NTV Telugu Site icon

Top Headlines @ 5 PM: టాప్‌ న్యూస్‌

Top Headlines @ 5 Pm New

Top Headlines @ 5 Pm New

అఖిలపక్ష భేటీకి దూరంగా జనసేన.. అసలు ఏమైందంటే..?
డీలిమిటేషన్ పై చెన్నై వేదికగా అఖిలపక్షం సమావేశమైంది.. డీఎంకే అధినేత, తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ అధ్యక్షతన.. చెన్నైలోని ఐటీసీ చోళ హోటల్‌లో ఈ భేటీ కాగా.. పలు రాష్ట్రాల సీఎంలు, కీలక నేతలు పాల్గొన్నారు.. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, పీసీసీ అధ్యక్షుడు మహేష్‌ గౌడ్, ఎంపీ మ‌ల్లు ర‌వి, బీఆర్ఎస్‌ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి జ‌గ‌దీశ్ రెడ్డి, నిరంజన్ రెడ్డి, ఎంపి రవిచంద్ర, మాజీ ఎంపీ వినోద్ కుమార్‌.. అయితే, ఈ సమావేశానికి జనసేన నేతలు కూడా హాజరైనట్టు ప్రచారం జరిగింది.. దీనిపై స్పందించిన ఆ పార్టీ కేంద్ర కార్యాలయం.. క్లారిటీ ఇచ్చింది.. అసలు ఈ సమావేశానికి ఎందుకు హాజరుకాలేదన్న దానిపై జనసేన క్లారిటీ ఇస్తూ ఓ ప్రకటన విడుదల చేసింది.. నియోజకవర్గాల పునర్విభజనపై ఆహ్వానం వచ్చింది.. కానీ, హాజరు కాలేమని సమాచారం ఇచ్చామని జనసేన ప్రకటించింది.. చెన్నైలో డీఎంకే.. నియోజకవర్గాల పునర్విభజనపై నిర్వహించిన అఖిలపక్ష సమావేశానికి జనసేన పార్టీకి ఆహ్వానం వచ్చింది.. అయితే, హాజరుకాలేమని సమాచారం అందించామని పేర్కొంది.. ఈ సమావేశానికి జనసేన హాజరైనట్లు వచ్చిన వార్తలు కేవలం ఊహాగానాలు మాత్రమే.. ఈ సమావేశంలో పాల్గొనాలని డీఎంకే తరఫున ప్రతినిధులు వచ్చి ఆహ్వానం అందించారు.. వేర్వేరు కూటములుగా ఉన్నందున ఈ సమావేశంలో పాల్గొనడం లేదని మర్యాదపూర్వకంగా తెలియజేయాలని.. పార్టీ చీఫ్‌, డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ దిశానిర్దేశం చేశారు.. ఆ మేరకు డీఎంకేకు సమాచారం ఇచ్చాం.. నియోజకవర్గాల పునర్విభజనపై వారి అభిప్రాయలు వారికి ఉన్నట్టే – ఈ అంశంపై మా విధానం కూడా ఉంది.. ఈ విషయమై మా విధానాన్ని సాధికారికమైన వేదికపై వెల్లడిస్తామని ఓ ప్రకటనలో పేర్కొంది జనసేన కేంద్ర కార్యాలయం.

పవన్‌ కల్యాణ్‌ భుజం ఎక్కిన బుడ్డోడు.. వాడి సంతోషం చూడండి..!
డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ కనిపిస్తే చాలు.. మా వైపు చూసి చేతులు ఊపితే చాలు.. ఒక్క ఫోటో దిగే అవకాశం ఇస్తే చాలు.. ఒక్క నవ్వు నవ్వితే చాలు.. ఇలా పవర్‌ స్టార్‌, జనసేన అధినేత పవన్‌ అభిమానులు ఎన్నో కలలు కంటారు.. అయితే, ఓ చిన్నోడికి మాత్రం.. ఏకంగా పవన్‌ కల్యాణ్‌ భుజనాలను ఎక్కే అవకాశం దక్కింది.. పవన్‌ కల్యాణ్ కర్నూలు జిల్లా పర్యటనలో ఈ ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది.. ఓర్వకల్లు మండలం పూడిచెర్ల బహిరంగ సభ వేదికపైకి చేరుకున్న పవన్‌ కల్యాణ్.. ఆ సభలో ఓ పిల్లాడు.. ఎర్ర టవల్‌ తలకు కట్టుకుని కనిపించాడు.. దీంతో, ఆ బుడ్డోడిని స్టేజిపైకి రప్పించిన పవన్‌.. అతనని భుజంపై కూర్చోబెట్టుకుని ముద్దాడు.. ఇక, చిన్నోడి చెవిలో ఏదో అడగడం.. అతడు బదులు ఇవ్వడం.. పవన్‌ కల్యాణ్‌ భుజనాలపై ఉన్న సమయంలో.. ఆ బుడ్డోడి సంతోషం అంతా ఇంత కాదని చెప్పాలి.. ఈ ఆ వీడియోను సోషల్‌ మీడియాలో వదిలారు జనసేన శ్రేణులు.. దీంతో.. అది కాస్తా వైరల్‌గా మారిపోయింది.. ఈ కింది లింక్‌ను క్లిక్‌ చేసి.. మీరు కూడా ఓ లుక్ వేయండి..

వారికి గుడ్‌న్యూస్‌.. నామినేటెడ్ పోస్టుల మూడో జాబితా రెడీ..!
ఆంధ్రప్రదేశ్‌లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పటికే రెండు దఫాలుగా నామినేటెడ్‌ పోస్టులు భర్తీ చేసింది.. కూటమిలో భాగస్వాములైన తెలుగుదేశం, జనసేన, బీజేపీ నేతలకు వివిధ నామినేటెడ్‌ పోస్టులు కట్టబెట్టారు.. ఇక, మూడో జాబితాలో మరికొన్ని కీలక పోస్టులను భర్తీ చేసేందుకు కసరత్తు చేస్తోంది సర్కార్‌.. దేవాలయాల పాలక మండళ్లపై కసరత్తు పూర్తి చేశారు.. 222 మార్కెట్ యార్డ్ కమిటీల జాబితా సిద్ధం అవుతోందట.. చైర్మన్ పదవులకు 2 నుంచి 3 పేర్ల ప్రతిపాదనలు రాగా.. ఈ వారంలో పదవుల భర్తీకి సన్నాహాలు సాగుతున్నాయి.. రాష్ట్రంలోని ప్రముఖ దేవాలయాల పాలక మండళ్లను భర్తీ చేసేందుకు కార్యాచరణ సిద్ధం చేసింది సర్కార్.. ఇప్పటికే పాలకమండళ్ల నియామకంపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వద్దకు పూర్తిస్తాయి నివేదిక వెళ్లగా.. తెలుగుదేశంతో పాటు బీజేపీ, జనసేన పార్టీలిచ్చిన సిఫార్సుల జాబితా కూడా చంద్రబాబు వద్దకు చేరిందని సమాచారం.. ఈసారి మొత్తం 21 ప్రముఖ ఆలయాలకు పాలకమండళ్లను నియమించనున్నారు.. దేవాలయ కమిటీ చైర్మన్ తో పాటు సభ్యులను కూడా నియమించేందుకు రంగం సిద్ధం అవుతోంది..

ఒకే గ్రామంలో 200 మందికి పైగా క్యాన్సర్‌..! వణికిపోతోన్న బలభద్రపురం
ఒకే గ్రామంలో 200 మందికి పైగా క్యాన్సర్‌ బారిన పడ్డారనే అనుమానాలు ఇప్పుడు జలభద్రపురాన్ని వణికిస్తున్నాయి.. తూర్పుగోదావరి జిల్లా బిక్కవోలు మండలం బలభద్రపురం గ్రామంలో క్యాన్సర్ కేసులు కలకలం సృష్టిస్తున్నారు.. గ్రామంలో 200 మందికి పైగా క్యాన్సర్ బారిన పడ్డారనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.. ఈ గ్రామాన్ని క్యాన్సర్ మహమ్మారి నుంచి కాపాడాలంటూ ఇటీవల అసెంబ్లీలో ప్రస్తావించారు స్థానిక ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి.. ఇక, క్యాన్సర్‌ కేసులపై అప్రమత్తమైన తూర్పు గోదావరి జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారులు.. ఇవాళ గ్రామంలో 31 బృందాలతో ఇంటింటి ఆరోగ్య సర్వే, గ్రామస్తులకు స్క్రీనింగ్ పరీక్షలు నిర్వహించారు.. బలభద్రపురం గ్రామంలో సుమారు పదివేల వరకు జనాభా నివాసం ఉంటున్నారు.. ఇప్పటికే 23 మంది క్యాన్సర్ చికిత్స తీసుకున్నట్లుగా గుర్తించామని జిల్లా కలెక్టర్ ప్రశాంతి వెల్లడించారు.. అయితే, స్థానికంగా వాతావరణం కాలుష్యం కావడం.. నీరు, గాలి.. ఇలా అన్నీ కలుషితం కావడంతో.. గ్రామస్తులకు ఈ పరిస్థితి వచ్చిందంటున్నారు.. బలభద్రపురం సమీపంలో ఉన్న గ్రాసిమ్ ఇండస్ట్రీస్ తో పాటు ఇతర పరిశ్రమల మూలంగా.. గాలి, నీరు కాలుష్యం అవుతున్నాయని.. దాని కారణంగా వందలాది మంది క్యాన్సర్ బారినపడ్డారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు గ్రామస్తులు.. ఇప్పటికే వందలాది మంది క్యాన్సర్‌ బారినపడ్డారు.. మరికొంత మందికి దాని బారిన పడకుండా.. కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వాన్నిదేనని విజ్ఞప్తి చేస్తున్నారు స్థానికులు.. అయితే, బలభద్రపురంలో క్యాన్సర్‌ మహమ్మారి విజృంభణ తీవ్రంగా ఉందని ఆవేదన వ్యక్తం చేశారు అనపర్తి ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి.. మృతులపై వైద్య, ఆరోగ్యశాఖ అధికారులు చెబుతున్న లెక్కలు సరికాదన్నారు.. పీహెచ్‌సీలకు వచ్చిన కేసుల ఆధారంగా అధికారులు లెక్కలు చెబుతున్నారు.. అసలు క్యాన్సర్‌ రోగులు పీహెచ్‌సీలకు ఎందుకొస్తారు? అని ప్రశ్నించారు.. అయితే, ఏడాది కాలంలో ఆ ఊరిలో క్యాన్సర్‌తో చనిపోయిన వారి దాదాపు 15 మంది కుటుంబాల్ని తానే పరామర్శించేందుకు వెళ్లానని ఎమ్మెల్యే చెబుతున్నారు.

డీలిమిటేషన్‌ స‌ద‌స్సులో ప్రత్యేక ఆక‌ర్షణ‌గా రేవంత్ రెడ్డి..
నియోజ‌క‌వ‌ర్గాల పున‌ర్విభ‌జ‌న‌కు సంబంధించి ద‌క్షిణాది రాష్ట్రాలతో పాటు న‌ష్ట‌పోయే ఇత‌ర రాష్ట్రాల హ‌క్కుల‌ను కాపాడుకునే క్ర‌మంలో రెండో స‌ద‌స్సుకు హైద‌రాబాద్‌లో వేదిక‌ కానుంది. పున‌ర్విభ‌జ‌న‌కు సంబంధించి చెన్నైలో శ‌నివారం నిర్వ‌హించిన స‌ద‌స్సు ఈ మేర‌కు తీర్మానించింది. స‌దస్సులో ప్ర‌సంగించిన ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి పున‌ర్విభ‌జ‌న‌తో నష్ట‌పోనున్న రాష్ట్రాల ప్ర‌జ‌ల అభిమ‌తానికి అనుగుణంగా రెండో స‌ద‌స్సును హైద‌రాబాద్‌లో నిర్వ‌హిస్తామ‌ని, అనంత‌రం భారీ బ‌హిరంగ స‌భ ఏర్పాటు చేస్తామ‌ని తెలిపారు. ఇందుకు స‌ద‌స్సులో పాల్గొన్న‌వారంతా మ‌ద్ద‌తు తెల‌ప‌డంతో పున‌ర్విభ‌జ‌న సద‌స్సు, స‌భ‌కు హైద‌రాబాద్ వేదిక‌గా మార‌నుంది. పున‌ర్విభ‌జ‌న‌పై ద‌క్షిణాదితో పాటు న‌ష్ట‌పోయే ఇత‌ర రాష్ట్రాల గ‌ళాన్ని బ‌లంగా వినిపించేందుకు ఆయా రాష్ట్రాల్లోని అన్ని పార్టీల ఎంపీల‌తో ఒక క‌మిటీని ఏర్పాటు చేయాల‌ని సీఎం రేవంత్ రెడ్డి సూచించారు. దేశ రాజ‌ధాని ఢిల్లీలోనే అన్ని రాజ‌కీయ ప‌ర‌మైన నిర్ణ‌యాలు జ‌రుగుతాయ‌ని, ఈ నేప‌థ్యంలో అక్క‌డ కార్య‌క‌లాపాల‌ను ఎప్ప‌టిక‌ప్పుడు గ‌మ‌నిస్తూ..ప‌ర‌స్ప‌రం స‌మ‌న్వ‌యం చేసుకుంటూ.. భ‌విష్య‌త్ కార్యాచ‌ర‌ణ రూప‌క‌ల్ప‌న‌కు ఎంపీల‌తో కూడిన క‌మిటీ ప‌ని చేయాల‌ని, ఇందుకు ప్ర‌త్యేక కార్యాల‌యం ఏర్పాటు చేయాల‌ని స‌ద‌స్సులో ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి సూచించారు. ఇందుకు స‌ద‌స్సులో పాల్గొన్న ముఖ్య‌మంత్రులు, నాయ‌కులు అంగీక‌రించ‌డంతో ఢిల్లీలో ఆ కార్యాల‌యం ఏర్పాటుకు రంగం సిద్ధ‌మైంది.

డ్రగ్ డి-అడిక్షన్ సెంటర్‌ను ప్రారంభించిన మంత్రి సీతక్క
వికలాంగులు, వయోవృద్ధులు, ట్రాన్స్ జెండర్ సాధికారత శాఖ ఆధ్వర్యంలో సైదాబాద్ అబ్జర్వేషన్ హోమ్ లో డ్రగ్ డి-అడిక్షన్ సెంటర్‌ను మంత్రి సీతక్క ప్రారంభించారు. మిషన్ పరివర్తన కార్యక్రమం ద్వారా దేశంలోని డ్రగ్స్ రహిత రాష్ట్రంగా తెలంగాణను తీర్చిదిద్దాలన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కలను సహకారం చేస్తూ ముందుకు వెళుతున్నామని మంత్రి సీతక్క తెలిపారు. డి అడిక్షన్ సెంటర్ నిర్వహణ కోసం వికలాంగులు,వయోవృద్ధులు,ట్రాన్స్ జెండర్ సాధికారత శాఖ ద్వారా 13 లక్షల 80 వేల రూపాయలు మంజూరు చేయడం జరిగిందని భవిష్యత్తులో ఈ సెంటర్ కు ఎలాంటి ఇబ్బందులు కలకుండా నడపడానికి నిధులు మంజూరు చేసినట్టు సీతక్క తెలిపారు. డి-అడిక్షన్ సెంటర్ కోసం ప్రత్యేక మానసిక నిపుణుల ద్వారా మాదకద్రవ్యాలకు బానిసైన పిల్లకు కౌన్సిలింగ్,వైద్య చికిత్స,ఇతర అనేక సేవలు అందించడం జరుగుతుందని మంత్రి తెలిపారు. త్వరలోనే డి-అడిక్షన్ సెంటర్ ను అన్ని అబ్జర్వేషన్ హోం లో ఏర్పాటు చేయడానికి కృషి చేస్తామని అన్నారు. యువత మారకద్రవ్యాల పట్ల ఆకర్షితులు కాకుండా తమ లక్ష్యాలను సాధించడంలో నిమగ్నమై మారకద్రవ్య రహిత తెలంగాణ నిర్మాణంలో భాగస్వామ్యం కావాలని కోరారు.

బెట్టింగ్ యాప్స్ ప్రమోటర్లకు చుక్కలే.. రాష్ట్ర వ్యాప్తంగా కేసులు
బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తున్న సెలబ్రిటీలు, సోషల్ మీడియా ఇన్ ఫ్లూయెన్సర్లకు దిమ్మ తిరిగిపోతోంది. వరుస కేసులతో ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు. హా ఏముందిలే నాలుగు యాప్స్ ప్రమోట్ చేస్తే లక్షల డబ్బు వస్తుంది.. ఎంచక్కా ఎంజాయ్ చేయొచ్చు అనుకున్నారు. కానీ అవతల ఎన్ని కుటుంబాలు సర్వనాశనం అవుతున్నాయో పట్టించుకోలేదు. ఇప్పుడు కేసులు నమోదవుతుండటంతో తెలియక చేశాం క్షమించేయండి అంటూ వీడియోలు రిలీజ్ చేస్తున్నారు. కానీ అసలు సినిమా ఇప్పుడే మొదలైంది. మొన్న పంజాగుట్టలో 11 మంది సినీ సెలబ్రిటీలపై కేసులు నమోదయ్యాయి. ఇప్పుడు ఏకంగా రాష్ట్రవ్యాప్తంగా చాలా మంది కేసులు పెడుతున్నారు. ఏకంగా కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యే హనుమంతరావు కూడా రంగంలోకి దిగాడు. నేరేడ్ మెట్ పోలీస్ స్టేషన్ లో ఆయన ఫిర్యాదు చేశారు. బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని కోరారు. బెట్టింగ్ మహమ్మారి వల్ల వేలాది మంది సూసైడ్ చేసుకున్నారని.. వారికి న్యాయం చేయాలంటూ విజ్ఞప్తి చేశారు. అటు ఓయూలో జనసేన విద్యార్థి విభాగం కూడా రంగంలోకి దిగింది. ఓయూ పోలీస్ స్టేషన్ లో విద్యార్థి విభాగం అధ్యక్షుడు సంపత్ నాయక్ ఫిర్యాదు చేశారు. బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తున్న జబర్దస్త్ వర్ష, హర్షసాయి, నటుడు అలీ సతీమణి జుబేద, యాంకర్ లాస్యలతో పాటు మరికొందరిపై చర్యలు తీసుకోవాలంటూ ఫిర్యాదు చేశారు.

హైదరాబాద్ వేదికగా రెండో “డీలిమిటేషన్” సమావేశం..
జనాభా ప్రాతిపదికన నియోజకవర్గాల పునర్విభజన(డీలిమిటేషన్)ని దక్షిణాది రాష్ట్రాల నేతల వ్యతిరేకిస్తున్నారు. ఈ నేపథ్యంలో శనివారం చెన్నై వేదికగా తమిళనాడు సీఎం స్టాలిన్ అధ్యక్షతన డీలిమిటేషన్‌పై మొదటి జాయింట్ యాక్షన్ కమిటీ(జేఏసీ) సమావేశం జరిగింది. ఈ సమావేశానికి తెలంగాణ, కేరళ, పంజాబ్ సీఎంలు రేవంత్ రెడ్డి, పినరయి విజయన్, భగవంత్ మాన్‌తో పాటు కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్, టీఆర్ఎస్ నేత కేటీఆర్ తదితరులు హాజరయ్యారు. జనాభా ప్రాతిపదికన డీలిమిటేషన్ చేస్తే, దక్షిణాది రాష్ట్రాల ప్రజలు ద్వితీయ శ్రేణి పౌరులుగా మారుతారని నేతలు ఆరోపిస్తున్నారు. మెరుగైన జనాభా నియంత్రణ చర్యల్ని అమలు చేయడంతో దక్షిణాది రాష్ట్రాల జనాభా తగ్గిందని వారు చెబుతున్నారు.

నాగ్‌పూర్ అల్లర్ల నిందితులపై బుల్డోజర్ యాక్షన్, ఆస్తి నష్టం రికవరీ..
ఔరంగజేబు సమాధి వివాదం నేపథ్యంలో ఇటీవల మహారాష్ట్ర నాగ్‌పూర్ నగరంలో పెద్ద ఎత్తున ఘర్షణలు, అల్లర్లు జరిగాయి. సోమవారం, ప్రార్థనలు ముగిసిన తర్వాత కొందరు ముస్లిం మూక రోడ్లపైకి వచ్చి వాహనాలకు, దుకాణాలకు ముప్పుపెట్టారు. మరో వర్గం దుకాణాలు, వ్యాపారాలను లక్ష్యం చేసుకుని దాడి చేసినట్లు సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ చెప్పారు. ఇది ముందస్తు ప్రణాళిక ప్రకారం జరిగిన దాడిగా వెల్లడించారు. ఈ కేసులో ప్రధాన సూత్రధారి అయిన ఫహీమ్ ఖాన్‌తో పాటు మరో ఐదుగురిపై దేశద్రోహ చట్టాల కింద కేసులు నమోదయ్యాయి. నాగ్‌పూర్ హింసాకాండలో దెబ్బతిన్న ఆస్తుల విలువను అల్లర్లు చేసిన వారి నుంచి వసూలు చేస్తామని సీఎం ఫడ్నవీస్ చెప్పారు. చెల్లించడంలో విఫలమైతే వారి ఆస్తుల్ని స్వాధీనం చేసుకుని విక్రయించాల్సి వస్తుందని ఆయన శనివారం చెప్పారు. ఎక్కడ అవసరమైతే అక్కడ బుల్డోజర్ యాక్షన్ తీసుకుంటామని చెప్పారు. విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. ఇప్పటి వరకు సీసీటీవీ కెమెరాల నుంచి ఆడియో, వీడియో ఫుటేజ్‌లను విశ్లేషించామని, 104 మంది అల్లర్లకు పాల్పడినట్లు వారిని గుర్తించామని, 12 మంది మైనర్లతో సమా 92 మందిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకున్నామని చెప్పారు.

కోల్‌కతాలో ఆరెంజ్ అలర్ట్.. మొదటి మ్యాచ్‌కు వరుణుడు కరుణిస్తాడా?
ఐపీఎల్ 2025 మొదటి మ్యాచ్ ఈరోజు (మార్చి 22, శనివారం) కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్ మైదానంలో జరగనుంది. 18వ సీజన్.. కోల్‌కతా నైట్ రైడర్స్ vs రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మ్యాచ్‌తో ప్రారంభమవుతుంది. అయితే.. వర్షం అభిమానుల ఉత్సాహాన్ని క్షీణింపజేస్తోంది. గత రెండు రోజులుగా కోల్‌కతాలో ఆరెంజ్ అలర్ట్ అమలులో ఉంది. బంగాళాఖాతంలో ఏర్పడిన యాంటీ సైక్లోనిక్ ప్రసరణ కారణంగా మార్చి 22 వరకు కోల్‌కతాలో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ (IMD) అంచనా వేసింది. నిన్న సాయంత్రం.. వర్షం కారణంగా ఇరు జట్ల ప్రాక్టీస్ సెషన్లు రద్దయ్యాయి. కానీ.. సాయంత్రం 4:00 గంటలకు కోల్‌కతాలో ఎండగా ఉంది. ఇదే వాతావరణం కొనసాగితే.. మ్యాచ్ సమయానికి ప్రారంభమయ్యే అవకాశం ఉంది. మూడు సార్లు ఐపీఎల్ టైటిల్ గెలిచిన కోల్‌కత్తా నైట్ రైడర్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో 34 మ్యాచులు ఆడింది. ఇందులో 20 సార్లు విజయం అందుకుంది. ఆర్‌సీబీ జట్టుకి కేవలం 14 మ్యాచుల్లో మాత్రమే విజయం దక్కింది.. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుపై కేకేఆర్ అత్యధిక స్కోరు 222/6. గత ఏడాది ఈడెన్ గార్డెన్‌లో జరిగిన మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన కేకేఆర్ 222 పరుగులు చేయగా లక్ష్యఛేదనలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు 221 పరుగులకి ఆలౌట్ అయ్యంది. 1 పరుగు తేడాతో కేకేఆర్ థ్రిల్లింగ్ విక్టరీ అందుకుంది. ఐపీఎల్‌లో అత్యల్ప స్కోరు 49 ఆలౌట్. ఈ స్కోరు కేకేఆర్‌తో మ్యాచ్‌లోనే నమోదు చేసింది ఆర్‌సీబీ.. 2017 సీజన్‌లో ఈడెన్ గార్డెన్‌లో జరిగిన మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన కోల్‌కత్తా, 131 పరుగులకి ఆలౌట్ అయ్యింది. అయితే లక్ష్యఛేదనలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు 49 పరుగులకే చాపచుట్టేసింది. ఈ నేపథ్యంలో ఇరు జట్ల మధ్య మధ్య చిరకాల వైరం కొనసాగుతోంది. ఈ మ్యాచ్ పై అటు అభిమానులు, ఇటు ప్లేయర్లు ఆశలు పెట్టుకుంటున్నారు. చివరికి ఎవరకు గెలుస్తారో వేచి చూడాల్సి ఉంది.

ఆరోజే సూసైడ్ చేసుకునే వాడిని.. ఎస్జే సూర్య షాకింగ్ కామెంట్స్!
తమిళ సినిమా దర్శకుడు, నటుడు ఎస్ జె సూర్య తాజాగా జరిగిన వీర వీర శూరన్ 2 ప్రెస్ మీట్‌లో తాను డైరెక్ట్ చేసిన ఖుషి సినిమా గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు. 2000 సంవత్సరంలో విజయ్, జ్యోతిక జంటగా విడుదలైన ఈ చిత్రం గురించి మాట్లాడుతూ, ఆ సినిమా డిస్ట్రిబ్యూటర్ షో సమయంలో తనకు కలిగిన అనుభవాలను ఆసక్తికరంగా వివరించారు. ఈ వ్యాఖ్యలు సినీ వర్గాల్లో, అభిమానుల మధ్య చర్చనీయాంశంగా మారాయి. ఎస్ జె సూర్య మాట్లాడుతూ, “ఖుషి సినిమా డిస్ట్రిబ్యూటర్ షో వేసినప్పుడు అందరూ స్మశానంలో కూర్చుని సినిమా చూసినట్టు చూశారు. ఆ సమయంలో పరిస్థితి అలానే ఉంటే నేను అసలే పిచ్చివాడిని, సూసైడ్ చేసుకునేవాడిని” అని షాకింగ్ విషయాన్ని వెల్లడించారు. ఈ వ్యాఖ్యలు ఆ సమయంలో సినిమాపై ఆయనకు ఉన్న ఒత్తిడిని, ఆందోళనను స్పష్టంగా తెలియజేస్తున్నాయి. డిస్ట్రిబ్యూటర్ షో సమయంలో సినిమా చూస్తున్న వారి నుంచి ఎలాంటి స్పందన రాకపోవడం ఆయనను తీవ్రంగా కలవరపెట్టినట్లు తెలుస్తోంది. “కానీ తరువాతి రోజు పరిస్థితి అంతా మారిపోయింది. స్మశానంలో ఉన్నట్టు అనిపించినా రెండో రోజు ఐపీఎల్ స్టేడియం లాగా పరిస్థితి తయారయింది” అని ఆయన చెప్పారు. అంటే, సినిమా విడుదలైన తర్వాత ప్రేక్షకుల నుంచి వచ్చిన అనూహ్య స్పందన, ఊహించని విజయాన్ని అందించాయని చెప్పుకొచ్చారు. ఖుషి సినిమా తర్వాత విమర్శకుల ప్రశంసలతో పాటు బాక్సాఫీస్ వద్ద కూడా మంచి విజయాన్ని సాధించిన సంగతి తెలిసిందే.

హైకోర్టును ఆశ్రయించిన సన్నీ యాదవ్
తెలుగు మోటోవ్లాగర్‌గా, సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్‌గా పేరొందిన బయ్యా సన్నీ యాదవ్ మరోసారి వార్తల్లో నిలిచాడు. సూర్యాపేట జిల్లాలోని నూతనకల్ పోలీస్ స్టేషన్‌లో ఆన్‌లైన్ బెట్టింగ్ యాప్‌లను ప్రమోట్ చేసిన ఆరోపణలపై నమోదైన కేసులో అతను ముందస్తు బెయిల్ కోసం హైకోర్టును ఆశ్రయించాడు. ఈ కేసు సంబంధించి దాఖలు చేసిన పిటిషన్‌పై హైకోర్టు విచారణ జరిపింది, అయితే తదుపరి విచారణను మార్చి 24, 2025కి వాయిదా వేసింది. సన్నీ యాదవ్‌పై మార్చి 5, 2025న నూతనకల్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. అతను తన సోషల్ మీడియా ఖాతాల ద్వారా ఆన్‌లైన్ బెట్టింగ్ యాప్‌లను పలుమార్లు ప్రమోట్ చేసినట్లు ఆరోపణలు వచ్చాయి. ఈ విషయంపై స్థానిక పోలీసులు ఫిర్యాదు ఆధారంగా చర్యలు తీసుకున్నారు.