రేపు జగన్ అధ్యక్షతన వైసీపీ కీలక సమావేశం..
మరో కీలక సమావేశం నిర్వహించేందుకు సిద్ధమయ్యారు వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డి.. రేపు వైసీపీ రాష్ట్ర స్థాయి సమావేశం జరగనుంది.. తాడేపల్లిలోని పార్టీ ప్రధాన కార్యాలయంలో వైఎస్ జగన్ అధ్యక్షతన జరగనున్న ఈ సమావేశానికి పార్టీ అన్ని జిల్లాల అధ్యక్షులు, రాష్ట్ర రీజినల్ కో ఆర్డినేటర్లు, ప్రధాన కార్యదర్శులు, కార్యదర్శులు హాజరుకానున్నారు.. పార్టీ బలోపేతం, పార్టీ నిర్మాణంపై దృష్టి సారించనున్నారు వైఎస్ జగన్.. పార్టీ పరంగా కమిటీల ఏర్పాటు, వాటి భర్తీపై చర్చించనున్నారు.. ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలపై ఆందోళన చేయటానికి కార్యాచరణ సిద్ధం చేయనున్నారట వైఎస్ జగన్.. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రజలకు కలుగుతున్న అనేక ఇబ్బందులపైనా చర్చించనున్నారు. ఇక, భారీగా కరెంటు ఛార్జీలు పెంచి కూటమి ప్రభుత్వం ప్రజల నడ్డివిరుస్తోందని విమర్శిస్తోంది వైసీపీ.. దీనిపైనా ఎలాంటి ఆందోళనలు నిర్వహించాలన్న దానిపై ఈ సమావేశంలో చర్చించనున్నారు వైసీపీ అధినేత వైఎస్ జగన్.. ధాన్యం సేకరణ, రైతులకు మద్దతు ధర ఇవ్వకపోవడం, మిల్లర్లు – దళారులు కలిసి రైతులను దోచుకుంటున్న అంశాలపై.. పోరాటాలపైనా సమావేశంలో ప్రస్తావనకు వచ్చే అవకాశం ఉందంటున్నారు.. ఫీజు రీయింబర్స్‌మెంట్ అందక రాష్ట్రంలో విద్యార్థులు, వారి తల్లిదండ్రులు పడుతున్న ఇబ్బందులపైనా ఈ భేటీలో చర్చ జరుగుతుందంటున్నారు.. అనారోగ్యం పాలైన ఆరోగ్యశ్రీ అంశంపై ఇదే సమావేశంలో చర్చించనున్నారు.. పేదలకు అత్యంత నష్టం చేకూరుస్తున్న ప్రభుత్వ విధానాలను ఎండగట్టడంపై కార్యాచరణ ప్రణాళికను రూపొందించి ఆమేరకు దిశానిర్దేశం చేయనున్నారు వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్‌రెడ్డి..
కొనసాగుతోన్న కౌంట్‌డౌన్.. రేపు PSLV-C59 ప్రయోగం..
భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) మరో ప్రయోగానికి సిద్ధమైంది.. ఇప్పటికే ఎన్నో ప్రతిష్టాత్మక ప్రయోగాలను విజయవంతం చేసిన ఇస్రో.. ఇటు కమర్షియల్ రాకెట్ ప్రయోగాలపై కూడా దృష్టిసారించింది.. ఇప్పటికే పలు దేశాలకు చెందిన ఉపగ్రహాలను.. ఇతర సంస్థలకు చెందిన ఉపగ్రహాలను సైతం కక్ష్యలోకి చేర్చి సత్తా చాటింది.. ఇప్పుడు.. యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ (ఈస్ఏ), భారతదేశంలోని న్యూ స్పేస్ ఇండియా లిమిటెడ్ (NSIL) సంస్థ మధ్య కుదిరిన ఒప్పందంలో భాగంగా.. రేపు మరో ప్రయోగం చేయనుంది.. ఇప్పటికే ఈ ప్రయోగానికి సంబంధించిన కౌంట్‌డౌన్ ప్రక్రియ విజయవంతంగా కొనసాగుతోంది.. ఈ రోజు మధ్యాహ్నం 2.38 గంటలకు ప్రారంభమైన కౌంట్‌డౌన్ ప్రక్రియ.. 25.05 గంటల పాటు కొనసాగనుండగా.. అనంతరం రేపు సాయంత్రం 4.08 గంటలకు తిరుపతి జిల్లాలోని సతీష్ ధావన్ స్పేస్ సెంటర్(షార్)లోని మొదటి ప్రయోగ వేదిక నుంచి రాకెట్‌ను ప్రయోగించనున్నారు శాస్త్రవేత్తలు.. ఈ PSLV-C59 రాకెట్ ద్వారా యూరోపియన్ స్పేస్ ఏజెన్సీకి సంబంధించిన probha-3 అనే 2 ఉపగ్రహాలను అంతరిక్షంలోనికి ప్రయోగించనుంది ఇస్రో.. రేపు సాయంత్రం 4.08 గంటలకు షార్ లోని మొదటి ప్రయోగ వేదిక నుంచి రాకెట్ ను ప్రయోగించే ప్రక్రియ విజయవంతంగా కొనసాగుతోన్నట్టు ఇస్త్రో శాస్త్రవేత్తలు చెబుతున్నారు.
భూ దందాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవు.. మంత్రి వార్నింగ్..
భూ దందాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవు అని వార్నింగ్ ఇచ్చారు మంత్రి అనగాని సత్యప్రసాద్.. భూదందాలపై ఉక్కు పాదం మోపుతామంటూ ఓ ప్రకటనలో హెచ్చరించారు.. ఇప్పటికే భూదురాక్రమణ (నిరోధక) చట్టం 2024ను తీసుకొచ్చాం.. వైఎస్ జగన్ రెడ్డి అరాచకపాలనలో వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు.. ప్రజల ఆస్తులను లాక్కున్నారని ఆరోపించారు.. కాకినాడ పోర్టులో ప్రధాన వాటాను లాక్కొని అరబిందో వాళ్లకు కట్టబెట్టడం జగన్ రెడ్డి అరాచకానికి ఉదాహరణగా పేర్కొన్న ఆయన.. భూ దందాలపై కూటమి ప్రభుత్వానికి దాదాపు 10 వేలకు పైగా ఫిర్యాదులు అందాయని వెల్లడించారు.. ఈ నెల ఆరో తేదీ నుండి జరగనున్న రెవిన్యూ సదస్సుల్లో వైసీపీ నేతల భూ దందాలపై కూడా ప్రజలు ఫిర్యాదులు ఇవ్వవచ్చు అని సూచించారు.. అయితే, భూ దందాలకు పాల్పడిన వారికి కఠిన శిక్షలు తప్పవు అని స్పష్టం చేశారు మంత్రి అనగాని సత్యప్రసాద్..
హైడ్రాకు భారీగా నిధులు విడుదల చేసిన సర్కార్
హైదరాబాద్ నగరంలోని చెరువులు, కుంటలు, పార్కుల సంరక్షణ కోసం ఏర్పాటు చేసిన హైడ్రా (HYDRA) కు తెలంగాణ ప్రభుత్వం భారీ నిధులు కేటాయించింది. మంగళవారం, హైడ్రా కార్యాలయ నిర్వహణకు, వాహనాల కొనుగోలుకు రూ.50 కోట్ల నిధులు విడుదల చేస్తూ పురపాలక శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. హైడ్రా ఆవిర్భావం తరువాత జీహెచ్ఎంసీ(GHMC) పరిధిలోని పలు చెరువులు, కుంటలు ఆక్రమణల నుండి విముక్తి పొందాయి. అక్రమ నిర్మాణాలను కూల్చివేసి నగరంలోని పర్యావరణాన్ని కాపాడేందుకు ఈ సంస్థ నిరంతర శ్రమ చేస్తోంది. హైడ్రాకు మరింత శక్తివంతమైన అధికారాలు ఇవ్వడం కోసం ప్రభుత్వం ప్రత్యేక చట్టాన్ని ప్రవేశపెట్టింది. ఈ బిల్లు ద్వారా హైడ్రా అనేక విస్తృత అధికారాలను పొందుతూ, చెరువుల రక్షణలో కీలక పాత్ర పోషించనుంది. ప్రభుత్వం మంజూరు చేసిన నిధులను అధునాతన సాంకేతిక పద్ధతులు, వాహనాల కొనుగోలు, కార్యాలయ నిర్వహణకు ఉపయోగించనున్నారు. ఈ నిధులు హైడ్రా పనితీరుకు మరింత బలం చేకూరుస్తాయి. ఈ చొరవతో చెరువుల సంరక్షణ, పర్యావరణ రక్షణలో హైదరాబాద్ నగరం దేశానికే ఆదర్శంగా నిలిచే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు.
ఓడి ఏడాదైనా ఎమ్మెల్యే స్టికర్ తీయని ఎమ్మెల్యే..
తెలంగాణ రాష్ట్రంలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో చొప్పదండి ఎమ్మెల్యే గా మేడిపల్లి సత్యం, గెలిచి నేటితో సంవత్సరం గడుస్తున్నా.. ఆ నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ మాజీ ఎమ్మెల్యే సుంకే రవిశంకర్ కారుకు ఎమ్మెల్యే స్టిక్కర్ మాత్రం తీయకపోవడం చర్చనీయాంశంగా మారింది. మాజీ ఎమ్మెల్యే సుంకే రవిశంకర్ గురుకుల బాట కార్యక్రమంలో, ఎమ్మెల్యే స్టిక్కర్ కెమెరాకు చిక్కింది.. తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ ప్రభుత్వ పాలన పోయి ఏడాది గడిచింది.. రాష్ట్ర వ్యాప్తంగా పలువురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఓడిపోయినప్పటికీ ఇంకా వారి కార్లపై మాత్రం ఎమ్మెల్యే స్టిక్కర్ మాత్రం తొలగించడం లేదు. ఎక్కడికి వెళ్ళినా ఎమ్మెల్యే స్టిక్కర్ తోనే మాజీ ఎమ్మెల్యేలు పర్యటిస్తున్నారు. వేములవాడ లోని బోయిన్‌పల్లి గురుకుల పాఠశాలను సందర్శించిన చొప్పదండి మాజీ ఎమ్మెల్యే శంకర్ రవి శంకర్ తన కారుపై నేటి వరకు ఎమ్మెల్యే స్టిక్కర్‌ను తొలగించకుండా పలు ప్రాంతాల్లో పర్యటించడంపై పలువురు వారి తీరుపై అసహన వ్యక్తం చేస్తున్నారు.. పోలీసుల కళ్లెదుటే ఎమ్మెల్యే స్టిక్కర్ పై కారులో ప్రయాణిస్తున్న పోలీసులు మౌనం వహించడంపై విమర్శలు వెల్లవెత్తుతున్నాయి.
తెలంగాణ ప్రభుత్వం విప్లవాత్మక అడుగు.. 5 నిమిషాల్లో డ్రాయింగ్ స్క్రూట్నీ
సెక్రటేరియట్‌లో బిల్డ్ నౌ అనే యాప్ ను అందుబాటులోకి తీసుకువచ్చారు మంత్రి శ్రీధర్ బాబు. తెలంగాణ ప్రభుత్వం యొక్క నూతన సమగ్ర భవనాలు , లేఅవుట్ల ఆమోదానికి సంబంధించిన వ్యవస్థ బిల్డ్ నౌ. ఇది అత్యాధునిక ప్రజాపాలన దిశగా ఒక విప్లవాత్మక అడుగు. భారతదేశంలోనే వేగవంతమైన డ్రాయింగ్ స్క్రూట్నీ వ్యవస్థ ఇది. ఈ నూతన వ్యవస్థ విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుట్టబోతోంది. అనుమతులు, డ్రాయింగ్ స్కూట్నీ ప్రాసెసింగ్ సమయాన్ని వారాల నుంచి నిమిషాలకు తగ్గిస్తుంది. పనితీరులో ఇది ఒక బెంచ్ మార్క్ గా నిలుస్తుంది. ఈ అత్యాధునిక వ్యవస్థ భవన నిబంధనలు , అనుమతులకు సంబంధించి ప్రజల అవసరాలను వేగంగా తీర్చడంతో పాటు విశ్వసనీయంగా , స్నేహపూర్వకంగా ఉంటుంది. ప్రజలు , నిర్మాణదారుల కోసం శక్తివంతమైన, అధునాతన వ్యవస్థ. ప్రజలు , నిర్మాణదారుల కోసం శక్తివంతమైన, ఆధునాతన వ్యవస్థ భారత దేశంలోనే అత్యంత వేగవంతమైన డ్రాయింగ్ స్క్రూట్నీ వ్యవస్థగా బిల్డ్ నౌ నిలుస్తుంది. అత్యాదునిక టెక్నాలజీతో ప్రాసెసింగ్ సమయాన్ని వారాల నుంచి నిమిషాలకు తగ్గిస్తుంది. ఈ కొత్త వ్యవస్థ అనేక విప్లవాత్మక లక్షణాలను కలిగిఉంది: బహుళ అంతస్తుల భవనాలను కూడా 5 నిమిషాల్లో ప్రాసెస్ చేయగల వేగంతమైన స్కూట్నీ ఇంటిన్ ఇది. ప్రజలు పలు విభాగాలకు వెళ్లడం , వివిధ పోర్టల్స్ మారే అవసరం లేకుండా అనుమతి ప్రక్రియ అంతా ఒకే చోట పూర్తి చేయగల ఏకీకృత సింగిల్ విండో ఇంటర్ పీస్ ఇది. ప్రజలు తమ భవనాలను నిర్మాణానికి ముంది వాస్తవికంగా అగ్మెంటెడ్ రియాలిటీ 3డీ విజువలైజేషన్ ద్వారా చూడొచ్చు. భవన నిబంధనలపై తక్షణం, కచ్చితమైన మార్గదర్శకాలను ఈ AI ఆధారిత పవర్డ్ అసిస్టెంట్ అందిస్తుంది. ప్రతి దరఖాస్తును దృవీకరించి ట్రాక్ చేసేందుకు నమ్మకాన్ని బ్లాక్ చైన్ టెక్నాలజీ అవాకశం కల్పిస్తుంది. డేటా ఆధారిత పాలనను చిత్తశుద్ధితో అమలు చేస్తుంది.
డిప్యూటీ సీఎం పదవికి అంగీకరించిన షిండే.. ఎల్లుండి సీఎంగా ఫడ్నవీస్ ప్రమాణస్వీకారం..!
మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ నేతృత్వంలోని ఏక్ నాథ్ షిండే శివసేన, అజిత్ పవార్‌ల ‘మహాయుతి’ కూటమి సంచలన విజయం సాధించింది. 288 అసెంబ్లీ స్థానాల్లో ఏకంగా 233 స్థానాలను కైవసం చేసుకుంది. 132 సీట్లతో బీజేపీ సింగిల్ లార్జెస్ట్ పార్టీగా మారింది. ఇదిలా ఉంటే, ఎన్నికల ఫలితాలు వచ్చి 10 రోజులు అవుతున్నా , మహారాష్ట్ర సీఎం ఎవరనేదానిపై ఇంకా సస్పెన్స్ కొనసాగుతూనే ఉంది. ప్రస్తుతం ఉన్న సమాచారం ప్రకారం.. బీజేపీ నేత దేవేంద్ర ఫడ్నవీస్ మహారాష్ట్రకు కాబోయే ముఖ్యమంత్రి అనేది స్పష్టంగా తెలుస్తోంది. అయితే, దీనికి సంబంధించి అధికార ప్రకటన రాలేదు. మరోవైపు డిసెంబర్ 05న ముంబైలో కొత్త ప్రభుత్వం ప్రమాణస్వీకారానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. సీఎం పదవిపై, తన ఇతర ఆశల్ని సాధించుకునేందుకు ఏక్‌నాథ్ షిండే కొద్దిగా బెట్టు చేసినట్లు తెలుస్తోంది.
రేపు సంభాల్‌కి రాహుల్ గాంధీ, కాంగ్రెస్ ఎంపీలు.. ఇటీవల మసీదు సర్వేలో హింస..
ఉత్తర్ ప్రదేశ్‌లో ఇటీవల హింస చెలరేగిన సంభాల్‌కి రేపు ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ, కాంగ్రెస్ ఎంపీలు వెళ్లనున్నారు. బుధవారం కాంగ్రెస్ బృందంతో రాహుల్ గాంధీ ఆ ప్రాంతాన్ని సందర్శించనున్నారు. నవంబర్ 24న యూపీలోని సంభాల్‌లోని షాహీ జామా మసీదు సర్వే సమయంలో వేల సంఖ్యలో గుంపు అధికారులు, పోలీసులపై రాళ్ల దాడి చేసింది. ఈ ఘటన హింసాత్మకంగా మారింది. ఈ ఘటనలో ఐదుగురు వ్యక్తులు మరణించారు. 30 మంది వరకు పోలీసులు గాయపడ్డారు. స్థానికంగా ఉన్న ఇళ్లు, వాహనాలు ధ్వంసమయ్యాయి. ఈ హింసపై మొత్తం 07 ఎఫ్ఐఆర్లు నమోదయ్యాయి. 20కి పైగా వ్యక్తుల్ని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ హింసాత్మక ఘర్షణల్లో స్థానిక సమాజ్‌వాదీ పార్టీ ఎంపీ జియా ఉర్ రెహ్మాన్‌తో పాటు ఆ ప్రాంత ఎమ్మెల్యే కుమారుడి ప్రమేయం ఉందని పోలీసులు అభియోగాలు మోపారు. అయితే, మంగళవారం తెల్లవారుజామున తమ పార్టీ బృందాన్ని సంభాల్ వెళ్లకుండా యూపీ పోలీసులు అడ్డుకున్నారని కాంగ్రెస్ నేత సచిన్ చౌదరి ఆరోపించారు. సంభాల్ హింసపై సీబీఐ విచారణ జరిపించాలని ఆయన డిమాండ్ చేశారు.
మహీంద్రా కొత్త ఎలక్ట్రిక్ కార్ “BE 6E”పై ఇండిగో కేసు.. వివాదం ఏంటంటే..?
స్వదేశీ ఆటోమేకర్ మహీంద్రా ఇటీవల తన ప్లాగ్‌షిప్ ఎలక్ట్రిక్ కార్లు BE 6E, XEC 9E కార్లను రిలీజ్ చేసింది. అత్యాధునిక ఫీచర్లు, స్టన్నింగ్స్ లుక్స్‌తో వినియోగదారులను వెంటనే ఆకర్షించేలా మహీంద్రా ఈ కార్లను డిజైన్ చేసింది. ఇదంతా బాగానే ఉన్నా, ప్రస్తుతం మహీంద్రా BE 6Eపై భారతదేశంలోనే అతిపెద్ద విమానయాన సంస్థ ఇండిగో ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. BE 6E కారులో ‘‘6E’’ని ఉపయోగించడంపై ఇండిగో ఈ కేసు ఫైల్ చేసినట్లు తెలుస్తోంది. దీనిని వాడటంపై ఇండిగో అభ్యంతరం వ్యక్తం చేసింది. ఇంటర్‌గ్లోబ్ ఏవియేషన్ వర్సెస్ మహీంద్రా ఎలక్ట్రిక్ ఆటోమొబైల్ లిమిటెడ్ పేరుతో ఈ కేసును మంగళవారం జస్టిస్ అమిత్ బన్సాల్ ముందుకు వచ్చింది. అయితే, ఈ కేసు విచారణ నుంచి న్యాయమూర్తి తప్పుకున్నారు. తదుపరి విచారణ డిసెంబర్ 09న జరగనుంది. అయితే, ఈ సమస్యను పరిష్కరించడానికి మహీంద్రా, ఇండిగోతో చర్చలు ప్రారంభించినట్లు ఇండిగో తరుపున సీనియర్ న్యాయవాది సందీప్ సేథీ కోర్టుకు తెలియజేశారు. ఇండిగో తన బ్రాండ్ గుర్తింపుకు ‘‘6E’’ పేరుతో సేవల్ని, వసతులని బ్రాండింగ్ చేస్తోంది. ఈ కాల్ సైన్ కింద 6E ప్రైమ్, 6E ఫ్లెక్స్, 6E యాడ్-ఆన్‌లతో సహా అనేక ప్రయాణీకుల-కేంద్రీకృత సేవలను ఎయిర్‌లైన్ అందిస్తుంది. ఇండిగో ‘‘’6E లింక్’’ అనే ట్రేడ్ మార్క్‌ని 2015లో రిజిస్టర్ చేయించింది. అయితే, మహీంద్రా ఎలక్ట్రిక్ ‘BE 6E’ కింద ట్రేడ్ మార్క్ రిజిస్ట్రార్ నుంచి ఆమోదం పొందింది. మహీంద్రా ఎలక్ట్రిక్ 12 క్లాస్ కింద ‘BE 6E’ని రిజిస్టర్ చేయించింది. ప్రస్తుతం ఇది మొత్తం వివాదానికి కారణమైంది.
జాతీయ క్రీడల షెడ్యూల్ షురూ.. ఎప్పుడు, ఎక్కడంటే?
38వ జాతీయ క్రీడల నిర్వహణ తేదీలు ఖరారు అయ్యాయి. ఈ క్రీడలకు ఉత్తరాఖండ్ జనవరి 28, 2025 నుండి జాతీయ క్రీడలకు ఆతిథ్యం ఇవ్వనుంది. ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్ (IOA) 36 క్రీడల తేదీ, జాబితాను విడుదల చేస్తూ అధికారిక లేఖను విడుదల చేసింది. 38వ జాతీయ క్రీడలను ఉత్తరాఖండ్‌లో 28 జనవరి 2025 నుండి 14 ఫిబ్రవరి 2025 వరకు నిర్వహించనున్నట్లు భారత ఒలింపిక్ సంఘం ఒక లేఖను విడుదల చేస్తూ అధికారికంగా ప్రకటించింది. ఈ పోటీలలో ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్ 32 ఒలింపిక్ క్రీడలతో పాటు ఉత్తరాఖండ్ లోని నాలుగు స్థానిక క్రీడలను చేర్చింది. మల్కామ్, యోగాసన్, రాఫ్టింగ్, కలరిపయట్టులను స్థానిక క్రీడలుగా చేర్చారు. IOA తీసుకున్న ఈ నిర్ణయం పట్ల ఉత్తరాఖండ్ రాష్ట్ర క్రీడల మంత్రి రేఖా ఆర్య సంతోషం వ్యక్తం చేశారు. ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ.. ఇది వారి సన్నాహాలకు ఆమోదముద్ర లాంటిదని అన్నారు. షెడ్యూల్ ప్రకటించిన తర్వాత ఆయా తేదీల ప్రకారం ఉత్తరాఖండ్ ఇప్పటికే సన్నాహాలు చేస్తోందని, ఈ తేదీలను ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి కూడా సిఫార్సు చేశారని రేఖా ఆర్య తెలిపారు. ఈ కార్యక్రమం అనేక విధాలుగా చారిత్రాత్మకంగా నిలుస్తుందని ఆవిడ అన్నారు. రాష్ట్రంలోని క్రీడాకారులను ప్రోత్సహిస్తూ.. ఇది తమకు అపూర్వమైన అవకాశమని, తమ రాష్ట్ర క్రీడాకారులు సొంత మైదానంలో అత్యుత్తమ ప్రదర్శన ఇవ్వగలరని ఆమె అన్నారు. రాష్ట్రవ్యాప్తంగా క్రీడాకారుల సన్నద్ధత శరవేగంగా సాగుతున్నదని, ఉత్తరాఖండ్ క్రీడాకారులు ఈసారి రాష్ట్రానికి పతకాల పట్టికలో ముందు వరుసలో స్థానంలో నిలుపుతారని రేఖ ఆర్య అన్నారు.
కొండగట్టు అంజన్నను దర్శించుకున్న మెగా హీరో
మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ ఈ మంగళవారం కొండగట్టు శ్రీ ఆంజనేయ స్వామి ఆలయాన్ని దర్శించుకున్నారు. ఆలయ అర్చకులు , అధికారులు ఆయనకు పూర్ణకుంభ స్వాగతం పలికారు. స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం, ఆర్చకులు వరుణ్ తేజ్‌కు ఆశీర్వచనం, తీర్థప్రసాదాలు, స్వామివారి చిత్రపటం అందజేశారు. ఈ సందర్భంగా వరుణ్ తేజ్ మాట్లాడుతూ, “కొండగట్టు అంజన్న మహిమగల దేవుడని, తొలిసారి హనుమాన్ దీక్ష తీసుకుని స్వామివారిని దర్శించుకోవడం చాలా ఆనందంగా ఉందని” పేర్కొన్నారు. ఇటీవల వరుణ్ తేజ్‌కి కాస్తంత అనుకూల పరిస్థితులు కలుగడం లేదు. తాజా సినిమాల షూటింగ్‌కు సమయం లేకపోయినా, హనుమాన్ దీక్ష తీసుకొని రాబోయే సినిమాలతో విజయాన్ని ఆశిస్తున్నట్లు చెప్పుకున్నారు. గతంలో “ఫిదా”, “తొలిప్రేమ”, “గద్దల కొండ గణేష్” వంటి సినిమాలు హిట్ కావడంతో, వరుణ్ తేజ్ కెరీర్ మంచి దిశలో సాగింది. కానీ “ఆపరేషన్ వాలంటైన్”, “గాండీవ ధారి అర్జున”, “గని” వంటి సినిమాలతో వరుసగా డిజాస్టర్‌లను అనుభవించారు. తాజాగా “మట్కా” సినిమా కూడా ఫ్లాప్ కావడంతో, ఆయన యాక్షన్ జానర్ నుంచి హార్రర్ కామెడీ జానర్ వైపు అడుగులు వేయాలని నిర్ణయించారు.
చత్రపతి శివాజీగా రిషబ్ శెట్టి
దర్శకుడు సందీప్ సింగ్ ఒక హిస్టారికల్ డ్రామా “ది ప్రైడ్ ఆఫ్ ఇండియా: ఛత్రపతి శివాజీ మహారాజ్”కి తెర లేపారు. ఈ సినిమాలో శివాజీ పాత్రలో కాంతార హీరో రిషబ్ శెట్టి కనిపించనున్నారు. ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదలైంది, ఇందులో శివాజీ మహారాజ్ పాత్రలో రిషబ్ శెట్టిని చూడటానికి అభిమానులు చాలా ఉత్సాహంగా ఉన్నారు. రిషబ్ పోస్టర్‌ను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసి ఈ చిత్రం 2027 జనవరి 21 న థియేటర్లలో విడుదల అవుతుందని రిషబ్ తెలిపారు. రిషబ్ శెట్టి ‘కాంతార: చాప్టర్ వన్’ తెరకెక్కించే పనుల్లో బిజీగా ఉన్నాడు. ఈ సినిమాకు సంబంధించిన పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది అంటే 2025లో విడుదల చేయనున్నారు. దీంతో పాటు ప్రశాంత్ వర్మ ‘జై హనుమాన్’లో కూడా రిషబ్ శెట్టి కనిపించబోతున్నాడు. ఛత్రపతి శివాజీ మహారాజ్ పాత్రలో రిషబ్ శెట్టి ఎలా నటిస్తారో చూడాలని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ప్రియాంక చోప్రా నటించిన మేరీ కోమ్, అమితాబ్ బచ్చన్-నటించిన ఝుండ్ వంటి పలు ప్రశంసలు పొందిన చిత్రాలను నిర్మించిన సందీప్ సింగ్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించనున్నారు . ఛత్రపతి శివాజీ మహారాజ్ సినిమాతో సందీప్ సింగ్ దర్శకుడిగా అరంగేట్రం చేయనున్నారు.