NTV Telugu Site icon

Top Headlines @ 5 PM: టాప్‌ న్యూస్‌

Top Headlines @ 5 Pm New

Top Headlines @ 5 Pm New

ఏపీలో భారీ నుంచి అతిభారీ వర్షాలు.. ఈ రెండు జిల్లాలకు రెడ్‌ అలర్ట్..
బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండ ప్రభావంతో.. ఆంధ్రప్రదేశ్‌లోని పలు జిల్లాలో వర్షాలు కురుస్తున్నాయి.. ఇక, తీవ్ర వాయుగుండం ప్రభావంతో రాగల 24 గంటల్లో రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు నమోదయ్యే అవకాశం ఉందని విశాఖ తుఫాన్‌ హెచ్చరికల కేంద్రం అంచనా వేసింది.. నైరుతి బంగాళాఖాతంలో ట్రింకోమలీకి తూర్పు ఈశాన్యంగా 110 కిలో మీటర్లు.. నాగపట్టణానికి ఆగ్నేయంగా 310 కి.మీ.. పుదుచ్చేరికి ఆగ్నేయంగా 410 కి.మీ… చెన్నైకి దక్షిణ ఆగ్నేయంగా 480 కి.మీ దూరంలో తీవ్ర వాయుగుండం కొనసాగుతోంది.. ఇది రాగల 12 గంటల్లో శ్రీలంక తీరాన్ని తాకుతూ ఉత్తర వాయువ్య దిశగా ప్రయాణించే అవకాశం ఉందని.. తీవ్రవాయుగుండం ఈరోజు సాయంత్రానికి లేదా రేపు ఉదయానికి తుఫాన్ గా బలపడే అవకాశం ఉందని పేర్కొంది. ఉత్తర తమిళనాడు, పుదుచ్చేరి తీరాలలో కరైకల్, మహాబలిపురం మధ్య ఈ నెల 30వ తేదీ ఉదయం తీవ్ర వాయుగుండంగా తీరం దాటే అవకాశం ఉందని తుఫాన్‌ హెచ్చరికల కేంద్రం అంచనా వేస్తోంది.. దీని ప్రభావంతో దక్షిణ కోస్తా ,రాయలసీమ జిల్లాలో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంది.. ఇక, తిరుపతి, నెల్లూరు జిల్లాలకు రెడ్ అలెర్ట్ జారీ చేశారు అధికారులు.. అన్నమయ్య, చిత్తూరు జిల్లాలో కొన్ని చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు పడనున్న నేపథ్యంలో ఆరెంజ్ అలర్ట్ జారీ అయ్యింది.. ప్రకాశం, సత్యసాయి, వైఎస్ఆర్ కడప జిల్లాలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్న నేపథ్‌యంలో ఎల్లో అలర్ట్ జారీ అయ్యింది.. దక్షిణ కోస్తా తీరం వెంబడి 45 నుంచి 55 వరకు గరిష్టంగా 65 కిలోమీటర్లు వేగంతో గాలులు వీస్తాయని.. కోస్తా తీరంలో మత్య్సకారులు చేపలువేటకు వెళ్లరాదని స్పష్టం చేసింది.. ఏపీలో ఉన్న అన్ని పోర్టులలో ఒకటివ నెంబర్ ప్రమాద హెచ్చరికలు జారీ చేశారు.. వ్యవసాయ పనులు చేసుకునే రైతులు తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది విశాఖ తుఫాన్ హెచ్చరికల కేంద్రం.

రైతులకు అండగా ఉంటాం.. దళారులను ప్రోత్సహించొద్దు..
రైతులకు అండగా ఉంటాం.. ధాన్యానికి కనీస మద్దతు ధర కల్పిస్తాం.. కానీ, రైతులు దళారులను ప్రోత్సహించొద్దు అని సూచించారు పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్.. కృష్ణా జిల్లాలో పర్యటించిన ఆయన.. పామర్రు, గుడివాడ నియోజకవర్గాల్లో రోడ్లపై ఆరబోసిన ధాన్యపురాసులను పరిశీలించారు.. రైతులతో మాట్లాడుతూ.. ఇబ్బందులు లేకుండా ధాన్యం కొనుగోళ్ల ప్రక్రియ జరుగుతుందంటూ భరోసా ఇచ్చారు.. ఆ తర్వాత మీడియాతో మాట్లాడుతూ.. వాతావరణ మార్పులతో 40 రోజులపాటు జరగాల్సిన ప్రక్రియ.. నాలుగు రోజుల్లో చేయాల్సి వస్తుంది. రైతులకు మద్దతుగా.. అధికార యంత్రాంగమంతా రాత్రింబవళ్లు కష్టపడుతుంది. వాతావరణ మార్పులతో రైతులకు మేలు చేకూర్చేలా.. ధాన్యం విక్రయాల్లో అనేక సంస్కరణలు తీసుకొచ్చాం అన్నారు.. ఇక, ధాన్యం విక్రయాలపై క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ రైతులకు భరోసా కల్పిస్తున్నాం అన్నారు మంత్రి మనోహర్.. రైతులకు నమ్మకం కలిగించేలా.. ధాన్యం కొనుగోళ్లలో ఇబ్బందులు లేకుండా ముందుకు వెళ్ళమని అధికారులకు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చాం. గతంలో ఎన్నడూ లేని విధంగా.. ధాన్యం విక్రయించిన 24 గంటల్లో.. రైతుల ఖాతల్లో నగదు జమ చేస్తున్నాం. 24 తేమ శాతం ఉన్న ధాన్యం కొనుగోళ్లు చేసేలా మిల్లర్లకు ఖచ్చితమైన ఆదేశాలు ఇచ్చాం అన్నారు. రైతుల ఆందోళన దృష్టిలో ఉంచుకొని.. సాయంత్రానికల్లా గుడివాడలో 30 మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేసేలా చర్యలు తీసుకున్నాం. మిల్లర్లకు బ్యాంకు గ్యారంటీ ఇబ్బందులు తలెత్తకుండా.. బకాయి నిధులు విడుదల చేశాం. కొత్త ఆలోచనతో 1:2 నిష్పత్తిలో రైతులకు బ్యాంక్ గ్యారంటీ వెసులుబాటు కల్పించాం. రైతు సహాయ కేంద్రాలను సంప్రదిస్తే.. కల్లాల వద్దకే గోనేసంచెలు.. రవాణా వాహనాలను పంపించేలా ఏర్పాటు చేశామన్నారు.. అయితే, రైతులెవరు దళాలను ప్రోత్సహించవద్దు అని సూచించారు పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్.

ఆక్వా రైతులతో మంత్రి గొట్టిపాటి భేటీ.. నాణ్యమైన విద్యుత్‌ సరఫరాపై హామీ
పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో ఆక్వా రైతులతో సమావేశమయ్యారు మంత్రి గొట్టిపాటి రవి కుమార్.. ఈ సందర్భంగా తమ సమస్యలను మంత్రి దృష్టికి తీసుకెళ్లారు ఆక్వా రైతులు. నాణ్యమైన విద్యుత్ ను సరఫరా చేయాలని మంత్రిని కోరారు రైతులు.. అయితే, వారి సమస్యలను విన్న మంత్రి గొట్టిపాటి.. నాణ్యమైన విద్యుత్ సరఫరాకు రైతులకు హామీ ఇచ్చారు.. ఇక, విద్యుత్‌ లోడ్ ఎక్కువగా ఉన్న ప్రాంతాలపై దృష్టి పెట్టాలని అధికారులకు సూచించారు.. విద్యుత్ సరఫరా అవసరానికి తగినట్లుగా కొత్త సబ్ స్టేషన్లను గుర్తించాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.. సీజనల్ సబ్సిడీపై ప్రభుత్వం పునరాలోచన చేయాలని కోరారు.. పలు హేచరీల యాజమాన్యాలు. హేచరీస్‌ యాజమాన్యాలతో అధికారులు సమావేశమై వారిపై ఆర్థిక భారం పడకుండా సమస్యపై నివేదిక కోరారు మంత్రి గొట్టిపాటి. దీనిపై ఇప్పటికే అసెంబ్లీలో చర్చించినట్లు తెలిపారు.. త్వరలోనే ఆక్వా రైతుల సమస్యలపై సరైన నిర్ణయం తీసుకుంటామని సంబంధిత రైతులకు భరోసా ఇచ్చారు మంత్రి గొట్టిపాటి రవికుమార్. మరోవైపు.. పశ్చిమ గోదావరి పర్యటనలో ఉన్న మంత్రి గొట్టిపాటి రవికుమార్‌.. కేంద్ర సహాయ మంత్రి శ్రీనివాస్ వర్మను పరామర్శించారు..

తిరోగమనం వైపు ఏపీ.. ధ్వజమెత్తిన జగన్
రాష్ట్రం తిరోగమనంలో ఉంది.. గత ఐదేళ్లు విప్లవాత్మక అడుగులు పడ్డాయి.. ఇప్పుడు ఆ విప్లవాత్మక అడుగులు అన్నీ వెనక్కి పడుతున్న బాధాకరమైన పరిస్థితి ఉంది అంటూ ధ్వజమెత్తారు వైఎస్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత, మాజీ సీఎం వైఎస్‌ జగన్‌.. గురువారం మీడియాతో మాట్లాడిన ఆయన.. రెడ్ బుక్ పరిపాలనలో రాజ్యాంగం తూట్లు పొడుస్తున్నారు.. రాష్ట్రంలో లిక్కర్ స్కామ్‌లు, సాండ్ స్కామ్‌లు కనపడుతున్నాయి.. పేకాట క్లబ్‌లు, మాఫీయా వ్యవహారం నడుస్తోంది.. ఏ పని చేయాలన్నా, పరిశ్రమలు పెట్టాలన్నా చంద్రబాబుకి, ఎమ్మెల్యేకు ఇంతా అని ముట్ట చెప్పాల్సిన పరిస్థితి ఉందంటూ సంచలన ఆరోపణలు చేశారు.. పాదయాత్రలో నేను గుర్తించిన ప్రతి సమస్యకు పరిష్కారం ఇచ్చే ప్రయత్నం చేశాను.. DBT ద్వారా లంచాలు లేకుండా సంక్షేమం అందించాం.. అవినీతికి తావులేకుండా సచివాలయాల ద్వారా అన్ని సేవలు ప్రజలకు అందించాం.. 2.73 లక్షల కోట్లు DBT ద్వారా అవినీతి, వివక్ష లేకుండా మేం ఇచ్చామని గుర్తుచేసుకున్నారు జగన్‌..

రైతు భరోసాపై మంత్రి కీలక ప్రకటన..
నల్లగొండ జిల్లాలో మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి పర్యటించారు. మహాత్మ జ్యోతిబా పూలే వర్ధంతి సందర్భంగా ఆయన విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రైతు భరోసాపై కీలక ప్రకటన చేశారు. త్వరలో రైతు భరోసా ఇవ్వబోతున్నామని తెలిపారు. ఇప్పటికే 18 వేల కోట్ల రూపాయల రుణమాఫీ చేశాం.. మిగతా రుణమాఫీ ఈ నెల 30న చేస్తామన్నారు. ఇదిలా ఉంటే.. రాష్ట్రంలో కులగణనను ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తుందని అన్నారు. కులగణన నివేదికపై అసెంబ్లీలో సమగ్ర చర్చ జరుపుతామని చెప్పారు. త్వరలో నల్గొండలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటన ఉంటుందని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి తెలిపారు. తెలంగాణలో పాలనను ప్రధాని విమర్శించడం ఆయన విజ్ఞతకే వదిలేస్తున్నామని మంత్రి అన్నారు. బీజేపీ పాలిత రాష్ట్రాలలో 500 రూపాయలకు సిలిండర్ ఎందుకు ఇవ్వడం లేదో ప్రధాని చెప్పాలని కోరారు. రాష్ట్ర అభివృద్ధి కోసం కేంద్రంతో కలిసి పని చేస్తాం.. కానీ రాజకీయంగా కొట్లాడుతామని పేర్కొన్నారు.

కేంద్రాన్ని, పార్లమెంట్‌ను తప్పుదోవ పట్టించారు.. ప్రభుత్వంపై విమర్శలు
మాజీ మంత్రి హరీష్ రావు రాష్ట్ర ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. మూసీ డెవలప్మెంట్ పైన పార్లమెంట్‌లో ఒక ప్రశ్న లేవనెత్తాము.. 2013 భూసేకరణ చట్టం అమలు చేస్తున్నామని రాష్ట్రం చెప్పిందని కేంద్రమంత్రి చెప్పారు.. కానీ, కాంగ్రెస్ ప్రభుత్వం కేంద్రాన్ని, పార్లమెంట్‌ను తప్పుదోవ పట్టించిందని హరీష్ రావు ఆరోపించారు. భూసేకరణ చట్టం వచ్చింది 2013లో అయితే.. రాష్ట్రాలకు వెసులుబాటు కల్పించింది కేంద్రం అని అన్నారు. దానికి తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత 2014లో కేసీఆర్ మార్పులు చేసారు.. 2013 చట్టానికి లోబడి ఇంకా మెరుగైన చట్టాన్ని 2014లో తీసుకుని వచ్చామని హరీష్ రావు తెలిపారు. మరోవైపు.. PN, PD నోటిఫికేషన్లు ఇచ్చిన తర్వాత ఇళ్లు కూల్చాలని హరీష్ రావు అన్నారు. పేదల ఇల్లు కూల్చి డబుల్ బెడ్ రూంలలో పడేస్తున్నారు.. పాత ఇంటికి విలువ కట్టాలి.. దాని నెట్ వాల్యూకి రెండింతలు ఇవ్వాలని హరీష్ రావు పేర్కొన్నారు. ఒక్క కుటుంబానికి 7 లక్షల రూపాయలు ఇవ్వాలి.. వారి పేరుపై రిజిస్ట్రేషన్ చేసి డబుల్ బెడ్ రూం ఇవ్వాలి.. 18 ఏళ్లు దాటిన వారికి 5లక్షలు ఇవ్వాలి.. 250 గజాల స్థలం ఇవ్వాలని తెలిపారు.

సిరిసిల్ల కలెక్టర్‌పై వ్యాఖ్యలను ఖండించిన అధికారుల సంఘం..
సిరిసిల్ల జిల్లా కలెక్టర్‌పై సిరిసిల్ల శాసనసభ్యులు కె.తారక రామారావు చేసిన అవమానకరమైన, నిరాధార ఆరోపణలను.. దుర్భాషలాడటాన్ని తెలంగాణ ఐపీఎస్ అధికారుల సంఘం తీవ్రంగా ఖండిస్తుంది. సివిల్ సర్వీస్ అధికారిపై చేసిన విమర్శలు పాలనా విధానాలు, రాజ్యాంగ నిబద్ధత ఆధారంగా సివిల్ సర్వెంట్స్ నిర్వర్తించే బాధ్యతలకు విరుద్ధంగా ఉన్నాయని పేర్కొన్నారు. ప్రజాసేవలో అధికారి విధులను నిష్పక్షపాతంగా, న్యాయబద్ధంగా, ఎటువంటి భయాందోళనలు లేకుండా నిర్వహించాల్సి ఉంటుంది.. అయితే, ఊహించని ఇటువంటి నిరాధార ఆరోపణలు బాధ్యతారాహిత్యమైనవిగా, ప్రజాస్వామ్య వ్యవస్థలపై చెడు ప్రభావాన్ని చూపిస్తాయని అధికారుల సంఘం తెలిపారు. ఈ సందర్భంలో తెలంగాణ ఐపీఎస్ అధికారుల సంఘం సిరిసిల్ల జిల్లా కలెక్టర్‌కు పూర్తి మద్దతు తెలియజేస్తుందని అన్నారు. సివిల్ సర్వీసు గౌరవం, స్వతంత్రత, నిష్పక్షపాతత్వాన్ని కాపాడటానికి తాము అండగా నిలబడతామని సంఘం స్పష్టం చేస్తోంది. అందువల్ల, ఇటువంటి నిరాధార ఆరోపణలను వెంటనే నిలిపివేయాలని.. వ్యవస్థల గౌరవాన్ని, రాజ్యాంగం ద్వారా కల్పించిన న్యాయబద్ధతను గౌరవించే విధంగా వ్యవహరించాలని తెలంగాణ ఐపీఎస్ అధికారుల సంఘం పిలుపునిస్తోంది. కాగా.. రెండు రోజుల క్రితం సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని తెలంగాణ భవన్‌లో దీక్షా దివస్‌ సన్నాహక సమావేశంలో కేటీఆర్ జిల్లా కలెక్టర్‌ను ఉద్దేశించి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఆయన మాట్లాడిన వ్యాఖ్యలు కింద వీడియోలో ఉంది.

జార్ఖండ్ సీఎంగా హేమంత్ సోరెన్ ప్రమాణస్వీకారం
జార్ఖండ్ ముఖ్యమంత్రిగా హేమంత్ సోరెన్ ప్రమాణస్వీకారం చేశారు. జార్ఖండ్ 14వ ముఖ్యమంత్రిగా హేమంత్ ప్రమాణం చేశారు. గవర్నర్ సంతోష్ కుమార్ గాంగ్వార్‌.. హేమంత్‌తో ప్రమాణం చేయించారు. కేవలం హేమంత్ ఒక్కరే ప్రమాణస్వీకారం చేశారు. ఈ కార్యక్రమానికి ఇండియా కూటమి నేతలంతా హాజరయ్యారు. కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీ, కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే, ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్, సతీమణి సునీతా కేజ్రీవాల్, బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్, తమిళనాడు డిప్యూటీ సీఎం  ఉదయనిధి స్టాలిన్, యూపీ మాజీ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్, శరద్ పవార్, కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే.శివకుమార్,  తదితర నేతలంతా హాజరయ్యారు. రాష్ట్రంలో 81 స్థానాలుండగా.. జేఎంఎం 34 చోట్ల విజయం సాధించింది. బీజేపీ 21, కాంగ్రెస్‌ 16, ఆర్జేడీ 4, సీపీఐ(ఎంఎల్‌)(ఎల్‌) రెండు, ఏజేఎస్‌యూపీ, లోక్‌ జనశక్తిపార్టీ (రాం విలాస్‌), జేఎల్‌కేఎం, జేడీయూ చెరో ఒక స్థానం చొప్పున గెలుచుకున్నాయి.

వక్ఫ్ బిల్లుపై పార్లమెంటరీ కమిటీ పదవి కాలం పొడగించిన పార్లమెంట్..
వక్ఫ్ (సవరణ) బిల్లుపై జాయంత్ పార్లమెంటరీ కమిటీ పదవీ కాలాన్ని వచ్చే ఏడాది పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల చివరిరోజు వరకు పొడగిస్తూ లోక్‌సభలో గురువారం తీర్మానాన్ని ఆమోదించారు. కమిటీ చైర్మన్, బీజేపీ నేత జగదాంబిక పాల్ లోక్‌భలో తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. మూజువాణి ఓటుతో దీనిని ఆమోదించారు. గత వర్షకాల సమావేశాల్లో వక్ఫ్ బిల్లుని కేంద్రం తీసుకువచ్చింది. అయితే, ఈ బిల్లుపై ప్రతిపక్షాలు అభ్యంతరం వ్యక్తం చేయడంతో రాజ్యసభ, లోక్‌సభలోని అధికార, విపక్ష ఎంపీలతో కలిపి జాయింట్ పార్లమెంటరీ కమిటీ(జేపీసీ)ని ఏర్పాటు చేశారు. అయితే, ఈ శీతాకాల సమావేశాల్లోనే కమిటీ తన నివేదికను పార్లమెంట్‌కి సమర్పించాల్సి ఉంది. ప్రతిపక్షాలతో పాటు పలువురు బీజేపీ ఎంపీలు కమిటీ కాల పరిమితిని పొడగించాలని కోరారు. నిజానికి శీతాకాల సమావేశాల్లో మొదటి వారం చివరి శుక్రవారం తన నివేదికను సమర్పించాల్సి ఉంది.

జైలు నుంచి విడుదలై గేట్ ముందే డ్యాన్స్ చేసిన ఖైదీ.. వీడియో వైరల్
జైలు నుంచి విడుదలవ్వడమంటే ఏ ఖైదీకైనా సంతోషమే. నాలుగు గోడల మధ్య బందీ అయిపోయే.. కుటుంబానికి దూరమైపోవడం అంటే ఎవరికైనా బాధాకరమే. మొత్తానికి జైలు శిక్ష పూర్తి చేసుకుని చెరసాల నుంచి ఖైదీ బయటకు వచ్చాడు. ఆనందమో.. లేదంటే సంతోషమో.. లేదంటే తన టాలెంట్ చూపించాలనుకున్నాడో.. ఏమో తెలియదు గానీ.. బయటకు రాగానే గేటు ముందే బ్రేక్ డ్యాన్స్ చేశాడు. ఆశ్చర్యం ఏంటంటే.. అతగాడి డ్యా్న్స్‌ను జైలు సిబ్బంది చూసి ఆస్వాదించారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లోని కన్నౌజ్‌లో చోటుచేసుకుంది. కన్నౌజ్ ప్రాంతానికి చెందిన శివ.. ఓ దాడి కేసులో ఏడాది జైలు, రూ.1,000 జరిమానా పడింది. అయితే ఎన్జీవో సాయంతో తొమ్మిది నెలలకే జైలు నుంచి శివ విడుదలయ్యాడు. అయితే శివ జైలు నుంచి బయటకు రాగానే.. ఏమనుకున్నాడో తెలియదు గానీ.. ఉన్నట్టుండి బ్రేక్ డ్యాన్స్ చేశాడు. మైకేల్ జాక్సన్ మాదిరిగా స్టెప్పులు వేశాడు. అయితే ఈ డ్యాన్స్‌ను జైలు సిబ్బంది, న్యాయవాది వీక్షించారు. అయితే శివ స్నేహితుడు.. ఈ దృశ్యాలను మొబైల్‌లో చిత్రీకరించి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. అయితే నెటిజన్లు రకరకాలుగా కామెంట్లు చేస్తున్నారు. ఇంత టాలెంట్ పెట్టుకుని.. చిన్న చిన్న తప్పులు కారణంగా జైలు పాలయ్యాడంటూ కామెంట్ చేస్తున్నారు. అతగాడి టాలెంట్‌ను మీరు కూడా చూసేయండి.

మైనర్ బాలికపై అంబులెన్స్‌లో సామూహిక అత్యాచారం..
మధ్యప్రదేశ్‌లోని దారుణం జరిగింది. మౌగంజ్ జిల్లాలో కదులుతున్న అంబులెన్స్‌లో ఇద్దరు వ్యక్తులు 16 ఏల్ల బాలికను కిడ్నాప్ చేసి సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ ఘటన సంచలనం సృష్టించింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మౌగంజ్ జిల్లా కేంద్రానికి 30 కి.మీ దూరంలో ఉన్న హనుమాన పోలీస్ స్టేషన్ పరిధిలో నవంబర్ 25న ఈ సంఘటన జరిగింది. ఇద్దరు వ్యక్తులు తనను బలవంతంగా కిడ్నాప్ చేసి జననీ ఎక్స్‌ప్రెస్ అంబులెన్స్‌లో బలవంతంగా ఎక్కించి సామూహిక అత్యాచారానికి పాల్పడినట్లు బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీనిని ‘‘108 అంబులెన్స్’’ అని కూడా పిలుస్తారు. జననీ ఎక్స్‌ప్రెస్ అంబులెన్స్‌ను మధ్యప్రదేశ్‌లోని గ్రామీణ ప్రాంతాల్లోని తల్లులు, అనారోగ్యంతో ఉన్న శిశువులు, పేద కుటుంబాల అత్యవసర రవాణా సౌకర్యాలను అందించేందుకు ప్రభుత్వం వీటిని నిర్వహిస్తోంది.

ట్రంప్ ఎఫెక్ట్.. స్టాక్ మార్కెట్ భారీ పతనం
దేశీయ స్టాక్ మార్కెట్‌గా భారీగా పతనం అయింది. అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టబోయే డొనాల్డ్ ట్రంప్ తీసుకుంటున్న నిర్ణయాలు మార్కెట్‌పై తీవ్ర ప్రభావం చూపిస్తోంది. గురువారం ఉదయం ప్లాట్‌గా ప్రారంభమైన సూచీలు.. క్రమక్రమంగా భారీ నష్టాల్లోకి జారుకున్నాయి. ఇక ముగింపులో సెన్సెక్స్ 1,190 పాయింట్లు నష్టపోయి 79, 043 దగ్గర ముగియగా.. నిఫ్టీ 360 పాయింట్లు నష్టపోయి 23, 914 దగ్గర ముగిసింది. ఇక రూపాయి మారకం విలువ డాలర్‌తో పోలిస్తే రూ.84.49 దగ్గర ముగిసింది. ఇక నిఫ్టీలో ఎస్‌బీఐ లైఫ్ ఇన్సూరెన్స్, హెచ్‌డీఎఫ్‌సీ లైఫ్, ఇన్ఫోసిస్, ఎం అండ్ ఎం, బజాజ్ ఫైనాన్స్ భారీ నష్టాల్లో కొనసాగగా.. అదానీ ఎంటర్‌ప్రైజెస్, శ్రీరామ్ ఫైనాన్స్, ఎస్‌బీఐ, సిప్లా లాభపడ్డాయి. సెక్టోరల్‌లో ఆటో, బ్యాంక్‌, ఐటీ, ఎఫ్‌ఎంసీజీ, మెటల్‌ ఫార్మా, ఎనర్జీ 0.3-2 శాతం, పీఎస్‌యూ బ్యాంక్‌ ఇండెక్స్‌ 1 శాతం, మీడియా ఇండెక్స్‌ 0.3 శాతం పెరిగాయి. బీఎస్‌ఇ మిడ్‌క్యాప్ ఇండెక్స్ ఫ్లాట్‌గా ముగియగా, స్మాల్‌క్యాప్ ఇండెక్స్ 0.4 శాతం పెరిగింది.

ఓటీటీలో రిలీజ్ అయిన లక్కీ భాస్కర్, క.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..?
మలయాళ స్టార్ దుల్కర్ సల్మాన్ లేటెస్ట్ రిలీజ్ “లక్కీ భాస్కర్”. దీపావళి కానుకగా రిలీజ్ అయిన ఈ సినిమా సూపర్ హిట్ టాక్ తెచ్చుకుంది. ఇటీవల 25 రోజుల థియేటర్ రన్ కంప్లిట్ చేసుకుంది  లక్కీ భాస్కర్. ఇక ఇప్పుడు ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ కు రెడీ అయింది. ఈ సినిమా డిజిటల్ రైట్స్ దక్కించుకున్న నెట్ ఫ్లిక్స్ భారీ ధరకు దక్కించుకోగా  నేటి నుండి స్ట్రీమింగ్ కు తీసుకువచ్చింది. మరోవైపు థియేటర్స్ లో లక్కీ భాస్కర్ స్టడీగా కలెక్షన్స్ రాబడుతోంది. రిలీజ్ అయిన కేవలం మూడు వారాల్లోనే లక్కీ భాస్కర్ రూ. 110 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసింది. దుల్కర్ కెరీర్ బెస్ట్ సినిమా రికార్డు క్రియేట్ చేసింది లక్కీ భాస్కర్. ఇక టాలీవుడ్ యంగ్ హీరో కిరణ్ అబ్బవరం నటించిన భారీ పీరియాడిక్ థ్రిల్లర్ సినిమా “క”. చింతా గోపాలకృష్ణ రెడ్డి భారీ ప్రొడక్షన్ వ్యాల్యూస్ తో నిర్మించిన ఈ సినిమాకు దర్శక ద్వయం సుజీత్, సందీప్ దర్శకత్వం వహించారు. విలేజ్ బ్యాక్ డ్రాప్ యాక్షన్ థ్రిల్లర్ కథతో ‌”క” సినిమాను తెరకెకెక్కించారు. ఈ సినిమా 31న దీపా‌వళి పండుగ సందర్భంగా తెలుగులో గ్రాండ్ థియేట్రికల్ ఆయిన ఈ సినిమా బ్లాక్ బస్టర్ టాక్ తో పాటు దీపావళి విన్నర్ గా నిలిచింది. కిరణ్ అబ్బవరం కెరీర్ లో బిగ్గెట్ హిట్ గా నిలిచిన ‘క’ ఈ రోజు నుండి డిజిటల్ స్ట్రీమింగ్ అవుతోంది. ఈ సినిమా డిజిటల్ రైట్స్ ను ప్రముఖ తెలుగు ఓటీటీ సంస్థ ఈటీవీ విన్ స్ట్రీమింగ్ కు తీసుకువచ్చినట్టు అధికారకంగా ప్రకటించింది.

ఓటీటీలో రిలీజ్ అయిన ప్రియదర్శి, టోవినో థామస్ సినిమాలు
వెర్సటైల్ యాక్టర్ ప్రియదర్శి లీడ్ రోల్ లో నటించిన క్రైమ్ థ్రిల్లర్ ‘తప్పించుకు తిరుగువాడు ధన్యుడు సుమతి’. నిరంజన అనూప్, మణికందన్ ఆర్. ఆచారి ఇతర కీలక పాత్రలు పోషించారు. నారాయణ చెన్నా దర్శకత్వం  వచించిన ఈ సినిమా బ్యాంక్ రాబరీ బ్యాక్ డ్రాప్ లో సాగుతుంది. హాస్య నటుడు ప్రియదర్శి క్యారెక్టరైజేషన్ ప్రేక్షకులని కట్టిపడేసింది. తనదైన నేచురల్ పెర్ఫామెన్స్, కామిక్ టైమింగ్ తో కథని ఆద్యంతం ఆకట్టుకునేలా నడిపారు ప్రియదర్శి. కాగా ఇప్పుడీ సినిమా భవానీ మీడియా ద్వారా ఆహ ఓటీటీలో నవంబర్ 28 నుంచి స్ట్రీమింగ్  అవుతోంది. ఇక మలయాళం స్టార్ టోవినో థామస్ లీడ్ రోల్ లో నటించిన చిత్రం నారదన్. అన్నా బెన్, షరాఫుద్దీన్, ఇంద్రన్స్, జాఫర్ ఇడుక్కి ఇతర కీలక పాత్రలు పోషించారు. నిజ జీవిత సంఘటనల నుండి ప్రేరణ పొందిన ఈ చిత్రంలో న్యూస్ యాంకర్ చంద్రప్రకాష్ పాత్రలో టోవినో థామస్ ప్రేక్షకులను అలరించాడు. నేటి TRP-బేస్డ్ మీడియా ల్యాండ్‌ స్కేప్‌లో నైతిక జర్నలిజం పాత్రపై నారదన్ పవర్ ఫుల్ ప్రతిబింబం. నారదన్ జర్నలిస్టులు ఎదుర్కొనే సవాళ్లను, కథల కోసం కనికరంలేని అన్వేషణ, వారి అభిరుచి కోసం చాలా మంది భరించే సవాళ్లను ఎక్సయిటింగ్ ప్రజెంట్ చేస్తోంది. మలయాళంలో థియేటర్స్ లో విడుదలై విజయం సాధించిన ఈ చిత్రం తెలుగు వెర్షన్ భవానీ మీడియా ద్వారా ఇప్పుడు ఆహాలో స్ట్రీమింగ్ కాబోతోంది. నవంబర్ 29 నుంచి ఆహాలో ప్రసారం కానుంది. ఈ రెండు ఎక్సయిటింగ్ మూవీస్ ను ఆహా నేడు స్ట్రీమింగ్ కు తీసుకువచ్చింది.