NTV Telugu Site icon

Top Headlines @ 5 PM: టాప్‌ న్యూస్‌

Top Headlines @ 5 Pm New

Top Headlines @ 5 Pm New

అమరావతికి కేంద్ర సాయంపై క్లారిటీ ఇచ్చిన మంత్రి
రాజధాని అమరావతికి కేంద్ర సాయంపై శాస‌న‌మండ‌లిలో సమాధానం ఇస్తూ క్లారిటీ ఇచ్చారు మంత్రి నారాయణ.. అమ‌రావ‌తికి ప్రపంచ బ్యాంకు, ఏషియ‌న్ డెవ‌ల‌ప్‌మెంట్ బ్యాంక్ 15000 కోట్లు రుణం ఇస్తున్నాయని.. ఈ రుణంపై కేంద్ర ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్‌ కూడా స్పష్టత ఇచ్చారని గుర్తుచేశారు.. ఈ నిధుల్లో గ్రాంట్ ఎంత‌… రుణం ఎంత అనేది చ‌ర్చించి చెబుతాం. హడ్కో ద్వారా 11 వేల కోట్లు రుణం తీసుకుంటున్నాం. KFW అనే జర్మన్ బ్యాంక్ ఒక 5000 కోట్లు లోన్ ఇస్తుంది. మొత్తం 31 వేల కోట్లు అమరావతికి వివిధ రూపాల్లో వస్తున్నాయని వెల్లడించారు. అమరావతికి రైల్వే ప్రాజెక్ట్ ఖర్చు కేంద్రమే భరిస్తుందన్నారు.. ఇక, అమ‌రావ‌తి రైల్వే ప్రాజెక్ట్ కు అవ‌స‌ర‌మైన భూమిని ఎలా సేక‌రించాల‌నే దానిపై చ‌ర్చిస్తున్నాం. అమరావతి డిజైన్ చేసినప్పుడే స్వయం సమృద్ధి (Self-sustainability) గా డిజైన్ చేశారని తెలిపారు.. ప్రస్తుతం పనులు ప్రారంభించడానికి బడ్జెట్ లో 6000 కోట్లు కేటాయించాం.. ప్రజలు టాక్స్ ల రూపంలో చెల్లించిన డబ్బులు అమరావతికి వాడకూడదనేది సీఎం నారా చంద్రబాబు నాయుడు చాలా క్లియర్ గా చెప్పారని పేర్కొన్నారు.. రాజ‌ధాని కోసం తీసుకున్న రుణాల‌ను అమ‌రావ‌తి పూర్తయిన తర్వాత అక్కడి భూములతో రీ పేమెంట్ చేస్తాం అన్నారు నారాయణ.. బ్యాంకుల‌ ద్వారా డబ్బులు రావడానికి లేట్ అవుతుందని.. దీంతో, ఈ బడ్జెట్‌లో కేటాయించిన 6000 కోట్లతో పనులు ప్రారంభిస్తాం అని తెలిపారు.. అయితే, రుణాల ద్వారా డబ్బులు వచ్చిన తర్వాత బడ్జెట్ డబ్బులు క్లియర్ చేయనున్నట్టు శాసనమండలిలలో వెల్లడించారు మంత్రి పొంగూరు నారాయణ..

ఎవ్వరినీ వదలని పవన్‌ కల్యాణ్‌.. ట్వీట్‌ వైరల్
ప్రశ్నిస్తానంటూ జనసేన పార్టీ పెట్టారు పవర్‌ స్టార్‌ పవన్‌ కల్యాణ్.. ఆ పార్టీ పెట్టి 11 ఏళ్లు పూర్తి చేసుకుని ఈ మధ్యే 12వ ఆవిర్భావ సభ ఘనంగా నిర్వహించారు.. తనకు ఎన్నికల్లో ఘన విజయాన్ని అందించిన పిఠాపురం అసెంబ్లీ నియోజకవర్గం వేదికగా భారీ బహిరంగ సభ నిర్వహించి.. కీలక అంశాలను ప్రస్తావించారు పార్టీ అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్.. పార్టీ పెట్టిన నాటి నుంచి.. ఇవాళ అధికారంలో కీలక భాగస్వామిగా మారిన వరకు జరిగిన ప్రయాణాన్ని నెమరువేసుకున్నారు.. అయితే, ఈ సందర్భంగా శుభాకంక్షలు తెలిపిన వారితో పాటు.. ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా నిర్వహించేందుకు కృషి చేసిన ప్రతీ ఒక్కరికి పేరుపేరునా ధన్యవాదులు తెలుపుతూ ఎక్స్‌ (ట్విట్టర్‌)లో పోస్టు పెట్టారు.. సీఎం చంద్రబాబు మొదలు కొని.. జనసేన కార్యకర్తల వరకు ఎవరినీ వదలకుండా ప్రత్యేక ధన్యవాదులు తెలిపిన పవన్‌ కల్యాణ్ ట్వీట్లు కాస్తా ఇప్పుడు వైరల్‌గా మారిపోయాయి. “జనసేన పార్టీ 11 సంవత్సరాల సుదీర్ఘ ప్రయాణం పూర్తి చేసుకుని, 12వ ఆవిర్భావ దినోత్సవం జరుపుకున్న సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేసిన తెలుగుదేశం పార్టీ అధినేత, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకి, మంత్రి నారా లోకేష్‌కి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు, రాజమహేంద్రవరం పార్లమెంట్ సభ్యురాలు పురంధేశ్వరికి, ఎన్డీఏ పక్ష నాయకులకు, ఇతర నాయకులు, చిత్ర పరిశ్రమ మిత్రులు, శ్రేయోభిలాషులకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. జనసేన పార్టీ రానున్న రోజుల్లో మరింత బలమైన పార్టీగా నిర్మాణం చేయడంతో పాటుగా, సామాన్యుల గొంతుకగా, రాష్ట్ర ప్రయోజనాలు, జాతీయ ఐక్యత లక్ష్యంగా మరింత బాధ్యతగా పనిచేసే దిశగా జనసేన పార్టీ అడుగులు వేయనుంది” అంటూ తొలి ట్వీట్ చేశారు పవన్‌ కల్యాణ్..

వల్లభనేని వంశీ బెయిల్‌ పిటిషన్‌పై విచారణ మళ్లీ వాయిదా..
వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ నేత, గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ మోహన్‌ బెయిల్ పిటిషన్‌పై విచారణ మరోసారి వాయిదా పడింది.. వంశీ దాఖలు చేసిన బెయిల్‌ పిటిషన్‌పై విచారణను వచ్చే సోమవారానికి వాయిదా వేసింది సీఐడీ కోర్టు.. గన్నవరం టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో బెయిల్ ఇవ్వాలని వంశీ పిటిషన్ దాఖలు చేయగా.. కౌంటర్ దాఖలు చేయటం కోసం సమయం కోరారు సీఐడీ పోలీసులు.. ఈ కేసులో ఏ71గా ఉన్నారు వల్లభనేని వంశీ మోహన్‌.. అయితే, బెయిల్‌ పిటిషన్‌పై విచారణను వచ్చే సోమవారానికి సీఐడీ కోర్టు వాయిదా వేయడంతో.. మరోసారి వల్లభనేని వంశీ మోహన్‌కు షాక్‌ తగినట్లు అయ్యింది..

హెచ్‌సీఏలో నిధులు దుర్వినియోగం.. ఈడీ విచారణ..
హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (HCA) నిధుల దుర్వినియోగంపై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED) దర్యాప్తు ముమ్మరంగా కొనసాగుతోంది. హెచ్‌సీఏ నిధుల అక్రమ లావాదేవీలకు సంబంధించి ఈడీ తాజాగా కొన్ని కీలక విషయాలను వెలుగులోకి తెచ్చింది. హెచ్‌సీఏలో కాంట్రాక్టుల పేరుతో క్విడ్ ప్రో కో (Quid pro quo) వ్యవహారం చోటుచేసుకున్నట్లు అధికారులు గుర్తించారు. ప్రత్యేకంగా హెచ్‌సీఏ మాజీ ట్రెజరర్ సురేందర్ అగర్వాల్‌పై ఈడీ అభియోగాలు నమోదు చేసింది. సురేందర్ అగర్వాల్ తన హోదాను ఉపయోగించి హెచ్‌సీఏ నిధులను అనుమతి లేకుండా వినియోగించారని అధికారులు వెల్లడించారు. క్రికెట్ బాల్స్, బకెట్ చైర్స్, జిమ్ ఎక్విప్మెంట్ కొనుగోలు పేరుతో భారీ మొత్తంలో సబ్ కాంట్రాక్టులు ఇచ్చారని, అందులో పెద్ద ఎత్తున అక్రమ లావాదేవీలు జరిగినట్లు విచారణలో తేలింది. సురేందర్ అగర్వాల్‌కు సంబంధించి 90 లక్షలకు పైగా నగదు మూడింటికిపైగా కంపెనీల ద్వారా చెల్లింపులు జరిగినట్లు ఈడీ గుర్తించింది. ఈడీ దర్యాప్తులో వెలుగులోకి వచ్చిన ప్రధాన అంశాల్లో అతని కుటుంబ సభ్యుల బ్యాంకు ఖాతాలకు కూడా పెద్ద మొత్తంలో నగదు బదిలీ జరిగినట్లు తెలిసింది. సురేందర్ అగర్వాల్ భార్య, కొడుకు, కోడలు బ్యాంకు ఖాతాల్లోకి లక్షల రూపాయలు జమ అయినట్లు అధికారులు గుర్తించారు. అంతేకాదు, అతని భార్యకు చెందిన కేబీ జ్యువెలర్స్ ఖాతాకు కూడా భారీగా నగదు బదిలీ జరిగింది.

పసిపిల్లలను అమ్ముతున్న ముఠా అరెస్ట్‌
రాచకొండ పోలీసులు చిన్నపిల్లల విక్రయాలకు సంబంధించి భారీ అంతరాష్ట్ర ముఠాను అరెస్ట్ చేశారు. ఈ ఆపరేషన్‌లో మొత్తం 9 మంది నిందితులను అదుపులోకి తీసుకున్నట్లు రాచకొండ పోలీస్‌ కమిషనర్‌ సుధీర్‌ బాబు తెలిపారు. అంతేకాకుండా, దత్తత తీసుకున్న 18 మంది పిల్లలను కూడా అదుపులోకి తీసుకున్నారు. ఈ ముఠా పిల్లల అక్రమ విక్రయాల్లో కీలకంగా వ్యవహరించినట్లు పోలీసులు గుర్తించారు. పోలీసుల అనుసంధానంలో ముఠాలో ప్రధానంగా అమూల్య అనే మహిళ కీలకంగా వ్యవహరించినట్లు నిర్ధారణ అయ్యింది. ఈ ముఠా 10 మంది చిన్నారులను అక్రమంగా విక్రయించింది. ఇంకా, అమూల్యతో పాటు దీప్తి అనే మహిళ కలిసి మరో 8 మందిని అమ్మినట్లు పోలీసులు గుర్తించారు. మగ శిశువులను ₹4,00,000 – ₹6,00,000 మధ్య అమ్మకాలు జరిపారు. ఆడ శిశువులను ₹2,00,000 – ₹4,00,000 మధ్య విక్రయించారు. మగ శిశువులను ₹4,00,000 – ₹5,00,000 మధ్య కొనుగోలు చేసి ₹5,00,000 – ₹6,00,000 మధ్య అమ్మినట్లు తేలింది. ఇప్పటివరకు 25 మంది శిశువుల అమ్మకాలు జరిగాయి. ఇందులో 16 మందిని ఇప్పటికే రెస్క్యూ చేయగా, ఇంకా 9 మంది చిన్నారులను కాపాడాల్సి ఉంది.

అనర్హుల జేబుల్లోకి చేరుతోందా? రేషన్ పంపిణీపై సుప్రీం ప్రశ్న..
నేడు ఒక కేసు విచారణలో భాగంగా సుప్రీంకోర్టు ప్రభుత్వాలకు పలు ప్రశ్నలు సంధించింది. దేశంలోని పలు రాష్ట్రాలు రేషన్ పంపిణీ వ్యవస్థల ద్వారా నిరుపేదలకు సబ్సిడీతో కూడిన నిత్యావసర సరకులను సరఫరా చేస్తున్నామని చెప్పుకుంటున్నట్లు గుర్తు చేసింది. అయితే ఈ రేషన్ బీపీఎల్(దారిద్య్రరేఖకు దిగువన ఉన్న కుటుంబాలు) లబ్ధిదారుల కుటుంబాలకు చేరడం లేదని పేర్కొంది. రాష్ట్రాలు రేషన్ కార్డులను ప్రదర్శన కోసం ఉపయోగిస్తున్నారా? అని సుప్రీంకోర్టు ప్రశ్నించింది. రేషన్ కార్డు ప్రయోజనాలు నిజంగా లబ్ధిదారులకు చేరుతున్నాయా? లే అర్హత లేని వ్యక్తుల జేబుల్లోకి చేరుతున్నాయా? అని సుప్రీం అడిగింది. సుప్రీంకోర్టులో జస్టిస్ సూర్యకాంత్, ఎన్. కోటీశ్వర్ సింగ్ ధర్మాసనం ఈ ప్రశ్నలు సంధించింది. అధిక మొత్తంలో రేషన్ కార్డులు జారీ చేశామని చెప్పుకునే రాష్ట్రాలు రేషన్ కార్డులను ప్రదర్శన కోసం ఉపయోగిస్తున్నాయని కోర్టు మండిపడింది. కోవిడ్ -19 మహమ్మారి సమయంలో వలస కార్మికులు ఎదుర్కొంటున్న ఇబ్బందులపై దాఖలైన కేసును విచారించిన కోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది.

‘‘మోక్షం’’ పేరుతో ఫ్రెంచ్ మహిళపై లైంగిక దాడి.. అరుణాచలంలో గైడ్ అఘాయిత్యం..
తమిళనాడు అరుణాచలం(తిరువణ్ణామలై)లో దారుణం జరిగింది. ‘‘మోక్షం’’ పేరులో ఒక ఫ్రెంచ్ మహిళను నమ్మించిన టూరిస్ట్ గైడ్, ఆమెపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఫ్రాన్స్‌కి చెందిన 46 ఏళ్ల మహిళ జనవరి 2025లో తిరువణ్ణామలైలో ఒక ప్రైవేట్ ఆశ్రమంలో నివసిస్తోంది. గతేడాది కొండచరియలు విరిగిపడటంతో దీపమలై కొండపైకి ప్రజలను అనుమతించడం నిషేధించారు. అయితే, నిషేధం ఉన్నప్పటికీ, ఆమె టూరిస్ట్ గైడ్ బృందంతో కలిసి కొండపైకి వెళ్లింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఆమె ధ్యానం చేయడానికి ఒక గుహలోకి వెళ్లిన క్రమంలో వెంకటేశన్ అనే టూరిస్ట్ గైడ్ ఆమెపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. ఆ మహిళ తప్పించుకుని కొండ దిగి తిరువణ్ణామలై పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ కేసుని దర్యాప్తు చేయడానికి ప్రత్యేక టీంని ఏర్పాటు చేశారు. నిందితుడు వెంకటేశన్‌ని పోలీసులు అరెస్ట్ చేశారు.

సునీతా విలియమ్స్‌ను వైట్‌హౌస్‌కు ఎందుకు పిలవలేదు.. ట్రంప్ క్లారిటీ..
తొమ్మిది నెల‌లుగా నెల‌కొన్న ఉత్కంఠ‌కు ఈ రోజు తెర‌ప‌డింది. దివి నుంచి వ్యోమగాములు దివికి చేరుకున్నారు. దాదాపు తొమ్మిది నెల‌లుగా అంత‌రిక్షంలోనే ఉండిపోయిన భారత సంతతికి చెందిన సునీతా విలియమ్స్ తోపాటూ.. బుచ్‌ విల్మోర్ మరో ఇద్దరు వ్యోమగాములు.. విజయవంతంగా భూమిపై అడుగు పెట్టారు. ఇంటర్నేషనల్‌ స్పేస్‌ స్టేషన్ నుంచి మంగ‌ళ‌వారం తిరుగు ప్రయాణమైన వాళ్లు.. భార‌త కాల‌మానం ప్రకారం ఇవాళ తెల్లవారుజామున 3.27 నిమిషాల‌కు ఫ్లోరిడా సముద్ర తీరంలో సేఫ్‌గా ల్యాండ్ అయ్యారు. ఈ అంశంపై అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ స్పందించారు. వ్యోమగాములను ఎందుకు వైట్ హౌస్‌కు పిలవలేదు? అనే ప్రశ్నకు ట్రంప్ సమాధానమిచ్చారు. వ్యోమగాములు ఇన్ని రోజులు అంతరిక్షంలో గడిపారని.. వారి సాధారణ స్థితికి చేరుకున్న తర్వాత ఆహ్వానిస్తామని ట్రంప్ తెలిపారు. “వారు భూమిపై నిలకడగా ఉండటానికి కొంత సమయం పడుతుంది. ఎందుకంటే అంతరిక్షంలో శారీరక స్థితిలో చాలా మార్పులు ఉంటాయి. గురుత్వాకర్షణ శక్తి లేకపోవడంతో శరీరం తేలికగా మారుతుంది. భూమిపై గురుత్వాకర్షణ శక్తి ఉంటుంది కాబట్టి వాళ్ల ఈ పరిస్థితులకు అలవాటు పడాలి. అందుకే వారిని ఇప్పుడే వైట్ హౌస్‌కు పిలవలేదు. వాళ్లు పరిస్థితి మెరుగుపడి సాధారణ స్థితికి చేరుకున్న తర్వాత తప్పకుండా ఆహ్వానిస్తాం.” అని ట్రంప్ వివరించారు.

పెద్ద ప్లానే.. 13 వేదికల్లో గ్రాండ్గా ఓపెనింగ్ సెర్మనీ ఏర్పాటు చేయనున్న బీసీసీఐ
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2025 అణాగ్రంగా వైభవంగా మార్చి 22న కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్ స్టేడియంలో ప్రారంభం కానుంది. గత సీజన్ విజేత కోల్‌కతా నైట్ రైడర్స్ (KKR), రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) జట్ల మధ్య ఓపెనింగ్ మ్యాచ్ జరగనుంది. ఈ ఏడాది ఐపీఎల్ 18వ సీజన్ కావడంతో, భారత క్రికెట్ కంట్రోల్ బోర్డ్ (BCCI) ఈ లీగ్‌ను మరింత వినోదాత్మకంగా మార్చేందుకు కొత్త నిర్ణయాన్ని తీసుకుంది. ఈసారి ఒక్క కోల్‌కతాలోనే కాదు, మొత్తం 13 వేదికల్లోనూ ఓపెనింగ్ సెర్మనీ నిర్వహించనుంది. ఈ ఏడాది BCCI ప్రత్యేకంగా ప్రతి వేదికపై తొలి మ్యాచ్‌కు ముందుగా ఓపెనింగ్ సెర్మనీ నిర్వహించాలని నిర్ణయించింది. ఈ కార్యక్రమానికి ప్రముఖ సినీ నటులు, గాయకులు, ఇతర ప్రముఖ కళాకారులు పాల్గొని అభిమానులను అలరించనున్నారు. సాధారణంగా, ఓపెనింగ్ మ్యాచ్‌కు మాత్రమే గ్రాండ్ సెర్మనీ జరుగుతుంది. కానీ, ఈసారి 13 వేదికల్లోని ప్రతి స్టేడియంలో మొదటి మ్యాచ్‌కు ముందు ప్రత్యేక ప్రదర్శనలు ఉంటాయి.

ప్యారడైజ్ లో అలాంటి పాత్ర చేస్తున్న నాని
నేచురల్ స్టార్ నాని కెరీర్ లోనే మొదటిసారి డిఫరెంట్ కథతో వస్తున్నాడు. అదే ది ప్యారడైజ్. ఇప్పటి వరకు నాని ఇలాంటి పాత్రలో నటించలేదు. శ్రీకాంత్ ఓదెల డైరెక్షన్ లో వస్తున్న ఈ మూవీ టీజర్ ఓ సెన్సేషన్ అయింది. ఇండస్ట్రీ చూపుతో పాటు ఇంటర్నెట్ చూపు మొత్తం ఈ సినిమావైపే వెళ్లిపోయింది. పైగా ఇందులో నాని పాత్రను లం… కొడుకు అంటూ చూపించడం పెద్ద చర్చకు దారి తీసింది. క్లాసిక్ సినిమాలు చేసే నాని ఇలాంటి సినిమా చేయడమే అందరికీ ఆశ్చర్యంగా మారింది. పైగా ఇందులో ఆయన రెండు జడలు, ముక్కు పుల్ల, చెవి కమ్మలు పెట్టుకుని మెడలో ఏవో దండలు వేసుకుని కనిపించాడు. చేతి మీద లం…. కొడుకు అనే టాటూ కూడా ఉంది. దీంతో అసలు ఈ కథ ఏంటి.. ఇందులో నాని పాత్ర ఏంటి అని ఒకటే ఆరా తీస్తున్నారు. రకరకాల కథనాలు అల్లేస్తున్నారు. కొందరేమో బిర్యానీ కథ అని.. ఇంకొందరేమో ఇది కాకుల కథ ఏమో అంటూ చెప్పేస్తున్నారు. అయితే ఇందులో అసలు కథ వేరే ఉన్నట్టు తెలుస్తోంది. ఇందులో నాని ఒక ట్రైబల్ జాతి నాయకుడిగా నటిస్తున్నట్టు సమాచారం. ఈ కథ 1980వ ప్రాంతంలో జరుగుతుదంట. అప్పట్లో సికింద్రాబాద్ ప్రాంతంలో వెనకబడ్డ ఒక ట్రైబల్ జాతి కథనే ది ప్యారడైజ్ గా తీసుకున్నట్టు తెలుస్తోంది.

మమ్ముట్టి కోసం స్టార్ హీరో ప్రత్యేక పూజలు
మళయాల మెగాస్టార్ మమ్ముట్టి గురించి ఎప్పుడూ ఏదో ఒక న్యూస్ వైరల్ అవుతూనే ఉంటుంది. ఆయన ఆరోగ్యం గురించి ఈ నడుమ ఎక్కువగా వార్తలు వస్తున్నాయి. ఈ క్రమంలోనే మమ్ముట్టి క్లోజ్ ఫ్రెండ్ అయిన మోహన్ లాల్ చేసిన పని అందరినీ ఆకట్టుకుంటోంది. మమ్ముట్టి, మోహన్ లాల్ నడుమ ఎప్పటి నుంచో మంచి అనుబంధం ఉంది. వీరిద్దరూ చాలా సినిమాల్లో కలిసి నటించారు. ప్రస్తుతం మోహన్ లాల్ ఎల్2.. ఎంపురాన్ సినిమాలో నటిస్తున్నాడు. ఈ మూవీ మార్చి 27న రిలీజ్ కాబోతోంది. ఈ సినిమా కోసం ప్రమోషన్లు స్టార్ట్ చేశారు. ఇందులో భాగంగా శబరిమల ఆలయాన్ని మోహన్ లాల్ తన కుటుంబ సభ్యులతో కలిసి దర్శించుకున్నారు. అక్కడ మమ్ముట్టి కోసం ప్రత్యేక పూజలు చేశారు. ఈ న్యూస్ ఇప్పుడు వైరల్ అవుతోంది. దీంతో ఇరువురి ఫ్యాన్స్ తెగ ఖుషీ అవుతున్నారు. ఇక మమ్ముట్టి నటించిన ఎల్ 2 ఇప్పటికే అంచనాలు పెంచేసింది. ఈ మూవీని పృథ్వీరాజ్ సుకుమారన్ డైరెక్ట్ చేశారు. ఇందులో చాలా మంది కీలక పాత్రలు చేశారు. పూర్తి యాక్షన్ సినిమాగా రాబోతోంది. మొదటి పార్టు హిట్ అయింది కాబట్టి ఈ సీక్వెల్ పై మంచి అంచనాలు ఉన్నాయి.

‘కోర్టు’ ప్రతి ఒక్కరూ చూడాల్సిన సినిమా
కోర్టు సినిమాలోని తన మంగపతి క్యారెక్టర్ ప్రేక్షకులకు ఎప్పటికీ గుర్తుండిపోతుందన్నాడు శివాజీ. కోర్టు సినిమా విజయోత్సవంలో భాగంగా సినిమా యూనిట్ విజయవాడలోని అమ్మవారిని దర్శించుకున్నారు. ఇందులో శివాజీ, ప్రియదర్శి, దర్శకుడు రామ్ జగదీష్, హీరో రోషన్, హీరోయిన్ శ్రీదేవి ఉన్నారు. అనంతరం వీరు విజయవాడలోని ప్రముఖ హోటల్ లో సందడి చేశారు. ఈ సందర్భంగా నటుడు శివాజీ మాట్లాడుతూ మూవీని తన కెరీర్ లో మంగపతి పాత్ర ఎప్పటికీ గుర్తుండిపోతుందన్నారు. 13 ఏళ్ల తర్వాత రీ ఎంట్రీ ఇచ్చిన తనకు మంగపతి పాత్ర దక్కడం సంతోషంగా ఉందన్నాడు. ఇక నుంచి ఇలాంటి వైవిధ్యభరితమైన పాత్రలే ఎక్కువగా చేయాలనుకుంటున్నట్టు తెలిపాడు. ఫోక్సో చట్టం గురించి, ప్రేమ, పెద్దల బాధ్యతలను తెలియజేసే సినిమా ఇది అన్నారు. నాని ఈ సినిమాను ప్రొడ్యూస్ చేయడం తనకు సంతోషంగా ఉందన్నాడు. ప్రియదర్శి మాట్లాడుతూ మొదటిసారి లాయర్ పాత్రలో నటించానని.. చాలా సంతోషంగా ఉందన్నాడు. సినిమా పెద్ద హిట్ కావడం సంతోషంగా ఉందని చెప్పాడు. డైరెక్టర్ రామ్ జగదీశ్ మాట్లాడుతూ.. ఈ సినిమాకు ముందు ఎంతో రీసెర్చ్ చేశానని.. తనను నమ్మి నాని సినిమా ప్రొడ్యూస్ చేయడం ఆనందంగా ఉందన్నాడు. ఇలాంటి సినిమాలు ప్రజల్లో అవగాహన పెంచుతాయన్నాడు.