NTV Telugu Site icon

Top Headlines @ 5 PM: టాప్‌ న్యూస్‌

Top Headlines @ 5 Pm New

Top Headlines @ 5 Pm New

మరోసారి రూ.100 కోట్ల మార్క్‌ దాటిన శ్రీవారి హుండీ..
తిరుమల శ్రీవారి హుండీ ఆదాయం మరోసారి వంద కోట్ల మార్క్‌ను దాటింది.. వరుసగా 33వ నెల 100 కోట్ల మార్కుని దాటింది. నవంబర్ నెలలో స్వామివారికి హుండీ ద్వారా 111 కోట్ల రూపాయల ఆదాయం లభించింది. దీనితో ఈ ఏడాది మొత్తంగా స్వామివారికి 11 నెలల కాలంలో హుండీ ద్వారా 1,253 కోట్ల రూపాయల ఆదాయం లభించినట్టు అయ్యింది.. కాగా, కలియుగ ప్రత్యక్ష దైవమైన శ్రీవారి దర్శనార్థం నిత్యం వేల సంఖ్యలో భక్తులు తిరుమలకు తరలివస్తుంటారు. స్వామివారి దర్శనార్థం తిరుమలకు విచ్చేసే భక్తులు తమ మొక్కులు చెల్లింపులో భాగంగా హుండీలో కానుకలు సమర్పిస్తుంటారు. ఇలా స్వామివారికి నిత్యం మూడు కోట్ల నుంచి ఐదు కోట్ల వరకు హుండీ ద్వారా ఆదాయం లభిస్తుంది. దీనితో నెలకి 100 కోట్లు పైగా స్వామివారికి హుండీ ఆదాయం లభిస్తుండగా ఏడాదికి హుండీ ద్వారా లభించే ఆదాయం 1300 కోట్లను దాటేస్తుంది. ఈ ఏడాది వరసగా స్వామివారికి 33వ నెల కూడా హుండీ ఆదాయం 100 కోట్ల మార్క్ ని దాటింది. కోవిడ్ కాలంలో తగ్గిన స్వామివారి హుండీ ఆదాయం.. అటు తరువాత 2022 మార్చి నుంచి కూడా ప్రతినెలా వందకోట్ల మార్కును దాటుతూ వస్తుంది. కాకపోతే గత ఏడాదితో పోలిస్తే మాత్రం ఈ ఏడాది స్వామివారికి లభిస్తున్న కానుకలు కొంత తగుముఖం పట్టింది. ఈ ఏడాది జనవరి నెలలో శ్రీవారికి 116 కోట్లు.. ఫిబ్రవరి నెలలో 112 కోట్లు.. మార్చి నెలలో 118 కోట్లు.. ఏప్రిల్ నెలలో 101 కోట్లు.. మే నెలలో 108 కోట్లు.. జూన్ నెలలో 114 కోట్లు.. జూలై నెలలో 125 కోట్లు.. ఆగస్టు నెలలో 126 కోట్లు.. సెప్టెంబర్ నెలలో 114 కోట్లు.. అక్టోబర్ నెలలో 127 కోట్లు.. నవంబర్ నెలలో 111 కోట్ల రూపాయలు హుండీ ద్వారా స్వామివారికి ఆదాయం లభించింది. ఇలా ఈ ఏడాది ఇప్పటివరకు శ్రీవారికి 1253 కోట్ల రూపాయల ఆదాయం లభించింది. డిసెంబర్ నెలతో కలిపితే స్వామివారి హుండీ ఆదాయం 1360 కోట్ల వరకు చేరుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి.

ముగిసిన వైసీపీ విస్తృత సమావేశం.. పోరుబాట కార్యాచరణ ప్రకటన..
వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి అధ్యక్షతన జరిగిన వైసీపీ రాష్ట్రస్థాయి విస్తృత సమావేశం ముగిసింది.. ఈ సమావేశంలో పోరుబాట కార్యాచరణ ప్రకటించారు వైఎస్‌ జగన్‌.. రైతు సమస్యలపై డిసెంబర్ 11న ర్యాలీలు, కలెక్టర్లకు విజ్ఞాపన పత్రం ఇవ్వనుంది వైసీపీ.. డిసెంబర్ 27న కరెంట్ ఛార్జీలపై ఆందోళనకు పిలుపునిచ్చారు.. కరెంట్ చార్జీలను తగ్గించాలని డిమాండ్ చేస్తూ SE,CMD కార్యాలయాలకు ర్యాలీలు నిర్వహించాలని.. విజ్ఞాపన పత్రాలు ఇవ్వాలని వైసీపీ నిర్ణయించింది.. ఇక, జనవరి 3న ఫీ రీయింబర్స్ మెంట్ కోసం వైసీపీ పోరు బాట నిర్వహించనుంది.. విద్యార్థులతో కలిసి కలెక్టర్లకు వినతి పత్రం ఇవ్వనున్నారు.. రైతుల సమస్యలు, కరెంటు ఛార్జీలు, ఫీజు రియింబర్స్‌మెంట్‌పై వైసీపీ పోరుబాట కార్యాచరణ ప్రకటించారు వైఎస్‌ జగన్‌.. తాడేపల్లిలోని వైసీపీ ప్రధాన కార్యాలయంలో జరిగిన ఈ సమావేశానికి జిల్లా పార్టీ అధ్యక్షులు, కార్యదర్శులు, ప్రదాన కార్యదర్శులు, రీజినల్‌ కో-ఆర్డినేటర్లు హాజరయ్యారు.. ఈ సమావేశంలో వైఎస్‌ జగన్‌ పోరుబాట కార్యాచరణ ప్రకటించారు.. రైతులు ఎదుర్కొంటున్న సమస్యలపై డిసెంబర్‌ 11న ర్యాలీ, కలెక్టర్‌కు విజ్ఞాపన పత్రం ఇవ్వనుండగా.. రూ.20 వేల పెట్టుబడి సహాయం, ధాన్యానికి మద్దతు ధర, ఉచిత పంటల భీమా పునరుద్ధరణకు డిమాండ్‌ చేస్తోంది వైసీపీ.. డిసెంబర్‌ 27న కరెంటు ఛార్జీలపై ఆందోళన నిర్వహించి.. కరెంటు ఛార్జీల పెంపును ఉపసంహరించుకోవాలని డిమాండ్‌ చేయనుంది.. జనవరి 3న ఫీజురియింబర్స్‌మెంట్‌కోసం పోరుబాట నిర్వహించనున్నట్టు ప్రకటించారు..

‘దేవర’ పాటకు స్టెప్పులేశాడు.. మంత్రి లోకేష్‌ని కలిశాడు..
సోషల్‌ మీడియా అందుబాటులోకి వచ్చిన తర్వాత.. ఎన్నో అఘాయిత్యాలు.. అపచారాలు చోటు చేసుకున్నా.. మట్టిలోని మాణిక్యాలను సైతం వెలికితీసిన ఘటనలు కూడా ఉన్నాయి.. సోషల్‌ మీడియాతో ఫేమస్‌ అయినవాళ్లు.. ఓవర్‌నైట్‌లో సెలబ్రిటీలు అయినవాళ్లు కూడా లేకపోలేదు.. అయితే, విధి నిర్వహణలో ఉండగా దేవర సినిమాలోని పాటకు స్టెప్పులు వేశాడు ఆర్టీసీ డ్రైవర్‌.. ఆ వీడియో కాస్తా వైరల్‌గా మారిపోవడంతో.. ఏపీఎస్‌ఆర్టీసీ అతడిపై చర్యలు తీసుకుంది.. కానీ, మంత్రి నారా లోకేష్‌ జోక్యంతో సస్పెన్షన్‌ రద్దు అయ్యింది.. ఇక, ఈ రోజు సస్పెన్షన్ కు గురైన తుని ఆర్టీసీ డిపో డ్రైవర్ లోవరాజు మంత్రి నారా లోకేష్ ను కలిశారు. తన సస్పెన్షన్ రద్దుచేయించి, తిరిగి విధుల్లోకి తీసుకునేలా చొరవ చూపించిన మంత్రి లోకేష్ ను కుటుంబ సభ్యులతో సహా కలిసి కృతజ్ఞతలు తెలిపారు. కాకినాడ జిల్లా తుని ఆర్టీసీ డిపోలో లోవరాజు అవుట్ సోర్సింగ్ విధానంలో డ్రైవర్ గా పనిచేస్తున్నాడు. అక్టోబర్ 24న బస్సు రౌతులపూడి నుంచి తుని డిపోకు వెళ్తుండగా మార్గమధ్యలో కర్రల లోడ్ ట్రాక్టర్ అడ్డొచ్చింది. చిన్న రోడ్డు కావడం, బస్సు ముందుకు వెళ్లలేని పరిస్థితుల్లో బస్సును నిలిపివేశారు. ఈ లోగా ప్రయాణికులకు వినోదం పంచడానికి సరదాగా కాసేపు దేవర సినిమాలోని పాటకు డ్యాన్స్ వేశాడు. ఇది కాస్తా ఓ యువకుడు వీడియో తీయడంతో వైరల్‌గా మారిపోయింది.. సోషల్ మీడియాలో డ్రైవర్ లోవరాజు డ్యాన్స్ చూసిన మంత్రి లోకేష్ మెచ్చుకున్నారు. ఈలోగానే నిబంధనలు ఉల్లంఘించారనే కారణంతో లోవరాజును అధికారులు సస్పెండ్ చేశారు. ఇది కాస్తా మంత్రి నారా లోకేష్ దృష్టికి రావడంతో సస్పెన్షన్ ఉత్తర్వులు రద్దు చేయిస్తానని హామీ ఇచ్చారు. అమెరికా నుంచి తిరిగి వచ్చిన తర్వాత వ్యక్తిగతంగా కలుస్తానని మాట ఇచ్చారు. దీంతో లోవరాజు కుటుంబంతో సహా మంత్రిని కలిశారు. ఈ సందర్భంగా లోవరాజు యోగక్షేమాలను మంత్రి లోకేష్ అడిగి తెలుసుకున్నారు. అన్ని విధాల అండగా ఉంటానని హామీ ఇచ్చారు మంత్రి నారా లోకేష్‌..

చివరి నిమిషంలో PSLV-C59 రాకెట్‌ ప్రయోగం వాయిదా.. కారణం ఇదే..!
భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రో ఈ రోజు నిర్వహించాల్సిన PSLV-C59 రాకెట్‌ ప్రయోగాన్ని వాయిదా వేసింది.. కౌంట్‌డౌన్‌ ప్రక్రియ మంగళవారం రోజు ప్రారంభం కాగా.. కౌంట్‌డౌన్‌ను విజయవంతంగా ముగించుకుని ఈ రోజు సాయంత్రం 4.12 గంటలకు తిరుపతి జిల్లా శ్రీహరికోటలోని సతీష్‌ దావన్‌ అంతరిక్ష రాకెట్ ప్రయోగ కేంద్రం నుంచి పీఎస్‌ఎల్వీ-సీ59 రాకెట్‌ను ప్రయోగించాల్సి ఉంది.. అయితే, చివరి క్షణాల్లో ప్రయోగాన్ని రేపటికి వాయిదా వేస్తున్నట్టు ప్రకటించింది ఇస్త్రో.. శాటిలైట్‌లో సాంకేతిక లోపాన్ని గుర్తించిన ఇస్త్రో శాస్త్రవేత్తలు.. ఆ వెంటనే కౌంట్‌ డౌన్‌ ప్రక్రియను నిలిపివేశారు. ప్రోబా-3 ఉపగ్రహంలో సాంకేతిక లోపం ఉన్నట్లు శాస్త్రవేత్తలు గుర్తించారు.. ప్రయోగానికి ముందు అన్ని విభాగాలను కంప్యూటర్ తో పరీక్షలు నిర్వహించారు.. అయితే, ఉపగ్రహంలో లోపం ఉన్నట్లు కంప్యూటర్ గుర్తించింది.. దీనిపై శాస్త్రవేత్తల సమీక్షించిన ఇస్రో చైర్మన్ డాక్టర్ సోమనాథ్.. ఆ తర్వాత కౌంట్‌డౌన్‌ ప్రక్రియ నిలిపివేసి.. ప్రయోగాన్ని రేపటికి వాయిదా వేస్తున్నట్టు ప్రకటించారు.. ఇక, రేపు సాయంత్రం అనగా గురువారం రోజు సాయంత్రం 4.12 గంటలకు PSLV-C59 రాకెట్‌ను ప్రయోగించనుంది ఇస్త్రో..

ఏపీ విద్యాశాఖ వినూత్న నిర్ణయం.. దేశంలోనే తొలిసారి..!
ఆంధ్రప్రదేశ్‌లో వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టేందుకు సిద్ధమైంది విద్యాశాఖ.. దేశంలోని ఇప్పటి వరకు ఏ రాష్ట్రంలో జరగని విధంగా మెగా పేరెంట్ మీటింగ్ చేస్తున్న మొదటి రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్‌ నిలవబోతోంది అంటున్నారు.. పాఠశాల విద్యాశాఖ సెక్రెటరీ కోన శశిధర్.. ఈ నెల 7వ తేదీన మెగా పేరెంట్ టీచర్ మీట్ నిర్వహిస్తాం.. 44,303 పాఠశాలల్లో ఒకేరోజు ఈ మెగా పేరెంట్‌ టీచర్‌ మీట్‌ నిర్వహణ ఉందన్నారు.. 38,319 మండలపరిషత్, జిల్లా పరిషత్ పాఠశాలలు.. 2,807 మునిసిపల్ పాఠశాలలు, 1054 రెసిడెన్షియల్, 2843 ప్రభుత్వ పాఠశాలల్లో 7వ తేదీన ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకూ సమావేశం నిర్వహించనున్న్టు వెల్లడించారు.. కోటి మందికి పైగా ఈ సమావేశంలో పాల్గొంటారని అంచనా వేస్తున్నారు.. పిల్లలు స్వయంగా తయారు చేసిన ఇన్విటేషన్ కార్డులు తలిదండ్రులకు ఇప్పించామని తెలిపారు కోన శశిధర్.. మెగా పేరెంట్ మీటింగ్ చేస్తున్న మొదటి రాష్ట్రం ఏపీయేనన్న ఆయన.. HOLISTIC PROGRESS CARD పిల్లలకు నచ్చే విధంగా తయారుచేశాం.. ప్రతి విద్యార్ధి గురించి ఉపాధ్యాయులు స్వయంగా రాస్తారు.. ప్రతీ పేరెంట్ కి Holistic Progress Card ఉపాధ్యాయులు స్వయంగా ఇవ్వడం ద్వారా ఇద్దరి మధ్య అనుసంధానం కలిగిస్తున్నాం.. తల్లులకు ఒక రంగోలీ పోటీ, తండ్రులకు టగ్ ఆఫ్ వార్ నిర్వహిస్తాం.. 900 స్కూళ్లలో హెల్త్ స్క్రీనింగ్ చేశాం.. మిగిలిన స్కూళ్లలో కూడా జరుగుతుందని తెలిపారు.. ఇక, పూర్వ విద్యార్ధులు, ప్రస్తుత విద్యార్థులు, తలిదండ్రులు, ప్రధానోపాధ్యాయులు ఉండగా ఒక యాక్టివ్ గా ఉండే తల్లులతో బహిరంగ సభ నిర్వహించనున్నట్టు వెల్లడించారు. స్టార్ రేటింగ్ ఇవ్వాలని నిర్ణయించాం.. విద్య, సదుపాయాలపై స్కూల్‌కు స్టార్ రేటింగ్ ఇస్తాం అన్నారు..

రాహుల్ గాంధీకి వ్యతిరేకంగా ప్రయాణికుల నినాదాలు.. కాంగ్రెస్ కార్యకర్తలతో ఘర్షణ..
ఉత్తర్ ప్రదేశ్‌లో సంభాల్ పట్టణంలోని షాహీ జామా మసీదు సర్వే వివాదం హింసాత్మకంగా మారింది. సర్వేకు వచ్చిన అధికారులు, పోలీసులపై వేల మంది గుంపు రాళ్లదాడికి పాల్పడింది. ఇది మొత్తం హింసాత్మకంగా మారింది. ఈ ఘటనలో ఐదుగురు వ్యక్తులు మరణించారు. 30 మంది వరకు పోలీసులకు గాయాలయ్యాయి. ఇదిలా ఉంటే, ఈ హింసాత్మక ఘటనలో బాధితుల్ని కలిసేందుకు ఈ రోజు లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ, వయనాడ్ ఎంపీ ప్రియాంకాగాంధీ, ఇతర కాంగ్రెస్ ఎంపీలు సంభాల్ పర్యటనకు వెళ్లారు. పర్యటన నేపథ్యంలో ఢిల్లీ-యూపీ సరిహద్దుల్లోనే రాహుల్ గాంధీని పోలీసులు అడ్డుకున్నారు. లా అండ్ ఆర్డర్ సమస్య కారణంగా అక్కడికి వెళ్లేందుక అనుమతించలేదు. ఈ నేపథ్యంలో రోడ్డుపై భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. అయితే, గంటల తరబడి ట్రాఫిక్ జామ్‌లో చిక్కుకున్న ప్రయాణికులు రాహుల్ గాంధీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. రాహుల్ గాంధీని, ఇతర కాంగ్రెస్ నేతల్ని అడ్డుకునేందుకు ఘాజీపూర్ బార్డర్ వద్ద బారికేడ్లు ఏర్పాటు చేశారు. దీంతో అసహనానికి గురైన ప్రయాణికులు ‘‘రాహుల్ గాంధీ ముర్దాబాద్’’ అంటూ నినాదాలు చేశారు. అయితే, అక్కడే ఉన్న కాంగ్రెస్ కార్యకర్తలు ఈ నినాదాలతో ఆగ్రహం చెందారు. దీంతో ప్రయాణికులు, కాంగ్రెస్ కార్యకర్తల మధ్య ఘర్షణ జరిగింది.

గూగుల్ కంపెనీతో తెలంగాణ ప్రభుత్వం కీలక ఒప్పందం..
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గూగుల్ కంపెనీతో కీలక ఒప్పందం చేసుకుంది. దేశంలోని మొట్టమొదటి గూగుల్ సేఫ్టీ ఇంజినీరింగ్ సెంటర్ (GSEC)ని హైదరాబాద్‌లో నెలకొల్పేందుకు గూగుల్ ముందుకొచ్చింది. భాగ్యనగరంలో స్థాపించే సేఫ్టీ ఇంజనీరింగ్ సెంటర్ ప్రపంచంలోనే ఐదవది. ఏషియా పసిఫిక్ జోన్లో టోక్యో తర్వాత ఏర్పాటు చేస్తున్న రెండో సెంటర్ ఇదే. గూగుల్ సేఫ్టీ ఇంజనీరింగ్ సెంటర్ అంతర్జాతీయ సైబర్ సెక్యూరిటీ హబ్ గా నిలబోతుంది. ఇది అధునాతన భద్రత మరియు ఆన్‌లైన్ భద్రతా ఉత్పత్తులను అభివృద్ధి చేయడంలో కీలక పాత్ర పోషిస్తుంది. అత్యాధునిక పరిశోధన, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత భద్రత, సైబర్‌ సెక్యూరిటీ నిపుణులు, పరిశోధకులకు ఈ సేఫ్టీ సెంటర్ సహకార వేదికగా ఉపయోగపడుతుంది. ఇక, దేశంలో నైపుణ్యాభివృద్ధిని పెంపొందించి, ఉపాధి పెంచడం, సైబర్‌ సెక్యూరిటీ సామర్థ్యాలు పెంపొందించే లక్ష్యంగా ఈ గూగుల్ సేఫ్టీ ఇంజినీరింగ్ సెంటర్ పని చేస్తుంది. ఇప్పటికీ భారీ సంఖ్యలో ఉద్యోగులున్న గూగుల్ ప్రపంచంలోనే అతి పెద్ద కార్యాలయాన్ని హైదరాబాద్ లో నిర్మిస్తోంది. ఈ ఏడాది అక్టోబర్ 3న జరిగిన గూగుల్ ఫర్ ఇండియా 2024 కాన్‌క్లేవ్‌లోనే సేఫ్టీ ఇంజనీరింగ్ సెంటర్ ఏర్పాటు విషయాన్ని ఆ కంపెనీ ప్రకటించింది. అప్పటి నుంచి జీఎస్ఈసీని తమ రాష్ట్రంలోనే నెలకొల్పాలని, గూగుల్ పెట్టుబడులను ఆహ్వానించేందుకు వివిధ రాష్ట్రాలు పోటీ పడ్డాయి. అయితే, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అమెరికా పర్యటన సందర్భంగా గూగుల్ ప్రధాన కార్యాలయాన్ని సందర్శించారు. అప్పటి నుంచి హైదరాబాద్‌లో ఈ అత్యాధునిక సెంటర్ ఏర్పాటుకు ప్రభుత్వం ప్రత్యేక చొరవ చూపింది.

డైవర్షన్ పాలిటిక్స్ తప్ప ఈ ప్రభుత్వం చేసిందేమి లేదు..
తెలంగాణ భవన్ లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మీడియాతో మాట్లాడుతూ.. ఈ సంవత్సర కాలంలో బీఆర్ఎస్ చాలా ఆటుపోట్లు ఎదుర్కుందని తెలిపారు. అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో ఓడిపోవడం, కేసీఆర్ అనారోగ్య పాలవడం, కవిత జైలుకు వెళ్లడం, మా పార్టీ ఎమ్మెల్యేలు వెళ్లిపోవడం లాంటి ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నామన్నారు. అయినా మాతో పాటే ఉన్న కార్యకర్తలకు ఆయన ధన్యవాదాలు చెప్పారు. ఇక, కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం అన్ని విషయాల్లో విఫలమైంది.. ఈ ప్రభుత్వంలో కేవలం ఎనుముల బ్రదర్స్ కు మాత్రమే లాభం జరిగింది అని ఆరోపించారు. ఈ ప్రభఉత్వం ఒక్కటి కూడా పాజిటివ్ పని చేయలేదు అని కేటీఆర్ అన్నారు. ఇక, సీఎం అనే వారు రాష్ట్ర ప్రతిష్టను పెంచాలి.. కానీ, కానీ దివాళా దిశగా తీసుకెళ్తున్నాడని కేటీఆర్ ఆరోపించారు. ఇంగ్లీషు వచ్చిన కొత్త పీఆర్ఓలను పెట్టుకున్నాడు.. తెలంగాణ ఫాలింగ్ జరుగుతుంటే.. రైజింగ్ అని అంటున్నాడని పేర్కొన్నారు. అప్పులు అని తన అసమర్దతను చెప్పుకుంటున్నారు.. ప్రభుత్వంపై విమర్శలు చేయొద్దు.. సంవత్సర కాలం ఆగండి అని మా కేసీఆర్ చెప్పారు.. ఈ సంవత్సరంలో సాధించిన విజయాలు చెప్పట్లేదు.. హామీలు ఎలా నెరవేరుస్తారో చెప్పకుండా.. అప్పుల గురించి మాట్లాడుతున్నారని ఆయన చెప్పుకొచ్చారు. అయితే, రాహుల్ గాంధీని తీసుకొచ్చి ఎన్నో హామీలు ఇచ్చారు.. నేను రేపో ఎల్లుండో రాహుల్ గాంధీకి లేఖ రాస్తాను.. అశోక్ నగర్ కు వచ్చి విద్యార్థులను మోసం చేసాడు రాహుల్.. తెలంగాణలో మళ్ళీ ప్రభుత్వ హత్యలు స్టార్ట్ అయ్యాయి.. ఆటో డ్రైవర్లతో పాటు ఎంతో మంది విద్యార్థులు సైసైడ్ చేసుకుంటున్నారు..అవన్నీ ప్రభుత్వ హత్యలే అని కేటీఆర్ వెల్లడించారు.

రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చిన ఘనత కేసీఆర్ది
రంగారెడ్డి జిల్లాలోని ఆమనగల్ వ్యవసాయ మార్కెట్ కమిటీ నూతన కార్యవర్గం ప్రమాణ స్వీకారంలో మంత్రి జూపల్లి కృష్ణారావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అప్పుల కుప్పగా మార్చిన ఘనత కేసీఆర్ ది అని ఆరోపించారు. కేసీఆర్ 8 లక్షల కోట్లు అప్పు చేశారని పేర్కొన్నారు. ఇక, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 67 వేల కోట్ల రూపాయలకు అప్పులు కట్టిందని చెప్పుకొచ్చారు. కాగా, గతంలో కేసీఆర్ 3 వేల కోట్లు మాత్రమే రుణమాఫీ చేశారు.. రైతులకు రైతు భరోసా ఎకరానికి 10 వేల రూపాయలను త్వరలో ఇస్తామని మంత్రి జూపల్లి కృష్ణారావు పేర్కొన్నారు. ఇక, జిల్లాలో పెండింగ్ ప్రాజెక్టులను త్వరలోనే పూర్తి చేస్తాం.. ప్రజలు ప్రతి పక్షాల మాటలు నమ్మొద్దు అని కోరారు. కల్వకుర్తి అభివృద్ధిలో తన వంతు కృషి చేస్తానని మంత్రి చెప్పుకొచ్చారు. అయితే, ఆమనగల్ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ గా యాట గీత నరసింహ ముదిరాజ్, వైస్ చైర్మన్ గా గూడూరు భాస్కర్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేశారు. ఈ ప్రమాణ స్వీకారంలో మంత్రి జూపల్లి కృష్ణారావు, ఎంపీ మల్లు రవి, ఎమ్మెల్యేలు కసిరెడ్డి నారాయణరెడ్డి, రాజేష్ రెడ్డిలు పాల్గొన్నారు.

ఆశ్చర్యపరిచిన ఫడ్నవీస్ కొత్త పేరు.. ఆహ్వానపత్రిక వైరల్..
మహారాష్ట్ర ఎన్నికల్లో బీజేపీ నేతృత్వంలోని మహాయుతి కూటమి ఘన విజయం సాధించింది. గత కొన్ని రోజులుగా కొనసాగుతున్న ఉత్కంఠకు తెరపడింది. సీఎం ఎవరనే దానిపై కూడా స్పష్టత వచ్చింది. రేపు సాయంత్రం ముంబైలోని ఆజాద్ మైదాన్‌లో ముఖ్యమంత్రిగా బీజేపీ నేత దేవేంద్ర ఫడ్నవీస్ ప్రమాణస్వీకారం చేయబోతున్నారు. డిప్యూటీ సీఎంలుగా ఏక్‌నాథ్ షిండే, అజిత్ పవార్ ప్రమాణస్వీకారం చేయనున్నారు. ఇదిలా ఉంటే, దేవేంద్ర ఫడ్నవీస్ పేరిట ఆహ్వాన పత్రిక ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. చీఫ్ సెక్రటరీ సుజాతా సౌనిక్ జారీ చేసిన ఈ ఆహ్వానంంలో ఫడ్నవీస్ పేరు ‘‘ దేవేంద్ర సరితా గంగధరరావు ఫడ్నవీస్’’ అని ఉంది. ఫడ్నవీస్ తల్లి పేరు సరిత కాగా, తండ్రి పేరు గంగాధర్. మహారాష్ట్ర ప్రజలు సాధారణంగా తండ్రిపేరున తమ మిడిల్ నేమ్‌గా ఉపయోగించడం ఆనవాయితీ. అయితే ఫడ్నవీస్ తన తల్లి పేరును ఉపయోగించడం ఇదే మొదటిసారి.

మెరిసిన వైభవ్ సూర్యవంశీ.. సెమీస్‌కు భారత్!
అండర్-19 ఆసియా కప్‌ 2024లో భారత్ సెమీస్‌కు దూసుకెళ్లింది. బుధవారం షార్జా క్రికెట్ స్టేడియంలో యూఏఈతో జరిగిన చివరి లీగ్ మ్యాచ్‌లో యువ టీమిండియా 10 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. యూఏఈ నిర్ధేశించిన 138 పరుగుల లక్ష్యాన్ని భారత్ 16.1 ఓవర్లలోనే ఛేదించింది. 13 ఏళ్ల వైభవ్ సూర్యవంశీ (76; 46 బంతుల్లో 3 ఫోర్లు, 6 సిక్స్‌లు) మెరుపు ఇన్నింగ్స్‌తో ఆకట్టుకున్నాడు. మరో ఓపెనర్ ఆయుష్‌ మాత్రే (67; 51 బంతుల్లో 4 ఫోర్లు, 4 సిక్స్‌లు) హాఫ్ సెంచరీ చేశాడు. డిసెంబరు 6 జరిగే సెమీస్‌లో శ్రీలంకతో టీమిండియా తలపడనుంది. ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన యూఏఈ 44 ఓవర్లలో 137 పరుగులకు ఆలౌట్‌ అయింది. యూఏఈ ఓపెనర్ ఆర్యన్ సక్సేనా (9) ఆరంభంలోనే పెవిలియన్ చేరాడు. యాయిన్ రాయ్ డకౌట్ అయ్యాడు. ఈ సమయంలో అక్షత్ రాయ్ (26), ఏతాన్ డిసౌజా (17)లు జట్టును ఆదుకునే ప్రయత్నం చేశారు. ఈ ఇద్దరు స్వల్ప వ్యవధిలో అవుట్ కాగా.. రాయన్ ఖాన్ (35; 48 బంతుల్లో 3 ఫోర్లు, 1 సిక్స్‌) జట్టు స్కోరును పెంచాడు. రాయన్ అనంతరం ఉద్దీష్ సూరి (16) డిఫెన్స్ ఆడేందుకే ప్రయత్నించాడు. అయితే మరో ఎండ్‌లో క్రీజులో నిలబడేవారే కరువయ్యారు. దాంతో యూఏఈ స్వల్ప స్కోరుకే పరిమితం అయింది. భారత బౌలర్లలో యుధజిత్ 3, చేతన్ శర్మ 2, హర్దిక్ రాజ్‌ 2 వికెట్స్ పడగొట్టారు.

తగ్గేదేలే.. పీసీబీ డిమాండ్‌కు బీసీసీఐ కౌంటర్‌!
వచ్చే ఏడాది పాకిస్థాన్‌లో జరిగే ఛాంపియన్స్‌ ట్రోఫీ 2024పై ఉత్కంఠ కొనసాగుతోన్న విషయం తెలిసిందే. గత కొన్ని నెలలుగా హైబ్రిడ్‌ మోడల్‌కు ఒప్పుకోని పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ).. చివరకు ఐసీసీ దెబ్బకు దిగొచ్చింది. అయితే కండిషన్స్ పెట్టి ఓకే చేసింది. ఛాంపియన్స్‌ ట్రోఫీని హైబ్రిడ్‌ మోడల్‌లో నిర్వహిస్తే.. భవిష్యత్‌లో భారత్‌లో జరిగే ఐసీసీ ఈవెంట్లను కూడా తాము అదే మోడల్‌లో ఆడుతామని ఐసీసీకి పీసీబీ తెలిపింది. ఈ నేపథ్యంలో పీసీబీ పెట్టిన కండిషన్‌కు బీసీసీఐ కౌంటర్‌ ఇచ్చినట్లు తెలుస్తోంది. భారత్‌లో ఎలాంటి భద్రతాపరమైన సమస్యలు లేవని, ఇక్కడ నిర్వహించే ఐసీసీ ఈవెంట్లకు హైబ్రిడ్‌ మోడల్‌ను అంగీకరించే ప్రసక్తే లేదని ఐసీసీకి బీసీసీఐ స్పష్టం చేసినట్లు సమాచారం. ఈ మేరకు ఓ జాతీయ మీడియా తమ కథనంలో పేర్కొంది. భారత్‌లో వచ్చే ఏడాది మహిళల వన్డే ప్రపంచకప్‌ జరగనుంది. ఇక 2026లో శ్రీలంకతో కలిసి సంయుక్తంగా టీ20 ప్రపంచకప్‌ భారత్ ఆతిథ్యం ఇవ్వనుంది. అనేకాదు 2029 ఛాంపియన్స్‌ ట్రోఫీ, 2031 వన్డే ప్రపంచకప్‌లు భారత్‌లో జరగనున్నాయి. వరుసగా టోర్నీలు ఉన్న నేపథ్యంలో పాకిస్థాన్‌ ఈ డిమాండ్‌ చేసింది.

రిలీజ్ కి ముందు మొట్ట మొదటి సినిమాగా సంచలన రికార్డు..
అల్లు అర్జున్ హీరోగా నటించిన పుష్ప ది రూల్ సినిమా మరికొద్ది గంటల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ సినిమా రేపు ప్రేక్షకుల ముందుకు రావాల్సి ఉండగా ఒకరోజు ముందుగానే ప్రీమియర్స్ ప్రదర్శించేందుకు సిద్ధమైంది సినిమా యూనిట్. అయితే ఈ సినిమాకి ఉన్న బజ్ కారణంగా అనేక రికార్డులు బద్దలౌతూ వస్తున్నాయి. ఇప్పుడు బుక్ మై షో లో ఈ సినిమా ఒక సరికొత్త రికార్డు క్రియేట్ చేసింది. నిజానికి బుక్ మై షో యాప్ లో ఈ సినిమాకి సంబంధించిన టికెట్స్ ని లేటుగా రిలీజ్ చేశారు. ఎందుకంటే జొమాటో డిస్ట్రిక్ట్ యాప్ ద్వారా సినిమా టికెట్స్ ముందు అమ్మకం చేయించారు. కాస్త లేటుగా రిలీజ్ చేసిన సరే ఈ సినిమా రిలీజ్ కి ముందే 2.3 మిలియన్ టికెట్లు అమ్మకాలు జరిపినట్లుగా ప్రకటించింది బుక్ మై షో. ఇప్పటివరకు ఈ రికార్డు విజయ్ లియో సినిమా పేరిట ఉండేది కానీ ఆ సినిమా రికార్డు బద్దలు కొడుతూ ఈ సినిమా ఇంకా రిలీజ్ కి కొన్ని గంటలు ఉండగానే రికార్డు బ్రేక్ చేయడం గమనార్హం. సుకుమార్ డైరెక్ట్ చేసిన ఈ సినిమాని మైత్రి మూవీ మేకర్స్ నిర్మించింది. అల్లు అర్జున్ సరసన రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమా మీద ప్రకటించిన వాటి నుంచే భారీ అంచనాలు ఉన్నాయి.

‘ఆదిత్య 369’ సీక్వెల్‌ కన్ఫర్మ్.. హీరో ఎవరో తెలుసా?
నందమూరి నటసింహం, అగ్ర కథానాయకుడు బాలకృష్ణ కెరీర్‌లోని బ్లాక్ బస్టర్ సినిమాలలో ‘ఆదిత్య 369’ ఒకటి. 1991లో సైన్స్ ఫిక్షన్ నేపథ్యంలో వచ్చిన ఈ సినిమా.. ఇండస్ట్రీలో రికార్డులు నెలకొల్పింది. ప్రముఖ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు డైరెక్ట్ చేసిన ఈ చిత్రంలో బాలకృష్ణ, మోహిని కీలక పాత్రల్లో నటించారు. ఈ సినిమా సీక్వెల్‌ కోసం నందమూరి అభిమానులతో పాటు సినీ ప్రియులు ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్నారు. ఆదిత్య 369 సీక్వెల్‌గా ‘ఆదిత్య 999’ ఉంటుందని ఇప్పటికే బాలయ్య బాబు పలుమార్లు చెప్పారు. తాజాగా సీక్వెల్‌ విశేషాలు అభిమానులతో పంచుకున్నారు. నందమూరి బాలకృష్ణ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తోన్న పాపులర్ షో ‘అన్‌స్టాపబుల్‌ సీజన్‌’. ప్రస్తుతం సీజన్ 4 కొనసాగుతోంది. తాజాగా షోకి సంబందించిన లేటెస్ట్ ఎపిసోడ్‌కు సంబందించిన ప్రోమోను రిలీజ్ చేశారు. ఇందులో ఆదిత్య 369 సినిమా గెటప్‌లో బాలయ్య బాబు స్టేజ్‌పై సందడి చేశారు. సీక్వెల్‌ విశేషాలు కూడా పంచుకున్నారు. ‘ఆదిత్య 369 చిత్రంకు సీక్వెల్‌గా ఆదిత్య 999 రానుంది. మా అబ్బాయి మోక్షజ్ఞ హీరోగా నటిస్తాడు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన పనులు జరుగుతున్నాయి. త్వరలోనే ఆదిత్య 999 పట్టాలెక్కుతుంది’ అని బాలకృష్ణ తెలిపారు. ఫుల్ ఎపిసోడ్‌ డిసెంబర్‌ 6న ప్రసారం కానుంది. అప్పుడు మరిన్ని విషయాలు పంచుకునే అవకాశాలు ఉన్నాయి. విషయం తెలిసిన నందమూరి ఫాన్స్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

జానీ మాస్టర్ కు కొరియోగ్రఫీ అవకాశం వచ్చిందా..?
లైంగిక ఆరోణలు నేపథ్యంలో అరెస్ట్ అయిన జానీ మాస్టర్ ఇటీవల బెయిల్ పై బయటకు వచ్చాడు. తన డాన్స్ తో నేషనల్ అవార్డు అందుకున్న జానీ మాస్టర్ నేడు సినిమా అవాకాశాలు లేక ఇబ్బదులు ఎదుర్కొంటున్నాడు. వాస్తవానికి ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటిస్తున్న పాన్ ఇండియా మోస్ట్ క్రేజీయెస్ట్ సినిమా పుష్ప -2లో జానీ మాస్టర్ స్పెషల్ సాంగ్ కు కొరియోగ్రాఫీ చేయాల్సి ఉంది. కానీ అరెస్ట్ నేపథ్యంలో ఆ అవకాశన్ని కోల్పోయాడు జానీ మాస్టర్. కాగా ప్రస్తుతం బెయిల్ పై బయట ఉన్న జానీ మాస్టర్ కాళిగానే ఉన్నాడు.  అయితే జానీ మాస్టర్ కు ఎట్టకేలకు ఓ అవకాశం వచ్చినట్టు తెలుస్తోంది. అయితే అది మన టాలీవుడ్ లో కాదు. బాలీవుడ్ యంగ్ హీరోలలో స్టార్ క్యాపబుల్ ఉన్న హీరో వరుణ్ ధావన్. ఈ కుర్ర హీరో ఇప్పడు బేబీ జాన్ అనే సినిమాలో నటిస్తున్నాడు. తమిళ హీరో విజయ్ నటించిన తేరి సినిమాకు బేబీ జాన్ అఫీషియల్ రీమేక్. కీర్తి సురేష్ ఈ సినిమాతో బాలీవుడ్ ఎంట్రీ ఇస్తోంది. అయితే ఈ సినిమాలోని ఓ స్పెషల్ సాంగ్ కు కొరియోగ్రాఫర్ గా జానీ మాస్టర్ కు అవకాశం వచ్చిందట. వరుణ్ ధావన్ తో కలిసి డాన్స్ ప్రాక్టీస్ చేస్తున్న జానీ మాస్టర్ వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. భారీ బడ్జెట్ పై తెరకెక్కుతున్న ఈ సినిమాకు టాలీవుడ్ మ్యూజిక్ డైరెక్టర్ SS థమన్ సంగీతం అందిస్తుండగా డిసెంబరు 25న వరల్డ్ వైడ్ గా రిలీజ్ కానుంది.

Show comments