ఉద్దానం పేజ్ -2 మంచినీటి పథకానికి శంకుస్థాపన.. ఆ సంస్కృతి మాది కాదు..!
ప్రభుత్వాన్ని ఎదిరిస్తే ప్రభుత్వ పథకాలు కట్ చేయడం వంటి సంస్కృతి మా కూటమి ప్రభుత్వానికి లేదన్నారు కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజారపు రామ్మోహన్ నాయుడు.. శ్రీకాకుళం జిల్లాలో పర్యటించిన ఆయన.. పాతపట్నంలో 265 కోట్ల రూపాయలతో చేపట్టనున్న ఉద్దానం పేజ్ – 2 మంచినీటి పథకానికి శంకుస్థాపన చేశారు.. పాతపట్నం నియోజకవర్గంలోని బూరగాం గ్రామంలో 265 కోట్ల రూపాయలతో ఉద్దానం పేజ్ -2 మంచినీటి పథకం ప్రాజెక్టుకు శంకుస్థాపన చేసిన ఆయన.. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. గత ప్రభుత్వం లాగా ఇసుక మాఫియా, భూధందాలు, లిక్కర్ మీద సొమ్ము చేసుకోవడం లేదన్నారు.. ప్రభుత్వాన్ని ఎదిరిస్తే ప్రభుత్వ పథకాలు కట్ చేయడం వంటి సంస్కృతి కూడా మా కూటమి ప్రభుత్వానిది కాదన్నారు.. కూటమి ప్రభుత్వంలో ప్రజలకు స్వాతంత్రం వచ్చేటట్లుగా స్వేచ్ఛగా ప్రభుత్వ పథకాలు పొందుతున్నారని పేర్కొన్నారు.. ప్రజలు ఎవరైనా సమస్యలు పరిష్కరించుకుంటే మమ్మల్ని అక్కడికక్కడే నిలదీస్తే మేం వారిపై ఎటువంటి అధికార జులుం ప్రదర్శించకుండా.. సమస్యలు పరిష్కారం అయ్యే విధంగా చర్యలు తీసుకుంటున్నామని వెల్లడించారు కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజారపు రామ్మోహన్ నాయుడు.
రూ. 100 కోసం బిచ్చగాడి హత్య..
మద్యం మత్తులో వంద రూపాయల నోటు ఇవ్వలేదని బిచ్చగాడుని బండరాయితో మోది, దారుణంగా హత్య చేశాడు ఓ యువకుడు.. నంద్యాలలోని నూనెపల్లె ఫ్లై ఓవర్ బ్రిడ్జి దిగువ జరిగిన దస్తగిరి అనే బిచ్చగాడి హత్య కేసు మిస్టరీగా మారగా.. ఆ మిస్టరీని ఛేదించారు త్రీ టౌన్ పోలీసులు. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. అవుకు మండలం కొండమాయ పల్లెకు చెందిన దస్తగిరికి ఇద్దరు భార్యలు, నలుగురు కుమారులు వున్నారు. వీరితో గొడవ పడి, నంద్యాలకు వచ్చి, రైల్వే స్టేషన్, నూనెపల్లె, నూనెపల్లె ఫ్లై ఓవర్ బ్రిడ్జి దిగువ భిక్షాటన చేస్తూ జీవనం సాగిస్తున్నాడు దస్తగిరి.. అయితే, సిరివేళ్లకు చెందిన రహ్యుం జులాయిగా పని పాట లేకుండా తాగి తిరిగేవాడు. ఈ క్రమంలో నంద్యాలకు వెళ్లి సాయిబాబా నగర్ సెంటర్ లోని వైన్స్ లో తప్పతాగి, అక్కడే పడిపోయాడు. ఇక, రెండు గంటల తర్వాత లేచి, నూనెపల్లె ఫ్లై ఓవర్ బ్రిడ్జి ప్రాంతానికి వెళ్లాడు.. అర్ధరాత్రి దగ్గర్లోనే నిద్రపోతున్న దస్తగిరిని లేపి, తాగడానికి డబ్బు ఇవ్వమని బెదిరించాడు రహ్యుం. కానీ, దస్తగిరి ఇవ్వకపోవడంతో జేబులో ఉన్న వంద రూపాయల నోటును లాక్కోబోయాడు. దీంతో, ఇద్దరి మధ్యన ఘర్షణ జరిగింది.. ఆవేశంతో ఊగిపోయిన రహ్యుం.. బండరాయితో దస్తగిరి తలపై మోది వెళ్లిపోయాడు.. అయితే, తలపై తీవ్రగాయమై అక్కడిక్కడే మృతి చెందాడు దస్తగిరి. ఈ హత్య మిస్టరీగా మారగా.. రంగంలోని దిగిన త్రీటౌన్ పోలీసులు.. సీసీ ఫుటేజ్ ఆధారంగా రహ్యుంను అరెస్ట్ చేశారు.. కోర్టు ఆదేశాల మేరకు అతన్ని అరెస్ట్ చేసి రిమాండుకు తరలించారు.
ఆయేషా మీరా కేసులో కొనసాగుతోన్న సస్పెన్స్..! మళ్లీ అనుమానాలు..?
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో సంచలనం రేపిన బీపార్మసీ విద్యార్థిని ఆయేషా మీరా హత్య కేసు మిస్టరీ ఇంకా కొనసాగుతోంది. ఆయేషా మీరా హత్య కేసు 17 ఏళ్ల నుంచి అనేక మలుపులు తిరుగుతూ ఇంకా మిస్టరీగానే మిగిలింది. 2007 డిసెంబరు 27న రాత్రి ఇబ్రహీంపట్నంలో దుర్గా లేడీస్ హాస్టల్ లో బీఫార్మసీ చదువుతున్న ఆయేషా మీరా అత్యాచారం, హత్యకు గురైంది. ఆయేషామీరాను అత్యంత దారుణంగా అత్యాచారం చేసి హత్య చేసి బాత్ రూమ్ లో మృతదేహాన్ని వదిలి నిందితుడు పరారయ్యాడు. మృతదేహంపై చిరుత అని కూడా రాసి వెళ్లాడు. జాతీయ రహదారిపై హాస్టల్ ఉండటంతో హత్య చేసి హైవేపైకి వెళ్లి పరారాయ్యాడు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఈ హత్య తీవ్ర కలకలం రేపింది. కేసును విచారించి విజయవాడ పోలీసులు దర్యాప్తులో భాగంగా దాదాపు 150 మంది యువకులను అదుపులోకి తీసుకుని విచారించి వదిలేశారు. సంఘటన జరిగిన తర్వాత ఏడాది కాలానికి.. 2008 ఆగస్టులో నందిగామకు చెందిన సత్యంబాబును అరెస్టు చేశారు. సత్యంబాబు.. ఆయేషా మీరాను అత్యాచారం చేసి హత్య చేశాడని పోలీసులు కోర్టుకు ఛార్జిషీట్ లో నివేదించారు. ఈ కేసుపై విచారణ జరిపిన విజయవాడలోని మహిళా సెషన్స్ కోర్టు.. సత్యంబాబుకు జీవిత ఖైదు విధించింది. ఈ తీర్పుపై సత్యంబాబు 2010లో హైకోర్టులో అప్పీలుకు వెళ్లారు. విచారణ జరిగిన డివిజన్ బెంచ్ 2017 మార్చి 31న సెషన్స్ కోర్టు ఇచ్చిన తీర్పును కొట్టివేసింది. పోలీసు దర్యాప్తు సక్రమంగా జరగలేదని కోర్టు అభిప్రాయపడింది. సత్యంబాబును నిర్దోషిగా ప్రకటిస్తూ తీర్పు ఇచ్చింది. దర్యాప్తు అధికారులపై చర్యలు తీసుకోవాలని తీర్పులో పేర్కొంది.
పెందుర్తిలో కూటమి పార్టీల మధ్య కొత్త కుంపటి..!
ఆంధ్రప్రదేశ్‌లో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత.. కిందిస్థాయిలో కొన్ని చోట్ల విభేదాలు బయటపడుతున్నా.. రాష్ట్రస్థాయిలో అంతా బాగానే ఉంది అనిపిస్తోంది.. కూటమి నేతలు ఒకే వేదికపై కనిపించినప్పుడూ.. వారి మధ్య మంచి వాతావరణం ఉందని స్పష్టం అవుతోంది.. అయితే, కొన్ని చోట్ల కూటమి నేతలకు చికాకులు తప్పడం లేదు.. తాజాగా, అనకాపల్లి జిల్లా పెందుర్తి నియోజకవర్గ కూటమి పార్టీలు మధ్య కొత్త కుంపటి రాజుకుంది. ఇప్పటి వరకు జనసేన ఎమ్మెల్యే పంచకర్ల… టీడీపీ ఇంచార్జ్ గండిబాబ్జీ మధ్య వర్గ విబేధాలు నడుస్తుండగా.. ఇప్పుడు మేయర్ పీలా శ్రీనివాస్ ఆ జాబితాలో చేరారు. మాజీ ఎమ్మెల్యే గండి బాబ్జీ విధానాలను వ్యతిరేకిస్తూ కేడర్ మీటింగ్ లో ఫైర్ అయ్యారు మేయర్ పీలా. ఇంచార్జిగా గండిబాబ్జీ ఏకపక్ష ధోరణి అవలంభిస్తున్నారని అసంతృప్తి వ్యక్తం చేశారు మేయర్.. అయితే, నియోజకవర్గ పరిశీలకుడు సమక్షంలోనే మేయర్ పీలా శ్రీనివాస్ ఆగ్రహం వ్యక్తం చేయడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. నియోజకవర్గంలో పార్టీకి సంబంధించి ఎటువంటి సమాచారం ఇవ్వడం లేదనేది మేయర్ అభ్యంతరం వ్యక్తం చేశారు.. పార్టీలో నేను సీనియర్ నాయకుడినే… పార్టీలో శిక్షణ కలిగిన నేతను.. ఏనాడు పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడలేదు.. అయినా, ఎందుకు కనీస సమాచారం ఇవ్వడం లేదో చెప్పాలని డిమాండ్ చేశారు. అయితే, పరిశీలకుడు, ముఖ్య అనుచరులు వారించే ప్రయత్నం చేస్తే మేయర్ ఆగ్రహంతో తోసేసి మరీ తన అభిప్రాయం కుండబద్ధలు కొట్టేశారు. ఇప్పుడు.. పెందుర్తి టీడీపీలో అంతర్గత కుమ్ములాటల వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.
నిరుద్యోగులకు రేవంత్ సర్కార్ గుడ్ న్యూస్.. 607 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్
నిరుద్యోగులకు ఉద్యోగాల కల్పనే లక్ష్యంగా రేవంత్ సర్కార్ కృషి చేస్తోంది. ఇప్పటికే గ్రూప్ 1,2,3, డీఎస్సీ ల ద్వారా ఉద్యోగాల భర్తీ చేపట్టగా తాజాగా ఆరోగ్య శాఖలో ఉద్యోగాల భర్తీకి రెడీ అయ్యింది. హెల్త్ డిపార్ట్ మెంట్ లో మరోసారి భారీగా జాబ్స్ భర్తీ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ క్రమంలో రేవంత్ సర్కార్ నిరుద్యోగులకు గుడ్ న్యూస్ అందించింది. మెడికల్ అండ్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్‌మెంట్ బోర్డు ఆరోగ్యశాఖలో 607 అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ పోస్టుకు ఎంపికైన వారికి నెల జీతం రూ.68,900-రూ.2,05,500 మధ్య ఉంటుంది. రెండ్రోజుల క్రితమే డెంటల్ అసిస్టెంట్ సర్జన్, స్పీచ్ థెరపిస్ట్ పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేసిన విషయం తెలిసిందే. తాజాగా అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులకు నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. అర్హత, ఆసక్తి ఉన్నవారు జులై 10 నుంచి దరఖాస్తు చేసుకోవచ్చు. ప్రభుత్వ హాస్పిటల్స్‌లో గడిచిన 17 నెలల్లో 8 వేలకుపైగా పోస్టులను భర్తీ చేసింది. మరో 2322 నర్సింగ్ ఆఫీసర్లు, 732 ఫార్టసిస్ట్, 1284 ల్యాబ్ టెక్నీషియన్, 1931 మల్టి పర్పస్ ఫీమెల్ హెల్త్ అసిస్టెంట్ పోస్టులకు భర్తీ ప్రక్రియ కొనసాగుతోంది. ఇప్పటికే ఆయా పోస్టుల ఫలితాలు విడుదల కాగా మెరిట్ జాబితాలు సిద్ధం చేస్తున్నారు అధికారులు.
రేపు తెలంగాణకు అమిత్ షా.. పసుపు బోర్డు కార్యాలయం ప్రారంభోత్సవం
రేపు తెలంగాణ రాష్ట్రానికి కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా రానున్నారు. రేపు ఉదయం 11.25 గంటలకు గుజరాత్ లోని అహ్మదాబాద్ ఎయిర్ పోర్టు నుంచి బయలుదేరి మధ్యాహ్నం 1 గంటకు బేగంపేట విమానశ్రయానికి చేరుకోనున్నారు. మధ్యాహ్నం 1.45 గంటలకు బేగంపేట్ నుంచి ప్రత్యేక హెలికాప్టర్ లో నిజామాబాద్ జిల్లా కలెక్టర్ కార్యాలయలోని హెలిప్యాడ్ వద్దకు చేరుకోనున్నారు. అక్కడి నుంచి వినాయక్ నగర్ లో జాతీయ పసుపు బోర్డు కార్యాలయాన్నీ ప్రారంభించడానికి వెళ్లనున్నారు. ఇక, మధ్యాహ్నం 2 గంటలకు జాతీయ పసుపు బోర్డు కార్యాలయాన్ని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ప్రారంభించనున్నారు. 2 నుంచి 2.30 వరకు జాతీయ పసుపు బోర్డు కార్యాలయంలోనే ఉండనున్నారు. మధ్యాహ్నం 2.35 గంటలకు నిజామాబాద్ లోని కంటేశ్వర్ క్రాస్ రోడ్ లో ఏర్పాటు చేసిన డి శ్రీనివాస్ విగ్రహాన్ని ఆవిష్కరించనున్నారు. 2. 45 నుంచి 4 గంటల వరకు పాలిటెక్నిక్ గ్రౌండ్ లో జరిగే కిసాన్ మహా బహిరంగ సభలో పాల్గొని ప్రసంగించనున్నారు. సాయంత్రం 5 గంటలకు బేగంపేట ఎయిర్ పోర్టుకు చేరుకుని ఢిల్లీకి తిరుగు ప్రయాణం అవుతారు.
లా విద్యార్థినిపై అత్యాచారం.. మెడ, ఛాతి చుట్టూ గాయాలు.. వెలుగులోకి వైద్య నివేదిక..
కోల్‌కతా లా కాలేజ్ క్యాంపస్ లోపల 24 ఏళ్ల లా విద్యార్థినిపై అత్యాచారం పశ్చిమ బెంగాల్‌ని కదిపేస్తోంది. ఆర్జీకల్ మెడికల్ కాలేజీ-హాస్పిటల్‌లో పీజీ వైద్యురాలిపై అత్యాచారం ఘటన మరవక ముందే ఈ ఘటన చోటు చేసుకుంది. దీనిపై ఇప్పటికే, రాజకీయ రచ్చ మొదలైంది. బాధితురాలిపై అత్యాచారం చేసిన ప్రధాన నిందితుడు మనోజిత్ మిశ్రాకు అధికార తృణమూల్ కాంగ్రెస్(టీఎంసీ) స్టూడెంట్ వింగ్ నాయకుడిగా ఉన్నారు. మరో ఇద్దరు కూడా ఈ నేరంలో ప్రత్యక్షంగా పాల్గొన్నందుకు మొత్తం ముగ్గురిని పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుడు గార్డు గదిలో బాధితురాలిపై అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ కేసులో నాలుగో వ్యక్తి సెక్యూరిటీ గార్డును కూడా పోలీసులు అరెస్ట్ చేశారు. ఇదిలా ఉంటే, బాధితురాలికి నిర్వహించిన వైద్య పరీక్షల్లో దాడికి సంబంధించిన పలు గాయాలు ఉన్నట్లు వైద్యులు నిర్ధారించారు. బాధిత మహిళ మెడపై గాయాలతో పాటు ఛాతిపై రాపిడి గుర్తులు ఉన్నట్లు వైద్య నివేదిక తెలియజేసింది. బాహ్య జననేంద్రియాలు, నోటి గాయాలు కనిపించనప్పటికీ, ఫోరెన్సిక్ నిర్ధారణ వచ్చే వరకు లైంగిక దాడిని వైద్యులు తోసిపుచ్చలేదు. జూన్ 26న రాత్రి 10 గంటలకు కోల్‌కతాలోని నేషనల్ మెడికల్ కాలేజీలో పరీక్ష నిర్వహించారు. ఈ ప్రక్రియలో మూడు స్వాబ్‌లను సేకరించి ఫోరెన్సిక్ పరీక్షకు పంపారు. వైద్య పరీక్షల్లో భాగంగా యూరిన్ ప్రెగ్నె్న్సీ టెస్ట్ నిర్వహించారు. ఇది నెగిటివ్‌గా వచ్చింది.
పూరీ జగన్నాథుడి రథయాత్రలో అదానీ కుటుంబం..
హిందువులు ఎంతో ప్రతిష్టాత్మకంగా భావించే పూరీ జగన్నాథుడి రథయాత్రలో ప్రముఖ పారిశ్రామికవేత్త గౌతమ్ అదానీ కుటుంబం పాల్గొంది. శనివారం పూరీ రథయాత్రలో గౌతమ్ అదానీతో పాటు ఆయన భార్య ప్రతీ అదానీ, కుమారుడు కరణ్ అదానీలు పాల్గొన్నారు. జగన్నాథుడు, బలభద్రుడు, సుభద్రల ఊరేగింపుకు సంబంధించిన పూజా ఆచారాలకు వీరు హాజరయ్యారు. ఇదే కాకుండా, ప్రసాదం తయారు చేయడంలో అదానీ కుటుంబం పాలుపంచుకుంది. తొమ్మిది రోజుల పాటు జరిగే ఈ వార్షిక కార్యక్రమానికి వచ్చే యాత్రికులకు, భక్తులకు అదానీ గ్రూప్ సహాయం అందిస్తుంది. పెద్ద ఎత్తున భోజన పంపిణీ, తాగునీరు అందించడం, కార్మికులకు భద్రతా సామాగ్రి, స్థానిక స్వచ్ఛంద సేవల్లో అదానీ ఫౌండేషన్ సహకరిస్తుంది. అదానీ గ్రూప్ ఆహారం, నీటితో పాటు మున్సిపల్ కార్మికులకు ఫ్లోరోసెంట్ దుస్తులు, స్వచ్ఛంద సేవకుల కోసం టీషర్టులు, భద్రతా సిబ్బంది, భక్తుల కోసం జాకెట్లు, టోపీలను, గొడుగులతో సహా రెయిన్ కోట్స్‌ని పంపిణీ చేసింది.
6 నెలల్లో 12 సార్లు అత్యాచారం.. పద్మశ్రీ అవార్డు గ్రహీతపై ఆరోపణలు..
2013లో పాఠశాలలో ఉద్యోగం ఇప్పిస్తానని చెప్పి తనపై అనేక సార్లు అత్యాచారం చేశాడని ఓ మహిళ పద్మశ్రీ అవార్డు గ్రహీత, బీజేపీకి అనుకూలంగా ఉండే కార్తీక్ మహరాజ్‌పై ఆరోపణలు చేసింది. అయితే, ఈ ఆరోపణలను అతను ఖండించారు. భారత్ సేవాశ్రమ సంఘానికి చెందిన సన్యాసి మహారాజ్, ముర్షిదాబాద్‌లోని ఒక ఆశ్రమంలో ఉన్న ఒక పాఠశాలలో టీచర్‌గా ఉద్యోగం ఇప్పిస్తానని హామీ ఇచ్చి తనను తీసుకెళ్లాడని ఆ మహిళ ఆరోపించింది. ఆమెకు అదే ఆశ్రయంలో వసతి ఏర్పాటు చేశారు. అయితే, ఒక రోజు రాత్రి కార్తీక్ మహారాజ్ తన గదిలోకి ప్రవేశించి తనపై బలవంతంగా దాడి చేశాడని మహిళ పేర్కొంది. 2013 జనవరి -జూన్ మధ్య ఆరు నెలల్లో కనీసం 12 సార్లు సన్యాసి అత్యాచారం చేశాడని ఆమె ఆరోపించింది. భయం, నిస్సహాయత కారణంగా ఈ సంఘటన గురించి తాను ఇన్ని సంవత్సరాలు మౌనంగా ఉన్నానని చెప్పింది. పోలీసుల్ని సంప్రదిస్తే తాను ఆత్మహత్య చేసుకుంటానని బెదిరించినట్లు ఫిర్యాదులో పేర్కొంది.
ఆ కోటలో అడుగు పెడుతున్న ప్రభాస్.. ఎందుకంటే..!
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ మోస్ట్ వెయిటెడ్ మూవీ రాజాసాబ్ ఈ సినిమా టీజర్ రీసెంట్ గా వచ్చి సెన్సేషన్ క్రియేట్ చేసింది. ఈ సినిమా కోసం ఫ్యాన్స్ ఆతృతగా వెయిట్ చేస్తున్నారు. మూవీని డిసెంబర్ 5న రిలీజ్ చేస్తున్నారు. తాజాగా మూవీ గురించి క్రేజీ అప్డేట్ వచ్చింది. ఈ సినిమా కొత్త షెడ్యూల్ ను స్టార్ట్ చేయబోతున్నారు. జులై మొదటి వారం నుంచి ఈ షూట్ స్టార్ట్ కాబోతోంది. ప్రత్యేకంగా వేసిన కోటలో ఈ షూట్ ఉండబోతున్నట్టు తెలుస్తోంది. ఇందులో ప్రభాస్ తో పాటు ఇతర నటులపై ఇంపార్టెంట్ సీన్లు షూట్ చేస్తారని తెలుస్తోంది. ఇప్పటి వరకు జరిగిన సీన్లకంటే ఇవి ఇంకా కీలకంగా ఉంటాయని తెలుస్తోంది. హర్రర్ ఎపిసోడ్ లు ఎక్కువగా ఈ షెడ్యూల్ లోనే జరుగుతాయని అంటున్నారు. ప్రస్తుతానికి దానికి సంబంధించిన ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఇప్పుడు ఫౌజీ షూటింగ్ లో బిజీగా ఉన్న ప్రభాస్.. త్వరలోనే రాజాసాబ్ సెట్స్ లో జాయిన్ అవుతాడని తెలుస్తోంది. ఇందులో ప్రభాస్ రెండు పాత్రల్లో నటిస్తున్న సంగతి తెలిసిందే కదా.
