చంద్రబాబుపై జగన్ ఫైర్.. మీకు అధికారం ఇచ్చింది పేదలపై కత్తి కట్టడానికా..?
ఏపీ సర్కార్, సీఎం చంద్రబాబుపై మరోసారి ఫైర్ అయ్యారు వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్.. ఇప్పటికే పలు అంశాలపై సోషల్ మీడియా వేదికగా ప్రభుత్వ విధానాలు తప్పుబడుతూ వస్తున్న జగన్.. ఈ సారి పేదలకు ఇళ్ల స్థలాల అంశాన్ని ప్రస్థావించారు.. “చంద్రబాబు గారూ.. మీకు అధికారం ఇచ్చింది పేదలపై కత్తికట్టడానికా? వారి సొంతింటి కలలను నాశనం చేయడానికా? మీది పేదలకు ఏదైనా ఇచ్చే ప్రభుత్వం కాదని, వారికి అందుతున్నవాటిని తీసివేసే రద్దుల ప్రభుత్వం అని, మీరు పేదల వ్యతిరేకి అని మరోసారి నిరూపణ అయ్యింది. పేద అక్కచెల్లెమ్మలకు రిజిస్ట్రేషన్ చేసిమరీ ఇచ్చిన ఇళ్లస్థలాలను రద్దు చేసే అధికారం మీకు ఎవరు ఇచ్చారు? వాళ్లు ఇళ్లు కట్టుకునేలా అండగా నిలబడాల్సింది పోయి, మా హయాంలో ఇచ్చిన స్థలాలను లాక్కుంటారా? అక్కచెల్లెమ్మల ఉసురు పోసుకుంటారా? తక్షణం ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలి..” అని డిమాండ్ చేశారు..
పెద్దారెడ్డికి సుప్రీంకోర్టు ఇచ్చిన ఆర్డర్‌లో ఏముందో ఒకసారి చూసుకోండి.. జేసీ సూచన
వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ, అనంతపురం జిల్లా అధ్యక్షుడు అనంత వెంకట్రామిరెడ్డిపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు టీడీపీ సీనియర్ నేత, తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి.. అసలు, మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డికి ఇచ్చిన సుప్రీంకోర్టు ఆర్డర్ లో ఏముందో ఒకసారి చూడాలని హితువు పలికారు.. అయితే, తాడిపత్రికి కేతిరెడ్డి పెద్దారెడ్డి వచ్చిన సమయంలో తాము ఏం అనలేదనే విషయాన్ని గుర్తుచేశారు జేసీ.. పోలీసులకు అయ్యే భద్రతకు సంబంధించిన ఖర్చు తామే భరిస్తామని పెద్దారెడ్డి తరపు న్యాయవాదులు కోర్టుకు చెప్పారు కదా…? అని ప్రశ్నించారు.. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు పోలీసులకు అయ్యే ఖర్చు పెద్దారెడ్డి చెల్లించాడా..? లేదా..? అని చెప్పాలని అనంత వెంకట్రామిరెడ్డిని కోరారు జేసీ ప్రభాకర్ రెడ్డి.. చదువురాని వాళ్లు మాట్లాడితే ఒక అర్థం ఉంది.. కానీ, న్యాయవాది, రాజకీయ నాయకుడైన అనంత వెంకట్రామిరెడ్డి అన్ని తెలిసి మాట్లాడితే ఎలా..? అని నిలదీశారు.. మాకు చట్టం పైన గౌరవం ఉంది.. చట్టం ఏదో చెప్పిందో అదే పాటించాలని మేము కోరుతున్నాం అని వ్యాఖ్యానించారు తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత, తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి..
తొలిరోజే హాట్‌హాట్‌గా శాసన మండలి..
ఏపీ శాసన సభ శాసన మండలి సమావేశాలు ఇవాళ్టి నుంచి ప్రారంభమయ్యాయి. శాసన సభ సమావేశాలను వైసీపీ ఈ సారి కూడా బాయ్ కాట్ చేసింది. అయితే శాసన మండలి లో మాత్రం వైసీపీ సభ్యులు ప్రజా సమస్యల పై చర్చకు ప్రభుత్వం పై ఒత్తిడి తీసుకు వచ్చే ప్రయత్నం చేశారు.. మండలిలో మొదట రైతాంగ సమస్యలు, యూరియా కొరతపై వైసీపీ సభ్యులు వాయిదా తీర్మానం ఇచ్చారు.. ఈ వాయిదా తీర్మానాన్ని మండలి చైర్మన్ తిరస్కరించారు. దీంతో చైర్మన్ పోడియం దగ్గర వైసీపీ సభ్యులు ఆందోళనకు దిగారు. ఫ్లకార్డులు ప్రదర్శిస్తూ నిరసన తెలియజేశారు. వైసీపీ ఆందోళనలతో శాసన మండలి 10 నిమిషాల పాటు వాయిదా పడింది.. వైసీపీ సభ్యుల ఆందోళనపై మండలిలో వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు ఘాటుగా స్పందించారు. యూరియా కొరత, వ్యవసాయ ఉత్పత్తులు, రైతుల సమస్యలపై చర్చించేందుకు ప్రభుత్వం సిద్దంగా ఉందన్నారు.. వైసీపీ సభ్యులకే కాదు.. రాష్ట్ర ప్రజలకు వివరాలు తెలియజేసే బాధ్యత తమ ప్రభుత్వంపై ఉందన్నారు.. బీఎసీ సమావేశం అనంతరం సభలో చర్చ చేపట్టేందుకు సిద్దమని మంత్రి అచ్చెన్న తెలిపారు.
లిక్కర్ స్కాం కేసులో కీలక పరిణామం.. సిట్ కస్టడీకి మిథున్‌రెడ్డి
ఆంధ్రప్రదేశ్‌లో సంచలనం సృష్టిస్తోన్న ఏపీ లిక్కర్ స్కాం కేసులో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది.. ఈ కేసులో వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, ఎంపీ మిథున్ రెడ్డిని పోలీస్ కస్టడీ కి ఇస్తూ విజయవాడలోని ఏసీబీ ప్రత్యేక న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసింది.. లిక్కర్ కేసులో ఎంపీ పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డిని 5 రోజులు కస్టడీకి ఇవ్వాలని కోరుతూ ఏసీబీ కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది సిట్.. అయితే, సిట్ పిటిషన్‌పై విచారణ చేపట్టిన ఏసీబీ కోర్టు.. మిథున్‌రెడ్డిని రెండు రోజుల పాటు కస్టడీకి ఇస్తూ ఆదేశాలు జారీ చేసింది.. మిథున్ రెడ్డిని రెండు రోజుల పాటు అంటే ఈ నెల 19, 20 తేదీల్లో రెండు రోజులు కస్టడీకి ఇస్తూ ఆదేశాలు ఇచ్చింది.. ఇక, ఏసీబీ కోర్టు ఆదేశాల మేరకు రేపు అనగా సెప్టెంబర్ 19న ఉదయం 8 గంటలకు మిథున్‌రెడ్డిని కస్టడీలోకి తీసుకోనున్నారు సిట్ అధికారులు.. రెండు రోజుల పాటు ఉదయం 8 నుంచి సాయంత్రం 6 గంటల వరకు కస్టడీకి ఇస్తూ ఆదేశాలు ఇచ్చింది ఏసీబీ కోర్టు.. గతంలో ఎంపీ మిథున్‌రెడ్డిని ప్రశ్నించిన తర్వాతే సిట్ అరెస్ట్ చేసింది.. ప్రస్తుతం ఆయన రాజమండ్రి సెంట్రల్ జైలులో రిమాండ్‌లో ఉండగా.. రేపు, ఎల్లుండి రెండు రోజుల పాటు మిథున్‌రెడ్డి నుంచి లిక్కర్ స్కాం కేసులో మరిన్ని వివరాలు రాబట్టేందుకు సిద్ధమైంది సిట్ టీమ్..
బీఆర్ఎస్ అంటే అప్పులు.. కాంగ్రెస్ అంటే అభివృద్ధి
ఖమ్మం జిల్లా, వైరా మున్సిపాలిటీలో పర్యటించిన మంత్రి సీతక్క, ప్రజల సంక్షేమం, అభివృద్ధికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వంపై బీఆర్ఎస్ పార్టీ విమర్శలు చేసి బదనాం చేస్తోందని ఆరోపించారు. యూరియా సరఫరా చేయాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వానిదని, రైతులను తప్పుదోవ పట్టించేందుకు కాంగ్రెస్ ప్రభుత్వంపై బీఆర్ఎస్ పార్టీ నిందలు వేస్తోందని ఆమె అన్నారు. గత ప్రభుత్వం రాష్ట్రాన్ని అప్పులమయం చేసిందని విమర్శించిన మంత్రి సీతక్క, తాము భారీ వర్షాలకు దెబ్బతిన్న రోడ్లకు త్వరలోనే మరమ్మతులు చేయిస్తామని హామీ ఇచ్చారు. అలాగే, అర్హులైన పేదలందరికీ ఇందిరమ్మ ఇళ్లను, మహిళలకు వివిధ సంక్షేమ పథకాలను అందిస్తున్నామని తెలిపారు. స్థానిక ఎన్నికల్లో 42 శాతం బీసీ రిజర్వేషన్లు అమలు చేయడానికి కేంద్ర ప్రభుత్వం చొరవ చూపాలని కోరిన ఆమె, స్థానిక ఎన్నికల నిర్వహణకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని చర్యలు చేపడుతోందని తెలిపారు.
జ్యూస్ తాగుతూ కుప్పకూలిన యువకుడు.. కారణం ఇదే!
దురదృష్టవశాత్తు గుండెపోటు మరణాలు రోజురోజుకు పెరుగుతున్నాయి. ఏ వయసు వారికైనా గుండెపోటు వచ్చే అవకాశం ఉండటం ఆందోళన కలిగిస్తోంది. రంగారెడ్డి జిల్లాలోని ఇబ్రహీంపట్నంలో 30 ఏళ్ల యువకుడు గుండెపోటుతో అకస్మాత్తుగా మరణించిన విషాద ఘటన చోటుచేసుకుంది. ఖమ్మం జిల్లాకు చెందిన ఏకలవ్య (30) అనే యువకుడు ఇబ్రహీంపట్నంలో తన స్నేహితుడితో కలిసి నివసిస్తున్నాడు. బుధవారం రాత్రి అతను జ్యూస్ తాగడానికి ఒక జ్యూస్ సెంటర్ దగ్గరికి వచ్చాడు. జ్యూస్ తాగుతుండగా ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. అది గమనించిన స్థానికులు అతడికి సీపీఆర్ (CPR) చేసి పోలీసులకు సమాచారం ఇచ్చారు. అంబులెన్స్ అందుబాటులో లేకపోవడంతో, పోలీసులు తమ వాహనంలోనే అతడిని ఆసుపత్రికి తరలించారు. కానీ అప్పటికే ఏకలవ్య మరణించినట్లు వైద్యులు నిర్ధారించారు. ఈ ఘటన మొత్తం స్థానిక సీసీ కెమెరాల్లో రికార్డయింది. 30 ఏళ్ల యువకుడు గుండెపోటుతో చనిపోవడం స్థానికులను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. అతని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఇబ్రహీంపట్నం మార్చురీకి తరలించారు.
‘‘అన్ని మతాలను గౌరవిస్తాను’’.. ‘‘విష్ణువు’’ వ్యాఖ్యలపై సీజేఐ గవాయ్..
సోషల్ మీడియాలో భారత ప్రధాన న్యాయమూర్తి(సీజేఐ) బీఆర్ గవాయ్ తీవ్ర వ్యతిరేకతను ఎదుర్కొంటున్నారు. ఒక కేసులో ‘‘విష్ణువు’’ను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలపై హిందువులు మండిపడుతున్నారు. ఖజురహోలో పురాతన విష్ణువు విగ్రహాన్ని పునరుద్ధరించాలని దాఖలైన పిల్‌ను ఆయన తోసిపుచ్చారు. ఛతర్‌పూర్ జిల్లాలోని జవారీ ఆలయంలో దెబ్బతిన్న విగ్రహాన్ని భర్తీ చేసి ప్రతిష్టించాలని కోరుతూ రాకేష్ దలాల్ అనే వ్యక్తి దాఖలు చేసిన పిటిషన్‌ను ప్రధాన న్యాయమూర్తి గవాయ్ నేతృత్వంలోని ధర్మాసనం తిరస్కరించింది. దీనిని విచారించిన సుప్రీం ధర్మాసనం..‘‘ఇది పూర్తిగా ప్రచార ప్రయోజన వ్యాజ్యం. వెళ్లి దేవుడినే ఏదైనా చేసుకోమని అడగండి. మీరు విష్ణువు భక్తులని మీరు అనుకుంటే, మీరు ప్రార్థన చేసి, కొంత ధ్యానం చేయండి’’ అని సీజేఐ అన్నారు. ఈ ఆలయం ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా అధికార పరిధి కిందకు వస్తుందని పేర్కొంటూ పిటిషన్‌ను తోసిపుచ్చింది.
భారత్-పాక్ యుద్ధం జరిగితే, సౌదీ భారత్‌పై దాడి చేస్తుందా..? కొత్త ఒప్పందం ఏం చెబుతోంది.?
భారత్-పాకిస్తాన్ మధ్య యుద్ధం జరుగుతుంది అని అనుకోండి, పాకిస్తాన్ దారుణంగా దెబ్బతిన్నది ఊహించుకోండి, ఆ సమయంలో భారత్‌పై యుద్ధానికి సౌదీ అరేబియా వస్తుందా..? ఇప్పుడు ఇదే పెద్ద ప్రశ్నగా ఉంది. తాజాగా, పాకిస్తాన్-సౌదీ అరేబియా మధ్య ఒక రక్షణ ఒప్పందం కుదిరింది. దీని ప్రకారం, రెండు దేశాల్లో ఏ ఒక్క దేశంపై దాడి జరిగినా, అది రెండో దేశంపై దాడిగా పరిగణించబడుతుందనేది ఒప్పందం సారాంశం. అయితే, నిజంగా భారత్‌కు వ్యతిరేకంగా సౌదీ రాయల్ ఆర్మీ భారత్‌పై యుద్ధానికి దిగుతుందా.? అంటే సందేహమే. కానీ, పాకిస్తాన్ మాత్రం మాకు అండగా సౌదీ ఉందని తెగ ఫీల్ అవుతోంది. నిజానికి ఈ ఒప్పందం భారత్ కన్నా, ఇజ్రాయిల్‌ను ఎక్కువగా టార్గెట్ చేస్తుంది. ఇటీవల, హమాస్ అగ్ర నాయకత్వమే లక్ష్యంగా ఖతార్ రాజధాని దోహాపై ఇజ్రాయిల్ ఎయిర్ స్ట్రైక్స్ చేసింది. తమకు వ్యతిరేకంగా, తమ ఉనికిని ప్రశ్నించే వారి పట్ల తాము దాడులు చేస్తామని ఇజ్రాయిల్ స్పష్టం చేసింది. మధ్యప్రాచ్యంలో అమెరికాకు అత్యంత మిత్రదేశమైన ఖతార్‌ను కూడా ఇజ్రాయిల్ వదలలేదు. తాజాగా, పాక్-సౌదీల ‘వ్యూహాత్మక పరస్పర రక్షణ ఒప్పందం’ భారత్ కన్నా, ఇజ్రాయిల్‌నే లక్ష్యంగా చేసుకుంది.
ఇక ప్రొఫిషనల్ కెమెరాలు అవసరం లేదేమో.. డ్యూయల్ 200MP కెమెరాలతో రాబోతున్న Honor Magic V8 series?
హానర్ కంపెనీ నుండి త్వరలో విడుదల చేయబోయే స్మార్ట్‌ఫోన్‌లలో కెమెరా విషయంలో ఒక పెద్ద అప్‌గ్రేడ్ ఉండబోతోందని సమాచారం. ఒక టిప్‌స్టర్ తెలిపిన వివరాల ప్రకారం.. షెన్‌జెన్ ఆధారిత తయారీదారు (OEM) తన రాబోయే హానర్ మ్యాజిక్ V8 సిరీస్, హానర్ మ్యాజిక్ V6 ఫోల్డబుల్ ఫోన్‌లలో 200 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరాను అమర్చనుంది. హానర్ మ్యాజిక్ V8 శ్రేణిలోని ఒక హ్యాండ్‌సెట్, ప్రైమరీ కెమెరాతో పాటు 200 మెగాపిక్సెల్ పెరిస్కోప్ టెలిఫోటో లెన్స్‌ను కూడా కలిగి ఉండవచ్చని తెలుస్తోంది. హానర్ మ్యాజిక్ 8 సిరీస్ 2025 నాలుగో త్రైమాసికంలో విడుదల కానుందని అంచనా. ఈ విషయమై హానర్ గ్రూప్ చీఫ్ మార్కెటింగ్ ఆఫీసర్ గువో రుయ్ మాట్లాడుతూ.. త్వరలో రాబోయే HonorMagic8 AI నేటివ్ స్మార్ట్‌ఫోన్ Q4లో అత్యంత చెప్పుకోతగ్గ ఫ్లాగ్‌షిప్ మొబైల్ అవుతుందని ఆయన అన్నారు. టిప్‌స్టర్ డిజిటల్ చాట్ స్టేషన్ వీబో పోస్ట్ ప్రకారం.. హానర్ తన రాబోయే హ్యాండ్‌సెట్‌ల కోసం 200MP కెమెరాలను ఉపయోగించనుంది. దీని కోసం పెద్ద సంఖ్యలో సెన్సార్‌లను వెతికే క్రమంలో ఉంది. హానర్ ఏ సెన్సార్‌ను ఉపయోగించబోతోందనే వివరాలు ఇంకా తెలియలేదు. కానీ, హానర్ మ్యాజిక్ V8 సిరీస్, మ్యాజిక్ V6 ఫోల్డబుల్ ఫోన్‌లు ఈ అప్‌గ్రేడ్‌ను పొందే అవకాశముందని లీకర్ పేర్కొన్నారు.
ఆ సంచలన డైరెక్టర్ తో మహేశ్ బాబు మూవీ..?
సూపర్ స్టార్ మహేశ్ బాబు ఇప్పుడు రాజమౌళితో భారీ పాన్ వరల్డ్ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ ప్రపంచలోని ప్రముఖ దేశాల్లో జరుగుతోంది. ఈ మూవీ తర్వాత మహేశ్ బాబు ఎవరితో చేస్తారనే ప్రచారం అప్పుడే మొదలైంది. ఎలాగూ ఈ సినిమా తర్వాత మహేశ్ బాబు రేంజ్ ఎక్కడికో వెళ్లిపోతుంది కదా. అందుకే ముందే మహేశ్ బాబును బుక్ చేసుకుంటున్నాయి కొన్ని నిర్మాణ సంస్థలు. ఇప్పటికే మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ మహేశ్ బాబుకు అడ్వాన్స్ ఇవ్వడానికి చర్చలు జరిపింది. కానీ అది ఇంకా ఫైనల్ కాలేదు. తాజాగా ఏషియన్ సునీల్ మహేశ్ బాబు దగ్గరకు ఓ మాసివ్ లైనప్ వెళ్లినట్టు తెలుస్తోంది. సెన్సేషనల్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగతో ఓ సినిమా చేసేందుకు మహేశ్ బాబు ముందు ప్రపోజల్ పెట్టాడంట సునీల్. అర్జున్ రెడ్డి సినిమా టైమ్ లోనే సందీప్ కు ఏషియన్ సునీల్ అడ్వాన్స్ ఇచ్చారు. ఇప్పుడు మహేశ్ బాబు, సందీప్ రెడ్డి కాంబోలో ఓ భారీ మాసివ్ సినిమాను తీయాలని ప్లాన్ చేస్తున్నారంట ఏషియన్ సునీల్. కానీ ఆ ప్రాజెక్ట్ ఇంకా ఫైనల్ కాలేదు. త్వరలోనే మహేశ్ బాబు నుంచి అప్డేట్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. ప్రస్తుతానికి మహేశ్ బాబు వద్ద మైత్రీ మూవీ మేకర్స్, ఏషియన్ సంస్థలు తమ ప్రపోజల్స్ ఉంచాయి. కానీ మహేశ్ బాబు అప్పుడే నిర్ణయం తీసుకోవద్దని ఆలోచిస్తున్నాడంట. రాజమౌళి సినిమా రిలీజ్ అయ్యాక.. అప్పటి తన మార్కెట్ రేంజ్, ఫ్యాన్ బేస్ ను బట్టి ఓ సాలీడ్ ప్రాజెక్ట్ లైన్ లో పెట్టాలని అనుకుంటున్నాడంట. కానీ సందీప్ సినిమాను ఓకే చేస్తే మహేశ్ ఫ్యాన్స్ రచ్చ మామూలుగా ఉండదు.
ఇండస్ట్రీల రికార్డ్‌లు తిరగరాసే కాంబో ఫిక్స్.. యానిమల్‌కు మించింది రాబోతున్నట్లు హింట్!
టాలీవుడు సూపర్ స్టార్ మహేష్ బాబు లైన్ అప్ మామూలుగా లేదని టాక్. ప్రస్తుతం ఆయన దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వంలో SSMB29 అనే సినిమాతో బిజీగా ఉన్నాడు. ఈ సినిమా బడ్జెట్ సుమారుగా ₹1,000 కోట్లు అని సమాచారం. ఇప్పటికే ఈ సినిమా కొన్ని షెడ్యూల్స్ పూర్తి చేసుకున్నట్లు వినికిడి. ప్రపంచ వ్యాప్తంగా ఎంతో మంది సినీ ప్రియులు ఆసక్తిగా ఎదురు చూస్తున్న ఈ సినిమాలో మహేష్ సరసన ప్రియాంక చోప్రా నటిస్తున్నారు. ఈ సినిమా 2027లో విడుదల కానుందని టాక్ నడుస్తుంది. ఆర్ఆర్ఆర్ వంటి సూపర్ హిట్ సినిమా తర్వాత రాజమౌళి దర్శకత్వంలో రానున్న ఈ చిత్రంపై భారీ స్థాయిలో అంచనాలు నెలకొన్నాయి. SSMB29 లాంటి భారీ చిత్రం తర్వాత మహేష్ బాబు నెక్ట్స్ ఎవరితో సినిమా చేయనున్నారు అనేది ఇప్పుడు సినీ వర్గాల్లో ఆసక్తిగా మారింది. మహేష్ బాబు 2026 లో కూడా రాజమౌళి సినిమాతో బిజీగా ఉండనున్నారు. అయితే ఇప్పటి నుంచే ఈ హీరో నెక్ట్స్ ప్రాజెక్ట్‌పై జోరుగా చర్చ నడుస్తుంది. బాబుతో సినిమా చేయడానికి ఇప్పటికే చాలా మంది నిర్మాతలు వరుసలో ఉన్నట్లు సమాచారం. మహేష్ బాబును ఇప్పటికే మైత్రి మూవీ మేకర్స్ వాళ్లు సంప్రదించినట్లు టాలీవుడ్ సర్కిల్‌లో టాక్ నడుస్తుంది. అలాగే నిర్మాత ఏసియన్ సునీల్ కూడా మహేష్ బాబును కలిసినట్లు వార్తలు వస్తున్నాయి. ఏసియన్ సునీల్ నిర్మాణంలో రానున్న భారీ చిత్రానికి యానిమల్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా దర్శకత్వం వహించబోతున్నట్లు టాక్.
