ప్రధాని, సీఎం, డిప్యూటీ సీఎం విశాఖ పర్యటన.. ఎయిర్‌పోర్ట్‌లో భారీ బందోబస్తు
అంతర్జాతీయ యోగా దినోత్సవానికి విశాఖపట్నం కేంద్రంగా మారనుంది.. ఇప్పటికే యోగా దినోత్సవానికి సర్వం సిద్ధం చేసింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం.. ఇక, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ విశాఖ పర్యటన నేపథ్యంలో.. వైజాగ్ ఎయిర్ పోర్ట్‌లో భారీ బందోబస్తు ఏర్పాట్లు చేశారు. ప్రధాని మోడీతో పాటు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్.. విశాఖ ఎయిర్ పోర్ట్‌కు రానున్నారు. ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ మధ్యాహ్నం మూడు గంటలకు విశాఖ విమానాశ్రయం చేరుకుంటారు. సాయంత్రం 6 గంటలకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వస్తారు. ఇక, రాత్రి 7 గంటల 45 నిమిషాలకు ప్రధాని నరేంద్ర మోడీ.. INS డేగా వద్దకు రానున్నారు. INS డేగా వద్ద ప్రధాన మంత్రి నరేంద్ర మోడీకి ఏపీ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ స్వాగతం పలుకనున్నారు. అయితే, వీవీఐపీలు, వీఐపీలు, ప్రముఖుల రాకతో విశాఖపట్నం ఎయిర్ పోర్ట్ లో ప్రత్యేక భద్రతా ఏర్పాట్లు చేశారు.. ఎయిర్ పోర్ట్ లో డాగ్ స్క్వాడ్ తో తనిఖీలు చేపట్టారు. కేంద్ర మంత్రి శ్రీనివాస వర్మ ఇప్పటికే విశాఖ ఎయిర్ పోర్ట్ కు చేరుకున్నారు. కేంద్రమంత్రి వర్మ ఎయిర్ పోర్టు నుండి విశాఖలోని ఒక ప్రైవేట్ హోటల్లో బస చేయటానికి వెళ్లారు.
స్థానిక ఎన్నికల తర్వాత రెడ్ బుక్ ఓపెన్ చేస్తా.. వాళ్లను నామినేషన్ వేయకుండా చేయాలి..!
మాజీ మంత్రి, గుంతకల్ ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం సంచలన వ్యాఖ్యలు చేశారు అనంతపురం జిల్లా గుత్తి టీడీపీ పట్టణ, మండల కమిటీల ఏర్పాటుపై పార్టీ కార్యకర్తలతో సమావేశమైన ఆయన.. ఈ సందర్భంగాన గుంతకల్ ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం. మాట్లాడుతూ.. మన మంత్రి నారా లోకేష్ రెడ్ బుక్ మూసేసినా.. నేను మాత్రం స్థానిక సంస్థల ఎన్నికల తర్వాత రెడ్ బుక్ ఓపెన్ చేస్తాను అని హెచ్చరించారు.. గత వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ పాలనలో టీడీపీ నాయకులపై ఎన్నో కేసులు బనాయించారు. కానీ, మనం మాత్రం.. కుళ్లు, కుతంత్రాల రాజకీయాలకు దూరంగా ఉండాలని సూచించారు.. అయితే, పార్టీ కోసం కష్టపడిన ప్రతి కార్యకర్తకు న్యాయం జరుగుతుందని స్పష్టం చేశారు.. రేపు రాబోయే ఎన్నికలలో ప్రతి కార్యకర్త కలిసిమెలిసిగా ఉండి పార్టీ అభ్యర్థుల గెలుపునకు కృషి చేయాలని పిలుపునిచ్చారు.. అంతేకాదు, స్థానిక ఎన్నికల్లో వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్లను నామినేషన్లు కూడా వేయకుండా చేయాలి అంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు మాజీ మంత్రి, టీడీపీ గుంతకల్ ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం..
భూమన ఆరోపణలు అవాస్తవాలు, అభూత కల్పనలే.. కొట్టిపారేసిన టీటీడీ..
తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ)పై మాజీ ఛైర్మన్ భూమన కరుణాకరరెడ్డి చేసిన ఆరోపణలను కొట్టిపారేసింది టీటీడీ.. అవన్నీ అవాస్తవాలు, అభూత కల్పనలే అని స్పష్టం చేసింది.. నిర్ధిష్టమైన ఆధారాలు లేకుండా సంస్థ మీద బురద జల్లడం శోచనీయం. శ్రీవారి ఆలయంలో తరతరాలుగా వస్తున్న వేద పారాయణానికి తూట్లు పొడిచే ప్రయత్నం జరుగుతోందని, వేద పారాయణదారులతో అవహేళనగా మాట్లాడటం అన్నది పూర్తిగా అవాస్తవం. ప్రస్తుతం శ్రీవారి ఆలయంలో వేద పారాయణాన్ని పఠించే సమయాన్ని గతం కన్నా మరింత పెంచడమే కాకుండా ప్రస్తుతం పూర్తిస్థాయిలో స్థిరీకరించడం కూడా జరిగిందని తెలిపింది టీటీడీ.. శ్రీవారి ఆలయంలో గానీ, వెలుపల గానీ, ఉభయ కాలిబాట మార్గాల్లో, కళ్యాణ కట్ట, శ్రీవారి సేవ, బయట క్యూలైన్లు, వెంగమాంబ అన్న ప్రసాద కేంద్రం తదితర ప్రాంతాల్లో కూడా ఒక సంవత్సర కాలంగా ఓం నమో వేంకటేశాయ నామాన్ని అన్ని చోట్లా ప్రతిధ్వన్వించేలా ఏర్పాటు చేశాం. వేద పాఠశాలల్లో వేద విద్యార్థులకు శారీరక – మానసిక దృఢత్వం పెంచే విధంగా కూడా చర్యలు చేపడుతున్నాం అని పేర్కొంది టీటీడీ..
శ్రీశైలంలో బయటపడ్డ రాగి రేకులు.. ఆసక్తికర అంశాలు వెలుగులోకి..
ప్రముఖ శైవక్షేత్రం శ్రీశైలంలో బయటపడ్డ రాగి రేకుల్లో ఆసక్తికర అంశాలు వెలుగు చూస్తున్నాయి.. రాగి రేకుల్లో హాలీ తోకచుక్కకు సంబంధించిన శిలాశాసనం గుర్తించారు.. 1456లో విజయనగరరాజు మల్లికార్జున పాలనకు చెందిన సంస్కృత, దేవనాగరి లిపిలో ఈ శాసనం ఉందని అధికారులు తేల్చారు.. భారతదేశంలో మొదటిసారిగా 1456లో హాలీ తోకచుక్క భూమి మీదకు వస్తే సంభవించే విపత్తుపై ఈ శాసనం రాశారు.. హాలీ తోకచుక్క(ఉల్కా) విపత్తు సంభవించకుండా 1456 జూన్ 28న విజయనగర రాజు మల్లికార్జున శ్రీశైలంలో శాంతి పూజలు జరిపించినట్టుగా ఈ శాసనంలో పొందుపరిచారు.. ఏపీలోని కడప జిల్లా గాలివీడు మండలం కడియపులంక గ్రామం ఖగోళ శాస్త్ర రంగంలో ప్రావీణ్యం ఉన్న లింగ నార్య అనే పండితుడికి రాసిచ్చినట్లు శాసనం చెబుతోంది.. 1456లో విజయనగర రాజు మల్లికార్జున హాలీ తోకచుక్క విపత్తు గుర్తించి శాంతి పూజలు నిర్వహించారట.. 1456లో ప్రపంచ వ్యాప్తంగా హాలీ తోకచుక్క భయంకరమని ప్రచారం జరిగింది.. ఆ నేపథ్యంలోనే విజయనగర రాజు మల్లికార్జున శ్రీశైలంలో శాంతి పూజలు జరిపించి ఉంటారనే.. ఆ సమయంలోనే ఈ శాసనం వేసి ఉంటారని చెబుతున్నారు ఆర్కియాలజీ డైరెక్టర్ మునిరత్నం రెడ్డి..
కవిత మాటల వెనుక కేసీఆర్ ఉన్నాడు.. వాళ్ళది ఫ్యామిలీ డ్రామా
చేసిన తప్పులను సరిదిద్దుకోవడానికి హరీష్ రావు పోలవరం- బనకచర్ల ప్రాజెక్ట్ పైన మాట్లాడుతున్నాడు అని కాంగ్రెస్ ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ అన్నారు. హరీష్ రావువి పిచ్చి కూతలు.. తెలంగాణ మీ అయ్య జాగీరా అని కృష్ణా జలాల్లో 299 టీఎంసీలకు ఆ నాడు ఒప్పుకున్నారా? అని ప్రశ్నించారు. తెలంగాణ మీ అయ్య జాగీరా అని రాయలసీమను రతనాల సీమ చేస్తానని కేసిఆర్ మాట్లాడాడా..? అని అడిగారు. ఇక, రోజా ఇంట్లో రొయ్యల పులుసు తిని నోటికొచ్చినట్లు మాట్లాడలేదా..? అని క్వశ్చన్ చేశారు. కేసీఆర్ ఆనాడు తెలంగాణ ముఖ్యమంత్రిగా మాట్లాడాడా లేక రాయలసీమ ముఖ్యమంత్రి అనుకున్నాడా..? అని అద్దంకి దయాకర్ పేర్కొన్నారు.
సీఎం సొంత జిల్లా అయిన మహబూబ్నగర్కు ఈ దుస్థితి ఏమిటి..?
రాష్ట్రంలో వర్షాలు పడుతుంటే రిజర్వాయర్లను నింపుకోవాలని ఎవరైనా చూస్తారు.. కానీ, ఈ కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం పట్టించుకోవడం లేదని మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఆరోపించారు. ముఖ్యంగా కరువు పీడిత జిల్లాలైన మహబూబ్ నగర్, నల్లగొండ జిల్లాల్లో వచ్చిన వరదతో రిజర్వాయర్లు నింపే అనవాయతీ ఉండేది గతంలో.. ఇపుడు జూరాల ప్రాజెక్టుకు వరద పోటెత్తిన.. నీళ్లు తరలించాలన్న సోయి ఈ ప్రభుత్వానికి లేదు అని విమర్శించారు. ప్రాజెక్టు నుంచి నీళ్లు వృథాగా కిందికి పోతున్నాయి.. ఆల్మట్టి ప్రాజెక్టు, తుంగభద్ర నుంచి నీళ్లు వస్తున్నా.. వాటిని వాడుకోవాలని ఈ ప్రభుత్వానికి లేదు. వస్తున్న నీటిని ఉపయోగించుకోవడంపై కనీసం ఓ సమీక్ష కూడా చేయలేదు అని శ్రీనివాస్ గౌడ్ మండిపడ్డారు. ఇక, జూరాల ప్రాజెక్టుపై ఆధార పడ్డ నెట్టెంపాడు, బీమాలకు నీళ్లు తరలించడం లేదని బీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ పేర్కొన్నారు. ఈ సారి ముందు వర్షాలు పడ్డాయి.. నీళ్లు సద్వినియోగం చేయాలన్న ఆలోచన ప్రభుత్వానికి లేదని మండిపడ్డారు. నీళ్లను నదిలోకి వదులుతున్నారు.. యాసంగిలో నీళ్లు లేక రైతులు ఇబ్బంది పడ్డారు.. ఈ వర్షా కాలంలో నీళ్ళుండి కూడా ప్రభుత్వం రైతులను సమస్యల పాలు చేస్తోంది అని ఆరోపించారు. సంగం బండకు మరమ్మత్తులు చేయకపోవడంతో నీళ్లు నింపుకోని పరిస్థితి దాపురించింది అన్నారు. ఇక, పాలమూరు- రంగారెడ్డి ప్రాజెక్టులో పంపులు సిద్ధంగా ఉన్నా.. కాలువలు తవ్వక నీళ్లు వాడుకోని పరిస్థితి ఉంది.. దేవుడు కరుణించినా పూజారి కరుణించే పరిస్థితి లేదని ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో స్పష్టంగా తేలింది. జూరాలను గత కాంగ్రెస్ ప్రభుత్వాల పుణ్యమాని పూడికతో నిండి పోయింది.. సీఎం సొంత జిల్లా అయినప్పటికీ మహబూబ్ నగర్ కు ఈ దుస్థితి ఏమిటీ? అని మాజీ మంత్రి వి. శ్రీనివాస్ గౌడ్ ప్రశ్నించారు.
బీహార్‌లో రైలు ప్రమాదం.. రైల్వే ట్రాలీని ఢీకొట్టిన ఎక్స్‌ప్రెస్..
బీహార్‌లో రైలు ప్రమాదం చోటు చేసుకుంది. కతిహార్ బరౌని రైల్వే సెక్షన్‌లోని కధగోలా, సేమాపూర్ మధ్య మహారాణి గ్రామం సమీపంలో ఈ ప్రమాదం జరిగింది. బరౌని నుంచి కతిహార్‌కి వస్తున్న 15910 అవధ్ అస్సాం ఎక్స్‌ప్రెస్ రైలు.. రైల్వే ట్రాలీని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఒక ట్రాలీమ్యాన్ అక్కడికక్కడే మరణించాడు. నలుగురు రైల్వే కార్మికులు తీవ్రంగా గాయపడినట్లు సమాచారం. గాయపడిన వారందరినీ సమీపంలోని ఆరోగ్య కేంద్రంలో చేర్చారు. ఈ సంఘటన సోన్‌పూర్ రైల్వే డివిజన్‌లో జరిగింది. ప్రమాదం కారణంగా.. ఈ మార్గంలో రైళ్ల రాకపోకలకు కొంతకాలం అంతరాయం ఏర్పడింది. సిబ్బంది వెంటనే పునరుద్ధరించారు. ఈ సంఘటనకు సంబంధించిన కతిహార్ అదనపు డివిజనల్ రైల్వే మేనేజర్(ADRM) మనోజ్ కుమార్ సింగ్ మాట్లాడుతూ.. ప్రమాదం జరిగిన ప్రాంతం కతిహార్ రైల్వే డివిజన్‌కు ఆనుకొని ఉన్నందున, కతిహార్ నుంచి వైద్య బృందాన్ని పంపినట్లు తెలిపారు. ప్రస్తుతం, గాయపడిన వారందరినీ సమీపంలోని ఆరోగ్య కేంద్రంలో చేర్చి చికిత్స అందిస్తున్నట్లు వెల్లడించారు. ఈ ప్రమాదానికి గల కారణాలను దర్యాప్తు అనంతరం వెల్లడిస్తామని స్పష్టం చేశారు. మరోవైపు… ఈ సంఘటనను తీవ్రంగా పరిగణించిన రైల్వే యంత్రాంగం ఉన్నత స్థాయి దర్యాప్తునకు ఆదేశించింది. రైల్వే సిబ్బంది ట్రాక్‌పై పనిచేసేటప్పుడు గరిష్ట జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశించింది.
తొలి టెస్టులో నల్ల బ్యాండ్స్ ధరించి, నిమిషం మౌనం పాటించిన ఇరు జట్ల ఆటగాళ్లు.. ఎందుకంటే..?
లీడ్స్ లోని హెడింగ్లీ మైదానం వేదికగా మొదలైన భారత్, ఇంగ్లండ్ మధ్య ఐదు టెస్టుల సిరీస్ తొలి మ్యాచ్ లో ఇరు జట్ల ఆటగాళ్లు నల్ల బ్యాండ్స్ ధరించారు. దీనికి కారణం, గత వారం అహ్మదాబాద్‌లో జరిగిన ఎయిర్ ఇండియా విమాన ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయినవారికి సంగిభావంగా ఇలా చేసారు. ఈ ఘటనలో మొత్తం 241 మంది మరణించగా, కేవలం ఒక్క ప్రయాణికుడు విశ్వాస్ కుమార్ మాత్రమే ప్రాణాలతో బయటపడ్డారు. మృతుల్లో మాజీ గుజరాత్ ముఖ్యమంత్రి విజయ్ రూపాణి కూడా ఉన్నారు. ఈ విషాద ఘటనకు గాను మ్యాచ్ ప్రారంభానికి ముందు ఒక నిమిషం మౌనం కూడా పాటించారు. ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు తన అధికారిక సోషల్ మీడియా వేదికగా ఈ విషయాన్ని తెలియజేస్తూ, అహ్మదాబాద్‌లో జరిగిన దుర్ఘటనలో మరణించిన వారి స్మృతికి నల్ల బ్యాండ్స్ ధరించామని, బాధితుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నామని ట్వీట్ చేసింది. ఇక నేటి మ్యాచ్ లో ఇంగ్లండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్ టాస్ గెలిచి ముందుగా బౌలింగ్ చేయాలని నిర్ణయించుకున్నారు. హెడింగ్లీ ఒక మంచి క్రికెట్ వికెట్. మొదటి సెషన్‌ను ఉపయోగించుకోవాలన్న ఆలోచనతో బౌలింగ్ ఎంచుకున్నాం అని స్టోక్స్ చెప్పారు.
‘వార్ 2’ కథ’కి చాలా సమయం!
మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్, బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్ కలయికలో రూపొందుతున్న ‘వార్ 2’ చిత్రం సినీ ప్రియుల్లో అపూర్వమైన ఉత్సాహాన్ని రేకెత్తిస్తోంది. యష్ రాజ్ ఫిల్మ్స్ (YRF) స్పై యూనివర్స్ ఫ్రాంచైజీలో ఆరవ చిత్రంగా తెరకెక్కుతున్న ఈ బ్లాక్‌బస్టర్‌ను ప్రముఖ దర్శకుడు అయాన్ ముఖర్జీ రూపొందిస్తున్నారు. ఈ చిత్రం గురించి ఇటీవల మాట్లాడిన అయాన్, ఎన్టీఆర్, హృతిక్ రోషన్ మధ్య సంఘర్షణను ఆకర్షణీయంగా, ఉత్కంఠభరితంగా తీర్చిదిద్దడానికి తాను ఎంతో సమయం వెచ్చించినట్లు వెల్లడించారు. ఈ సినిమా భారతీయ సినిమా ప్రేక్షకులకు ఒక అద్భుతమైన థియేట్రికల్ అనుభవాన్ని అందించనుందని ఆయన చెబుతున్నారు. YRF స్పై యూనివర్స్ ఫ్రాంచైజీలో భాగంగా 2019లో విడుదలైన ‘వార్’ చిత్రం, హృతిక్ రోషన్, టైగర్ ష్రాఫ్ నటనతో ప్రపంచ వ్యాప్తంగా సంచలన విజయం సాధించింది. ఈ ఫ్రాంచైజీలో కొనసాగింపుగా ‘వార్ 2’ రూపొందుతోంది. ఈ చిత్రంలో ఎన్టీఆర్, హృతిక్ రోషన్‌లను ఒకే తెరపై చూడాలనే అభిమానుల కల నెరవేరనుంది. అయాన్ ముఖర్జీ మాట్లాడుతూ, “‘వార్’ సినిమా ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకులను ఆకర్షించిన ఒక బ్లాక్‌బస్టర్. దానికి కొనసాగింపుగా ‘వార్ 2’ను రూపొందించడం నాకు ఒక పెద్ద బాధ్యతగా అనిపించింది. ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నప్పుడు, నా తొలి చిత్రాన్ని తీసినట్లుగా ఉత్సాహంగా, ఉద్వేగంగా భావించాను. ఈ ఫ్రాంచైజీకి ఉన్న భారీ ఫ్యాన్ బేస్‌తో పాటు, ఎన్టీఆర్, హృతిక్ అభిమానులను కూడా ఈ సినిమా ఆకర్షించేలా చేయాలని భావించాను. ఇది నాకు ఒక సవాల్‌గా, అదే సమయంలో స్ఫూర్తిదాయకమైన అవకాశంగా అనిపించింది,” అని అన్నారు.
శేఖర్ కమ్ముల మూవీలు.. సోషల్ మెసేజ్ లు..!
డైరెక్టర్ శేఖర్ కమ్ముల మూవీలకు స్పెషల్ బ్రాండ్ ఉంది. సోషల్ మెసేజ్ లేకుండా అసలు సినిమానే తీయరు. హీరోను బట్టి కథలో మార్పులు చేయరు. మాస్ డైలాగులు ఉండవు. కత్తి పట్టి నరకడాలు అసలే ఉండవు. హీరో వంద మందిని కొట్టి చంపేయడాలు ఊహకు కూడా కనిపించవు. శేఖర్ సినిమాలు అంటే కథే కీలకం. సన్నివేశాలే హీరోలు. అదే ఆయన స్పెషాలిటీ. తన కథకు తగ్గ హీరోలను ఆయన వెతుక్కుంటారు. అంతే గానీ హీరోలను బట్టి కథలు రాసుకోరు. మొన్న కుబేర ప్రీ రిలీజ్ ఈవెంట్ లో రాజమౌళి కూడా ఇదే చెప్పాడు. శేఖర్ కమ్ముల ఎవరికోసమే తన సిద్ధాంతాలను అస్సలు మార్చుకోరు అని. ఇప్పటి వరకు శేఖర్ చేసిన సినిమాలను చూస్తేనే ఇది అర్థం అవుతోంది. పైగా ఆయన సినిమాల్లో కామన్ గా ఉండేది సోషల్ మెసేజ్. లీడర్ సినిమాలో నాయకుడు అంటే ఎలా ఉండాలో చూపించాడు. ఇప్పటి రాజకీయాలు ఎంత దారుణంగా ఉన్నాయి.. ఎంత అవినీతి జరుగుతోంది.. న్యాయం ఎవరికి జరుగుతోంది అన్నది కళ్లకు కట్టినట్టు చూపించారు శేఖర్ కమ్ముల. లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ సినిమాను చూస్తే.. వయసుకు ఎదిగిన పిల్లలు తల్లిదండ్రుల ఆశయాలను పక్కన పెడితే ఎలాంటి పరిస్థితులు ఎదురవుతాయి.. చివరకు లైఫ్ లో సెటిల్ అయితే కుబుంబం ఎంత హ్యాపీగా ఉంటుంది.. నిజమైన ప్రేమ, అట్రాక్షన్ కు తేడా చూపించారు.
మీరు మోహన్ లాల్ ఇంట్లో ఉండచ్చు.. ఎలానో తెలుసా?
మలయాళ చిత్ర పరిశ్రమలో సూపర్‌స్టార్లుగా వెలుగొందుతున్న మోహన్‌లాల్, మమ్ముట్టి ఇద్దరూ తమ నటనా ప్రతిభతో, వ్యక్తిత్వంతో దశాబ్దాలుగా ప్రేక్షక హృదయాలను ఆకట్టుకుంటున్నారు. మోహన్‌లాల్ వయసు 65 సంవత్సరాలు, మమ్ముట్టి వయసు 73 సంవత్సరాలు అయినప్పటికీ, వీరిద్దరి ఉత్సాహం, చురుకుదనం చూస్తే యవ్వనంలోనే ఉన్నట్టు అనిపిస్తుంది. సినిమాల్లో నటిస్తూ, కొత్త ప్రయోగాలతో ప్రేక్షకులను ఆశ్చర్యపరుస్తూ, వారు ఇప్పటికీ సినీ పరిశ్రమలో స్టార్ లుగా నిలుస్తున్నారు. ఇటీవల వీరిద్దరి సినీ ప్రయాణంతో పాటు వ్యాపారంలో కూడా దూసుకుపోతున్నారు. మోహన్‌లాల్ ఊటీలోని గెస్ట్‌హౌస్, మమ్ముట్టి కొచ్చిలోని అతిథి గృహం రెండూ వారి అభిమానులకు, పర్యాటకులకు ఒక ప్రత్యేకమైన అనుభవాన్ని అందిస్తున్నాయి.
