరికాలో గుడ్ల కోసం ప్రజల నిరసన వ్యక్తం చేస్తున్నారు. గుడ్ల ధరలు రికార్డు స్థాయికి చేరుకుంటున్నాయి. దీని కారణంగా ధరలు కార్టన్‌కు 7డాలర్లు అయ్యాయి. ప్రజల అల్పాహారంలో గుడ్డు ఒక ముఖ్యమైన భాగం. అందుకే, ప్రతిరోజూ కోట్లాది మంది గుడ్లు కొనుగోలు చేస్తుంటారు. కానీ ఇప్పుడు గుడ్ల ధర వారి బడ్జెట్‌ను పాడు చేస్తోంది. ఈ కొరత కారణంగా దొంగిలించబడిన గుడ్ల గురించి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. దీని గురించి ప్రస్తుతం తమ వద్ద పెద్దగా సమాచారం లేదని పోలీసులు తెలిపారు.. దొంగతనం త్వరలోనే బయటపడుతుందని పోలీసులు తెలిపారు.

సెలెక్టివ్ గా తిరువీర్ సినిమాలు.. ఎందుకంటే?
జార్జి రెడ్డి, పలాస 1978 వంటి చిత్రాల్లో తనదైన నటనతో ఆకట్టుకున్నాడు తిరువీర్. ఆ తర్వాత మసూద, పరేషాన్ లాంటి సినిమాల్లో ప్రధాన పాత్రలలో నటించి ప్రేక్షకులను మెప్పించారు. ఇక తిరువీర్ కెరీర్‌లో మసూద బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్‌గా నిలిచింది. ఇక ఆ సినిమా సక్సెస్ అయిన తర్వాత కూడా వరుస సినిమాలు ఎంచుకోకుండా చాలా సెలెక్టివ్గా సినిమాలు ఎంచుకుంటూ వెళుతున్నాడు. ప్రస్తుతం తిరువీర్ పలు ప్రాజెక్టులతో బిజీగా ఉన్నారు. ప్రస్తుతం తిరువీర్ ‘ది గ్రేట్ ప్రీ-వెడ్డింగ్ షో’ అనే సినిమాలో ఫోటోగ్రాఫర్ పాత్రలో కనిపించనున్నారు. రాహుల్ శ్రీనివాస్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం అవుట్ అండ్ అవుట్ కామెడీ ఎంటర్టైనర్‌గా ఉండబోతోంది. ఇక తిరువీర్ తన కొత్త సినిమా గురించి మాట్లాడుతూ.. “వెడ్డింగ్ ఫోటోగ్రాఫర్ పాత్ర పోషించడం చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంది. మొబైల్‌తో చాలాసార్లు ఫోటోలు తీశా, కానీ ఇలా ప్రొఫెషనల్ ఫోటోగ్రాఫర్‌గా నటించడం చాలా కొత్తగా, ఛాలెంజింగ్‌గా అనిపిస్తోంది.

మస్తాన్ సాయి కేసులో సంచలనాలు.. సినీ పరిశ్రమ వారితో కలిసి డ్రగ్స్ పార్టీలు?
రాజ్ తరుణ్ భార్యగా చెప్పుకుంటున్న లావణ్య మస్తాన్ సాయి అనే యువకుడి హార్డ్ డిస్క్ పోలీసులకు అందజేసిన సంగతి తెలిసిందే. ఇక ఈ వ్యవహారం మీద పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అయితే తాజాగా మరికొన్ని వీడియోలను లావణ్య స్వయంగా విడుదల చేసింది.మస్తాన్ సాయికి సంబంధించిన కొన్ని వీడియోలను లావణ్య విడుదల చేసింది. మస్తాన్ సాయి ఇంట్లో జరిగిన ఒక డ్రగ్స్ పార్టీ వీడియోతో పాటు కొన్ని ఫోటోలు సైతం లావణ్య విడుదల చేసింది. మస్తాన్ సాయి ఇంట్లో అమ్మాయిలతో డ్రగ్స్ పార్టీలు నిర్వహించినట్లు గుర్తించారు. ఈ పార్టీలలో సినీ పరిశ్రమకు చెందిన వారు కూడా కొంతమంది పాల్గొన్నట్లు తెలుస్తోంది. ఇక డ్రగ్స్ పార్టీ వీడియోతో సహా ఫోటోలను కూడా లావణ్య పోలీసులకు అందజేసింది. గంజాయి సహా డ్రగ్స్ వాడినట్లు ఫోటోలో నిర్ధారణ అవుతుంది. అమ్మాయిలు, అబ్బాయిలు కలిసి పెద్ద ఎత్తున డ్రగ్స్ పార్టీలు చేసుకుంటున్నట్లుగా వీడియోలో ఉంది. అయితే ఈ డ్రగ్స్ పార్టీ ఎప్పుడు జరిగింది? అనే విషయం మీద మాత్రం లావణ్య ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు. అయితే పోలీసులకు లావణ్య అందజేసిన ఒక ఫోటో మాత్రం ఇప్పుడు హాట్ టాపిక్ అవుతోంది. ఎందుకంటే అందులో డ్రగ్స్ వ్యవహారం గురించి ఉన్న న్యూస్ పేపర్ కటింగ్ ఉండగా దాని మీద డ్రగ్స్ పెట్టుకొని సేవిస్తున్నట్లు నిర్ధారణ అయింది.