NTV Telugu Site icon

Top Headlines @ 5 PM: టాప్‌ న్యూస్‌

Top Headlines @ 5 Pm New

Top Headlines @ 5 Pm New

డిప్యూటీ సీఎం పవన్‌ వ్యాఖ్యలపై స్పందించిన డీజీపీ.. ఆసక్తికర కామెంట్లు..!
పిఠాపురంలో క్రైమ్ పెరిగిందంటూ గత వారం డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ చేసిన వ్యాఖ్యలపై స్పందించిన డీజీపీ ద్వారకా తిరుమలరావు.. ఆస్తికర వ్యాఖ్యలు చేశారు.. ప్రూఫ్స్ లేకుండా నేను మాట్లాడను అని స్పష్టం చేశారు.. అటువంటిది ఉంటే అడ్రస్ చేస్తామని వెల్లడించారు.. అయితే, సైబర్ క్రైమ్‌ పెరిగింది.. విజిబుల్, ఇమేజింగ్ పోలీసింగ్ ఉండాలని సీఎం చంద్రబాబు ఆదేశాలు ఇచ్చారని తెలిపారు.. మెన్‌లతో కాకుండా డ్రోన్ ల ద్వారా కూడా ఫోకస్ పెడతాం.. ఏఐ ద్వారా కేసులు పరిష్కారం చేస్తాం అన్నారు. మరోవైపు.. సోషల్ మీడియా ద్వారా అసత్య ప్రచారాలని కట్టడి చేస్తున్నాం.. సైబర్ క్రైమ్ కేసులు ఎక్కువ అయిపోయాయి.. ఏళ్ల తరబడి పెండింగ్ లో ఉన్న కేసులను ఆరు నెలల్లో పరిష్కారం చేశాం.. టెక్నాలజీ ఉపయోగించి కేసులు పరిష్కారం చేస్తాం అన్నారు.

పంచాయతీరాజ్‌పై పవన్‌ సమీక్ష.. కీలక నిర్ణయం
డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌.. ఈ రోజు పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖపై సమీక్ష సమావేశం నిర్వహించారు.. ఈ సమావేశంలో కీలక ఆదేశాలు జారీ చేశారు.. గ్రామ పంచాయతీ క్లస్టర్ వ్యవస్థకు కొత్త రూపు.. ఆదాయ ప్రాతిపదికతతోపాటు జనాభా ప్రాతిపదికనను జోడించి కొత్త గ్రేడ్లు ఇవ్వనున్నారు.. గ్రేడ్లు ఆధారంగా సిబ్బంది కేటాయింపు ఉంటుందని.. గ్రామ పంచాయతీ, సచివాలయ సిబ్బందితో సమన్వయం చేసుకోవాలని.. అధ్యయనం చేసి సిఫార్సులు చేసేందుకు ఓ కమిటీని కూడా ఏర్పాటు చేస్తున్నట్టు డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ వెల్లడించారు.. గ్రామీణ ప్రజలకు నిరంతరాయంగా పంచాయతీ సేవలు అందేలా చూడాలని, దీనికోసం సిబ్బంది లేమి సమస్యను అధిగమించాలని స్పష్టం చేశారు పవన్‌ కల్యాణ్‌.. పంచాయతీరాజ్ శాఖ పరిధిలోని గ్రామ పంచాయతీల క్లస్టర్ విధానంలో మార్పులు చేపట్టి, కొత్త మార్గదర్శకాలను రూపొందించాలని ఆదేశించారు. గతంలో పంచాయతీల ఆదాయాన్ని ప్రాతిపదికగా తీసుకొని మాత్రమే చేపట్టిన క్లస్టర్ గ్రేడ్ల విభజన విధానానికి, నూతనంగా జనాభాను కూడా ప్రాతిపదికగా తీసుకొని పంచాయతీల క్లస్టర్ గ్రేడ్లు విభజించాలని సూచించారు. సిబ్బంది నియామకం విషయంలో హెచ్చుతగ్గులు లేకుండా, గ్రామ పంచాయతీల్లో సేవలు నిరంతరాయంగా ప్రజలకు ఆండాలన్నారు. పంచాయతీరాజ్ శాఖ ఉన్నతాధికారులతో.. తన క్యాంపు కార్యాలయంలో గ్రామ పంచాయతీల క్లస్టర్ గ్రేడ్ల విభజనపై సమీక్ష నిర్వహించారు డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌… ఈ సమావేశంలో పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి శశిభూషణ్ కుమార్, కమిషనర్ కృష్ణ తేజ, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

లోకేష్‌ను డిప్యూటీ సీఎంను చేయాలని డిమాండ్‌..! టీడీపీ కీలక ఆదేశాలు
ఆంధ్రప్రదేశ్‌ రాజకీయాల్లో గత కొంత కాలంగా.. నారా లోకేష్‌ను డిప్యూటీ సీఎంను చేయాలన్న డిమాండ్‌ కాకరేపుతోంది.. దీనిపై స్పందించిన తెలుగుదేశం పార్టీ అధిష్టానం కీలక ఆదేశాలు జారీ చేసింది.. ఈ వ్యవహారంపై సీరియస్‌ అయ్యింది.. అత్యుత్సాహం వద్దని నేతలను వారించింది టీడీపీ అధిష్టానం.. కూటమి నేతలు మాట్లాడుకున్నాకే ఏదైనా నిర్ణయాలుంటాయని స్పష్టం చేసింది.. అయితే, గత నాగుగైదు రోజులుగా లోకేష్‌ను డిప్యూటీ సీఎంను చేయాలనే డిమాండ్‌ ఏపీలో కాకరేపుతోంది.. ఈ మధ్యే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కడప జిల్లా పర్యటనలో ఉన్న సమయంలో.. ఆయన ముందే.. పార్టీ జిల్లా అధ్యక్షుడిగా ఉన్న శ్రీనివాసరెడ్డి.. మంత్రి నారా లోకేష్‌ను డిప్యూటీ సీఎంను చేయాలంటూ స్టేజ్‌పైనే మాట్లాడారు.. ఆ తర్వాత పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ మాట్లాడుతూ.. టీడీపీ సభ్యత్వాలు కోటి చేయించిన ఘనత మంత్రి నారా లోకేష్‌దే అని.. టీడీపీకి భవిష్యత్తు లేదన్న వారందరికీ ‘యువగళం’తో ఆయన సమాధానం చెప్పారని.. నారా లోకేష్‌కు డిప్యూటీ సీఎం పదవి ఇవ్వాలని కోరారు. దీనిపై మరికొందరు టీడీపీ నేతలు.. కీలకంగా ఉన్నవారు సైతం.. ఈ డిమాండ్‌ చేస్తూ వచ్చారు.. మరోవైపు.. జనసేన నుంచి దీనిపై కౌంటర్‌ ఎటాక్‌ మొదలైంది.. ముఖ్యంగా సోషల్‌ మీడియాలో.. లోకేష్‌ను డిప్యూటీ సీఎంను చేయండి.. తప్పులేదు.. కానీ, పవన్‌ కల్యాణ్‌ను ముఖ్యమంత్రిని చేయాలంటూ కామెంట్లు పెట్టసాగారు.. దీంతో, అలర్ట్‌ అయిన టీడీపీ అధిష్టానం.. ఇది టీడీపీ-జనసేన-బీజేపీ కూటమికే ముప్పు ఉంటుందని భావించి.. ఈ చర్చకు పులిస్టాప్ పెట్టాలని భావంచింది.. ఈ వ్యవహారంపై ఎవరూ కామెంట్లు చేయవద్దని స్పష్టం చేసింది.. దావోస్‌ పర్యటనలో ఉన్న టీడీపీ అధినేత, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు.. ఈ ఇష్యూకు తెరదించాలనే నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తోంది.. ఈ నేపథ్యంలోనే నేతల డిమాండ్‌పై టీడీపీ అధిష్టానం సీరియస్‌ అయ్యింది.. అత్యుత్సాహం వద్దని నేతలను టీడీపీ అధిష్టానం స్పష్టం చేసింది..

ఏటీఎం కార్డులతో బురిడీ కొట్టిస్తున్న ముగ్గురు కేటుగాళ్లు అరెస్ట్.. భారీగా నగదు స్వాధీనం
హైదరాబాద్‌లో దొంగలు రెచ్చిపోతున్నారు. ప్రజలు దృష్టి మళ్లించి ఏటీఎం కార్డులు దొంగిలించి నగదు దోచుకుంటున్న ముగ్గురు కేటుగాళ్లను పోలీసులు అరెస్ట్ చేశారు. వారి దగ్గర నుంచి వివిధ బ్యాంకులకు సంబంధించిన ఏటీఎం కార్డులు, రూ.7.6 లక్షల నగదు, ఒక నకిలీ పోలీస్ ఐడీ కార్డను స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా సౌత్ జోన్ డీసీపీ స్నేహ మెహర మీడియాతో మాట్లాడారు. బహుదూర్‌పురాలో డిసెంబర్ 22న ఒక మహిళ ఏటీఎంలో డబ్బులు విత్‌డ్రా చేస్తుండగా దృష్టి మళ్లించి నకిలీ ఏటీఎం కార్డు చేతిలో పెట్టి ఒరిజినల్ కార్డు తీసుకెళ్లి రూ.2లక్షలు విత్‌డ్రా చేశారని తెలిపారు. కేసు నమోదు చేసి అంతర్రాష్ట్ర ముఠా సభ్యులను అరెస్ట్ చేసినట్లు పేర్కొ్న్నారు. ముగ్గురిని అరెస్ట్ చేయగా.. మరో ఇద్దరు పరారీలో ఉన్నారని తెలిపారు. ఈ అంతరాష్ట్ర ముఠా సభ్యులు నాలుగు రాష్ట్రాల్లో ఇలాంటి తరహా మోసాలకు పాల్పడుతున్నట్లు డీసీపీ చెప్పారు. నిందితుల టార్గెట్ అంతా మహిళలు, వృద్ధులు, చిన్నపిల్లలే అన్నారు. ఏటీఎం సెంటర్స్ దగ్గర డబ్బులు డ్రా చేసే సమయంలో వారికి సహాయం చేస్తున్నట్టు నటించి డూప్లికేట్ కార్డు పెట్టి ఒరిజినల్ కార్డు తీసుకెళ్తున్నట్లు వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్, ఒడిశా, కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాల్లో 18 కేసుల్లో నిందితులుగా ఉన్నారన్నారు. ఏటీఎం సెంటర్ల దగ్గర నగదు విత్‌డ్రాలు చేసేటప్పుడు ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచించారు. గుర్తు తెలియని వ్యక్తుల పట్ల అప్రమత్తంగా ఉండాలని డీసీపీ స్నేహ మెహర పేర్కొన్నారు.

సంస్కారాన్ని నేర్పేది విద్య మాత్రమే
రంగారెడ్డి జిల్లా షాద్ నగర్‌లో గ్రంథాలయ అభివృద్ధి కమిటీ నూతన పాలకవర్గం ప్రమాణ స్వీకారం కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మంత్రి జూపల్లి కృష్ణ రావ్, ఎమ్మెల్సీ ప్రొఫెసర్ కోదండరాం, జిల్లా గ్రంథాలయ ఛైర్మెన్ మధుసూదన్ రెడ్డి, షాద్ నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ హాజరయ్యారు. మంత్రి జూపల్లి కృష్ణా రావు మాట్లాడుతూ నేటి సమాజంలో, ప్రస్తుత పరిస్థితుల్లో సంస్కారం నేర్పేది విద్య మాత్రమే అన్నారు. గ్రంథాలయాల్లో మహనీయుల పుస్తకాలు ఉండాలన్నారు. అభివృద్ధి కి నిధులు కేటాయించినప్పుడు అందులో నుండి 10% గ్రంథాలయాలకు ఉపయోగించాలన్నారు. ప్రతి గ్రామములో గ్రంధాలయాలు ఏర్పాటు దిశగా పని చేయాలన్నారు. యువత చెడు అలవాట్లకు, మొబైల్స్ లో సమయం వృధా చేయడం మానేసి గ్రంధాలయాల్లో పుస్తకాలు చదవడం అలవాటు చేసుకోవాలన్నారు. కోట్ల ఖర్చుతో విగ్రహాల ఏర్పాట్ల పై శ్రద్ద కన్నా విద్య పై, గ్రంథాలయాలపై శ్రద్ధ పెట్టాలన్నారు. సాంస్కృతిక శాఖ తరపున గ్రంథాలయానికి 5 లక్షలు మంజూరు చేస్తున్నట్లు అయన ప్రకటించారు. ప్రొఫెసర్ కోదండరాం మాట్లాడుతూ గ్రంథాలయంలో విద్యార్థులకు పోటీ పరీక్షలకు అవసరమయ్యే పుస్తకాలను ఏర్పాటు చేయాలన్నారు. పుస్తకాలు కొనుక్కోవడం వీలు కానీ పేద విద్యార్థులకు గ్రంథాలయాలు ఆసరాగా ఉండాలన్నారు. వర్తమాన అంశాలపై గ్రంథాలయంలో విద్యార్థులకు లెక్చర్లు ఏర్పటు చేయాలన్నారు.

కోల్‌కతా కేసులో నిందితుడికి ఏ సెక్షన్ల కింద కోర్టు శిక్ష విధించింది.. బాధితురాలికి న్యాయం జరిగనట్లేనా ?
ఆర్జీ కర్ ఆసుపత్రిలో ట్రైనీ మహిళా వైద్యురాలిపై అత్యాచారం, హత్య కేసులో సంజయ్ రాయ్ కు కోర్టు జీవిత ఖైదు విధించింది. శనివారం ఈ కేసులో సంజయ్ రాయ్‌ను కోర్టు దోషిగా నిర్ధారించింది. కోల్‌కతాలోని సీల్దా కోర్టు సోమవారం సంజయ్ రాయ్‌కు శిక్ష విధించింది. దోషి సంజయ్ రాయ్ చనిపోయే వరకు జైలులోనే ఉండాలని కోర్టు పేర్కొంది. ఇది కాకుండా సంజయ్ రాయ్ పై రూ.50 వేల జరిమానా కూడా విధించారు. ఇది అరుదైన కేసు అని న్యాయమూర్తి అనిర్బన్ దాస్ అంగీకరించినప్పటికీ, నిందితుడికి మరణశిక్ష విధించలేదు. బాధిత కుటుంబానికి రాష్ట్ర ప్రభుత్వం రూ.17 లక్షల పరిహారం చెల్లించాలని న్యాయమూర్తి ఆదేశించారు. గత ఏడాది ఆగస్టులో జరిగిన ఈ సంఘటన పశ్చిమ బెంగాల్ అంతటా ప్రజల ఆగ్రహానికి దారితీసింది. ఆగస్టు 9, 2024న, ఆసుపత్రిలోని కాన్ఫరెన్స్ రూమ్‌లో 31 ఏళ్ల మహిళా ట్రైనీ డాక్టర్ మృతదేహం కనుగొనబడింది. దర్యాప్తులో వైద్యురాలిపై మొదట అత్యాచారం చేసి, ఆపై హత్య చేసినట్లు తేలింది. ఈ సంఘటన తర్వాత కోల్‌కతాలో నిరసనలు చెలరేగాయి. రాష్ట్రంలో ఆరోగ్య సేవలు రెండు నెలలకు పైగా స్తంభించిపోయాయి. జనవరి 18న కోల్‌కతాలోని సీల్దా కోర్టు ఈ కేసులో తీర్పు వెలువరించింది. తీర్పు వెలువరిస్తూ, కోర్టు ప్రత్యేక న్యాయమూర్తి అనిర్బన్ దాస్, CBI సమర్పించిన లైంగిక వేధింపులు, అత్యాచారాల ఆధారాలు వారి నేరాన్ని రుజువు చేస్తున్నాయని అన్నారు. భారత శిక్షాస్మృతిలోని సెక్షన్లు 64, 103 (1) కింద సంజయ్ రాయ్‌ను కోర్టు దోషిగా నిర్ధారించింది.

అమెరికాలో డోనాల్డ్ ట్రంప్ ప్రమాణ స్వీకార కార్యక్రమం.. ఈ వేడుకను ఎక్కడ, ఎప్పుడు చూడాలి
అమెరికాలో మరోసారి డోనాల్డ్ ట్రంప్ యుగం ప్రారంభం కానుంది. ఈరోజు సోమవారం డొనాల్డ్ ట్రంప్ రెండోసారి అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ప్రపంచంలోని అనేక దేశాల నాయకులతో పాటు, ప్రతి రంగాల నుండి ప్రముఖ వ్యక్తులు ఆయన ప్రమాణ స్వీకార కార్యక్రమానికి హాజరయ్యే అవకాశం ఉంది. భారత కాలమానం ప్రకారం రాత్రి 10.30 గంటలకు ఈ ప్రమాణ స్వీకారం జరుగుతుంది. అమెరికా నుండి ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని ఇక్కడ ప్రత్యక్ష ప్రసారంలో కూడా వీక్షించవచ్చు. దేశ 47వ అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ నేడు (జనవరి 20) పదవీ ప్రమాణం, గోప్యతా ప్రమాణం చేయనున్నారు. అక్కడ ఫంక్షన్ కోసం పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేశారు. భారత కాలమానం ప్రకారం, ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమం రాత్రి 10:30 గంటలకు జరుగుతుంది. ప్రమాణ స్వీకారంతో అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత ట్రంప్ తన మొదటి ప్రసంగంలో ఏమి చెబుతారో అని ప్రపంచం మొత్తం చూస్తోంది. ట్రంప్ ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని ప్రతి న్యూస్ ఛానల్‌లో ప్రత్యక్ష ప్రసారంలో చూడవచ్చు. దీనితో పాటు, NTV ఛానెల్ లో కూడా ఫంక్షన్‌కు సంబంధించిన కార్యకలాపాలను వీక్షించవచ్చచు. యూట్యూబ్‌లో నిరంతర ప్రత్యక్ష ప్రసారం ఉంటుంది. అంతకుముందు, సంప్రదాయం ప్రకారం ట్రంప్ శనివారం రాత్రి వైట్ హౌస్ (అధ్యక్షుడి కార్యాలయం) ఎదురుగా ఉన్న పెన్సిల్వేనియా అవెన్యూలో అధ్యక్షుడి అధికారిక అతిథి నివాసం అయిన బ్లెయిర్ హౌస్‌లో గడిపారు. నగరానికి పశ్చిమాన 30 మైళ్ల దూరంలో ఉన్న వర్జీనియాలోని స్టెర్లింగ్‌లోని తన గోల్ఫ్ క్లబ్‌లో జరిగిన పార్టీకి హాజరైన తర్వాత అతను బ్లెయిర్ హౌస్‌కు చేరుకున్నాడు.

ట్రంప్ ప్రమాణ స్వీకారానికి 10గంటల ముందే రికార్డ్ సృష్టించిన బిట్ కాయిన్.. సంబరాల్లో ఇన్వెస్టర్లు
అమెరికా నూతన అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ముందు బిట్‌కాయిన్ కొత్త రికార్డులను నెలకొల్పింది. ఈ ఉదయం బిట్‌కాయిన్ ధర 109,241డాలర్లకి చేరుకుంది. నిపుణుల అభిప్రాయం ప్రకారం, ట్రంప్ క్రిప్టో-స్నేహపూర్వక విధానాల అంచనాల కారణంగా ఈ పెరుగుదల సంభవించింది. డొనాల్డ్ ట్రంప్ తన ఎన్నికల ప్రచారంలో క్రిప్టోకరెన్సీ పట్ల సానుకూల వైఖరి తీసుకున్నారు. తాను అధ్యక్షుడైతే అమెరికాను క్రిప్టోకరెన్సీకి ప్రపంచ కేంద్రంగా మార్చడానికి కృషి చేస్తానని ఆయన హామీ ఇచ్చారు. అతని పరిపాలన క్రిప్టోకరెన్సీ కంపెనీలపై నియంత్రణ భారాన్ని తగ్గించి, డిజిటల్ కరెన్సీల స్వీకరణను ప్రోత్సహించే అవకాశం ఉంది. ట్రంప్ ప్రమాణ స్వీకారం తర్వాత, క్రిప్టో మార్కెట్ మరింత వృద్ధిని చూడవచ్చని నిపుణులు భావిస్తున్నారు. గత కొన్ని రోజులుగా బిట్‌కాయిన్ ధర 40 శాతానికి పైగా పెరిగింది. ఇది బిట్‌కాయిన్ పెట్టుబడిదారులు ట్రంప్ పరిపాలన నుండి సానుకూల మార్పులను ఆశిస్తున్నారని సూచిస్తుంది.

ఈ ఏడాది తెలంగాణలో బ్యాంక్ సెలవుల లిస్ట్ ఇదే.. మొత్తం ఎన్ని రోజులంటే?
ఆర్థిక అవసరాల కోసం బ్యాంకులకు వెళ్లే వారి సంఖ్య పెరిగిపోయింది. కస్టమర్లు బ్యాంకు రూల్స్, సెలవుల గురించి తెలుసుకుని ఉండాలి. లేదంటే మీ పనుల్లో జాప్యం జరిగే అవకాశం ఉంటుంది. ఒక్కోసారి నష్టపోయే ప్రమాదం కూడా ఉంటుంది. కాగా ప్రతి సంవత్సరం రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్యాంకులకు సెలవుల జాబితాను ప్రకటిస్తూ ఉంటుంది.అయితే ఈ సెలవులు రాష్ట్రాలను బట్టీ మారుతూ ఉంటాయి. ఈ ఏడాది కూడా ఆర్బీఐ సెలవులను ప్రకటించింది. ఈ జాబితా ప్రకారం తెలంగాణ రాష్ట్రంలో జాతీయ సెలవులతో పాటు ప్రాంతీయ సెలవులు కూడా ఉన్నాయి. పలు పండగలు, ఈవెంట్స్ ఉండడంతో సెలవులు భారీగానే ఉన్నాయి. 4 జాతీయ సెలవులతో పాటు.. 11 ప్రాంతీయ సెలవులు ఉన్నాయి. వీటితో పాటు ప్రతి నెల రెండవ, నాలుగవ శనివారాలల్లో కూడా సెలవులు ఉండనున్నాయి. ఆదివారాల్లో బ్యాంకులు మూసి ఉంటాయన్న సంగతి తెలిసిందే. బ్యాంకు పనులు ఉన్నవారు ఈ సెలవుల గురించి ముందే తెలుసుకుని ఉంటే మీ సమసయం వృదా కాకుండా ఉంటుంది.

సైఫ్ అలీఖాన్ డిశ్చార్జ్ ఎప్పుడు?
కత్తి దాడి ఘటనలో గాయపడిన నటుడు సైఫ్ అలీఖాన్ లీలావతి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. నటుడి ఆరోగ్యం ఎలా ఉందో, హాస్పిటల్ నుంచి ఎప్పుడు రిలీజ్ అవుతారో తెలుసుకోవాలని అభిమానులు అనుకుంటున్నారు. ఆసుపత్రి వైద్యులు నితిన్ డాంగే ఈ విషయాన్ని వెల్లడించారు. నటుడు దాడి జరిగిన అనంతరం సైఫ్ అలీఖాన్ ముంబైలోని లీలావతి ఆస్పత్రిలో చేరారు. ప్రస్తుతం ప్రమాదం నుంచి బయటపడ్డా, వైద్యుల పర్యవేక్షణలో ఉన్నారు. ఈరోజు ఆయన ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అవుతారని మీడియాలో వార్తలు వచ్చాయి. ఇప్పుడు లీలావతి ఆస్పత్రికి చెందిన డాక్టర్ నితిన్ డాంగే దీనికి సంబంధించి ఒక అప్‌డేట్ ఇచ్చారు. సైఫ్ అలీఖాన్‌ను ఈరోజు ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ చేయడం లేదని డాక్టర్ నితిన్ డాంగే అన్నారు. ఈ అంశం మీద మరో రెండు రోజుల్లో నిర్ణయం తీసుకోనున్నామని అన్నారు. సైఫ్ ఆరోగ్యం మెరుగుపడుతుందని చెప్పారు. ఇక నటుడిపై కత్తులతో పలుమార్లు దాడి చేసిన నిందితుడిని పోలీసులు అరెస్టు చేయగా, అతడిని మహ్మద్ షరీఫుల్ ఇస్లాం షాజాద్‌గా గుర్తించారు. నిందితుడు షెహజాద్ దొంగతనం చేయాలనే ఉద్దేశంతో నటుడి ఇంట్లోకి ప్రవేశించాడు. దాడి చేసిన వ్యక్తి మొదట ఇంట్లో పనిమనిషితో వాగ్వాదానికి దిగాడు. తర్వాత, శబ్దం విన్న సైఫ్ అలీఖాన్ అక్కడికి చేరుకోగా నటుడిపై దాడి చేయడం ప్రారంభించాడు. నటుడు సైఫ్ రక్తంలో తడిసి ఆసుపత్రికి వచ్చిన తీరు సింహంలా ఆసుపత్రికి వచ్చాడని డాక్టర్ అన్నారు. వారు పూర్తిగా రక్తంలో తడిసిపోయారు. కానీ, కొడుకుతో పాటు సింహంలా ఆస్పత్రికి చికిత్స కోసం వచ్చాడు. ప్రస్తుతం అతని పరిస్థితి బాగానే ఉంద అని అన్నారు.

సైఫ్ అలీఖాన్‌ను ఆసుపత్రికి తీసుకెళ్లిన ఆటో డ్రైవ్ కి రివార్డు ఎంతంటే?
జనవరి 16వ తేదీ తెల్లవారుజామున 2 గంటల సమయంలో సైఫ్ అలీఖాన్ ఇంట్లోకి ఓ గుర్తు తెలియని వ్యక్తి ప్రవేశించి అక్కడ ఉన్న పని మనిషితో గొడవకు దిగాడు. సైఫ్ అలీ ఖాన్ ఆ గలాటా విన్న తర్వాత వచ్చి తన కుటుంబాన్ని రక్షించే ప్రయత్నంలో నటుడు ఆ వ్యక్తితో గొడవ పడ్డాడు. దీంతో కోపంతో నటుడిపై నిందితులు కత్తితో దాడి చేశారు. దాడి చేసిన వ్యక్తి సైఫ్‌ను కత్తితో ఆరుసార్లు పొడిచాడని, దాని కారణంగా అతను తీవ్రంగా గాయ పడ్డాడని చెబుతున్నారు. ఈ దాడిలో చిన్నారుల నానీకి కూడా గాయాలయ్యాయి. దాడి చేసిన వ్యక్తి పారిపోయిన తర్వాత, సైఫ్ స్వయంగా తైమూర్‌తో కలిసి ఆటోలో ముంబైలోని లీలావతి ఆసుపత్రికి వెళ్లాడు. నటుడి వెన్నెముకకు సమీపంలో కత్తి ముక్క ఇరుక్కుపోయింది, దానిని లీలావతి ఆసుపత్రి వైద్యులు శస్త్రచికిత్స ద్వారా తొలగించారు. సైఫ్ ఇప్పుడు ప్రాణాపాయం నుంచి బయటపడటం కాస్త ఊరటనిచ్చే విషయమే. ఇక సైఫ్ అలీ ఖాన్‌ను ఆసుపత్రికి తరలించిన ఆటో డ్రైవర్‌కు ఇప్పుడు రివార్డు లభించింది. సైఫ్ అలీఖాన్‌ను లీలావతి ఆసుపత్రికి తీసుకెళ్లిన డ్రైవర్‌కు రూ.11,000 రివార్డు అందించారు. డ్రైవరు చేసిన సేవకు ఓ సంస్థ రివార్డ్‌ను అందజేసి అభినందించింది. ఇక నిందితుడు పశ్చిమ బెంగాల్‌ వాసి అని చెబుతున్నా, బంగ్లాదేశ్ వాసి అయి ఉండవచ్చని ఇప్పుడు పోలీసులు చెబుతున్నారు. నిందితుడి నుంచి ఎలాంటి గుర్తింపు కార్డు లభించలేదు. నిందితుడి నుంచి సరైన భారతీయ పత్రం ఏదీ లభించలేదని డీసీపీ దీక్షిత్ గెడం విలేకరుల సమావేశంలో తెలిపారు. దీంతో పోలీసులు అతడిపై పాస్‌పోర్ట్ చట్టంలోని సంబంధిత సెక్షన్ల కింద కేసు నమోదు చేసి విచారిస్తున్నారు.

ఫస్ట్ టైం అలాంటి పాత్రలో ప్రభాస్!!
ప్రభాస్ హీరోగా పలు సినిమాలు సెట్స్ మీద ఉన్న సంగతి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ప్రభాస్ హీరోగా హను రాఘవపూడి దర్శకత్వంలో ఒక ఒక సినిమా తెరకెక్కుతోంది. దీనికి ఫౌజీ అనే పేరు ఫిక్స్ చేసినట్లు ప్రచారం జరుగుతోంది కానీ అధికారిక ప్రకటన ఇప్పటివరకు రాలేదు. తన సినిమాలలో ఇప్పటివరకు ప్రభాస్ కనిపించని ఒక పాత్రలో కనిపించబోతున్నాడని తెలుస్తోంది. ఈ సినిమాలో ఆయన ఒక సైనికుడి పాత్రలో నటిస్తున్నాడని ముందు నుంచి ప్రచారం జరుగుతూ ఉండగా ఇప్పుడు ఆయన ఒక బ్రాహ్మణ కుటుంబానికి చెందిన వ్యక్తిగా కనిపించబోతున్నాడని తెలుస్తోంది. ఇప్పటికే ప్రభాస్ కాలి గాయం నుంచి కోలుకుంటున్నాడు. ఆయన రాజా సాబ్ పెండింగ్ షూట్ పూర్తి చేసి హను రాఘవపూడి ఫౌజీ షూటింగ్‌ను తిరిగి ప్రారంభించాలి. ఫౌజీ కొత్త షెడ్యూల్ త్వరలో తమిళనాడులోని మధురై సమీపంలోని కరైకుడిలో ప్రారంభం కానుంది. ప్రభాస్ బ్రాహ్మణ కుర్రాడిగా కనిపిస్తాడని, దేవిపురం అగ్రహారం నేపథ్యంలో ఒక ముఖ్యమైన కుటుంబ ఎపిసోడ్ షూట్ చేయనున్నారు. 20 రోజుల పాటు ఈ షెడ్యూల్ జరగనుంది. ప్రభాస్ అందుబాటులోకి రావడంతో ఈ షెడ్యూల్ తేదీలు ఈ వారంలోనే లాక్ కానున్నాయి. ఇమాన్వి హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమా ఎమోషనల్ లవ్ స్టోరీ కలిగి ఉన్న హై వోల్టేజ్ యాక్షన్ డ్రామా అని అంటున్నారు. స్వాతంత్ర్యానికి ముందు జరిగిన కథగా చెప్పబడుతున్న ఈ సినిమాలో ప్రభాస్ సైనికుడి పాత్రలో నటిస్తున్నాడు. మైత్రీ మూవీ మేకర్స్ ఈ భారీ బడ్జెట్ చిత్రాన్ని నిర్మిస్తుండగా, విశాల్ చంద్రశేఖర్ సంగీతం అందిస్తున్నారు. వచ్చే ఏడాది ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.