అమరావతిపై జగన్ సంచలన వ్యాఖ్యలు..
ఏపీ రాజధాని అమరావతిపై మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్‌రెడ్డి.. తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో ఉమ్మడి కృష్ణా, గుంటూరు జిల్లాలకు చెందిన వైయస్సార్‌సీపీ లీగల్‌సెల్ న్యాయవాదులతో సమావేశమైన ఆయన.. అమరావతిలో అవినీతికి అంతులేకుండా పోతోందని ఆరోపించారు.. చదరపు అడుగకు 4 వేలు పెడితే ఫైవ్ స్టార్ సదుపాయాలు వస్తాయి.. అమరావతిలో చదరపు అడుగుకు 10 వేలు ఖర్చు చేస్తున్నారు.. మొబలైజేషన్ అడ్వాన్స్‌ల పేరిట దోపిడీ చేస్తున్నారు.. 10 శాతం ఇచ్చి 8 శాతం కమీషన్లు వసూలు చేస్తున్నారని విమర్శించారు.. మనం 2.49 లకు పీపీఏ చేసుకుంటే, దానిపై విపరీతంగా దుష్ప్రచారం చేస్తున్నారు. ఇప్పుడు 4.60 పైసలకు పీపీఏ చేసుకుంటున్నారన్న జగన్.. అవినీతికి అంతులేకుండా పోయింది. నియోజకవర్గంలో మట్టి, గ్రావెల్, మైనింగ్, పరిశ్రమలు నడపాలన్నా.. కమీషన్లు ఇవ్వాల్సిందే.. పోలీసులు దగ్గరుండి వీటికి సహకరిస్తున్నారు. కళ్లముందే కరప్షన్ కనిపిస్తోందని ఆరోపణలు గుప్పించారు..
మూడేళ్ల తర్వాత అధికారం మనదే.. వారంతా జైలుకే..!
మూడేళ్ల తర్వాత అధికారంలోకి రాబోతున్నాం.. ఇప్పుడు పార్టీ కోసం పని చేస్తున్న వారెవ్వరినీ జగన్ 2.0లో మర్చిపోం.. పక్కాగా డేటా బేస్ తయారు చేయమని మన లీగల్ విభాగం ప్రతినిధులకు చెబుతున్నాను.. ఆ డేటా బేస్ ఆధారంగా వారందరికీ తగిన గుర్తింపు ఇస్తాం అన్నారు. వైయస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో పార్టీ లీగల్‌సెల్ సమావేశం నిర్వహించారు వైఎస్ జగన్.. ఉమ్మడి కృష్ణా, గుంటూరు జిల్లాలకు చెందిన పార్టీ లీగల్ సెల్ ప్రతినిధులు హాజరయ్యారు.. వైసీపీ లీగల్‌సెల్ రాష్ట్ర అధ్యక్షుడు ఎం.మనోహర్‌రెడ్డి, పార్టీ ప్రధాన కార్యదర్శి (లీగల్) పొన్నవోలు సుధాకర్‌రెడ్డితో పాటు, పలువురు సీనియర్ న్యాయవాదులు పాల్గొన్నారు.. ఇంకా త్వరలోనే ఒక యాప్ వస్తుంది. దాని తయారీలో సీనియర్ లాయర్లు కూడా పాలు పంచుకుంటున్నారు. రాష్ట్రంలో ఎక్కడ, ఏ వైసీపీ కార్యకర్తకు అన్యాయం జరిగినా.. ఆ యాప్ ఓపెన్ చేసుకుని, తన పూర్తి వివరాలు, తనకు జరిగిన అన్యాయం, అది ఎవరి వల్ల జరిగింది? దానికి సంబంధించి ఉన్న ఆధారాలు అప్‌లోడ్ చేస్తే చాలు. అది ఆటోమేటిక్‌గా ఇక్కడ మన డిజిటల్ లైబ్రరీలో నిక్షిప్తం అవుతుంది. రేపు మనం అధికారంలోకి రాగానే, ఆ డేటా ఓపెన్ చేసి చూస్తాం. ఇప్పుడు వేధిస్తున్న వారెవ్వరినీ వదలిపెట్టబోం. చట్టం ముందు వారిని నిలబెడతాం. చట్టం తన పని తాను చేసుకు పోతుంది. తప్పు చేసిన వారిని వదిలిపెట్టం. జైలుకు పంపిస్తామని వార్నింగ్ ఇచ్చారు జగన్..
రేపు ఏపీ కేబినెట్ భేటీ.. మహిళలకు గుడ్‌న్యూస్..!
ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన రేపు ఆంధ్రప్రదేశ్ కేబినెట్ సమావేశం జరగనుంది.. సచివాలయంలో జరిగిన ఈ కేబినెట్ సమావేశంలో పలు కీలక అంశాలపై చర్చించి ఆమోదం తెలపనుంది మంత్రివర్గం.. ముఖ్యంగా.. ఎంతోకాలంగా ఎదురుచూస్తోన్న మహిళలకు శుభవార్త చెప్పబోతోంది ప్రభుత్వం.. రేపు కేబినెట్ సమావేశంలో మహిళల ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణంపై చర్చించబోతున్నారు.. ఆర్టీసీ బస్సుల్లో మహిళల ఉచిత ప్రయాణానికి సంబంధించి అధికారికంగా పేరు ఖరారు చేసి ప్రకటన చేయనుంది ప్రభుత్వం.. పలు సంస్థలకు భూ కేటాయింపులపై కూడా చర్చించనున్నారు.. నాలా చట్ట సవరణకు సంబంధించి కేబినెట్ లో చర్చిస్తారు.. ఎల్ఆర్ఎస్.. బీఆర్ఎస్ పై కూడా కేబినెట్‌లో చర్చించే అవకాశం ఉంది.. సీఎం అండ్ టీం సింగపూర్ టూర్ పై చర్చించనుంది మంత్రివర్గం.. ఇక, కేబినెట్ సమావేశం తర్వాత తాజా పరిణామాలపై సీఎం చంద్రబాబు మంత్రులతో చర్చించనున్నారు.. లిక్కర్ కేసులు.. నగదు బయట పడడం.. అరెస్ట్ లకు సంబంధించి కూడా చర్చించనున్నారు..
ఈవీఎం వద్దు.. బ్యాలెట్ పేపర్ ముద్దు
ఢిల్లీ – భారతదేశంలో ఇకపైన జరిగే ప్రతి ఎన్నిక బ్యాలెట్ పేపర్ విధానంలోనే జరగాలని డిమాండ్ చేశారు బిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. బ్యాలెట్ విధానాన్ని బీహార్ అసెంబ్లీ ఎన్నికల నుంచే ప్రవేశపెట్టాలని కేంద్ర ఎన్నికల సంఘాన్ని కేటీఆర్ కోరారు. ఢిల్లీలో కేంద్ర ఎన్నికల సంఘం ఆహ్వానం మేరకు బిఆర్ఎస్ నేతల బృందం కేటీఆర్ నేతృత్వంలో ఈసీ అధికారులతో సమావేశం అయింది. దేశంలో ఎన్నికల వ్యవస్థ, నూతన సంస్కరణలు, ఎన్నికల నియమావళి వంటి అంశాలపై కేంద్ర ఎన్నికల సంఘం దేశంలోని అన్ని రాజకీయ పార్టీలతో సమావేశాలు నిర్వహిస్తుంది. అందులో బాగానే టిఆర్ఎస్ పార్టీని సమావేశానికి ఆహ్వానించింది.
బెంగాల్ బీజేపీ నేత సువేందు కాన్వాయ్‌పై దాడి.. తీవ్ర ఉద్రిక్తత!
పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో తీవ్ర ఉద్రిక్తత కొనసాగుతుంది. బీజేపీ నాయకుడు సువేందు అధికారి కాన్వాయ్‌పై గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేశారు. ఇవాళ (ఆగస్టు 5న) కూచ్ బెహార్‌లో నిర్వహించిన ర్యాలీలో సువేందు పాల్గొన్నారు. అయితే, రాష్ట్రంలో మహిళలపై హింస, నేరాలు పెరుగుతున్న క్రమంలో టీఎంసీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆయన ర్యాలీ చేపట్టారు. ఈ క్రమంలో కొందరు దుండగులు ఆయన కాన్వాయ్‌పై రాళ్లతో దాడికి పాల్పడ్డారు. ఈ దాడులకు సంబంధించిన వివరాలను ఎస్పీకి సమర్పించేందుకు ర్యాలీగా వెళ్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది.
ట్రంప్ వ్యాఖ్యలను లైట్ తీసుకున్న టీమ్ కుక్.. భారత్‌తోనే దోస్తాన్!
భారతదేశంలో ఐఫోన్లు తయారీ చేపట్టడంపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అసహనం వ్యక్తం చేశారు. మే నెలలో దోహా పర్యటన సందర్భంగా తన మనసులో మాటను అతడు బయట పెట్టాడు. ఇండియాలో తయారీ చేయడం తనకు ఏ మాత్రం ఇష్టంలేదంటూ టిమ్ కుక్ సమక్షంలోనే తెలియజేశాడు. అలాగే, ట్రేడ్ డీల్ విషయంలో కోపంగా ఉన్న ట్రంప్.. భారత్‌పై 25 శాతం టారీఫ్స్ విధించారు. అయితే, అందులో స్మార్ట్‌ఫోన్లు, కంప్యూటర్లు, ఎలక్ట్రానిక్ పరికరాలకు మినహాయింపు ఇచ్చాడు. దీంతో ప్రస్తుతానికి ఐఫోన్లపై ఎలాంటి సుంకాల ఎఫెక్ట్ లేనట్లే. కానీ, మున్ముందూ పరిస్థితి ఎలా ఉంటుందో చెప్పలేమని విశ్లేషకులు వెల్లడించారు.
ఎంజీ కళ్లు చెదిరే ఆఫర్స్.. ఆ మోడల్స్ పై రూ. 2.30 లక్షల డిస్కౌంట్
కొత్త కారు కొనాలనే ఆలోచనలో ఉన్నారా? డిస్కౌంట్ ఆఫర్ల కోసం ఎదురుచూస్తున్నారా? అయితే మీకు లక్కీ ఛాన్స్. ఎంజీ మోటార్ దేశంలో ఆరు సంవత్సరాలు పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా కంపెనీ రెండు SUV లపై లక్షల రూపాయల విలువైన డిస్కౌంట్ ఆఫర్లను అందిస్తోంది. ఎంజీ హెక్టార్, ఆస్టర్ లపై కళ్లు చెదిరే డిస్కౌంట్ ను ప్రకటించింది. కంపెనీ MG హెక్టర్ పై గొప్ప ఆఫర్లను అందిస్తోంది. దీనిని మిడ్-సైజ్ SUV గా అందిస్తున్నారు. ఈ నెలలో, మీరు ఈ SUV ని కొనుగోలు చేయడం ద్వారా రూ. 2.30 లక్షల వరకు ఆదా చేసుకోవచ్చు. ఈ ఆదా దాని షార్ప్ ప్రో MT వేరియంట్ పై అందుబాటులో ఉంటుంది. ఈ వేరియంట్ ను ఆఫర్ తో రూ. 19.59 లక్షల ఎక్స్-షోరూమ్ ధరకు కొనుగోలు చేయవచ్చు.
ఫ్యామిలీ లెగసీపై ఎన్టీఆర్ సంచలన వ్యాఖ్యలు
తాజాగా జూనియర్ ఎన్టీఆర్ ‘ఎస్క్వైర్ ఇండియా’ అనే ఒక మ్యాగజైన్‌కి ఇంటర్వ్యూ ఇచ్చాడు. అంతేకాక ఆ మ్యాగజైన్ కవర్ పేజీపై జూనియర్ ఎన్టీఆర్ ఫోటో ప్రచురించడంతో ఆయన అభిమానులు అందరూ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. అయితే ఆ మ్యాగజైన్‌కి ఇచ్చిన ఒక ఎక్స్‌క్లూజివ్ ఇంటర్వ్యూలో ఎన్టీఆర్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. తనకు తన కుటుంబానికి సంబంధించిన సినిమాల లెగసీ విషయంలో ఏం జరుగుతుందో తెలియదని, తాను ఆ విషయంలో ఎలాంటి ప్లాన్స్ వేసుకోలేదని చెప్పుకొచ్చాడు. కానీ తాను చెప్పే కథలతో తనను గుర్తుంచుకోవాలనే ప్రయత్నం మాత్రం చేస్తున్నానని అన్నారు. అన్నిటికన్నా ముఖ్యంగా తనను ఒక నటుడిగా కంటే ఎక్కువగా ఒక నిజాయితీగల మనిషిగా గుర్తించాలని కోరుకుంటున్నట్లు చెప్పుకొచ్చాడు. ఎమోషన్స్‌తో కూడిన నిజాయితీగల వ్యక్తిగా తనను గుర్తిస్తే చాలని ఆయన అన్నారు.
‘మాస్ జాతర’.. ‘ఓలే ఓలే’ భలే ఉందే!
మాస్ మహారాజా రవితేజ నటిస్తున్న ప్రతిష్టాత్మక 75వ చిత్రం ‘మాస్ జాతర’. భాను భోగవరపు దర్శకత్వం వహిస్తున్నారు. శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్ పతాకాలపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మిస్తున్నారు. ‘మాస్ జాతర’ కోసం అందరూ ఎంతగానో ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే విడుదలైన గ్లింప్స్ ప్రేక్షకులను మెప్పించి.. సినిమాపై భారీ అంచనాలు ఏర్పడేలా చేసింది. మొదటి గీతంగా విడుదలైన ‘తు మేరా లవర్’ అందరినీ ఉర్రూతలూగించింది. ఇప్పుడు రెండవ గీతంగా ‘ఓలే ఓలే’ను విడుదల చేసింది చిత్ర బృందం. అందరూ కాలు కదిపేలా ఎంతో ఉత్సాహభరితంగా ఈ సాంగ్ ఉంది.
బంద్ పై కార్మిక శాఖ కీలక వ్యాఖ్యలు!
తెలుగు సినీ పరిశ్రమలో 30% వేతనాల పెంపు కోసం తెలుగు ఫిల్మ్ ఫెడరేషన్ డిమాండ్ చేస్తున్న నేపథ్యంలో, ఈ వివాదం పరిష్కారం కోసం లేబర్ డిపార్ట్మెంట్ అడిషనల్ కమిషనర్ గంగాధర్ ఎన్టీవీతో కీలక ప్రకటనలు చేశారు. సినీ కార్మికుల ఫెడరేషన్ ఈ విషయంపై తమను సంప్రదించినట్లు ఆయన తెలిపారు. 2022లో చివరిసారిగా వేతనాలు సవరించిన తర్వాత, మూడేళ్ల వ్యవధిలో 30% వేతన పెంపు ఒప్పందం ప్రకారం అమలు చేయాలని ఫెడరేషన్ డిమాండ్ చేస్తోంది. అయితే, ప్రస్తుతం సినీ పరిశ్రమ ఆర్థిక నష్టాల్లో నడుస్తున్న నేపథ్యంలో, నిర్మాతల మండలి ఈ పెంపును అమలు చేయడం సాధ్యం కాదని స్పష్టం చేస్తోంది.
