NTV Telugu Site icon

Top Headlines @ 5 PM: టాప్‌ న్యూస్‌

Top Headlines @ 5 Pm New

Top Headlines @ 5 Pm New

హైడ్రాపై పవన్‌ కల్యాణ్‌ కీలక వ్యాఖ్యలు..
తెలంగాణ ప్రభుత్వం.. హైడ్రా (హైదరాబాద్‌ డిజాస్టర్‌ రెస్పాన్స్‌ అండ్‌ అస్సెట్‌ ప్రొటెక్షన్‌ ఏజెన్సీ) పేరుతో ఏర్పాటు చేసిన వ్యవస్థ ఇప్పుడు అక్రమ కట్టడాల పనిపడుతోంది.. హైదరాబాద్‌లో విపత్తు నిర్వహణ, ప్రభుత్వ ఆస్తుల రక్షణ కోసం ఒక స్వతంత్ర సంస్థగా ఇది ఏర్పాటు చేశారు.. దీనికి కమిషనర్‌ గా ఐపీఎస్ అధికారి ఏవీ రంగనాథ్‌ వ్యవహరిస్తున్నారు.. ఇప్పటికే పలు అక్రమ కట్టడాలను కూలుస్తూ దూకుడు చూపిస్తోంది హైడ్రా.. అయితే, హైడ్రాపై ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ కీలక వ్యాఖ్యలు చేశారు.. హైడ్రా విషయంలో రేవంత్ రెడ్డి చేసేది కరెక్ట్ అన్నారు.. హైడ్రా లాంటి ఒక వ్యవస్థ మంచిదే అని స్పష్టం చేశారు పవన్‌ కల్యాణ్‌.. ఏపీలో ఉన్న పరిస్థితుల్లో హైడ్రా లాంటి వ్యవస్థపై ఏం చేయాలి అనేది చర్చిస్తాం అన్నారు పవన్‌ కల్యాణ్.. హైదరాబాద్‌లో చెరువుల్లో ఇల్లు కట్టేస్తున్న సమయంలో చూసే వాడిని.. ఇళ్లు చెరువుల్లో కట్టేస్తే ఎలా అనుకునే వాడిని.. కానీ, ఇప్పుడు రేవంత్ రెడ్డి వచ్చి వాటిని తొలగిస్తున్నారు అని అభినందించారు.. నిబంధనలకు విరుద్ధంగా నిర్మాణాలు జరిగే సమయంలో కఠినంగా ఉండాలని.. అలా కాకుండా కట్టే సమయంలో సైలెంట్ గా ఉంటే ఇబ్బందులు తప్పవన్నారు.. ఇక, ఇళ్ల నిర్మాణాలు చేసే సమయంలో.. వెంచర్లు వేసే సమయంలో.. వీటిని అడ్డుకోవాలి.. పలుకుబడితో ఇలాంటి నిర్మాణాలు చేపడితే.. దాచుకున్న డబ్బుతో ఇళ్లను కొన్న వారికి వాటిని తొలగిస్తే నష్టం జరుగుతందన్నారు.. అలాంటి పరిస్థితి రాకుండా ఉండాలంటే ముందే ఈ ఆక్రమణలను, అనుమతులు ఇవ్వకుండా చర్యలు తీసుకోవాలని.. లేకుంటే 10 ఏళ్ల తర్వాతైనా మళ్లీ ప్రజలకు ఇబ్బందులు తప్పవని వ్యాఖ్యానించారు ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌..

అంతా బుడమేరుతోనే.. కబ్జాలు తొలగిస్తాం..
కృష్ణా నదికి మరో 40 వేల క్యూసెక్కుల నీరు వచ్చుంటే మరింత ప్రమాదం సంభవించేది అన్నారు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు.. అయితే, వరద ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యలు వేగంగా సాగుతున్నాయన్నారు.. ఫుడ్ డెలివరి ఇస్తున్నాం.. కానీ కొంత జాప్యం అయింది. ఫుడ్ క్వాలిటీ టెస్ట్ చేస్తున్నాం. ఐవీఆర్ఎస్ కాల్స్ ద్వారా ప్రజాభిప్రాయం తీసుకుంటున్నాం. బుడమేరులో ఇంకా రెండు గండ్లు పూడ్చాల్సి ఉంది అని వెల్లడించారు.. నీళ్లు లేని సబ్ స్టేషన్లను పునరుద్దరిస్తున్నాం. కొన్ని చోట్ల మున్సిపల్ వాటర్ సప్లై చేస్తున్నాం. ప్రస్తుతం వస్తున్న మున్సిపల్ నీటిని తాగడానికి కాకుండా ఇతర అవసరాలకు వినియోగించుకోవాలని సూచించారు.. ఫైరింజన్ల ద్వారా ఇళ్లను శుభ్రం చేస్తున్నాం అన్నారు. ఇక, ఐదు లక్షల ఎక్స్ గ్రేషియా మృతుల బంధువులకు ఇస్తాం. చనిపోయిన వారెవరైనా ఉంటే ఆ మృత దేహాలను పోస్టుమార్టం చేశాం అన్నారు. ఇప్పటి వరకు ఆరు లక్షల మందికి ఫుడ్ అందించాం. గర్భిణులను ఇబ్బందులు పడుతున్నారు.. వారిని గుర్తించి సేఫ్ గా తరలిస్తున్నాం అన్నారు.. ఇక, ఉదయం నుంచి ఎగువన వర్షపాతం నమోదైంది. కృష్ణా నదికి మరో 40 వేల క్యూసెక్కుల నీరు వచ్చుంటే మరింత ప్రమాదం సంభవించేదని ఆవేదన వ్యక్తం చేశారు సీఎం చంద్రబాబు.. భవానీపురంలో వచ్చిన నీళ్లు అన్ని ప్రాంతాలనూ ముంచెత్తింది. బుడమేరు ప్రవహాన్ని మళ్లించేందుకు తీసుకున్న చర్యలేవీ అమలు కాలేదన్నారు.. బుడమేరు సమీపంలో 2019 నుంచి ఆక్రమణలు పెరిగాయన్న ఆయన.. బుడమేరు కాల్వ.. వాగును లేకుండా ఆక్రమణలు వచ్చాయి. గత ఐదేళ్లల్లో వైసీపీ ప్రభుత్వం ఏం గాడిదలు కాస్తోంది అంటూ మండిపడ్డారు.. బుడమేరు ఆక్రమణలపై సర్వే చేయమన్నాం అన్నారు.. పోలవరం రైట్ మెయిన్ కెనాల్ గట్లను కూడా తవ్వేశారు. వైసీపీ చేసిన తప్పుకు అమాయకులు ఇబ్బంది పడ్డారు. వివిధ ఉద్యోగ సంఘాలు ఒక్క రోజు జీతం విరాళం ఇవ్వడానికి మందుకొచ్చారు. పరిస్థితిని నార్మల్ స్థితికి తీసుకురావాలి. సాయంత్రం లేదా రేపట్నుంచి నిత్యావసర వస్తవుల పంపిణీ చేపట్టనున్నామని వెల్లడించారు సీఎం చంద్రబాబు.. బుడమేరు నీరు కొల్లేరు, కృష్ణానదికి వెళ్లేలా చర్యలు తీసుకుంటాం. బుడమేరు ప్రవాహ దారిలో కాలువలు, వాగుల్లో కబ్జాలు తొలగిస్తాం. ఇలాంటి విపత్తులను అందరూ సమిష్టిగా ఎదుర్కోవాలి. వరద బాధితులు అందరికీ న్యాయం చేస్తాం అన్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు..

గుడ్లవల్లేరు ఘటనపై ప్రభుత్వం కీలక ఆదేశాలు..
ఆంధ్రప్రదేశ్‌లో సంచలనం సృష్టించిన కృష్ణా జిల్లాలోని గుడ్లవల్లేరు కళాశాల ఘటనపై విచారణకు ప్రభుత్వం కీలక ఆదేశాలు జారీ చేసింది.. బాలికల హాస్టల్ లో హిడెన్ కెమెరాలు పెట్టారని విద్యార్థుల ఫిర్యాదుపై దుమారం రేగిన విషయం విదితమే కాగా.. ఇప్పటికే ఈ ఘటనపై విచారణ చేపట్టారు పోలీసులు.. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు లోతైన విచారణ చేపట్టారు పోలీసులు.. అయితే, కంప్యూటర్ ఎమర్జన్సీ రెస్పాన్స్ టీమ్ (CERT) ద్వారా ఆధారాల సేకరణ చేయాలని పోలీసులు నిర్ణయం తీసుకున్నారు.. రేపు CERT టీం ముందుకి వచ్చి ఏమైనా ఆధారాలు ఉంటే ఉదయం నుంచి మధ్యాహ్నం 2 గంటలకు సమర్పించాలని విద్యార్దులను కోరారు పోలీసులు..

వైసీపీపై చంద్రబాబు ఫైర్.. అమరావతి మునిగిందా..? వీళ్లను పూడ్చాలి..!
వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు సీఎం చంద్రబాబు నాయుడు.. అమరావతి మునిగిందా..? వీళ్లను పూడ్చాలి.. అప్పుడే బుద్ది వస్తుంది అంటూ ఘాటుగా వ్యాఖ్యానించారు.. ఒక్క వ్యక్తి అహంభావం వల్ల పెద్ద ఎత్తున ప్రజలు ఇబ్బంది పడాలా..? ప్రజలు ఇబ్బందుల్లో ఉంటే తప్పుడు ప్రచారం చేస్తారా..? ఇలాంటి రాజకీయ నేరస్తులను.. తప్పుడు ప్రచారం చేసే వారిని సంఘ బహిష్కరణ చేయాలని కామెంట్‌ చేశారు.. వైసీపీ లాంటి పార్టీకి రాష్ట్రంలో ఉండే అర్హత లేదన్న సీఎం.. సాయం చేయకపోగా నిందలేస్తారా..? తప్పుడు ప్రచారం చేపడతారా..? ప్రజల కోసం నేను యజ్ఞం చేస్తుంటే.. వైసీపీ నేతలు రాక్షసుల్లా అడ్డం పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.. ప్రజలకు సేవ చేయాలి.. మరోవైపు రాక్షసులతో యుద్దం చేయాల్సి వస్తోందన్నారు సీఎం చంద్రబాబు.. బురద జల్లడం ఆపాలి.. సిగ్గుంటే క్షమాపణ కోరాలని డిమాండ్‌ చేశారు. తప్పుడు ప్రచారం చేసేవాళ్లని సహించను అని వార్నింగ్‌ ఇచ్చారు.. నా ఇంటిలోకి నీళ్లొస్తే.. వస్తాయి.. నీళ్లు వస్తాయి.. వెళ్తాయి. సంక్షోభ సమయంలో నేను దాని గురించే ఆలోచన చేస్తున్నా.. నా గురించి కాదన్నారు చంద్రబాబు.. ఇక, కేంద్ర మంత్రి అమిత్ షాతో ఫోన్లో మాట్లాడాను. ఏపీలోని వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించాలని కోరాను అని వెల్లడించారు.. విజయవాడలో రాజధానిలో భాగం.. ముంపు బారిన పడకుండా కార్యాచరణ రూపొందిస్తాం అన్నారు.. ఇదే సమయంలో.. బోట్లల్లో తరలింపు కోసం డబ్బులు తీసుకుంటే కేసులు పెడతామని హెచ్చరించారు.. ప్రైవేట్ బోట్ల వాళ్లూ డబ్బులు వసూలు చేయకూడదు.. తరలింపు కోసం డబ్బులు తీసుకుంటే అరెస్ట్ చేస్తాం అన్నారు. నిత్యావసర వస్తువుల ధరలు పెంచకుండా ఉండేలా ప్రణాళికలు రూపొందిస్తున్నాం.. నిత్యావసరాలు.. కూరగాయల ధరలకు ప్రభుత్వమే ఫిక్సడ్ రేట్ పెడతాం అన్నారు సీఎం చంద్రబాబు నాయుడు..

రాష్ట్రానికి రెఫరల్ ఆసుపత్రిగా నాట్కో క్యాన్సర్ కేంద్రం
‘వైద్యో నారాయణో హరిః’ అన్న సామెత ప్రకారం వైద్యుడు దేవుడితో సమానం. ఏదైనా జబ్బు వచ్చినప్పుడు మనకు వైద్యం చేసి బ్రతికించే వైద్యుడు నిజంగా దేవుడితో సమానం. సమాజంలో వైద్యల సేవలు మరవలేనివి. అయితే.. అలాంటి వైద్యులే ఒక్కటై ప్రజల కోసం మరింత ముందడుగు వేయడం అనేది వారి గొప్పతనానికి నిదర్శనం. రాష్ట్రంలోని ప్రభుత్వ వైద్య కళాశాలల్లో చదివి.. అమెరికాలో స్థిరపడిన వైద్య నిపుణులు ఏపీ రాష్ట్ర ప్రజల కోసం దేశానికే గర్వకారణంగా నాట్కో కాన్సర్‌ కేంద్రాన్ని ఏర్పాటు చేయడం రాష్ట్రంపై వారికి ఉన్న ప్రేమకు నిదర్శనం. అయితే.. ఈనెల 1న అమెరికాలోని ఫ్లోరిడా రాష్ట్రం ఆర్లాండోలో గుంటూరు, రంగరాయ, సిద్ధార్థ్ వైద్య కళాశాలల పూర్వ విద్యార్థుల 18వ ద్వైవార్షిక సదస్సు ఎంతో ముచ్చటగా జరిగింది. ఈ సందర్భంగా నాట్కో ఫార్మా కార్యనిర్వాహక ఉపా ధ్యక్షుడు నన్నపనేని సదాశివరావు మాట్లాడుతూ అంతర్జాతీయ ప్రమాణాలతో గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిలో నాట్కో క్యాన్సర్ కేంద్రాన్ని నిర్మించామని వెల్లడించారు.

పవర్ లూం క్లస్టర్ ను మంజూరు చేయండి.. పావులా వడ్డీకే రుణాలందించండి
కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ సిరిసిల్లలో పవర్ లూం క్లస్టర్ ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని కోరుతూ కేంద్ర జౌళిశాఖ మంత్రి గిరిరాజ్ సింగ్ ను కోరారు. దీంతోపాటు నేషనల్ హ్యాండ్లూం డెవలప్ మెంట్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో నేతన్నలు కొనుగోలు చేసేందుకు అవసరమైన ముడిసరుకు డిపో(యార్న్ డిపో)ను ఏర్పాటు చేయాలని విజ్ఝప్తి చేశారు. అట్లాగే ముడిసరుకు ఖర్చుల కారణంగా నేతన్నలు తీవ్రమైన ఆర్దిక ఇబ్బందులు పడుతున్న నేపథ్యంలో సబ్సిడీని 80 శాతం మేరకు పెంచాలని కోరారు. ఈరోజు ఢిల్లీలో గిరిరాజ్ సింగ్ ను కలిసిన బండి సంజయ్ ఈ మేరకు వినతి పత్రం అందజేశారు. సిరిసిల్లలో పవర్ లూం క్లస్టర్ ను ఏర్పాటు చేయడంవల్ల వేలాది మంది నేత కార్మికులకు ప్రయోజనం కలుగుతుందన్న్నారు. ముఖ్యంగా యంత్రాల ఆధునీకరణతోపాటు ఉత్పాదకతను, కార్మికుల మధ్య ఆరోగ్యకరమైన పోటీతత్వాన్ని పెంచుతుందన్నారు. నాణ్యమైన వస్త్రాలను అందించడంతోపాటు పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలు లభిస్తాయన్నారు. అట్లాగే యార్న్ డిపో ఏర్పాటువల్ల సిరిసిల్లో నేత కార్మికులకు ముడి సరకులు సులభంగా తక్కువ ధరకు లభిస్తాయన్నారు. ప్రస్తుతం నేత కార్మికులు తీవ్రమైన ఆర్దిక ఇబ్బందుల్లో ఉన్నారని, పెరిగిన ఖర్చులవల్ల ముడిసరకులను కూడా కొనుగోలు చేయడం కష్టమైందన్నరు. ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఇస్తున్న సబ్సిడీని 80 శాతానికి పెంచడంతోపాటు పావులా వడ్డీకే రుణాలు అందించేలా చర్యలు తీసుకోవాలని కోరారు.

30 ఏళ్ల సాయుధ పోరాటానికి తెర!.. త్రిపురలో ‘శాంతి ఒప్పందం’పై ఆమోదం
భారత ప్రభుత్వం, త్రిపుర ప్రభుత్వం, నేషనల్ లిబరేషన్ ఫ్రంట్ ఆఫ్ త్రిపుర (NLFT), ఆల్ త్రిపుర టైగర్ ఫోర్స్ (ATTF) ప్రతినిధులు బుధవారం కేంద్ర హోం మంత్రి అమిత్ షా సమక్షంలో త్రిపుర శాంతి ఒప్పందంపై సంతకాలు చేశారు. ఈ ఒప్పందం తర్వాత.. తాము ప్రభుత్వాన్ని విశ్వసించామని ఎన్ఎల్ఎఫ్‌‌టీ (NLFT) తెలిపింది. అందుకే 30 ఏళ్ల సాయుధ పోరాటానికి ముగింపు పలుకుతున్నామని స్పష్టం చేసింది. తమ నిబంధనలను పంచుకున్నామంది. హోంమంత్రిపై తమకు పూర్తి నమ్మకం ఉందని పేర్కొంది. ఈ శాంతి ఒప్పందానికి సహకరించిన హోం మంత్రి అమిత్ షాకు ధన్యవాదాలు తెలిపారు. ఈ శాంతి ఒప్పందానికి హోంమంత్రి రూపశిల్పి అని నిరూపించుకున్నారని అన్నారు. గత 10 ఏళ్లలో ఈశాన్య ప్రాంతంలో డజనుకు పైగా శాంతి ఒప్పందాలు జరిగాయని, అందులో 3 ఒప్పందాలు త్రిపురకు సంబంధించినవేనని చెప్పారు. త్రిపుర భవిష్యత్తు ఉజ్వలంగా ఉండనుందని ఆశాభావం వ్యక్తం చేారు. ప్రధాని మోడీకి కూడా కృతజ్ఞతలు తెలిపారు.

ఫిరాయింపు ఎమ్మెల్యేలకు బిగ్ షాక్.. ఇకపై పెన్షన్ కట్.. అసెంబ్లీలో బిల్లు ఆమోదం
హిమాచల్‌ప్రభుత్వం అసెంబ్లీలో సరికొత్త బిల్లును ఆమోదించింది. ఫిరాయింపు ఎమ్మెల్యేలకు పెన్షన్ ఇవ్వకూడదని శాసనసభలో ప్రభుత్వం కొత్త బిల్లును ప్రవేశపెట్టింది. బుధవారం బిల్లును అసెంబ్లీ ఆమోదించింది. దీంతో ఫిరాయింపు ఎమ్మెల్యేలకు గట్టి షాక్ తగిలినట్లైంది. బిల్లు ఆమోదంతో తిరుగుబాటు ఎమ్మెల్యేలకు పింఛన్ అందదు. రాజ్యసభ ఎన్నికల సమయంలో హిమాచల్‌ప్రదేశ్‌లో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు క్రాస్ ఓటింగ్‌కు పాల్పడ్డారు. దీంతో బీజేపీ అభ్యర్థి సునాయసంగా గెలుపొందాడు. అధికారంలో ఉన్న కాంగ్రెస్.. రాజ్యసభ సీటును కోల్పోవల్సి వచ్చింది. ఈ పరిణామం కాంగ్రెస్‌కు తీవ్ర నష్టాన్ని కలిగించింది. ఈ సంఘటనలను దృష్టిలో ఉంచుకుని ముఖ్యమంత్రి సుఖ్విందర్ సింగ్.. బుధవారం అసెంబ్లీలో కొత్త బిల్లును ప్రవేశపెట్టారు. ఫిరాయింపు ఎమ్మెల్యేలకు భవిష్యత్‌లో పింఛన్ ఇవ్వకూడదని బిల్లు ప్రవేశపెట్టగా ఆమోదం పొందింది. బిల్లు ఆమోదంతో ఇకపై ఫిరాయింపు ఎమ్మెల్యేలకు పెన్షన్ అందదు.

నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్
దేశీయ స్టాక్ మార్కెట్‌లో జోరుకు బ్రేకులు పడ్డాయి. గత వారం రికార్డుల మోత మోగించిన సూచీలు.. ఈ వారం మాత్రం ఆ ప్రభావం ఏ మాత్రం కనిపించలేదు. అంతర్జాతీయ మార్కెట్‌లోని ప్రతికూల సంకేతాలు మన మార్కెట్‌పై ప్రభావం చూపించడంతో బుధవారం ఉదయం నష్టాల్లోనే సూచీలు ప్రారంభమయ్యాయి. ముగింపు దాకా అలాగే ట్రేడ్ అయ్యాయి. సెన్సెక్స్ 202 పాయింట్లు నష్టపోయి 82, 352 దగ్గర ముగియగా.. నిఫ్టీ 81 పాయింట్లు నష్టపోయి 25, 198 దగ్గర ముగిసింది. రూపాయి మారకం విలువ డాలర్‌తో పోలిస్తే రూ. 83.96 దగ్గర ముగిసింది. నిఫ్టీలో ఏషియన్ పెయింట్స్, గ్రాసిమ్ ఇండస్ట్రీస్, హెచ్‌యుఎల్, అపోలో హాస్పిటల్స్, సన్ ఫార్మా లాభాల్లో కొనసాగగా.. విప్రో, కోల్ ఇండియా, ఒఎన్‌జిసి, హిందాల్కో ఇండస్ట్రీస్, ఎం అండ్ ఎం నష్టపోయాయి. సెక్టోరల్‌లో ఎఫ్‌ఎంసీజీ, రియాల్టీ, ఫార్మా 0.5 శాతం చొప్పున లాభపడగా.. ఆటో, బ్యాంక్, ఎనర్జీ, ఐటి, మెటల్ 0.4-1 శాతం క్షీణించాయి. బీఎస్‌ఇ మిడ్‌క్యాప్ సూచీ స్వల్పంగా నష్టపోగా, స్మాల్‌క్యాప్ ఇండెక్స్ గ్రీన్‌లో ముగిసింది.

మళ్లీ ప్రధాన కోచ్ బాధ్యతలు చేపట్టిన రాహుల్ ద్రవిడ్!
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2025లో భారత జట్టు మాజీ ప్రధాన కోచ్ రాహుల్ ద్రవిడ్‌కు మళ్లీ కోచ్ బాధ్యతలు స్వీకరించారు. ఆయన ఐపీఎల్ 2025 సీజన్‌కు ముందు రాజస్థాన్ రాయల్స్ (RR)కి ప్రధాన కోచ్ గా నియమితులయ్యారు. ఈ ఏడాది జూన్‌లో టీ20 ప్రపంచకప్ గెలిచిన భారత జట్టుకు రాహుల్ ద్రవిడ్ ప్రధాన కోచ్ గా వ్యవహరించిన విషయం తెలిసిందే. ఆయన తర్వాత గౌతమ్ గంభీర్ ప్రధాన కోచ్‌గా నియమితులయ్యారు. ‘ఈఎస్‌పిఎన్‌క్రిక్‌ఇన్‌ఫో’ నివేదిక ప్రకారం.. ద్రావిడ్ ఇటీవలే ఫ్రాంచైజీతో ఒప్పందం కుదుర్చుకున్నారు. రాబోయే మెగా వేలానికి ముందు ఆటగాళ్లను రిటైన్ చేసుకోవడంపై ప్రాథమిక చర్చలు జరిపారు. అండర్-19 నుంచి ద్రవిడ్ రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్ సంజూ శాంసన్‌తో సుదీర్ఘ సంబంధాన్ని కలిగి ఉన్నారు. ద్రవిడ్‌కు రాజస్థాన్ రాయల్స్‌తో సుదీర్ఘ చరిత్ర ఉంది. ఆయన ఐపీఎల్ 2012( IPL 2012) మరియు 2013లో ఈ టీంకు కెప్టెన్‌గా ఉన్నారు. 2014 మరియు 2015 ఐపీఎల్ సీజన్‌లలో జట్టు డైరెక్టర్, మెంటార్‌గా పనిచేశారు. 2016లో.. ద్రావిడ్ ఢిల్లీ డేర్‌డెవిల్స్ (ప్రస్తుతం ఢిల్లీ క్యాపిటల్స్)కి మారారు. 2019లో రాహుల్ ద్రవిడ్ బెంగళూరులోని నేషనల్ క్రికెట్ అకాడమీ హెడ్‌గా బాధ్యతలు చేపట్టారు. 2021లో భారత క్రికెట్ జట్టు ప్రధాన కోచ్‌గా నియమితులయ్యారు. ఆయన మూడేళ్ల కోచింగ్ పదవీ కాలంలో, ద్రావిడ్ భారత జట్టును టీ20 వరల్డ్ ఫైనల్స్ 2021, 2023, ఓడీఐ ప్రపంచ కప్ 2023 ఫైనల్‌కు తీసుకెళ్లారు. జూన్ 29, 2024న రాహుల్ సారథ్యంలో టీమ్ ఇండియా టీ20 ప్రపంచ కప్‌లో ఛాంపియన్‌గా నిలిచింది. భారత మాజీ బ్యాట్స్‌మెన్ విక్రమ్ రాథోడ్‌ను ద్రవిడ్‌కు సహాయ కోచ్‌గా రాజస్థాన్ రాయల్స్ నియమించే అవకాశం ఉందని క్రిక్‌ఇన్‌ఫో నివేదికలో కూడా పేర్కొన్నారు. భారత మాజీ సెలెక్టర్ అయిన రాథోడ్ 2019లో భారత బ్యాటింగ్ కోచ్ కావడానికి ముందు ఎన్సీఏలో ద్రవిడ్ కోచింగ్ స్టాఫ్‌లో భాగంగా ఉన్నారు.

లైవ్‌లో రెహమాన్ గూస్‌బంప్స్.. ఆగలేకపోతున్నాం మావా!!
ఇప్పుడంటే కాస్త రేసులో వెనకబడిపోయారు కానీ, ఒకప్పటి ఏ.ఆర్. రెహమాన్ వేరే. అసలు రెహమాన్ మ్యూజిక్ అందిస్తున్నాడు అంటే చాలు.. ఆ సినిమా హిట్ అయినట్టే. ముఖ్యంగా శంకర్ లాంటి డైరెక్టర్‌తో రెహమాన్ చేసిన మ్యూజిక్ అద్భుతాలు అన్నీ ఇన్నీ కావు. ఇక ‘స్లమ్ డాగ్ మిలియనీర్’ సినిమాతో ఆస్కార్ కొట్టి.. తన సంగీతాన్ని ప్రపంచానికి పరిచయం చేసిన రెహమాన్.. గత కొంత కాలంగా ఆశించిన స్థాయిలో సంగీతం అందించలేకపోతున్నారు. దీంతో.. ఇక రెహమాన్ పనైపోయినట్టేనని అనుకున్నారు. ఇలాంటి సమయంలో.. రెహమాన్ కొడితే ఎలా ఉంటుందో ‘రాయన్’ సినిమాతో మరోసారి ప్రూవ్ అయింది. ధనుష్ హీరోగా తెరకెక్కిన ‘రాయన్’ సినిమాలో.. రెహమాన్ సెకండ్ హీరోగా నిలిచారు. అదిరిపోయే బ్యాక్ గ్రౌండ్ స్కోర్‌తో థియేటర్లో గూస్ బంప్స్ తెప్పించాడు. అయితే.. రాయన్ థియేటర్లోనే కాదు.. లైవ్‌లో కూడా రోమాలు నిక్కబొడిచేలా చేశాడు ఈ మ్యూజిక్ లెజెండరీ. రాయ‌న్ సినిమాలోని ‘ఉసురే నీదానే..’ అనే పాట చాల పాపులర్ అయిన సంగతి తెలిసిందే. ఇదే పాటను.. సింగ‌పూర్ మ్యూజిక్ కాన్సర్ట్‌లో ఆలపించారు రెహమాన్. ఈ వేదిక‌ పై సింగ‌ర్ మ‌నోతో క‌లిసి ఈ పాట పాడి అల‌రించాడు. అయితే.. మ‌నో ఈ సాంగ్ పాడుతుండగా.. ఎఆర్. రెహమాన్ మ‌ధ్య‌లో గ్యాప్ తీసుకోమని చెబుతాడు. దీంతో.. అసలేం జరుగుతుందో ‘మనో’కి కూడా అర్థం కాదు. రెహమాన్ అలా చేయడంతో.. ఆడిటోరియం అంతా గోలతో దద్దరిల్లిపోయింది. కానీ ఒక్కసారిగా రెహమాన్ ‘ఉసురే నీదానే..’ అని పాడడంతో.. అక్కడున్న వారికే కాదు.. ఈ వీడియో చూసిన వారికి కూడా గూస్‌బంప్స్ గ్యారెంటీ. ఈ మూమెంట్ సింగపూర్ ఈవెంట్‌కే హైలైట్‌గా నిలిచింది.

పెళ్లిపై బాంబు పేల్చిన తమన్నా
మిల్కీ బ్యూటీ తమన్నా గురించి తెలుగు ప్రేక్షకులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. అప్పుడెప్పుడో శ్రీ అనే సినిమాలో మంచు మనోజ్ పక్కన హీరోయిన్ గా పరిచయమైన తమన్నా తర్వాత తెలుగులో కొంతకాలం టాప్ హీరోయిన్స్ లీగ్ లో కూడా కొనసాగింది. ఈ మధ్యలో కొత్త భామల ఎంట్రీతో కాస్త వెనకబడిన ఆమె విజయ్ వర్మ అనే నటుడితో ప్రేమలో పడి మునిగి తేలుతోంది. అయితే తమన్న ప్రేమ గురించి సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది కానీ ఆమె పెళ్లి ఎప్పుడు? అనే విషయం మీద మాత్రం క్లారిటీ లేదు. తాజాగా హైదరాబాదులో ఒక షాప్ ఓపెనింగ్ నిమిత్తం వచ్చిన తమన్నాని ఎన్టీవీ ప్రత్యేకంగా పలకరించింది. మీ పెళ్లి కబుర్లు ఏమైనా చెప్పమని అడిగితే దానికి ఆమె ఇప్పట్లో తాను పెళ్లి చేసుకోవడం లేదు కంగారు పడవద్దు అంటూ కామెంట్ చేసింది. అయితే విజయ వర్మతో తమన్నా ప్రేమలో ఉన్న మాట వాస్తవమే కానీ ఇప్పుడే పెళ్లి చేసుకోవాలని ఆమె అనుకోవడంలేదని తాజా కామెంట్స్ తో క్లారిటీ వచ్చినట్లు అయింది. ఇక తమన్నాకి తెలుగులో అవకాశాలు తగ్గడంతో ఆమె ఎక్కువగా హిందీలో సినిమాలు చేసేందుకు ప్రయత్నాలు చేస్తోంది. హిందీలో హీరోయిన్ గా మాత్రమే కాకుండా అతిథి పాత్రలు కూడా ఏమాత్రం కాదనకుండా చేస్తూ పోతోంది. చివరి డెస్టినేషన్ ఎలాగో హీరోయిన్లకు బాలీవుడ్డే కాబట్టి ఇకపై బాలీవుడ్ లోనే ప్రాజెక్టులు చేసేందుకు ఆమె ప్రయత్నాలు చేస్తున్నట్లుగా తెలుస్తోంది. తెలుగులో అవకాశాలు వస్తే కూడా వెనక్కి తగ్గకుండా అవి కూడా ఒప్పుకునేందుకు ఆమె సిద్ధంగా ఉంది.

Show comments