NTV Telugu Site icon

Top Headlines @ 5 PM: టాప్‌ న్యూస్‌

Top Headlines @ 5 Pm New

Top Headlines @ 5 Pm New

ప్రధాని మోడీ – పవన్‌ కల్యాణ్‌ మధ్య ఆసక్తికర చర్చ.. ఏపీ డిప్యూటీ సీఎం ఏమన్నారంటే..?
ఢిల్లీలోని రాంలీలా మైదానంలో ఆసక్తికర సన్నివేశం చోటు చేసుకుంది.. ఢిల్లీ సీఎం రేఖా గుప్తా ప్రమాణ‌స్వీకారోత్సవానికి ప్రధాని నరేంద్ర మోడీ, కేంద్ర మంత్రులు, ఎన్డీఏ పాలిత రాష్ట్రాల సీఎంలు.. ఎన్డీఏ కూటమిలోని కీలక నేతలు హాజరయ్యారు.. ఇక, ఇదే కార్యక్రమంలో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ల్యాణ్ కూడా పాల్గొన్నారు.. అయితే, ఆ వేదికపై డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌.. ప్రధాని నరేంద్ర మోడీ మధ్య ఆసక్తికర చర్చ సాగింది.. మొత్తానికి పవన్‌ కల్యాణ్‌ను ప్రధాని మోడీ పలకరించడం.. దానికి నవ్వుతూ పవన్‌ కల్యాణ్‌ సమాధానం ఇచ్చిన వీడియో వైరల్‌గా మారిపోయింది.. అయితే, సోషల్‌ మీడియాలో పవన్‌ కల్యాణ్ ఫ్యాన్స్‌, జనసైనికులు ఆ వీడియోను షేర్‌ చేస్తూ.. అది పవన్‌ రేంజ్.. ప్రధాని మోడీ.. పవన్‌ కల్యాణ్‌కు ఇచ్చే గౌరవం అంటూ కామెంట్లు పెడుతున్నారు.. ఇక, ప్రధాని-తన మధ్య జరిగిన చర్చను మీడియాకు వివరించారు పవన్‌ కల్యాణ్.. కాషాయ దుస్తుల్లో వచ్చిన పవన్‌ కల్యాణ్‌ను చూసి.. హిమాలయాలకు వెళ్తున్నారా? అని ప్రశ్నించారట ప్రధాని మోడీ.. దానికి ఇంకా సమయం ఉందంటూ సమాధానం ఇచ్చారట పవన్‌.. మొత్తంగా.. ఢిల్లీ సీఎం రేఖా గుప్తా ప్రమాణస్వీకారానికి హాజరైన పవన్ కల్యాణ్‌తో ప్రధాని మోడీ సరదాగా మాట్లాడారు.. మొత్తంగా మోడీ-పవన్‌ భేటీకి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్‌ మీడియాలో గట్టిగానే తిరుగుతోంది..

కూటమి ప్రభుత్వంపై పవన్‌ కీలక వ్యాఖ్యలు.. అందుకే కొన్ని సమావేశాలు హాజరుకాలేదు..!
ఏపీలో టీడీపీ-జనసేన-బీజేపీ కూటమి అధికారాన్ని చేపట్టింది.. అయితే, ఈ మధ్య ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ కొన్ని సమావేశాలకు దూరంగా ఉండడంపై సోషల్ మీడియాలో పలు రకాల చర్చలు జరుగుతున్నాయి.. అయితే, ఢిల్లీ సీఎం రేఖా గుప్తా ప్రమాణస్వీకారానికి.. ఎన్డీఏ సమావేశానికి హాజరైన పవన్‌ కల్యాణ్.. మీడియా చిట్‌చాట్‌లో కీలక వ్యాఖ్యలు చేశారు.. ఏపీలో సమన్వయంతోనే కలిసి ముందుకు వెళ్తున్నామని స్పష్టం చేశారు పవన్‌.. వెన్ను నొప్పి కారణంగానే ఏపీలో కొన్ని సమావేశాలకి హాజరుకాలేకపోయానన్న ఆయన.. ఇప్పటికీ వెన్ను నొప్పి తీవ్రంగా బాధిస్తోందన్నారు.. ఏపీలో కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలకు కట్టుబడి పనిచేస్తోందని స్పష్టం చేశారు.. అయితే, ఏపీని వైఎస్‌ జగన్ అప్పుల కుప్పగా మార్చారు.. ఆ కారణంగా ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయన్నారు.. ఆర్థిక ఇబ్బందులు ఉన్నా ఇచ్చిన హామీల అమలు చేసుకుంటూ ముందుకు వెళుతున్నాం.. పర్యావరణ, అటవీ శాఖలు నాకు చాలా ఇష్టమైన శాఖలు.. నిబద్ధతతో నా మంత్రిత్వ శాఖ బాధ్యతలు నిర్వహిస్తున్నానని పేర్కొన్నారు పవన్‌ కల్యాణ్‌..

ముంబైలో మంత్రి నారాయణ, సీఆర్టీఏ కమిషనర్‌.. MMRDAతో భేటీ..
ఏపీ మంత్రి నారాయణ, సీఆర్డీఏ కమిషనర్‌, ఇతర ఉన్నతాధికారులు ముంబైలో పర్యటిస్తున్నారు.. మంత్రి నారాయణ, సీఆర్డీఏ కమిషనర్ కన్నబాబు, ఇతర అధికారులు.. ముంబై మెట్రోపాలిటన్ రీజియన్ డెవలప్‌మెంట్‌ అథారిటీ (MMRDA), సిడ్కో అధికారులతో సమావేశమయ్యారు.. ఈ సమావేశంలో MMRDA ప్లానింగ్ డైరెక్టర్ శంకర్ దేశ్ పాండే, ఇతర విభాగాల అధికారులు పాల్గొన్నారు.. అయితే, ముంబై అభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తోంది MMRDA.. ముంబైలో రోడ్లు, మెట్రో రైలు, హౌసింగ్ ప్రాజెక్టులను MMRDA చేపడుతోంది.. రోడ్లు అభివృద్ధి, మెట్రో రైలు ప్లానింగ్, రవాణా ప్రణాళికలు, ఇళ్ల నిర్మాణం, రీజినల్ డెవలప్మెంట్, నిధుల సమీకరణపై మంత్రి నారాయణ బృందానికి వివరించారు ముంబై అధికారులు.. ముంబై మహానగరంలో విదేశీ పెట్టుబడుల సహకారంతో మౌళిక వసతులను అభివృద్ధి చేస్తున్న విధానాన్ని మంత్రికి వివరించారు MMRDA అధికారులు.. ఇక, ప్రభుత్వ ప్రాజెక్టుల కోసం నిధుల సమీకరణ చేస్తున్న విధానాలు అడిగి తెలుసుకున్నారు మంత్రి నారాయణ.. ముంబై మహానగర అభివృద్ధిలో MMRDA తీసుకుంటున్న విధానాలను ఏపీలోని నగరాల అభివృద్ధికి అనుసరించే ఆలోచనలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఉన్నట్టుగా తెలుస్తుండగా.. అందులో భాగంగానే మంత్రి నారాయణ, సీఆర్డీఏ కమిషనర్‌ కన్నబాబు.. ముంబైలో పర్యటిస్తున్నట్టుగా తెలుస్తోంది.

మన పర్యావరణం, నీరు, భూ పరిరక్షణ కోసం చర్యలు తీసుకోవాలి
రంగారెడ్డి జిల్లా క‌న్ష శాంతి వ‌నంలో తెలంగాణ బ‌యోడైవ‌ర్సిటీ బోర్డు ఏర్పాటు చేసిన నేష‌న‌ల్ బ‌యోడైవ‌ర్స‌టీ కాన్ఫ‌రెన్స్ -2025లో మంత్రి కొండా సురేఖ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. నేష‌న‌ల్ బ‌యోడైవ‌ర్స‌టీ కాన్ఫ‌రెన్స్ – 2025… ఫిబ్ర‌వ‌రి 20, 21, 22 తేదీలలో రంగారెడ్డిలో మూడు రోజుల పాటు జరగనుందన్నారు. దెబ్బతింటోన్న జీవవైవిధ్య పరిరక్షణలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు మంత్రి కొండా సురేఖ. మన పర్యావరణం, నీరు, భూ పరిరక్షణ కోసం చర్యలు తీసుకోవాలని మంత్రి కొండా సురేఖ సూచించారు. జీవవైవిధ్య పరిరక్షణ దిశగా సంరక్షణ, పరిశోధన, అధ్యయన రంగాలకు ఉపయుక్తంగా ఈ జీవవైవిధ్య సదస్సు ఉపయోగపడుందని మంత్రి అభిప్రాయం వ్యక్తం చేశారు. ఈ సదస్సులో పాల్గొన్న విద్యార్థులు, యువ సైంటిస్టులకు జీవ వైవిధ్యం కోసం పని చేయాలని మంత్రి సురేఖ‌ కోరారు.

మటన్‌ సూప్‌ ఆర్డర్ చేస్తే.. బొద్దింక సూప్‌ వచ్చిందేంటీ..?
రోజు రోజుకు హైదరాబాద్‌లో ఆహార పదార్థాల నాణ్యత తగ్గుతోంది. ఇప్పటికే గ్రేటర్‌లో ఫుడ్‌ సేఫ్టీ అధికారులు తనిఖీలు నిర్వహిస్తూ నాణ్యత ప్రమాణాలు పాటించని రెస్టారెంట్లను సీజ్‌ చేస్తున్నారు. అయినప్పటికీ కొన్ని రెస్టారెంట్ల యాజమాన్యాల్లో మాత్రం మార్పు రావడం లేదు. తాజాగా అహార పదార్థాల నాణ్యత లోపించిన ఘటన వెలుగులోకి వచ్చింది. గ్రేటర్‌ హైదరాబాద్‌లోని సైనిక్‌పురిలో ఉన్న అరేబియన్‌ మంది రెస్టారెంట్‌కు ఓ కస్టమర్‌ వెళ్లాడు. ఆకలి మీదున్న ఆ కస్టమర్‌ మటన్‌ సూప్‌ను ఆర్డర్‌ చేసి వేయిట్‌ చేస్తున్నాడు. ఇంతలో తను ఆర్డర్‌ ఇచ్చిన సూప్‌ వచ్చింది. ఆవురావురుమని తిన్నేద్దామనుకున్న తనకు అంతలోనే షాక్‌ తగిలింది. మటన్‌ సూప్‌లో చెంచా పెట్టిచూస్తే మటన్‌కు బదులు బొద్దింక దర్శనమిచ్చింది. దీంతో అవాక్కైన కస్టమర్‌ రెస్టారెంట్‌ యాజమాన్యం దృష్టికి ఈ విషయాన్ని తీసుకెళ్లాడు. వాళ్లు దాన్ని చూసి మామూలుగానే రెస్పాన్స్‌ ఇచ్చారు. దీంతో మరింత ఖంగుతిన్నాడు కస్టమర్‌ రోహిత్. అయితే.. ఈ ఘటనకు సంబంధించి వీడియోను సామాజిక కార్యకర్త రాబిన్ జక్కీయస్ సోషల్ మీడియా వేదికగా స్పందించి సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. అహార భద్రతకు సంబంధించి ఇటువంటి ఉదంతాలు పెరిగిపోతుండటంపై ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రెస్టారెంట్‌లు పరిశుభ్రత పాటించకపోవడం వల్ల ప్రజల ఆరోగ్యానికి ముప్పు వాటిల్లే అవకాశం ఉందని అంటున్నారు. ఈ ఘటనపై వెంటనే చర్యలు తీసుకోవాలని గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (GHMC) అధికారులను, సంబంధిత శాఖలను కోరారు.

బీఆర్‌ఎస్‌ పార్టీ బరితెగించి ముందుకు పోతుంది
రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో వేములవాడ ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆది శ్రీనివాస్‌ మీడియాతో మాట్లాడుతూ.. బీఆర్‌ఎస్‌ పార్టీ బరితెగించి ముందుకు పోతుందని మండిపడ్డారు. బీఆర్‌ఎస్‌ పార్టీ భవనంలో ప్రెస్ మీట్లో అధికారుల పట్ల వ్యాఖ్యలు కేటీఆర్ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశామని ఆయన వెల్లడించారు. సోషల్ మీడియాలో జిల్లా కలెక్టర్ మీద అనేక ఆరోపణ చేస్తున్నారని ఆయన విమర్శించారు. జిల్లా కేంద్రంలోని 1000 ఎకరాల భూముల ఆక్రమణకు గురైంది, వాటిని స్వాధీనం చేసుకునే ప్రయత్నం చేస్తున్నందుకు వ్యక్తిగత జీవితం గురించి చూస్తున్నారని ఆయన పేర్కొన్నారు. ఫోన్ ట్యాపింగ్ లో మీరు వ్యక్తిగతంగా సినిమా వాళ్ళ జీవితాల్లోకి తొంగి చూడలేదా అని ఆది శ్రీనివాస్‌ ప్రశ్నించారు.

ఓటీటీ ప్లాట్‌ఫామ్స్‌కు కేంద్ర ప్రభుత్వం స్ట్రాంగ్ వార్నింగ్..
ఇండియాస్ గాట్ లాటెంట్ కార్యక్రమంలో చెలరేగిన వివాదం మధ్య, కేంద్రం ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లకు కీలక సూచనలు చేసింది. ప్లాట్‌ఫామ్స్‌ ప్రవర్తనా నియమావళిని పాటించాలని కేంద్రం సూచించింది. ‘A’ రేటెడ్ కంటెంట్‌ను నిషేధించాలని తెలిపింది. ఈ మేరకు సమాచార, ప్రసార మంత్రిత్వశాఖ ఓ ప్రకటనను విడుదల చేసింది. ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లు, సోషల్‌ మీడియాలోని అశ్లీల, అసభ్యకరమైన కంటెంట్‌లపై ఫిర్యాదులు అందాయని మంత్రిత్వ శాఖ పేర్కొంది. ఐటీ రూల్స్‌లోని (2021) కోడ్‌ ఆఫ్‌ ఎథిక్స్‌ గురించి ప్రస్తావించింది. సామాజిక మాధ్యమాలు, ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లు ఐటీ రూల్స్‌లోని (2021) కోడ్‌ ఆఫ్‌ ఎథిక్స్‌ను తప్పనిసరిగా పాటించాలని సూచించింది. ఈ నిబంధనలు ఉల్లంఘించొద్దని హెచ్చరించింది. వయస్సు ఆధారంగా కంటెంట్‌ను వర్గీకరించాలని పేర్కొంది. ఓటీటీలు స్వీయ నియంత్రణ కలిగి ఉండాలని ప్రకటన ద్వారా తెలిపింది.

ఏక్‌నాథ్ షిండేకు హత్యా బెదిరింపు.. కారును బాంబుతో పేల్చేస్తామని హెచ్చరిక
మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండేకు హత్య బెదిరింపు కేసు వెలుగులోకి వచ్చింది. గోరేగావ్ పోలీసులకు ఒక తెలియని వ్యక్తి నుండి ఒక ఇమెయిల్ వచ్చింది. ఇందులో ఏక్‌నాథ్ షిండే కారును బాంబుతో పేల్చివేస్తానని బెదిరింపు ఉంది. మంత్రిత్వ శాఖ, జెజె మార్గ్ పోలీస్ స్టేషన్‌కు కూడా ఇలాంటి బెదిరింపు మెయిల్‌లు వచ్చాయి. బెదిరింపు ఇమెయిల్ పంపిన వ్యక్తి కోసం పోలీసులు వెతుకుతున్నారు. ఢిల్లీ ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకార కార్యక్రమానికి హాజరు కావడానికి ఏక్‌నాథ్ షిండే ప్రస్తుతం ఢిల్లీలో ఉన్నారు. బెదిరింపు వార్త వచ్చినప్పటి నుండి భద్రతను కట్టుదిట్టం చేశారు. బెదిరింపు చేసిన వ్యక్తి కోసం పోలీసులు గాలిస్తున్నారు. అయితే, పోలీసుల ప్రాథమిక దర్యాప్తులో అది బూటకపు కాల్ (మెయిల్) అని తేలింది.

అకస్మాత్తుగా 1,380 కార్లను రీకాల్ చేసిన కియా.. ఏమైందో తెలుసా?
దక్షిణకొరియా ఆటోమొబైల్‌ దిగ్గజం కియా ఇండియా తన ఎలక్ట్రిక్ కారు ఈవీ6 ను రికాల్ చేస్తున్నట్లు ప్రకటించింది. 1,380 యూనిట్లను స్వచ్ఛందంగా రీకాల్ చేస్తున్నట్లు కంపెనీ తెలిపింది. ఈ యూనిట్లను 3 మార్చి 2022, 14 ఏప్రిల్ 2023 మధ్య తయారు చేసిన కార్లను రికాల్ చేయనుంది. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వ రోడ్డు రవాణా, రహదారుల మంత్రిత్వ శాఖ (MoRTH)కి సమాచారం అందించింది. ప్రస్తుతం కస్టమర్లను సంప్రదిస్తోంది. రీకాల్ చేయడానికి కారణాన్ని కంపెనీ వెల్లడించింది. ఇంటిగ్రేటెడ్ ఛార్జింగ్ కంట్రోల్ యూనిట్ (ICCU) సాఫ్ట్‌వేర్‌ను నవీకరించనుంది. ఇది 12V సపోర్టు బ్యాటరీ ఫాస్ట్ ఛార్జింగ్, పనితీరును మెరుగుపరుస్తుంది. ఈ రీకాల్ ఛార్జింగ్ కంట్రోల్ యూనిట్ సామర్థ్యాన్ని పెంచేందుకు కంపెనీ యత్నిస్తోంది. 2025లో తయారైన మోడళ్లను కంపెనీ రీకాల్ చేయలేదు.

ఆ పనిలో బిజీగా రష్మిక
వరుస సినిమాలు చేస్తూ సక్సెస్ స్ట్రీక్ ఎంజాయ్ చేస్తున్న రష్మిక మందన తన తరువాతి ప్రాజెక్టులను పూర్తి చేసి ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు ప్రణాళిక సిద్ధం చేసుకుంటుంది. చావాలో ఆమె నటించిన యేసు భాయి రోల్ కి మంచి ప్రాధాన్యత ఉండటంతో పాటు ఆమె పద్ధతిగా కనిపించింది అనే పేరు రావడంతో ఆమెకు మరిన్ని సినిమాలు క్యూ కడుతున్నాయి. అంతకుముందే ఆమె చేసిన పుష్ప సెకండ్ పార్ట్ కూడా బ్లాక్ బస్టర్ హిట్ గా నిలవడమే కాదు ఇండియన్ సినీ హిస్టరీలోనే అత్యంత భారీ కలెక్షన్లు సాధించిన చిత్రంగా నిలిచింది. అయితే జిమ్ లో ఆమె కాలికి గాయం కావడంతో ఆమె చేస్తున్న బడా చిత్రాలన్నింటికీ బ్రేకులు పడ్డాయి. అయితే ఆమె చేస్తున్న మరో బడా చిత్రం సికిందర్ రంజాన్ సందర్భంగా ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతోంది. ఈ సినిమాలో సల్మాన్ ఖాన్ హీరోగా నటిస్తుండగా ఆయన సరసన రష్మిక హీరోయిన్గా నటిస్తోంది. మురుగదాస్ ఈ సినిమాకి దర్శకుడిగా వ్యవహరిస్తున్నారు. ఏప్రిల్ లో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఆమె త్వరలోనే ఈ సినిమా సెట్స్ లో రీ జాయిన్ అయి తన పార్ట్ పూర్తి చేయాల్సిన పరిస్థితి కనిపిస్తోంది. మరొకపక్క కుబేరలో ఆమె చేయాల్సిన పోర్షన్ కోసం శేఖర్ కమ్ముల ఎదురు చూస్తున్నాడు. రష్మిక కాలి గాయం కారణంగా ఈ సినిమా షూటింగ్ కూడా నిలిచిపోయింది. ఈ నేపథ్యంలోని ఈ సినిమాకి సంబంధించిన షూట్ వాయిదా పడింది. షూట్ తో పాటు రిలీజ్ కూడా వాయిదా పడింది. ఇక తన పోర్షన్స్ పూర్తి చేసి వీలైనంత త్వరగా మేకర్స్ కి రిలీజ్ అడ్డంకులు తొలగించేందుకు రష్మిక ప్రయత్నాలు చేస్తున్నట్లుగా తెలుస్తోంది.

ప్రశాంత్ నీల్ డ్యూటీ ఎక్కేశాడు!
ఎన్టీఆర్ హీరోగా ప్రశాంత్ నీల్ డైరెక్షన్లో ఒక సినిమా తెరకెక్కుతోంది. ప్రస్తుతానికి ఈ సినిమాకి డ్రాగన్ అనే టైటిల్ పరిశీలిస్తున్నారు. ఇక ఇప్పటికే ఈ సినిమా పట్టాలెక్కాల్సి ఉంది కానీ పలు కారణాలతో వాయిదా పడుతూ వచ్చింది. ఎట్టకేలకు ఈ సినిమా ఈరోజు సెట్స్ మీదకు వెళ్ళింది. ఇక ఈరోజు హైదరాబాదులోని రామోజీ ఫిలిం సిటీ లో ఈ సినిమా షూటింగ్ మొదలు పెట్టినట్లుగా సినిమా టీంతో పాటు నిర్మాణ సంస్థ అధికారికంగా ప్రకటించింది. ఈ విషయాన్ని జూనియర్ ఎన్టీఆర్ కూడా తన సోషల్ మీడియా వేదికగా నిర్ధారించారు. నిజానికి ఈ సినిమా అప్డేట్ కోసం అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. జూనియర్ ఎన్టీఆర్ ని ప్రశాంత్ నీల్ స్టైల్ ఎలివేషన్స్ లో చూద్దామని అభిమానులతో పాటు సినీ ప్రేమికుల సైతం ఆసక్తికరంగా ఎదురు చూస్తున్నారు. ఇక ఈరోజు 2000 మంది జూనియర్ ఆర్టిస్టులతో ఒక భారీ ఎపిసోడ్ షూట్ చేస్తున్నట్లుగా తెలుస్తోంది. ఈ షెడ్యూల్లో జూనియర్ ఎన్టీఆర్ నటించడం లేదు కానీ వచ్చే షెడ్యూల్లో ఆయన జాయిన్ కాబోతున్నారని తెలుస్తోంది. ఇక ఈ సినిమా వచ్చే ఏడాది జనవరి 9వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం ఉంది. తెలుగుతో పాటు తమిళ, హిందీ, కన్నడ, మలయాళ భాషలలో కూడా ఈ సినిమాని రూపొందిస్తున్నారు. ఒకరకంగా సంక్రాంతి కానుకగా సినిమాను ప్రేక్షకులు ముందుకు తెచ్చేందుకు ప్రయత్నాలు సిద్ధం చేస్తున్నారు. కేజిఎఫ్ సిరీస్ తర్వాత సలార్ లాంటి సినిమాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ఈ సినిమాని కళ్యాణ్ రామ్, నవీన్, రవిశంకర్,ని హరికృష్ణ కొసరాజు మైత్రి మూవీ మేకర్స్ -ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ల మీద సంయుక్తంగా నిర్మిస్తున్నారు.