NTV Telugu Site icon

Top Headlines @ 5 PM: టాప్‌ న్యూస్‌

Top Headlines @ 5 Pm New

Top Headlines @ 5 Pm New

సోషల్ మీడియాపై స్పెషల్‌ ఫోకస్.. ప్రత్యేక విభాగం పెడతాం..
సోషల్ మీడియా మీద ప్రత్యేకంగా ఫోకస్ పెడతాం అన్నారు ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు.. ఏపీ అసెంబ్లీలో శాంతిభద్రతలపై శ్వేతపత్రాన్ని విడుదల చేసిన ఆయన.. ఈ సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేశారు.. ఆడబిడ్డలను ఇష్టం వచ్చినట్టు ట్రోల్ చేస్తే ఏం చేయొచ్చో.. చేసి చూపిస్తాం అన్నారు.. సోషల్ మీడియా ట్రోలింగ్స్ కంట్రోల్ చేయడానికి ప్రత్యేక విభాగం పెడతామని ప్రకటించారు.. కక్ష సాధింపు ఆలోచన పక్కన పెట్టండి. బాధ్యతతో వ్యవహరించాలి.. ప్రజలకు సేవ చేయాలి అని సూచించారు చంద్రబాబు.. ఇక, వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో ఓ రోజంతా శాంతి భద్రతలపై చర్చిద్దాం.. వివిధ వర్గాలు, ఉద్యోగులు, అమరావతి రైతులపై తప్పుడు కేసులు పెట్టారు. ఈ కేసులను ఏం చేయాలనే దానిపై సమీక్షిస్తాం. తప్పుడు కేసులు పెట్టిన వారిపై చర్యలు తీసుకోవడం ఖాయం అని స్పష్టం చేశారు చంద్రబాబు. ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టేలా ఎన్డీఏ ప్రభుత్వంలో ఏ ఒక్కరూ వ్యవహరించ వద్దు అని సూచించారు చంద్రబాబు.. చట్టాన్ని చేతుల్లోకి తీసుకోవద్దన్న ఆయన.. చాలా మందికి బాధ ఉంది.. ఆవేశం ఉంది.. నాయకులుగా మనమే కాదు.. కార్యకర్తల్లోనూ ఆవేదన ఉందని.. కానీ, కక్షసాధింపునకు ప్రజలు మనకు అధికారం ఇవ్వలేదన్నారు. ప్రాణ సమానమైన కార్యకర్తలను పోగొట్టుకున్నాను. నేను చంద్రయ్య పాడె మోశాను.. నేను ఎలా మరిచిపోగలను…? అని ప్రశ్నించారు. సినిమాల్లో నటించే పవన్ కల్యాణ్‌ కూడా రోడ్ మీద పడుకునేలా చేశారు. ఆడబిడ్డలకు రక్షణ కల్పించే బాధ్యత తీసుకోండని ఓ బాధితురాలు నన్ను కోరింది. మాకేం చేయొద్దు సార్.. మాకు రక్షణ కల్పిస్తే చాలు అని మాత్రమే కోరారని గుర్తుచేసుకున్నారు.. ఇక, ఫ్యామ్లీ విషయాలు కూడా ఇష్టానుసారంగా మాట్లాడారు. ఈ వ్యవహారంలో సోషల్ మీడియా మీద ప్రత్యేక ఫోకస్ పెడతాం అన్నారు.. ఆడబిడ్డలను ఇష్టం వచ్చినట్టు ట్రోల్ చేస్తే ఏం చేయొచ్చో.. చేసి చూపిస్తాం అని హెచ్చరించారు సీఎం చంద్రబాబు..

భీమిలి ఎర్రమట్టి దిబ్బలను పరిశీలించిన వాటర్‌మ్యాన్ ఆఫ్ ఇండియా..
విశాఖపట్నంలోని భీమిలి ఎర్రమట్టి దిబ్బల ప్రాంతాన్ని పరిశీలించారు వాటర్ మ్యాన్ ఆఫ్ ఇండియా రాజేంద్రసింగ్.. కనుమరుగైపోతున్న ఎర్రమట్టి దిబ్బలను వాటర్ మాన్ ఆఫ్ డాక్టర్ రాజేంద్ర సింగ్ పరిశీలించారు. జియో లాజికల్ సైంటిస్ట్ రాజశేఖర్ రెడ్డి, జల బిలాదరి జాతీయ కన్వీనర్ బొలిశెట్టి సత్యనారాయణ, కార్పొరేటర్ మూర్తి యాదవ్ తో కలిసి పరిశీలించారు. వారసత్వ సంపద పరిరక్షణ ఆవశ్యకతపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు కృషి చేస్తున్నామని వాటర్ మాన్ ఆఫ్ ఇండియా రాజేంద్ర సింగ్ అన్నారు. ప్రపంచంలో అరుదైన ప్రాంతంగా ఎర్రమట్టిదిబ్బలను గుర్తించాలన్నారు. ఇప్పటికే భారత ప్రభుత్వం జియో హెరిటేజ్ ప్రాంతంగా గుర్తించింది వాటిని పరిరక్షించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉంటాదని. జియో లాజికల్ విద్యార్థులకు ఎర్రమట్టి దిబ్బలను పరిశోధించేందుకు అవకాశం ఇవ్వాలన్నారు. భావితరాలకు సురక్షితంగా భౌగోళిక వారసత్వ సంపదను అందజేయాలన్నారు. ఎర్ర మట్టి దిబ్బలలో మొక్కల వేర్లను కూడా అధ్యయనం చేయవచ్చన్నారు వాటర్ మ్యాన్ ఆఫ్ ఇండియా డాక్టర్ రాజేంద్ర సింగ్.

ఆ ఒక్క మాటతో అసెంబ్లీలో నిల్చున్న 80 శాతం మంది ఎమ్మెల్యేలు.. సభలో నవ్వులు..
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాల్లో ఒక్కసారిగా నవ్వులు పూయించారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు.. ఏపీ అసెంబ్లీలో శాంతిభద్రతలపై శ్వేతపత్రాన్ని విడుదల చేసిన ఆయన.. ఈ సందర్భంగా గత ప్రభుత్వ హయాంలో జరిగిన ఘటనలపై సుదీర్ఘ ఉపన్యాసం చేశారు.. వైసీపీ ప్రభుత్వంలో ఇష్టం వచ్చినట్టుగా ప్రతిపక్షాలపై కేసులు పెట్టారని ఫైర్‌ అయ్యారు.. ప్రతిపక్షాల గొంతు నొక్కడానికి.. ప్రజల వాయిస్‌ వినిపించకుండా చేసేందుకు.. ప్రజాప్రతినిధులు, నేతలపై కేసులు పెట్టారని విమర్శించారు.. ఇక, వైసీపీ ప్రభుత్వ హయాంలో కేసులు ఉన్న వారు నిల్చొవాలని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అనడంతో అసెంబ్లీలో దాదాపు 80 శాతం మంది ఎమ్మెల్యేలు.. సభలో లేచి నిల్చున్నారు.. డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌తో పాటు.. మంత్రులు, టీడీపీ, జనసేన, బీజేపీ ఎమ్మెల్యేలు.. ఇలా 80 శాతం మంది ఎమ్మెల్యేలు సభలో ఒక్కసారిగా లేచి నిలబడ్డారు.. నాపై రెండు కేసులు.. నాపై మూడు కేసులు.. నాపై అయితే ఏడు కేసులు అంటూ.. మంత్రులు.. ఎమ్మెల్యేలు.. అంటుంటూ సభలో నవ్వులు పూసాయి.. స్పీకర్‌ అయ్యన్నపాత్రుడు సహా సభ్యులంతా నవ్వుకున్నారు. అయితే, వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ హయాంలో కేసులు ఉన్న నేతల్లో దాదాపు అసెంబ్లీకి వచ్చారని ఈ సందర్భంగా పేర్కొన్నారు సీఎం నారా చంద్రబాబు నాయుడు.

ఇంతటి కష్టకాలంలో ఇంత పెద్ద బడ్జెట్ పెట్టడం సాహసోపేతం
తెలంగాణ బడ్జెట్‌ సమావేశాలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో నేడు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క నేడు అసెంబ్లీలో బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. అయితే.. ఈ సందర్భంగా అసెంబ్లీ మీడియా పాయింట్‌ వద్ద సీపీఐ ఎమ్మెల్యే కూనం నేని సాంబశివరావు మాట్లాడుతూ.. ఇంతటి కష్టకాలంలో ఇంత పెద్ద బడ్జెట్ పెట్టడం సాహసోపేతమని ఆయన అన్నారు. ప్రభుత్వం మా బడ్జెట్ చాలా గొప్పది అంటారని , ప్రతిపక్షాలు విమర్శలు చేస్తాయని, మేము కమ్యూనిస్టులాము 6లక్షల 70వేల కోట్ల అప్పుల్లో ఇంతకు మించి చేయడానికి ఇంకా ఏం లేదన్నారు. వ్యవసాయానికి, రైతు బంధు, రుణమాఫీ కి ఎక్కువ బడ్జెట్ కేటాయించారని, విద్య వైద్యానికి 15 శాతం ఉండాల్సిన అవసరం ఉందన్నారు కూనంనేని. కానీ ఆ అవకాశం లేకపోయిందని, భవిష్యత్ లో అయిన విద్య, వైద్యానికి కేటాయించిన నిధులు పెంచాలన్నారు కూనంనేని సాంబశివరావు.

కాంగ్రెస్ + రాష్ట్ర బడ్జెట్ = గాడిద గుడ్డేనా?
రాష్ట్ర బడ్జెట్ పై కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ స్పందిస్తూ.. కాంగ్రెస్ + రాష్ట్ర బడ్జెట్ = గాడిద గుడ్డేనా? అని వ్యంగ్యస్త్రాలు సంధించారు. 6 గ్యారంటీలు + రాష్ట్ర బడ్జెట్ = గాడిద గుడ్డేనా? అని, గాడిద గుడ్డు పెట్టడం ఎంత నిజమో… కాంగ్రెస్ ఇచ్చిన హామీలన్నీ అమలు చేయడం అంతే నిజమనే దానికి బడ్జెట్ నిదర్శనమిని ఆయన విమర్శలు గుప్పించారు. భట్టి విక్రమార్క గారు… మీరు చదివింది ఆర్థిక బడ్జెట్టా లేక అప్పుల పత్రమా..? అని ఆయన ప్రశ్నించారు. అప్పులున్నందున హామీలను అమలు చేయలేమని చేతులెత్తేస్తున్నారా? అప్పులున్న విషయం ముందు మీకు తెలిసి కూడా 6 గ్యారంటీలిచ్చిన మీరు వాటన్నింటికీ బడ్జెట్ లో నిధులెందుకు కేటాయించలేదు? 6 గ్యారంటీలుసహా హామీల అమలుపై చర్చ జరగకుండా ఉండేందుకే కేంద్రాన్ని బదనాం చేయాలనుకుంటున్నారా? అని బండి సంజయ్‌ అన్నారు. బడ్జెట్ కేటాయింపులకు సరిపడ ఆదాయం ఎక్కడి నుండి సమకూర్చుకుంటారో బడ్జెట్ లో లెక్కా పత్రం చూపకపోవడం విడ్డూరమని, సర్కారీ భూములన్నీ అడ్డికి పావుశేరు అమ్మాలనుకుంటున్నారా? అని ఆయన వ్యాఖ్యానించారు.

కేజ్రీవాల్‌ కోసం రంగంలోకి ఇండియా కూటమి.. ఢిల్లీలో భారీ నిరసనకు ప్లాన్!
ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ కోసం ఇండియా కూటమి రంగంలోకి దిగబోతుంది. లిక్కర్ కేసులో మార్చి 21న అరెస్టై.. తీహార్ జైల్లో ఉంటున్నారు. దాదాపు నాలుగు నెలల నుంచి జైల్లో ఉండడంతో ఆయన ఆరోగ్యం క్షీణిస్తోంది. ఇంకోవైపు ఆమ్ ఆద్మీ పార్టీ నేతలు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. జైల్లోనే చంపేందుకు బీజేపీ కుట్ర చేస్తోందని ఆరోపిస్తోంది. ఈ నేపథ్యంలో కేజ్రీవాల్ కోసం కూటమి నేతలు ఢిల్లీలో భారీ నిరసన కార్యక్రమం చేపట్టాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. జూలై 30న జంతర్ మంతర్ దగ్గర ఇండియా కూటమి భారీ ర్యాలీ నిర్వహించనుందని ఆమ్ ఆద్మీ పార్టీ తెలిపింది. కేజ్రీవాల్‌ను జైల్లో చంపేందుకు కుట్ర జరుగుతోందని.. జూన్ 3 నుంచి జూలై 7 వరకు పలుమార్లు షుగర్ లెవల్స్ పడిపోయాయని మెడికల్ రిపోర్టులను బయటపెట్టింది. కేజ్రీవాల్ ఆరోగ్యం కోసం ఈనెల 30న కూటమి భారీ నిరసన చేపడుతున్నట్లు ఆప్ పేర్కొంది.

దేశంలో పూర్తి “శాకాహార నగరం”గా గుర్తింపు.. మాంసాహరం నిషేధానికి కారణం ఏంటీ..?
ప్రపంచంలోనే భిన్న సంస్కృతి, సంప్రదాయాలు, ఆహార అలవాట్లకు భారతదేశం కేంద్రం. ఒక్కో ప్రాంతంలో ఒక్కో తరహా ఆచార వ్యవహారాలు ఉంటాయి. అక్కడి స్థానిక పరిస్థితులను బట్టి ఆహార నియమాలు, అలవాట్లు ఉంటాయి. ప్రపంచ అట్లాస్ నివేదిక ప్రకారం, భారత్‌లో ప్రపంచంలోనే అత్యధిక శాకాహారులు ఉన్న దేశంగా నిలిచింది. దేశంలో 38 శాతం మంది శాకాహారులు ఉన్నారు. ఇదిలా ఉంటే, దేశంలోనే పూర్తి ‘‘శాకాహార’’ నగరంగా గుజరాత్ లోని ‘పాలిటానా’ రికార్డుకెక్కింది. ఈ పట్టణంలో పూర్తిగా మాంసాహారం నిషేధం. ఈ పట్టణం గుజరాత్‌లోని భావ్ నగర్ జిల్లాలో ఉంది. మాంసం, గుడ్లతో పాటు మాంసాహారం ఈ పట్టణంలో పూర్తిగా నిషేధం. ఈ ప్రాంతంలో జైన సన్యాసులు మాంసాహార నిషేధం కోసం పెద్ద ఉద్యమమే చేశారు. 2014లో, ఈ ప్రాంతంలో దాదాపుగా 250 మాంసం దుకాణాలనున మూసేయాలని కోరుతూ 200 మంది సన్యాసులు నిరాహారదీక్ష చేశారు. జైన మతస్తుల మనోభావాలను గౌరవించేందు ఈ ప్రాంతంలో మాంసం, గుడ్లు, జంతువులను వధించడంపై ప్రభుత్వం నిషేధం విధించింది. ఇవి ఉల్లంఘిస్తే భారీ జరిమానాలను విధిస్తుంది.

అమెరికా యువతితో ఫేస్బుక్లో పరిచయం.. ఇండియాకు రప్పించి అత్యాచారం
రాజస్థాన్‌లోని అజ్మీర్‌లో అమెరికా మహిళపై అత్యాచారం జరిగిన ఉదంతం వెలుగు చూసింది. పెళ్లయిన ఓ లాయర్ అమెరికాకు చెందిన అమ్మాయితో ఫేస్‌బుక్‌లో స్నేహం చేశాడు. తనకు పెళ్లికాలేదని యువతిని భారత్‌కు రప్పించాడు. జైపూర్, అజ్మీర్ సహా పలు చోట్ల హోటళ్లలో యువతికి సౌకర్యం కల్పించాడు. ఈ క్రమంలో అమెరికా యువతిపై అత్యాచారానికి పాల్పడ్డాడు. అయితే.. ఆ యువతి తనను పెళ్లి చేసుకోవాలని పట్టుబట్టింది. దానికి ఆ వ్యక్తి అబద్ధపు మాటలు చెబుతూ వచ్చాడని యువతి తెలిపింది. ఈ క్రమంలో.. నిందితుడు మోసం చేశాడని తెలిసుకుని బాధిత మహిళ బుండిలోని ఎన్జీవోను సంప్రదించి.. బుండి మహిళా పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. ఈ కేసుపై అజ్మీర్ పోలీసులు చర్యలు చేపట్టారు.

ఫ్లాట్‌గా ముగిసిన సూచీలు
దేశీయ మార్కెట్‌లో వరుస నష్టాలు కొనసాగుతున్నాయి. అంతర్జాతీయంగా ప్రతికూల సంకేతాలు మన మార్కెట్‌పై కూడా తీవ్ర ప్రభావం చూపిస్తోంది. సెన్సెక్స్ 109 పాయింట్లు నష్టపోయి 80, 039 దగ్గర ముగియగా.. నిఫ్టీ 7 పాయింట్లు నష్టపోయి 24, 406 దగ్గర ముగిసింది. ఇక రూపాయి మారకం విలువ డాలర్‌తో పోలిస్తే రూ.83.70 దగ్గర ముగిసింది. నిఫ్టీలో టాటా మోటార్స్, ఒఎన్‌జీసీ, ఎస్‌బీఐ లైఫ్ ఇన్సూరెన్స్, బీపీసీఎల్ మరియు సన్ ఫార్మా లాభపడగా.. యాక్సిస్ బ్యాంక్, నెస్లే ఇండియా, టైటాన్ కంపెనీ, ఐసీఐసీఐ బ్యాంక్ మరియు టాటా స్టీల్ నష్టపోయాయి. రంగాలవారీగా చూస్తే.. ఆటో, క్యాపిటల్ గూడ్స్, పవర్, ఆయిల్ అండ్ గ్యాస్, హెల్త్‌కేర్, మీడియా 0.5-3 శాతం పెరగగా.. బ్యాంక్, ఐటీ, మెటల్, రియల్టీ, టెలికాం 0.5-1 శాతం క్షీణించాయి.

ఆరు పదుల వయసులో ఒలింపిక్స్ లోకి అడుగు పెడుతున్న బామ్మ..
పారిస్ ఒలింపిక్స్ 2024 జూలై 26 నుంచి ఆగస్టు 11 వరకు కొనసాగుతుంది. ఇది 33వ సమ్మర్ ఒలింపిక్ క్రీడలు. ప్యారిస్ ఈ క్రీడలకు మూడవసారి ఆతిథ్యం ఇవ్వబోతోంది. క్రీడల మహా సంబరంలో 10 వేల మందికి పైగా అథ్లెట్లు పతకాల కోసం పోటీపడతున్నారు. ఇందులో భారతదేశం నుండి 117 మంది అథ్లెట్లు పాల్గొంటున్నారు. ఈసారి ఒలింపిక్స్‌లో బ్రేక్ డ్యాన్స్, స్పోర్ట్స్ క్లైంబింగ్, స్కేట్‌బోర్డింగ్ లాంటి కొన్ని కొత్త క్రీడలు చేర్చబడ్డాయి. టోక్యో ఒలింపిక్స్‌ కంటే మెరుగైన ఆటతీరుపై భారత ఆటగాళ్లు కన్నేశారు. 117 మంది సభ్యుల బృందంతో భారత్ పారిస్ ఒలింపిక్స్‌లో పాల్గొననుంది. గత మూడేళ్లలో భారత బృందం అద్భుత ప్రదర్శన కనబరిచినందున ఒలింపిక్స్‌లో అత్యుత్తమ ఏడు స్థానాలను దాటాలనే భావంతో భారత క్రీడాకారులు అడుగుపెట్టనున్నారు. భారతదేశం దాదాపు ప్రతి క్రీడలో మంచి అనుభవం ఉన్న వారిని కలిగి ఉంది. ఇకపోతే 44 ఏళ్ల టెన్నిస్ స్టార్ రోహన్ బోపన్న పారిస్ ఒలింపిక్స్‌లో పాల్గొనే భారత జట్టులో అత్యంత వృద్ధ అథ్లెట్. బోపన్న మూడోసారి ఒలింపిక్స్‌లో ఆడనున్నాడు. 14 ఏళ్ల ధినిధి దేశింగు భారత జట్టులో అతి పిన్న వయసు అథ్లెట్. బెంగళూరుకు చెందిన 14 ఏళ్ల స్విమ్మర్ ధీనిధి దేశింఘు 2024 పారిస్ ఒలింపిక్స్‌లో భారతదేశపు అతి పిన్న వయస్కురాలిగా చరిత్ర సృష్టించడానికి సిద్ధంగా ఉంది. ప్రస్తుత ఒలింపిక్స్‌ లో పాల్గొనే ఆటగాళ్లందరి గురించి మనం చూసినట్లయితే.. 11 సంవత్సరాల 11 నెలల వయస్సు గల స్కేట్‌ బోర్డర్ జెంగ్ అతి పిన్న వయస్కుడైన పోటీదారు అవుతాడు. ఆమె 10 సంవత్సరాల 218 రోజుల వయస్సులో 1896 ఒలింపిక్స్‌లో పాల్గొన్న అతి పిన్న వయస్కుడైన ఒలింపియన్, గ్రీకు జిమ్నాస్ట్ డిమిట్రియోస్ లౌండ్రాస్ కంటే ఒక సంవత్సరం పెద్దది.

దేవరకొండతో మాట్లాడాలంటే అదోలా అనిపించిది.. రష్మిక ఆసక్తికర వ్యాఖ్యలు
విజయ్ దేవరకొండ రష్మిక మందన బాండింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. వీరిద్దరూ మొట్టమొదటిసారిగా గీతగోవిందం అనే సినిమాలో కలిసి నటించారు. ఆ సినిమా తర్వాత రష్మిక తనకు జరిగిన ఎంగేజ్మెంట్ బ్రేక్ చేసుకోవడంతో అప్పటి నుంచి విజయ్ దేవరకొండ రష్మిక మధ్య ఏదో ఉందనే ప్రచారం ఎప్పుడూ జరుగుతూనే ఉంటుంది. దానికి తోడు వీరిద్దరూ సోషల్ మీడియాలో షేర్ చేసే ఫోటోలు కూడా రకరకాల హింట్స్ ఇచ్చే విధంగా ఉండటంతో ఈ ప్రచారం జరుగుతూనే వస్తోంది. వీళ్ళిద్దరూ ఎప్పుడూ తమ రిలేషన్ గురించి బాహాటంగా మాట్లాడింది లేదు. వీలైతే అప్పుడప్పుడు ఖండిస్తూనే వస్తున్నారు. కానీ వీరిద్దరూ కలిసి సినిమా చేస్తే చూడాలని అభిమానులు మాత్రం కోరుతున్నారు. అయితే తాజాగా జరిగిన ఒక ఇంటర్వ్యూలో రష్మిక మందన విజయ్ దేవరకొండ గురించి ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేసింది. అదేంటంటే గీతగోవిందం సినిమా సెట్స్ లో విజయ్ దేవరకొండ పక్కన నటిస్తున్నప్పుడు అతని గత సినిమాల ఎఫెక్ట్తో అతనితో మాట్లాడాలంటే ఎందుకో బెరుకుగా అనిపించదని చెప్పుకొచ్చింది. అయితే ఆ సినిమాల్లో చూసిన విజయ్ దేవరకొండ వేరు, బయట విజయ్ దేవరకొండ వేరు అని తనకు త్వరగానే అర్థమైందని ఆమె వెల్లడించింది. సినిమాల్లో చూపించినట్టు కాకుండా బయట విజయ్ చాలా కూల్ అని ఎవరైనా ఈజీగా మాట్లాడగలిగే అంత మంచి వ్యక్తిని చెప్పుకొచ్చింది. బహుశా అందువల్లే తనకు విజయ్ తో వాళ్ళ ఫ్యామిలీతో మంచి బాండింగ్ ఏర్పడిందని ఆమె చెప్పుకొచ్చింది. ఫ్యూచర్లో విజయ్ తో సినిమా చేస్తారా? అని అడిగితే ప్రస్తుతానికైతే చేసే ఆలోచనలు ఏమీ లేవు అని ఆమె వెల్లడించింది. ప్రస్తుతానికి ఒకపక్క విజయ్ తన సినిమాల బిజీలో తాను ఉంటే రష్మిక సినిమాల బిజీలో ఆమె ఉంది. రష్మిక ఇప్పటికే పాన్ ఇండియా హీరోయిన్ అయిపోయి నేషనల్ క్రష్ గా అలరిస్తుంటే విజయ్ పాన్ ఇండియా వైడ్ ఒక మంచి సాలిడ్ హిట్ కొట్టడానికి ప్రయత్నాలు చేస్తున్నాడు.