NTV Telugu Site icon

Top Headlines @ 5 PM: టాప్‌ న్యూస్‌

Top Headlines @ 5 Pm New

Top Headlines @ 5 Pm New

3 రోజులు వర్షాలే వర్షాలు.. కోస్తా జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు..
నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కాస్తా తీవ్ర అల్పపీడనంగా మారింది.. ఇది, ఆంధ్రప్రదేశ్‌కు ముప్పుగా మారుతోంది. తమిళనాడు తీరానికి చేరువగా వచ్చి దిశను మార్చుకుంటుందని.. ఆ తర్వాత ఏపీ తీరం వెంబడి బలమైన ఈదురు గాలులతో పయనిస్తుందని భారత వాతావరణ విభాగం హెచ్చరికలు జారీ చేసింది. ఈ ప్రభావంతో వచ్చే మూడు రోజులు ఆంధ్రప్రదేశ్‌లో విస్తారంగా వర్షాలు కురవనున్నాయి.. ముఖ్యంగా ఉత్తర కోస్తా, దక్షిణ కోస్తా జిల్లాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలకు ఛాన్స్ వుంది. ఇక, గడచిన 24 గంటల్లో విజయనగరం జిల్లా డెంకాడలో 2 సెంటీమీటర్ల వర్ష పాతం నమోదైంది. తీవ్ర అల్పపీడనంపై విశాఖ తుఫాన్ హెచ్చరికల కేంద్రం డైరెక్టర్ శ్రీనివాస్‌ పూర్తి వివరాలను వెల్లడించారు.. ఇక, పంటలు కోసే సమయం కావడంతో.. రైతులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు..

రాజధాని నిర్మాణంపై కీలక ప్రకటన.. మూడేళ్లలో పూర్తి..!
ఆంధ్రప్రదేశ్‌లో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత.. గత ప్రభుత్వ హయాంలో ఎక్కడికక్కడ నిలిచిపోయిన ఏపీ రాజధాని అమరావతి పునఃనిర్మాణంపై వేగంగా అడుగులు వేస్తోంది.. అయితే, ఏపీ రాజధాని అమరావతి నిర్మాణం రానున్న మూడేళ్లలో పూర్తి చేస్తామంటూ కీలక ప్రకటన చేశారు మున్సిపల్ శాఖ మంత్రి పొంగూరు నారాయణ.. ఇప్పటికే అనుమతి లభించిన 45 వేల కోట్ల రూపాయల నిర్మాణాలకి రేపు కేబినెట్‌ సమావేశంలో ఆమోదం తెలిపి.. టెండర్లు పిలవబోతున్నామని తెలిపారు. అమరావతి మొత్తం ప్రాజెక్టు వ్యయం 62 వేల కోట్ల రూపాయలు అని వెల్లడించారు. రాజమండ్రిలో పర్యటనలో మున్సిపల్ అధికారులతో సమీక్ష నిర్వహించిన మంత్రి.. వచ్చే ఏడాది జులైలో రాజమహేంద్రవరం నగరపాలక సంస్థ ఎన్నికలు నిర్వహిస్తామని తెలిపారు. గత ఆరు నెలలుగా రాష్ట్రంలోని మున్సిపాలిటీల్లో పరిపాలన గాడిలో పెట్టామని అన్నారు. రాజధాని అమరావతిలో రానున్న మూడేళ్లలో ఐదు ఐకానిక్ టవర్లు..‌ 250 మీటర్ల ఎత్తులో అసెంబ్లీ భవనం.. హైకోర్టు సహా.. అధికారుల నివాసాలు.. ట్రంక్ రోడ్లు పూర్తి చేస్తామని వెల్లడించారు మంత్రి పొంగూరు నారాయణ..

కూటమి ప్రభుత్వం సమర్థ పాలన వల్లే సాగునీటి సంఘాల ఎన్నికలు ఏకగ్రీవం..
ఆంధ్రప్రదేశ్‌లో ఇటీవలే సాగునీటి సంఘాల ఎన్నికలు జరిగాయి.. అయితే, రాష్ట్రంలో ప్రభుత్వ సమర్థ పాలన వల్లే సాగునీటి సంఘాల ఎన్నికలన్నీ ఏకగ్రీమయ్యాయని రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి అన్నారు. నెల్లూరులో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. సాగునీటి సంఘాలు ఎన్నికలపై ప్రతిపక్షాలు చేస్తున్న ఆరోపణలు అర్థరహితమన్నారు. వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ప్రభుత్వ హయాంలో సాగునీటి సంఘాలకు ఎన్నికలు నిర్వహించలేదని.. అప్పట్లో ఆ ప్రభుత్వానికి ధైర్యం లేదన్నారు. ఇక, సోమశిల ప్రాజెక్టు దెబ్బ తినడానికి వైసీపీ ప్రభుత్వమే కారణమని ఆనం విమర్శించారు.. అన్నమయ్య ప్రాజెక్టు నిర్వహణకు 7 కోట్ల రూపాయలు నిధులు అడిగితే ప్రభుత్వం ఇవ్వలేదని.. అందువల్లే అది వరదల్లో.. కొట్టుకుపోయిందంటూ ఆరోపణలు గుప్పించారు.. సోమశిల హై లెవెల్ కెనాల్ పనులను కూడా చేపట్టలేదని.. కేవలం భూ పరిహారంలో మాత్రమే రైతులను మభ్యపెట్టారన్నారు మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి.. మరోవైపు.. సాగునీటి సంఘాల ఎన్నికల సందర్భంగా పలు ప్రాంతాల్లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్ని విషయం విదితమే కాగా.. అసలు, కూటమి ప్రభుత్వం సాగునీటి సంఘాల ఎన్నికల్లో ఏకపక్షంగా వ్యవహారిస్తుందంటూ.. వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ సాగునీటి సంఘాల ఎన్నికలను బహిష్కరిస్తున్నట్టు ప్రకటించిన విషయం విదితమే.. అయితే, ఆ ప్రకటన చేసినా.. కొన్ని ప్రాంతాల్లో వైసీపీ అభ్యర్థులు.. ఈ ఎన్నికల్లో పాల్గొన్నారు.

ఎమ్మెల్యే సీరియస్‌ వార్నింగ్‌.. నేను చెప్పినవే జరగాలి.. తీరు మారకపోతే తరిమి తరిమి కొడతా..!
ప్రభుత్వ విప్‌, ఎమ్మెల్యే డాక్టర్‌ ఎంవీ థామస్‌ చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి.. ఎస్ఆర్ పురం మండలం తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో నిర్వహించిన నీటి సంఘ చైర్మన్ ల సన్మాన కార్యక్రమంలో పాల్గొన్న డాక్టర్ థామస్.. ఈ సందర్భంగా.. లోకల్‌ లీడర్లకు కొందరికి సీరియస్‌ వార్నింగ్‌ ఇచ్చారు.. గంగాధర నెల్లూరు నియోజకవర్గంలో నేను ఎమ్మెల్యే.. నేను చెప్పినవే జరగాలని స్పష్టం చేశారు.. ఇక్కడ, అక్కడ చిచ్చుపెట్టే నాయకులు జాగ్రత్త.. అలాంటి నాయకులు మళ్లీ తీరు మారలేదంటే తరిమి తరిమి కొడతాను అంటూ హెచ్చరించారు.. తనకు చిచ్చుపెట్టే నాయకులు తెలుసు.. వాళ్లు తీరు మార్చుకోవాలని సూచించారు.. ఇక, గంగాధర్ నెల్లూరు నియోజకవర్గంలో మండల అధ్యక్షులను సంప్రదించే అన్ని పనులు అప్పగిస్తున్నాను అన్నారు థామస్‌.. ఇక, నేను నియోజకవర్గంలో నా సొంత డబ్బులు ఖర్చు పెట్టి ఎమ్మెల్యేగా గెలిచా.. ఎవరి దగ్గర టిష్యూ పేపర్ కూడా తీసుకోలేదంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.. ఇది ఎస్సీ నియోజకవర్గం.. కింద స్థాయిలో ఉన్న బడుగు, బలహీన వర్గాల అభివృద్ధి కోసం నేను పాటుపడుతున్నాను అన్నారు.. గంగాధర నెల్లూరు నియోజకవర్గంలో ఇప్పటికే 20 కోట్ల రూపాయలతో సిమెంట్ రోడ్లకు నిధులు తీసుకువచ్చా.. గతంలో మీరు ఎలా ఉన్నారో? నాకు తెలియదు.. ఇప్పుడు మాత్రం నేను చెప్పిందే వినాలని స్పష్టం చేశారు. నేను ఇంటర్నేషనల్ తిరిగి వచ్చిన వాడిని.. దాదాపు 100 దేశాలు తిరిగి వచ్చాను.. నా దగ్గర మీ ఆటలో సాగవు అంటూ హెచ్చరించారు.. పార్టీ కోసం కష్టపడ్డ కార్యకర్తలకు నేను అండగా ఉంటా.. కానీ, చిచ్చుపెట్టేవాళ్లు జాగ్రత్త నేర్చుకోండి.. అంటూ ఘాటుగా హెచ్చరించారు ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే డాక్టర్ థామస్..

తెలంగాణ టెట్ షెడ్యూల్ విడుదల
తెలంగాణ టెట్(ఉపాధ్యాయ అర్హత పరీక్ష) షెడ్యూల్‌ను పాఠశాల విద్యా శాఖ డైరెక్టర్ విడుదల చేశారు. సబ్జెక్టుల వారీగా షెడ్యూల్‌ను రిలీజ్‌ చేశారు. జనవరి 2 నుండి జనవరి 20వ తేదీ వరకు టెట్ పరీక్షలను నిర్వహించనున్నారు. 10 రోజుల పాటు పరీక్షలు జరగనున్నాయి. ఆన్‌లైన్‌లో రోజూ రెండు సెషన్స్‌లో పరీక్ష జరగనుంది. ఉదయం 9 నుంచి 11.30 గంటల వరకు ఒక సెషన్‌.. మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 4.30 గంటల వరకు మరో సెషన్‌లో పరీక్షలు జరగనున్నాయి. ఈ సారి టెట్‌ పేపర్‌-1, పేపర్‌-2లకు కలిపి సుమారు 2,75,773 మంది దరఖాస్తులు చేసుకున్నారు.

దమ్ముంటే అసెంబ్లీలో చర్చ పెట్టండి.. సీఎం రేవంత్‌కు కేటీఆర్ లేఖ
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ లేఖ రాశారు. దమ్ముంటే ఫార్ములా-ఈ రేస్ అంశంపై రాష్ట్ర శాసనసభలో చర్చ పెట్టాలని లేఖ ద్వారా సవాల్ విసిరారు. ఫార్ములా-ఈ రేస్ వ్యవహారంలో ప్రభుత్వం కొన్ని నెలలుగా గత బీఆర్ఎస్ ప్రభుత్వం మీద, ముఖ్యంగా తన మీద అనేక నిరాధార ఆరోపణలు చేస్తోందని లేఖలో తెలిపారు.ఈ విషయం మీద ఈ వారం మీ ఆధ్వర్యంలో జరిగిన కేబినెట్ సమావేశంలో గంటన్నర సేపు చర్చ కూడా జరిగినట్టు వార్తా కథనాలు వచ్చాయన్నారు. ఈ అంశం మీద నాలుగు గోడల మధ్య చర్చ కన్నా రాష్ట్ర శాసన సభలో నాలుగు కోట్ల మంది ప్రజల ముందు చర్చ జరగితే నిజానిజాలు ఏమిటో అందరికీ తెలుస్తాయన్నారు. తెలంగాణ రాష్ట్రానికి, హైదరాబాద్ నగరానికి మంచి జరగాలనే సదుద్దేశంతో గత ప్రభుత్వం ఫార్ములా-ఈ రేస్ నిర్వాహకులతో ఒక ఒప్పందం చేసుకుందని కేటీఆర్ తెలిపారు.

యూట్యూబర్ భానుచందర్ అరెస్ట్.. రిమాండ్‌కు తరలింపు
మేడ్చల్ జిల్లాఘట్కేసర్ పోలీస్ స్టేషన్ పరిధి ఔటర్ రింగురోడ్డుపై మనీ హంట్ ఛాలెంజ్ పేరుతో డబ్బులు వెదజల్లుతూ న్యూసెన్స్ క్రియేట్ చేస్తున్న భానుచందర్ అనే యూట్యూబర్‌ను ఘట్‌కేసర్ పోలీసులు అరెస్టు చేశారు. అతడిని రిమాండ్‌కు తరలించారు. ఘట్ కేసర్ పీఎస్‌లో మల్కాజిగిరి ఏసీపీ చక్రపాణి ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఏసీపీ మాట్లాడుతూ.. హైదరాబాద్ బాలానగర్‌కు చెందిన రాయలాపురం భానుచందర్ అనే వ్యక్తి ఘట్ కేసర్ వద్ద అవుటర్ రింగురోడ్డుపై తన సోషల్ మీడియా అకౌంట్ ద్వారా వీడియో తీస్తూ కరెన్సీని అవుటర్ రింగురోడ్డుపై చెట్లపొదల్లో విసిరివేస్తూ వచ్చి తీసుకోమని మనీ హంట్ ఛాలెంజ్ చేస్తున్నాడని అన్నారని ఏసీపీ వెల్లడించారు. ఓఆర్ఆర్ సిబ్బంది ఫిర్యాదు మేరకు బీఎన్ఎస్ సెక్షన్ 179, నేషనల్ యాక్ట్ – 1956 ప్రకారం ప్రకారం భానుచందర్‌ను అరెస్టు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఏసీపీ చక్రపాణి తెలిపారు. ఈ కార్యక్రమంలో ఘట్ కేసర్ సీఐ పి.పరశురాం, ఎస్ఐ శేఖర్ తదితరులు పాల్గొన్నారు.

అంబేద్కర్‌పై వ్యాఖ్యలు.. అమిత్‌షా‌పై తృణమూల్ ప్రివిలేజ్ నోటీసులు.. .
రాజ్యసభలో అంబేద్కర్‌పై అనుచిత వ్యాఖ్యలు చేశారని కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షాపై ప్రతిపక్ష పార్టీలు ఫైర్ అవుతున్నాయి. తాజాగా ఆయన చేసిన వ్యాఖ్యలపై తృణమూల్ కాంగ్రెస్ ప్రివిలేజ్ మోషన్ నోటీసులు పంపింది. రాజ్యాంగ నిర్మాత వారసత్వాన్ని, పార్లమెంట్ గౌరవాన్ని దెబ్బతీశారని పేర్కొంది. రాజ్యసభలో టీఎంసీ నేత డెరెక్ ఓబ్రెయిన్ రూల్ 187 కింది నోటీసులు అందించారు. ప్రతిపక్షాలను ఉద్దేశించి అమిత్ షా చేసిన ప్రసంగం నుంచి ఈ వివాదం మొదలైంది. రాజ్యాంగం ఏర్పడి 75 ఏళ్లు పూర్తయిన సందర్భంగా జరిగిన చర్చలో అమిత్ షా మాట్లాడుతూ.. ‘‘బీఆర్ అంబేద్కర్ పేరుని చెప్పడం ప్రతిపక్షాలకు ఫ్యాషన్ అయింది. అంబేద్కర్ , అంబేద్కర్ , అంబేద్కర్ , అంబేద్కర్ , అంబేద్కర్ , అంబేద్కర్ అని చెప్పుకోవడం ఫ్యాషన్ గా మారిపోయిందని, ఇన్ని సార్లు దేవుడి పేరు తలుచుకుంటే స్వర్గంలో చోటు దక్కేది.’’ అని ఆయన అన్నారు. నెహ్రూ ప్రభుత్వంతో విభేదించి అంబేద్కర్ రాజీనామా చేసిన విషయాన్ని అమిత్ షా గుర్తు చేశారు.

అంబేద్కర్‌ని అవమానిస్తే దేశం సహించదు..
రాజ్యసభలో అమిత్ షా చేసిన ప్రసంగం వివాదాస్పదంగా మారింది. రాజ్యాంగ నిర్మాత బీఆర్ అంబేద్కర్ గురించి తప్పుడు వ్యాఖ్యలు చేశారని కాంగ్రెస్‌తో పాటు ఇతర ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. మరోవైపు స్పీచ్‌లోని కొంత భాగాన్ని మాత్రమే కాంగ్రెస్ వైరల్ చేస్తోందని బీజేపీ ఆరోపిస్తోంది. మొత్తం చర్చను చూస్తే అమిత్ షా ఏం చెప్పారో అర్థమవుతుందని బీజేపీ వర్గాలు చెబుతున్నాయి. ఇదిలా ఉంటే, లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ మాట్లాడుతూ.. బాబాసాహెబ్ అంబేద్కర్‌ని అవమానించడాన్ని దేశం సహించదని బుధవారం అన్నారు. రాజ్యసభలో అమిత్ షా చేసిన వ్యాఖ్యలకు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. ‘‘“బాబా సాహెబ్ రాజ్యాంగ రూపశిల్పి, దేశానికి దిశానిర్దేశం చేసిన గొప్ప వ్యక్తి, అతని అవమానాన్ని లేదా రాజ్యాంగాన్ని అవమానిస్తే దేశం సహించదు. ఆయన చేత హోంమంత్రి క్షమాపణ చెప్పాలి.’’ అని రాహుల్ గాంధీ ఫేస్‌బుక్ పోస్టులో డిమాండ్ చేశారు. పార్లమెంట్ ఆవరణలో మాట్లాడుతూ.. ‘‘వారు(బీజేపీ) రాజ్యాంగానికి వ్యతిరేకం, రాజ్యాంగాన్ని మారుస్తామని వారు గతంలో చెప్పారు, వారు అంబేద్కర్, ఆయన సిద్ధాంతాలకు వ్యతిరేకం, వారి పని అంబేద్కర్ రాజ్యాంగాన్ని ముగించడమే అని దేశం మొత్తానికి తెలుసు.” అని అన్నారు.

ప్రేమలో పడ్డ ముగ్గురు పిల్లల తల్లి.. దగ్గరుండి పెళ్లి చేసిన భర్త!
బీహార్‌లోని సహర్సా జిల్లాలో ఓ ఆశ్చర్యకరమైన సంఘటన వెలుగులోకి వచ్చింది. ఇక్కడ 12 ఏళ్ల క్రితం మహిళ ప్రేమ వివాహం చేసుకుంది. 12 ఏళ్ల తర్వాత ఆ మహిళ మరొకరితో ప్రేమలో పడింది. ఈ విషయం మహిళ భర్తకు తెలియడంతో.. మొదట ఆగ్రహానికి గురయ్యాడు. తర్వాత వారిద్దరికీ పెళ్లి జరిపించాడు. ఈ మొత్తం విషయానికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఓ జాతీయ మీడియా కథనం ప్రకారం.. ఈ ఘటన సహర్సాలోని బైజ్నాథ్పూర్ గ్రామంలో జరిగింది. ఓ యువకుడు 12 సంవత్సరాల క్రితం రహువా తులసియాహి గ్రామానికి చెందిన అమ్మాయిని ప్రేమించాడు. ఇద్దరూ పెళ్లి చేసుకోవాలనుకున్నారు. కానీ వారి కుటుంబాలు అంగీకరించలేదు. వీరిద్దరూ పారిపోయి పెళ్లి చేసుకున్నారు. వీరికి ముగ్గురు పిల్లలు ఉన్నారు. అంతా మామూలుగానే సాగుతోంది. ఇంతలో ఆమె అదే గ్రామంలోని మరో వ్యక్తిపై మనసు పారేసుకుంది. కులాంతర వివాహం చేసుకున్న ఈ జంట ప్రభుత్వ పథకాల ప్రయోజనాలను పొందడంలో ఈ యువకుడు సహాయం చేశాడు. అప్పటికే నుంచి ఈ మహిళతో సాన్నిహిత్యం పెరిగి.. క్రమంగా ప్రేమకు దారితీసింది.

బ్రేకింగ్: శ్రీ తేజ్ ను పరామర్శించిన అల్లు అరవింద్
హైదరాబాద్ సంధ్య థియేటర్ వద్ద తొక్కిసలాట ఏర్పడి రేవతి అనే మహిళ మృతి చెందిన సంగతి తెలిసిందే. పుష్ప 2 సినిమా ప్రీమియర్ సందర్భంగా అల్లు అర్జున్ ఆ ధియేటర్ కి వెళ్లడంతో తొక్కిసలాట ఏర్పడింది. రేవతి అనే మహిళ మృతిచెందగా ఆమె కుమారుడు శ్రీ తేజ్ తీవ్రంగా గాయపడ్డాడు. ఆ రోజు నుంచి శ్రీ తేజ్ కి హైదరాబాద్ కిమ్స్ హాస్పిటల్ లో చికిత్స అందిస్తున్నారు. ఇప్పటికే ఆ కుటుంబానికి అండగా ఉంటానంటూ అల్లు అర్జున్ ప్రకటించి పాతిక లక్షలు సాయం చేస్తామని వెల్లడించారు. ఇప్పటికే 10 లక్షల రూపాయలు ఇచ్చినట్లుగా తెలుస్తోంది. అంతేకాక చికిత్సకు అవసరమైన ఒక ఇంజక్షన్ కూడా సింగపూర్ నుంచి తెప్పించినట్లుగా తెలుస్తోంది. తాజాగా కిమ్స్ ఆసుపత్రికి అల్లు అర్జున్ తండ్రి, ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ వెళ్లారు. శ్రీ తేజ్ ఆరోగ్య పరిస్థితిపై ఆయన ఆరా తీసినట్లుగా తెలుస్తోంది. ఆ తర్వాత శ్రీ తేజ్ కుటుంబ సభ్యులతో సైతం ఆయన మాట్లాడినట్టుగా చెబుతున్నారు. ఇక తొక్కిసలాట కారణంగా శ్రీ తేజ్ తల్లి రేవతి మరణించింది. ఆ రోజు నుంచి శ్రీ తేజ్ ఆరోగ్య ఇబ్బందికరంగా ఉందని చెబుతున్నారు. నిన్న హైదరాబాద్ సిపి సివి ఆనంద్ తెలంగాణ హెల్త్ సెక్రటరీ క్రిస్టినాతో కలిసి శ్రీ తేజను పరమర్శించారు. శ్రీ తేజ్ ఇంకా స్పృహలోకి రాలేదని, అప్పటి నుంచి వెంటిలేటర్ మీదనే ఉంచి చికిత్స అందిస్తున్నారని తెలుస్తోంది. ఇక ఈ మేరకు నిన్న కిమ్స్ హాస్పిటల్ వైద్యులు ఒక హెల్త్ బులిటెన్ సైతం రిలీజ్ చేశారు.

అల్లు అర్జున్ రాలేకపోయారు.. అందుకే నేను వచ్చా!
హైదరాబాద్‌ లోని కిమ్స్‌ ఆస్పత్రికి వెళ్ళారు అల్లు అర్జున్ తండ్రి, ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్‌. సంధ్య థియేటర్‌ ఘటనలో గాయపడ్డ బాలుడు శ్రీతేజ్‌ ఆరోగ్య పరిస్థితిపై వాకబు అల్లు అరవింద్‌ చేశారు. శ్రీతేజ్‌ కుటుంబ సభ్యులతో మాట్లాడిన అరవింద్.. సంధ్య థియేటర్‌ వద్ద తొక్కిసలాటలో బాలుడు శ్రీతేజ్‌ తల్లి రేవతి మృతి చెందిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఈరోజు కిమ్స్ ఆస్పత్రికి వెళ్లిన ఆయన మృతి చెందిన మహిళ కుటుంబాన్ని పూర్తిగా ఆదుకుంటామని అన్నారు. ప్రభుత్వం మాకు పూర్తిస్థాయిలో సహకారం అందించింది అని వెల్లడించిన ఆయన కేసు కోర్టులో ఉన్నందున అల్లు అర్జున్‌ రాలేక పోయారని అన్నారు. అర్జున్‌ తరపున నేను ఆస్పత్రికి వచ్చాను అని అల్లు అరవింద్‌ పేర్కొన్నారు. హైదరాబాద్ సంధ్య థియేటర్ వద్ద తొక్కిసలాట ఏర్పడి రేవతి అనే మహిళ మృతి చెందిన సంగతి తెలిసిందే. పుష్ప 2 సినిమా ప్రీమియర్ సందర్భంగా అల్లు అర్జున్ ఆ ధియేటర్ కి వెళ్లడంతో తొక్కిసలాట ఏర్పడింది. రేవతి అనే మహిళ మృతిచెందగా ఆమె కుమారుడు శ్రీ తేజ్ తీవ్రంగా గాయపడ్డాడు. ఆ రోజు నుంచి శ్రీ తేజ్ కి హైదరాబాద్ కిమ్స్ హాస్పిటల్ లో చికిత్స అందిస్తున్నారు.

Show comments