NTV Telugu Site icon

Top Headlines @ 5 PM: టాప్‌ న్యూస్‌

Top Headlines @ 5 Pm New

Top Headlines @ 5 Pm New

మీడియా చిట్‌చాట్‌లో సీఎం చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు..
పార్టీ కార్యాలయంలో మీడియాతో చిట్‌చాట్‌లో కీలక వ్యాఖ్యలు చేశారు ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు.. వినతులు ఎన్ని ఉన్నా… అన్నింటి పరిష్కారమే లక్ష్యంగా పెట్టుకున్నామన్నాయన.. గత ఐదేళ్ల కాలంలో జరిగిన రెవెన్యూ సంబంధిత సమస్యలపైనే ఎక్కువ ఫిర్యాదులు వస్తున్నాయి. రెవెన్యూ సమస్యలకు కారణమై, అక్రమాలకు పాల్పడిన అధికారులపై చర్యలు ఉంటాయని స్పష్టం చే శారు.. ప్రతీ మండలంలోనూ ఓ భూ కుంభకోణం వెలుగు చూస్తోంది. రికార్డులు కూడా తారుమారు చేశారు. రీ సర్వే అస్తవ్యస్తంగా జరగటం వల్ల ప్రజలు ఎన్నో ఇబ్బందులు పడ్డారు. ప్రతీ జిల్లాలో కూడా రెవెన్యూ సంబంధిత ఫిర్యాదులు స్వీకరణకు ప్రాధాన్యం ఇస్తున్నాం. రెవెన్యూ శాఖను ఎంత దారుణంగా నిర్వీర్యం చేశారో మదనపల్లి ఘటనే ఓ ఉదాహరణగా పేర్కొన్నారు. అయితే, 100 రోజుల్లో దెబ్బతిన్న వ్యవస్థలన్నీ గాడిలో పెడతామని వ్యాఖ్యానించారు సీఎం చంద్రబాబు.. భూ కబ్జాదారులపై కఠిన చర్యలు తీసుకోవడం ద్వారా రెవెన్యూ శాఖను ప్రక్షాళన చేస్తామన్న ఆయన.. ఉద్యోగులు కూడా పెద్ద ఎత్తున సమస్యలతో వస్తున్నారు. కార్యకర్తల సమస్యలు, ప్రజా సమస్యలు, ఉద్యోగ సమస్యలు ఇలా వేటికవి విభజించి పరిష్కరిస్తాం అన్నారు.. ప్రజలు దూర ప్రయాణాలు చేసి అమరావతి వరకూ రాకుండా జిల్లాల వారీగా మంత్రులు, నియోజకవర్గాల వారీగా ఎమ్మెల్యేలు వినతులు తీసుకునేలా యంత్రాంగం రూపొందిస్తున్నాం అన్నారు.. జిల్లాల్లో నా పర్యటనల సందర్భంగా ఎవ్వరూ ఇబ్బంది పడకుండా పోలీసు వ్యవస్థలోనూ మార్పులు తెస్తాం. పోలీసు వ్యవస్థ సంయమనం పాటిస్తూ ప్రజా పోలీసింగ్ చేసే వ్యవస్థగా మారుస్తామని స్పష్టం చేశారు. వర్షాలు పడి ప్రాజెక్టులు కూడా నిండటంతో రైతులు సంతోషంగా ఉన్నారు. శాఖల వారీ సమీక్షలు సత్ఫలితాలనిస్తున్నాయి అని మీడియా చిట్‌చాట్‌లో పేర్కొన్నారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. కాగా, ప్రజా సమస్యలను తెలుసుకునేందుకు ఈ రోజు ఉదయం టీడీపీ కేంద్ర కార్యాలయానికి వచ్చారు టీడీపీ అధినేత, సీఎం చంద్రబాబు నాయుడు.. ప్రజల వద్ద నుంచి వినతి పత్రాలు, పార్టీ శ్రేణుల నుంచి అర్జీలను స్వీకరించారు. ఇక, సీఎంను కలిసి వినతి పత్రాలు సమర్పించేందుకు పెద్ద సంఖ్యలో ప్రజలు తరలివచ్చారు.. ఈ సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేశారు సీఎం చంద్రబాబు నాయుడు.

మారిన హెల్త్‌ యూనివర్సిటీ పేరు.. గెజిట్‌ విడుదల
వైఎస్సార్ హెల్త్ యూనివర్సిటీ పేరును డాక్టర్ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్శిటీగా మారుస్తూ ఇటీవలే ఆంధ్రప్రదేశ్‌లోని సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న విషయం విదితమే.. ఇక, ఈ బిల్లును రాష్ట్ర శాసనసభ ఏకగ్రీవంగా ఆమోదించింది. ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ ప్రవేశపెట్టిన బిల్లును టీడీపీ, జనసేన, బీజేపీ పక్షాల సభ్యులు బలపరిచారు.. ఇక, వైఎస్సార్ హెల్త్ యూనివర్శిటీ పేరు మార్పుపై గెజిట్‌ విడుదల చేసింది ఏపీ ప్రభుత్వం.. వైఎస్సార్‌ హెల్త్‌ యూనివర్సిటీ పేరును ఎన్టీఆర్ హెల్త్ యూనివర్శిటీకిగా పునరుద్ధరిస్తూ గెజిట్ విడుదల చేశారు.. ఇకపై ఎన్టీఆర్ హెల్త్ యూనివర్శిటీ పేరుతో కార్యకలాపాలు సాగించనుంది హెల్త్ యూనివర్శిటీ యాజమాన్యం.

చిట్ట చివరి కౌలు రైతుకు కూడా న్యాయం.. సాగు చేసే రైతుకు ప్రాధాన్యత..
చిట్ట చివరి కౌలు రైతుకు కూడా న్యాయం జరగాలని స్పష్టం చేశారు ఆంధ్రప్రదేశ్‌ వ్యవసాయశాఖ మంత్రి అచ్చెన్నాయుడు.. ఈ రోజు మంత్రి అచ్చెన్నాయుడు నేతృత్వంలో అప్కాబ్ సమావేశం జరిగింది.. ఈ సందర్భంగా ఆప్కాబ్ వాట్సప్ బ్యాంకింగ్ సేవలు ప్రారంభించారు మంత్రి అచ్చెన్నాయుడు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. చిట్ట చివరి కౌలు రైతుకు కూడా న్యాయం జరగాలన్నారు.. సాగు చేసే రైతుకు ప్రాధాన్యత ఇవ్వాలన్న ఆయన.. టీడీపీ హయాంలో నూతన సంస్కరణలతో రైతుల జీవితాల్లో మార్పు రావాలని సూచించారు.. కౌలు రైతులను సహకార సంఘాల్లో సభ్యులుగా చేర్చి కౌలు రైతుల రుణాలు ఇవ్వాలన్నారు. పెత్తందారులకు కాకుండా పేదరికంలో ఉన్న రైతులకు రుణాలు ఇవ్వాలని స్పష్టం చేశారు.. రేపటి నుంచే పరిస్థితి మారాలన్నారు మంత్రి అచ్చెన్నాయుడు.. బ్యాంకులకు ధీటుగా సహకార సంఘాలను తీర్చి దిద్దాలన్నారు.. వ్యవస్థలో లోపాలు సరిదిద్దాలని ఆదేశించారు.. డిజిటైలేజేషన్‌తోనే అక్రమాలకు చెక్ చెప్పగలం. సహకార సంఘాల్లో అవినీతిపై విచారణ జరిపిస్తామని ప్రకటించారు.. APCOB సేవలు విస్తృతం చేసేందుకు చర్యలు తీసుకోవాలన్నారు.. ఆప్కాబ్ – డీసీసీబీ, సహకార సంఘాల ద్వారా మహిళా సంఘాలకు అధిక శాతం రుణాలను అందించాలని.. సహకార వ్యవస్థలో EKYC అమలు చేసి పారదర్శకంగా సేవలు అందించాలని స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు మంత్రి అచ్చెన్నాయుడు.. ఈరోజు ఆప్కాబ్ వాట్సప్ బ్యాంకింగ్ సేవలు ప్రారంభించాను. APCOB సేవలు విస్తృతం చేసేందుకు చర్యలు తీసుకుంటామని.. ఆప్కాబ్, డీసీసీబీ, సహకార సంఘాల్లో జవాబుదారీతనం, పారదర్శకంగా సేవలు అందేలా చర్యలు తీసుకుంటామని.. సహకార వ్యవస్థలో EKYC అమలు చేయడంతో పాటు ఈ – ఆఫీస్ విధానంలో కార్యకలాపాలు జరిగేలా చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు మంత్రి అచ్చెన్నాయుడు.

అంతా ప్రభుత్వ ఉద్యోగులే కావాలంటే సాధ్యం కాదు..!
అందరూ ప్రభుత్వ ఉద్యోగులే కావాలంటే సాధ్యం కాదు అన్నారు మంత్రి సత్యకుమార్‌ యాదవ్.. ఇదే సమయంలో.. ప్రైవేటు సంస్థలలో రాణించాలంటే.. నైపుణ్య శిక్షణ చాలా అవసరం అన్నారు.. విజయవాడలో నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ 2020 అమలుపై అఖిల భారతీయ రాష్ట్రీయ సైక్షిక్ మహాసంఘ్, స్కూల్ ఆఫ్ ప్లానింగ్ అండ్ ఆర్కిటెక్చర్ ఆధ్వర్యంలో రెండు రోజుల సెమినార్ జరుగుతోంది.. ఈ సెమినార్‌కు ముఖ్య అతిథి హాజరైన ఏపీ మంత్రి సత్యకుమార్ యాదవ్.. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. రెండు రోజులు పాటు నూతన విద్యా విధానం పై చర్చించడం ఆనందంగా ఉంది అన్నారు. యాభై రోజుల పాలనలో ఇంకా నేను నేర్చుకునే పనిలోనే ఉన్నాను.. ఎన్నో సాదక బాధకాలు తెలుసుకుంటూ వాటిపై అవగాహన పెంచుకుంటున్నాను అన్నారు.. అయితే, గత ఐదేళ్లల్లో మన విద్యా విధానం భ్రష్టు పట్టిందని విమర్శించారు మంత్రి సత్యకుమార్‌.. భారతీయ విద్యా విధానం రూటుమార్చి.. బ్రిటీష్ విద్యను అమలు చేశారు.. ఇదే బానిస ఆలోచనలతో ఇంకా ఉంటే.. యువశక్తిని ఉపయోగించుకునే అవకాశం ఉండదు అన్నారు. భారతీయ విలువను జోడించి, కొత్త విద్యా విధానం అమలు చేయాల్సింది.. 1986లో కొత్త విద్యా విధానం రాజీవ్ గాంధీ నేతృత్వంలో వచ్చినా.. పూర్తిగా అమలు చేయలేదు. 2009 లో నాలెజ్డ్ కమీషన్ తీసుకు వచ్చి .. అందులో కొత్త విద్యా విధానం అమలు చేశారు.. ఈ దేశానికి ఇంగ్లీష్ అవసరమని విద్యార్దులపై బలవంతంగా రుద్దారు.. ఇటీవల మళ్లీ కొత్తగా అమల్లోకి వచ్చిన విద్యా విధానం వల్ల యువత భవిష్యత్ కు ఉపయోగపడుతుందన్నారు.. అందరూ ప్రభుత్వ ఉద్యోగులే కావాలంటే సాధ్యం కాదు.. ప్రైవేటు సంస్థలలో రాణించాలంటే.. నైపుణ్య శిక్షణ చాలా అవసరం అన్నారు. మరోవైపు బట్టిపట్టే చదువుల వల్ల జీవితంలో ఒడిదుడుకులు ఎలా ఎదుర్కొంటారు..? ఏ భాష అయినా మాధ్యమం మాత్రమే.. మాతృభాషను మరచిపోతే ఎలా? అని ప్రశ్నించారు. చైనా, జపాన్ లు పారిశ్రామికంగా ఎలా ఎదుగుతున్నారో చూడాలి.. ప్రాథమిక విద్య మొత్తం మాతృ భాషలో ఉంటేనే.. వారిలో సృజనాత్మకత బయటకు వస్తుందన్నారు. అన్ని దేశాల్లో ఇది అమలవుతున్నా.. మన దేశంలో మాత్రం పర భాషపై మోజు పెరిగిందని దుయ్యబట్టారు.

విద్యుత్ వ్యవస్థను గాడిలో పెడతాం.. రైతులకు 9 గంటల నాణ్యమైన విద్యుత్‌..
గత ప్రభుత్వ నాసిరకమైన విధానాల వల్ల విద్యుత్ వ్యవస్థ అతలాకుతలమైంది.. విద్యుత్ వ్యవస్థను గాడిలో పెట్టాల్సిన అవసరం ఉందన్నారు ఆంధ్రప్రదేశ్‌ విద్యుత్‌ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్‌.. బాపట్లలో మీడియాతో మాట్లాడిన ఆయన.. గత ప్రభుత్వం విద్యుత్ అడ్డగోలుగా కొనుగోలు చేసి చార్జీలు పెంచి ప్రజల మీద భారం వేసిందని ఫైర్‌ అయ్యారు.. ఇక, శ్రీశైలం రిజర్వాయర్‌, నాగార్జున సాగర్ ప్రాజెక్టులలో పుష్కలంగా వరద నీరు చేరడం వల్ల విద్యుత్ ఉత్పత్తి సమృద్ధిగా జరుగుతుందని తెలిపారు.. రైతులకు 9 గంటల నాణ్యమైన విద్యుత్తు నిరంతరాయంగా అందిస్తామని స్పష్టం చేశారు.. దేశంలోనే విద్యుత్‌ రంగంలో మొదటగా సంస్కరణలు తీసుకువచ్చింది ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మాత్రమేనని గుర్తుచేశారు.. మరోవైపు.. సోలార్ విద్యుత్ ఉత్పత్తి చేయడం ద్వారా సంస్థను గాడిలో పెట్టి దేశానికే ఆదర్శవంతమవుతాం అన్నారు విద్యుత్‌ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్‌..

అక్బరుద్దీన్ ఓవైసీని చూసి గజగజలాడుతున్నారు.. ఎందుకు..?
సీఎం రేవంత్ రెడ్డి చేయాల్సిన పనులు చాలా ఉన్నాయని కామారెడ్డి బీజేపీ ఎమ్మెల్యే కాటిపల్లి వెంకట రమణ రెడ్డి అన్నారు. గత ప్రభుత్వం ఏమీ చేయలేదని ప్రతి పక్షంలో కూర్చో పెట్టారు.. రేవంత్ సర్కార్ ఏమీ చేస్తామో చెప్పకుండా గత ప్రభుత్వాన్నీ విమర్శించడం పనిగా పెట్టుకుంది.. విధ్వంసం, అప్పుల పాలు అయిన తెలంగాణలో 31 వేల కోట్ల రూపాయల రుణమాఫీ ఎలా జరుగుతుంది.. లక్ష 50 వేల కోట్ల రూపాయలతో మూసి ప్రక్షాళన ఎలా అవుతుంది.. అక్బరుద్దీన్ ఓవైసీకి రూ. 300 కోట్లు ఎలా ఇస్తామని అన్నారు అంటూ ప్రశ్నించారు. ఇక, కేంద్ర ప్రభుత్వం ఏమీ ఇవ్వలేదో చెప్పమని అడిగితే చెప్పరు.. అక్బరుద్దీన్ ఓవైసీ మాట్లాడితే సినిమా చూసినట్టు చూస్తారు.. బీజేపీకి టైమ్ ఇవ్వమంటే ఇవ్వరు.. అసెంబ్లీలో బూతు పురాణం మాట్లాడుతున్నారు.. అప్పుడే అప్పులు అంటాడు.. అప్పుడే శంకుస్థాపనలు చేస్తున్నామని రేవంత్ రెడ్డీ అంటున్నారు.. రిటైర్ అధికారులతో రాష్ట్రాన్ని నడిపిస్తున్నారు.. వారి తర్వాత ఉన్న ఉద్యోగులు అసమర్థుల అని ఎమ్మెల్యే కే.వీ రమణ రెడ్డి అన్నారు. ఇక, మంత్రుల పేషీలో 20 మంది ఉన్నారు.. తమ వాళ్ళను పెట్టుకుంటున్నారు.. దీని వల్ల ప్రజాధనం వృథా అవుతుంది అని వెంకట రమణ రెడ్డి పేర్కొన్నారు. ఒక్కో ఐఏఎస్ కు 8 డిపార్ట్ మెంట్ లు ఇస్తున్నారు.. ఐఏఎస్ లు బదిలీ అయితే అయనతో పని చేసిన వారిని తీసుకు పోతున్నారు.. ఆంధ్ర కేడర్ కు చెందిన అధికారులను అడ్వైజర్లుగా ముఖ్యమంత్రి పెట్టుకున్నారు.. తెలంగాణ పేరు చెపుకొని బతకడమే తప్ప చేసేదేమీ లేదు అని ఆయన తెలిపారు. జీహెచ్ఎంసీలో వచ్చే డబ్బులు జీహెచ్ఎంసీ పరిధిలోనే పెట్టాలి అని డిమాండ్ చేశారు. కొడంగల్, మధిరకు ఎందుకు పోతుంది అని కాటేపల్లి వెంకట రమణ రెడ్డి ప్రశ్నించారు.

ఢిల్లీ స్కూల్‌కి బాంబు బెదిరింపులో ఊహించని ట్విస్ట్
ఈ మధ్య దేశ వ్యాప్తంగా ఆయా రాష్ట్రాల్లో ఈమెయిల్ బాంబు బెదిరింపు కాల్స్ ఎక్కువైపోయాయి. ఢిల్లీ, ముంబై, బెంగళూరు, గుజరాత్ ఇలా ఆయా రాష్ట్రాల్లో స్కూళ్లు, ఎయిర్‌పోర్టులకు బాంబు బెదిరింపు కాల్స్ వచ్చాయి. బాంబ్ స్క్వాడ్స్ రంగంలోకి దిగి తనిఖీల తర్వాత నకిలీది తేల్చారు. అయితే ఢిల్లీలో శుక్రవారం ఓ స్కూల్‌కు కూడా బెదిరింపు కాల్ వచ్చింది. గురువారం అర్ధరాత్రి స్కూల్ యాజమాన్యానికి బెదిరింపు మెయిల్ వచ్చింది. శుక్రవారం ఉదయం స్కూల్‌కు రాగానే.. మెయిల్ చూసి భయాందోళనకు గురైన సిబ్బంది.. పోలీసులకు సమాచారం ఇచ్చారు. డాగ్, బాంబ్ స్క్వాడ్స్ రంగంలోకి దిగి తనిఖీలు చేపట్టారు. అయితే ఎలాంటి అనుమానిత వస్తువులు కనిపించకపోవడంతో నకిలీదిగా తేల్చారు. అయితే పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టగా.. నిందితుడు స్కూల్ విద్యార్థేనని తేల్చారు. స్కూల్ ఎగ్గొట్టేందుకు ఈ నాటకానికి తెరలేపినట్లుగా పోలీసులు గుర్తించారు. స్టూడెంట్‌ను పోలీసులు అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. ఢిల్లీలోని గ్రేటర్ కైలాష్ ప్రాంతంలోని సమ్మర్ ఫీల్డ్స్ పాఠశాలకు శుక్రవారం ఈమెయిల్ బెదిరింపు వచ్చింది. స్కూల్‌ను పేల్చేస్తామని టెస్ట్‌లో పేర్కొంది. దీంతో ముందు జాగ్రత్తగా పాఠశాలను యాజమాన్యం ఖాళీ చేయించారు. పోలీసులు రంగంలోకి దిగి తనిఖీలు చేపట్టారు. ఎలాంటి అనుమానిత వస్తువు కనిపించలేదు. అనంతరం మెయిల్‌ తనిఖీ చేయగా స్కూల్ విద్యార్థే ఈ పని చేసినట్లుగా గుర్తించారు. అనుమానం రాకుండా.. మరో రెండు పాఠశాలలకు కూడా మెయిల్ పెట్టాడు. అయితే దీనిపై విచారణ జరుగుతుందని పోలీసుల చెప్పారు.

అయోధ్య గ్యాంగ్‌రేప్ నిందితుల ఆస్తులపై బుల్డోజర్ యాక్షన్
అయోధ్యలో గ్యాంగ్‌రేప్ నిందితుల ఆస్తులపై యోగి ప్రభుత్వం యాక్షన్‌కు దిగింది. 12 ఏళ్ల బాలికపై ఇద్దరు వ్యక్తులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. శుక్రవారం ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ను బాధిత కుటుంబం కలిసింది. సీఎంను కలిసిన కొన్ని గంటల వ్యవధిలోనే నిందితుల ఆస్తులపై ప్రభుత్వం చర్యలకు పూనుకుంది. అయోధ్య జిల్లా యంత్రాంగం శనివారం బుల్డోజర్‌తో అత్యాచార నిందితుడు మోయిద్ ఖాన్ బేకరీపై దాడి చేసి ఆస్తులను ధ్వంసం చేసింది. మైనర్ గ్యాంగ్ రేప్ కేసులో సమాజ్ వాదీ పార్టీ (ఎస్పీ) నాయకుడు ప్రధాన నిందితుడుగా ఉన్నాడు. ఈ బేకరీని ఆహార కల్తీ విభాగం సీల్ చేయగా.. శనివారం కూల్చివేత చర్యలు ప్రారంభించింది. బేకరీ చట్టవిరుద్ధమని గుర్తించిన తర్వాత సీల్ చేశామని, బేకరీని కూల్చివేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని ఎస్‌డిఎం సోహవాల్ అశోక్ కుమార్ తెలిపారు. నిందితులకు సంబంధించిన మరికొన్ని ఆస్తులు కూల్చివేసే అవకాశం ఉంది. అయోధ్యలో ఇద్దరు వ్యక్తుల చేతుల్లో అత్యాచారానికి గురైన మైనర్ బాలికను ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి శుక్రవారం కలిశారు. సమావేశం తర్వాత కేసు దర్యాప్తులో ఆలస్యం చేసినందుకు ఇద్దరు ఉత్తరప్రదేశ్ పోలీసులను సస్పెండ్ చేశారు. ఈ కేసుకు సంబంధించి బేకరీ యజమాని మోయిద్ ఖాన్, అతని ఉద్యోగి రాజు ఖాన్‌ను జూలై 30న పురకాలందర్ ప్రాంతంలో అరెస్టు చేశారు.

ఏడాది క్రితం స్కూల్ అమ్మాయి రాసిన కథే కేరళలోని వయనాడ్ లో నిజమైంది
చిన్న పిల్లలు దేవుళ్లతో సమానం అంటారు. కొన్నిసార్లు పిల్లలు చెప్పినా.. రాసినా అది నిజమవుతాయని అంటారు. అది సరైనదని తేలింది. కేరళలోని వాయనాడ్‌లో జరిగిన విధ్వంసం మధ్య అలాంటి యాదృచ్చిక సంఘటన ఒకటి వెలుగులోకి వచ్చింది. ఈ ఘటనపై ఓ పాఠశాల బాలిక ఏడాది క్రితమే రాసిందని పేర్కొన్నారు. ఎనిమిదో తరగతి చదువుతున్న ఈ బాలిక గతేడాది ఓ కథ రాసిందని చెబుతున్నారు. ఈ కథలోని సంఘటనల గురించి ఆమె రాసినది రాసినట్లు వాయనాడ్‌ పరిస్థితి దాదాపుగా అలాగే మారింది. ఈ కథనం స్కూల్ మ్యాగజైన్‌లో కూడా ప్రచురితమైంది. ఒకే తేడా ఏమిటంటే, ఆ కథ సుఖాంతం అయినప్పటికీ, వాస్తవంలో ఇది మాత్రం విషాదంగా మారింది. వాయనాడ్‌లో ప్రతేడాది ఇలాంటి విపత్కర పరిస్థితులు ఎదురవుతూనే ఉంటాయి. తాజాగా జరిగిన విధ్వంసం వల్ల ఇప్పటి వరకు 308మంది చనిపోయారు. మరో 200మందికి పైగా గల్లంతయ్యారు. పరిస్థితి ఇంకా అదుపులోకి రాలేదని వాతావరణ శాఖ చెబుతోంది.

సోమాలియా బీచ్‌లో ఆత్మాహుతి దాడి.. 32 మంది మృతి
సోమాలియాలో ఉగ్రవాదులు మారణహోమం సృష్టించారు. టూరిస్టులను లక్ష్యంగా చేసుకుని దాడులకు తెగబడ్డారు. దీంతో 32 మంది ప్రాణాలు కోల్పోగా.. పదుల కొద్ది క్షతగాత్రులుగా మారిపోయారు. సోమాలియా రాజధాని మొగదీషులోని ప్రముఖ లిడో బీచ్‌లో పర్యాటకులు ఆనందంగా గడుపుతున్నారు. ఇంతలో ఆల్‌ఖైదా గ్రూప్‌నకు సంబంధించిన అల్-షబాబ్ సంస్థకు చెందిన ఒకరు ఆత్మాహుతి దాడికి పాల్పడ్డాడు. బీచ్‌కు ఆనుకుని ఉన్న రెస్టారెంట్‌పై దాడి చేయగా.. 32 మంది ప్రాణాలు కోల్పోయారు. 63 మంది గాయాలు పాలయ్యారు. ఆరుగురు ఉగ్రవాదులు పాల్గొనగా.. ఒకరు దాడిలో చనిపోగా.. మరో ఐదుగురిని భద్రతా దళాలు సజీవంగా పట్టుకున్నాయి. భారీ జనసమూహం మధ్య దాడి చేయడంతో భారీగా ప్రాణనష్టం జరిగింది. ఇదిలా ఉంటే పేలుడు ధాటికి మృతదేహాలు చెల్లాచెదురుగా పడ్డాయి. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. దాడి చేసింది తామేనని అల్ షబాబ్ ఉగ్రవాద సంస్థ ప్రకటించింది.

ఇదేందయ్యా ఇది.. గ్రహాంతరవాసికి గుడి కట్టేస్తున్న వ్యక్తి..
తమిళనాడులోని సేలం జిల్లా నుంచి ఓ వింత వార్త హల్చల్ చేస్తోంది. రాష్ట్రంలోని మల్లముపంబట్టి నివాసి లోగనాథన్ తన గ్రామంలో గ్రహాంతరవాసుల కోసం ఆలయాన్ని నిర్మిస్తున్నాడు. ఎక్కడైనా మాములుగా దేవుడికి అనేక గదులను నిర్మాణాలను కట్టటం చూస్తుంటాం. ఒకవేళ దేవుళ్లకు మాత్రమే కాకుండా కొంతమంది కన్న తల్లిదండ్రులు, కట్టుకున్న భార్య, భర్త, ఇంకా పిల్లలకు దేవాలయాలు నిర్మించిన వార్తలు కూడా విని ఉంటాం. ఇకపోతే అభిమాన నాయకులు, నటినటుల కోసం గుడి కట్టడం కూడా చూసి ఉంటాము. అయితే., గత కొద్దిరోజుల క్రితం నుండి తమిళనాడుకు చెందిన ఓ వ్యక్తి మాత్రం ఏలియన్స్ కు దేవాలయం నిర్మించాడు. ఇక ఈ గుడి నిర్మిస్తున్న లోగనాథన్ మాట్లాడుతూ.. ప్రపంచంలో ప్రకృతి వైపరీత్యాలు రోజురోజుకి పెరిగిపోతున్నాయని.. ఈ విపత్తులను ఆపగలిగే శక్తి కేవలం గ్రహాంతరవాసులకు మాత్రమే ఉందని.. అందుకే గ్రహాంతరవాసుల ఆలయాన్ని నిర్మించాలని అనుకున్నట్లు ఆయన చెప్పుకొచ్చారు. ఈయన ప్రతిరోజూ ఈ గుడిలో గ్రహాంతరవాసులకు కూడా పూజలు చేస్తున్నాడు. అయితే., ఈ ఆలయ నిర్మాణ పనులు కాస్త నత్త నడకన కొనసాగుతూనే ఉన్నాయి. దాతల సహకారం అందిస్తే మరికొన్ని నెలల్లో పూర్తవుతుందని ఆయన చెప్పుకొచ్చారు.

కాంగ్రెసులో చేరిన బిగ్ బాస్ నూతన్ నాయుడు
బిగ్ బాస్ ద్వారా చాలామంది ఫేమస్ అయితే కామన్ మ్యాన్ అనే పేరుతో లోపలికి వచ్చి ఫేమస్ అయ్యాడు నూతన్ నాయుడు. బిగ్ బాస్ తెలుగు రెండో సీజన్‌లో హడావుడి చేసిన ఆయన తర్వాత లగడపాటికి సర్వేలు చేసినట్టు పొలిటికల్ సర్కిల్స్‌లో ప్రచారం జరగడంతో అక్కడ కూడా సుపరిచితమే. ఓ దళిత యువతికి శిరోముండనం చేసిన కేసుల్లో ఇరుక్కుని వివాదాస్పదం కూడా అయ్యారు. చాలా కాలం నుంచి అసలు వార్తల్లో కూడా లేకుండా పోయిన నూతన్ నాయుడు షర్మిల సమక్షంలో ఏపీ కాంగ్రెస్ పార్టీలో చేరడం హాట్ టాపిక్ అవుతుంది. ఆయనకు కండువా కప్పిన షర్మిల ఏపీ కాంగ్రెస్ లోకి సాదర స్వాగతం పలికారు. నిజానికి కామన్ మ్యాన్ అనే పేరుతో ఆయనని హౌస్ లోపలికి సెకండ్ సీజన్ లో తీసుకురావడం చర్చనీయాంశమైంది. చాలా పలుకుబడి కలిగిన వ్యక్తిగా ప్రచారం ఉన్న అతన్ని కామన్ మాన్ గా లోపలికి పంపడం మీద కూడా పెద్ద చర్చ జరిగింది. ఇక ఇప్పుడు నూతన్ నాయుడు కాంగ్రెస్ లో చేరడంతో ఇప్పుడు ఎందుకు యాక్టివ్ అయ్యారు అనేది తెలియాల్సి ఉంది.

‘సూపర్ సిక్స్’ ట్రెండ్ ఫాలో అవుతున్న టాలీవుడ్ ప్రముఖ నిర్మాణ సంస్థ
టాలీవుడ్ లో విభిన్నమైన కథలు ఎంచుకుంటూ తనకంటూ సెపరేట్ ఇమేజ్ ఏర్పరుచుకున్న హీరోలలో అడివి శేష్. కర్మ సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చిన ఈ యంగ్ హీరో ఆ సినిమా డిజాస్టర్ తో సహాయనటుడి పాత్రల్లో పంజా, దొంగాట తో పాటు పలు చిత్రాల్లో నటించాడు. ఆ తర్వాత 2018 లో వచ్చిన ‘గూడాచారి’ చిత్రంతో విభిన్న కథలను ఎంచుకుంటూ ఎవరు, మేజర్, హిట్ వంటి సూపర్ హిట్ సినిమాలలో నటించాడు. అడివి శేష్ ,శోభిత దూళిపాళ్ల హీరోహీరోయిన్లుగా నూతన దర్శకుడు శశి కిరణ్ టిక్క దర్శకత్వంలో తెరకెక్కిన్న చిత్రం గూఢచారి. అభిషేక్ పిక్చర్స్, పీపుల్స్ మీడియా సంయుక్తంగా నిర్మించిన గూఢచారి 2018 లో విడుదలై బాక్సాఫీస్ వద్దఘన విజయం సాధించింది. దింతో ఈ చిత్రానికి సిక్వెల్ ప్రకటించారు మేకర్స్. ప్రస్తుతం ఈ చిత్రం షూటింగ్ దశలో ఉంది. మొదటి భాగాన్ని నిర్మింషన నిర్మాతలే రెండవ భాగాన్ని నిర్మిస్తున్నారు. కాగా గూఢచారి విడుదలై నేటికి 6 సంవత్సరాలు. ఆ విశేషాన్నిసెలెబ్రేట్ చేస్తూ గూఢచారి -2(G 2) కు సంబంధించి 6ఇయర్స్ 6 మూమెంట్స్ ఇన్ 60 మినిట్స్ అంటూ వినూత్న పబ్లిసిటీ స్టార్ట్ చేసి 6 పోస్టర్స్ ను విడుదల చేసారు పీపుల్స్ మీడియా నిర్మాతలు. ఒక్కో పోస్టర్స్ కు ఒక్కో టాగ్ లైన్ ను జత చేస్తూ సినిమాపై ప్రేక్షకుల్లో మరింత ఆసక్తిని పెంచారు. G2 లో బాలీవుడ్ నటుడు ఇమ్రాన్ హస్మి ముఖ్య పాత్ర పోషిస్తున్నారు. అత్యంత భారీ బడ్జెట్ లో నిర్మించనున్న ఈ చిత్రాన్ని 2025లో విడుదల చేయనున్నారు  నిర్మాతలు.

బిగ్ బాస్ విజేతగా హీరోయిన్.. ఏకంగా అన్ని లక్షల ప్రైజ్ మని..
సుదీర్ఘ నిరీక్షణ తర్వాత బిగ్ బాస్ OTT సీజన్ 3 విజేతగా సనా మక్బుల్ ట్రోఫీని గెలుచుకుంది. సనా.. రాపర్ నేజీ రన్నరప్‌ను ఓడించి ట్రోఫీని గెలుచుకుంది. ఇకపోతే ట్రోఫీ సమయంలో సనా మక్బూల్ చాలా ఎమోషనల్‌గా కనిపించింది. బిగ్ బాస్ OTT 3 టైటిల్ గెలుచుకున్న తర్వాత, సనా మక్బూల్‌పై డబ్బు వర్షం కురిపించింది. సనాకు మెరిసిపోయే ట్రోఫీతోపాటు రూ.25 లక్షల ప్రైజ్ మనీ లభించింది. బిగ్ బాస్ OTT సీజన్ 3లో జూన్ 21న 16 మంది కంటెస్టెంట్లు హౌస్‌ లోకి ప్రవేశించారు. బిగ్ బాస్ OTT 3 హౌస్ నేజీ, సనా మక్బూల్, రణ్‌వీర్ షోరే, కృతికా మాలిక్, సాయి కేతన్ రావ్, సనా సుల్తాన్, శివాని కుమారి, అర్మాన్ మాలిక్, దీపక్ చౌరాసియా, విశాల్ పాండే, పాయల్ మాలిక్, లవకేష్ కటారియా, చంద్రికా ఖారాజ్ గోయత్, మునీషా ఖారాజ్ గోయత్. మరియు పౌలోమి దాస్ హౌస్‌ లోకి ప్రవేశించారు. వీరిలో సనా కాకుండా, బిగ్ బాస్ OTT 3 గ్రాండ్ ఫినాలే టాప్-5 కంటెస్టెంట్స్‌ లో నేజీ, సాయి కేతన్ రావ్, కృతిక మాలిక్, రణవీర్ షోరే ఉన్నారు. ఇక చివరకు అయితే ఛాంపియన్ గా సనా మక్బూల్‌ నిలిచింది. బిగ్ బాస్ OTT 3 విజేత సనా మక్బూల్ మోడల్‌ తో పాటు నటి కూడా. ఆమె తమిళం, తెలుగు చిత్రాలలో పనిచేసింది. సనా 2014లో దిక్కులు చూడకు రామయ్య అనే తెలుగు సినిమాతో తన సినీ కెరీర్‌ ని ప్రారంభించింది. అంతేకాకుండా సనా హిందీ టెలివిజన్‌లో కూడా కనిపించింది. ఇంకా కలర్స్ టీవీ షో సూపర్ నేచురల్ డ్రామా విష్‌ లో డాక్టర్ అలియా కొఠారి పాత్రను సనా మక్బూల్ పోషించింది.