Site icon NTV Telugu

Top Headlines @ 5 PM: టాప్‌ న్యూస్‌

Top Headlines @ 9 Pm

Top Headlines @ 9 Pm

జనసేన ఎమ్మెల్యేపై లైంగిక ఆరోపణలు.. విచారణ ప్రారంభం..
మహిళా ఉద్యోగినిపై లైంగిక ఆరోపణలు రావడంతో రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన జనసేన పార్టీ రైల్వే కోడూరు ఎమ్మెల్యే అరవ శ్రీధర్ వ్యవహారంపై విచారణ ప్రారంభమైంది. ఈ ఘటనపై జనసేన పార్టీ ముగ్గురు సభ్యులతో కూడిన విచారణ కమిటీని ఏర్పాటు చేసి, క్షేత్రస్థాయిలో విచారణ చేపట్టేందుకు సిద్ధమైంది. విచారణ కమిటీ రైల్వే కోడూరులో పర్యటించి, ఎమ్మెల్యే అరవ శ్రీధర్, బాధితురాలు, పార్టీ నాయకులు, సంబంధిత అధికారులు తదితరుల నుంచి వివరాలు సేకరించనుంది. ఆరోపణల వెనుక ఉన్న నిజానిజాలను సమగ్రంగా పరిశీలించి, పూర్తి వివరాలతో కూడిన నివేదికను డిప్యూటీ సీఎం, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్‌కు అందజేయనుంది. విచారణ కమిటీ సమర్పించే నివేదిక ఆధారంగా ఎమ్మెల్యేపై తదుపరి చర్యలు తీసుకునే అవకాశం ఉందని పార్టీ వర్గాలు తెలిపాయి. ఈ వ్యవహారంపై జనసేన పార్టీ కఠినంగా వ్యవహరించే అవకాశముందని, మహిళల భద్రత, న్యాయం విషయంలో రాజీ ఉండదని పార్టీ నాయకులు స్పష్టం చేశారు. ఈ ఘటనపై రాజకీయ వర్గాల్లో విస్తృత చర్చ జరుగుతుండగా, విచారణ ఫలితాలపై రాష్ట్రవ్యాప్తంగా ఆసక్తి నెలకొంది. కాగా, జనసేన ఎమ్మెల్యే శ్రీధర్‌పై బాధితురాలు చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి.. అంతేకాకుండా.. బాధితురాలు విడుదల చేసిన వీడియోలు వైరల్‌గా మారిపోయింది.. ఈ వ్యవహారంపై నిజానిజాలు తేల్చేందుకు జనసేన పార్టీ ముగ్గురు సభ్యులతో కూడిన విచారణ కమిటీని నియమించిన విషయం విదితమే..

లిక్కర్‌ స్కామ్‌ కేసులో చెవిరెడ్డికి బిగ్‌ రిలీఫ్..
ఆంధ్రప్రదేశ్‌లో సంచలనం సృష్టించిన ఏపీ లిక్కర్‌ స్కామ్‌ కేసులో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది.. ఈ కేసులో మాజీ ఎమ్మెల్యే, వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నేత చెవిరెడ్డి భాస్కర్‌ రెడ్డికి బిగ్ రిలీఫ్ లభించింది. ఈ కేసులో కోర్టు ఆయనకు బెయిల్ మంజూరు చేయడంతో, 226 రోజుల జైలు జీవితం అనంతరం ఆయన విడుదల కానున్నారు. ఇక, తమ నేత చెవిరెడ్డికి బెయిల్ రావడంతో తిరుపతి జిల్లావ్యాప్తంగా వైసీపీ శ్రేణులు సంబరాల్లో మునిగిపోయాయి. నియోజకవర్గంలోని పలు మండల కేంద్రాల్లో కార్యకర్తలు బాణాసంచా పేల్చుతూ హర్షం వ్యక్తం చేశారు. తుమ్మలగుంటలోని చెవిరెడ్డి నివాసం వద్ద పండుగ వాతావరణం నెలకొంది. పెద్ద సంఖ్యలో అభిమానులు, పార్టీ కార్యకర్తలు చేరుకుని “న్యాయం గెలిచింది” అంటూ నినాదాలు చేశారు.

గుడ్‌ న్యూస్‌ చెప్పిన ప్రభుత్వం.. వారికి ఉచిత విద్యుత్.. పెన్షన్‌ పెంపు..
చేనేత, పవర్‌లూమ్ కార్మికులకు ఆంధ్రప్రదేశ్‌లోని కూటమి ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు నేతన్నలకు ఉచిత విద్యుత్ పథకాన్ని అమలు చేయనున్నట్లు చేనేత మరియు టెక్స్‌టైల్స్‌ శాఖ మంత్రి సవిత ప్రకటించారు. ఈ పథకం వచ్చే ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి రానుంది. ఈ సందర్భంగా మంత్రి సవిత మాట్లాడుతూ.. ఎన్నికల సమయంలో చేనేతలకు అండగా ఉంటామని మాట ఇచ్చాం. గతంలో టీడీపీ ఎన్టీఆర్ కాలం నుంచి చేనేతలకు తోడుగా ఉంది. ఇచ్చిన మాట ప్రకారం హ్యాండ్‌లూమ్‌కు 200 యూనిట్లు, పవర్‌లూమ్‌కు 500 యూనిట్ల ఉచిత విద్యుత్ అందిస్తున్నాం అని తెలిపారు. ఈ పథకం ద్వారా రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 1,03,534 చేనేత కుటుంబాలు లబ్ధి పొందనున్నాయి. హ్యాండ్‌లూమ్ (మగ్గం): 200 యూనిట్లు – 93,000 కుటుంబాలు ఉండగా.. పవర్‌లూమ్ (మర మగ్గం)కు 500 యూనిట్లు – 10,534 కుటుంబాలకు అందించనున్నారు.. ఈ పథకం ద్వారా సుమారు 4 లక్షల మందికి ప్రత్యక్ష లబ్ధి చేకూరనుంది. నెలకు సుమారు రూ.85 కోట్ల భారం ప్రభుత్వంపై పడనుందని మంత్రి తెలిపారు. ఈ స్కీమ్‌ ద్వారా మగ్గం లబ్ధిదారులకు నెలకు సుమారు రూ.720, ఏడాదికి రూ.8,640 ఆదా కానుంది.. మర మగ్గం లబ్ధిదారులకు నెలకు సుమారు రూ.1,800, ఏడాదికి రూ.21,600 ఆదా అవుతుందని అంచనా వేస్తున్నారు.. మరోవైపు, 50 ఏళ్ల వయస్సు నుంచే నేతన్నలకు రూ.4,000 పెన్షన్ అందిస్తున్నామని మంత్రి సవిత తెలిపారు. ప్రస్తుతం 87,280 మంది నేతన్నలకు పెన్షన్లు అందుతున్నాయని చెప్పారు. పెన్షన్‌ను రూ.3,000 నుంచి రూ.4,000కి పెంచడంతో ఒక్కో నేతన్నకు ఏడాదికి రూ.12,000 అదనపు లబ్ధి లభిస్తోందని వివరించారు.

కేసీఆర్ సిట్ నోటీసులు.. ఎర్రవల్లి ఫామ్‌హౌస్‌కు కేటీఆర్‌, హరీష్ రావు
ఫోన్ ట్యాపింగ్ కేసులో విచారణను వేగవంతం చేసిన సిట్ అధికారులు, మాజీ సీఎం కేసీఆర్‌కు నోటీసులు అందజేశారు. రేపు (శుక్రవారం) మధ్యాహ్నం 3 గంటలకు విచారణకు అందుబాటులో ఉండాలని ఆ నోటీసుల్లో పేర్కొన్నారు. అయితే, కేసీఆర్ వయస్సు, ఆరోగ్య రీత్యా ఆయనకు పోలీస్ స్టేషన్‌కు రావాలనే నిబంధన నుంచి మినహాయింపునిచ్చారు. జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్‌కు రావచ్చు లేదా హైదరాబాద్ పరిధిలో తనకు అనుకూలమైన మరో ప్రదేశాన్ని సూచించవచ్చని అధికారులు వెసులుబాటు కల్పించారు. కేసీఆర్ సూచించిన ప్రదేశానికే అధికారులు వచ్చి విచారణ జరుపుతారని, ఆ ప్రదేశం ఏదనేది ముందే తెలియజేయాలని సిట్ స్పష్టం చేసింది. సిట్ నోటీసుల నేపథ్యంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి హరీష్ రావు మరికాసేపట్లో ఎర్రవల్లిలోని కేసీఆర్ ఫామ్ హౌస్‌కు వెళ్లనున్నారు. కేసీఆర్‌తో కలిసి వారు ఈ నోటీసుల పై సుదీర్ఘంగా చర్చించనున్నారు. ముఖ్యంగా రేపటి విచారణకు హాజరుకావాలా? లేక న్యాయపరమైన చిక్కులు రాకుండా ఉండేందుకు అధికారులను మరికొంత సమయం కోరాలా? అనే అంశాలపై వీరు చర్చించే అవకాశం ఉంది.

యాదాద్రిలో డాలర్స్ మాయం.. ఆడిట్‌లో బయటపడ్డ అసలు నిజం.!
యాదగిరిగుట్ట దేవాలయ ప్రచార శాఖ ఆధ్వర్యంలో భక్తుల కోసం విక్రయించే బంగారు , వెండి డాలర్ల లెక్కల్లో భారీ వ్యత్యాసం ఉన్నట్లు తాజాగా వెలుగులోకి వచ్చింది. ఏడాది కాలంగా ఈ డాలర్లు మాయమైనట్లు తాజాగా నిర్వహించిన అంతర్గత ఆడిట్‌లో అధికారులు గుర్తించారు. ఆలయ రికార్డుల ప్రకారం ఉండాల్సిన స్టాక్‌కు, క్షేత్రస్థాయిలో అందుబాటులో ఉన్న డాలర్లకు అస్సలు పొంతన లేకపోవడంతో ఈ మోసం బయటపడింది. అదృశ్యమైన ఈ డాలర్ల మొత్తం విలువ సుమారు 10 లక్షల రూపాయలకు పైనే ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ స్థాయిలో విలువైన వస్తువులు మాయమవ్వడం ఆలయ భద్రత , పర్యవేక్షణపై పలు అనుమానాలను రేకెత్తిస్తోంది. ఇటీవలే యాదాద్రి లడ్డు ప్రసాదంలో నాణ్యత లోపించడం, చింతపండు వినియోగంపై తలెత్తిన వివాదం మరువకముందే ఈ డాలర్ల మాయం వ్యవహారం వెలుగు చూడటం ఆలయ అధికారుల పనితీరుకు అద్దం పడుతోంది. పవిత్రమైన పుణ్యక్షేత్రంలో ఇలాంటి అవకతవకలు జరగడం పట్ల భక్తులు తీవ్ర విస్మయం వ్యక్తం చేస్తున్నారు. ఆలయ ఆస్తులను, భక్తుల నమ్మకాన్ని కాపాడాల్సిన బాధ్యత ఉన్న సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరించడంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ప్రచార శాఖలోని కొందరు సిబ్బంది సహకారంతోనే ఈ డాలర్లు పక్కదారి పట్టి ఉండవచ్చనే అనుమానాలు కూడా వ్యక్తం అవుతున్నాయి.

పవార్ మరణం తర్వాత ‘‘పవర్’’ పాలిటిక్స్.. డిప్యూటీ సీఏంగా సునేత్ర పవార్..!
నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్‌సిపి) అధినేత, డిప్యూటీ సీఎం అజిత్ పవార్ మరణంతో మహారాష్ట్ర రాజకీయాల్లో ‘‘పవర్ గేమ్’’ మొదలైంది. ఎన్సీపీకి తదుపరి అధినేత ఎవరనే ప్రశ్న ఉత్పత్నమవుతోంది. మరోవైపు, అజిత్ పవార్ వర్గం, శరద్ పవార్ వర్గం కలిసిపోతాయనే చర్చ నడుస్తోంది. ఈ నేపథ్యంలో అజిత్ పవార్ భార్య సునేత్ర పవార్‌ను మహారాష్ట్ర డిప్యూటీ సీఎం పదవి కోసం పార్టీ నామినేట్ చేయనున్నట్లు తెలుస్తోంది. సీనియర్ ఎన్సీపీ నేత, మహారాస్ట్ర ఎఫ్‌డీఏ మంత్రి నర్హరి జిర్వాల్ గురువారం మాట్లాడుతూ.. సునేత్ర పవార్‌ను రాష్ట్ర మంత్రివర్గంలోకి తీసుకోవాలని ప్రజలు కోరుకుంటున్నారని అన్నారు. మరోవైపు, ఎన్సీపీ నేతలు ప్రఫుల్ పటేల్, ఛగన్‌ భుజ్ బల్, ధనంజయ్ ముండే, సునీల్ తట్కరేలు సునేత్ర పవార్‌తో సంప్రదింపులు జరిపినట్లు తెలుస్తోంది. అజిత్ పవార్ మరణంతో ఖాళీ అయిన అసెంబ్లీ స్థానం నుంచి సునేత్రా పవార్‌ను పోటీలో దింపాలని ఎన్సీపీ భావిస్తోంది.

కులాల పేరుతో సమాజాన్ని విభజిస్తారా.? UGC నిబంధనలపై సుప్రీంకోర్టు స్టే..
యూనివర్సిటీల్లో కుల ఆధారిత వివక్షను అరికట్టేందుకు కేంద్రం ప్రవేశపెట్టిన యూనియన్ గ్రాంట్ కమిషన్(UGC) 2016 రూల్స్‌పై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. వీటి అమలుపై అత్యున్నత న్యాయస్థానం స్టే విధించింది. ఈ రూల్స్ అస్పస్టంగా ఉన్నాయని, సమాజాన్ని విభజించే అవకాశం ఉందని, దుర్వినియోగానికి తావిచ్చే అవకాశం ఉందని కోర్టు ఆందోళన వ్యక్తం చేసింది. చీఫ్ జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ జోయ్‌మల్య బాగ్చిలతో కూడిన ధర్మాసనం ఈ అంశంపై కేంద్రం, యూజీసీలకు నోటీసులు జారీ చేసింది. తదుపరి ఆదేశాలు వచ్చే వరకు ఈ నిబంధనలు అమలులో ఉండవని స్పష్టం చేసింది. కొత్త నిబంధనల ప్రకారం, ప్రతీ ఉన్నత విద్యాసంస్థలో ఈక్విటీ కమిటీలను ఏర్పాటు చేయాలి. ఇవి వివక్షకు సంబంధించిన ఫిర్యాదుల్ని పరిశీలించడంతో పాటు సామరస్య వాతావరణాన్ని ప్రోత్సహించాల్సి ఉంటుంది. ఈ కమిటీల్లో ఎస్‌సీ, ఎస్టీ, ఓబీసీలు, మహిళలు, దివ్యాంగులు ఉండాలని నిబంధనలు చెబుతున్నాయి. అయితే , జనరల్ కేటగిరి విద్యార్థలకు ఈ ఫిర్యాదు వ్యవస్థను విస్తరించకపోవడం తీవ్ర విమర్శలకు గురవుతోంది. ఇది సమాన హక్కుల సూత్రానికి విరుద్ధమని పిటిషన్లు వాదించారు. విద్యార్థుల మధ్య వైరాన్ని పెంచే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు.

ఎందుకు రూపాయి పతనం..? ఎలా కట్టడి చేయాలి..? రహస్యాన్ని బయటపెట్టిన సర్వే..
డాలర్‌తో పోలిస్తే భారత రూపాయి విలువ గురువారం ఆల్‌టైమ్ కనిష్ట స్థాయికి చేరింది. ఒక డాలర్‌కు రూపాయి విలువ 92కు పడిపోవడం ఆర్థిక వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ఈ ఏడాది ఇప్పటివరకు రూపాయి విలువ దాదాపు 2.5 శాతం తగ్గింది. అమెరికా ఫెడరల్ రిజర్వ్ రెపో రేటు కోతలను నిలిపివేయడం ఈ పతనానికి ప్రధాన కారణంగా భావిస్తున్నారు. ఇదిలా ఉండగా, కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంటులో ఆర్థిక సర్వే–2026ను ప్రవేశపెట్టారు. ఈ సర్వేలో భారత రూపాయి బలహీనతపై కీలక విశ్లేషణను పొందుపరిచారు. రూపాయి ఎందుకు క్షీణిస్తోంది, దాని వల్ల కలిగే ప్రభావాలు ఏమిటి, దీనిని ఎలా నియంత్రించవచ్చనే అంశాలపై స్పష్టతనిచ్చింది. ఆర్థిక సర్వే ప్రకారం, భారత రూపాయి నిరంతర పతనం దేశ ఆర్థిక మౌలికాంశాలను పూర్తిగా ప్రతిబింబించడం లేదు. రూపాయి తన వాస్తవ సామర్థ్యానికి మించి బలహీనపడుతోందని నివేదిక పేర్కొంది. ఆర్థిక మంత్రిత్వ శాఖకు చెందిన బృందం రూపొందించిన ఈ నివేదిక ప్రకారం, అమెరికా విధించిన సుంకాల ప్రభావాన్ని కొంతవరకు తగ్గించడంలో రూపాయి క్షీణత సహకరిస్తోంది. మరోవైపు, అమెరికా సుంకాల పెరుగుదలే రూపాయి పతనానికి ప్రధాన కారణం కాదని సర్వే స్పష్టం చేసింది. ప్రస్తుత పరిస్థితుల్లో రూపాయి విలువ తగ్గడం పూర్తిగా హానికరం కాదని, ఇది భారత ఎగుమతులకు కొంత లాభాన్ని చేకూరుస్తుందని పేర్కొంది.

టీ20 మ్యాచ్‌లో ఫస్ట్ బాల్ కే ఔటైన 5 మంది భారత బ్యాట్స్‌మెన్స్ వీరే..!
భారత్ న్యూజిలాండ్ మధ్యన 5 టీ20ల సిరీస్ జరుగుతున్న విషయం తెలిసందే. ఈ సిరీస్ లో వరుసగా మూడు మ్యాచ్ లను గెలిచిన టీమిండియా సిరీస్ ను కైవసం చేసుకుంది. నాలుగో టీ20లో భారత్ పరాజయంపాలైంది. కాగా న్యూజిలాండ్‌తో జరిగిన నాల్గవ టీ20లో తొలి బంతికే టీమిండియా స్టార్ ఓపెనింగ్ బ్యాట్స్‌మన్ అభిషేక్ శర్మ ఖాతా తెరవకుండానే ఔటయ్యాడు. ఇదే సిరీస్‌లో సంజు సామ్సన్ విషయంలో కూడా ఇలాంటి సంఘటనే జరిగింది. క్రికెట్ చరిత్రలో, మ్యాచ్‌లో తొలి బంతికే ఔటైన భారతీయ బ్యాట్స్‌మెన్‌లు ఐదుగురు మాత్రమే ఉన్నారు. 2016లో హరారేలో జింబాబ్వేతో జరిగిన మ్యాచ్‌లో కేఎల్ రాహుల్‌కు ఇదే జరిగింది. తన టీ20 అరంగేట్రంలోనే తొలి బంతికే ఔటయ్యాడు. తొలి బంతికే వికెట్ కోల్పోయి టీ20 ఇన్నింగ్స్‌ను ప్రారంభించిన భారత్ ఇదే తొలిసారి. అదేవిధంగా, 2021లో కొలంబోలో శ్రీలంకతో జరిగిన మ్యాచ్‌లో పృథ్వీ షా విషయంలో కూడా ఇలాంటి పరిస్థితి ఎదురైంది. వన్డేల్లో అద్భుతమైన ప్రదర్శన తర్వాత, టీ20ఐ జట్టులో ఇన్నింగ్స్‌ను ప్రారంభించే అవకాశాన్ని పొందాడు. అయితే, శ్రీలంకతో జరిగిన టీ20ఐ సిరీస్‌లోని తొలి మ్యాచ్‌లో, టాస్ గెలిచి ముందుగా బౌలింగ్ ఎంచుకున్న శ్రీలంక జట్టు తరపున ఆడుతున్న పృథ్వీ షా మొదటి బంతికే ఔటయ్యాడు.

డబ్బు కోసమే వదిలేసిందా? కీర్తి భట్‌ బ్రేకప్’పై ఎక్స్ లవర్ సంచలన వీడియో!
బిగ్‌బాస్‌తో తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరైన సీరియల్ నటి కీర్తి భట్, తాను రెండేళ్ల క్రితం నిశ్చితార్థం చేసుకున్న నటుడు విజయ్ కార్తీక్‌తో పెళ్లి విషయంలో ముందుకు వెళ్లడం లేదని ప్రకటించింది. ఇకమీదట స్నేహితులు లాగా ఉండాలని భావిస్తూ, ఇద్దరం మ్యూచువల్ గా విడిపోతున్నామని నిన్న సోషల్ మీడియా వేదికగా ప్రకటించింది. అయితే, ఈ విషయం మీద తాజాగా విజయ్ కార్తీక్ స్పందించాడు. తాను ఈ విషయం మీద స్పందించాలి అని అనుకోలేదు కానీ, చాలా మంది ఆమెను వదిలివేయవద్దు అంటూ తనకు ఫోన్లు, మెసేజ్ల ద్వారా చెబుతున్నారని, ఈ విషయంలో తాను ఆమెను వదిలేయాలని అనుకోలేదని చెప్పుకొచ్చాడు. “కీర్తి గారిని వదిలేయకండి, కూర్చుని మాట్లాడుకోండి అని చాలా మంది కంటిన్యూగా మెసేజ్లు పెడుతున్నారు. వదిలేయడం అనేది నా డెసిషన్ కాదు, ఎందుకంటే నేను ఆమెను పెళ్లి చేసుకోవాలనుకుని నిశ్చితార్థం చేసుకున్నాను. ఈ ఏడాది పెళ్లి చేసుకోవాలని మా కుటుంబ సభ్యులు కూడా భావించారు. అలాంటప్పుడు నేనెందుకు విడిపోవాలని డెసిషన్ తీసుకుంటాను? ఇది ఆమె సొంత డెసిషన్. ఎందుకంటే నేను ఇంకా ఫైనాన్షియల్ గా స్టేబుల్ కాలేదని ఆమెకు స్ట్రాంగ్ గా అనిపించింది. ఇదే విషయం డిసెంబర్‌లోనే చెప్పి ఆమె ఇప్పటికే తన జీవితం కొత్తగా ప్రారంభించింది. ఆమెకు ఆమె జీవితం మీద నిర్ణయం తీసుకునే హక్కు ఉంటుంది, నేను ఆ నిర్ణయాన్ని గౌరవిస్తాను” అంటూ విజయ్ కార్తీక్ చెప్పుకొచ్చాడు.

Exit mobile version