NTV Telugu Site icon

Top Headlines @ 5 PM: టాప్‌ న్యూస్‌

Top Headlines @ 5 Pm New

Top Headlines @ 5 Pm New

తెలంగాణ ప్రజాప్రతినిధులకు శుభవార్త.. సిఫార్సు లేఖలపై టీటీడీ కీలక నిర్ణయం
తెలంగాణ ప్రజాప్రతినిధులకు శుభవార్త వినిపించింది తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) పాలకమండలి.. వారానికి రెండు సార్లు తెలంగాణ నేతల సిఫార్సు లేఖలు అనుమతించాలని నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాలు జారీ చేయడం.. టీటీడీ కూడా సిఫార్సు లేఖలకు అనుమతిస్తామని చెప్పినా.. అది కార్యరూపం దాల్చకపోవడంతో.. టీటీడీ సిబ్బందిపై విమర్శలు పెరిగాయి.. ఈ నేపథ్యంలో.. తెలంగాణ ప్రజాప్రతినిధులకు శుభవార్త చెప్పింది టీటీడీ.. మార్చి 24వ తేదీ నుంచి తెలంగాణ ప్రజా ప్రతినిధులు సిఫార్సు లేఖలు స్వీకరించబోతోంది టీటీడీ.. అయితే, తెలంగాణ ప్రజాప్రతినిధుల సిఫార్సు లేఖలపై సోమవారం, మంగళవారాల్లో బ్రేక్ దర్శనాలు కల్పించనున్నారు టీటీడీ అధికారులు.. ఇక, బుధవారం ,గురువారం రోజుల్లో తెలంగాణ ప్రజాప్రతినిధుల సిఫార్సు లేఖలపై 300 రూపాయల ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్లను జారీ చేయనున్నట్టు తిరుమల తిరుపతి దేవస్థానం స్పష్టం చేసింది.

పోసానిపై మరో ఫిర్యాదు.. ఉద్యోగం పేరుతో లక్షలు తీసుకొని మోసం..!
నటుడు పోసాని కృష్ణ మురళిని వరుసగా కేసులు వెంటాడుతూనే ఉన్నాయి.. గతంలో నారా చంద్రబాబు నాయుడు, పవన్‌ కల్యాణ్‌, నారా లోకేష్‌.. వారి కుటుంబ సభ్యులపై చేసిన కామెంట్లపై పలు పోలీస్ స్టేషన్లలో కేసులు నమోదు కాగా.. పోసానిని అరెస్ట్ చేశారు పోలీసులు.. ఇప్పటికే మూడు జైళ్లు తిప్పారు.. ఆయన బెయిల్‌ కోసం తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నా ఫలితం లేకుండా పోయింది.. ఈ సమయంలో.. పోసానిపై మరో ఫిర్యాదు అందిందింది.. తనకు ఉద్యోగం ఇప్పిస్తా అని 9 లక్షల రూపాయలు తీసుకుని మోసం చేశారని టీడీపీ కేంద్ర కార్యాలయంలో కర్నూలు జిల్లాకు చెందిన ఓ వ్యక్తి ఫిర్యాదు చేశాడు.. కర్నూలు జిల్లాకు చెందిన సత్యనారాయణ అనే వ్యక్తి టీడీపీ గ్రీవిన్స్ లో పోసాని కృష్ణ మురళిపై ఫిర్యాదు చేశారు.. పోసాని కృష్ణ మురళి.. మహేష్ అనే వ్యక్తులు తన నుంచి 9 లక్షల రూపాయాలు తీసుకుని ఉద్యోగం ఇవ్వకుండా మోసం చేశారని ఆవేదన వ్యక్తం చేశాడు సత్యనారాయణ.. ఈ వ్యవహారంలో గతంలో హైదరాబాద్‌లోని గచ్చిబౌలి పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేసినా.. పోలీసులు పట్టించుకోలేదని.. అందుకే ఇప్పుడు టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఫిర్యాదు చేస్తున్నట్టు పేర్కొన్నారు. 9 లక్షల రూపాయలు ఇచ్చి మోసపోయానంటున్నర బాధితుడు.. ఇంటికి వెళ్లలేక.. గుంటూరులో కూలి పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నట్టు చెప్పుకొచ్చారు.. మరి, పోసాని కృష్ణ మురళి కేసుల వ్యవహారంలో ఏపీ సర్కార్‌ సీరియస్‌గా ఉండగా.. ఇప్పుడు టీడీపీ కార్యాలయంలో అందిన ఫిర్యాదుపై ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో వేచి చూడాలి..

విద్య, ఉద్యోగం, రాజకీయాల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు సాధిస్తాం..
అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. 42 శాతం రిజర్వేషన్ ఇస్తామని హామీ ఇచ్చారు. రాహుల్ గాంధీ చెప్పినట్టు కులగణన చేశాం.. ఫిబ్రవరి 4వ తేదీ 2024 నాడు క్యాబినెట్లో తీర్మానం చేశాం.. మూడు కోట్ల 58 లక్షల మంది సర్వేలో పాల్గొన్నారు.. సర్వేలో పాల్గొన్న అందరికీ కృతజ్ఞతలు.. 75 వేల మంది డేటా ఎంట్రీ ఆపరేటర్లు పాల్గొన్నారు.. విద్య, ఉద్యోగాలు, స్థానిక సంస్థలలో రిజర్వేషన్ కోరుతూ అన్ని పార్టీలు ఏకాభిప్రాయం వ్యక్తం చేశారు.. బిల్లు ఆమోదానికి సహకరించిన సభ్యులకు అభినందనలు తెలిపారు ముఖ్యమంత్రి. కలిసి కట్టుగా మనం ఉన్నామని సమాజానికి సంకేతం ఇచ్చాం.. అలాగే, గత ప్రభుత్వం చేసిన ప్రతిపాదన ఉపసంహరించుకున్నామని అసెంబ్లీ వేదికగా రేవంత్ రెడ్డి తెలిపారు. అయితే, లీగల్ గా ఇబ్బంది అవుతుంది కాబట్టి గత ప్రభుత్వం చేసిన ప్రతిపాదనను ఉపసంహరించుకున్నట్లు సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. ఇప్పటి నివేదిక పంపుతున్నాం.. రిజర్వేషన్ పెంచాలని.. బలహీన వర్గాలకు అండగా ఉండాలని మేం ఈ నిర్ణయం తీసుకున్నాం.. అందుకే ఫిబ్రవరి 4న సోషల్ జస్టిస్ డే నిర్వహిస్తున్నాం.. చట్టబద్ధత కోసం ఇవాళ సభలో బిల్లులు ప్రవేశ పెట్టాం.. ఏ వివాదాలకు పోకుండా.. బీసీ రిజర్వేషన్లు ఇవ్వాలన్నారు. సభా నాయకుడిగా రిజర్వేషన్ సాధనకు నాయకత్వం వహిస్తాను.. కేసీఆర్ కి విజ్ఞప్తి చేస్తున్నాను.. సభకు రండి.. అన్ని రాజకీయ పార్టీలు కలిసి కేంద్ర ప్రభుత్వం దగ్గరికి పోదాం.. చట్టాలు మనకు అనుకూలంగా రాసుకున్నవే.. 42 శాతం రిజర్వేషన్లు అమలు తీసుకొద్దామన్నారు. ప్రధాని దగ్గరికి పోదాం.. వీలైనంత తొందరగా… ప్రధానినీ అపాయింట్మెంట్ అడుగుతాం.. బీజేపీ ఎమ్మెల్యేలు, కిషన్ రెడ్డి ద్వారా ప్రధాని మోడీ అపాయింట్మెంట్ ఫిక్స్ చేయించండి అని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.

యునెస్కో తాత్కాలిక జాబితాలో మరో 6 ప్రదేశాలు.. తెలంగాణలో ఆ ప్రాంతం
యునెస్కో ప్రపంచ వారసత్వ హోదా తాత్కాలిక జాబితాలో మరో 6 ప్రదేశాలు చేరాయి. అందులో తెలంగాణలోని నారాయణపేట జిల్లా ముడుమాల్‌లో ఉన్న నిలువురాళ్లకు చోటు దక్కింది. అంతేకాకుండా.. మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్‌లోని బుండేలాల రాజభవన కోటలు సహా ఆరు ప్రదేశాలను యునెస్కో ప్రపంచ వారసత్వ కేంద్రం భారతదేశ తాత్కాలిక జాబితాలో చేర్చిందని కేంద్ర సాంస్కృతిక, పర్యాటక శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ సోమవారం తెలిపారు. ఈ ఏడాది భారత్‌ చేర్చిన జాబితాలో చత్తీస్‌గఢ్‌లోని కంగెర్‌ వ్యాలీ నేషనల్‌ పార్క్, తెలంగాణలోని ముడుమాల్‌ మెగాలితిక్‌ మెన్హిర్స్, పలు రాష్ట్రాల్లోని అశోకుడి శాసన స్థలాలు, మౌర్య రూట్స్, పలు రాష్ట్రాల్లోని చౌసత్‌ యోగిని దేవాలయాలు, ఉత్తర భారతంలోని గుప్తుల దేవాలయాలు, మధ్యప్రదేశ్, ఉత్తర ప్రదేశ్‌లలోని బుందేలాల రాజభవనాలు, కోటలు ఉన్నాయని మంత్రి షెకావత్ లోక్‌సభలో తెలిపారు. పూరీ జగన్నాథ రథయాత్రను యునెస్కో యొక్క అసంపూర్ణ సాంస్కృతిక వారసత్వ జాబితాలో చేర్చడానికి చొరవ తీసుకోవాలని బిజెపి ఎంపి సంబిత్ పాత్ర చేసిన సూచనకు సమాధానమిస్తూ షెకావత్ ఈ విషయాన్ని వెల్లడించారు.

ఐదేళ్లలో రూ.400 కోట్ల పన్నులు చెల్లించాం..
శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ గత ఐదు సంవత్సరాలలో ప్రభుత్వానికి దాదాపు రూ.400 కోట్ల పన్నులు చెల్లించినట్లు వెల్లడించింది. ఫిబ్రవరి 5, 2020-ఫిబ్రవరి 5, 2025 మధ్య చెల్లించినట్లు ట్రస్ట్ కార్యదర్శి చంపత్ రాయ్ వెల్లడించారు. చెల్లించిన మొత్తం పన్నులో రూ.270 కోట్లు వస్తువులు మరియు సేవల పన్ను (జిఎస్‌టి)కింద.. మిగిలిన రూ.130 కోట్లు వివిధ ఇతర పన్నుల కింద చెల్లించినట్లు తెలిపారు. ఆలయ నిర్మాణం తర్వాత అయోధ్యను సందర్శించే భక్తుల సంఖ్య గణనీయంగా పెరగడమే ఈ ఆర్థిక పెరుగుదలకు కారణమని రాయ్ పేర్కొన్నారు. అయోధ్య రామాలయం ప్రధాన మత పర్యాటక కేంద్రంగా అవతరించిందని.. భక్తులు, సందర్శకుల సంఖ్య 10 రెట్లు పెరిగిందని చంపత్ రాయ్ తెలిపారు. భక్తులు, పర్యాటకుల రాకతో స్థానికులకు ఉపాధి అవకాశాలు పెరిగాయని పేర్కొన్నారు. మహా కుంభమేళా సందర్భంగా సుమారు 1.26 కోట్ల మంది భక్తులు బాల రాముడిని దర్శించుకున్నారని ఆయన చెప్పారు. గత ఏడాదిలో అయోధ్యకు 16 కోట్ల మంది వచ్చారని.. ప్రత్యేకంగా 5 కోట్ల మంది భక్తులు రామాలయాన్ని సందర్శించారని రాయ్ వెల్లడించారు. రామమందిర ట్రస్ట్ యొక్క ఆర్థిక లావాదేవీలు పారదర్శకంగా ఉంటాయని.. కంప్ట్రోలర్ మరియు ఆడిటర్ జనరల్ (CAG) అధికారులు క్రమం తప్పకుండా ఆడిట్ చేస్తారని రాయ్ తెలిపారు.

పాకిస్తాన్ రైలు హైజాక్.. జాతీయ భద్రతపై కీలక సమావేశం
పాకిస్తాన్‌లో రైలు హైజాక్ ఘటన సంచలనం సృష్టించింది. బలోచిస్థాన్ ప్రావిన్సులోని పర్వత ప్రాంతమైన క్వెట్టా నుంచి ఖైబర్ పఖ్తుంఖ్వా ప్రావిన్సులోని పెషావర్‌కు వెళ్తున్న జాఫర్ ఎక్స్‌ప్రెస్‌ను బలోచ్ లిబరేషన్ ఆర్మీ (BLA) మిలిటెంట్లు హైజాక్ చేసిన సంగతి తెలిసిందే. ఈ ఘటన జరిగిన సమయంలో తొమ్మిది కోచ్‌లలో మొత్తం 440 మంది ప్రయాణికులు ఉన్నారు. వెంటనే ఆర్మీ, ఎయిర్ ఫోర్స్, ఫ్రాంటియర్ కార్ప్స్, స్పెషల్ గ్రూప్ కమాండోస్‌తో రెస్య్కూ ఆపరేషన్ చేపట్టారు. ఈ ఆపరేషన్ విజయవంతం అయింది. ఈ క్రమంలో.. పాకిస్తాన్ జాతీయ అసెంబ్లీ స్పీకర్ అయాజ్ సాదిక్ జాతీయ భద్రతపై పార్లమెంటరీ కమిటీ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సమావేశం రేపు (మంగళవారం) జరుగనుంది. బలూచిస్తాన్, ఖైబర్ పఖ్తుంఖ్వా ప్రావిన్సులలో ఇటీవల ఉగ్రవాద దాడులు పెరిగిన నేపథ్యంలో ఈ సమావేశం ప్రాముఖ్యతను సంతరించుకుంది. పాకిస్తాన్ వార్తపత్రిక నివేదిక ప్రకారం.. మంగళవారం మధ్యాహ్నం 1:30 గంటలకు పార్లమెంట్ హౌస్‌లో ఈ భద్రతా సమావేశాన్ని ఏర్పాటు చేయాలని ప్రధాన మంత్రి షాబాజ్ షరీఫ్ జాతీయ అసెంబ్లీ స్పీకర్‌ను కోరారు. ప్రధానమంత్రి కార్యాలయం (PMO) విడుదల చేసిన ప్రకటన ప్రకారం.. ఈ సమావేశంలో పాకిస్తాన్ ఆర్మీ ఉన్నతాధికారులు పాల్గొని.. ప్రస్తుత భద్రతా పరిస్థితిపై పార్లమెంటరీ కమిటీకి సమగ్ర వివరణ ఇవ్వనున్నారు. భద్రతపై పార్లమెంటరీ కమిటీ ఏర్పాటు కానందున.. రక్షణ, విదేశాంగ వ్యవహారాలపై జాతీయ అసెంబ్లీ స్టాండింగ్ కమిటీల సభ్యులు, సమాఖ్య మంత్రివర్గ సభ్యులు, నాలుగు ప్రావిన్సుల ముఖ్యమంత్రులు.. అన్ని పార్లమెంటరీ పార్టీల నాయకులు లేదా వారి ప్రతినిధులు ఈ సమావేశానికి హాజరవుతారని డాన్ వార్తపత్రిక నివేదించింది.

ప్రతినెలా ధోనికి పెన్షన్.. బీసీసీఐ గట్టిగానే ఇస్తోందిగా!
భారత క్రికెట్ చరిత్రలో తనదయిన ముద్ర వేసిన వ్యక్తి మహేంద్ర సింగ్ ధోనీ. ఫార్మాట్ ఏదైనా సరే భారత జట్టును విజయవంతంగా నడిపించిన ధోనీ, అత్యంత విజయవంతమైన కెప్టెన్‌గా గుర్తింపు పొందాడు. ధోని క్రికెట్ లో సాధించిన రికార్డులు, అవార్డ్స్, విజయాలు అబ్బో.. ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో చెప్పవచ్చు. ఇకపోతే, భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (BCCI) మాజీ క్రికెటర్లకు వారి సేవలను గుర్తించి పెన్షన్ అందిస్తోంది. ఆటగాడు ఆడిన మ్యాచులు, భారత జట్టుకు చేసిన సేవలను బట్టి పెన్షన్ మొత్తాన్ని నిర్ణయిస్తారు. ఆటగాళ్లకు ఆర్థిక భద్రత కల్పించడమే ఈ పథకం ప్రధాన ఉద్దేశం. ముఖ్యంగా, టీమిండియాకు ఆడిన మ్యాచుల ఆధారంగా పెన్షన్ మొత్తాన్ని నిర్ణయిస్తారు. ఇందులో భాగంగా.. 75 కంటే ఎక్కువ టెస్ట్‌లు ఆడిన లేదా 50 కంటే ఎక్కువ టెస్ట్‌లు ఆది ఉంది టీమిండియా అద్భుత విజయాల్లో తోడ్పడిన క్రికెటర్లకు రూ. 70,000 పెన్షన్ అందుతుంది. అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ తీసుకున్న ఆటగాళ్లకు బీసీసీఐ 2022లో పెన్షన్ పథకాన్ని మరింత మెరుగుపరిచింది. అప్పటి బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ తీసుకున్న నిర్ణయాలతో ఆటగాళ్లకు పెన్షన్ మొత్తం పెరిగింది. పురుషులతో పాటు మహిళా క్రికెటర్లకూ ఈ పథకం వర్తించనుంది.

మెగాస్టార్ సినిమాలోనూ బుల్లి రాజు?
తెలుగు సినీ పరిశ్రమలో ఇటీవల కాలంలో సంచలన విజయం సాధించిన చిత్రాల్లో ‘సంక్రాంతికి వస్తున్నాం’ ఒకటి. విక్టరీ వెంకటేష్ హీరోగా, అనిల్ రావిపూడి దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం సంక్రాంతి సీజన్‌లో బాక్సాఫీస్ వద్ద దూసుకెళ్లింది. ఈ సినిమాలో ‘బుల్లిరాజు’ పాత్రలో నటించిన బాల నటుడు రేవంత్ భీమాల ఒక్కసారిగా స్టార్‌డమ్‌ను సంపాదించాడు. ఈ చిన్నారి అద్భుతమైన నటన ప్రేక్షకులను ఆకట్టుకోవడమే కాక, సినీ వర్గాల్లోనూ హాట్ టాపిక్‌గా మారింది. ‘సంక్రాంతికి వస్తున్నాం’ సినిమా విజయం తర్వాత రేవంత్ భీమాల క్రేజ్ ఆకాశాన్ని అంటింది. భీమవరం నుంచి వచ్చిన ఈ బాల నటుడు, సినిమాలో తన సహజమైన నటనతో అందరి దృష్టిని ఆకర్షించాడు. సోషల్ మీడియాలో రీల్స్ ద్వారా అనిల్ రావిపూడి టీమ్ గుర్తించి అవకాశం ఇవ్వగా, ఆ అవకాశాన్ని రేవంత్ సద్వినియోగం చేసుకున్నాడు. ప్రస్తుతం రేవంత్ రోజుకు లక్ష రూపాయల వరకు డిమాండ్ చేస్తున్నట్లు సమాచారం. ఈ చిన్న వయసులోనే ఇంతటి డిమాండ్ సాధించడం అతని ప్రతిభకు నిదర్శనం. ఇక ఇదిలా ఉండగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి నటించనున్న తాజా చిత్రంలో రేవంత్ భీమాల కీలక పాత్ర పోషించనున్నట్లు టాక్ వినిపిస్తోంది. ‘సంక్రాంతికి వస్తున్నాం’లో రేవంత్ నటన చూసి అనిల్, తన తదుపరి భారీ ప్రాజెక్ట్‌లోనూ అతడిని తీసుకున్నట్లు సమాచారం. ఈ సినిమా త్వరలో సెట్స్‌పైకి వెళ్లనుంది. చిరంజీవి లాంటి లెజెండరీ హీరో సినిమాలో రేవంత్ నటించడం అతడి కెరీర్‌కు పెద్ద బూస్ట్ అవుతుందని అభిమానులు ఆశిస్తున్నారు. ఈ కొత్త చిత్రానికి సంబంధించిన స్క్రిప్ట్ వర్క్ 90 శాతం పూర్తయినట్లు తెలుస్తోంది. దర్శకుడు అనిల్ రావిపూడి ఈ స్క్రిప్ట్‌కు సింహాచలంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. మూడు నెలల్లో షూటింగ్ ప్రారంభించి, ఆ తర్వాత పోస్ట్ ప్రొడక్షన్ పనులు పూర్తి చేసి, వచ్చే సంక్రాంతికి సినిమాను విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. అనిల్ రావిపూడి గత ‘సంక్రాంతికి వస్తున్నాం’ సినిమాకు పనిచేసిన అదే టెక్నికల్ టీమ్—భీమ్స్ సంగీతం, సమీర్ రెడ్డి సినిమాటోగ్రఫీ, తమ్మిరాజు ఎడిటింగ్—ఈ చిత్రానికి కూడా వర్క్ చేయనుంది. ఈ కాంబినేషన్ సంక్రాంతి సీజన్‌లో మరో బ్లాక్‌బస్టర్‌ను అందిస్తుందని అందరూ ఆశిస్తున్నారు.

విజయ్ వర్మతో బ్రేకప్.. తమన్నా సంచలన పోస్టు
మిల్కీ బ్యూటీ తమన్నా ఇప్పుడు హాట్ టాపిక్ అయిపోయింది. ఆమె ఏ చిన్న పోస్టు పెట్టినా సరే అది విజయ్ వర్మను ఉద్దేశించే అని చాలా మంది కామెంట్లు పెడుతున్నారు. ఇలాంటి టైమ్ లో సంచలన పోస్టు పెట్టింది తమన్నా. నిలువెత్తు అందాల రాశి తమన్నా ఎవరి సొంతమో అని కుర్రాళ్లంతా ఊహించుకుంటున్న టైమ్ లో విజయ్ వర్మతో ప్రేమలో పడింది. లస్ట్ స్టోరీస్-2 టైమ్ లో నుంచే ఇద్దరూ ప్రేమలో పడ్డారు. దాదాపు రెండేళ్ల పాటు డేటింగ్ చేశారు. సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా వీరే వైరల్ అయ్యేవారు. విజయ్ వర్మ చాలా లక్కీ.. తమన్నా లాంటి అందగత్తె దొరికింది అంటూ ఎన్నో మీమ్స్, ట్రోల్స్ కనిపించేవి. కానీ సడెన్ గా వీరిద్దరూ బ్రేకప్ చెప్పుకున్నారనే వార్తలు కొన్ని రోజులుగా వినిపిస్తున్నాయి. ఇద్దరూ ఒక చోట కనిపించట్లేదు. ఒక ఈవెంట్ కు కూడా వేర్వేరుగా వస్తున్నారు. మాట్లాడుకోవట్లేదు. దాంతో బ్రేకప్ వార్తలు గుప్పుమంటున్నాయి. తాజాగా తమన్నా పెట్టిన పోస్టు వైరల్ అవుతోంది. ఇందులో ఆమె.. “అద్భుతాల కోసం ఎదురు చూడొద్దు.. మనమే జీవితంలో అద్భుతాలను సృష్టించుకోవాలి” అంటూ రాసుకొచ్చింది. విజయ్ ను ఉద్దేశించే తమన్నా ఈ పోస్టు పెట్టింది అంటున్నారు. బ్రేకప్ ను వీరిద్దరూ అధికారికంగా ఇంకా ప్రకటించలేదు. ప్రస్తుతం ఎవరి సినిమాల్లో వారు బిజీగా ఉంటున్నారు.