Site icon NTV Telugu

Top Headlines @ 5 PM: టాప్‌ న్యూస్‌

Top Headlines @ 5 Pm New

Top Headlines @ 5 Pm New

రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై జగన్‌ ఆందోళన.. ఆదాయం తగ్గి.. అప్పులు పెరిగి..!
ఆంధ్రప్రదేశ్‌ ఆర్థిక పరిస్థితిపై సోషల్‌ మీడియా వేదికగా ఆందోళన వ్యక్తం చేశారు మాజీ ముఖ్యమంత్రి, వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత వైఎస్‌ జగన్మోహన్‌ రెడ్డి.. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై ఎక్స్ లో స్పందించిన ఆయన.. ఆదాయాలు తగ్గిపోయి, అప్పులు పెరగటంపై ఆగ్రహం వ్యక్తం చేశారు.. కాగ్ నివేదికలపై ఎక్స్ లో ట్వీట్ చేశారు జగన్.. రాష్ట్ర ప్రభుత్వ ఆదాయాలు భారీగా తగ్గి, అప్పులు పెరిగి పోతున్నాయి.. కూటమి ప్రభుత్వ విధానాలతోనే ఈ పరిస్థితి ఏర్పడిందని ఆరోపించారు.. రాష్ట్ర ఆర్ధిక పరిస్థితిపై కాగ్ నివేదికలు ఆందోళన కలిగిస్తున్నాయి. 2019–24 మధ్య మా ప్రభుత్వంపై టీడీపీ, జనసేన పార్టీలు పదేపదే అబద్దాలు చెప్పాయి. రాష్ట్రంలో ఆదాయ వృద్ది తగ్గిందనీ, అభివృద్ది అనేదే లేదని తప్పుడు ప్రచారం చేశాయి. తాము అధికారంలోకి వస్తే సంపద సృష్టిస్తామంటూ కూటమి నేతలు నమ్మబలికారు. కానీ, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రాష్ట్ర ఆదాయాలు భారీగా తగ్గాయని పేర్కొన్నారు జగన్‌.. 2024–25 ఆర్థిక సంవత్సరంలో రాష్ట్ర ప్రభుత్వ సొంత ఆదాయాలు కేవలం 3.08 శాతం మాత్రమే పెరిగాయని తెలిపారు జగన్.. కేంద్ర ప్రభుత్వ ఆదాయాల వృద్ది 12.04 శాతం పెరగగా, ఏపీ ఆదాయం భారీగా తగ్గిపోయిందన్న ఆయన. కూటమి ప్రభుత్వం చెప్పినట్టు నిజంగానే ఏపీ ఆర్థిక వృద్ధి 12.02 శాతం ఉంటే, మరి ఆదాయం పెరుగుదల 3.08 శాతం దగ్గరే ఎందుకు ఆగిపోయింది? అని ప్రశ్నించారు.. గతేడాదితో పోల్చితే ఈఏడాది కొంత ఆశాజనకంగా ఉంటుందనుకుంటే మొదటి నాలుగు నెలల్లో కూడా అదే పరిస్థితి నెలకొంన్న ఆయన.. ప్రజల్లో కొనుగోలు శక్తి కూడా బాగా తగ్గిపోయిందన్నారు.. కూటమి ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి ఆదాయాల వృద్ది పది శాతం ఉండాల్సి ఉండగా, కేవలం 2.39 శాతం మాత్రమే ఉంది. మా హయాంలో అన్ని రకాల అప్పులు కలిపి రూ.3,32,671 కోట్లు మాత్రమే.. కానీ, టీడీపీ కూటమి ప్రభుత్వం ఈ 14 నెలల్లోనే ఏకంగా రూ. 1,86,361 కోట్లు అప్పు చేసింది.. అంటే మా ఐదేళ్ల హయాంలో చేసిన అప్పుల్లో ఇప్పటికే 56 శాతం చేశారని పేర్కొన్నారు.. ఆదాయాలు తగ్గి, అప్పులు పెరిగిపోతున్న ఈ నేపథ్యంలో కూటమి ప్రభుత్వం పునరాలోచన చేయాలని హితవు చెప్పారు.. అన్ని స్థాయిల్లో పెరిగిన అవినీతిని అరికట్టాలని సూచించారు మాజీ సీఎం, వైసీపీ అధినేత వైఎస్‌ జగన్..

నేను ఆ విషయం సిట్‌కు చెప్పలేదు.. ల్యాప్‌టాప్‌ అంటే తెలియదు.. వాట్సాప్‌ వాడటం కూడా రాదు..!
ఏపీలో సంచలనంగా మారిన లిక్కర్‌ స్కాం కేసులో శుక్రవారం రోజు వైసీపీ సీనియర్‌ నేత, మాజీ డిప్యూటీ సీఎం నారాయణస్వామిని ప్రశ్నించారు సిట్‌ అధికారులు.. దాదాపు 6 గంటల పాటు నారాయణస్వామిని విచారించిన సిట్‌ అధికారులు కీలక విషయాలు రాబట్టారని.. ఆయన కీలక సమాచారం ఇచ్చారని, ల్యాప్‌టాప్‌ కూడా సీజ్‌ చేశారని వార్తలు వచ్చాయి.. అయితే, సిట్‌ విచారణపై మరోసారి మీడియాతో మాట్లాడిన మాజీ డిప్యూటీ సీఎం నారాయణస్వామి.. ఆసక్తికర విషయాలు వెల్లడించారు.. సిట్ వారు సహకరించారు.. వారు ఆడిగిన ప్రశ్నలకు నేను సమాధానం చెప్పాను… కేసుతో నాకేం సంబంధం లేదు.. అంతా పైవాళ్లే చేశారని నేను ఎక్కడ సిట్ అధికారులకు చెప్పలేదని స్పష్టం చేశారు.. సిట్ అధికారులు ఇబ్బంది పడే ప్రశ్నలు అడిగాన‌.. నేను సమాధానం చెప్పాను… నన్ను అరెస్టు చేశారంటూ కోందరూ అసత్య ప్రచారం చేశారని మండిపడ్డారు. నేనెప్పుడూ నీతిగా, నిజాయితీ బతికాను… ఎప్పుడూ తప్పు చేయలేదు.. అవినీతి చేయలేదన్నారు నారాయణస్వామి.. ఇక, నాకు ల్యాప్‌టాప్ అంటే ఏంటో.. దానిని ఎలా వాడాలో కూడా తెలియదు‌‌‌‌‌‌‌.. నాకు వాట్సాప్‌ వాడటం కూడా రాదన్నారు.. ల్యాప్ టాప్ సిట్‌ అధికారులు తీసుకుని పోలేదన్నారు.. ప్రభుత్వం తరపున మద్యం అమ్మకాలు చేస్తే అవినీతికి అవకాశం ఉండదు అని తెలిపారు.. ప్రైవేటు గా అమ్మకాలు సాగిస్తేనే అవినీతి జరుగుతుందన్నారు.. కూటమీ ప్రభుత్వంలో రాష్ట్రంలో పాల ప్యాకెట్ల కంటే మద్యం 24 గంటలకు దొరుకుతుందని ఆవేదన వ్యక్తం చేశారు.. నేను ఎక్కడ తప్పుడు సంతకాలు పెట్టలేదు… నేను ఏంటో చంద్రబాబుకు తెలుసు…. నేను మంచోడినని ఆయనే చెప్పారని గుర్తుచేసుకున్నారు.. మరోవైపు, జగన్ ఎప్పుడూ పిలిచి చెప్పిన పనులు చేయాలని నాకు చెప్పలేదు‌… ఎప్పుడూ పిలిస్తే అప్పుడు విచారణకు వెళ్తాను అన్నారు.. ఎనిమిది కోట్లు దొరికిందని అసత్య ప్రచారం చేశారని మండిపడ్డారు మాజీ డిప్యూటీ సీఎం నారాయణస్వామి..

ఓపెన్ ఏఐ హైదరాబాద్‌లో ఆఫీస్ పెడుతుందా..? కేటీఆర్‌ ఇచ్చిన ఆహ్వానం
హైదరాబాద్ టెక్ హబ్‌గా వేగంగా ఎదుగుతోన్న నేపథ్యంలో, అంతర్జాతీయ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సంస్థ ఓపెన్‌ఏఐ (OpenAI) తన కార్యకలాపాలను హైదరాబాద్‌లో ప్రారంభించాలని భారత రాష్ట్ర సమితి (BRS) కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌ (K.T. Rama Rao) విజ్ఞప్తి చేశారు. తాజాగా ఓపెన్‌ఏఐ సీఈవో శామ్ అల్ట్‌మన్ (Sam Altman) భారత్‌లో ఆఫీస్ ఏర్పాటు చేయాలని ప్రకటించిన విషయం తెలిసిందే. సెప్టెంబర్ నెలలో భారత్ పర్యటనకు వస్తున్నట్లు కూడా ఆయన వెల్లడించారు. ఈ నేపథ్యంలో కేటీఆర్ ఆయనకు ‘ఎక్స్‌’ (X) వేదిక ద్వారా స్వాగతం పలికారు. హైదరాబాద్‌ అనేది ప్రపంచ స్థాయి ఐటీ హబ్ మాత్రమే కాకుండా, ఆధునిక సాంకేతికతలకు అనువైన మౌలిక సదుపాయాలతో ఉన్నదని ఆయన గుర్తుచేశారు. భారత్‌లో తమ కార్యకలాపాలు విస్తరించాలనుకుంటున్న ఓపెన్‌ఏఐ వంటి సంస్థలకు హైదరాబాద్ ఆదర్శవంతమైన గేట్‌వే (Gateway) అవుతుందని కేటీఆర్ అభిప్రాయపడ్డారు. ఐటీ, బహుళజాతి కంపెనీలు, స్టార్టప్‌లు, అత్యాధునిక మౌలిక సదుపాయాలతో పాటు, స్కిల్‌డ్ మానవ వనరులు హైదరాబాద్‌లో సమృద్ధిగా ఉన్నాయని కేటీఆర్ వివరించారు.

హైడ్రా లాంటి సంస్థ దేశంలో ఎక్కడా లేదు…
హైదరాబాద్‌లో వరదలు, మురుగునీటి సమస్యలు, చెరువుల కబ్జాలు, పర్యావరణ సమస్యలు వంటి క్లిష్ట అంశాల పరిష్కారానికి ఒక ప్రత్యేక సంస్థ అవసరమని భావించిన ప్రభుత్వం, గత ఏడాది జూలైలో హైడ్రా (HYDRA) అనే ప్రత్యేక సంస్థను ఏర్పాటు చేసింది. ఈ సందర్భంగా హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ మీడియాతో మాట్లాడుతూ సంస్థ పనితీరు, భవిష్యత్ దిశపై కీలక వ్యాఖ్యలు చేశారు. ఏవీ రంగనాథ్ మాట్లాడుతూ .. “హైడ్రా లాంటి సంస్థ దేశంలో ఎక్కడా లేదు. ఇది కొత్త ప్రోగ్రామ్, కాబట్టి ఇంకా చాలా తెలుసుకోవాల్సి ఉంది. సిబ్బంది తక్కువ ఉన్నప్పటికీ, మేము భాగానే పనులు చేస్తున్నాం. తప్పులు జరిగితే వాటిని సమీక్షించుకుంటాం” అన్నారు. హైడ్రా ఏర్పాటు తర్వాత ప్రభుత్వమే జిహెచ్ఎంసి యాక్ట్‌లో మార్పులు చేసి సంబంధిత అధికారాలు కల్పించిందని కమిషనర్ తెలిపారు. ముఖ్యమంత్రి, ప్రజా ప్రతినిధులు, అధికారులు అందరూ సహకరిస్తున్నారని చెప్పారు.

నిజమైన పేదవాడు ఐదు లక్షలతో ఇల్లు కట్టుకునే పరిస్థితి లేదు
మల్కాజిగిరి పార్లమెంట్ పరిధిలోని డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల కేటాయింపు, సమస్యలను పరిష్కరించడానికి బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ తాజాగా రాష్ట్ర మంత్రితో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా సెక్రటేరియట్‌లో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డిని కలిసిన ఆయన సమస్యలపై వివరణాత్మక చర్చ నిర్వహించారు. అనంతరం ఈటల రాజేందర్ మాట్లాడుతూ, మల్కాజిగిరి ఎంపీ పరిధిలో పేదలకు కేటాయించాల్సిన డబుల్ బెడ్ రూమ్ ఇళ్లలో సమస్యలు కొనసాగుతున్నాయని వెల్లడించారు. గతంలో తప్పిపోయిన పేదల జాబితాను మంత్రి పొంగులేటికి అందించినప్పటికీ, ఇప్పటివరకు కేటాయింపులు సక్రమంగా జరిగేవి లేవని, అలాట్మెంట్ ప్రక్రియ పూర్తి కాకపోవడంతో భూములు దొంగల పుటకు చేరుతున్నాయని చెప్పారు.

సంచలన ‘ధర్మస్థల’లో అంతా తూచ్.. కంప్లైంట్ చేసిన వ్యక్తి అరెస్ట్..
కర్ణాటకలోని ధర్మస్థలలో వందల సంఖ్యలో మహిళలు, యువతుల మృతదేహాలు పూడ్చిపెట్టినట్లు ఓ పారిశుద్ధ్య కార్మికుడు చేసిన ఆరోపణలు దేశవ్యాప్తంగా సంచనలం సృష్టించిన విషయం తెలిసిందే. ఈ కేసును కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వం సీరియస్‌గా తీసుకొని, సిట్ ఏర్పాటు చేసి ప్రత్యేక దర్యాప్తుకు ఆదేశించిన విషయం తెలిసిందే. తాజాగా ఈ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఆ మృతదేహాలను తానే పూడ్చిపెట్టానని చెప్పిన పారిశుద్ధ్య కార్మికుడు భీమాను సిట్ అధికారులు అరెస్టు చేశారు. ప్రత్యేక దర్యాప్తు బృందం హెడ్ ప్రణవ్ మొహంతి మీడియాతో మాట్లాడుతూ.. తప్పుడు సమాచారంతో ప్రభుత్వాన్ని, ప్రజలను తప్పుదారి పట్టించాడన్న కారణంగా పారిశుద్ధ్య కార్మికుడు భీమాను అరెస్ట్ చేశామన్నారు. శుక్రవారం రాత్రి నుంచి శనివారం తెల్లవారుజాము వరకు ఫిర్యాదుదారుడిని విచారించామని తెలిపారు. ఫిర్యాదుదారుడు ఇచ్చిన వాంగ్మూలాలు, అందించిన పత్రాలలో అనేక వ్యత్యాసాలు ఉన్నాయని, అందుకే ఈ విచారణ చేపట్టామని పేర్కొన్నారు. మాయమాటలతో మొత్తం వ్యవస్థను నమ్మించి చివరికి ఏమీ తెలియదని చేతులు ఎత్తేశాడని దర్యాప్తులో విచారణ బృందం గుర్తించింది. నేడు భీమాను కోర్టులో హాజరుపర్చనున్నారు.

ప్రధాని మోడీ, వీవీఐపీల భద్రతకు ముప్పుగా మారిన చెట్టు.. అసలేంటి ఈ కథ..?
కొత్త పార్లమెంట్‌ భవనంలో ఆరు ప్రవేశ మార్గాలు ఉన్నాయి. అందులో గజ ద్వారం ఒకటి. ప్రధాని నరేంద్ర మోడీ తరచూ ఈ మార్గం నుంచే సభలోనికి ఎంట్రీ ఇస్తుంటారు. ఈ గేటు వద్ద “నంబర్‌ 1″గా పేర్కొనే ఓ పసుపు పూల చెట్టు ఉంది. మొదట్లో చిన్నగానే ఉన్న ఈ చెట్టు ఇప్పుడు బాగా ఎత్తు పెరిగింది. ఇప్పుడు ఈ చెట్టు ఈ ప్రాంతంలో భద్రతకు అడ్డంకిగా మారింది. వీవీఐపీలు వెళ్లే మార్గంలో ఈ చెట్టు వల్ల భద్రతాపరమైన సమస్యలు ఎదురవుతున్నాయి. దీంతో ఈ చెట్టును ఇక్కడ నుంచి తొలగించి వేరే ప్రదేశానికి మార్చాలని ప్రయత్నాలు మొదలయ్యాయి. దీని వల్ల వీవీఐపీల భద్రతకు ముప్పు ఉందని భావించిన స్పెషల్‌ ప్రొటెక్షన్‌ గ్రూప్‌(ఎస్పీజీ) కేంద్ర ప్రభుత్వానికి చెందిన సెంట్రల్‌ పబ్లిక్‌ వర్క్స్‌ డిపార్ట్‌మెంట్‌ (సీపీడబ్యూడీకి)కి సమాచారం అందించింది. ఈ చెట్టును తొలగించాలంటే ఢిల్లీ అటవీ శాఖ నుంచి అనుమతి తప్పనిసరి. దీంతో ఆ భద్రతా సిబ్బంది ఆ ప్రక్రియను ప్రారంభించారు. ఇందుకోసం ఇప్పటికే అటవీశాఖ వద్ద రూ.57వేల సెక్యూరిటీ డిపాజిట్‌ను జమ చేశారు. వచ్చేవారం పార్లమెంట్‌ ప్రాంగణంలోని ప్రేరణ స్థల్‌ వద్దకు దీన్ని మార్చేందుకు సన్నాహాలు చేస్తున్నారు.

గూగుల్ Pixel 10 ఫోన్ లో క్రేజీ ఫీచర్.. శాటిలైట్ ద్వారా వాట్సాప్ కాల్స్.. వరల్డ్ లో ఫస్ట్ ఫోన్ ఇదే
వాట్సాప్ కాల్స్, మెసేజెస్ చేయాలంటే మొబైల్ నెట్ వర్క్ లేదా వైఫై ఉండాల్సిందే. అయితే ఇప్పుడు ఇవేమీ లేకున్నా వాట్సాప్ కాల్స్ చేసుకోవచ్చు. గూగుల్ Pixel 10 క్రేజీ ఫీచర్ ను తీసుకొచ్చింది. ఇప్పుడు Pixel 10 యూజర్లు WhatsAppలో శాటిలైట్ ఆధారిత వాయిస్, వీడియో కాలింగ్‌కు మద్దతు పొందబోతున్నారు. గూగుల్ ఇటీవల తన కొత్త Pixel 10 సిరీస్ స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేసింది. లాంచ్ అయిన కొన్ని రోజుల తర్వాత, కంపెనీ అందరినీ ఆశ్చర్యపరిచే ఈ ఫీచర్‌ను ప్రకటించింది. గూగుల్ X లో ఒక పోస్ట్ షేర్ చేసి ఈ కొత్త ఫీచర్ గురించి తెలియజేసింది. ఆగస్టు 28 నుంచి పిక్సెల్ 10 సిరీస్‌లో ఈ ఫీచర్ యాక్టివేట్ చేయబడుతుందని కంపెనీ తెలిపింది. వాట్సాప్ కాల్ శాటిలైట్ నెట్‌వర్క్ ద్వారా వచ్చినప్పుడు, మీ ఫోన్ స్టేటస్ బార్‌లో శాటిలైట్ చిహ్నం కనిపిస్తుంది. దీని తరువాత, మీరు సాధారణ నెట్‌వర్క్ లేదా Wi-Fi లో చేసినట్లుగానే కాల్స్‌ను స్వీకరించొచ్చు.

పొలిటికల్‌ ఎంట్రీపై నారా రోహిత్‌ ఆసక్తికర వ్యాఖ్యలు.. మనల్ని ఎవడ్రా ఆపేది..?
సినీ ఇండస్ట్రీ నుంచి పొలిటికల్‌ ఎంట్రీ ఇచ్చిన తారలు ఎంతో మంది ఉన్నారు.. ఇప్పటికే ఎంతో మంది హీరోలు, హీరోయిన్లు, ఇతర నటులు.. రాజకీయాల్లోకి ప్రవేశించి సీఎంలు, డిప్యూటీ సీఎంలు, కేంద్రమంత్రులు, రాష్ట్రాల మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు.. ఇలా వివిధ స్థాయిల్లో పనిచేసినవారు ఉన్నారు.. మాకొద్దు బాబోయ్ ఈ రాజకీయాలు అనేవారు ఉన్నారు.. అయితే రాజకీయ నేపథ్యం ఉన్న కుటుంబం నుంచి సినీ ఇండస్ట్రీలో ఉన్న హీరో నారా రోహిత్.. తన పొలిటికల్‌ ఎంట్రీపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.. రాజకీయాల్లోకి, సినిమాలోకి వస్తే ఎవరు ఆపారని ఎదురు ప్రశ్నించారు నారా రోహిత్… మొత్తంగా ఓ ఈవెంట్‌లో పవన్‌ కల్యాణ్‌ వాడిన మనల్ని ఎవడ్రా ఆపేది..? డైలాగ్‌ను గుర్తుచేసినట్టు అయ్యింది.. రాజమండ్రిలో మీడియాతో మాట్లాడిన నారా రోహిత్.. రాజకీయాల్లోకి వస్తే చెప్తానని అన్నారు… పెదనాన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, అన్నయ్య నారా లోకేష్.. ఇలా రాజకీయ కుటుంబం నుంచే వచ్చానని అన్నారు . ఈ నెల 27వ తేదీన నారా రోహిత్ హీరోగా నటించిన సుందరకాండ చిత్రం విడుదల కానున్న నేపథ్యంలో.. చిత్ర యూనిట్ రాజమండ్రిలో సందడి చేసింది.. నారా రోహిత్ హీరోగా, ప్రతివాఘవి, శ్రీదేవి హీరోయిన్లుగా సంతోష్ నిర్మాతగా ఈ చిత్రం తెరకెక్కింది.. ఈ సందర్భంగా హీరో నారా రోహిత్, హీరోయిన్లు ప్రతివాఘవి, రుక్మిణి సినిమా ఫ్రేం శ్రీదేవి మీడియాతో మాట్లాడుతూ.. పాత సుందరకాండ సినిమాకి ఈ సినిమాకి చాలా తేడా ఉందన్నారు.. సుందరకాండ సినిమాలు రెండు ఒకటి కాదు ట్యాగ్ లైన్ గా పెట్టామని వివరించారు. ఇది కుటుంబ కథ చిత్రమని, ఎంటర్టైన్మెంట్ లవ్ స్టోరీతో కూడుకున్నదని అంటున్నారు. సినిమా మంచి విజయం సాధిస్తుందని ఆశిస్తున్నామని అన్నారు. ప్రొడ్యూసర్ సంతోష్, హీరోయిన్ ప్రతివాఘవి, శ్రీదేవి మాట్లాడుతూ.. సుందరకాండ సినిమాను ప్రేక్షకులు ఆదరించాలని కోరారు. ఈ సినిమాలో ప్రతి నటుడు మంచి రోల్ ఉందని పేర్కొంది చిత్ర యూనిట్..

తండ్రి అయిన పాపులర్ కమెడియన్.
టాలీవుడ్ కమెడియన్ తండ్రి అయ్యాడు. ఈ మేరకు ఇన్ స్టాలో పోస్టు పెట్టాడు. అతను ఎవరో కాదు మహేవ్ విట్టా. ఈయన గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. యూట్యూబ్ లో మొదట్లో కామెడీ వీడియోలతో ఫేమస్ అయ్యాడు. ఆ తర్వాత బిగ్ బాస్ కు వెళ్లి మంచి గుర్తింపు పొందాడు. అక్కడి నుంచి వరుసగా షోలు చేశాడు. మరోసారి బిగ్ బాస్ లో కనిపించాడు. బిగ్ బాస్ షోలో ఉన్నప్పుడే తన ప్రేమ విషయాన్ని బయట పెట్టాడు. తాను శ్రావణి రెడ్డి అనే అమ్మాయితో ప్రేమలో ఉన్నట్టు చెప్పిన మహేశ్.. అదే ఏడాది పెళ్లి కూడా చేసుకున్నాడు. అప్పటి నుంచి కొన్ని రోజులు గ్యాప్ తీసుకున్న మహేశ్.. ప్రస్తుతం వరుసగా వెబ్ సిరీస్ లు చేస్తున్నాడు. రెండు నెలల క్రితం తన భార్య ప్రెగ్నెంట్ అని చెప్పాడు. గత నెలలో శ్రీమంతం వేడుక ఫొటోలను కూడా బయట పెట్టాడు. ఇప్పుడు తాజాగా తన భార్య మగబిడ్డకు జన్మనిచ్చిందని తెలిపాడు. ఇందుకు సంబంధించిన ఫొటోలను షేర్ చేశాడు. ఇవి కాస్త సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. దీంతో నెటిజన్లు అతనికి విషెస్ చెబుతున్నారు. ప్రస్తుతం మహేశ్ ఓ సినిమాకు డైరెక్షన్ చేస్తున్నాడు. గతంలో జాంబిరెడ్డి, కొండపొలం లాంటి సినిమాల్లో నటించాడు. ఈ మధ్య సినిమాల్లో పెద్దగా కనిపించట్లేదు.

నానితో చిరంజీవి సినిమా అప్పుడేనా..?
మెగాస్టార్ చిరంజీవి బర్త్ డేకు కొన్ని సినిమా అప్డేట్లు వచ్చాయి. విశ్వంభర నుంచి గ్లింప్స్, మెగా 157 నుంచి టైటిల్ గ్లింప్స్ రిలీజ్ చేశారు. అలాగే డైరెక్టర్ బాబీతో ఓ సినిమాను ప్రకటించారు. కానీ శ్రీకాంత్ ఓదెలతో మాత్రం సినిమా అప్డేట్ రాలేదు. వాస్తవానికి వీరిద్దరి మధ్య ఎప్పుడో సినిమా కన్ఫర్మ్ అయింది. అనిల్ రావిపూడి సినిమా తర్వాత కచ్చితంగా శ్రీకాంత్ సినిమానే ఉంటుందని అంతా అనుకున్నారు. కానీ మెగా 158సినిమాగా బాబీ మూవీని అనౌన్స్ చేశారు. కానీ శ్రీకాంత్ ఓదెల డైరెక్షన్ లో హీరో నాని నిర్మాణంలో మూవీ గురించి ఒక్కటంటే ఒక్క అప్డేట్ కూడా రాలేదు. సినిమా నెంబర్ అయినా ప్రకటిస్తారేమో అనుకుంటే అది కూడా లేదు. ప్రస్తుతం శ్రీకాంత్ ఓదెల డైరెక్షన్ లో నాని హీరోగా ది ప్యారడైజ్ మూవీ వస్తోంది. అది మార్చి 26 2026న వస్తోంది. కాబట్టి ఈ సినిమా అయిపోయిన తర్వాతనే చిరంజీవితో మూవీ ఉండొచ్చు. విశ్వంభర కూడా సమ్మర్ లోనే రాబోతోంది. దాని తర్వాత బాబీతో మూవీ ఉంటుంది. అది అయిపోవడానికి ఎంత లేదన్నా రెండేళ్లు పడుతుంది. అంటే 2028లో బాబీ మూవీ రిలీజ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. చూస్తుంటే 2029లో నాని, చిరంజీవి, శ్రీకాంత్ ఓదెల కాంబోలో సినిమా వచ్చే అవకాశాలు ఉన్నాయి. అలా కాకుండా బాబీ 2026 ఎండింగ్ లోపు సినిమాను కంప్లీట్ చేస్తే.. అదే సినిమాతో శ్రీకాంత్ ఓదెల సినిమాను కూడా చిరు కంప్లీట్ చేయగలిగితే రెండు సినిమాలు 2028లోనే వచ్చే అవకాశాలు ఉంటాయి.

Exit mobile version