NTV Telugu Site icon

Top Headlines @ 5 PM: టాప్‌ న్యూస్‌

Top Headlines @ 5 Pm New

Top Headlines @ 5 Pm New

సచివాలయానికి ఆ ఐఏఎస్‌ల క్యూ..!
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మారిన తర్వాత భారీ స్థాయిలో ఐఏఎస్ అధికారులను బదిలీ చేశారు.. ఈ మధ్యే 19 మంది ఐఎఎస్ అధికారులను బదిలీ చేస్తూ సీఎస్ ఉత్తర్వులు జారీ చేశారు.. కొందరు వివిధ శాఖలు కేటాయించిన సర్కార్‌.. శ్రీలక్ష్మీ , రజిత్ భార్గవ్, ప్రవీణ్ ప్రకాష్, మురళీధర్ రెడ్డి లాంటి వారిని జీఏడీలో రిపోర్ట్ చేయాలని ఆదేశాలు జారీ చేసింది.. అయితే, ఇప్పుడు ఏపీ సచివాలయానికి క్యూ కడుతున్నారు అవినీతి అభియోగాలు ఎదుర్కొంటున్న ఐఏఎస్‌ అధికారులు.. జీఏడీకి రిపోర్ట్ చేసేందుకు సెక్రటేరియట్‌కు వస్తున్నారు పలువురు ఐఏఎస్‌లు.. ఇప్పటికే తూర్పు గోదావరి, గుంటూరు జిల్లాల మాజీ కలెక్టర్లు మాధవీలత, వేణుగోపాల్ రెడ్డి.. జీఏడీలో రిపోర్ట్‌ చేశారు.. మరికొందరు సీనియర్ ఐఏఎస్‌లు జీఏడీలో రిపోర్ట్ చేసినట్టు సమాచారం. అయితే, జీఏడీకి రిపోర్ట్ చేసిన అధికారులకు ఎప్పటిలోగా పోస్టింగులు దక్కుతాయో అనేదానిపై క్లారిటీ లేదు.. మరోవైపు.. అవినీతి అరోపణలు ఎదుర్కొంటున్న పలువురు ఐఏఎస్ అధికారులపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విచారణకు సిద్ధం అవుతోంది.

మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లికి హైకోర్టు షాక్..
మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టులో గట్టి ఎదురుదెబ్బ తగిలింది.. పిన్నెల్లి ముందస్తు బెయిల్‌ పిటిషన్లు కొట్టివేసింది హైకోర్టు.. దీంతో.. పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని ఎప్పుడైనా అరెస్ట్‌ చేసే అవకాశం ఉంది.. సార్వత్రిక ఎన్నికల సమయంలో.. ఈవీఎం ధ్వంసంతో పాటు మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లిపై మొత్తం నాలుగు కేసులు నమోదు చేశారు పల్నాడు పోలీసులు.. కాగా, ఆ మూడు కేసుల్లో ఇప్పటి వరకు మధ్యంతర ముందస్తు బెయిల్‌పై ఉన్నారు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి.. అయితే, అరెస్టు నుంచి రక్షణ కోరుతూ పిన్నెల్లి బెయిల్ పిటిషన్లు కొట్టివేసింది హైకోర్టు.. గతంలో నాలుగు ముందస్తు బెయిల్ పిటిషన్లు వేశారు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి.. పోలీసుల తరఫున స్పెషల్ కౌన్సిల్‌గా న్యాయవాది ఎన్‌.అశ్వినీకుమార్‌ వాదనలు వినిపించగా.. ఫిర్యాదుదారు నంబూరి శేషగిరిరావు తరఫున న్యాయవాది పోసాని వెంకటేశ్వర్లు వాదనలు కొనసాగించారు.. గతంలో తీర్పును రిజర్వ్‌ చేసిన ఏపీ హైకోర్టు.. ఇవాళ మధ్యాహ్నం 2.15 గంటలకు తీర్పు ఇచ్చింది.. ముందస్తు బెయిల్‌ పిటిషన్లను డిస్మిస్‌ చేస్తూ ఆదేశాలు జారీ చేసింది.. పిన్నెల్లి పై ఈవీఎం ధ్వంసం సహా మరో మూడు కేసులు నమోదు చేశారు పల్నాడు పోలీసులు.. అయితే, ఈ కేసుల్లో ఆయనకు ఊరట కల్పిస్తూ.. ఏపీ హైకోర్టు గతంలో ముందస్తు బెయిల్‌ ఇచ్చింది.. దీంతో.. ఇప్పటి వరకు మధ్యంతర ముందస్తు బెయిల్ పై ఉన్న పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి ఈ రోజు హైకోర్టు తీర్పు షాక్‌ ఇచ్చినట్టు అయ్యింది.. పిటిషన్లు మొత్తం డిస్మిస్‌ కావడంతో.. పిన్నెల్లిని ఏ క్షణంలోనైనా అరెస్ట్‌ చే సే అవకాశం ఉందంటున్నారు.

మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి అరెస్ట్..
మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని అరెస్ట్ చేశారు పోలీసులు.. మాజీ ఎమ్మెల్యే అనిల్‌ కుమార్‌ యాదవ్‌ ఇంట్లో ఉన్న పిన్నెల్లిని అరెస్ట్ చేసిన పోలీసులు.. పల్నాడు ఎస్పీ ఆఫీసుకు తరలించారు.. పిన్నెల్లి ముందస్తు బెయిల్‌ పిటిషన్లు ఏపీ హైకోర్టు కొట్టివేసిన నేపథ్యంలో.. ఆ వెంటనే పిన్నెల్లిని అదుపులోకి తీసుకున్నారు.. పిన్నెల్లిపై ఈవీఎం ధ్వంసం, ఎన్నికల అల్లర్ల కేసులు నమోదైన విషయం విదితమే.. ఎన్నికల సందర్భంగా ఈవీఎం ధ్వంసం చేస్తూ దొరికిన విజువల్స్ తో పాటు పలు హత్యాయత్న కేసులు కూడా పిన్నెల్లి పై నమోదు అయ్యాయి.. గడిచిన కొద్ది వారాలుగా కండిషన్ బెయిల్ పై నరసరావుపేటలోని ప్రైవేట్ హౌస్ లో నివాసం ఉంటున్నారు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి . పోలీసుల పర్యవేక్షణలో ప్రతినిత్యం ఎస్పీ కార్యాలయానికి వెళ్లి సంతకం పెట్టి వచ్చేలాగా కోర్టు ఆదేశాలు జారీ చేసింది.. మరోవైపు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి పాస్‌పోర్ట్‌ను కూడా కోర్టు సీజ్ చేసిన నేపథ్యంలో నరసరావుపేటలోనే ఉంటున్నారు రామకృష్ణారెడ్డి … ఈరోజు పిన్నెల్లి పెట్టుకున్న బెయిల్ పిటిషన్లను కోర్టు తిరస్కరించడంతో పిన్నెల్లిని అరెస్ట్ చేశారు.

హాట్ కేకుల్లా శ్రీవారి దర్శన టికెట్ల విక్రయాలు.. నిమిషాల వ్యవధిలోనే..
కలియుగ ప్రత్యక్షదైవం తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామి దర్శనానికి నిత్యం పోటెత్తుతూనే ఉంటారు భక్తులు.. ఇక, తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) ప్రతీ నెల ఆన్‌లైన్‌ విడుదల చేసే.. ప్రత్యేక దర్శనం టికెట్లతో పాటు.. వివిధ సేవలకు సంబంధించిన టికెట్లు కూడా నిమిషాల వ్యవధిలో హాట్‌ కేకుల్లా అమ్ముడుపోతూనే ఉన్నాయి.. ఈ రోజు కూడా అలాంటి పరిస్థితే చోటు చేసుకుంది.. సెప్టెంబర్‌ నెలకు సంబంధించిన దర్శన టికెట్ల కోటాను ఆన్‌లైన్‌లో విడుదల చేసింది టీటీడీ.. దీంతో.. గంటా 25 నిముషాల వ్యవధిలోనే ఆర్జిత సేవా టికెట్ల కోటాను పూర్తి చేశారు భక్తులు.. ఇక, 2 నిముషాల 30 సెంకడ్ల వ్యవధిలోనే అంగప్రదక్షణ టికెట్లు పూర్తిగా బుక్‌ చేసుకున్నారు.. 10 నిముషాల 11 సెకండ్ల వ్యవధిలోనే వయోవృద్ధులు, వికలాంగుల దర్శన టికెట్ల కోటా పూర్తి చేశారు.. మరోవైపు.. శ్రీవారి 300 రూపాయల ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల కోటాను 2 గంటల 6 నిముషాల వ్యవధిలోనే పూర్తి స్థాయిలో బుక్‌చేసుకున్నారు. గంటా 40 నిముషాల వ్యవధిలోనే వసతి గదుల కోటాను పొందారు భక్తులు.. కాగా, వేసవి సెలవులు ముగిసి.. స్కూళ్లు ప్రారంభం అయినా.. తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోన్న విషయం విదితమే.

స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్‌పై డిప్యూటీ సీఎం పవన్‌ సమీక్ష.. నిధులు, ఖర్చులపై ఆరా..!
ఆంధ్రప్రదేశ్‌ డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌.. స్వచ్ఛాంధ్ర కార్పోరేషన్‌పై సమీక్షా సమావేశం నిర్వహించారు.. ఈ సమావేశానికి ఉన్నతాధికారులు, ఇంజనీర్లు హాజరయ్యారు.. ఇక, ఈ సమావేశంలో.. స్వచ్ఛాంధ్ర కార్పోరేషన్ పని తీరుపై డిప్యూటీ సీఎంకు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు అధికారులు.. స్వచ్ఛాంధ్రకు నిధుల లభ్యత, ఖర్చుల వివరాలపై ఆయన ఆరా తీశారు.. గత ఐదేళ్ల కాలంలో కేంద్రం విడుదల చేసిన రూ.1066 కోట్లు ఏమయ్యాయని అధికారులను ప్రశ్నించారు డిప్యూటీ సీఎం పవన్. అయితే, కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన నిధులను రాష్ట్ర ఆర్థిక శాఖ.. స్వచ్ఛాంధ్రకు విడుదల చేయలేదనే విషయాన్ని పవన్‌ కల్యాణ్‌ దృష్టికి తీసుకెళ్లారు అధికారులు.

తొందర పడకండి.. ఎమ్మెల్యేలతో కేసీఆర్ కీలక భేటీ..!
సిద్దిపేట జిల్లాలోని ఎర్రవల్లిలోని ఫాం హౌస్ కి బీఆర్ఎస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు క్యూ కట్టారు. గత రెండు రోజులుగా బీఆర్ఎస్ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఎమ్మెల్యేలతో సమావేశం అవుతున్నారు. ఈ నేపథ్యంలోనే ఇవాళ మాజీ మంత్రి మల్లారెడ్డి, ఎమ్మెల్యేలు, పల్లా రాజేశ్వర్ రెడ్డి, కాలేరు వెంకటేష్, దేవిరెడ్డి సుధీర్ రెడ్డి, బండారి లక్ష్మా రెడ్డి, మర్రి రాజశేఖర్ రెడ్డిలు ఎర్రవల్లిలోని ఫాం హౌస్ కి వెళ్లారు. కాగా, తెలంగాణ రాష్ట్రంలో తాజా రాజకీయ పరిణామాలపై ఎమ్మెల్యేలతో మాజీ సీఎం కేసీఆర్ చర్చించారు. పార్టీకి చెందిన ఎమ్మె్ల్యేలకు పలు కీలక సూచనలు చేశారు. ఎట్టి పరిస్థితుల్లో పార్టీ రావొద్దని సూచించారు. అయితే, దాదాపు 2 గంటలకు పైగా జరిగిన ఈ సమావేశంగా ముగిసింది. దీంతో బీఆర్ఎస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు ఫామ్ హౌస్ నుంచి వెళ్లిపోయారు. ఈ సమావేశంపై మాజీ మంత్రి మల్లారెడ్డి మాట్లాడుతూ.. కేసీఆర్ తో చాలా విషయాలు చర్చించాము.. అవన్నీ సీక్రెట్, బయటకు చెప్పడం కుదరదు అని పేర్కొన్నారు. కాగా, నిన్న ( మంగళవారం ) కూడా గ్రేటర్ హైదరాబాద్ నగర పరిధిలోని బీఆర్ఎస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలతోనూ గూలాబీ బాస్ కేసీఆర్ సమావేశం అయ్యారు.

బీఆర్‌ఎస్ బీఫాంపై గెలిచిన ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌లో చేరడం చట్ట వ్యతిరేకం..
బీఆర్‌ఎస్ పార్టీ బీఫాంపై గెలిచిన ఎమ్మెల్యేలు పోచారం, శ్రీనివాస రెడ్డి, సంజయ్‌కుమార్‌లు కాంగ్రెస్‌ పార్టీలో చేరడం చట్ట వ్యతిరేకమని మాజీ మంత్రి, బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే జగదీష్‌ రెడ్డి అన్నారు. పార్టీ ఫిరాయింపుల చట్టం ప్రకారం ఇద్దరి సభ్యతం రద్దు కావాల్సి ఉందన్నారు. నిన్నటి నుంచి స్పీకర్ అపాయింట్ మెంట్ కోసం ఎదురుచూస్తున్నామని, మాకు అపాయింట్‌మెంట్ ఇవ్వడం లేదన్నారు. మాకున్న ఇతర మార్గాల ద్వారా ఒకటి స్పీడ్ పోస్టు, ఇంకోటి ఈ మెయిల్ ద్వారా ఇద్దరిపై అనర్హత వేటు వేయాలని ఫిర్యాదు చేశామన్నారు. వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నామని, లేదంటే న్యాయపరంగా ముందుకు వెళ్తామన్నారు. పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహించిందే కాంగ్రెస్ పార్టీ అని, పాంచ్‌ న్యాయ్‌లో భాగంగా పార్టీ ఫిరాయింపుల చట్టాన్ని మేనిఫెస్టోలో పెట్టారన్నారు. మళ్లీ వారే పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహిస్తున్నారని విమర్శించారు. ఇలాంటి సిగ్గుమాలిన పనులు చేయొద్దని ఎమ్మెల్సీ జీవన్‌ రెడ్డే చెప్తున్నారని ఆయన వెల్లడించారు. మా హయంలో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలే కేసీఆర్ దగ్గరకు వచ్చి కండువాలు కప్పుకున్నారన్నారు. చట్టం ప్రకారం 2\3 వంతు మా పార్టీలో జాయిన్ అయ్యారని పేర్కొన్నారు. మా ఎమ్మెల్యేలు మా అధినేత దగ్గరకు వస్తారు, తప్పు ఏముంది.. ప్రజలే తండోప తండాలుగా కేసీఆర్‌ను కలవడానికి వస్తున్నారన్నారు. గూడెం మహిపాల్ రెడ్డి పార్టీ మార్పుపై మాజీ మంత్రి ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి స్పందించారు.

ఎయిరిండియా విమానానికి బాంబ్ బెదిరింపులు..
తమ టికెట్‌ను పునరుద్దరించలేదన్న కోపంతో ఓ వ్యక్తి విమానంలో బాంబు బెదిరింపులకు పాల్పడిన ఘటన కేరళ రాష్ట్రంలో చోటు చేసుకుంది. అయితే, ఈ విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. సోమవారం అర్ధరాత్రి ముంబయిలోని ఎయిర్ ఇండియా కస్టమర్ కేర్ సెంటర్‌కు ఓ వ్యక్తి కాల్ చేసి కొచ్చి – లండన్ గాట్విక్ విమానంలో బాంబు పెట్టినట్లుగా వార్నింగ్ ఇచ్చాడని అధికారులు చెప్పుకొచ్చారు. విషయం తెలుసుకున్న కొచ్చి ఎయిర్ పోర్ట్ అధికారులు ముమ్మరంగా తనిఖీలు చేశారు. తీవ్ర గాలింపుల తర్వాత అది తప్పుడు సమాచారం అని నిర్ధారించడంతో విమానం లండన్‌కు స్టార్ట్ అయింది. ఈ ఘటనపై ఎయిర్ పోర్టు అధికారులు పోలీసులకు కంప్లైంట్ చేయడంతో కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. దర్యాప్తులో కాల్ చేసిన వ్యక్తి లండన్‌కు టికెట్‌ బుక్‌ చేసుకున్న ప్రయాణికుడు షుహైబ్ అని తెలిసింది. దీంతో అతడ్ని అదుపులోకి తీసుకుని విచారణ చేశారు. ఇక, పోలీసుల వివరాల ప్రకారం.. షుహైబ్‌ మంగళవారం తన భార్య, కుమార్తెతో కలిసి AI 149 విమానంలో లండన్‌కు వెళ్లాల్లి.. అదే సమయంలో ఆయన కుమార్తె ఫుడ్ పాయిజనింగ్‌తో ఇబ్బంది పడుతుండడంతో టికెట్‌ను మరో రోజు రీషెడ్యూల్ చేయాలని ఎయిర్‌లైన్స్‌ను షూహైబ్ కోరారు. దానికి ఎయిర్ ఇండియా ఎయిర్‌లైన్స్‌ అందుకు నిరాకరించడంతో నిరాశ చెందిన అతడు బాంబు బెదిరింపు చర్చలకు పాల్పడ్డాని పోలీసులు వెల్లడించారు. నిందితుడిపై పోలీసులు కేసు నమోదు చేసి అదుపులోకి తీసుకున్నారు.

ఘోరం.. బ్యాంక్ డ్యూటీలో ఉండగా గుండెపోటు.. సీట్లోనే కుప్పకూలిన మేనేజర్
మృత్యువు ఎప్పుడు.. ఎలా.. ఏ రూపంలో వస్తుందో ఎవరికీ తెలియదు. కానీ ఈ మధ్య జరుగుతున్న మరణాలు అంతు చిక్కడం లేదు. ఒకప్పుడు గుండెపోటు అంటే.. వయసు పైబడిన వారికి వచ్చేవి. కానీ ఇప్పుడు పరిస్థితులు మారాయి. పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ల వరకు.. ఇలా ఏ వయసు తేడా లేకుండా.. అన్ని వయసుల వారికి హార్ట్ ఎటాక్‌లు రావడం దిగ్భ్రాంతి కరమైన పరిణామం. తాజాగా ఉత్తరప్రదేశ్‌లో ఓ బ్యాంక్‌లో పని చేస్తున్న యువ ఉద్యోగికి హార్ట్ ఎటాక్ వచ్చి కుర్చీలోనే ప్రాణాలు కోల్పోయాడు. ఈ పరిణామంతో సహా ఉద్యోగులంతా షాక్‌కు గురయ్యారు. ఈ ఘోరం ఉత్తరప్రదేశ్‌లోని మహోబాలోని హెచ్‌డీఎఫ్‌సీ బ్రాంచ్‌లో జరిగింది. హెచ్‌డీఎఫ్‌సీ బ్రాంచ్‌లో జనరల్ మేనేజర్ రాజేష్ కుమార్ షిండే (30) ల్యాప్‌ట్యాప్‌లో పని చేస్తున్నాడు. సడన్‌గా కుర్చీపై నుంచి కిందకి కుప్పకూలిపోయాడు. సహచర ఉద్యోగులంతా అప్రమత్తమై ఆస్పత్రికి తరలించారు. కానీ అప్పటికే అతడు ప్రాణాలు కోల్పోయాడు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు బ్యాంక్ సీసీ కెమెరాలో రికార్డ్ అయ్యాయి. అధిక ఒత్తిడి కారణంగానే గుండెపోటులు వస్తున్నాయని వైద్యులు పేర్కొన్నారు. ఈ పరిణామంతో ఉద్యోగులంతా తీవ్ర విషాదంలో మునిగిపోయారు. అప్పటిదాకా కళ్ల ముందు మెదిలాడిన వ్యక్తి.. ఆ క్షణంలోనే చనిపోవడం చూసి ఉద్యోగులంతా నిశ్చేష్టులయ్యారు.

మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఇంటికి ముకేశ్‌ అంబానీ.. ఎందుకంటే.?
రిలయన్స్ ఇండస్ట్రీస్ ఛైర్మన్ ముకేశ్‌ అంబానీ ఇవాళ (బుధవారం) మహారాష్ట్ర సీఎం ఏక్‌నాథ్ షిండేను ఆయన నివాసంలో మర్వాదపూర్వకంగా కలిశారు. జూలై 12వ తేదీన జరగనున్న తన కుమారుడు అనంత్‌ అంబానీ పెళ్లికి హాజరుకావాలని ఆహ్వానించారు. ఆయనతో పాటు అనంత్ అంబానీ, రాధికా మర్చంట్ షిండేను కలిశారు. వారిని సాదరంగా ఆహ్వానించిన ముఖ్యమంత్రి కుటుంబసభ్యులు రాధికా మర్చంట్‌కు వినాయకుడి విగ్రహాన్ని బహూకరించారు. అయితే, అనంత్‌ అంబానీ, రాధికా మర్చంట్‌ సోమవారం ముంబయిలోని అజయ్ దేవగన్ ఇంటికి వెళ్లి తమ పెళ్లికి రావాల్సిందిగా ఆహ్వానించారు. రిలయన్స్ ఫౌండేషన్ ఛైర్‌పర్సన్, వ్యవస్థాపకురాలు నీతా అంబానీ కాశీ విశ్వనాథుడిని దర్శించి తొలి వివాహ ఆహ్వాన పత్రికను సమర్పించి ఆశీస్సులు తీసుకున్నారు. దర్శనం తర్వాత ఆమె లోకల్ హోటల్ లో స్థానికులతో మాట్లాడారు. 10 ఏళ్ల తర్వాత ఇక్కడికి వచ్చా.. ఇక్కడ జరుగుతున్న అభివృద్ధి కాశీ విశ్వనాథ్ కారిడార్, నమో ఘాట్, సోలార్ ఎనర్జీ ప్లాంట్లు, పరిశుభ్రతను చూస్తుంటే చాలా సంతోషంగా ఉందని నీతా అంబానీ పేర్కొనింది. కాగా, అనంత్ అంబానీ, రాధికా మర్చంట్‌ల పెళ్లి జులై 12న ముంబయిలోని జియో వరల్డ్ కన్వెన్షన్ సెంటర్‌లో జరగబోతుంది. 2022లో రాజస్థాన్‌లోని నాథ్‌ద్వారా పట్టణంలోని శ్రీనాథ్‌జీ ఆలయంలో వీరి నిశ్చితార్థం జరగ్గా.. ఇటీవల మార్చి 1 నుంచి 3 వరకు జామ్‌నగర్‌లో మూడు రోజుల పాటు ప్రీ- వెడ్డింగ్ సెలబ్రేషన్స్ ఘనంగా జరిగాయి.

స్టాక్ మార్కెట్‌లో కొనసాగుతున్న జైత్రయాత్ర.. రికార్డ్‌లు బద్ధలుకొట్టిన సూచీలు
స్టాక్ మార్కెట్‌ రికార్డుల మోత మోగిస్తున్నాయి. వరుస లాభాలతో జైత్రయాత్ర కొనసాగిస్తోంది. ప్రతి రోజూ సరికొత్త చరిత్రను సృష్టిస్తోంది. కేంద్రంలో సంకీర్ణ ప్రభుత్వం ఏర్పడ్డాక.. మార్కెట్లు ఎలా ఉంటాయోనన్న అనుమానాలు వ్యక్తమయ్యాయి. కానీ అందుకు భిన్నంగా మార్కెట్ శైలి సాగిపోతుంది. మంగళవారం సెన్సెక్స్, నిఫ్టీ సరికొత్త రికార్డ్ సృష్టించగా.. బుధవారం అంతకు మించి తాజా రికార్డ్‌లను సొంతం చేసుకుంది. ఉదయం ఫ్లాట్‌గా ప్రారంభమైన సూచీలు.. అనంతరం క్రమక్రమంగా పుంజుకుంటూ భారీ లాభాల్లో సూచీలు దూసుకుపోయాయి. సెన్సెక్స్ 620 పాయింట్లు లాభపడి 78, 674 దగ్గర ముగియగా.. నిఫ్టీ 147 పాయింట్లు లాభపడి 23, 868 దగ్గర ముగిసింది. రెండూ కూడా సరికొత్త రికార్డులను నమోదు చేశాయి. ఇక డాలర్‌పై రూపాయి మారకం విలువ 83.57 దగ్గర ముగిసింది. నిఫ్టీలో రిలయన్స్ ఇండస్ట్రీస్, అల్ట్రాటెక్ సిమెంట్, భారతీ ఎయిర్‌టెల్, ఐసీఐసీఐ బ్యాంక్ మరియు గ్రాసిమ్ ఇండస్ట్రీస్ అత్యధికంగా లాభపడగా.. అపోలో హాస్పిటల్స్, బజాజ్ ఆటో, ఎం అండ్ ఎం, టాటా స్టీల్ మరియు హిందాల్కో ఇండస్ట్రీస్ నష్టపోయాయి.సెక్టార్లలో బ్యాంక్, ఆయిల్ & గ్యాస్, టెలికాం, మీడియా మరియు ఎఫ్‌ఎంసిజి 0.3-2 శాతం పెరగగా, ఆటో, మెటల్ మరియు రియల్టీ 0.7-1.5 శాతం క్షీణించాయి. బిఎస్‌ఇ మిడ్‌క్యాప్ ఇండెక్స్ 0.30 శాతం క్షీణించగా, స్మాల్‌క్యాప్ ఇండెక్స్ ఫ్లాట్ నోట్‌తో ముగిసింది.

తుఫాన్ కాదిది సునామీ.. రిలీజ్ కు ముందే 14 లక్షల టిక్కెట్ల అమ్మకం!
పాన్ ఇండియా సూపర్ స్టార్ ప్రభాస్ ‘కల్కి 2898 AD’ బాక్సాఫీస్ వద్ద సునామీ సృష్టిస్తున్నాడు. 2024లో ఇప్పటి వరకు బాలీవుడ్ నుంచి సౌత్ సినిమాల వరకు వచ్చిన సినిమాలు పెద్దగా అద్భుతాలు చేయకపోగా.. ‘కల్కి 2898 AD’ ఆ లెక్కలన్నీ తేల్చేస్తుందని తెలుస్తోంది. టాక్ తో సంబంధం లేకుండా ఓపెనింగ్ రోజైనా ఈ సినిమా భారీ వసూళ్లను రాబడుతోందని అంచనా. నాగ్ అశ్విన్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా బంపర్ అడ్వాన్స్ బుకింగ్ ఆశ్చర్యం కలిగిస్తోంది. బుధవారం మధ్యాహ్నం నాటికి, మొదటి రోజుకి 14 లక్షల టిక్కెట్లు అమ్ముడయ్యాయి. హైదరాబాద్‌లో అయితే సరికొత్త రికార్డు సృష్టించింది. అంతేకాదు, జూన్ 27 గురువారం విడుదల కావడానికి ఇంకా 16 గంటల సమయం ఉంది. 2024 సంవత్సరంలో మొదటి రోజు అడ్వాన్స్ బుకింగ్ ద్వారా 10 లక్షలకు పైగా టిక్కెట్‌లను విక్రయించబడిన మొదటి భారతీయ చిత్రంగా ‘కల్కి 2898 AD’ అవతరించింది. బుధవారం మధ్యాహ్నం 12 గంటల వరకు, ఈ చిత్రం అడ్వాన్స్ బుకింగ్ ద్వారా రూ. 38.41 కోట్లు రాబట్టింది. అభిమానుల క్రేజ్‌ను దృష్టిలో ఉంచుకుని గురువారంఉదయం 5:30 గంటల నుంచి థియేటర్లలో ఈ సినిమా షోలను ప్రదర్శించనున్నారు. ‘కల్కి 2898 AD’ వేగం చూస్తుంటే జూన్ 27న విడుదలకు ముందే ఈ సినిమా అడ్వాన్స్ బుకింగ్ ద్వారా రూ.50 కోట్లకు పైగా రాబట్టడం ఖాయంగా కనిపిస్తోంది. ఇప్పటి వరకు ఏ భారతీయ చిత్రానికైనా ఇదే అతి పెద్ద ప్రీ-సేల్ అవుతుంది. ఈ సినిమా తెలుగు వెర్షన్ నుండి దాదాపు 30 కోట్ల రూపాయలను రాబట్టినట్టు భారీ అడ్వాన్స్ బుకింగ్స్ లెక్కలు చెబుతున్నాయి. ఇక హిందీ వెర్షన్, ఇప్పటివరకు దాదాపు రూ. 3 కోట్ల అడ్వాన్స్ బుకింగ్ జరిగింది. హిందీలో ప్రభాస్ గతంలో విడుదల చేసిన ‘సాలార్’ కంటే ఈ సినిమా మంచి వసూళ్లను సాధిస్తోంది. కాగా, హైదరాబాద్ నగరంలో అడ్వాన్స్ బుకింగ్‌లో ‘కల్కి 2898 AD’ సరికొత్త రికార్డు సృష్టించింది. ‘సాలార్’ హైదరాబాద్‌లో రూ.12 కోట్ల అడ్వాన్స్ బుకింగ్ చేసుకుంది. కాగా, ‘కల్కి 2898 AD’ ప్రీ-సేల్స్ ద్వారానే దాదాపు రూ.14 కోట్లు రాబట్టినట్లు తెలుస్తోంది.

‘రేణుకాస్వామిని హీరోగా చేయడం ఆపండి’: దర్శన్‌కు మద్దతుగా యాంకర్ సంచలన ప్రకటన!
శాండల్‌వుడ్ ఛాలెంజింగ్ స్టార్, బాక్సాఫీస్ సుల్తాన్ గా అతని అభిమానులు చెప్పుకునే దర్శన్ జైలు పాలయ్యాడు. రేణుకాస్వామి హత్య కేసులో దర్శన్ ప్రమేయం ఉందని పోలీసులు భావిస్తున్నారు. చిత్రదుర్గకు చెందిన రేణుకాస్వామి పట్టగెరె షెడ్డులో దారుణ హత్యకు గురయ్యారు. ఈ కేసులో దర్శన్ రెండో ముద్దాయి కాగా, దర్శన్ ప్రియురాలు పవిత్ర గౌడ మొదటి ముద్దాయి. ఈ కేసుకు సంబంధించి నిందితులందరినీ జ్యుడీషియల్ కస్టడీకి తరలించారు. ప్రస్తుతం పరప్పన అగ్రహార జైలులో ఉన్న దర్శన్‌కు వీజే/యాంకర్ హేమలత మద్దతు తెలుపుతూ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఈ ఘటనపై ఏం చెప్పాలో తెలియడం లేదు, దయచేసి రేణుకాస్వామిని హీరోగా నిలబెట్టకండి’’ అని దర్శన్ గురించి వీజే హేమలత అన్నారు. “ఎవరూ నన్ను ఆపలేరు!! వేయి మందిని వేయిసార్లు మాట్లాడనివ్వండి.. ఒక్కసారిగా పెరిగిన స్నేహానికి సముద్రంలా గాఢమైన ప్రేమకు మనమంతా రుణపడి ఉంటాం.. ఒక్కసారి స్నేహ సంకెళ్లలో చిక్కుకున్నా గొలుసు తెంచుకోము. . అప్పుడు, ఇప్పుడు, మేము ఎప్పటికీ మరచిపోము, వదిలివేయము, లేదా వదులుకోము. ఈ ఘటనపై ఏం చెప్పాలో తెలియడం లేదు, చట్టానికి ముగింపు పలికి బయటకు వచ్చి కళంకం అంతా కడిగేయండి. మీ పట్ల ప్రేమ మరియు గౌరవం ఎప్పటికీ విఫలం కాదు. దయచేసి రేణుకాస్వామిని హీరో చేయడం ఆపండి అని ఇన్‌స్టాగ్రామ్‌లో VJ హేమలత రాశారు. అయితే ఈ పోస్ట్‌ను పోస్ట్ చేసిన తర్వాత, VJ హేమలత పోస్ట్‌లోని కామెంట్ సెక్షన్‌ను ఆఫ్ చేసారు.