NTV Telugu Site icon

Top Headlines @ 5 PM: టాప్‌ న్యూస్‌

Top Headlines @ 5 Pm New

Top Headlines @ 5 Pm New

వల్లభనేని వంశీకి బిగ్‌ షాక్‌..
వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ నేత, గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీకి మరోసారి బిగ్‌ షాక్‌ తగిలింది.. వల్లభనేని వంశీ దాఖలు చేసిన బెయిలు పిటిషన్‌ డిస్మిస్ చేసింది కోర్టు.. గన్నవరం తెలుగుదేశం పార్టీ కార్యాలయంపై దాడి కేసులో తనకు బెయిల్ ఇవ్వాలంటూ విజయవాడ 12 అదనపు డిస్ట్రిక్ట్ సెషన్స్ కోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు వల్లభనేని వంశీ.. అయితే, ఈ పిటిషన్ పై విచారణ జరిపిన న్యాయస్థానం.. వంశీ పిటిషన్ డిస్మిస్ చేసింది.. ఇక, గన్నవరం టీడీపీ కార్యాలయంలో దాడి కేసులో వల్లభనేని వంశీ మోహన్‌ ఏ71గా ఉన్నారు.. కాగా, వల్లభనేని వంశీ బెయిల్‌ పిటిషన్ పై మంగళవారం రోజు కోర్టులో ఇరుపక్షాల వాదనలు ముగిశాయి. వంశీకి బెయిల్ ఇవ్వొద్దని.. బెయిల్ ఇస్తే సాక్షులను ప్రభావితం చేస్తారని కోర్టులో సీఐడీ తరపు న్యాయవాదులు వాదనలు వినిపించగా.. వంశీ అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారని, మానవతా కోణంలో బెయిల్ మంజూరు చేయాలని ఆయన తరపు న్యాయవాది కోర్టులో విన్నవించారు.. అయితే, తీర్పు రిజర్వ్ చేసిన న్యాయమూర్తి.. ఈ రోజు వల్లభనేని వంశీ మోహన్‌తో పాటు.. ఈ కేసులో నిందితులుగా ఉన్న మరో నలుగురు దాఖలు చేసిన బెయిల్ పిటిషన్లను కూడా తిరస్కరిస్తున్నట్టు ప్రకటించారు..

అనపర్తిలో వైసీపీకి బిగ్‌ షాక్‌.. బీజేపీ ఖాతాలో తొలి ఎంపీపీ..
ఆంధ్రప్రదేశ్‌లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీకి వరుసగా షాక్‌లు తగులుతూనే ఉన్నాయి.. ఇప్పటికే ఎంపీలు మొదలుకొని.. ఎమ్మెల్సీలు, మాజీ మంత్రులు.. మాజీ ఎమ్మెల్యేలు, కీలక నేతలు, కిందిస్థాయి ప్రజాప్రతినిధులు ఇలా ఎంతో మంది.. పార్టీకి గుడ్‌బై చెప్పి.. కూటమి పార్టీల్లో చేరుతున్నారు.. ఇక, తాజాగా, తూర్పుగోదావరి జిల్లా అనపర్తిలో వైసీపీకి బిగ్‌ షాక్‌ తగిలింది.. బిక్కవోలులో పలువురు వైసీపీ ఎంపీటీసీలు పార్టీకి రాజీనామా చేసి.. భారతీయ జనతా పార్టీ (బీజేపీ)లో చేరారు.. ఈ సందర్భంగా వారికి జిల్లా బీజేపీ అధ్యక్షుడు పిక్కి నాగేంద్ర, ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డిలో కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం ఎంపీపీ ఎన్నికల్లో తొస్సిపూడి ఎంపీటీసీ సభ్యురాలు తేతలి సుమ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. కాగా, రిటర్నింగ్ అధికారి ఆమెతో ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి.. టీడీపీ నేత నల్లమిల్లి మనోజ్ రెడ్డి.. నూతన ఎంపీపీ సుమకు శుభాకాంక్షలు తెలిపారు. దీంతో, రాష్ట్రంలో తొలి బీజేపీ ఎంపీపీగా తేతలి సుమ ఎన్నికయ్యారు. గతంలో వైసీపీ ఎంపీపీ రాజీనామా చేయగా ఆ పదవికి నేడు ఎన్నికలు జరిగిన విషయం విదితమే..

సూర్యలంక బీచ్ కి మహర్దశ.. నిధులు విడుదల చేసిన కేంద్రం..
ఆంధ్రప్రదేశ్‌లోని బాపట్లకు దగ్గర ఉన్న సూర్యలంక బీచ్‌కు మహర్దశ పట్టబోతోంది.. సహజమైన తీరం, స్ఫటికం-స్పష్టమైన జలాలు, సూర్యోదయాలకు ప్రసిద్ధి చెందిన ఒక అద్భుతమైన ప్రదేశం సూర్యలంక బీచ్‌.. అయితే, సూర్యలంక బీచ్ కి మహర్దశ వచ్చేసింది.. కేంద్ర ప్రభుత్వం నిధులు విడుదల చేసింది.. కేంద్ర ప్రభుత్వ స్వదేశీ దర్శన్ స్కీమ్ 2.0 క్రింద ఏపీలోని సూర్యలంక బీచ్ అభివృద్ధికి రూ.97.52 కోట్ల నిధులు విడుదలయ్యాయని వెల్లడించారు మంత్రి కందుల దుర్గేష్.. త్వరలోనే అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో సూర్యలంక బీచ్ రూపురేఖలు మారుస్తామని తెలిపారు.. ఇటీవల న్యూఢిల్లీ పర్యటనలో కేంద్ర పర్యాటక మంత్రి గజేంద్రసింగ్ షెకావత్ ను కలిసి సూర్యలంక బీచ్ కు నిధులు ఇవ్వమని కోరారు మంత్రి కందుల దుర్గేష్.. ఇప్పటికే సూర్యలంక బీచ్ అభివృద్ధి కోసం, పర్యాటకుల స్వర్గధామంగా తీర్చిదిద్దడానికి అవసరమైన ప్రణాళికలతో కూడిన ప్రతిపాదనలు కేంద్రానికి పంపించింది ఏపీ పర్యాటక శాఖ.. ఇక, సూర్యలంక బీచ్ లో మౌలిక వసతులు కల్పించి పరిశుభ్ర బీచ్ గా తీర్చిదిద్దుతామని వెల్లడించారు మంత్రి కందుల దుర్గేష్..

అసెంబ్లీలో మల్లారెడ్డి మసాలా.. స్పీకర్‌ను షాక్ ఇచ్చిన కామెడీ పంచ్..!
తెలంగాణ అసెంబ్లీ సమావేశాల్లో మాజీమంత్రి, మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డి తనదైన హాస్యశైలితో నవ్వులు పూయించారు. పంచ్ డైలాగులతో సామాజిక మాధ్యమాల్లో తరచూ ట్రెండింగ్‌లో ఉండే మల్లారెడ్డి, తాజాగా అసెంబ్లీలో చేసిన వ్యాఖ్యలు మళ్లీ ఆసక్తి రేకెత్తించాయి. ఈరోజు శాసనసభలో మాట్లాడుతూ, “నేను రెండు ముఖ్యమైన విషయాలు చెప్పాలనుకుంటున్నాను. ఒకటి ప్రభుత్వానికి రూ. 1100 కోట్లు లాభం వచ్చే అంశం, రెండోవది మా మేడ్చల్ నియోజకవర్గంలోని సర్పంచ్‌లు, కౌన్సిలర్లు ఎదుర్కొంటున్న సమస్యల గురించి” అని మల్లారెడ్డి అన్నారు. ఇది విన్న అసెంబ్లీ సభ్యులు ఒక్కసారిగా నవ్వారు. స్పీకర్ హస్తక్షేపం చేసి, “రెండు వద్దు, ఒక్కదానికే అనుమతి” అని సూచించారు. దీంతో మల్లారెడ్డి తన నియోజకవర్గ పరిస్థితిని వివరించడం ప్రారంభించారు. “మా మేడ్చల్ నియోజకవర్గానికి దిష్టి తగిలింది. 61 గ్రామాలు మున్సిపాలిటీల్లో విలీనం అయ్యాయి. పదేళ్ల రిజర్వేషన్ల విధానం తెచ్చిన బీఆర్ఎస్ ప్రభుత్వం ఇప్పుడు ఐదేళ్లలోనే అన్ని రద్దు చేసింది. దయచేసి ఇదే రిజర్వేషన్ కొనసాగించాలి. మమ్మల్ని జీహెచ్ఎంసీలో విలీనం చేయొద్దు” అంటూ ప్రభుత్వాన్ని కోరారు. అనంతరం మల్లారెడ్డి “ఇప్పుడు ప్రభుత్వానికి లాభం చేకూరే విషయం చెబుతాను” అని ప్రారంభించగానే స్పీకర్ మళ్లీ అడ్డుకున్నారు. దీంతో సభలో మరికొంత హాస్యరసం నెలకొంది. మల్లారెడ్డికి ప్రసంగం పూర్తి చేసే అవకాశం లేకపోయినప్పటికీ, ఆయన మాటలు అసెంబ్లీని కాసేపు ఉల్లాసంగా మార్చాయి.

ఆయనకు ఫ్రస్టేషన్‌ తగ్గట్లేదు.. నేను శాశ్వతంగా రాజకీయాలు వదిలేస్తా.. కేటీఆర్‌ సంచలనం
చివరి రోజు తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ఆసక్తికరంగా సాగుతున్నాయి. అసెంబ్లీ సీఎం రేవంత్‌ రెడ్డి వర్సెస్‌ కేటీఆర్‌ అన్నట్లు మాటల యుద్ధం నడుస్తోంది. గత ప్రభుత్వం తనపై కక్ష కట్టి ఎన్నో రకాలుగా ఇబ్బందులకు గురిచేసిందని సీఎం రేవంత్‌ రెడ్డి ఉగ్రరూపం చూపించారు. అనంతరం కేటీఆర్‌ అసెంబ్లీలో మాట్లాడుతూ.. సీఎం రేవంత్‌ రెడ్డికి ఫ్రస్టేషన్‌ ఎందుకో అర్థంకావడంలేదు అని ఆయన అన్నారు. ఆయన సీఎం సీటులో కూర్చుంటా అన్నాడు.. కూర్చున్నా కూడా కూల్‌ కావడం లేదంటూ సెటైర్‌ వేశారు కేటీఆర్‌. ఎన్నికల ముందు రైతులకు రైతుబంధు ఇవ్వదంటూ.. ఎన్నికల కమిషన్‌ లేఖ రాసింది అప్పటి పీసీసీగా రేవంత్‌ రెడ్డినే అని ఆయనఅన్నారు. ఇప్పుడు మేము రైతుబంధు అపాం అని నిందలువేస్తున్నామన్నారు.. కావాలంటే.. ఆయన ఎన్నికల కమిషన్‌కు ఇచ్చిన లేఖ కాపీ నాదగ్గర ఉంది ప్రూఫ్‌ చూడండని ఆయన అన్నారు. ప్రతి సారి రుణమాఫీ అంటారు.. ఏ ఒక్కగ్రామంలోనైనా వందశాతం రుణమాఫీ అయితే నేను శాశ్వతంగా రాజకీయాలకు దూరంగా ఉంటా అని సీఎం రేవంత్‌ రెడ్డికి కేటీఆర్‌ సవాల్‌ విసిరారు. కొండారెడ్డిపల్లి పోదామా.? లేకుండా.. సిరిసిల్ల పోదామా..? అంటూ కేటీఆర్‌ వ్యాఖ్యానించారు.

“ఆత్మహత్య చేసుకుంటానని బెదిరించడం విడాకులకు కారణమే”..
జీవిత భాగస్వామిని బెదిరించడం లేదా ఆత్మహత్యకు ప్రయత్నించడం విడాకులకు కారణమే అని బాంబే హైకోర్టు ఔరంగాబాద్ బెంచ్ కీలక తీర్పు చెప్పింది. తన భార్య ఆత్మహత్య చేసుకుంటానని తన కుటుంబాన్ని బెదిరిస్తోందని ఓ వ్యక్తి ఆరోపించాడు. జీవిత భాగస్వామిని బెదిరించడం అనేది క్రూరత్వం కిందకు వస్తుందని, విడాకులకు ఇవ్వడానికి కారణం అని హైకోర్టు చెప్పింది. హైకోర్టు ఔరంగాబాద్ బెంచ్‌కు చెందిన జస్టిస్ ఆర్.ఎం. జోషి గత నెలలో ఒక జంట వివాహాన్ని రద్దు చేస్తూ ఫ్యామిలీ కోర్టు జారీ చేసిన తీర్పుని సమర్థించారు. ఫ్యామిలీ కోర్టు ఆదేశాలను సవాల్ చేస్తూ సదరు మహిళ హైకోర్టుని ఆశ్రయించడంతో ఈ తీర్పు వెలువడింది. ఆత్మహత్య చేసుకుంటానని తన భార్య బెదిరిస్తోందని, తనను తన కుటుంబాన్ని జైలుకు పంపిస్తానని చెబుతోందని సదరు మహిళ భర్త ఆరోపించారు. హిందూ వివాహ చట్టం ప్రకారం.. ఇది క్రూరత్వానికి సమానమే అని ఫ్యామిలీ కోర్టులో విడాకులు కోరుతూ పిటిషన్ దాఖలు చేశారు.

బెడ్రూంలోకి ఆవు, ఎద్దు.. కప్‌బోర్డులో చిక్కుకున్న మహిళ.. వైరల్ వీడియో..
హర్యానా ఫరీదాబాద్‌లో ఓ ఫన్నీ సంఘటన జరిగింది. ఇంట్లోని బెడ్రూంలోకి ఆవు, ఎద్దు దూరాయి. దీంతో భయపడిన మహిళ, ఇంట్లోని కప్‌బోర్డులో దాక్కుంది. ఎన్ని రకాలుగా ప్రయత్నించిన పశువులు బయటకు వెళ్లలేదు. ప్రస్తుతం ఈ వీడియో ఇంటర్నెట్‌లో వైరల్‌గా మారింది. దాదాపుగా రెండు గంటల పాటు సాయం కోసం సదరు మహిళ కప్‌బోర్డులోనే ఉంది. బుధవారం జరిగిన ఈ సంఘటనలో, డబువా కాలనీలోని సీ-బ్లాక్‌లోని ఒక ఇంట్లోని బెడ్రూంలోకి ఆవు, ఎద్దు దూసుకువచ్చాయి. రాకేష్ సాహు తన కుటుంబంతో కలిసి ఈ ఇంట్లో నివసిస్తున్నాడు. బుధవారం ఉదయం 10 గంటల ప్రాంతంలో అతడి భార్య సప్న ఇంట్లో పూజ చేస్తున్న సమయంలో ఈ ఘటన జరిగింది. అయితే, ఆ సమయంలో ఆమె పిల్లలు, ఆమె అత్త ఇంట్లో లేరు. ఆమె అత్త మార్కెట్‌కి వెళ్లారు.

ఆ కారణంతో.. భారత్‌లో 2,000 వీసా అపాయింట్ మెంట్స్‌ను రద్దు చేసిన అమెరికా
అమెరికా వెళ్లాలనుకునే వారికి షాక్. భారత్‌లో 2,000 వీసా అపాయింట్ మెంట్స్‌ను అమెరికా రద్దు చేసింది. మోసపూరిత కార్యకలాపాల కారణంగా 2 వేలకుపైగా వీసా దరఖాస్తులను రద్దు చేసినట్లు భారత్ లోని అమెరికా రాయబార కార్యాలయం బుధవారం తెలిపింది. గత సంవత్సరం యూఎస్ రాయబార కార్యాలయం అంతర్గత దర్యాప్తు నిర్వహించి దరఖాస్తుదారులకు వీసాలు పొందడానికి నకిలీ పత్రాలను సమర్పించడం ద్వారా US ప్రభుత్వాన్ని “మోసం” చేసిన 30 మంది ఏజెంట్ల జాబితాను రూపొందించింది. అపాయింట్‌మెంట్ షెడ్యూలింగ్ వ్యవస్థలో లోపాన్ని గుర్తించనట్లు తెలిపింది. ఆ తర్వాత అనుబంధ ఖాతాల షెడ్యూలింగ్ అధికారాలను నిలిపివేసింది. ఏజెంట్లు, ఫిక్సర్ల పట్ల జీరో-టాలరెన్స్ విధానాన్ని పాటిస్తున్నట్లు కూడా రాయబార కార్యాలయం తెలిపింది. “కాన్సులర్ టీం ఇండియా బాట్‌లు చేసిన సుమారు 2000 వీసా అపాయింట్‌మెంట్‌లను రద్దు చేస్తోంది . మా షెడ్యూలింగ్ విధానాలను ఉల్లంఘించే ఏజెంట్లు ఫిక్సర్‌లను మేము సహించము” అని భారత్ లోని US రాయబార కార్యాలయం ట్విట్టర్‌ ద్వారా వెల్లడించింది. మోసాల నిర్మూళనకు ప్రయత్నాలను మేము కొనసాగిస్తాము. మోసాన్ని మేము ఎంతమాత్రం సహించము అని స్పష్టం చేసింది. అమెరికా రాయబార కార్యాలయం వీసా మోసాన్ని గుర్తించిన తర్వాత, ఢిల్లీ పోలీసులు ఫిబ్రవరి 27న వీసా, పాస్‌పోర్ట్ ఏజెంట్లపై కేసు నమోదు చేశారు. ఈ ఏజెంట్లు దరఖాస్తుదారులకు వీసాలు పొందడానికి నకిలీ పత్రాలను సమర్పించడం ద్వారా అమెరికా ప్రభుత్వాన్ని “మోసం” చేశారు.

ఈనెల 26న బీసీసీఐ సెంట్రల్ కాంట్రాక్ట్ సమావేశం.. ఈ ప్లేయర్లకు కాంట్రాక్టు..!
భారత క్రికెట్ నియంత్రణ బోర్డు (BCCI) రాబోయే సీజన్ కోసం సెంట్రల్ కాంట్రాక్టుల జాబితాను ఖరారు చేయడానికి.. భవిష్యత్ టెస్ట్ కెప్టెన్‌ను ఎంపిక చేసేందుకు కీలకమైన సమావేశం నిర్వహించనుంది. ఈ సమావేశంలో టీమిండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్, చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ పాల్గొననున్నారు. ఈ సమావేశం మార్చి 29న (శనివారం) గౌహతిలో జరుగనుంది. బీసీసీఐ కార్యదర్శి దేవజిత్ సైకియా, ఇతర సంబంధిత వర్గాలు భారత క్రికెట్ భవిష్యత్తు కోసం కొన్ని కీలక నిర్ణయాలపై చర్చించనున్నారు. టీమిండియా స్టార్ ఆటగాళ్లైన విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, రవీంద్ర జడేజా తమ A+ కాంట్రాక్టులను కొనసాగిస్తారని వర్గాలు తెలిపాయి. వీరితో పాటు.. గత సంవత్సరం దేశీయ క్రికెట్‌కు దూరమైన కారణంగా కాంట్రాక్టు కోల్పోయిన శ్రేయాస్ అయ్యర్‌తో సహా మరికొన్ని కొత్త పేర్లు జాబితాలో చేర్చనున్నారు. నితీశ్ రెడ్డి, హర్షిత్ రాణా, అభిషేక్ శర్మలు మొదటిసారిగా కేంద్ర కాంట్రాక్ట్ జాబితాలో చేరే అవకాశం ఉంది. గతసారి.. కేంద్ర కాంట్రాక్ట్ నుంచి ఇషాన్ కిషన్, శ్రేయాస్ అయ్యర్‌ను తొలగించారు. మరోవైపు.. శుభ్‌మన్ గిల్ ‘ఏ గ్రేడ్’ నుంచి ‘ఏ గ్రేడ్+’కు పదోన్నతి పొందే అవకాశం ఉంది. అలాగే.. అక్షర్ పటేల్ ‘గ్రేడ్ బి’ నుంచి ‘గ్రేడ్ ఏ’కు పదోన్నతి పొందే అవకాశం ఉంది. అంతర్జాతీయ క్రికెట్ నుంచి రిటైర్ అయిన రవిచంద్రన్ అశ్విన్‌ను కాంట్రాక్ట్ జాబితా నుంచి తొలగించే అవకాశం ఉంది.

అట్లీతో సినిమా ఇప్పట్లో కష్టమే.. స్టార్ హీరో క్లారిటీ
తమిళ స్టార్ డైరెక్టర్ అట్లీకి ఇప్పుడు ఇండియా వ్యాప్తంగా మార్కెట్ ఉంది. ఆయన తీసే సినిమాలు భారీ హిట్ అవుతున్నాయి. అందుకే ఆయనతో చాలా మంది స్టార్ హీరోలు సినిమాలు తీసేందుకు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ప్రస్తుతం అల్లు అర్జున్ తో సినిమా ఉంటుందనే వార్తలు ఎక్కువగా వినిపిస్తున్నాయి. దానికంటే ముందు ఓ డౌట్ ఉండేది. అట్లీతో బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ సినిమా ఉంటుందనే ప్రచారం మొన్నటి వరకు సాగింది. దానిపై తాజాగా సల్మాన్ ఖాన్ క్లారిటీ ఇచ్చారు. అట్లీతో ఇప్పట్లో సినిమా చేయట్లేదని తేల్చి చెప్పేశాడు. అట్లీతో చేసేది భారీ బడ్జెట్ సినిమా అని.. అందుకే దాన్ని ఇప్పుడు వాయిదా వేస్తున్నట్టు సల్మాన్ స్పష్టం చేశాడు. కానీ భవిష్యత్ లో కచ్చితంగా అట్లీతో సినిమా ఉంటుందని చెప్పుకొచ్చాడు. సల్మాన్ ఖాన్ తో సినిమా లేదు అంటే కచ్చితంగా అల్లు అర్జున్ తో సినిమా ఉంటుందేమో అని టాలీవుడ్ లో చర్చ జరుగుతోంది. వాస్తవానికి పుష్ప తర్వాత త్రివిక్రమ్ తో సినిమా చేయాల్సి ఉంది. ఆ మూవీ భారీ బడ్జెట్ తో మైథలాజికల్ స్టోరీతో వస్తుండటంతో ఇంకా టైమ్ పట్టేలా ఉంది. ఈ గ్యాప్ లో అట్లీతో మూవీ చేయాలని అల్లు అర్జున్ భావిస్తున్నాడు. ఇప్పటికే ఇద్దరి మధ్య కథ ఓకే అయిందని.. త్వరలోనే అనౌన్స్ మెంట్ ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఉగాది పర్వదినాన దీనిపై క్లారిటీ వచ్చే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఒకవేళ వీరిద్దరి కాంబోలో మూవీ వస్తే మాత్రం పాన్ ఇండియా స్థాయిలో క్రేజ్ రావడం పక్కా. ఇద్దరూ వరుస హిట్లతో జోరుమీదున్నారు. మరి ఈ కాంబో ఎలా ఉంటుందో చూడాలి.

ఏంటీ ‘ఫంకీ’ నాగ్ అశ్విన్ బయోపిక్కా?
విశ్వక్ సేన్ హీరోగా అనుదీప్ కేవీ ఫంకీ అనే సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా గురించి సినిమా నిర్మిస్తున్న నాగవంశీ ఒక ఇంటర్వ్యూలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. అదేమంటే ఈ సినిమా నాగ అశ్విన్ బయోపిక్ లాగా ఉంటుందని అన్నారు. ఈ సినిమా ఒక దర్శకుడు తన నిర్మాత కుమార్తెతో ప్రేమలో పడడం గురించి ఉంటుందని చెప్పుకొచ్చారు. నిజానికి నాగ్ అశ్విన్ కూడా తన మొదటి సినిమా ఎవడే సుబ్రహ్మణ్యం నిర్మాత వైజయంతి మూవీస్ అధినేత అశ్వినిదత్ కుమార్తె ప్రియాంకతో పరిచయం అయిన తరువాత ఆమెను ప్రేమించి వివాహం చేసుకున్నాడు ఇప్పుడు దాదాపు అలాంటి కథతోనే సినిమా నిర్మించబోతున్నట్లుగా తెలుస్తోంది. నిజానికి అనుదీప్ గతంలోనే పిట్టగోడ అనే సినిమా చేశాడు. అయితే ఆ సినిమా ప్రేక్షకులను అంతగా ఆకట్టుకోలేదు. ఈ క్రమంలోనే నాగ్ అశ్విన్ అనుదీప్ చెప్పిన కథ నచ్చడంతో జాతి రత్నాలు అనే సినిమా నిర్మించి సూపర్ హిట్ అందించాడు. మరి ఆ కృతజ్ఞతతో బయోపిక్ చేస్తున్నాడో లేక సరదాగా అలాంటి కథ కావడంతో ఒక పోలిక కోసం నాగవంశీ ఇలా చెప్పాడో తెలియదు కానీ ఈ కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి. ఇక నాగ వంశీ సోదరి హారిక నిర్మించిన మ్యాడ్ స్క్వేర్ సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఆమె నిర్మాతగా వ్యవహరించినా కూడా నాగవంశీ మార్క్ ఉండడంతో ప్రమోషన్స్ లో ఆయనే ఎక్కువగా కనిపిస్తున్నారు.