NTV Telugu Site icon

Top Headlines @ 5 PM: టాప్‌ న్యూస్‌

Top Headlines @ 5 Pm New

Top Headlines @ 5 Pm New

డీజీపీకి హరిరామ జోగయ్య లేఖ.. నాపేరుతో డబ్బులు వసూళ్లు చేస్తున్నారు చర్యలు తీసుకోండి..
ప్రముఖల పేర్లతో డబ్బులు వసూలు చేయడం చూస్తూనే ఉన్నాం.. వారి పేరు చెప్పి.. పలుకుబడి వాడుకొని కూడా డబ్బులు కొట్టేసిన ఘటనలు ఎన్నో వెలుగు చూశాయి.. తాజాగా, మాజీ మంత్రి హరిరామ జోగయ్య పేరుతో కూడా డబ్బులు వసూలు చేస్తున్నారట.. ఈ నేపథ్యంలో.. ఆంధ్రప్రదేశ్‌ డీజీపీ ద్వారకా తిరుమలరావుకు లేఖ రాశారు మాజీ మంత్రి హరిరామ జోగయ్య.. తన పేరుతో డబ్బుల వసూళ్లకు పాల్పడుతున్న వ్యక్తిపై చర్యలు తీసుకోవాలని డీజీపీని లేఖ ద్వారా కోరారు.. అత్యవసరంగా డబ్బులు కావాలంటూ తన పేరుతో ప్రముఖులకు ఫోన్ చేస్తూ డబ్బులు వసూలు చేస్తున్న వ్యక్తిపై చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.. గతంలో ఫిర్యాదు చేసిన ఇంకా డబ్బులు వసూళ్లకు పాల్పడుతున్నాడట అగంతకుడు.. జోగయ్య పేరుతో వచ్చిన కాల్స్ తో మోసపోయి డబ్బులు పంపిన వారి జాబితాలో జానారెడ్డి, కామినేని శ్రీనివాస్, మోత్కుపల్లి నరసింహులు, కొత్తపల్లి సుబ్బారాయుడు, వి. హనుమంతరావు లాంటి రాజకీయ నేతలు కూడా ఉండడం చర్చగా మారింది.. 78010 96535 ఫోన్‌ నంబర్‌ నుంచి ఫోన్‌ చేస్తూ.. గుర్తు తెలియని వ్యక్తి డబ్బులు వసూలు చేస్తున్నాడు అంటూ ఫిర్యాదులో పేర్కొన్నారు హరిరామ జోగయ్య.. డబ్బు వసూళ్లకు పాల్పడిన వ్యక్తిపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని డీజీపీ ద్వారకా తిరుమల రావుకు లేఖ ద్వారా విజ్ఞప్తి చేశారు మాజీ మంత్రి హరిరామజోగయ్య..

కేదార్నాథ్, బద్రీనాథ్ యాత్ర పేరుతో టోకరా.. మధ్యలో వదలి పరార్..!
గంగోత్రి, యమునోత్రి, బద్రీనాథ్, కేదార్నాథ్‌ యాత్రను చార్‌ధామ్‌ యాత్రగా పేర్కొంటారు.. మరికొందరు వీటిలో ఏవైనా రెండు సందర్శిస్తే.. ఆ యాత్రను దో ధామ్ యాత్రగా పేర్కొంటారు.. ఇందులో ఎక్కువ సంఖ్యలో కేదార్నాథ్, బద్రీనాథ్ ఆలయాలకు దర్శనానికి వెళ్తుంటారు భక్తులు.. ఈ యాత్ర పేరుతో పెద్ద బిజినెస్‌ జరుగుతోంది.. అయితే, కేదార్నాథ్, బద్రీనాథ్ యాత్రకు వెళ్లిన అనంతపురం యాత్రికులకు ఓ ట్రావెల్ ఏజెన్సీ టోకరా పెట్టింది. దో ధామ్‌ పేరుతో అనంతపురం పట్టణంలోని రామ్ నగర్ లో ఉన్న ఉదయ శంకర్ ట్రావెల్స్.. కేదార్నాథ్, బద్రీనాథ్ పుణ్యక్షేత్రాల దర్శనానికి పెద్ద మొత్తంలో యాత్రికల నుంచి డబ్బులు వసూలు చేసి మోసం చేసింది.. కేదార్నాథ్, బద్రీనాథ్ పుణ్యక్షేత్రాల దర్శనానికి అనంతపురానికి చెందిన దాదాపు 70 మంది యాత్రికుల నుంచి 60 వేల రూపాయల చొప్పున దాదాపు కోటి రూపాయలు ఉదయ్ శంకర్ ట్రావెల్స్ వసూలు చేసింది. నగరంలోని రామ్ నగర్ లో ఉంటున్న ఉదయ శంకర అనే వ్యక్తి ఉదయ శంకర్ ట్రావెల్స్ ను నడుపుతున్నాడు. అయితే అనంతపురం నుంచి హరిద్వార్ వరకు యాత్రికలను తీసుకువెళ్లాడు. కానీ, అక్కడ యాత్రికుల నుంచి మిగిలిన సొమ్మును వసూలు చేసి.. మరి కొద్ది సేపట్లో బయలుదేరుదామని చెప్పి అక్కడి నుంచి ఉదయ్ శంకర్ పరారయ్యాడు. ఎంతసేపటికి ట్రావెల్స్ నిర్వాహకుడు ఉదయ శంకర్ రాకపోవడంతో సొంత ఖర్చులతో హరిద్వార్ నుంచి అనంతపురానికి యాత్రికులు వచ్చారు. ఉదయ్ శంకర్ ట్రావెల్స్ ఆఫీస్ వద్దకు బాధితులు వెళ్లగా.. అక్కడ ఎవరూ లేకపోవడంతో అనంతపురం టూ టౌన్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. ఒక్కొక్కరి నుంచి 60 వేల రూపాయలు వసూలు చేసి దాదాపు కోటి రూపాయలు టోకరా వేశాడని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. ఉదయ్ శంకర్ ట్రావెల్స్ యజమాని ఉదయ శంకర్ పై చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు.

ఇంద్రకీలాద్రికి వెళ్లే భక్తులకు అలర్ట్.. ఈ సమయంలో దర్శనానికి రావొద్దు..
బెజవాడ కనకదుర్గమ్మ ఆలయానికి ప్రతీరోజు పెద్ద సంఖ్యలో భక్తులు తరలివెళ్తుంటారు.. అయితే, సామాన్యుల భక్తులకు ఇబ్బంది లేకుండా.. కీలక నిర్ణయం తీసుకున్నారు అధికారులు.. ఇంద్రకీలాద్రి వచ్చే వీఐపీలు, వికలాంగులు, వృద్ధులు ఉదయం 11:30 గంటల నుంచి మధ్యాహ్నం 1:30 గంటల మధ్య దర్శనానికి రావొద్దు అని విజ్ఞప్తి చేశాసింది.. ఇక, ఉదయం 11:45 గంటల నుంచి మధ్యాహ్నం 12:45 గంటల వరకు మహానివేదన కనుక దర్శనం నిలిపివేయబడును అని.. ఆ సమయంలో ప్రత్యేక‌ దర్శన ఏర్పాటు ఉండదు కనుక.. ఆలయ నిబంధనలను పాటించాలని స్పష్టం చేసింది.. ఆలయ ఆచారంగా వస్తున్న మహానివేదన సమయంలో ఈ సూచనను వీఐపీలు, వికలాంగులు, వృద్ధులు పాటించాలని ఓ ప్రకటనలో పేర్కొన్నారు విజయవాడ కనకదుర్గమ్మ ఆలయ అధికారులు.

మళ్లీ వస్తా.. ఆస్పత్రి రూపురేఖలు మారిపోవాలి.. సూపరింటెండెంట్‌కు మంత్రి వార్నింగ్‌
మళ్లీ వస్తా.. ఆస్పత్రి రూపురేఖలు మారిపోవాలి.. లేకపోతే పరిస్థితి తీవ్రంగా ఉంటుందని కర్నూలు ప్రభుత్వ ఆస్పత్రి సూపరింటెండెంట్‌కు వార్నింగ్‌ ఇచ్చారు మంత్రి టీజీ భరత్.. కర్నూలు ప్రభుత్వ ఆస్పత్రిని తనిఖీ చేసిన ఆయన.. ఆసుపత్రిలో అపరిశుభ్రత తాండవిస్తోంది.. వార్డులు అస్తవ్యస్తంగా ఉన్నాయి.. తాగునీటి సమస్య ఉంది అని ఆవేదన వ్యక్తం చేశారు.. అంతే కాదు.. ఆస్పత్రికి వచ్చే రోగులకు.. మందులు, టెస్ట్‌లు బయటికి రాస్తున్నట్లు తెలిసిందని.. ఇది సరైన విధానం కాదన్నారు.. ఆసుపత్రిలో కరెంట్ కోతలు రోగులను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నాయి. చిన్న పిల్లల విభాగంలో ఐదేళ్లుగా ఏసీలు పనిచేయడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.. టీజీవీ వాటర్ ప్లాంట్ లు సొంతంగా ఏర్పాటు చేస్తే.. చెడిపోయినా, నీరు రాకపోయినా మరమ్మతులు చేయించరా? అంటూ ఆస్పత్రి అధికారులపై మండిపడ్డారు.. మళ్ళీ ఆసుపత్రికి వస్తా.. ఆసుపత్రి తీరు మారాలని సూపరింటెండెంట్‌ ప్రభాకర్ రెడ్డిని హెచ్చరించారు మంత్రి టీజీ భరత్.. ప్రభుత్వ ఆసుపత్రిలో సమస్యలు తీరుస్తాం.. రోగులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా చేస్తాం అన్నారు.. ఐదేళ్లు అధికారంలో ఉన్న వైసీపీ పాలకులు ఏమాత్రం జీజీహెచ్ ను పట్టించుకోలేదు అని విమర్శించారు మంత్రి టీజీ భరత్.

కొండగట్టు అంజన్నను దర్శించుకున్న పవన్‌
ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ జగిత్యాల జిల్లాలోని కొండగట్టు శ్రీ అంజనేయ స్వామి వారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆయన ఆలయ అధికారులు ఘన స్వాగతం పలికారు. పవన్‌ కల్యాణ్‌ ఆలయంలో స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ నేపథ్యంలో పవన్‌ కల్యాణ్‌కు ఆలయ అర్చకులు వేందమంత్రోత్చరణలతో ఆశీర్వచనం చేశారు. అయితే.. ఏపీలో ఎన్నికల ముందు పవన్‌ కల్యాణ్ వారాహి యాత్ర నిర్వహించిన విషయం తెలిసిందే. వారాహి వాహనానికి పూజ చేయించేందుకు పవన్‌ కల్యాణ్ కొండగట్టు వచ్చారు. ఈ క్రమంలోనే.. ఎన్నికల్లో గెలిచిన తరువాత మొదటి సారి డిప్యూటీ సీఎం హోదాలో పవన్‌ కల్యాణ్ కొండగట్టు అంజన్నను దర్శించుకున్నారు. అయితే.. పవన్ కల్యాణ్‌ పర్యటన నేపథ్యంలో కొండగట్టు అంజన్న క్షేత్రంలో పోలీసులు భారీగా బందోబస్తు నిర్వహించారు. సిద్ధిపేటలో పవన్ అభిమానులు గజమాలతో సత్కరించారు. కారుపైకి ఎక్కి అభిమానులకు పవన్ అభివాదం చేశారు. జై జనసేన, జై పవన్ కల్యాణ్, సీఎం.. సీఎం అంటూ జనసైనికులు నినాదాలు చేశారు. దీంతో పవన్ కల్యాణ్ వారికి అభివాదం చేస్తూ ముందుకు సాగారు. హైదరాబాద్ నుంచి రోడ్డు మార్గంలో బయల్దేరిన పవన్ కళ్యాణ్ మధ్యాహ్నం కొండగట్టు చేరుకున్నారు. పవన్ కళ్యాణ్ ప్రస్తుతం వారాహి అమ్మవారి దీక్షలో ఉన్నారు.

19 ఏళ్లకే గిన్నిస్ వరల్డ్ రికార్డ్‌.. దేంట్లో అంటే..!
వయసు చిన్నదే అయినా ఆమె ప్రతిభతో గిన్నిస్ వరల్డ్ రికార్డ్‌లో చోటు సంపాదించేలా చేసింది. ఆమెలో ఉన్న టాలెంట్‌తో రెండు క్లాసులు ఎగబాకి రికార్డులను తన ఖాతాలో వేసుకుంది. అసలు ఆమె ఎవరు? ఆమె సాధించిన రికార్డులేంటో తెలియాలంటే ఈ వార్త చదవండి. నందిని అగర్వాల్. మధ్యప్రదేశ్‌లోని మొరెనా నగరానికి చెందిన వాసి. ప్రస్తుతం 19 ఏళ్లు. పాఠశాల వయసులోనే రెండు తరగతుల్ని ఎగబాకి 13వ ఏట 10వ తరగతి.. 15వ ఏట ఇంటర్ పూర్తి చేసింది. అనంతరం 19వ ఏటలోనే ప్రపంచంలోనే అతి పిన్ని వయసులో మహిళా చార్టర్డ్ అకౌంటెంట్‌గా గిన్నిస్ వరల్డ్ రికార్డ్‌ను సొంతం చేసుకుంది. ఇక 2021లో సీఏ పరీక్షల్లో మొదటి ర్యాంక్ సాధించి ప్రశంసలు పొందింది. నందిని అగర్వాల్ 2021లో తన చార్టర్డ్ అకౌంటింగ్ ఫైనల్ పరీక్షలో 800కి 614 (76.75%) స్కోర్ చేసింది . ఆమె 83,000 మంది అభ్యర్థులను ఓడించి నంబర్ 1 స్థానాన్ని కైవసం చేసుకుంది. బాల్యం నుంచి అన్నింటిలో మెరుపు వేగంతో దూసుకుపోతుంది.

కేంద్రానికి జేడీయూ కండీషన్.. బీహార్‌కు ప్రత్యేక హోదా ఇవ్వాలని తీర్మానం
కేంద్రంలో మోడీ 3.0 సర్కార్ ఏర్పడిన తర్వాత లేటెస్ట్‌‌గా ప్రత్యేక హోదా అంశం తెరపైకి వచ్చింది. ఎన్డీఏ మిత్ర పక్షాల నుంచే ఈ డిమాండ్ రావడం ప్రాధాన్యత సంతరించుకుంది. కేంద్రంలో మోడీ ప్రభుత్వం ప్రస్తుతం మిత్ర పక్షాల సపోర్ట్ పిల్లర్స్‌పై ఆధారపడి ఉంది. ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీకి సొంతంగా స్పష్టమైన మెజార్టీ రాకపోవడంతో కూటమి పార్టీల మద్దతుతో ప్రభుత్వం ఏర్పడింది. ఈ నేపథ్యంలో ఇదే మంచి అవకాశంగా జేడీయూ భావించింది. అవకాశం దొరికినప్పుడే సాధించుకోవాలన్న దృక్పథం కలిగి ఉన్న జేడీయూ.. దాన్ని అందిపుచ్చుకునేందుకు ప్లాన్ రెడీ చేసింది. మాస్టర్ ప్లాన్‌లో భాగంగా బీహార్‌లోని జేడీయూ సర్కా్ర్.. కేంద్రానికి సరికొత్త మెలిక పెట్టింది. శనివారం జేడీయూ జాతీయ కార్యవర్గ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వాలని తీర్మానం చేసింది. ప్రభుత్వం ఏర్పడి నెలరోజులైనా కాకముందే.. డిమాండ్లను తెరపైకి తెచ్చారు. సమావేశం అనంతరం జేడీయూ సీనియర్‌ నేత ఒకరు మీడియాతో మాట్లాడుతూ.. బీహార్‌ రాష్ట్రానికి ప్రత్యేక హోదా డిమాండ్‌ కొత్తదేమీ కాదని. రాష్ట్ర వృద్ధి పథాన్ని వేగవంతం చేయడం, సవాళ్లను పరిష్కరించడంలో ఇది కీలకమైన దశ అని చెప్పుకొచ్చారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా లేదా ఆర్థిక ప్యాకేజీని ఇవ్వాలని తీర్మానం చేసినట్లు వెల్లడించారు. అలాగే నీట్ ప్రశ్నపత్రాల లీకేజీ కేసుల్లో నిందితులకు కఠిన శిక్ష విధించాలని జేడీయూ డిమాండ్‌ చేసింది. అంతేకాకుండా పరీక్షల్లో అక్రమాలను నివారించేందుకు పార్లమెంట్‌లో ప్రత్యేక కఠినచట్టం చేయాలని కోరింది. బీహార్ పరిస్థితుల్ని అర్థం చేసుకుని రాష్ట్రానికి స్పెషల్ స్టేటస్ ఇవ్వాల్సిన అవసరం ఉందని జేడీయూ అభిప్రాయపడుతుంది. దీర్ఘకాలిక అవసరం తోనే ఈ డిమాండ్ చేస్తు్న్నట్లుగా జేడీయూ నొక్కి చెబుతోంది.

గుడ్‌న్యూస్.. మరో రెండు రోజుల్లో దేశమంతటా వ్యాపించనున్న రుతుపవనాలు
ఢిల్లీ-ఎన్‌సీఆర్ సహా ఉత్తర భారత రాష్ట్రాల్లో రుతుపవనాలు ప్రవేశించాయి. అయితే రుతుపవనాలు వ్యాపించని రాష్ట్రాలు ఇప్పటికీ ఉన్నాయి. ఇందులో హర్యానా, పంజాబ్, పశ్చిమ ఉత్తరప్రదేశ్‌లోని కొన్ని ప్రాంతాలు ఉన్నాయి. అయితే ఈ ప్రాంతాలకు కూడా వాతావరణ శాఖ శుభవార్త చెప్పింది. పంజాబ్, హర్యానాకు రుతుపవనాలు ఎప్పుడు వస్తాయో ప్రకటించింది. మండే వేడిని ఎదుర్కొన్న తర్వాత, రుతుపవనాలు ఢిల్లీకి కూడా వచ్చాయి, అయితే పంజాబ్, హర్యానా ప్రజలు ఇంకా రుతుపవనాల కోసం ఎదురు చూస్తున్నారు. వాతావరణ శాఖ ప్రకారం, రుతుపవనాలు రాబోయే రెండు రోజుల్లో పంజాబ్, హర్యానాతో సహా దేశం మొత్తాన్ని కవర్ చేస్తాయి. ఆ తర్వాత యూపీ-బీహార్ తరహాలో ఈ రాష్ట్రాల్లోనూ భారీ వర్షాలు కురుస్తాయి. హిమాచల్ ప్రదేశ్‌లోని 12 జిల్లాల్లో ఏడింటిలో కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు, ఉరుములతో కూడిన జల్లులు కురుస్తాయని వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ ప్రకటించింది. చంబా, కాంగ్రా, కులు, మండి, సిమ్లా, సిర్మౌర్, సోలన్ జిల్లాల్లో నేడు, రేపు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. సోమ, మంగళవారాల్లో రాష్ట్రంలోని వివిధ చోట్ల భారీ వర్షాలు, ఉరుములతో కూడిన జల్లులు పడే అవకాశం ఉంది. నైరుతి రుతుపవనాలు గురువారం హిమాచల్ ప్రదేశ్‌లోని అనేక ప్రాంతాలకు చేరుకున్నాయి. వాతావరణ శాఖ ప్రకారం, ఇప్పటివరకు సిమ్లాలో 84 మిల్లీమీటర్ల వర్షపాతం, సబర్బన్ ప్రాంతం జుబ్బర్‌హట్టిలో 136 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. గోహర్‌లో 42 మిమీ, మషోబ్రాలో 39.5 మిమీ, స్లోపర్‌లో 34.6 మిమీ, కుఫ్రి, షిలారులో 24.2 మిమీ, సరహన్, బర్తిన్‌లలో 22 మిమీ, ఘగాస్‌లో 18.8 మిమీ, కర్సోగ్‌లో 18.2 మిమీ వర్షపాతం నమోదైంది.

అలా జరిగితే రోహిత్ శర్మ సముద్రంలో దూకేస్తాడు.. గంగూలీ షాకింగ్ కామెంట్స్
భారత క్రికెట్ జట్టు ఎనిమిది నెలల్లో రెండో ప్రపంచకప్ ఫైనల్ ఆడనుంది. మరికొన్ని గంటల్లో జరిగే టీ20 ప్రపంచకప్ 2024 ఫైనల్‌లో దక్షిణాఫ్రికాతో తలపడనుంది. ఈ గ్రేట్ మ్యాచ్ బార్బడోస్‌లో జరగనుంది. నవంబర్ 19, 2023న వన్డే వరల్డ్ కప్ ఫైనల్‌లో ఆస్ట్రేలియా చేతిలో భారత్ ఓడిపోయింది. ఆ ప్రపంచకప్‌లో ఏ మ్యాచ్‌లోనూ ఓడిపోకుండానే టీమిండియా ఫైనల్‌కు చేరుకుంది. ఐసీసీ టైటిల్ కరువు కోసం సుదీర్ఘ నిరీక్షణను ముగించేందుకు ఇప్పుడు జట్టుకు మరో సువర్ణావకాశం లభించింది. అయితే, రాబోయే ఫైనల్‌లో భారత్ ఓడిపోతే రోహిత్ బార్బడోస్ సముద్రంలోకి దూకుతాడని భారత మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ సరదాగా అన్నాడు. ఏడు నెలల్లోపు అతను రెండు ప్రపంచకప్ ఫైనల్స్‌లో ఓడిపోతాడని నేను అనుకోను అని గంగూలీ అన్నాడు. ఏడు నెలల్లో అతని కెప్టెన్సీలో రెండు ఫైనల్స్‌లో ఓడిపోతే, బార్బడోస్ సముద్రంలో ప్రయాణించినప్పుడు రోహిత్ శర్మ బహుశా సముద్రంలోకి దూకేస్తాడని సౌరవ్ గంగూలీ సరదాగా వ్యాఖ్యానించాడు. రోహిత్ శర్మ ముందుండి జట్టును నడిపించాడని, అద్భుతంగా బ్యాటింగ్ చేశాడని.. అది ఫైనల్‌లోనూ కొనసాగుతుందని ఆశిస్తున్నానన్నారు. తప్పకుండా భారత్ కప్ గెలుస్తుందనే విశ్వాసాన్ని భారత జట్టు మాజీ కెప్టెన్ వ్యక్తం చేశారు. జట్టు భయపడకుండా ఆడాలని ఆయన చెప్పారు.

గుడిలో ప్రియుడిని పెళ్లాడిన తెలుగు హీరోయిన్
సౌత్ ఇండియన్ భాషల్లో నటించి ఫేమస్ అయిన నటి మీరా నందన్ ఈరోజు ఉదయం గురువాయూర్ ఆలయంలో కుటుంబ సభ్యుల సమక్షంలో పెళ్లి చేసుకున్నారు. దీనికి సంబంధించిన ఫోటోలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. నటి మీరా నందన్ కేరళకు చెందిన వారు. కొచ్చిలో పుట్టి పెరిగిన ఆమె ముందుగా యాంకర్ గా కెరీర్ మొదలు పెట్టి సీరియల్ నటిగా మారగా ఆ తర్వాత వెండితెరపై నటించే అవకాశం వచ్చింది. ఆమె 2007లో ప్రసారమైన వీడు అనే సీరియల్‌తో మలయాళ బుల్లితెర పరిశ్రమలో అడుగుపెట్టింది. తర్వాత 2008లో మలయాళ చిత్రం ‘ముల్లా’లో నటించింది. 2009లో అఖిల్ హీరోగా తమిళంలో నటించిన ‘వాల్మీకి’ సినిమాతో కోలీవుడ్‌లోకి అడుగుపెట్టింది మీరా. కానీ ఆమె నటించిన మొదటి సినిమా పరాజయం పాలైంది. అయితే 2011 లో జైబోలో తెలంగాణ అనే సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన ఆమె తరువాత 2015లో హితుడు, 2017లో 4త్ డిగ్రీ అనే సినిమాలు చేసినా తెలుగులో సరైన గుర్తింపు దొరకలేదు. తమిళం, తెలుగు, కన్నడ వంటి భాషల్లో ఆమె నటించిన సినిమాలు ఆశించిన స్థాయిలో ఆదరణ పొందలేకపోయాయి. అందుకే మలయాళ చిత్ర పరిశ్రమపై దృష్టి సారించింది. నటిగానే కాకుండా, రేడియో జాకీ, మోడల్ యాంకర్ గా కూడా పేరు తెచ్చుకున్న మీరా నందన్, ప్రియుడు బ్యూ శ్రీజుని ఈ ఉదయం గురువాయూర్ ఆలయంలో వివాహం చేసుకుంది. పెళ్లి చాలా సింపుల్ గా జరిగినా రిసెప్షన్ గ్రాండ్గా ప్లాన్ చేశారని అంటున్నారు. ప్రస్తుతం మీరా నందన్ – శ్రీజు పెళ్లి ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

కల్కి 2 రిలీజ్ అప్పుడే.. షూటింగ్ ఎంత అయిందంటే?
ప్రభాస్ హీరోగా కమల్ హాసన్ విలన్ గా అమితాబ్ బచ్చన్, దీపికా పడుకొనే, దిశా పటాని వంటి వాళ్ళు కీలక పాత్రలలో నటించిన సినిమా కల్కి 2898 ఏడి. డైరెక్టర్ నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ఈ సినిమా భారీ బడ్జెట్ తో తెరకెక్కించారు. వైజయంతి మూవీస్ బ్యానర్ మీద అశ్వినీ దత్ అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించిన ఈ సినిమాకి మొదటి ఆట నుంచి మంచి పాజిటివ్ రెస్పాన్స్ వస్తోంది. క్రిటిక్స్ కూడా సినిమా అద్భుతంగా ఉందంటూ ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. అయితే ఈ సినిమాకి సెకండ్ పార్ట్ కూడా ఉంది. కానీ అది ఎప్పుడు రిలీజ్ అవుతుంది అనే విషయం మీద క్లారిటీ లేదు. ఇక సినిమా సక్సెస్ అయిన నేపథ్యంలో మీడియాతో ముచ్చటించిన అశ్వినీ దత్ ఈ సినిమాకి సంబంధించిన సెకండ్ పార్ట్ రిలీజ్ గురించి షూటింగ్ గురించి ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. సెకండ్ పార్ట్ షూటింగ్ పూర్తయిందా అని అడిగిన మీడియా ప్రతినిధుల ప్రశ్నకు స్పందిస్తూ కొంత భాగం పూర్తయింది ఇప్పటికే మూడు వేల అడుగుల ఫుటేజ్ మా దగ్గర ఉంది అని ఆయన అన్నారు. అయితే రిలీజ్ డేట్ ఎప్పుడు అని అడిగితే ముందు ఇప్పుడు అది ఏమీ ఆలోచించలేదు అని పేర్కొన్న ఆయన బహుశా వచ్చేయడాది ఇదే సమయంలో రిలీజ్ చేసే అవకాశం ఉందని అన్నారు. అంతేకాక కల్కి సినిమాటిక్ యూనివర్స్ నుంచి ప్రస్తుతానికి ఈ రెండు భాగాలు మాత్రమే రిలీజ్ చేయాలనుకున్నామని ఈ రెండు రిలీజ్ అయిన తర్వాత అవకాశం ఉంటే మళ్లీ ఈ యూనివర్స్ లో భాగంగా సినిమాలు చేస్తారేమో నాగ్ అశ్విన్ నిర్ణయానికే వదిలేస్తున్నామని అన్నారు. ఇక నాగ్ అశ్విన్ గురించి కూడా అశ్విని దత్ ప్రశంసల వర్షం కురిపించారు.