తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో సీఎం ఏరియల్ సర్వే..
మొంథా తుఫాన్ ఆంధ్రప్రదేశ్‌పై తీవ్ర ప్రభావం చూపిస్తోంది.. బంగాళాఖాతంలో ఏర్పడిన మొంథా తుఫాన్ కాకినాడ – మచిలీపట్నం మధ్య అంతర్వేదిపాలెం సమీపంలో తీరాన్ని తాకింది. ఆ తర్వాత బలమైన తుఫాన్‌గా కొనసాగుతోంది. దీని ప్రభావంతో ఆంధ్రప్రదేశ్‌తో పాటు తెలంగాణలోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. అయితే, తుఫాన్ కారణంగా దెబ్బతిన్న కోనసీమలోని తీరప్రాంతాలలో ఏరియల్ సర్వే నిర్వహించారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు.. ఓడలరేవు ఓఎంజీసీ టెర్మినల్ కు చేరుకున్న ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు.. ఓడలరేవులోని. తుఫాన్ పునరవాసి కేంద్రాలను పరిశీలించారు.. తుఫాన్ బాధితులను పరామర్శించారు.. రోడ్డు మార్గం ద్వారా అల్లవరం మండలం బెండమూర్లంక గ్రామానికి చేరుకున్న ఆయన.. తుఫాన్ కు నేలకొరిగిన వరి పొలాలను పరిశీలించారు.. పంట నష్టాలకు సంబంధించి రైతులను అడిగి తెలుసుకున్నారు.. వరి పైరు నేలకొరిగి పోవడంతో దిగుబడి తగ్గిపోతుందని ముఖ్యమంత్రి ఎదుట వాపోయారు రైతులు.. ఎకరానికి 20 వేల నుండి 30 వేల రూపాయల వరకు నష్టం ఉంటుందని అంటున్నారు.. ఇది పెనువిపత్తు.. రాష్ట్రానికి తీవ్ర నష్టం జరిగిందన్నారు సీఎం చంద్రబాబు.. గతంలో తుఫాన్‌ల సమయంలో పనిచేసిన అనుభవం నాకుందన్న ఆయన.. మొంథా తుఫాన్‌పై ముందుగానే ప్రణాళిక సిద్ధం చేసుకున్నాం అన్నారు.. అయితే, ఈ తుఫాన్ వల్ల రాష్ట్రానికి తీవ్రమైన నష్టం జరిగిందన్నారు.. ఏరియల్ సర్వే తర్వాత మీడియాతో మాట్లాడిన ఆయన.. ముందు జాగ్రత్తలు తీసుకుని మొంథా తుఫాన్ వల్ల ప్రాణ నష్టం లేకుండా చూశాం అన్నారు.. ఆస్తి నష్టం కూడా చాలా వరకు తగ్గేలా చర్యలు తీసుకున్నాం అని వెల్లడించారు.. పలు జిల్లాల్లో వరి, ఉద్యాన పంటలు దెబ్బతిన్నాయి.. నెల్లూరు, ప్రకాశం, బాపట్ల జిల్లాల్లో భారీ వర్షం నమోదైందన్నారు.. ఆస్తి నష్టంపై నివేదిక వచ్చాక చర్యలు తీసుకుంటాం అని వెల్లడించారు.. కౌలు రైతులకు పరిహారం అందిస్తాం అన్నారు.. ఇక, మత్స్యకారులు, చేనేత కార్మికులకు అదనంగా 50 కిలోల చొప్పున బియ్యం ఇవ్వనున్నట్టు తెలిపారు సీఎం నారా చంద్రబాబు నాయుడు..
మరోసారి ఉప్పాడ సముద్ర తీరానికి భారీగా జనం.. బంగారం కోసం వేట..!
కాకినాడ జిల్లాలోని ఉప్పాడ సముద్ర తీరానికి మరోసారి భారీ సంఖ్యలో తరలివచ్చారు ప్రజలు.. బంగాళాఖాతంలో ఏర్పడిన మొంథా తుఫాన్ కాకినాడ – మచిలీపట్నం మధ్య అంతర్వేదిపాలెం సమీపంలో తీరాన్ని తాకింది.. ఆ తర్వాత బలమైన తుఫాన్‌గా కొనసాగుతోంది. దీని ప్రభావంతో ఆంధ్రప్రదేశ్‌తో పాటు తెలంగాణలోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి.. కొన్ని ప్రాంతాలు అతలాకుతలం అయ్యాయి.. భారీ నష్టాన్ని చవి చూడాల్సి వచ్చింది.. కానీ, యథావిధిగా ఈ సారి కూడా ఉప్పాడ తీరానికి భారీగా తరలివచ్చారు స్థానికులు.. తుఫాన్ ప్రభావంతో ఒడ్డుకు ఏమైనా బంగారం ముక్కలు కొట్టుకొచ్చాయా? అని ఎగబడి మరి వెతుకున్నారు.. ఇసుకలో చిన్న చిన్న బంగారు ముక్కలు దొరుకుతాయని ఏరుకునేందుకు పోటీపడుతున్నారు స్థానికులు.. కాగా, గతంలో రాజులు కోటలు, పలు దేవాలయాలు సముద్ర గర్భంలో కలిసిపోయాయని, వాటిలో ఉన్న విలువైన వస్తువులు ఇలాంటి తుఫాన్‌ల సమయంలో బయటపడతాయని గతంలోనూ తుఫాన్ వచ్చిన సమయంలో.. ఉప్పాడ తీరంలో స్థానికులు బంగారం కోసం వెతుకుతూనే ఉన్నారు.. స్థానిక మత్స్యకారులు తుఫాన్ తర్వాత తీరంలో బంగారం కోసం జల్లెడపట్టిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి.. గతంలో, చిన్నారులు సైతం స్కూల్ మానేసి బంగారం కోసం వెతికారు.. అక్కడ కొందరికి బంగారు రేణువులు దొరికాయని.. మరికొందరికి ఉంగరాలు, ముక్కుపుడలకు దొరికాయి… అంతేకాదు, గతంలో ఈ ప్రాంతంలోనే వెండి నాణేలు కూడా పెద్ద సంఖ్యలు దొరికాయి.. దీంతో, మరోసారి సముద్ర తీరానికి వచ్చి.. ఏమైనా దొరుకుందా? అనే కోణంలో సముద్ర తీరాన్ని జల్లడ పడుతున్నారు స్థానికులు.. అసలే బంగారం, వెండి ధరలు ఆల్ టైం హై రికార్డులను సృష్టించి.. కాస్త తగ్గుముఖం పట్టాయి.. సామాన్యులు బంగారం కొనలేని పరిస్థితి కూడా ఏర్పడడంతో.. ఇప్పుడు ఉప్పాడ తీరంలో బంగారం కోసం వేట ప్రారంభించారు.. వాళ్లకు దొరికి చిన్ని బంగారం రేణువులతో సంతోషపడుతున్నారు.
తుఫాన్ బాధితులకు ఆర్థిక సాయం ప్రకటించిన సీఎం చంద్రబాబు..
తుఫాన్ బాధితులకు ఆర్థిక సాయం ప్రకటించారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు.. అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం నియోజకవర్గంలోని ఓడలరేవు గ్రామంలో తుఫాన్ పునరావాస కేంద్రాలను సందర్శించిన సీఎం చంద్రబాబు.. పునరవాస కేంద్రాలలో ప్రజలతో మాట్లాడారు.. ప్రజలకు నిత్యవసరాలతో పాటు బియ్యం కూడా అందజేసినట్లు సీఎం చంద్రబాబు తెలిపారు… అన్ని శాఖల అధికారులతో సమన్వయం చేసుకుని తుఫాన్ ఎఫెక్ట్ తో ప్రాణనష్టం జరగకుండా అర్ధరాత్రి వరకు మానిటర్ చేశాం.. వరి పంట కొంతవరకు దెబ్బతింది.. హార్టికల్చర్ కొంతవరకు దెబ్బతింది.. మరికొన్ని జిల్లాల్లో ఈరోజు కూడా తుఫాను ప్రభావంతో వర్షాలు పడుతున్నాయి… ఒక్కోచోట ఒక్కో విధంగా తుఫాను ప్రభావితం ఉండడంతో పూర్తిగా అంచనా వేయడానికి కాస్త సమయం పడుతుందన్నారు.. అయితే, రెండు నుంచి మూడు రోజులు రిహాబిడేషన్ సెంటర్స్ లో ఉన్నవారికి 3000 రూపాయలతో పాటు నిత్యవసరాలు, బియ్యం అలాగే మత్స్యకారులు వేట నిషేధం విధించాం కాబట్టి 50 కేజీల బియ్యం.. అలాగే చేనేతలకు కూడా బియ్యం ఇస్తున్నట్లు సీఎం చంద్రబాబు వెల్లడించారు.. పునరావాస శిబిరాలలో ఉన్నవారికి తక్షణ ఆర్థిక సాయం కింద మనిషికి వెయ్యి రూపాయల నగదు చొప్పున.. కుటుంబానికి గరిష్టంగా రూ.3 వేల చొప్పున అందిస్తామన్నారు సీఎం చంద్రబాబు..
ఖమ్మం, భద్రాద్రి జిల్లాల సరిహద్దుల్లో తుఫాన్ కేంద్రీకృతం
మొంథా తుఫాన్ ప్రభావం పెరుగుతోంది. ఖమ్మం-భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల సరిహద్దుల్లో తుఫాన్ కేంద్రీకృతమై ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. ప్రస్తుతం తుఫాన్ భద్రాద్రి జిల్లాకు సుమారు 50 కిలోమీటర్ల దూరంలో, ఖమ్మం నగరానికి 110 కిలోమీటర్ల దూరంలో కొనసాగుతోంది. తుఫాన్ ప్రభావంతో ఈ రెండు జిల్లాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. నదులు, వాగులు పొంగిపొర్లుతున్నాయి. ముఖ్యంగా మున్నేరు నదిలో నీటి మట్టం వేగంగా పెరుగుతోంది. ఇప్పటికే మున్నేరులో నీటి మట్టం 14 అడుగులకు చేరింది. నీటి మట్టం 16 అడుగులు దాటితే మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేయనున్నట్లు అధికారులు తెలిపారు. తుఫాన్ తీవ్రత పెరుగుతున్న నేపథ్యంలో జిల్లా యంత్రాంగం అప్రమత్తమైంది. తక్కువ ఎత్తున్న ప్రాంతాల ప్రజలను ముందస్తు చర్యగా సురక్షిత ప్రాంతాలకు తరలించే పనిలో అధికారులు నిమగ్నమయ్యారు. రహదారులపై నీరు నిలవడం, చెట్లు కూలిపోవడం వంటి సమస్యలు నమోదవుతున్నాయి. విద్యుత్ సరఫరాలో కూడా అంతరాయాలు ఎదురవుతున్నాయి. వాతావరణ శాఖ హెచ్చరికల ప్రకారం, రాబోయే గంటల్లో ఖమ్మం, భద్రాద్రి, వరంగల్, మహబూబాబాద్ జిల్లాల్లో మరింతగా వర్షాలు కురిసే అవకాశం ఉంది. ప్రజలు అవసరమైతే తప్ప బయటకు వెళ్లకుండా జాగ్రత్తలు పాటించాలని అధికారులు సూచించారు.
తెలంగాణ కేబినెట్‌లోకి అజారుద్దీన్.. ఎల్లుండి మంత్రిగా ప్రమాణస్వీకారం
తెలంగాణ కేబినెట్‌లోకి మాజీ భారత క్రికెటర్, కాంగ్రెస్ నేత మహమ్మద్ అజారుద్దీన్ రానున్నారు. ఎల్లుండి ఆయన మంత్రి పదవికి ప్రమాణస్వీకారం చేయనున్నారు. ఇటీవల గవర్నర్ కోటా ద్వారా ఎమ్మెల్సీగా అజారుద్దీన్ పేరును రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించింది. ఆ ప్రతిపాదనకు ఆమోదం లభించడంతో మంత్రి పదవి ఇవ్వాలని సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయించారు. మంగళవారం సాయంత్రం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసిన అజారుద్దీన్, తనకు ఇచ్చిన అవకాశంపై కృతజ్ఞతలు తెలిపారు. పార్టీ పట్ల నిబద్ధతతో పనిచేస్తానని, రాష్ట్ర అభివృద్ధి కోసం కృషి చేస్తానని ఆయన పేర్కొన్నారు. అజారుద్దీన్ మంత్రి పదవిలోకి రావడం ద్వారా ఓల్డ్ సిటీలో కాంగ్రెస్ స్థాయిలో కొత్త ఉత్సాహం నెలకొనే అవకాశముంది. ఓల్డ్ సిటీ ముస్లిం ఓటర్లను ఆకర్షించేందుకు, మైనార్టీ వర్గాల మద్దతును బలోపేతం చేసేందుకు ఈ నిర్ణయం కీలకంగా మారనుంది. ప్రముఖ క్రికెటర్‌గా భారత జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరించిన అజారుద్దీన్ 2019లో తెలంగాణ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడిగా కూడా బాధ్యతలు నిర్వహించారు. ఇప్పుడు రాష్ట్ర కేబినెట్‌లో కీలక బాధ్యతలు స్వీకరించనున్నారు.
అందరూ అలర్ట్.. మొంథా తుపాన్ ప్రభావంపై సీఎం ఆరా…
మొంథా తుపాన్ ప్రభావంపై ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి అధికారులను బుధవారం ఆరా తీశారు. వరి కోతల సమయం కావడం… పలు చోట్ల కళ్లాల్లో ధాన్యం ఆరబోసిన నేపథ్యంలో ఎటువంటి నష్టం వాటిల్లకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సీఎం అధికారులను ఆదేశించారు. ధాన్యం, పత్తి కొనుగోలు కేంద్రాల్లోనూ తగిన ఏర్పాట్లు చేయాలని సీఎం సూచించారు. మొంథా తుపాను ప్రభావం ఉమ్మడి ఖమ్మం, ఉమ్మడి వరంగల్, ఉమ్మడి నల్గొండ జిల్లాల్లో అధికంగా ఉండడం.. హైదరాబాద్ సహా ఇతర జిల్లాల్లోనూ భారీ వర్షాలు కురుస్తుండడంతో అన్ని శాఖల అధికారులు, సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ జంక్షన్‌లో గోల్కొండ ఎక్స్‌ప్రెస్, గుండ్రాతిమడుగు స్టేషన్‌లో కోణార్క్ ఎక్స్‌ప్రెస్‌లు నిలిచిపోవడం.. పలు రైళ్లను దక్షిణ మధ్య రైల్వే అధికారులు దారి మళ్లించిన నేపథ్యంలో ప్రయాణికులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని సీఎం ఆదేశించారు. మొంథా తుపాన్ ప్రభావం అధికంగా ఉన్న జిల్లాల్లో ఎస్‌డీఆర్‌ఎఫ్, ఎన్‌డీఆర్‌ఎఫ్ బృందాలు సమన్వయం చేసుకోవాలని.. జిల్లా కలెక్టర్లు ఆయా బృందాలకు తగిన మార్గదర్శకత్వం వహించాలని సీఎం సూచించారు. వాగులు, వంకలు పొంగే ప్రమాదం ఉన్నందున జిల్లా అధికారులు అప్రమత్తంగా ఉండాలని, లోతట్టు ప్రాంతాల్లోని కుటుంబాలను సహాయక శిబిరాలకు తరలించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు. నీటి పారుదల శాఖ అధికారులు, సిబ్బంది రిజర్వాయర్లు, చెరువులు, కుంటల నీటి మట్టాన్ని ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ నీటి విడుదలపై ముందుగానే కలెక్టర్లు, క్షేత్ర స్థాయి సిబ్బందికి సమాచారం ఇవ్వాలని సూచించారు. పూర్తిగా నిండిన చెరువులు, రిజర్వాయర్ల వద్ద ఇసుక బస్తాలను ముందుగానే సిద్ధంగా ఉంచాలని సీఎం సూచించారు. రోడ్లపై నీరు నిలిచిన ప్రాంతాల్లో, లోలెవల్ బ్రిడ్జిలు, కాజ్‌వేలపై నుంచి రాకపోకలు పూర్తిగా నిషేధించాలన్నారు. పోలీసులు, రెవెన్యూ అధికారులు వాటి సమీపంలో బారికేడ్లు ఏర్పాటు చేసి పర్యవేక్షణ చేయాలని సీఎం ఆదేశించారు.
ఓట్ల కోసం ప్రధాని మోడీ డ్యాన్స్ కూడా చేస్తారు..
బీహార్ అసెంబ్లీ ఎన్నికలకు మరికొన్ని రోజులు మాత్రమే మిగిలి ఉన్నాయి. దీంతో కాంగ్రెస్ తన ప్రచారాన్ని ప్రారంభించింది. ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న రాహుల్ గాంధీ, ప్రధాని నరేంద్ర మోడీపై విరుచుకుపడ్డారు. మోడీ ఓట్ల కోసం ఏదైనా చేస్తారని ఆరోపించారు. ‘‘ మీ ఓట్ల కోసం నరేంద్రమోడీని డ్యాన్స్ చేయమని అడిగితే, అతను వేదికపైనే డ్యాన్స్ చేస్తారు’’ అని ముజఫర్‌పూర్ లో తేజస్వీ యాదవ్‌తో కలిసి పాల్గొన్న ఉమ్మడి ర్యాలీలో రాహుల్ గాంధీ అన్నారు. భీహారీలకు అతిపెద్ద పండగ అయిన ‘‘ఛత్ పూజా’’ గురించి ప్రస్తావిస్తూ.. ప్రజలు ఢిల్లీలోని కాలుష్యమైన యమునా నదిలో పూజాలు చేసుకుంటున్నారని, కానీ మోడీ మాత్రం ప్రత్యేకంగా తయారు చేసిన స్మిమ్మింగ్ పూల్ లో స్నానం చేశారని, యమునా నదితో సంబంధం లేదని, మోడీకి ఛత్ పూజాకు సంబంధం లేదని, అతడికి మీ ఓట్లు మాత్రమే కావాలి అని రాహుల్ గాంధీ ఆరోపించారు.
బిలియన్ డాలర్లు ఖర్చు చేసి ఉద్యోగులకు ఉద్వాసన.. ఐటీ కంపెనీల స్ట్రాటజీ..
గ్లోబల్ ఐటీ దిగ్గజ కంపెనీలు వరసగా లేఆఫ్స్ ప్రకటిస్తున్నాయి. తమ ఉద్యోగుల్ని తీసేస్తున్నాయి. దీంతో సాఫ్ట్‌రంగంలో ఉద్యోగులకు భద్రత కరువైంది. ఎప్పుడు ఎవరి ఉద్యోగం ఊడుతుందో తెలియని పరిస్థితి ఏర్పడింది. ఇదిలా ఉంటే, ఇలా ఉద్యోగుల్ని తీసేయడానికి టెక్ కంపెనీలు బిలియన్ డాలర్లను ఖర్చు చేస్తున్నాయి. తీసేసిన ఉద్యోగులకు ప్యాకేజీలను అందిస్తున్నాయి. సెవరెన్స్ ప్యాకేజీలు, నోటిస్ పే, అవుట్‌ప్లేస్‌మెంట్ సపోర్ట్, వీసా సాయం, మానసిక ఆరోగ్య సహాయం వంటి వాటికి ఖర్చు చేస్తున్నాయి. కంపెనీలు ఇలా చేయడానికి అనేక కారణాలు ఉన్నాయి. తొలగిస్తున్న ఉద్యోగులకు ప్యాకేజీలు ఇవ్వడం ద్వారా తమ కంపెనీల ‘‘ఎంప్లాయర్ బ్రాండ్’’ని కాపాడుకోవాలని అనుకుంటున్నాయి. ఉద్యోగులను గౌరవంగా పంపడం ద్వారా మానవీయ కోణాన్ని చూపాలనుకుంటున్నాయి. లీగర్ రిస్క్ తగ్గడం కోసం సెవరెన్స్ ప్యాకేజీలను ఇస్తున్నాయి. దీంతో న్యాయ వివాదాలు తగ్గుతాయని భావిస్తున్నాయి. ఇప్పుడు ఎక్కువగా ఖర్చుపెట్టినప్పటికీ, తర్వాతి కాలంలో జీతాల ఖర్చులు తగ్గిపోవడంతో కంపెనీలు లాభాలు మెరుగుపడుతాయని అనుకుంటున్నాయి. దీంతో పాటు వేగంగా విస్తరిస్తున్న ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(AI)కి కంపెనీలు ప్రాధాన్యత ఇస్తున్నాయి. మానవవనరుల్ని తగ్గించి ఆటోమేటెడ్ ప్రాసెస్‌లకు మారడాన్ని లక్ష్యంగా పెట్టుకున్నాయి.
భారత్, ఆసీస్ తొలి టీ20 వర్షార్పణం..!
భారత్, ఆస్ట్రేలియా మధ్య జరగాల్సిన తొలి T20 మ్యాచ్ వర్షం కారణంగా రద్దైంది. ఆటను తిరిగి ప్రారంభించడానికి అవకాశం లేకపోవడంతో అంపైర్లు మ్యాచ్‌ను నిలిపివేస్తున్నట్లు ప్రకటించారు. ఆస్ట్రేలియా కెప్టెన్ మిచెల్ మార్ష్ టాస్ గెలిచి ఎప్పటిలాగే ముందుగా బౌలింగ్ ఎంచుకున్నాడు. మార్ష్ ఇప్పటివరకు టాస్ గెలిచిన ప్రతిసారీ బౌలింగ్ ఎంచుకున్నాడు. ఇక భారత ఇనింగ్స్ లో అభిషేక్ శర్మ, శుభ్‌మన్ గిల్ బ్యాటింగ్‌ను ప్రారంభించారు. ఓపెనర్ అభిషేక్ శర్మ (19) మరోసారి బ్యాట్ ఝళిపించి కొన్ని ఫోర్లు కొట్టినా.. 35 పరుగుల వద్ద నాథన్ ఎల్లిస్ బౌలింగ్‌లో టిమ్ డేవిడ్‌కు క్యాచ్ ఇచ్చి తొలి వికెట్‌గా వెనుదిరిగాడు. ఆ తర్వాత క్రీజులోకి కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ వచ్చాడు. ఇక భారత 5 ఓవర్లకు స్కోర్ 43/1 వద్ద ఉండగా.. తొలిసారిగా వర్షం రావడంతో ఆట నిలిచిపోయింది. ఇక వర్షం తగ్గిన తర్వాత మ్యాచ్‌ను 18 ఓవర్లకు కుదిస్తూ నిర్ణయం తీసుకున్నారు. 5.2 ఓవర్లకు పవర్‌ప్లే కుదించబడింది. ఇక ఆట తిరిగి ప్రారంభం కాగానే, గిల్ మరియు సూర్యకుమార్ జోరు పెంచారు. ఈ నేపథ్యంలో 8వ ఓవర్‌లో, 18 పరుగుల వద్ద ఉన్న సూర్యకుమార్ యాదవ్‌కు జోష్ ఫిలిప్ క్యాచ్ డ్రాప్ చేయడంతో ఒక లైఫ్ లభించింది. ఈ నేపథ్యంలో గిల్ (37)*, సూర్యకుమార్ యాదవ్ (39)* కలిసి కేవలం 32 బంతుల్లో అర్ధశతక భాగస్వామ్యాన్ని నమోదు చేశారు. భారత్ స్కోర్ 9.4 ఓవర్లకు 97/1గా ఉన్నప్పుడు రెండోసారి వర్షం అంతరాయం కలిగించింది. అయితే ఈసారి వర్షం తగ్గకపోవడం, ఆటను కొనసాగించే అవకాశం లేకపోవడంతో మ్యాచ్‌ను రద్దు చేస్తున్నట్లు అంపైర్లు ప్రకటించారు.
మాస్ జాతరకు బాహుబలి ఎఫెక్ట్.. తేడా వస్తే అంతే సంగతి
అక్టోబర్ 31న రెండు భారీ సినిమాలు రిలీజ్ కాబోతున్నాయి. బాహుబలి రెండు పార్టులను కలిపి ఒకే పార్టు కింద బాహుబలి ది ఎపిక్ పేరుతో రీ రిలీజ్ చేస్తున్న సంగతి తెలిసిందే. అదే రోజు మాస్ మహారాజ రవితేజ నటించిన మాస్ జాతర సినిమాను రిలీజ్ చేస్తున్నారు. బాహుబలికి ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. అసలే ఎవర్ గ్రీన్ మూవీ. తెలుగు సినిమా గతిని మార్చిన సినిమా. అందులోనూ రెండు పార్టులు కలిపి తీసుకొస్తున్నారు. కొన్ని కొత్త సీన్స్ యాడ్ చేశారనే ప్రచారంతోనే ఫ్యాన్స్ లో అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. దెబ్బకు అడ్వాన్స్ బుకింగ్స్ లోనే కోట్లు కొల్లగొడుతోంది ఈ మూవీ. ఇలాంటి భారీ సినిమా ముందు మాస్ జాతర గట్టిగానే పోరాడుతోంది. రవితేజకు రీసెంట్ గా అన్నీ ప్లాపులే ఉన్నాయి. కాబట్టి మాస్ జాతరకు పెద్దగా హైప్ రావట్లేదు. బాహుబలి ది ఎపిక్ మూవీకి పెద్దగా ప్రమోషన్లు చేయకపోయినా కావాల్సినంత హైప్ క్రియేట్ అయిపోయింది. కాబట్టి రీ రిలీజ్ సినిమా ముందు డైరెక్ట్ సినిమా తక్కువ వసూళ్లు రాబడితే మాత్రం పరువు పోవడం ఖాయం. అందుకే ఈ సినిమాతో రవితేజ మంచి హిట్ కొట్టాల్సిందే. అసలే రవితేజ సినిమాలకు నార్మల్ ఆడియెన్స్ హిట్ అయితే తప్ప వెళ్లట్లేదు. హార్డ్ కోర్ ఫ్యాన్స్ తో పాటు మిగతా ఆడియెన్స్ వస్తేనే మాస్ జాతర కలెక్షన్లు పెరుగుతాయి. మాస్ జాతర టాక్ ఏ మాత్రం తేడా కొట్టినా వీకెండ్ మొత్తం బాహుబలిదే అప్పర్ హ్యాండ్ అవుతుంది.
