NTV Telugu Site icon

Top Headlines @ 5 PM: టాప్‌ న్యూస్‌

Top Headlines @ 5 Pm New

Top Headlines @ 5 Pm New

చేనేత వస్త్రాల అమ్మకాలు.. ఏపీ-తమిళనాడు మధ్య ఒప్పందం..
చేనేత వస్త్రాల అమ్మకాలపై ఆంధ్రప్రదేశ్ – తమిళనాడు రాష్ట్రాల మధ్య కీలక ఒప్పందం కుదురింది.. ఆప్కో.. కో ఆప్టెక్స్ లలో రెండు రాష్ట్రాల చేనేత వస్త్రాలు అమ్ముకునేందుకు వీలుగా ఎంవోయూ కుదుర్చుకున్నారు.. ఈ ఏడాది 9 కోట్లకు పైగా వ్యాపార నిర్వహణ లక్ష్యంగా పెట్టుకున్నారు.. రెండు రాష్ట్రాల మంత్రులు సవిత.. గాంధీ సమక్షంలో అధికారుల మధ్య ఒప్పందం జరిగింది.. అయితే, ఏపీలో తయారవుతున్న చేనేత ఉత్పత్తులకు విస్తృతమైన మార్కెటింగ్ కల్పించే లక్ష్యంలో భాగంగా తమిళనాడు ప్రభుత్వంతో ఎంవోయూ కుదుర్చుకుంటున్నట్టు రాష్ట్ర చేనేత, జౌళి శాఖ మంత్రి సవిత వెల్లడించారు.. చేనేత కార్మికులకు 365 రోజుల పాటు పని కల్పిస్తూ వారు ఆర్థికంగా, సామాజికంగా గౌరవ ప్రదమైన జీవనం సాగించడమే లక్ష్యంగా కూటమి సర్కార్‌ ముందుకు సాగుతోందన్నారు. ఈ లక్ష్య సాధనలో భాగంగా జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో చేనేత ఉత్పత్తుల అమ్మకాలకు మార్కెటింగ్ ను విస్తరించే పనిలో పడినట్టు పేర్కొన్నారు.. దీనిలో భాగంగా రాష్ట్రానికి ఆప్కోను తమళినాడుకు చెందిన కో ఆప్టెక్స్ తో ఎంవోయూ కుదుర్చుకున్నాయి..

జగన్‌కు భయం.. అందుకే అసెంబ్లీకి రావడంలేదు..!
వైఎస్‌ జగన్‌, వైసీపీ నేతలపై విరుచుకుపడ్డారు మంత్రి కొల్లు రవీంద్ర.. కృష్ణా జిల్లా గుడివాడ టీడీపీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన ఆయన.. జగన్ ఐ ప్యాక్ డ్రామాలు ప్రజలు నమ్మరని తెలిపారు.. అధికారంలో ఉండగా చేసిన తప్పులను ప్రశ్నిస్తామనే భయంతో… జగన్ అసెంబ్లీకి రావడం లేదని విమర్శించారు.. పోలీసులను బెదిరించే నీచ రాజకీయాలకు జగన్ తెర లేపారని ఫైర్‌ అయ్యారు.. దళిత సోదరుని కిడ్నాప్ చేస్తే కేసులు పెట్టరా? అని నిలదీశారు.. ప్రజలు గుడ్డలూడదీసి రోడ్డుమీద నిల్చోబెట్టినా.. జగన్ ప్రవర్తనలో మార్పు రావడం లేదన్నారు.. అసలు జగన్ ఏం మాట్లాడుతున్నాడో ఎవరికి అర్థం కావడం లేదు. మిర్చి రైతుల సమస్యలపై కేంద్ర మంత్రితో సీఎం చంద్రబాబు మాట్లాడారని వెల్లడించారు. అయితే, ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ అమల్లో ఉందని అధికారులు చెప్పినా.. రాజకీయ స్వార్థానికే వైఎస్‌ జగన్ గుంటూరు మిర్చి యార్డ్ కి వెళ్లారని దుయ్యబట్టారు మంత్రి కొల్లు రవీంద్ర.. పెయిడ్ ఆర్టిస్టులను రైతులుగా నిలబెట్టి… ఐ ప్యాక్ చేస్తున్న డ్రామాలను ప్రజలు ఛీ కొడుతున్నారని పేర్కొన్నారు.. ఇక, మాజీ మంత్రి కొడాలి నాని వ్యాఖ్యలకు కౌంటర్‌ ఇచ్చిన రవీంద్ర.. బూతులు మాట్లాడడానికైతే ఉద్యోగం అవసరం… ప్రజాసేవ చేయడానికి ఉద్యోగం కావాలా? అని ఎద్దేవా చేశారు.. ప్రతిపక్షంలో ఉన్న.. అధికారంలో ఉన్న… ప్రజలకు జవాబుదారీగానే తాము పని చేశాం. అవినీతి, అరాచకాలు, విధ్వంసంతో నాశనమైన కృష్ణాజిల్లా… ఖ్యాతిని తిరిగి తీసుకొచ్చేందుకు మేమంతా కష్టపడుతున్నాం అన్నారు మంత్రి కొల్లు రవీంద్ర..

మిర్చి యార్డ్ అధికారులు, ట్రేడర్స్ తో భేటీకి సిద్ధమైన సీఎం చంద్రబాబు..
మిర్చి ధరలు పడిపోవడంతో రైతులు గగ్గోలు పెడుతున్నారు.. ఇక, పాలక, ప్రతిపక్ష నేతల ఎంట్రీతో.. మిర్చి ధరలకు రాజకీయరంగు పులిమినట్టు అయ్యింది.. ఇప్పటికే మిర్చి రైతుల దుస్థితిని కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లిన ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు.. రేపు మిర్చి యార్డ్ అధికారులతో, ట్రేడర్స్ తో ప్రత్యేకంగా సమావేశం కానున్నారు.. ఈ ఏడాది మిర్చి ధరల పతనంతో తీసుకోవాల్సిన చర్యలపై సమావేశం నిర్వహించనుంది రాష్ట్ర ప్రభుత్వం… ఐదు లక్షల ఎకరాల్లో ఈ ఏడాది మిర్చి సాగైనట్టు అంచనాలు ఉండగా.. 12 లక్షల మెట్రిక్ టన్నుల్లో.. ఇప్పటికే నాలుగు లక్షల మెట్రిక్ టన్నులను వ్యాపార వర్గాలు కొనుగోలు చేశాయి.. ఇక, మిగిలిన 8 లక్షల మెట్రిక్ టన్నుల మిర్చి పంటకు గిట్టుబాటు ధర కల్పించేలా ప్రభుత్వం చర్యలు తీసుకోనుంది.. ఎప్పుడూ లేనంతగా రేట్లు పడిపోవడం.. దీనిపై రాజకీయంగా విమర్శలు.. రైతుల నుంచి విజ్ఞప్తులు వస్తున్న తరుణంలో రంగంలోకి దిగింది ఏపీ ప్రభుత్వం.. రేపు వ్యాపారులు, మార్కెట్ కమిటీ ప్రతినిధులతో మాట్లాడి ధరల పతనానికి కారణాలను తెలుసుకోనుంది సర్కార్‌.. అయితే, రాష్ట్ర ప్రభుత్వం తీసుకోనున్న నిర్ణయాలపై మిర్చి రైతుల్లో సర్వత్ర ఉత్కంఠ నెలకొంది..

మావోయిస్టు కమాండర్ వంజెం కేషా లొంగుబాటు.. వరుస ఎన్‌కౌంటర్లతో మావోయిస్టులకు భారీ దెబ్బ
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల కఠిన నిర్భందాలతో పాటు వరుస ఎన్‌కౌంటర్ల కారణంగా మావోయిస్టు శక్తి క్రమంగా క్షీణిస్తోంది. అనేక మంది మావోయిస్టులు ఎదురు కాల్పుల్లో మరణిస్తుండగా, మరికొందరు లొంగుబాటుకు సిద్ధమవుతున్నారు. ఈ నేపథ్యంలో, మావోయిస్టు పార్టీ గొత్తికొయ ఏరియా కమిటీ సభ్యురాలు, ప్రోటెక్షన్ గ్రూప్ కమాండర్ వంజెం కేషా అలియాస్ జిన్ని వరంగల్ పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా ఎదుట లొంగిపోయింది. వంజెం కేషా ఛత్తీస్‌గఢ్‌లోని బీజాపూర్ జిల్లా పామెడ్ మండలం, రాసపల్లి గ్రామానికి చెందినది. చిన్నతనం నుంచే చైతన్య నాట్య మండలిలో పని చేసిన ఆమె, మావోయిస్టు పార్టీలోని సభ్యులతో పరిచయం పెంచుకుంది. 2017లో పామెడ్‌ లోకల్ స్క్వాడ్ కమాండర్ గొట్టే కమల ద్వారా మావోయిస్టు పార్టీలో చేరింది. 2019లో కేషా అబుజ్‌మడ్ ప్రాంతానికి బదిలీ అయ్యింది. అక్కడ కేంద్ర కమిటీ సభ్యుడు కడారి సత్యనారాయణ రెడ్డి (కొసా)కు ప్రోటెక్షన్ గ్రూప్ సభ్యురాలిగా నియమితమైంది. 2021లో మావోయిస్టు కేంద్ర నాయకత్వం ఆమెను ఏరియా కమిటీ సభ్యురాలిగా పదోన్నతి కల్పించింది. 2022 డిసెంబర్ వరకు ప్రోటెక్షన్ గ్రూప్ కమాండర్‌గా పని చేసింది.

14 నెలల్లో తెలంగాణ రాష్ట్రాన్ని రాహుల్ గాంధీకి తాకట్టు పెట్టాడు
ప్రపంచమంతా ఎరువుల ధరలు పెరిగితే ఒక్క భారతదేశంలోనే రేటు పెరగలేదని, కాంగ్రెస్ హయాంలో యూరియా బ్లాక్ మార్కెట్ లో అమ్ముకున్నారని ఆరోపించారు కేంద్రమంత్రి కిషన్‌ రెడ్డి. ఇవాళ ఆయన మెదక్‌లో మీడియాతో మాట్లాడుతూ.. ప్రధాని మోడీ హయాంలో తెలంగాణకి పసుపు బోర్డు వచ్చిందని, తెలంగాణలో ప్రధాని ఇచ్చిన పథకాలు అమలు కావాలంటే ఇక్కడ కూడా డబుల్ ఇంజన్ సర్కార్ రావాలన్నారు కిషన్‌ రెడ్డి. కేసీఆర్ కుటుంబం తెలంగాణని దోపిడీ చేస్తే…ఇప్పుడు సోనియాగాంధీ కుటుంబం దోపిడి చేస్తుందని, గతంలో కేసీఆర్ మెడలు ఎలా వంచామో…ఇప్పుడు రేవంత్ రెడ్డి మెడలు వంచుతామన్నారు. గత పదేళ్ళలో కేసీఆర్ కుటుంబం తెలంగాణ రాష్ట్రాన్ని దోపిడీ చేసిందని, 14 నెలల్లో తెలంగాణ రాష్ట్రాన్ని రాహుల్ గాంధీకి తాకట్టు పెట్టాడన్నారు కిషన్‌ రెడ్డి. రాహుల్, రేవంత్ టాక్స్ ల పేరుతో బెదిరించి డబ్బు వసూళ్లు చేస్తున్నారని, ఆనాడు కేసీఆర్ కుటుంబం దోపిడీ చేస్తే ఇప్పుడు రాహుల్ గాంధీ దోపిడీ చేస్తున్నాడన్నారు. హైదరాబాద్ చుట్టు పక్కల ఉన్న ప్రభుత్వ భములను రేవంత్ రెడ్డి అమ్మేస్తారని, రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ ఉన్నన్ని రోజులు వాళ్ళు ఇచ్చిన హామీలు అమలు కావని ఆయన వ్యాఖ్యానించారు. కేటీఆర్ మాట్లాడినట్టే ఎగిరెగిరి సీఎం రేవంత్ మాట్లాడుతున్నారని, మేము బియ్యం ఇస్తుంటే కేసీఆర్ కి ఇక్కడ రేషన్ కార్డు ఇవ్వడానికి మనసు రాలేదన్నారు. వైఎస్సార్‌ ఇచ్చిన రేషన్ కార్డులే ఇప్పటికి ఉన్నాయని, సీఎం రేవంత్ కూడా రేషన్ కార్డులు ఇవ్వకుండా కాలయాపన చేస్తున్నారన్నారు కిషన్‌ రెడ్డి.

‘నువ్వు సన్నగా ఉన్నావు, నువ్వంటే నాకు ఇష్టం’’.. అర్ధరాత్రి మహిళకు మెసేజ్.. కోర్టు కీలక తీర్పు..
గుర్తు తెలియని మహిళకు రాత్రిపూట ‘‘ నువ్వు స్లిమ్‌గా ఉన్నావు, చాలా స్మార్ట్‌గా అందంగా ఉన్నాము, నువ్వుంటే నాకు ఇష్టం’’ అంటూ మెసేజ్ చేయడం అసభ్యకరమని ముంబైలోని సెషన్స్ కోర్టు తీర్పు చెప్పింది. మాజీ కార్పొరేటర్‌కి వాట్సాప్‌లో అశ్లీల సందేశాలు పంపిన వ్యక్తిని దోషిగా నిర్ధారిస్తూ అదనపు సెషన్స్ జడ్జి (దిండోషి) డిజి ధోబ్లే ఈ వ్యాఖ్యలు చేశారు. “నువ్వు సన్నగా ఉన్నావు”, “నువ్వు చాలా స్మార్ట్ గా కనిపిస్తున్నావు”, “నువ్వు అందంగా ఉన్నావు”, “నువ్వు పెళ్లి చేసుకున్నావా లేదా?” వంటి సందేశాలతో కూడిన చిత్రాలను అర్థరాత్రి నిందితుడు మహిళకు పంపాడని కోర్టు తేల్చింది. తెలియని వ్యక్తి నుంచి ఇలాంటి మెసేజులు రావడాన్ని వివాహిత స్త్రీ, ఆమె భర్త సహించరని కోర్టు పేర్కొంది. నిందితుడు, మహిళకు మధ్య సంబంధం ఉందని ఎలాంటి ఆధారాలు లేవని కోర్టు చెప్పింది. 2022లో ఇదే కేసులో నిందితుడిని మేజిస్ట్రేట్ కోర్టు నిందితుడిని దోషిగా నిర్ధారించి 3 నెలల జైలు శిక్ష విధించింది, ఆ తర్వాత నిందితుడు ఈ తీర్పును సెషన్స్ కోర్టులో ఛాలెంజ్ చేశాడు. ఇతర కారణాలతో పాటు రాజకీయ శత్రుత్వం కారణంగా తనను ఈ కేసులో తప్పుగా ఇరికించారని నిందితుడు పేర్కొన్నాడు. అయితే, కోర్టు అతడి వాదనల్ని తోసిపుచ్చింది. ఈ వాదనలకు సంబంధించి ఎలాంటి ఆధారాలు లేవని కోర్టు చెప్పింది. ‘‘ అంతేకాకుండా, ఏ స్త్రీ కూడా తన గౌరవాన్ని పణంగా పెట్టి తప్పుడు కేసులో ఇరికించదు’’ అని కోర్టు పేర్కొంది. నిందితుడు ఆ మహిళకు అశ్లీల వాట్సాప్ సందేశాలు, చిత్రాలను పంపాడని ప్రాసిక్యూషన్ నిరూపించిందని కోర్టు తెలిపింది. దీంతో కింది కోర్టు విధించిన శిక్షను సెషన్స్ కోర్టు జడ్జి సమర్థించారు.

‘‘భారత ఎన్నికల్లో అమెరికా జోక్యం’’.. ట్రంప్ వ్యాఖ్యలపై కేంద్రం స్పందన..
భారతదేశ ఎన్నికల్ని ప్రభావితం చేయాలనే ఉద్ధేశ్యంతో, 21 మిలియన్ డాలర్లను గత అమెరికా ప్రభుత్వం కేటాయించిందని ఇటీవల అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆరోపించారు. ఈ ఆరోపణలపై ఇప్పటికే బీజేపీ, కాంగ్రెస్‌పై తీవ్ర విమర్శలు చేస్తోంది. ‘‘కాంగ్రెస్ ఎకో సిస్టమ్’’, రాహుల్ గాంధీలు ఈ నిధుల్ని వాడుకున్నారని బీజేపీ ఆరోపిస్తోంది. ఈ నేపథ్యంలో తాజాగా ట్రంప్ ఆరోపణలపై కేంద్ర ప్రభుత్వం స్పందించింది. విదేశాంగ మంత్రిత్వ శాఖ(MEA) ప్రతినిధి రణధీర్ జైస్వాల్ మాట్లాడుతూ..‘‘ ఈ ఆరోపణలు తీవ్ర ఆందోళనకరమైనవి’’గా అభివర్ణించారు. సంబంధిత అధికారులు వీటిని పరిశీలిస్తున్నట్లు చెప్పారు. “అమెరికా కార్యకలాపాలు మరియు నిధులకు సంబంధించి అమెరికా పరిపాలన విడుదల చేసిన సమాచారాన్ని మేము చూశాము. ఇవి స్పష్టంగా చాలా బాధ కలిగించేవి. ఇది భారతదేశ అంతర్గత వ్యవహారాల్లో విదేశీ జోక్యం గురించి ఆందోళనలకు దారితీసింది” అని చెప్పారు. ప్రభుత్వం ఈ విషయాన్ని చురుకుగా పరిశీలిస్తోందని, ఈ దశలో వివరణాత్మక బహిరంగ ప్రకటన చేయడం లేదని వెల్లడించారు.

బ్యాంక్ ఖాతాదారులకు బిగ్ అలర్ట్.. రేపు యూపీఐ సేవలు బంద్
డిజిటల్ చెల్లింపులు అందుబాటులోకి వచ్చాక చేతిలో నగదు ఉంచుకోవాల్సిన అవసరం లేకుండా పోయింది. ఏ సమయంలోనైనా ఆన్ లైన్ ద్వారా పేమెంట్ చేసుకునే సౌకర్యం ఉండడంతో అంతా ఈ విధానానికే అలవాటుపడిపోయారు. ఫోన్ పే, గూగుల్ పే వంటి యాప్స్ ద్వారా చెల్లింపులు చేస్తున్నారు. కాగా రేపు ఆ బ్యాంక్ ఖాతాదారులకు యూపీఐ సేవలు నిలిచిపోనున్నాయి. ఖాతాదారులకు మెరుగైన సేవలు అందించేందుకు దిగ్గజ ప్రైవేట్ సెక్టార్ బ్యాంక్ హెచ్డీఎఫ్సీ సిస్టమ్ మెయిన్ టెనెన్స్ చేపడుతున్నట్లు వెల్లడించింది. దీంతో రేపు కొంత సమయం పాటు యూపీఐ సేవలు నిలిచిపోనున్నట్లు ఖాతాదారులకు సమాచారం చేరవేసింది. హెచ్డీఎఫ్సీ బ్యాంక్ ఖాతాదారులకు బిగ్ అలర్ట్ ఇచ్చింది. ఈ నెల 22న అర్థరాత్రి 2.30 గంటల నుంచి మార్నింగ్ 7 గంటల వరకు యూపీఐ సేవలు నిలిపివేస్తున్నట్లు తెలిపింది. అంటే 4.30 గంటల పాటు యూపీఐ సేవలు నిలిచిపోతాయి. హెచ్డీఎఫ్సీ బ్యాంక్ ఖాతాను యూపీఐ పేమెంట్ యాప్స్ కు లింక్ చేసుకున్న వారు ఇది గమనించాలని కోరింది. బ్యాంక్ సూచించిన ఆ సమయంలో యూపీఐ ఖాతాదారులు ట్రాన్సాక్షన్స్ చేయలేరు. ఈ సమయంలో డబ్బులు అవసరం అవుతాయనుకునే వారు ముందుగానే కొంత డబ్బు విత్ డ్రా చేసుకోవడం బెటర్. లేదా హెచ్డీఎఫ్సీ వారి పేజ్యాప్ (PayZapp) వాడుకోవచ్చని బ్యాంక్ అధికారులు తెలిపారు.

ఛాంపియన్స్ ట్రోఫీ నుంచి ఫఖర్ ఔట్.. ఏడుస్తున్న వీడియో వైరల్
2025 ఛాంపియన్స్ ట్రోఫీలో భాగంగా.. తొలి మ్యాచ్‌లో పాకిస్తాన్‌ న్యూజిలాండ్ చేతిలో 60 పరుగుల తేడాతో ఓడిపోయింది. అంతేకాకుండా.. ఈ మ్యాచ్‌లో పాకిస్తాన్ స్టార్ క్రికెటర్ ఫఖర్ జమాన్ గాయపడ్డాడు. అతను ఫీల్డింగ్ చేస్తుండగా గాయమైంది. దీంతో.. దుబాయ్‌లో భారత్‌తో జరిగే కీలక మ్యాచ్‌కు ముందు అతను ఛాంపియన్స్ ట్రోఫీ నుంచి దూరమయ్యాడు. ఈ క్రమంలో.. ఫఖర్ స్థానంలో ఇమామ్-ఉల్-హక్‌ను జట్టులోకి తీసుకున్నారు. కాగా.. న్యూజిలాండ్‌తో జరిగిన మ్యాచ్ అనంతరం సోషల్ మీడియాలో ఒక వీడియో వైరల్ అవుతోంది. ఇందులో ఫఖర్ జమాన్ చాలా భావోద్వేగంగా కనిపించాడు. అతను డ్రెస్సింగ్ రూమ్‌లోకి వెళ్లి ఏడుస్తూ కనిపించాడు. అతను ఏడుస్తున్న సమయంలో పక్కన బౌలర్ షాహీన్ అఫ్రిది ఓదారుస్తున్నాడు. ఫఖర్ జమాన్ గాయపడినప్పటికీ బ్యాటింగ్‌ చేశాడు. అతను 41 బంతుల్లో 24 పరుగులు సాధించాడు. ఔట్ అయిన తర్వాత పెవిలియన్‌కు తిరిగి వస్తూ, అతను చాలా భావోద్వేగానికి గురయ్యాడు.

భారత్-పాకిస్తాన్ మ్యాచ్ ఎప్పుడూ ఫైనల్ లాగానే ఉంటుంది..
ఛాంపియన్స్ ట్రోఫీలో భాగంగా.. ఫిబ్రవరి 23న ఆదివారం దుబాయ్‌లోని దుబాయ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో భారత్-పాకిస్తాన్ మధ్య మ్యాచ్ జరగనుంది. ఈ హై ఓల్టేజ్ మ్యాచ్‌కు విపరీతమైన క్రేజ్ ఉంది. భారత్, పాకిస్తాన్ మధ్య మ్యాచ్ అంటే అన్ని దేశాల క్రికెట్ అభిమానులకు ఎంతో ఆసక్తి.. ఎందుకంటే ఈ రెండు జట్లు అంతర్జాతీయ మ్యాచ్‌ల్లో ఒక టీమ్‌తో మరొక టీమ్ ఆడిన మ్యాచ్‌లు తక్కువ. చివరిసారిగా.. జూన్ 2024లో జరిగిన టీ20 ప్రపంచ కప్‌లో భారత్ పాకిస్తాన్‌తో తలపడింది. ఆ మ్యాచ్‌లో భారత్ 6 పరుగుల తేడాతో పాకిస్తాన్‌ను ఓడించింది. కాగా.. టీమిండియా మాజీ ఆల్ రౌండర్ యువరాజ్ సింగ్ ఎన్నో ముఖ్యమైన మ్యాచ్‌లు ఆడాడు. 2007 టీ20 ప్రపంచ కప్ ఫైనల్, 2011 ప్రపంచ కప్ సెమీఫైనల్, 2017 ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ మ్యాచ్‌ల్లో యువరాజ్ ముందుండి నమ్మకంగా ఆడాడు. అయితే.. పాకిస్తాన్‌తో జరిగే మ్యాచ్ గురించి ఆయన మాట్లాడుతూ, “ఇండియా-పాకిస్తాన్ మ్యాచ్ ఎప్పుడూ ఫైనల్ లాగా అనిపిస్తుంది. అది గ్రూప్ మ్యాచ్ అయినా, సెమీఫైనల్ అయినా, లేదా ఛాంపియన్‌షిప్ మ్యాచ్ అయినా.. అలాగే, ఒత్తిడి చాలా ఎక్కువ ఉంటుంది. ఈ మ్యాచ్ టోర్నమెంట్‌ను సెట్ చేస్తుంది. నేను 2017 ఛాంపియన్స్ ట్రోఫీలో ఆడినప్పుడు మొదటి మ్యాచ్‌లో పాకిస్తాన్‌ను ఓడించాం, కానీ వారు ఫైనల్‌లో మమ్మల్ని ఓడించారు. కాబట్టి ఏం జరుగుతుందో చెప్పలేము. కానీ ప్రపంచం మొత్తం చూస్తున్న ఒక పెద్ద వేదికపై విజయం సాధించడం చాలా ముఖ్యం.” అని యువరాజ్ సింగ్ తెలిపారు.

అప్పటిదాకా రిలీజ్ డౌటే?
మెగాస్టార్ చిరంజీవి హీరోగా విశ్వంభరా అనే సినిమా తెరకెక్కుతోంది. బింబిసారా అనే సినిమా డైరెక్టర్ చేసిన వశిష్ట ఈ సినిమా డైరెక్ట్ చేశాడు. నిజానికి ఈ సినిమా సంక్రాంతి సందర్భంగా ప్రేక్షకుల ముందుకు రావాల్సి ఉంది. కానీ మెగాస్టార్ చిరంజీవి కుమారుడు రామ్ చరణ్ తేజ గేమ్ చేంజర్ చిత్రం కోసం ఈ సినిమాని వాయిదా వేశారు. అయితే అది వాయిదా వేసేందుకు మరో కారణం కూడా ఉన్నట్లుగా తెలుస్తోంది. అదే కంప్యూటర్ గ్రాఫిక్స్. ఈ విశ్వంభరా అనేది ఒక సోషియో ఫాంటసీ మూవీ. కాబట్టి సినిమాకి కంప్యూటర్ గ్రాఫిక్స్ కీలకంగా తెలుస్తోంది. ఆ మధ్య దసరా సందర్భంగా విడుదల చేసిన టీజర్ గ్రాఫిక్స్ విషయంలో టీం నెగెటివిటీ ఎదుర్కొంది. ఈ నేపథ్యంలో సినిమా మీద చాలా ఫోకస్ పెట్టి టీం పని చేస్తోంది. సినిమా కథపరంగా అయితే బాగుందని విజువల్స్ పరంగా కూడా చాలా కేర్ తీసుకోవాలని నిర్ణయం తీసుకున్నారు. అందుకే ఎంత ఆలస్యమైనా పర్లేదు మంచి అవుట్ ఫుట్ వచ్చిన తర్వాత రిలీజ్ డేట్ అనౌన్స్ చేయాలని భావిస్తున్నారు. ప్రస్తుతానికి ఈ సినిమాకి సంబంధించి కొన్ని పాటలు పెండింగ్ ఉన్నాయి. మెగాస్టార్ చిరంజీవితో వాటి షూటింగ్ కూడా ఈ మధ్య పూర్తి చేశారు. ఇక మరికొంత భాగం షూటింగ్ మిగిలి ఉండడంతో వీలైనంత త్వరగా దాన్ని పూర్తి చేసి పూర్తి కంప్యూటర్ గ్రాఫిక్స్ తో కూడిన బెస్ట్ ప్రోడక్ట్ చేతికి వచ్చాక అప్పుడు సినిమా రిలీజ్ డేట్ అనౌన్స్ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి ..

‘వైరం ధనుష్’ను మరిపించే అఖండ!
దర్శకుడు రవిరాజా పినిశెట్టి కుమారుడు ఆది పినిశెట్టి హీరోగా పరిచయమైన సంగతి తెలిసిందే. ఆయన తెలుగులో ఎన్నో సినిమాలు చేశాడు. తమిళంలో కూడా హీరోగా అనేక సినిమాలు చేశాడు. అయితే అవేవీ తీసుకురాని గుర్తింపు బోయపాటి శ్రీను దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరోగా తెరకెక్కిన సరైనోడు సినిమా తీసుకువచ్చింది. ఈ సినిమాలో అల్లు అర్జున్తో ఢీ అంటే ఢీ అనే పాత్రలో ఆది నటించాడు. ఆ సినిమాలో వైరం ధనుష్ అనే ఒక సీఎం కొడుకు పాత్రలో అదరగొట్టాడు. ఇప్పటికీ తెలుగు ప్రేక్షకులు ఆది పినిశెట్టి అంటే ఎవరో అనే ఆలోచిస్తారేమో కానీ వైరం ధనుష్ అంటే మాత్రం ఇట్టే గుర్తుపడతారు అయితే ఇప్పుడు దానికి మించిన పాత్రని బోయపాటి శ్రీను ఆది కోసం డిజైన్ చేసినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం బాలకృష్ణ హీరోగా అఖండ సీక్వెల్ సినిమా షూటింగ్ జరుగుతోంది. ఈ సినిమాలో ఆది పినిశెట్టి జాయిన్ అయినట్లు ఈమధ్య టీం అధికారిక ప్రకటన చేసింది. అయితే ఫిలింనగర్ వర్గాల్లో జరుగుతున్న ప్రచారం మేరకు ఈ సినిమాలో ఆయన బాలకృష్ణను ఢీకొట్టే పాత్రలో నటించబోతున్నాడు. ఈ సినిమాలో అది కూడా ఒక అఘోరా పాత్రలో నటిస్తున్నాడని తెలుస్తోంది. ఆ లుక్కు కూడా ఆయనకు బాగా సెట్ అయిందని నెవర్ బిఫోర్ అనేలా ఈ పాత్ర పండుతుందని అంచనాలు వినిపిస్తున్నాయి. ఇకమీదట వైరం ధనుష్ అని కాకుండా అఖండ ఆది అని గుర్తుపెట్టుకునేలా ఈ పాత్ర పేలే అవకాశం ఉందని ఇన్సైడ్ వర్గాల సమాచారం.