వల్లభనేని వంశీకి షాకిచ్చిన కోర్టు..!
వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత, గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ మోహన్‌కు మరోసారి కోర్టులో షాక్ తగిలినట్టు అయ్యింది.. తాజాగా, నూజివీడు కోర్టులో వల్లభనేని వంశీకి చుక్కెదురైంది. వంశీ మోహన్ దాఖలు చేసిన బెయిల్ పిటిషన్‌ను కొట్టివేసింది నూజివీడు కోర్టు… నకిలీ ఇళ్ల పట్టాల పంపిణీ కేసులో బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు వల్లభనేని వంశీ.. అయితే, దీనిపై వాదనలు విన్న న్యాయమూర్తి.. బెయిల్ పిటిషన్‌ను డిస్మిస్ చేశారు. వంశీ ప్రస్తుతం ఇదే కేసులో అరెస్టై విజయవాడ జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్న విషయం విదితమే..
కాకాణికి రిమాండ్.. జైలుకు తరలింపు..
మాజీ మంత్రి, వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత కాకాణి గోవర్ధన్ రెడ్డికి రిమాండ్ విధించింది కోర్టు.. కాకాణిని వెంకటగిరి మేజిస్టేట్ ముందు హాజరుపరిచారు పోలీసులు.. ఈ నేపథ్యంలో వెంకటగిరిలో అప్రమత్తమైన పోలీసులు.. వెంకటగిరి కోర్టు పరిసరాల్లో 144 సెక్షన్ అమలు చేశారు.. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ముందస్తు చర్యలు తీసుకున్నారు గూడూరు డీఎస్పీ ఆధ్వర్యంలో పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు.. క్వార్ట్జ్ అక్రమ తవ్వకాలు, అక్రమ రవాణా, నిబంధనలకు విరుద్ధంగా పేలుడు పదార్థాల వినియోగం, అభ్యంతరం వ్యక్తం చేసిన గిరిజనులపై బెదిరింపులకు దిగడం లాంటి తదితర అభియోగాలపై నెల్లూరు జిల్లా పొదలకూరు పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు కాగా.. దాదాపు 55 రోజులుగా పరారీలో ఉన్న కాకాణిని ఎట్టకేలకు పోలీసులు అరెస్ట్ చేశారు.. అయితే, మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డికి వచ్చేనెల తొమ్మిది వరకు రిమాండ్ విధించారు న్యాయమూర్తి.. దీంతో, వెంకటగిరి నుంచి నెల్లూరు సెంట్రల్ జైలుకి కాకాణిని తరలించారు పోలీసులు.
వన్ నేషన్ వన్ ఎలక్షన్‌పై పవన్ కల్యాణ్ కీలక వ్యాఖ్యలు.. డీఎంకేపై పంచ్‌లు..
చెన్నైలో జరిగిన వన్ నేషన్ వన్ ఎలక్షన్ సమావేశంలో పాల్గొన్న జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్.. కీలక వ్యాఖ్యలు చేశారు.. తమిళనాడులో చాలాకాలం పాటు పెరిగాను.. తమిళనాడును వదిలి ముప్పై ఏళ్లు అయ్యింది.. నేను తమిళనాడు వదిలి పెట్టి వెళ్లాను.. కానీ, నన్ను తమిళనాడు వదలలేదు.. తమిళనాడు నాపై చాలా ప్రభావం చూపించింది… ఇక్కడే రాజకీయ, సినిమా, ఆధ్యాత్మిక భావన, మార్షల్ ఆర్ట్స్ నేర్చుకున్నాను.. అందుకే తమిళనాడు అంటే నాకు ప్రత్యేకమైన గౌరవం, ఇష్టం.. తమిళనాడు నాకు నేర్పిన పాఠం.. నా జీవితంపై చాలా ప్రభావం చూపిందన్నారు.. అయితే, వన్ నేషన్ వన్ ఎలక్షన్ పై చాలా అబద్ధపు ప్రచారాలు జరుగుతున్నాయి.. ఎన్నికల ఫలితాలు అప్పుడు ఈవీఏం గురించి మాట్లాడినట్లుగా వన్ నేషన్ వన్ ఎలక్షన్ పై నేతలు మాట్లాడుతున్నారని దుయ్యబట్టారు..ఇక, డీఎంకేపై పంచ్‌లు వేశారు పవన్ కల్యాణ్.. ఎన్నికలలో వారు గెలిస్తే ఈవీఏంలు సూపర్ అంటారు.. ఓడిపోతే ఈవీఏంలు ట్యాంపరింగ్ అంటారా…? అని నిలదీశారు.
వన్ నేషన్ వన్ ఎలక్షన్ కొత్త కాదు.. 1952-67 వరకు ఒకేసారి ఎన్నికలు..!
వన్ నేషన్ వన్ ఎలక్షన్ అనేది.. దేశానికి, తమిళనాడుకు కొత్తదేమీ కాదు అన్నారు ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన ధినేత పవన్ కల్యాణ్.. చెన్నైలో జరిగిన వన్ నేషన్ – వన్ ఎలక్షన్ సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. 1952-67 వరకు దేశంలో ఒకేసారి అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికలు జరిగాయి… వన్ నేషన్, వన్ ఎలక్షన్ అనేది కోరుకున్నది మాజీ సీఎం దివంగత కరుణానిధి .. ఇప్పుడు వారి కూమారుడు స్డాలిన్ వద్దు అంటున్నారు అని మండిపడ్డారు. వన్ నేషన్ వన్ ఎలక్షన్ల వల్ల ప్రాంతీయ పార్టీలకు నష్టం జరుగదు అన్నారు పవన్ కల్యాణ్.. అందుకు ఉదాహరణే గత రెండు ఎన్నికలలో ఏపీ, తెలంగాణ ప్రాంతీయ పార్టీ గెలుస్తున్నాయి. తెలంగాణలో టీఆర్ఎస్ వరుసగా రెండు సార్లు గెలిచింది.. ఏపీలో 2014 టీడీపీ, 2019లో మరో పార్టీ గెలిచింది.. గత ఎన్నికలలో కూటమీ ప్రభుత్వం ఎంపీ, అసెంబ్లీలో ఎన్నికలలో గెలిచింది.. ఆ గెలుపు ప్రాంతీయ పార్టీలే కీలకంగా ఉన్నాయి అని గుర్తుచేశారు.. ఒడిస్సా, తెలంగాణలో పరిస్థితులు భిన్నంగా ఉంటాయి… అక్కడ బీజేపీ లబ్ధి పొందలేదు.. ఆశించినంత గెలవలేదు కదా..? అని ప్రశ్నించారు. కానీ, ప్రాంతీయ పార్టీలకు నష్టం జరుగుతుందని డీఎంకే చెప్పడం విడ్డురంగా ఉందన్నారు.. ఇక, వన్ నేషన్ ,వన్ ఎలక్షన్ పై కరుణానిధి పుస్తకంలో రాశారు… డీఎంకే అధినేత స్టాలిన్ ఒకసారి వన్ నేషన్ వన్ ఎలక్షన్ పై పునరాలోచించుకోవాలని సూచించారు.. నేను దక్షిణాదినేతనే… నేను ప్రాంతీయ పార్టీ అధ్యక్షుడు నే… అంతిమంగా ప్రజలకు ఏది మంచి జరుగుతుందో ఆ దిశగానే ఆలోచించాలి.. వ్యక్తిగత లబ్ధి కోసం ఆలోచించకూడదు.. ఈ వన్ నేషన్, వన్ ఎలక్షన్ అనేది కరుణానిధి కళ… ఆయన డ్రీమ్ అది… దేశంలో ఎప్పుడూ ఎక్కడో ఒకచోటా ఎన్నికల జరగడం వల్ల ఇబ్బందులు పడాల్సివస్తోంది… దానివల్ల డబ్బులు, టైం, అభివృద్ధి పై ఎఫెక్ట్ పడుతుంది.. వాటి అన్నిటికి చెక్ పెట్టడానికే వన్ నేషన్, వన్ ఎలక్షన్.. ఎప్పుడు ఎలక్షన్లో ఉండడంవల్ల అధికారులు నేతలు దానిపైనే దృష్టి పెడుతున్నారు… దానివల్ల అభివృద్ధి పనులు ఆగిపోతున్నాయని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఆవేదన వ్యక్తం చేశారు..
తెలంగాణ ప్రయోజనాలు కాపాడలేని ఆ పార్టీ ఎంపీలు రాజీనామా చేయాలి..
సూర్యాపేట జిల్లాలోని ఆత్మకూరు(S) మండలం ఏపూరు గ్రామంలో ఐకేపీ కేంద్రంలో తడిసి మొలకెత్తిన ధాన్యం రాశులను పరిశీలించి, రైతులతో మాజీ మంత్రి జగదీశ్ రెడ్డి మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తొమ్మిది ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో కృష్ణా జలాలను సమర్థవంతంగా వాడుకున్నాం అన్నారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ సహకారంతో ఏపీ సీఎం చంద్రబాబు కృష్ణా జలాలను తరలించుకుని పోతున్నారని పేర్కొన్నారు. కృష్ణా జలాలను వాడుకోవడంలో ప్రభుత్వం విఫలమైందని కేఆర్ఎంబీ చెప్తుంది.. ఈడీ చార్జ్ షీట్ లో తన పేరు రాగానే సీఎం రేవంత్ రెడ్డి ప్రధాని వద్దకు వెళ్లారు అని బీఆర్ఎస్ నేత జగదీష్ రెడ్డి ఆరోపించారు. ఇక, నీటి హక్కుల సాధన కోసం తెలంగాణ వాదులు, రైతులు మరో ఉద్యమానికి సిద్ధం కావాలి అని మాజీ మంత్రి జగదీష్ రెడ్డి పిలుపునిచ్చారు. ప్రధాని నరేంద్ర మోడీ వద్ద పైరవీలు చేసుకునేందుకు.. చంద్రబాబు చుట్టూ తెలంగాణ నేతలు తిరుగుతున్నారు.. ఆంధ్ర రాష్ట్రం సాగు, నీటి ప్రాజెక్టులకు ప్రధాని పెద్దపీట వేస్తుంటే.. తెలంగాణ బీజేపీ ఎంపీలు ఎందుకు నోరు మెదపడం లేదు అని ప్రశ్నించారు. తెలంగాణ ప్రయోజనాలు కాపాడలేని భారతీయ జనతా పార్టీ పార్లమెంట్ సభ్యులు రాజీనామా చేయాలని జగదీష్ రెడ్డి డిమాండ్ చేశారు.
కాంగ్రెస్ వస్తే కరెంట్ ఉండదని కేసీఆర్ అన్నారు..
కేసీఆర్ సీఎంగా ఉన్నప్పుడు కాంగ్రెస్ వస్తే కరెంటు ఉండదని అన్నారని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క గుర్తు చేశారు. విద్యుత్ ఉత్పత్తి చేసే ప్లాంట్లు పెట్టకుండా ఎలా ఇస్తున్నారు.. ఉన్నవన్నీ కాంగ్రెస్ పార్టీ హయంలోనివే అని చెప్పాను.. భద్రాద్రి, యాదాద్రి నుంచి కరెంటు ఉత్పత్తి కాలేదని చెప్తే కేసీఆర్ నుంచి సమాధానం లేదు.. మిగులు విద్యుత్ ఉత్పత్తి ఉండేలా ప్రణాళికలు తయారు చేసుకొని ముందుకు సాగుతున్నాం.. 17,162 మెగావాట్ల విద్యుత్ డిమాండ్ వచ్చినా కోతలు లేకుండా ఇస్తున్నామంటే అది కాంగ్రెస్ పాలన.. 2050 నాటికి గాలి, సోలార్, నీటి ద్వారా విద్యుత్ ఉత్పత్తిని 20 వేల మెగావాట్ల లక్ష్యంగా ముందుకు వెళ్తున్నాం.. 29 లక్షల పంపు సెట్లకు ఇచ్చే కరెంట్ కు రూ.12,500 కోట్లు రైతుల పక్షాన కడుతున్నాం.. మహిళల అభివృద్దే, రాష్ట్ర అభివృద్ధి అని ముందుకు సాగుతున్నాం.. మహిళలకు లక్ష కోట్ల రూపాయల వడ్డీ లేని రుణాలు ఇవ్వాలని లక్ష్యంగా పెట్టుకున్నామని ఉప ముఖ్యమంత్రి భట్టి అన్నారు.
మళ్లీ కరోనా విజృంభణ.. వెయ్యి కేసులు నమోదు
భారతదేశంలో మరోసారి కరోనా విజృంభిస్తోంది. మళ్లీ చాపకింద నీరులా పాకుతోంది. కోవిడ్ పూర్తిగా అంతరించిపోయిందన్న భావనలో ఉన్న ప్రజలకు మళ్లీ షాకిస్తోంది. కొత్త వేరియంట్రూపంలో ప్రజలకు దడ పుట్టిస్తోంది. కొద్ది రోజులుగా స్తబ్ధతగా ఉన్న కేసులు.. మళ్లీ అమాంతంగా పెరిగిపోతున్నాయి. మొదటి వేవ్, సెకండ్ వేవ్ కారణంగా ఎంత మంది ప్రాణాలు కోల్పోయారు. ఎన్నో కుటుంబాల్లో కోవిడ్ విషాదాన్ని నింపి వెళ్లింది. ఇప్పుడిప్పుడే మనుషులు తిరిగి నార్మల్ స్థితికి వస్తున్న తరుణంలో మరోసారి కరోనా వార్త ప్రజలను భయాందోళనకు గురిచేస్తోంది. దేశ వ్యాప్తంగా కేసులు పెరిగాయని ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ తెలిపింది. సోమవారం నాటికి దేశ వ్యాప్తంగా 1,009 యాక్టివ్ కోవిడ్-19 కేసులు నమోదయ్యాయని ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ తెలిపింది. ఇటీవల 752 కేసులండగా.. సడన్‌గా ఆ సంఖ్య వెయ్యికి పైగా దాటి పోయింది. దీంతో మరోసారి ప్రజల్లో భయాందోళన మొదలైంది. లాక్‌డౌన్‌లాంటి పరిస్థితులు తలెత్తుతాయేమోనని ఆలోచన మొదలైంది. ప్రభుత్వ గణాంకాల ప్రకారం ప్రస్తుతం అత్యధికంగా కేరళలో 430 యాక్టివ్ కేసులు నమోదైనట్లు ఆరోగ్య శాఖ పేర్కొంది. కేరళ అగ్ర స్థానంలో ఉన్నట్లుగా చెప్పింది. ఇక పశ్చిమ బెంగాల్‌లో 11 యాక్టివ్ కేసులు ఉన్నట్లు పేర్కొంది.
ముంబైపై జలఖడ్గం.. 107 ఏళ్ల నాటి రికార్డ్ బద్ధలు
ఆర్థిక రాజధాని ముంబైను కుండపోత వర్షం ముంచెత్తింది. ఏకధాటిగా కురిసిన వర్షానికి నగరం అతలాకుతలం అయింది. రహదారులన్నీ జలమయం అయ్యాయి. ఇక ముంబైలో కొత్తగా ప్రారంభించిన వర్లి భూగర్భ మెట్రో స్టేషన్ వరదల్లో మునిగిపోయింది. పైకప్పు లీకేజీలు కారణంగా ఏకధాటిగా కురిసిన వర్షంతో మెట్రో స్టేషన్ బురదతో నిండిపోయింది. వరద నీటిలోనే ప్రయాణికులు వెళ్తున్న దృశ్యాలు కనిపించాయి. ఈసారి ముంబైకు ముందుగానే రుతుపవనాలు వచ్చేశాయి. 75 ఏళ్లలో ఇంత త్వరగా నైరుతి రుతుపవనాలు రావడం ఇదే తొలిసారి. ఆదివారం అర్ధరాత్రి నుంచి ఏకధాటిగా వర్షం కురిసింది. దీంతో నగరంలోని అనేక ప్రాంతాలు నీట మునిగాయి. భారీగా ట్రాఫిక్ జామ్ కావడంతో వాహనదారులు తీవ్రంగా ఇబ్బంది పడ్డారు. ఇక భూగర్భ మెట్రో స్టేషన్ అంతా నీటి మునిగిపోయింది. ప్లాట్‌ఫామ్‌లపైకి నీరు వచ్చింది చేరింది. దీంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. తగిన విధంగా డ్రైనేజీ లేకపోవడంతో నీరు నిలిచిపోయినట్లుగా తెలుస్తోంది.
భారత దాడుల్లో పాక్ నూర్ ఖాన్ ఎయిర్‌బేస్‌కి భారీ నష్టం.. శాటిలైట్ చిత్రాలు..
ఆపరేషన్ సిందూర్ పాకిస్తాన్‌కి తీరని నష్టాన్ని మిగిల్చింది. పహల్గామ్ ఉగ్రవాద ఘటనకు తర్వాత, భారత్ దాయాది దేశంలోని ఉగ్రవాద స్థావరాలను టార్గెట్ చేసి ధ్వంసం చేసింది. అయితే, దీని తర్వాత పాక్ సైన్యం భారత్‌పై డ్రోన్లు, క్షిపణులతో దాడులు నిర్వహించింది. ఈ దాడులకు ప్రతిగా భారత్ మే 10 తెల్లవారుజామున పాకిస్తాన్ వైమానిక స్థావరాలే లక్ష్యంగా విరుచుకుపడింది. మొత్తం 11 ఎయిర్ బేస్‌లపై దాడులు చేసింది. ఈ దాడుల్లో పాకిస్తాన్ వైమానిక దళం 20 శాతం ఆస్తుల్ని కోల్పోయినట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటే, తాజాగా శాటిలైట్ చిత్రాలను బట్టి చూస్తే.. పాక్ ఆర్మీ హెడ్‌క్వార్టర్స్ రావల్పిండికి సమీపంలో ఉన్న నూర్ ఖాన్ ఎయిర్‌బేస్ దారుణంగా దెబ్బతిన్నట్లు తెలుస్తోంది. పాకిస్తాన్ డ్రోన్స్, వీఐపీ ఎయిర్ ఫ్లీట్‌కి నూర్ ఖాన్ ఎయిర్‌బేస్ కేంద్రంగా ఉంది. ఇది పాక్ రాజధాని ఇస్లామాబాద్‌కి 25 కి.మీ లోపే ఉంది. భారత్ దాడి చేసిన ప్రదేశానికి సమీనంలోని మొత్తం కాంప్లెక్స్ ఇప్పుడు మొత్తం కూల్చివేయడినట్లు వెల్లడైంది.
కోహ్లీని కలిసిన జహీర్.. ఆ ఫోన్లో ఏముంది..?
సీజన్ చివరి లీగ్ మ్యాచ్ కి ఆర్సీబీ సిద్ధమైంది. మంగళవారం నాడు ఆర్సీబీ, లక్నో మధ్య కీలక మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్ లో గెలిస్తే ఆర్సీబీ టాప్2లోకి వెళ్లే అవకాశముంది. ఈ నేపథ్యంలో ఆటగాళ్లు మైదానంలో గంటలతరబడి ప్రాక్టీస్ చేశారు. ఇది ఇలా ఉండగా.. విరాట్ కోహ్లీ మైదానంలో ప్రాక్టీస్ చేస్తుండగా.. లక్నో సూపర్ జాయింట్స్ మెంటర్ జహీర్ ఖాన్ కోహ్లీని కలవడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఇందుకు సంబంధించిన వివరాలలోకి వెళితే.. జహీర్ ఖాన్, కోహ్లీ మాట్లాడుతున్న సమయంలో జహీర్ ఖాన్ తన మొబైల్ తీసి కోహ్లీకి ఎదో చూపించాడు. దానికి కోహ్లీ అంతే ఆసక్తిగా స్పందించాడు. ఇంతకీ జహీర్ కోహ్లీకి ఏమి చూపించి ఉండొచ్చని ఫ్యాన్స్ తెగ ఆరాటపడుతున్నారు. అదీ కాకుండా.. కీలక మ్యాచ్ ముందు ఒక మెంటర్ ప్రత్యర్థి జట్టు ఆటగాడిని కలవడం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. నిజానికి జహీర్ దంపతులు ఇటీవల బేబీ బాయ్ కి జన్మనిచ్చారు. తన కొడుకు ఫోటోలను కోహ్లీకి చూపించేందుకే జహీర్ మైదానానికి వెళ్లినట్లు తెలుస్తుంది.
సంక్రాంతికి ‘అనగనగా ఒక రాజు’
నవీన్ పోలిశెట్టి అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్న ‘అనగనగా ఒక రాజు’ సంక్రాంతి కానుకగా 2026 జనవరి 14న థియేటర్లలో రిలీజ్ కానుంది. తనదైన ప్రత్యేక కామెడీ టైమింగ్ తో ప్రేక్షకుల హృదయాల్లో స్థానం సంపాదించుకున్న నవీన్ పొలిశెట్టి ‘అనగనగా ఒక రాజు’ అనే ఫ్యామిలీ ఎంటర్టైనర్ తో అలరించడానికి సిద్ధమవుతున్నారు. ఇప్పటికే సినిమా యూనిట్ చేసిన మోషన్ పోస్టర్ అందరి దృష్టిని ఆకర్షించింది. ఈ చిత్రంతో నవీన్ పొలిశెట్టి థియేటర్లలో నవ్వుల పండుగను తీసుకురాబోతున్నాడని మోషన్ పోస్టర్ తోనే అర్థమైంది. తెలుగు సినీ అభిమానులు సంక్రాంతి పండుగను సినిమా పండుగలా భావిస్తుంటారు. ముఖ్యంగా సంక్రాంతి సమయంలో ఫ్యామిలీ ఎంటర్టైనర్ లకు ప్రేక్షకుల నుంచి విశేష ఆదరణ ఉంటుంది. ఈ క్రమంలోనే పండుగకి సరైన సినిమాగా ‘అనగనగా ఒక రాజు’ వచ్చే సంక్రాంతికి థియేటర్లలో అడుగుపెట్టనుంది. తెలుగు సినీ పరిశ్రమలో వరుస విజయాలతో దూసుకుపోతున్న మీనాక్షి చౌదరి ‘అనగనగా ఒక రాజు’లో నవీన్ పొలిశెట్టికి జోడిగా నటిస్తున్నారు.
నాకు తెలంగాణాలో ఉన్నవి 30 థియేటర్లే!
థియేటర్ల వివాదం అంశం మీద అనేక చర్చలు జరుగుతున్న క్రమంలో నిన్న అల్లు అరవింద్ తర్వాత ఈరోజు దిల్ రాజు మీడియా ముందుకు వచ్చారు. ఈ క్రమంలో ఆయన మాట్లాడుతూ తనకు తన వర్గానికి తెలంగాణాలో కేవలం 30 థియేటర్లు ఉన్నాయని అన్నారు. ఆయన మాట్లాడుతూ ఏప్రిల్ 26 గిల్డ్ లో జరిగిన మీటింగ్ కారణంగా ఆ డిస్కషన్ కంటిన్యూ అవ్వడం వాళ్ళని రమ్మని చెప్పడానికి అడగడం జరిగింది అని అన్నారు. అనుకున్నది జరగకపోతే తూర్పు గోదావరి జిల్లా ఎగ్జిబిటర్లు జూన్ 1వ తేదీ నుండి థియేటర్లు ఆపాలి అని ఇండైరెక్ట్ గా అనుకున్నారు. అలా ఈస్ట్ గోదావరి జిల్లాలో మొదలైన ఈ వ్యవహారం నైజాం థియేటర్ల వరకు చేరింది. నైజాంలో సింగిల్ స్క్రీన్స్ 370 ఉంటే అందులో మా వర్గానికి చెందినవి కేవలం 30 థియేటర్లు ఉన్నాయి. ఏషియన్ సునీల్ అండ్ సురేష్ ప్రొడక్షన్స్ అండర్లో 90 థియేటర్లు ఉన్నాయి. మా ముగ్గురి దగ్గర మొత్తం కలిపి 120 థియేటర్లు ఉన్నాయి. మిగతా 250 థియేటర్లు యజమానులు ఇతర లీజు దారుల దగ్గర ఉన్నాయి. అయితే తెలంగాణలో కూడా థియేటర్ యజమానులు ఇబ్బందులు పడుతున్నాం అని మా తమ్ముడు శిరీష్ దృష్టికి తీసుకుని వచ్చారు. 1998 నుండి మేము కలిసి వ్యాపారం చేస్తున్నాము, మా బాధలు కూడా పట్టించుకోవాలని కోరారు. మా శిరీష్ ద్వారా నా దగ్గరకు ఈ విషయం వచ్చింది. నేను FDC చైర్మన్ కాబట్టి నా దగ్గరకు ఈ విషయం తీసుకుని వచ్చారు.
దిల్ రాజు ప్రెస్ మీట్ సమయంలో బండ్ల గణేష్ సంచలన ట్వీట్
దిల్ రాజు ప్రెస్ మీట్ జరుగుతున్న సమయంలోనే మరో నిర్మాత బండ్ల గణేష్ చేసిన ట్వీట్ కలకలం రేపుతుంది. ఆస్కార్ నటులు, కమల్ హాసన్లు ఎక్కువైపోయారు, వీళ్ళ నటన చూడలేకపోతున్నాం అంటూ బండ్ల గణేష్ ట్వీట్ చేశారు. అయితే ఆయన ఎవరి గురించి ట్వీట్ చేశారనే విషయం మీద క్లారిటీ లేదు కానీ సరిగ్గా దిల్ రోజు ప్రెస్ మీట్ జరుగుతున్న సమయంలో ట్వీట్ చేయడం హాట్ టాపిక్ అవుతోంది. ఆయన దిల్ రాజుని ఉద్దేశించే ట్వీట్ చేశారేమో అనే కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్లు.
