Site icon NTV Telugu

Top Headlines @ 5 PM: టాప్‌ న్యూస్‌

Top Headlines @ 5 Pm New

Top Headlines @ 5 Pm New

పార్టీ సంస్థాగత నిర్మాణంపై టీడీపీ అధిష్టానం ఫోకస్..
జనసేన-బీజేపీతో జతకట్టి ఆంధ్రప్రదేశ్‌లో తిరుగులేని విజయాన్ని అందుకుంది తెలుగుదేశం పార్టీ.. ఓవైపు అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలపై ప్రత్యేక దృష్టి సారించింది కూటమి ప్రభుత్వం.. మరోవైపు.. కూటమిలోని పార్టీలు.. ఆయా పార్టీల నిర్మాణంపై కూడా ఫోకస్‌ పెట్టాయి.. మరోవైపు.. పార్టీ సంస్థాగత నిర్మాణాన్ని మరింత బలోపేతం చేయడంపై టీడీపీ అధిష్టానం దృష్టి సారించింది. ఇటీవల జిల్లా కమిటీల నియామక ప్రక్రియను పూర్తి చేసిన అధిష్టానం, ప్రస్తుతం రాష్ట్ర కమిటీ ఎంపికపై కసరత్తు కొనసాగిస్తోంది. ఈ నేపథ్యంలో రేపు టీడీపీ కేంద్ర కార్యాలయంలో జిల్లా కార్యదర్శుల కోసం ప్రత్యేక వర్క్‌షాప్ నిర్వహించనున్నారు. అలాగే 25 పార్లమెంటరీ పార్టీ కమిటీల నేతలకు ఇప్పటికే ఆహ్వానాలు అందాయి. వర్క్‌షాప్‌లో నాయకత్వ లక్షణాలు, పార్టీ బలోపేతం, భవిష్యత్ కార్యాచరణపై నేతలకు అధిష్టానం దిశానిర్దేశం చేయనుంది. ఈ కార్యక్రమానికి పార్టీ అధినేత, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్ హాజరుకానున్నారు.

పాలనలో టెక్నాలజీని విస్తృతంగా వినియోగించాలి.. ఉద్యోగులపై పని భారం తగ్గించాలి..
పాలనలో టెక్నాలజీని విస్తృతంగా వినియోగించి క్షేత్రస్థాయి ఉద్యోగులపై పని భారం తగ్గించాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులకు సూచించారు. సమర్ధత లేకపోతే శిక్షణ ఇచ్చి, నిరంతరం పర్యవేక్షించాలని.. తద్వారా ఫలితాలు సాధించవచ్చన్నారు. సాంకేతికతతో గవర్నెన్స్‌లో చాలా సమస్యలు పరిష్కరించవచ్చని, సాంకేతికతను ఉద్యోగులు, అధికారులు విస్తృత స్థాయిలో వినియోగించుకునేలా ప్రోత్సహించేలా కోరారు. 2026 సంవత్సరం టెక్నాలజీ డ్రివెన్ డిసిషన్ మేకింగ్ ఇయర్‌గా మారాలని, ప్రభుత్వ సేవల్లోనూ ఏఐ పాత్ర పెరగాలని స్పష్టం చేశారు. ఏఐ వినియోగించుకుని గ్రీవెన్స్‌లు సత్వరంగా పరిష్కరించాలని నిర్దేశించారు. క్యాంపు కార్యాలయంలో ఆర్టీజీఎస్‌పై వివిధ శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు.. ఇక డేటా డ్రివెన్ గవర్నెన్స్‌పై మరింత దృష్టి సారిస్తామని చెప్పారు. మన మిత్ర – వాట్సప్ గవర్నెన్స్ ద్వారా ప్రస్తుతం 878 ప్రభుత్వ సేవలను అందించగలుగుతున్నట్టు.. ఇప్పటివరకు 1.43 కోట్ల మంది ఈ సేవలను వినియోగించుకున్నారని అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. అనంతరం వైద్యం, వ్యవసాయం, రెవెన్యూ, రహదారులు, ఆర్టీఏ, అగ్నిమాపక శాఖల పనితీరుపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులతో సమీక్షించారు.

కేవలం రూ.3,500కే గోవా టూర్..! TGSRTC అదిరిపోయే ఆఫర్.. మిస్ కావద్దు.!
ఫిబ్రవరి రెండో వారంలో వరుసగా సెలవులు వస్తుండటంతో, సామాన్యులకు సైతం అందుబాటులో ఉండేలా TGSRTC సరికొత్త పర్యాటక ప్యాకేజీలను సిద్ధం చేసింది. సాధారణంగా గోవా వంటి పర్యాటక ప్రాంతాలకు వెళ్లాలంటే ప్రైవేట్ వాహనాల్లో వేల రూపాయలు ఖర్చవుతాయి. కానీ, RTC లగ్జరీ బస్సుల్లో అత్యంత తక్కువ ధరకే సురక్షితమైన ప్రయాణాన్ని అందిస్తోంది. ఈ ప్యాకేజీలు కేవలం విహారయాత్రలకే కాకుండా, చారిత్రక , ఆధ్యాత్మిక ప్రాధాన్యత ఉన్న ప్రాంతాలను సందర్శించేలా రూపొందించబడ్డాయి. ఈ ప్యాకేజీలో భాగంగా పర్యాటకులు 3 రాత్రులు , 4 రోజుల పాటు అద్భుతమైన ప్రయాణ అనుభూతిని పొందవచ్చు. కేవలం రూ. 3,500 చెల్లించడం ద్వారా గోవాలోని అందమైన బీచ్‌లతో పాటు, యునెస్కో గుర్తింపు పొందిన హంపీలోని చారిత్రక కట్టడాలను సందర్శించే అవకాశం కలుగుతుంది. దీనితో పాటు మహారాష్ట్రలోని ప్రముఖ శక్తిపీఠం తుల్జాపూర్ భవాని అమ్మవారి దర్శనం కూడా ఈ ప్యాకేజీలో అంతర్భాగంగా ఉంటుంది. లగ్జరీ బస్సుల్లో సాగే ఈ ప్రయాణం పర్యాటకులకు సౌకర్యవంతంగా ఉండటమే కాకుండా, తక్కువ బడ్జెట్‌లో ఎక్కువ ప్రాంతాలను కవర్ చేసేలా ప్లాన్ చేశారు.

చప్పుడు కాకుండా వెళ్లి.. చక్కగా పని ముగించుకొచ్చారు.. ఇండియన్ ఆర్మీ సీక్రెట్ మిషన్!
గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఆదివారం కేంద్రం ప్రకటించిన ‘శౌర్యచక్ర’ పురస్కారాలతో భారత సైన్యం నిర్వహించిన ఒక కోవర్ట్ ఆపరేషన్ వెలుగులోకి వచ్చింది. నిజానికి ఈ రహస్య ఆపరేషన్ ఎప్పుడు జరిగింది, ఎక్కడ జరిగిందనే విషయాలను బహిర్గతం చేయడం చాలా అరుదు. తాజాగా కేంద్రం ప్రకటించిన ‘శౌర్యచక్ర’ పురస్కార ప్రకటనతో ఈ రహస్య ఆపరేషన్ వివరాలు వెల్లడయ్యాయి. ఇంతకీ ఈ సీక్రెట్ ఆపరేషన్ ఎక్కడ జరిగింది, ఎప్పుడు జరిగింది అనేది ఈ స్టోరీలో తెలుసుకుందాం. ఇండియాకు మయన్మార్‌తో దాదాపు 1600 కిలోమీటర్ల మేర సరిహద్దు ఉంది. ఈ సరిహద్దు ప్రాంతం నుంచి గత కొన్నేళ్లుగా ఉల్ఫా(ఐ) అస్సాంకు ప్రత్యేక ప్రతిపత్తిని డిమాండ్‌ చేస్తూ దేశ వ్యతిరేక కార్యకలాపాలు నిర్వహిస్తుంది. ఈ క్రమంలో గతేడాది భారత సైన్యం మయన్మార్ భూభాగంలో ఓ రహస్య ఆపరేషన్‌ నిర్వహించింది. మన సైన్యం ఈ కోవర్ట్‌ ఆపరేషన్‌ను మయన్మార్ భూభాగంలో ఉన్న మిలిటెంట్లను లక్ష్యంగా చేసుకొని నిర్వహించింది. భారత్‌-మయన్మార్‌ సరిహద్దు ప్రాంతంలో 2025 జులై 11 నుంచి 13 వరకు ఈ ఇండియన్ ఆర్మీ ఈ సీక్రెట్ ఆపరేషన్‌‌ను నిర్వహించింది. ఈ ఆపరేషన్‌లో 9 మంది మిలిటెంట్‌ నాయకులు మరణించారు. గతేడాది జులైలో యునైటెడ్‌ లిబరేషన్‌ ఫ్రంట్‌ ఆఫ్ అస్సాం (ఇండిపెండెంట్‌) (ఉల్ఫా (ఐ)) విడుదల చేసిన ఒక ప్రకటనలో మయన్మార్‌లోని సగైంగ్‌ ప్రాంతంలో జరిపిన డ్రోన్లు, క్షిపణి దాడుల్లో తమ సంస్థకు చెందిన అగ్ర నాయకులు మరణించినట్లు ప్రకటించింది. అప్పట్లో ఈ సంస్థ ఈ దాడి చేసింది భారత ఆర్మీనేనని ఆరోపించింది. కానీ దీనిపై ఆనాడు కేంద్రం ఎలాంటి స్పష్టత ఇవ్వలేదు. నిజానికి ఇలాంటి ఒక సీక్రెట్ ఆపరేషన్ గురించి కేంద్రం ధ్రువీకరించడం చాలా అరుదుగా కనిపిస్తుంది. తాజాగా గణతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా కేంద్రం ప్రకటించిన శౌర్య చక్ర అవార్డుతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది.

భారత్‌లో ట్రేడ్ డీల్‌ను ట్రంప్, వాన్స్ అడ్డుకుంటున్నారు.. సెనెటర్ ఆడియో లీక్ కలకలం..
ఈయూ-భారత్ మధ్య ప్రతిష్టాత్మక వాణిజ్య ఒప్పందం దాదాపుగా ఖరారైంది. మరోవైపు, యూఎస్-ఇండియా ఒప్పందం మాత్రంపై రెండు దేశాలు సైలెంట్‌గా ఉన్నాయి. ఈ నేపథ్యంలో అమెరికన్ సెనెటర్ టెడ్ క్రూజ్‌కు సంబంధించిన లీకైన ఆడియో అమెరికా రాజకీయాల్లో కలకలం రేపుతోంది. ఈ ఆడియోలో భారత్-అమెరికా మధ్య సుదీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న వాణిజ్య ఒప్పందం ముందుకు సాగకుండా వైస్ ప్రెసిడెంట్ జేడీ వాన్స్, వైట్‌హౌజ్ ఆర్థిక సలహాదారు పీటర్ నవారోలు అడ్డుపడినట్లు ఆరోపించారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌పై విమర్శలు గుప్పించారు. ఈ ఆడియో 2025 ప్రారంభ, మధ్యకాలానికి సంబంధించిందిగా చెబుతున్నారు. దాదాపు 10 నిమిషాల రికార్డింగ్‌ను రిపబ్లికన్ సోర్సెస్ షేర్ చేసినట్లు ఆక్సియోస్ నివేదించింది. ప్రైవేట్ దాతలతో సంబాషణలో రికార్డయినట్లు చెప్పింది. ట్రంప్ తీసుకుంటున్న టారిఫ్ విధానాలు అమెరికా ఆర్థిక వ్యవస్థకు తీవ్ర నష్టం కలిగిస్తాయని క్రూజ్ హెచ్చరించారు. టారిఫ్‌ల కారణంగా రిటైర్మెంట్ ఖాతాల విలువ 30 శాతం పడిపోవచ్చని, కిరాణా ధరలు 10-20 శాతం పెరగొచ్చని, ఇదే జరిగితే రిపబ్లికన్లు ఎన్నికల్లో ఘోరంగా ఓడిపోవచ్చని ట్రంప్‌ను హెచ్చరించారు.

‘‘డ్రాగన్-ఏనుగు ఐక్యంగా ఉండాలి’’.. భారత్‌కు జిన్‌పింగ్ రిపబ్లిక్ డే సందేశం..
మిత్రుడు అనుకున్న అమెరికా భారత్‌పై సుంకాలతో విరుచుకుపడుతున్న వేళ, శత్రువుగా భావించే చైనా నుంచి భారత్‌కు హృదయపూర్వక సందేశం వచ్చింది. జి జిన్‌పింగ్ భారతదేశ గణతంత్ర దినోత్సవం సందర్భంగా శుభాకాంక్షలు చెప్పారు. ‘‘డ్రాగన్-ఏనుగు కలిసి నృత్యం చేయడం’’ రెండు దేశాలకు సరైన ఎంపిక అని ఆయన చెప్పారు. భారత్‌లో చైనా రాయబారి జు ఫీహాంగ్ కూడా ఇదే తరహా అభిప్రాయాన్ని వెల్లడించారు. ‘‘చైనా, భారత్ మంచి పొరుగు స్నేహితులు. భాగస్వాములుగా ఉండటం, ఒకరినొకరు విజయవంతం చేసుకోవడం, సహాయపడటం, డ్రాగన్-ఏనుగు టాంగో సరైన ఎంపిక’’ అని అన్నారు. 77వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా జిన్‌పింగ్ సోమవారం భారత అధ్యక్షురాలు ద్రౌపది ముర్ముకు శుభాకాంక్షలు తెలిపారు. భారత్-చైనాలు మంచి పొరుగుదేశాలుగా, స్నేహితులుగా అభివర్ణించారు. భారత్, చైనా సంబంధాల అభివృద్ధి రెండు దేశాల ప్రాథమిక ప్రయోజనాలకు అనుగుణంగా ఉందని, ప్రపంచశాంతి, శ్రేయస్సుకు గణనీయంగా దోహదపడుతుందని ఆయన అన్నారు. “సహకారం మరియు అభివృద్ధి అవకాశాల కోసం భాగస్వాములు” అనే ఏకాభిప్రాయానికి ఇరు దేశాలు కట్టుబడి ఉంటాయని, వ్యూహాత్మక సంభాషణల్ని బలోపేతం చేస్తామని, ఒకరి ఆందోళనల్ని మరొకరు పరిష్కరించుకుంటారని, చైనా-భారత్ సంబంధాల ఆరోగ్యకరమైన, స్థిరమైన అభివృద్ధిని ప్రోత్సహిస్తాయని జిన్‌పింగ్ ఆశాభావం వ్యక్తం చేశారు.

WhatsApp యూజర్లకు షాక్.. డబ్బులు కడితేనే వాట్సాప్ సేవలు..!
స్మార్ట్‌ ఫోన్‌ ఉంటే.. వాట్సాప్‌ ఉండాల్సిందే.. అలసు ఈ యాప్‌ లేని ఫోన్‌ ఉంటుందా? అనే స్థాయిలోకి తీసుకెళ్లింది ఈ యాప్‌.. తక్కువ కాలంలోనే ఎన్నో మార్పులు.. మరెన్నో అప్‌డేట్లు.. మెసేజ్‌, వాయిస్‌ కాలింగ్, వీడియో కాలింగ్.. గ్రూప్ కాలింగ్.. ఇలా ఎప్పటికప్పుడు ఎన్నో కీలక ఫీచర్స్‌ అందుబాటులోకి వచ్చాయి.. ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది ఉపయోగిస్తున్న ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సాప్ (WhatsApp) త్వరలో పెయిడ్ సబ్‌స్క్రిప్షన్ మోడల్‌ను ప్రవేశపెట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో వాట్సాప్ యూజర్లలో ఆందోళన నెలకొంది. రాబోయే రోజుల్లో వాట్సాప్ ఉపయోగించాలంటే వినియోగదారులు డబ్బులు చెల్లించాల్సి రావొచ్చన్న వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. కంపెనీ తన ప్లాట్‌ఫామ్‌లో ప్రకటన రహిత (Ad-Free) సబ్‌స్క్రిప్షన్ మోడల్‌ను పరీక్షిస్తున్నట్లు నివేదికలు చెబుతున్నాయి. నివేదికల ప్రకారం, వాట్సాప్ తాజా వెర్షన్ 2.26.3.9 కోడ్‌ను పరిశీలించినప్పుడు స్టేటస్ (Status) మరియు ఛానెల్స్ (Channels) విభాగాల్లో ప్రకటనలను తొలగించేందుకు ప్రత్యేక సబ్‌స్క్రిప్షన్ మోడల్‌కు సంబంధించిన కొత్త స్ట్రింగ్‌లు గుర్తించారు. ఇది కంపెనీ భవిష్యత్తులో పెయిడ్ ప్లాన్‌ను ప్రవేశపెట్టే ఆలోచనలో ఉందనే సంకేతంగా భావిస్తున్నారు. అయితే, ఈ విషయంపై ఇప్పటివరకు వాట్సాప్ లేదా మాతృసంస్థ మెటా (Meta) నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు.

మీరు OTT ప్రియులైతే ఈ Jio ప్లాన్లు ఖచ్చితంగా నచ్చుతాయి.. కేవలం రూ.175కే 10 OTT సేవలు
దేశంలో అతిపెద్ద టెలికాం సర్వీస్ ప్రొవైడర్ అయిన జియో, కస్టమర్లకు కాలింగ్ నుండి మెసేజింగ్, డేటా వరకు ప్రయోజనాలను అందించే వివిధ రకాల ప్లాన్‌లను అందిస్తుంది. జియో మల్టీ OTT ప్రయోజనాలను అందించే అనేక ప్లాన్‌లను కూడా అందిస్తుంది. యూజర్లు ఒకే ప్లాన్‌లో వివిధ రకాల OTT సేవలను ఆస్వాదించడానికి వీలు కల్పిస్తుంది. అతి తక్కువ ధర గల ప్లాన్ ధర రూ. 175. జియో రూ. 175 ప్రీపెయిడ్ ప్లాన్ అనేది 28 రోజుల డేటా వోచర్, ఇందులో 10GB హై-స్పీడ్ డేటా, JioTV యాప్ ద్వారా 12 ప్రీమియం OTT అప్లికేషన్‌లకు యాక్సెస్ ఉంటాయి. యాడ్-ఆన్ ప్యాక్‌గా రూపొందించిన దీనికి అపరిమిత వాయిస్ కాలింగ్ పొందడానికి యాక్టివ్ బేస్ ప్లాన్ అవసరం. ఈ ప్లాన్‌లో చేర్చబడిన OTT యాప్‌లలో సోనీ లివ్, జీ5, జియో టీవీ, లయన్స్‌గేట్ ప్లే, డిస్కవరీ+, సన్ఎన్‌ఎక్స్‌టి, కాంచ లంక, ప్లానెట్ మరాఠీ, చౌపాల్, హోయిచోయ్ ఉన్నాయి. వీటిలో 10 యాప్‌లు ఉన్నాయి. జియో రూ.445 ప్రీపెయిడ్ ప్లాన్ 28 రోజుల చెల్లుబాటుతో రోజుకు 2GB డేటా, అపరిమిత వాయిస్ కాల్స్, రోజుకు 100 SMSలతో వస్తుంది. ఇందులో 10 కి పైగా OTT ప్లాట్‌ఫామ్‌లకు (సోనీ లివ్, జీ5, జియో టీవీతో సహా) ఉచిత యాక్సెస్, జియోటీవీ ద్వారా అపరిమిత 5G డేటా కూడా ఉన్నాయి. ఇది డేటా ప్లాన్, జియో స్పెషల్ ఆఫర్ ప్రయోజనాలను కూడా అందిస్తుంది. ఇందులో సోనీ లివ్, జీ5, జియో టీవీ, లయన్స్‌గేట్ ప్లే, డిస్కవరీ+, సన్ఎన్‌ఎక్స్‌టి, కాంచ లంక, ప్లానెట్ మరాఠీ, చౌపాల్, ఫన్‌కోడ్, హోయిచోయ్‌లకు యాక్సెస్ ఉంటుంది. ఇది 18 నెలల పాటు గూగుల్ జెమిని ప్రో ప్లాన్ ప్రయోజనాలను కూడా అందిస్తుంది.

దాయాదుల మధ్య పోరుకు ఈ రోజు పాకిస్థాన్‌లో హైప్రొఫైల్ మీటింగ్..
టోర్నమెంట్ ఏమైనా, వేదిక ఏదైనా అందులో ఇండియా – పాకిస్థాన్ తలపడుతున్నాయంటే అది హై ఓల్టేజ్ మ్యాచ్ అవుతుంది. క్రికెట్ ప్రేమికులు ఎంతగానో ఆసక్తిగా ఎదురు చూస్తున్న T20 ప్రపంచ కప్‌లో పాకిస్థాన్ ఎంట్రీ ఇస్తుందా లేదా అనే చర్చపై ఈరోజు ముగింపు వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే ఈ రోజు సాయంత్రం పాకిస్థాన్ ప్రధాన మంత్రి షెహబాజ్ షరీఫ్‌తో పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (PCB) ఛైర్మన్ మొహ్సిన్ నఖ్వీ ఒక ముఖ్యమైన సమావేశం నిర్వహిస్తారని, ఆ తర్వాత T20 ప్రపంచ కప్‌లో పాక్ పాల్గొంటుందా లేదా అనే దానిపై నిర్ణయం తీసుకోవచ్చని పలు వర్గాలు తెలిపాయి. ఈ సమావేశం చాలా ముఖ్యమైనది, ఎందుకంటే ఈ టోర్నమెంట్‌లో పాకిస్థాన్ జట్టు పర్యటనపై తుది నిర్ణయం PCB తీసుకోదని, పాకిస్థాన్ ప్రభుత్వం తీసుకుంటుందని నఖ్వీ ఇప్పటికే స్పష్టం చేశారు. నిజానికి ఆదివారం పీసీబీ T20 ప్రపంచ కప్‌లో పాల్గొనే 15 మంది సభ్యుల పాక్ జట్టును ప్రకటించింది. కానీ ఆ ప్రకటనను టోర్నమెంట్‌లో పాక్ జట్టు పాల్గొనడాన్ని ధృవీకరించినట్లుగా భావించకూడదని పీసీబీ ఛైర్మన్ తేల్చిచెప్పారు. లాహోర్‌లో ఆటగాళ్లు, ప్రధాన కోచ్ మైక్ హెస్సన్‌తో జరిగిన క్లోజ్డ్ డోర్ సమావేశంలో నఖ్వీ బోర్డు వైఖరిని స్పష్టం చేసినట్లు సమాచారం. నఖ్వీ మాట్లాడుతూ.. “మేము ప్రభుత్వ సలహా కోసం ఎదురు చూస్తున్నాము. ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకున్నా, మేము దానిని అనుసరిస్తాము. వారు మమ్మల్ని ప్రపంచ కప్‌లో పాల్గొనకూడదనుకుంటే, మేము వెళ్లము” అని ఆయన అన్నారు. ఈ ప్రకటనతో PCB బంతిని ప్రభుత్వ కోర్టులో పెట్టిందని స్పష్టం చేసింది.

ఆ ‘ద’ ఎక్కడికి పోయింది? దేవరకొండా?
రాహుల్ సాంకృత్యాన్ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ హీరోగా మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రం అనౌన్స్‌మెంట్ నుండే భారీ అంచనాలను పెంచేస్తోంది. ఇదిలా ఉండగా విజయ్ గత చిత్రం ‘ఖుషి’ పోస్టర్‌కి, తాజా VD14 పోస్టర్‌కి మధ్య ఒక చిన్న మార్పును గమనించిన అభిమానులు సోషల్ మీడియాలో రచ్చ చేస్తున్నారు. ఆ మార్పు విజయ్ ఇమేజ్‌లో వచ్చిన ఎదుగుదలను సూచిస్తోందని నెటిజన్లు భావిస్తున్నారు. విజయ్ దేవరకొండ ఖుషి సినిమా టైటిల్ కార్డులో అలాగే పోస్టర్లలో “THE Vijay Deverakonda” అని ఉంటుంది. ఇది విజయ్ ఒక బ్రాండ్‌గా ఎదిగిన తీరుకు నిదర్శనంగా అప్పట్లో ఆయన ఫ్యాన్స్ చెప్పుకునేవారు. ‘ఖుషి’ పోస్టర్‌లో కూడా మనం ఇదే గమనించవచ్చు. అయితే, తాజాగా విడుదలైన VD14 పోస్టర్‌లో మాత్రం కేవలం “VIJAY DEVERAKONDA” అని మాత్రమే ఉంది. ‘THE’ అనే పదాన్ని తీసివేయడం ఇప్పుడు కొత్త చర్చకు దారి తీసింది. ఇదే విషయాన్ని గమనించిన ఓ నేటిజన్ ఆ రెండు పోస్టర్లు షేర్ చేసి రెండిటి మధ్య తేడా ఏంటి అని అడిగితే విజయ్ దేవరకొండ మాత్రం తెలివిగా స్పందిస్తూ.. “Double The Scale.. Bigger The Responsibility.. Stronger The Force” (రెట్టింపు స్థాయి.. అంతకు మించిన బాధ్యత.. మరింత శక్తివంతమైన బలం) అంటూ పేర్కొన్నారు. ఒక కథ తన ఆత్మను, హృదయాన్ని డిమాండ్ చేసినప్పుడు ఇలాంటి మార్పులు సహజమని ఆయన అభిప్రాయపడ్డారు. ఈ చిత్రం 19వ శతాబ్దం నాటి కథా నేపథ్యంతో సాగే ఒక అడ్వెంచర్ డ్రామా అని తెలుస్తోంది.

రేంజ్ రోవర్ వెనుక అసలు రహస్యం ఇదే: చిరంజీవి-అనిల్ రావిపూడి నెక్స్ట్ మూవీ ఫిక్స్!
మెగాస్టార్ చిరంజీవి, సక్సెస్ ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి కాంబినేషన్ అంటేనే వినోదానికి గ్యారెంటీ అని ఇటీవలే వీరిద్దరి కలయికలో వచ్చిన ‘మన శంకర వరప్రసాద్ గారు’ నిరూపించింది. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపించడమే కాకుండా, విమర్శకుల ప్రశంసలు కూడా అందుకుంది. సంక్రాంతి కానుకగా విడుదలైన ఈ సినిమా ఇప్పటికే రూ. 350 కోట్లకు పైగా వసూళ్లు సాధించి ఇండస్ట్రీ రికార్డులను తిరగరాస్తోంది. ఈ భారీ విజయం ఇచ్చిన ఉత్సాహంతో, మెగాస్టార్ చిరంజీవి, అనిల్ రావిపూడి మరోసారి మరో ఫ్యామిలీ ఎంటర్టైనర్ చేయనున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి. వీరిద్దరి మధ్య కుదిరిన బాండింగ్, సినిమా ఫలితం పట్ల మెగాస్టార్ ఎంతో సంతోషంగా ఉన్నారు. చిరంజీవి సాధారణంగా కమర్షియల్ హంగులతో కూడిన సినిమాలకు ప్రాధాన్యత ఇస్తారు మరోపక్క అనిల్ రావిపూడి తన చిత్రాల్లో కామెడీని, ఫ్యామిలీ ఎమోషన్స్‌ను పండించడంలో దిట్ట. ‘మన శంకర వరప్రసాద్ గారు’ చిత్రంలో చిరుని సరికొత్త కామెడీ టైమింగ్‌తో చూపించి ఫ్యాన్స్‌కు పసందైన వినోదాన్ని అందించారు, ఆ మ్యాజిక్‌ను రిపీట్ చేసేందుకు మరో ఫ్యామిలీ ఎంటర్టైనర్ కథపై చర్చలు జరుగుతున్నట్లు సమాచారం. ఈ సినిమా సక్సెస్ చూసి ముగ్ధుడైన చిరంజీవి, దర్శకుడు అనిల్ రావిపూడికి ఇటీవలే ఒక ఖరీదైన రేంజ్ రోవర్ స్పోర్ట్ కారును బహుమతిగా ఇచ్చారు. అలాగే అనిల్ రావిపూడి ఇప్పటికే ఒక లైన్ చిరంజీవికి వినిపించినట్లు, అది మెగాస్టార్‌కు బాగా నచ్చిందని ఇండస్ట్రీ వర్గాల్లో టాక్. ప్రస్తుతం చిరంజీవి బాబీ కోల్లి దర్శకత్వంలో రాబోయే సినిమాతో బిజీగా ఉన్నారు. ఈ ప్రాజెక్ట్స్ పూర్తయిన తర్వాత అనిల్ రావిపూడి సినిమా పట్టాలెక్కే అవకాశం ఉంది, అనిల్ రావిపూడి మార్క్ కామెడీకి మెగాస్టార్ గ్రేస్ తోడైతే థియేటర్లలో నవ్వుల పూత పూయడం ఖాయం. ‘మన శంకర వరప్రసాద్ గారు’ అందించిన జోష్‌ను కొనసాగిస్తూ రాబోయే ఈ క్రేజీ కాంబో కోసం అభిమానులు అప్పుడే ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

Exit mobile version