NTV Telugu Site icon

Top Headlines @ 5 PM: టాప్‌ న్యూస్‌

Top Headlines @ 5 Pm New

Top Headlines @ 5 Pm New

బలహీనపడిన అల్పపీడనం.. ఏపీ వ్యాప్తంగా వర్షాలు..
ఆంధ్రప్రదేశ్‌లో రాష్ట్రవ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి.. ఇక, హైదరాబాద్‌ సహా తెలంగాణలోనూ పలు ప్రాంతాల్లో మోస్తరు వర్షాలు.. కొన్ని చోట్ల ముసురు పడుతోంది.. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం.. తీవ్ర అల్పపీడనంగా మారిన విషయం విదితమే కాగా.. ఆ తీవ్ర అల్పపీడనం ఈరోజు ఉదయం అల్పపీడనంగా బలహీనపడింది.. ఇక, అల్పపీడనం మరింత బలహీన పడి ఉపరితల ఆవర్తనం కొనసాగుతుంది.. దీని ప్రభావంతో కోస్తా తీరం వెంబడి బలమైన ఈదురు గాలులు వీస్తున్నాయి.. గంటకు 65 కిలోమీటర్ల వేగంతో బలమైన గాలులు వీస్తున్నాయి.. మరోవైపు ఆంధ్రప్రదేశ్‌లో అన్ని పోర్టులకు 3వ నంబర్‌ ప్రమాద హెచ్చరికలు కొనసాగుతున్నాయి.. ఈ సమయంలో మత్స్యకారులు సముద్రంలోకి వేటకు వెళ్లరాదని వాతావరణశాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు.. ఇక, రాష్ట్ర వ్యాప్తంగా మోస్తారు వర్షాలు కురుస్తుండగా.. నెల్లూరు జిల్లాలో భారీ వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ అధికారులు వెల్లడించారు..

జనసేన వినూత్న నిరసన.. జూదం, గుండాట, పేకాట మాకొద్దు..!
జూదం, గుండాట, పేకాట మాకొద్దు అంటూ జనసేన వినూత్న నిరసన చేపట్టింది.. కృష్ణా జిల్లా బాపులపాడు మండలం అంపాపురం పంచాయతీ పరిధిలో బాపులపాడు జనసేన మండల కార్యదర్శి కందుకూరి శ్రీధర్ ఆధ్వర్యంలో మూడురోజుల పాటు ఈ నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.. ఈ సందర్భంగా శ్రీధర్ మాట్లాడుతూ.. అంపాపురం గ్రామంలో సంక్రాంతి పండుగను పురస్కరించుకుని సంప్రదాయకంగా జరగవలసిన ఆటల పోటీలను కలుషితం చేస్తున్నారని.. సంక్రాంతి పండగను అడ్డం పెట్టుకుని గుండాట, పేకాట, కోళ్లకు కత్తులు కట్టి హింసాత్మక వాతావరణం సృష్టిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.. ఇక్కడ కొన్ని కోట్లలో బెట్టింగులు జరుగుతాయి. మా అప్పాపురం గ్రామంలో జరుగుతున్న ఈ హింసాత్మక ఆటలకు ఇతర రాష్ట్రాల నుంచి కూడా లక్షల్లో మందెపు రాయుళ్లు, నేర చరిత్రగలవారు వస్తుంటారని విమర్శించారు. మా అంపాపురం గ్రామం జాతీయ రహదారి వెంబడి ఉండటం వలన జూదం ఆడేందుకు వేళల్లో కార్లు, బైకుల్లో వచ్చి జాతీయ రహదారిపై భారీగా 10 కిలోమీటర్ల మేర ట్రాఫిక్‌కు అంతరాయం కలగిస్తున్నారని మండిపడ్డారు శ్రీధర్‌.. సామాన్య ప్రజలకు ఎటువంటి ఇబ్బంది కలుగకుండా చర్యలు తీసుకోవాలని.. చుట్టూ ఉన్న పంట పొలాల్లో మద్యం సేవించి మద్యం బాటిళ్లు పగలగొట్టి పొలాలలోకి విసరిస్తున్నారు, దీనివల్ల రైతులు తీవ్ర ఇబ్బందులకు గురవతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

మరోసారి రోజా సంచలన వ్యాఖ్యలు.. తప్పులు చేసి ఓడిపోలేదు..!
మాజీ మంత్రి, వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ కీలక నేత ఆర్కే రోజా మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు.. ఓవైపు తప్పులు చేసి మనం ఓడిపోలేదు అని పార్టీ శ్రేణులకు ధైర్యం చెబుతూనే.. మరోవైపు కూటమి ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు రోజా.. జైల్లో పెడతావా..? పెట్టుకో.. కేసులు పెడతావా? పెట్టుకో.. ఉద్యోగాలు తీసేస్తావా తీసేసెయ్..! మళ్లీ మా ప్రభుత్వం వస్తుంది.. వడ్డీతో సహా తిరిగి ఇస్తామని హెచ్చరించారు.. ఇక, కూటమి ప్రభుత్వ హయాంలో ఇబ్బందులు పడ్డ కార్యకర్తల పేర్లను గుడ్ బుక్‌లో రాసి పెట్టుకుంటాం.. వారిని గుర్తుపెట్టుకుంటామని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఉద్యోగస్తులందరూ ఎగిరెగిరి పడ్డారు.. మన ప్రభుత్వాన్ని దించేంతవరకు ఉద్యోగులందరూ కంకణం కట్టుకొని పనిచేశారు.. ఇప్పుడు ఉద్యోగస్తులు అందరూ నరకయాతన అనుభవిస్తున్నారని వ్యాఖ్యానించారు ఆర్కే రోజా.. ఇక, పవన్ కల్యాణ్‌కు, చంద్రబాబుకు, లోకేష్ కు మాత్రమే ఉద్యోగాలు వచ్చాయి.. ఏపీ యువతకు ఉద్యోగాలు రాలేదన్న ఆమె.. మనం తప్పులు చేసి ఓడిపోలేదు‌.. ఆరు నెలల్లోనే కూటమి ప్రభుత్వం ఆలీబాబా ఆరడజను దోంగల్లా మారిందని విమర్శించారు.. ఏపీ ప్రజలకు నరకం అంటే ఎంటో కూటమి ప్రభుత్వం చూపిస్తుందన్నారు.. జగన్‌ను ఓడించి తప్పుచేశామని ప్రజలు కన్నీళ్లు పెట్టుకుంటున్నారు.. పశ్చాత్తాప పడుతున్నారని వ్యాఖ్యానించారు.. సంపద సృష్టిస్తా అని చెప్పి అప్పుల మీద అప్పులు చంద్రబాబు సృష్టిస్తున్నారు… ఎన్నికల ప్రచారంలో పచ్చ చొక్కాలు వేసుకుని, పచ్చ చీరలు కట్టుకుని నీకు 15 వేలు నీకు 15 వేలు అంటూ అబద్దాలు చెప్పారని మండిపడ్డారు.. జగన్ బిజినెస్ మాన్ గా, పార్టీ అధినేతగా, ఫ్యామిలీ మెన్ గా సక్సెస్ అయిన వ్యక్తిగా అభివర్ణించారు ఆర్కే రోజా..

రూ.300 కోసం ఘర్షణ.. ఒకరు మృతి
డబ్బుల కోసం, ఆస్తుల కోసం ఘర్షణలు అనేది చాలా చిన్న విషయంగా మారిపోయింది.. బంధాలు, బంధుత్వాలు తర్వాత.. ముందు పైసలే కావాలి అనేలా పరిస్థితులు తయారయ్యాయి.. డబ్బుల కోసం అయినవారు.. బయటివారు అనే తేడా లేకుండా.. దాడులు, ప్రతిదాడులు.. కొన్నిసార్లు ప్రాణాలు తీసుకునేంత వరకు వెళ్తున్నారు.. చివరకు 10 రూపాయలు, వంద రూపాయలకు కూడా ప్రాణాలు పోయిన ఘటనలు కొన్ని చోటు చేసుకున్న విషయం విదితమే కాగా.. ఇప్పుడు 300 రూపాయల కోసం ఒక ప్రాణం తీసిన ఘటన కృష్ణా జిల్లాలో జరిగింది.. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళ్తే.. కృష్ణా జిల్లా పామర్రు మండలం చాట్లవానిపురంలో ఈ నెల 20వ తేదీన ఇరువురు వ్యక్తుల మధ్య రూ.300 విషయమై ఘర్షణ జరిగింది.. అదికాస్తా దాడికి దారిసింతి.. చాట్ల సతీష్ (27) పై కర్రతో దాడి చేశాడు వెంకటేశ్వరావు అనే వ్యక్తి.. ఈ ఘటనలో తీవ్రగాయాలపాలయ్యారు చాట్ల సతీష్.. దీంతో, అతడిని ఆస్పత్రికి తరలించారు స్థానికులు.. కానీ, విజయవాడ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ నిన్న రాత్రి సతీష్ మృతి చెందాడు.. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.. అయితే, నిందితుడు వెంకటేశ్వరరావు పరార్ కావడంతో.. అతడి కోసం ప్రత్యేక బృందాలతో గాలింపు చర్యలు చేపట్టారు పోలీసులు..

పట్నం నరేందర్ రెడ్డికి ఐజీ వార్నింగ్.. బెయిల్ రద్దుకు సిఫారసు చేస్తాం
వికారాబాద్ జిల్లా పరిగి సీఐ కార్యాలయంలో ఐజీ సత్యనారాయణ మీడియా సమావేశం నిర్వహించారు. నిన్న కొడంగల్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి పరిగిలో ప్రెస్ మీట్ నిర్వహించడంపై ఐజీ స్పందించి ఫైరయ్యారు. పట్నం నరేందర్ రెడ్డి కండిషన్ బెయిల్ పై ఉండి విచారణను ప్రభావితం చేసే విధంగా ప్రెస్ మీట్ పెట్టడం సరి కాదని తెలిపారు. బెయిల్ రద్దుకు సిఫారసు చేస్తామని ఐజీ సత్యనారాయణ హెచ్చరించారు. ఫార్మా భూ సేకరణ విషయంలో నరేందర్ రెడ్డిని అరెస్టు చేయలేదు.. పోలీస్ నిఘా వైఫల్యం అనడం సరికాదని పేర్కొన్నారు. లగచర్లలో 230 మంది పోలీసులను బందోబస్తుగా ఏర్పాటు చేశామని ఐజీ తెలిపారు. సురేష్ అనే వ్యక్తి పథకం ప్రకారమే కావాలని కలెక్టర్‌ను గ్రామంలోకి తీసుకువెళ్లాడు.. కలెక్టర్ పై దాడి చేసినందుకే అరెస్టు చేశామని ఐజీ చెప్పారు. ఎవరిని కూడా కొట్టలేదు.. రెండు నుంచి మూడు విడతలుగా దాడి చేసిన వ్యక్తులను పట్టుకున్నామని.. సంబంధం లేని వ్యక్తులను వదిలేశామన్నారు ఐజీ సత్యనారాయణ. ప్రెస్‌మీట్‌లో అవాస్తవాలు చెప్పడం మానేయాలని తెలిపారు. ఏ ప్రభుత్వం రైతులకు బేడీలు వేయమని చెప్పదన్నారు. సురేష్ వాయిస్ రికార్డ్ తమ దగ్గర ఉందని.. అతనే మొత్తం ప్లాన్ చేసిందని వెల్లడించారు. టైం వచ్చినప్పుడు బయట పెడతాం.. పట్నం నరేందర్ రెడ్డి సురేష్ విచారణలో అసలు సహకరించడం లేదని ఐజీ సత్యనారాయణ పేర్కొన్నారు. పట్నం నరేందర్ రెడ్డి ఫోన్ పాస్‌వర్డ్ చెప్పమంటే చెప్పడం లేదని ఐజీ తెలిపారు.

రాజన్న ఆలయ ఆవరణలో అన్యమత ప్రచారం.. అధికారుల పొంతన లేని సమాధానం
వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయ ఆవరణలో అన్యమత ప్రచారంపై అధికారులు పొంతన లేని సమాధానం చెబుతున్నారు. బుధవారం గుర్తుతెలియని వ్యక్తులు తమ పుట్టిన రోజులతో పాటు క్రిస్మస్ వేడుకల సందర్భంగా ఆలయ పరిసరాల్లో ఉండే యాచకులకు, నిరాశ్రయులకు మాంసాహారంతో కూడిన ఆహార ప్యాకెట్లను పంపిణీ చేశారు. అయితే ఆలయ పరిసరాల్లోకి మాంసాహారం తీసుకు వెళ్ళొద్దనే నిబంధనలు ఉన్నప్పటికీ నిబంధనలకు విరుద్ధంగా ప్రధాన ఆలయం సమీపంలోనికి వెళ్లి మాంసాహారంతో కూడిన ఆహారం పంపిణీ చేయడం తీవ్ర విమర్శలకు దారి తీసింది. విషయం తెలుసుకున్న స్థానిక బిజెపి నాయకులు సంఘటన స్థలానికి చేరుకుని మాంసహారంతో కూడిన పాకెట్లను స్వాధీనం చేసుకొని స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలో.. ఆలయ అధికారులు ఒక మాట.. పోలీసులు మరో మాట చెబుతున్నారు. ఒకరికొకరు పొంతన లేని సమాధానం చెబుతున్నారు. అన్యమతస్తులు ఓ మతంకి చెందిన ఫోటో ఉన్న బిర్యానీ ప్యాకెట్స్ పంపిణీ చేశారని ఆలయ ఏఈఓ శ్రావణ్ తెలిపారు. ఈ అంశంపై పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేస్తాం.. ఉదయమే అన్యమతస్తులు బిర్యానీ పంపిణీ చేయడంపై ఆలయ సంప్రోక్షణ చేశామన్నారు. మరోవైపు.. జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ మాట్లాడుతూ, మత ప్రచారం జరుగలేదని.. పుట్టినరోజు సందర్భంగా కేవలం బిర్యానీ ప్యాకెట్లు పంపిణీ చేశారని తెలిపారు. బిక్షాటన చేసే వారికి బిర్యానీ ఇచ్చారని ఎస్పీ పేర్కొన్నారు.

ఢిల్లీలో టూర్‌లో షిండే ఫ్యామిలీ.. మోడీ, నడ్డా, అమిత్ షాతో భేటీ
మహారాష్ట్ర డిప్యూటీ సీఎం, శివసేన అధినేత ఏక్‌నాథ్ షిండే ఢిల్లీ పర్యటనలో ఉన్నారు. కుమారుడు, ఎంపీ శ్రీకాంత్ షిండే, కోడలు వృషాలి షిండేతో కలిసి ఢిల్లీలో పర్యటిస్తున్నారు. హస్తిన పర్యటనలో హైకమాండ్ పెద్దలను కలుస్తున్నారు. గురువారం ప్రధాని మోడీ, బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా, కేంద్ర హోంమంత్రి అమిత్ షాను షిండే కలిశారు. మహారాష్ట్రలో సంకీర్ణ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత షిండే తొలి ఢిల్లీ పర్యటన ఇదే. ఇటీవల మంత్రివర్గ విస్తరణ సమయంలో దేవేంద్ర ఫడ్నవిస్, అజిత్ పవార్ ఢిల్లీలో పర్యటించినా.. షిండే మాత్రం హస్తినకు వెళ్లలేదు. తాజాగా కుటుంబంతో కలిపి ఢిల్లీలో పర్యటిస్తున్నారు. భేటీ అనంతరం షిండే మీడియాతో మాట్లాడారు. మహారాష్ట్రలో ప్రభుత్వం ఏర్పడి.. మంత్రివర్గ విస్తరణ తర్వాత ప్రధానమంత్రిని కలిసినట్లు తెలిపారు. రాష్ట్ర అభివృద్ధి కోసం, పార్టీ విజయానికి చేసిన కృషిపై ప్రధాని మోడీ అభినందించినట్లు తెలిపారు. ఫడ్నవిస్, అజిత్ పవార్‌తో కలిసి రాష్ట్రాభివృద్ధికి వ్యూహాన్ని రూపొందిస్తామని వెల్లడించారు. దీనిపై ప్రధాని మోడీతో కూడా చర్చించినట్లు పేర్కొన్నారు. శ్రీకాంత్ షిండే మహారాష్ట్రలోని కళ్యాణ్ స్థానం నుంచి లోక్‌సభ ఎంపీగా ఉన్నారు. శ్రీకాంత్ షిండే భార్య వృశాలి షిండే కూడా ఢిల్లీ టూర్‌లో ఉన్నారు. ముగ్గురు అగ్ర నేతలను వరుసగా కలిశారు.

మోహన్ భగవత్ వ్యాఖ్యలతో విభేదించిన ఆర్ఎస్ఎస్ పత్రిక..
మందిర్-మసీద్ వివాదాలపై ఇటీవల ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ కీలక వ్యాఖ్యలు చేశారు. దేశంలో పలు మసీదుల విషయం వివాదాస్పదం కావడంపై ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. సంభాల్ షాహీ జామా మసీదు వివాదం, అజ్మీర్ దర్గా వివాదం నేపథ్యంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేసినట్లు తెలుస్తోంది. దేవాలయాలను కూల్చి మసీదులు నిర్మించారని ఆరోపిస్తూ కోర్టులో పలు పిటిషన్లు దాఖలయ్యాయి. అయితే, కొత్త దేవాలయాలు-మసీదు వ్యాజ్యాలను తాత్కాలికంగా నిలిపివేయాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. అయితే, మోహన్ భగవత్ వ్యాఖ్యల్ని ఆర్ఎస్ఎస్ పత్రిక ‘‘ది ఆర్గనైజర్’’ వ్యతిరేకించింది. “నాగరిక న్యాయం” కోసం వివాదాస్పద స్థలాలు, నిర్మాణాల వాస్తవ చరిత్రను తెలుసుకోవడం చాలా ముఖ్యమని తన వైఖరిని తెలియజేసింది. ఆర్గనైజర్ తాజా ఎడిషన్‌లో ఉత్తర్ ప్రదేశ్‌లోని సంభాల్ మసీదు వివాదం గురించి కవర్ స్టోరీని అందించింది. షాహీ జామా మసీదు ఒకప్పుడు ఆలయమని ప్రస్తావించింది. చారిత్రాత్మకంగా ఆక్రమించబడిన లేదా కూల్చివేయబడిన మతపరమైన ప్రదేశాలకు సంబంధించిన సత్యాన్ని అర్థం చేసుకోవడం చాలా కీలకమని వాదించింది.

ప్రాణాపాయ స్థితిలో సిరియా మాజీ అధ్యక్షుడి భార్య అస్మా.. చేతులెత్తేసిన వైద్యులు!
సిరియా మాజీ అధ్యక్షుడు అసద్ భార్య అస్మా మరణపు అంచుల్లో ఉన్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం ఆమె తీవ్రమైన కేన్సర్ వ్యాధితో బాధపడుతున్నట్లు అంతర్జాతీయ మీడియా పేర్కొంది. ఇక వైద్యులు కూడా చేతులెత్తేసినట్లు తెలుస్తోంది. కేవలం 50-50 శాతమే అస్మా బతికే అవకాశాలు ఉన్నట్లు వైద్యులు పేర్కొన్నారు. అస్మా లుకేమియాతో పోరాడుతున్నారు. అస్మా తొలుత 2019లో రొమ్ము కేన్సర్‌తో పోరాడారు. ఒక సంవత్సరం చికిత్స తర్వాత విజయం సాధించారు. కేన్సర్ రహిత పేషెంట్‌గా వైద్యులు వెల్లడించారు. రొమ్ము కేన్సర్ నుంచి ఉపశమనం పొందిన కొద్ది రోజుల తర్వాత బ్లడ్ కేన్సర్ బయటపడింది. దీంతో ఆమె పరిస్థితి మరింత విషమంగా మారింది. ప్రస్తుతం బ్లడ్ కేన్సర్ తీవ్ర స్థాయికి వెళ్లినట్లు సమాచారం. వైద్యులు చికిత్స అందిస్తున్నా.. 50 శాతమే బతికే అవకాశం ఉన్నట్లు పేర్కొన్నారు. ఇటీవల సిరియా తిరుగుబాటుదారుల చేతుల్లోకి వెళ్లిపోయింది. దీంతో అధ్యక్షుడు అసద్ కుటుంబం రష్యాకు పారిపోయింది. రాజకీయ శరణార్థిగా జీవితం గడుపుతున్నారు. అయితే అస్మాకు రష్యాలో ఉండడం ఏ మాత్రం ఇష్టం లేదు. అస్మా.. బ్రిటీష్ పౌరురాలు. దీంతో ఆమె.. భర్త అసద్‌కు విడాకులు ఇచ్చి.. పిల్లలతో కలిసి సొంత దేశమైన యూకేకు వెళ్లిపోవాలని ఆమె నిర్ణయం తీసుకున్నట్లు వార్తలు వినిపించాయి. యూకేలోనే చికిత్స తీసుకోవాలని భావించినట్లు సమాచారం. అయితే ఈ వార్తలను బ్రిటీష్ పీఎంవో ఖండించింది. అస్మా యూకేకు రాలేదని తేల్చి చెప్పింది. దేశం విడిచి వెళ్లేందుకు ప్రత్యేక అనుమతి కోరుతూ అస్మా రష్యా కోర్టును ఆశ్రయించినట్లు తెలుస్తోంది. ఈ అప్లికేషన్ ప్రస్తుతం రష్యన్ అధికారుల సమీక్షలో ఉంది.

పామును పెంచిన పాకిస్తాన్.. దాడికి సిద్ధమైన 15,000 మంది తాలిబన్ ఫైటర్స్..
2011లో అమెరికా విదేశాంగమంత్రి హిల్లరీ క్లింటన్ మాట్లాడుతూ.. మన పెరట్లో పాముల్ని పెంచుకుని, అవి పొరుగువారిని మాత్రమే కాటేయాలని ఆశించడం అవివేకం అవుతుందని పాకిస్తాన్‌ని ఉద్దేశించి అన్నారు. సరిగ్గా ఇలాంటి పరిస్థితిన పాకిస్తాన్ ఎదుర్కొంటోంది. తాను పెంచి పోషించిన తాలిబన్లు ఇప్పుడు ఆ దేశాన్ని వణికిస్తున్నారు. రెండు రోజుల క్రితం పాకిస్తాన్ వైమానిక దళం ‘‘తెహ్రీక్-ఇ-తాలిబాన్ పాకిస్తాన్ (TTP)’’ని టార్గెట్ చేస్తూ ఆఫ్ఘనిస్తాన్‌లోని పలు ప్రాంతాలపై దాడులు చేసింది. ఈ దాడుల్లో 40కి పైగా ప్రజలు చనిపోయినట్లు తాలిబన్లు తెలిపారు. తప్పకుండా ప్రతీకారం ఉంటుందని పాక్‌ని హెచ్చరించారు. ఈ దాడి నేపథ్యంలో ప్రతీకారం తీర్చుకునేందుకు ఆఫ్ఘనిస్తాన్‌ని పాలిస్తున్న తాలిబన్లు సిద్ధమైనట్లు తెలుస్తోంది. నివేదిక ప్రకారం.. 15000 మంది తాలిబన్ ఫైటర్ల పాకిస్తాన్ సరిహద్దు వైపు మార్చ్ చేస్తున్నారు. ఆఫ్ఘన్‌లో అధికారాన్ని తాలిబన్లు చేజిక్కించుకున్న తర్వాత పాక్ తాలిబన్లు రెచ్చిపోతున్నారు. పాకిస్తాన్‌లోని ఖైబర్ ఫఖ్తుంఖ్వా ప్రావిన్సుల్లో పాక్ ఆర్మీ, పోలీసులు లక్ష్యంగా దాడులు చేస్తున్నారు. పాకిస్తాన్ పెంచి పోషించిన తాలిబన్లకే ఇప్పుడు ఆ దేశం బలవుతోంది. గతంలో తాలిబన్లు ఆఫ్ఘనిస్తాన్‌ని చేజిక్కించుకున్న తరుణంలో అప్పటి పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ వారిని ‘‘వరం’’గా కొనియాడారు.

ముగిసిన నాల్గవ టెస్టు మొదటిరోజు ఆట.. ఆధిపత్యం చెలాయించిన ఆస్ట్రేలియా?
మెల్‌బోర్న్‌లో భారత్, ఆస్ట్రేలియా మధ్య ఐదు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌లో నాల్గవ మ్యాచ్ జరుగుతోంది. ఈ బాక్సింగ్ డే టెస్టు మ్యాచ్‌లో తొలి రోజు ఆస్ట్రేలియా ఆధిపత్యం కనిపించింది. అయితే, మరోవైపు భారత్‌కు 6 వికెట్లు లభించాయి కూడా. అయితే, నలుగురు బ్యాట్స్‌మెన్‌ల హాఫ్ సెంచరీలతో ఆస్ట్రేలియా 311 పరుగులు చేసింది. ఆస్ట్రేలియాకు శామ్‌ కాన్‌స్టాస్‌, ఉస్మాన్‌ ఖవాజా గట్టి ఆరంభాన్ని అందించారు. కొంటాస్ 60 పరుగుల ఇన్నింగ్స్, ఉస్మాన్ ఖవాజా 57 పరుగులు చేసి ఔటయ్యారు. ఆ తర్వాత మార్నస్ లాబుషాగ్నే 72 పరుగులు వద్ద అవుట్ అవ్వగా.. ఆస్ట్రేలియా స్టార్ బ్యాట్సమెన్ స్టీవెన్ స్మిత్ 68 పరుగులతో క్రీజ్ లో కొనసాగుతున్నాడు. ఇక ప్రస్తుత బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ మూడు టెస్టుల మ్యాచ్‌ల తర్వాత సిరీస్‌ 1-1తో సమమైంది. తొలి మ్యాచ్‌లో భారత్ విజయం సాధించగా, రెండో మ్యాచ్‌లో ఆస్ట్రేలియా విజయం సాధించింది. గబ్బాలో జరిగిన మ్యాచ్ డ్రా అయింది. ఇక భారత శిబిరంలో బుమ్రా మూడు వికెట్లు తీయగా.. ఆకాష్ దీప్, రవీంద్ర జడేజా, వాషింగ్టన్ సుందర్ లు చెరో వికెట్ ను పడగొట్టారు. ఆస్ట్రేలియా ఓపెనర్‌ సామ్‌ కాన్‌స్టాస్‌పై విరాట్‌ కోహ్లీ చేసిన కవ్వింపు చర్యను ఐసీసీ సీరియస్ గా తీసుకుంది. దానితో మెల్‌బోర్న్ టెస్టు తొలిరోజు ఆట ముగిసిన వెంటనే విరాట్ కోహ్లీకి జరిమానా విధించారు అధికారులు. విరాట్ కోహ్లీ మ్యాచ్ ఫీజులో 20 శాతం కొత్త విధించారు. నివేదికల ప్రకారం, విరాట్ కోహ్లీ లెవల్ 1 దోషిగా తేలింది. మెల్‌బోర్న్ టెస్టు తొలి రోజు ఆట ముగిసిన వెంటనే విరాట్ కోహ్లీ మ్యాచ్ రిఫరీ ఆండీ పైక్రాఫ్ట్ ముందు మాట్లాడాడు. అక్కడ విరాట్ కోహ్లీ తన నేరాన్ని అంగీకరించాడు. ఆట 10వ ఓవర్ ముగిసిన తర్వాత విరాట్ కోహ్లీ కాన్స్టాస్‌ను భుజంతో ఢీ కొట్టాడు. విరాట్ కోహ్లి మరో ఎండ్‌లో స్లిప్ వైపు వెళుతుండగా, సామ్ కాన్స్టాన్స్ కూడా తన ఎండ్‌ను మార్చుకుంటున్నాడు. ఆ సమయంలో కోహ్లి నేరుగా సామ్ కాన్స్టాన్స్ భుజంను ఢీ కొట్టాడు. ఈ ఘటన తర్వాత విరాట్ కోహ్లీపై పెద్దెత్తున తీవ్ర విమర్శలు వచ్చాయి.

రామ్ చరణ్ ‘గేమ్ ఛేంజర్’ థియేట్రికల్ ట్రైలర్ డేట్ ఫిక్స్..?
మెగా  ఫ్యాన్స్ ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న సమయం రానే వచ్చేసింది. మరో రెండు వారాల్లో మోస్ట్ అవైటేడ్ పాన్ ఇండియా మూవీ గేమ్ ఛేంజర్ థియేటర్లోకి రాబోతోంది. జనవరి 10న మెగా ఫ్యాన్స్‌కు అసలు సిసలైన సంక్రాంతి స్టార్ట్ కానుంది. కానీ అంతకంటే ముందు.. న్యూ ఇయర్ సెలబ్రేషన్స్‌కు రెడీ ఉండండని గేమ్ ఛేంజర్ మేకర్స్ చెబుతున్నారు. ఇప్పటి వరకు గేమ్ ఛేంజర్ నుంచి జరగండి, రా మచ్చా, నానా హైరానా, డోప్ సాంగ్స్ రిలీజ్ అవగా.. చార్ట్ బస్టర్స్ అయ్యాయి. తమన్ అదిరిపోయే ట్యూన్స్ ఇచ్చాడు. అలాగే.. లక్నోలో గ్రాండ్‌గా టీజర్ రిలీజ్ చేయగా సూపర్ రెస్పాన్స్ వచ్చింది. ఇక ఇప్పుడు సినిమా ఓపెనింగ్స్‌ను డిసైడ్ చేసే అసలు సిసలైన ట్రైలర్ రాబోతోందట. ఇప్పటి వరకు గేమ్ ఛేంజర్ పై ఉన్న హైప్‌ను నెక్స్ట్ లెవల్‌కి తీసుకెళ్లాలంటే పవర్ ఫుల్ ట్రైలర్ రావాల్సిందే. ఇప్పటికే  ట్రైలర్ కట్‌ వర్క్ జరుగుతోందట. అయితే  డిసెంబర్ 27న ఈ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ అనుకున్నారు కానీ ఎందుకనో వాయిదా వేశారు. కాగా డిసెంబర్ 30న హైదరాబాద్ వేదికగా ఈవెంట్ ఉండొచ్చు అని యూనిట్ టాక్. ఈ ఈవెంట్‌కి మెగాస్టార్ చిరంజీవి గెస్ట్‌గా వచ్చే అవకాశముందని అంటున్నారు. ఇక జనవరి మొదటి వారంలో ఏపిలో గ్రాండ్‌గా ప్రీ రిలీజ్ ఈవెంట్ ప్లాన్ చేస్తున్నారు. ఈ ఈవెంట్‌కు రియల్ గేమ్ ఛేంజర్, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ముఖ్య అతిథిగా రానున్నట్టు టాక్ ఉంది. ఫ్యాన్స్ ఈగర్ గా వెయిట్ చేస్తున్న గేమ్ ఛేంజర్ ట్రైలర్ ఎలా ఉంటుందో చూడాలి.

ఎల్లమ్మగా సాయి పల్లవి..?
సాయి పల్లవి ఏదైనా సినిమాకు సైన్ చేసిందంటే ఆడియెన్స్‌లో ఆ సినిమా హిట్ అనే సైన్ ఉంది. ఇప్పటి వరకు సాయి పల్లవి చేసిన సినిమాలు చూసుకుంటే సక్సెస్ రేట్ చాలా ఎక్కువగా ఉంటుంది. అందుకే ఏదైనా సినిమాకు లేడీ పవర్ స్టార్ ఓకె చెబితే చాలు ఆటోమేటిక్‌గా మంచి హైప్ వచ్చేస్తుంది. రీసెంట్‌గా అమరన్‌తో సాలిడ్ హిట్ కొట్టిన పల్లవి అందులో అదిరిపోయే పర్ఫార్మెన్స్ ఇచ్చింది. ప్రస్తుతం బాలీవుడ్ భారీ ప్రాజెక్ట్ ‘రామాయణ్’తో పాటు, తెలుగులో నాగ చైతన్య సరసన ‘తండేల్’ సినిమాలో నటిస్తోంది ఈ ముద్దుగుమ్మ. ఈ సినిమాల పై భారీ అంచనాలున్నాయి. లేటెస్ట్‌గా సాయి పల్లవి మరో తెలుగు ప్రాజెక్ట్‌కు ఓకె చెప్పినట్టుగా తెలుస్తోంది. ‘బలగం’ వంటి బ్లాక్ బస్టర్  తర్వాత ‘ఎల్లమ్మ’ అనే సినిమా చేస్తున్నాడు డైరెక్టర్ వేణు ఎల్దండి. నితిన్  హీరోగా దిల్ రాజు నిర్మాణంలో రానున్న ఈ సినిమా త్వరలోనే సెట్స్ పైకి వెళ్లనుంది. తాజాగా ఈ సినిమాకు సాయి పల్లవి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టుగా సమాచారం. వేణు చెప్పిన కథ బాగా నచ్చడంతో సాయి పల్లవి వెంటనే ఓకే చెప్పేసిందట. అంతేకాదు డేట్స్ కూడా ఇచ్చేసిందట. ఎల్లమ్మ సినిమాను తెలంగాణ బ్యాక్‌డ్రాప్‌లో ప్లాన్ చేస్తున్నాడు వేణు. గతంలో సాయి పల్లవి చేసిన ‘పిధా’ సినిమా కూడా తెలంగాణ బ్యాక్ డ్రాప్‌లోనే తెరకెక్కింది. కాబట్టి.. తెలంగాణ యాస, భాష పై సాయి పల్లవి మంచి పట్టు ఉందనే చెప్పాలి. మొత్తంగా.. ఎల్లమ్మగా సాయి పల్లవికి మరో అదిరిపోయే క్యారెక్టర్ పడినట్టే. అఫీషియల్ ప్రకటన త్వరలో వచ్చే అవకాశం ఉంది.

Show comments