మంగళగిరి ఎయిమ్స్‌కు గుడ్‌న్యూస్ చెప్పిన సీఎం..
మంగళగిరి ఎయిమ్స్‌కు శుభవార్త చెప్పారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు.. రాష్ట్రపతి ద్రౌపది ముర్ముతో కలిసి మంగళగిరి ఎయిమ్స్ మొదటి స్నాతకోత్సవంలో పాల్గొన్న ఆయన.. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఎయిమ్స్ మంగళగిరికి 10 ఎకరాల భూమి ఇస్తామని తెలిపారు.. దేశంలో ఏ AIIMS కు కూడా ఇలాంటి భూమి లేదు.. అమరావతి భారతదేశపు భవిష్యత్ సిటీ.. మంగళగిరి ఎయిమ్స్ భారతదేశంలోనే నంబర్ 1 అవుతుందనే నమ్మకాన్ని వ్యక్తం చేశారు.. 960 బెడ్లు ఉన్న ఆసుపత్రి… 1618 కోట్లు ఖర్చుతో సిద్ధమైన ఆసుపత్రి.. మంగళగిరి ఎయిమ్స్ సొంతంగా అభివర్ణించారు.. డాక్టర్లుగా ఎదగడానికి టెక్నికల్ నాలెడ్జ్ కూడా ఉండాలని డైరెక్టర్ మధవానంద కర్ అంటున్నారు.. అందుకే ఎయిమ్స్ మంగళగిరికి 10 ఎకరాలు ఇస్తామని వెల్లడించారు సీఎం చంద్రబాబు.. ఇక, ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ద్రౌపది ముర్మును ఆదర్శంగా తీసుకోవాలని విద్యార్థులకు సూచించారు సీఎం చంద్రబాబు.. ఒక ఆదివాసీ కుటుంబం నుంచి వచ్చి ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అవ్వడం ఆవిడ సాధించిన విజయంగా పేర్కొన్న ఆయన.. కష్టపడితే ఈ ప్రపంచంలో సాధించలేనిది ఏదీలేదు అనడానికి ద్రౌపది ముర్ము జీవితం ఒక ఉదాహరణ అన్నారు.. అవకాశం ఉంటే నాకు ఇక్కడ చదువుకోవాలని ఉంది అంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు సీఎం.. భవిష్యత్తులో ఎయిమ్స్ మంగళగిరికి ఎలాంటి మౌళిక సదుపాయాల లోటు ఉండనివ్వం.. కొలనుకొండ లో రీసెర్చ్ సెంటర్, ఐఐటీతో అనుసంధానించాలనుకుంటున్నారు.. మెడికల్ అనేది ఇప్పుడు మెడ్ టెక్ గా మారిపోయింది… డీప్ టెక్ ను మెడికల్ లో కూడా అమలు చేయాలనుకుంటున్నాం అన్నారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు..
ఆళ్ల నాని చేరికకు లైన్ క్లియర్.. రేపే టీడీపీకి గూటికి మాజీ డిప్యూటీ సీఎం..
మాజీ మంత్రి, వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత ఆళ్ల నాని.. తెలుగుదేశం పార్టీలోకి రావడానికి లైన్ క్లియర్ అయ్యింది. తెలుగు తమ్ముళ్లు బహిరంగంగా ఎంత వ్యతిరేకించిన చివరికి అధిష్టానం నిర్ణయానికి తలవంచక తప్పలేదు.. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన కొంత కాలానికే వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీకి గుడ్‌బై చెప్పిన ఆయన.. టీడీపీలో చేరేందుకు సిద్ధం అయ్యారు.. అయితే, స్థానిక నేతలు తీవ్రంగా వ్యతిరేకించడంతో.. అప్పుడు తాత్కాలికంగా వాయిదా పడినా.. ఇప్పుడు టీడీపీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది.. దీంతో.. రేపు ఉదయం 11 గంటలకు టీడీపీ అధినేత, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సమక్షంలో పసుపు కండువా కప్పుకోనున్నారు ఆళ్ల నాని. కొంత మంది కార్యకర్తలు ఆళ్ల నాని చేరికపై తీవ్ర అసంతృప్తితో ఉన్నారని.. ఏదేమైన టీడీపీ క్రమశిక్షణకు మారుపేరని.. ఆళ్ల నాని చేరిక విషయంలో అధిష్టాన నిర్ణయం శిరోధార్యమని స్పష్టం చేశారు ఎమ్మెల్యే బడేటి..
ఏపీ నూతన పర్యాటక పాలసీ 2024-2029 ఆవిష్కరణ.. టార్గెట్‌అదే..!
ఏపీ నూతన పర్యాటక పాలసీ 2024-2029ను ఆవిష్కరించారు రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్.. సీఐఐ, ఏపీ చాంబర్స్ ఆధ్వర్యంలో జరుగుతున్న పర్యాటక పెట్టుబడిదారుల సమావేశంలో.. ఈ కొత్త పాలసీని విడుదల చేశారు.. ఇక, నూతన పర్యాటక పాలసీ 2024-29పై పెట్టుబడిదారులతో చర్చించి ఆహ్వానించారు మంత్రి దుర్గేష్.. అంతేకాదు.. పెట్టుబడిదారుల నుంచి పలు ప్రతిపాదనలు స్వీకరించారు మంత్రి దుర్గేష్.. పెట్టుబడిదారులకు ప్రభుత్వ సహకారం ఎల్లప్పుడూ ఉంటుందని హామీ ఇచ్చారు.. అంతేకాకుండా.. పెట్టుబడిదారులకు పర్యాటక పాలసీ విధివిధానాలను తెలిపారు మంత్రి దుర్గేష్.. పెట్టుబడి పెట్టేందుకు ఎలాంటి భయాందోళనలు అక్కర్లేదని స్పష్టం చేశారు. రాష్ట్రంలో పర్యాటక అభివృద్ధికి ఉన్న అవకాశాలను ఈ సందర్భంగా వివరించారు మంత్రి కందుల దుర్గేష్.. పర్యాటక రంగంలో తమది సమగ్ర విధానం అని తెలిపారు.. నూతన పాలసీ ద్వారా పెట్టుబడిదారులకు ప్రభుత్వపరంగా ఇచ్చే ప్రోత్సాహకాలు, రాయితీలను వివరించారు.. అయితే, పర్యాటక రంగంలో రూ. 25,000 కోట్ల పెట్టుబడులు ఆకర్షించాలన్నది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ధ్యేయమని స్పష్టం చేశారు.. పర్యాటకంగా అభివృద్ధి చెందేందుకు రాష్ట్రంలో విశాలమైన సముద్రతీరం, అద్భుతమైన చారిత్రక, వారసత్వ, ప్రకృతి సంపద, సజీవ నదులు ఉన్నాయని వివరించారు ఏపీ పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్.
ఆ పోస్టులను వెంటనే భర్తీ చేయండి.. మంత్రి ఆదేశాలు..
పశు సంవర్ధక శాఖలో ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకి తక్షణమే చర్యలు చేపట్టాలని ఆదేశాలు చేశారు మంత్రి అచ్చెన్నాయుడు.. సచివాలయంలో ఈ రోజు పశుసంవర్ధక, మత్స్య శాఖల ఉన్నతాధికారులతో రాష్ట్ర వ్యవసాయ, పశుసంవర్ధక, మత్స్య శాఖల మంత్రి అచ్చెన్నాయుడు సమీక్ష సమావేశం నిర్వహించారు.. జిల్లా సంయుక్త కలెక్టర్ల ఆధ్వర్యంలో జనవరి నెలాఖరులోపు చేప పిల్లల పంపిణీ పూర్తి చేయాలని అధికారులను ఈ సందర్భంగా ఆదేశించిన మంత్రి అచ్చెన్నాయుడు.. రాష్ట్రంలో తీర ప్రాంత అభివృద్ధికి నివేదిక సిద్ధం చేయాలని పేర్కొన్నారు.. మత్స్యకారుల బోట్లకు ఇంధన రాయితీలో ఇబ్బందులు తలెత్తకుండా తక్షణ చర్యలకు ఆదేశించారు.. ఇక, రాష్ట్రంలో ఎమ్బ్రియో ట్రాన్స్ఫర్ టెక్నాలజీ వృద్ధి చేసి మేలైన పశు జాతులను అందించేందుకు చర్యలు తీసుకోవాలన్నారు.. ఇక, పశు సంవర్ధక శాఖలో ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకి తక్షణమే చర్యలు చేపట్టాలని ఆదేశించారు.. పశువుల ఆసుపత్రి భవనాల నిర్మాణాలు, మరమ్మతులు అవసరం ఉన్నవి ప్రతిపాదనలు సిద్ధం చేయాలని సూచించారు. ఇక, ఉపాధి హామీ అనుసంధానంతో పశువుల షెడ్ల నిర్మాణం, గడ్డి పెంపకం మరింత ఎక్కువ మంది లబ్ధిదారులకు అందించేందుకు నివేదిక పంపాలని ఆదేశించారు రాష్ట్ర వ్యవసాయ, పశుసంవర్ధక, మత్స్య శాఖల మంత్రి అచ్చెన్నాయుడు.
విపక్షాల నిరసనల మధ్యే మూడు కీలక బిల్లులకు ఆమోదం
విపక్షాల నిరసనల మధ్య తెలంగాణ శాసనసభ సమావేశాలు కొనసాగుతున్నాయి. లగచర్లకు రైతులకు బేడీల అంశంపై చర్చ చేపట్టాలని విపక్షాలు పట్టుబట్టాయి. బీఆర్‌ఎస్, బీజేపీలు వాయిదా తీర్మానాల కోసం డిమాండ్ చేశాయి. మరోవైపు బీఆర్‌ఎస్, బీజేపీ శాసనసభ్యుల నిరసన మధ్య మూడు కీలక బిల్లులకు సభ ఆమోదం తెలిపింది. స్పోర్ట్స్ యూనివర్సిటీ బిల్లును మంత్రి కొండా సురేఖ అసెంబ్లీలో ప్రవేశపెట్టగా.. వెంటనే సభ ఆమోదం తెలిపింది. తెలంగాణ యూనివర్సిటీ సవరణ బిల్లును మంత్రి దామోదర రాజనర్సింహ అసెంబ్లీలో ప్రవేశ పెట్టారు. దీనికి కూడా ఎలాంటి చర్చ లేకుండానే ఆమోదం లభించింది. జీఎస్టీ సవరణ బిల్లును మంత్రి శ్రీధర్‌బాబు సభలో ప్రవేశపెట్టారు. బీఆర్ఎస్, బీజేపీ సభ్యుల నిరసనల మధ్య ఈ మూడు బిల్లులను సభ ఆమోదించింది. అనంతరం టూరిజం పాలసీపై స్వల్పకాలిక చర్చ తర్వాత సభ బుధవారానికి వాయిదా పడింది.
దమ్ముంటే రైతులకు ఇచ్చిన హామీలపై చర్చ పెట్టాలి..
తెలంగాణ రాష్ట్రంలో అన్ని వ్యవస్థలు నిర్వీర్యం అయ్యాయని మాజీ మంత్రి, ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి తీవ్రంగా విమర్శించారు. శాసన సభను కూడా వాళ్ళ అబద్ధాలను నిజాం చేసుకునేందుకు వాడుకుంటున్నారని ఆరోపించారు. స్పీకర్ కూడా వారికి రూల్స్ తెలియజేసే ప్రయత్నం చేయడం లేదన్నారు. లగచర్ల రైతుల సమస్యపై చర్చించడానికి సమయం అడిగామని.. కానీ స్పందించడం లేదన్నారు. రైతుల సమస్య కంటే టూరిజం ఎక్కువైందా అంటూ జగదీష్ రెడ్డి ప్రశ్నించారు. కేవలం ఢిల్లీ, జైపూర్, కొరియా వెళ్లే దానిపై శ్రద్ధ ఉందని.. కేటీఆర్‌పై ఎలా కేసు పెట్టాలనే దానిపై ఆలోచిస్తున్నారన్నారని మండిపడ్డారు. దమ్ముంటే రైతులకు ఇచ్చిన హామీలపై చర్చ పెట్టాలని సవాల్ విసిరారు. మహిళలకు ప్రకటించిన హామీలపై చర్చ పెట్టాలంటూ డిమాండ్ చేశారు. 6 గ్యారెంటీలపై చర్చ పెట్టాలన్నారు. సీఎం రేవంత్ రెడ్డి దమ్ముంటే శాసన సభలో చర్చ పెట్టాలని ఛాలెంజ్ విసిరారు. శాసన సభను చూసి కాంగ్రెస్ భయపడుతుందని ఎద్దేవా చేశారు. బిల్లులు ఆమోదం చేసుకోవడానికి మూడు నాలుగు రోజులు అసెంబ్లీ నడిపిద్దాం అనుకుంటున్నారని ఆరోపణలు చేశారు. బీఆర్‌ఎస్ ప్రభుత్వంలో జరిగిన ప్రతి ఫైల్‌పై చర్చకు మేము సిద్ధంగా ఉన్నామన్నారు. చర్చకు కేటీఆర్ వస్తాడని.. దమ్ముంటే రేవంత్ రెడ్డి చర్చ పెట్టాలన్నారు. చర్చ పెట్టమంటే సభ వాయిదా వేసి పారిపోతున్నారని ఎద్దేవా చేశారు. అసెంబ్లీలో మా గొంతు నొక్కినా ప్రజా క్షేత్రంలో పోరాటం చేస్తామని ఆయన అన్నారు.
యువకుడితో రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడ్డ భార్య.. భర్త ఏం చేశాడంటే..!
భార్యాభర్తల సంబంధం రోజురోజుకు దిగజారిపోతుంది. కలకాలం కలిసుండాల్సిన దంపతులు.. మధ్యలో పెడదారిన పడుతున్నారు. దీంతో కుటుంబ వ్యవస్థ చిన్నాభిన్నం అయిపోతుంది. క్షణిక సుఖం కొందరు అడ్డదారులు తొక్కి.. మధ్యలోనే జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. తాజాగా ఓ వివాహిత.. యువకుడితో అక్రమ సంబంధం పెట్టుకుంది. ఏకాంతంగా ఉన్న సమయంలో భర్త కంట్లో పడ్డారు. దీంతో కోపోద్రేకుడైన భర్త ఘాతుకానికి పాల్పడ్డాడు. ఈ దారుణం దేశ రాజధాని ఢిల్లీలో చోటుచేసుకుంది. ఢిల్లీలోని శాస్త్రి పార్క్ ప్రాంతంలో ఓ వివాహిత కుటుంబం నివాసం ఉంటుంది. ఆమె.. 21 ఏళ్ల యువకుడైన రితిక్ వర్మతో వివాహేతర సంబంధం పెట్టుకుంది. అయితే సోమవారం ఉదయం 11 గంటల ప్రాంతంలో వివాహిత.. యువకుడితో ఏకాంతంగా ఉంది. అదే సమయంలో భర్త ఇంటికొచ్చాడు. దీంతో ఇద్దరిని రెడ్‌హ్యాండెడ్ పట్టుకున్నాడు. ఈ పరిణామంతో భర్త కోపంతో రగిలిపోయాడు. మరికొందరి సాయంతో యువకుడిని తీవ్ర చిత్రహింసలకు గురిచేశాడు. అతడి గోళ్లు కూడా పీకేశారు. రితిక్ వర్మతో పాటు వివాహితను కూడా దారుణంగా కొట్టారు. అయితే తీవ్రగాయాలు కావడంతో రితిక్ వర్మ ప్రాణాలు కోల్పోయాడు.
వనౌటు ద్వీపాన్ని వణికించిన భారీ భూకంపం.. పలు ఎంబసీ కార్యాలయాలు ధ్వంసం
పసిఫిక్ ద్వీపమైన వనౌటును భారీ భూకంపం హడలెత్తించింది. రిక్టర్ స్కేల్‌పై తీవ్రత 7.3గా నమోదైంది. దీంతో పలు భవనాలు కంపించిపోయాయి. భారీగా ఆస్తులు ధ్వంసమయ్యాయి. ఈ ఘటనలో ఒకరు మృతిచెందగా.. పలువురు గాయపడినట్లుగా తెలుస్తోంది. దక్షిణ పసిఫిక్ మహాసముద్రంలోని వనౌటులో మంగళవారం దేశంలోని అతిపెద్ద నగరమైన పోర్ట్ విలా నుంచి పశ్చిమాన 57 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రాన్ని గుర్తించారు. భూకంపం తర్వాత అదే ప్రాంతంలో 5.5 తీవ్రతతో పలుమార్లు ప్రకంపనలు నమోదైనట్లు తెలుస్తోంది. అయితే పలుచోట్ల వీధుల్లో మృతదేహాలు పడి ఉన్నాయని ప్రత్యక్ష సాక్షులు చెప్పారు. కానీ అధికారికంగా ఎలాంటి ప్రకటన రాలేదు. అయితే రాజధాని పోర్ట్ విలాలో పలు భవనాలు తీవ్రంగా దెబ్బతిన్నట్లుగా వీడియోలు వైరల్ అవుతున్నాయి. యూఎస్, యూకే, ఫ్రెంచ్ రాయబార కార్యాలయాలు తీవ్రంగా దెబ్బతిన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇందుకు సంబంధించిన వీడియోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. యూఎస్ జియోలాజికల్ సర్వే ప్రకారం.. స్థానిక కాలమానం ప్రకారం మధ్యాహ్నం 12:47 గంటలకు ప్రధాన ద్వీపం ఎఫేట్ తీరానికి దాదాపు 30 కిమీ దూరంలో 57 కిమీ లోతులో ఈ ప్రకంపనలు సంభవించినట్లుగా తెలిపింది. ఇక భూకంప దృశ్యాలు సీసీటీవీ కెమెరాల్లో రికార్డ్ అయ్యాయి.
ఎస్‌బిఐలో ఉద్యోగాల జాతర.. ఏకంగా 13,735 క్లర్క్ ఉద్యోగాలకు నోటిఫికేషన్
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా జూనియర్ అసోసియేట్ (కస్టమర్ సపోర్ట్ అండ్ సేల్స్) భారీ రిక్రూట్‌మెంట్‌ను ప్రకటించింది. బ్యాంకింగ్ రంగంలో కెరీర్‌ను సంపాదించాలనుకునే అభ్యర్థులకు ఇది సువర్ణావకాశం. ఎస్‌బిఐ బ్యాంక్ 13,735 క్లర్క్ పోస్టుల కోసం దరఖాస్తులను ఆహ్వానించింది. ఎస్‌బిఐ క్లర్క్ రిక్రూట్‌మెంట్ కోసం దరఖాస్తు ప్రక్రియ ఆన్‌లైన్‌లో మొదలైంది. ఆసక్తి గల అభ్యర్థులు ఎస్‌బిఐ అధికారిక వెబ్‌సైట్ sbi.co.in ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. ఆసక్తి గల అభ్యర్థులు 17 డిసెంబర్ 2024 నుండి 7 జనవరి 2025 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఎస్‌బిఐ ఈ రిక్రూట్‌మెంట్ డ్రైవ్ కింద 13,735 పోస్టులను రిక్రూట్ చేస్తుంది. ఇందులో కేటగిరీ వారీగా ఖాళీల వివరాలు ఇలా ఉన్నాయి. ఇందులో జనరల్ లో 5870 పోస్టులు, EWS కింద 1361 పోస్టులు, OBCకి 3001 పోస్టులు, SC కింద 2118 పోస్ట్‌లు, ST కింద 1385 పోస్ట్‌లు ఉన్నాయి. దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుండి గ్రాడ్యుయేషన్ డిగ్రీని కలిగి ఉండాలి. అలాగే వయస్సు పరిమితిని 20 నుండి 28 సంవత్సరాలుగా అధికారులు నిర్ణయించారు. ఇకపోతే, ఎస్‌బిఐ క్లర్క్ రిక్రూట్‌మెంట్ కోసం ఎంపిక ప్రక్రియ మూడు దశల్లో నిర్వహించబడుతుంది. అందులో ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ (ఆన్‌లైన్), మెయిన్ ఎగ్జామినేషన్ (ఆన్‌లైన్), లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ టెస్ట్ ఉంటాయి.
ఉమెన్స్ ప్రీమియర్ లీగ్‌కు కడప జిల్లా విద్యార్థిని.. హర్షం వ్యక్తం చేస్తున్న తల్లిదండ్రులు
కడప జిల్లాకు చెందిన ఓ గ్రామీణ విద్యార్థిని స్టార్ క్రికెటర్లతో కలిసి ఆడే అవకాశం వచ్చింది. తాజాగా జరిగిన ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ 2025 టోర్నమెంట్ వేలంలో ఈ విద్యార్థిని అమ్ముడుపోయింది. రూ. 55 లక్షల పారితోషకంతో ఢిల్లీ క్యాపిటల్స్ శ్రీ చరణి అనే విద్యార్ధిని సొంతం చేసుకుంది. శ్రీ చరణి ఆంధ్రప్రదేశ్‌కు చెందిన అమ్మాయి. కడప జిల్లా వీరపనేని మండలం ఎర్రమల్లె గ్రామానికి చెందిన విద్యార్థిని. ఓ సాధారణ కుటుంబానికి చెందిన శ్రీ చరణి.. ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ 2025లో ఆడబోతుంది. శ్రీ చరణి తండ్రి చంద్రశేఖర్ రెడ్డి.. రాయలసీమ థర్మల్ పవర్ ప్రాజెక్టులో చిరు ఉద్యోగిగా పనిచేస్తున్నాడు. కాగా.. ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ మ్యాచ్‌కు తమ కుమార్తె సెలెక్ట్ కావడంపై తల్లిదండ్రులు, బంధువులు, గ్రామాస్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. 2025లో జరిగే మూడో సీజన్ కోసం బెంగుళూరులో మెగా వేలం నిర్వహించారు. ఈ మెగా వేలంలో మొత్తం 120 మంది ఆటగాళ్లు పాల్గొన్నారు. అందులో 91 మంది భారతీయులు ఉండగా.. 29 మంది విదేశీయులు ఉన్నారు. మొత్తం ప్లేయర్లలో ముగ్గురు అసోసియేట్ నేషన్స్‌కు చెందినవారు ఉన్నారు. భారత ఆటగాళ్ల విషయానికి వస్తే.. 82 మంది అన్‌క్యాప్, 9 మంది క్యాప్‌లో ఉన్నారు. ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ మొదటి సీజన్‌లో ముంబై ఇండియన్స్ టైటిల్ గెలుచుకుంది. రెండో సీజన్ టైటిల్‌ను రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) సొంతం చేసుకుంది. కాగా.. ఈ రెండు సీజన్లలో ఢిల్లీ క్యాపిటల్స్ రెండో స్థానంలో నిలిచింది.
శృతి హాసన్ తప్పుకుంటుందా? తప్పిస్తున్నారా?
శృతిహాసన్ గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. కమల్ హాసన్ కుమార్తెగా సినీ ప్రపంచానికి పరిచయమైన ఆమె తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకుంది. మధ్యలో ప్రేమ వ్యవహారం నడిపి సినీ పరిశ్రమకు పూర్తిగా దూరమైన ఆమె ఆ తర్వాత మళ్లీ సినిమాల్లో బిజీ అయింది. చివరిగా ఆమె ప్రభాస్ హీరోగా నటించిన సలార్ సీజ్ ఫైర్ పార్ట్ వన్ లో కనిపించింది. తర్వాత అడివి శేష్ హీరోగా నటిస్తున్న డెకరేట్ సినిమాలో నటించాల్సి ఉంది కానీ యాటిట్యూడ్ కారణాలు అని చెబుతూ ఆమె తప్పుకున్నట్లు తెలుస్తోంది. ఆమె స్థానంలో మృణాల్ ఠాకూర్ ను రంగంలోకి దించారు. అయితే ఆమె కేవలం డెకాయిట్ సినిమా మాత్రమే కాదు మరో రెండు సినిమాల నుంచి కూడా తప్పుకున్నట్లు తెలుస్తోంది. అందులో ఒకటి కన్నడ సినిమా కాగా మరొకటి ఇంటర్నేషనల్ లెవెల్ లో తెరకెక్క వలసిన చెన్నై స్టోరీ అనే సినిమా. అయితే సినిమాల నుంచి ఆమె తప్పుకుంటుందా లేక తప్పిస్తున్నారా అనే విషయం మీద మాత్రం క్లారిటీ లేదు. ఎందుకంటే శృతిహాసన్ తో పనిచేయడం చాలా కష్టమని ఆమెతో సినిమాలు చేసిన నటీనటులు చెబుతున్నారు. ఒకసారి ఆ కారణం వల్లే ముందుగా తెలియక ఆమెను తీసుకున్నా సరే విషయం అర్థమైన తర్వాత ఆమెను సైడ్ పెడుతున్నట్టుగా ప్రచారం జరుగుతోంది. మొత్తం మీద ఏదైతేనేం ఆమెను తప్పిస్తేనేమిటి? తప్పుకుంటేనేమిటి? మొత్తానికి ఆమె సినిమాల నుంచి పూర్తిగా పక్కకు వచ్చేస్తున్న మాట వాస్తవం. ఈ విషయాన్ని సరిదిద్దుకోకపోతే తన తండ్రి కమలహాసన్ లాగా లాంగ్ రన్ అయితే ఇక్కడ కష్టమే. ఎందుకంటే హీరోయిన్లకు మామూలుగానే టైం పీరియడ్ తక్కువ ఉంటుంది. దానికి తోడు ఇలాంటి కంప్లైంట్స్ వస్తే సినిమాలు ఆమెకు లభించే అవకాశం అయితే కష్టమే అని చెప్పవచ్చు.
అమెరికాలో రామ్ చరణ్ అయ్యప్ప దీక్ష విరమణ
తెలుగు హీరోలలో రామ్ చరణ్ తేజ ప్రతి ఏడాది అయ్యప్ప మాల ధరిస్తాడు అన్న సంగతి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ ఏడాది కూడా ఆయన అయ్యప్ప మాల ధారణ చేశారు. ఆయన చేసిన గేమ్ చేంజర్ సినిమా వచ్చే ఏడాది సంక్రాంతి సందర్భంగా ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రంగం సిద్ధమవుతోంది. అయితే ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా మునుపెన్నడూ లేని విధంగా ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ని అమెరికాలో డిసెంబర్ 21వ తేదీన నిర్వహించేందుకు సిద్ధం చేశారు. డల్లాస్ నగరంలో ఈ ఈవెంట్ జరగనుండగా ఈ ఈవెంట్ కోసం రామ్ చరణ్ తేజ అమెరికా వెళ్ళబోతున్నారు. రామ్ చరణ్ తేజ్ తో పాటు ఈ సినిమా నిర్మాత దిల్ రాజు తో, దర్శకుడు శంకర్, ఎస్.జే సూర్య వంటి వారు కూడా అక్కడికి వెళ్ళబోతున్నారు. సుమ యాంకర్ గా వ్యవహరించబోతున్న ఈ కార్యక్రమం కోసం అమెరికాలోని డల్లాస్ నగరంలో భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. అయితే ఈ క్రమంలో ఒక ఆసక్తికర అంశం తెలిసింది. అదేంటంటే ప్రస్తుతానికి రామ్ చరణ్ తేజ అయ్యప్ప దీక్షలో ఉన్నారు. అయ్యప్ప మాల విసర్జన సమయానికి ఆయన అమెరికాలో ఉంటారు. అక్కడే డల్లాస్ లోని అయ్యప్ప స్వామి దేవాలయంలో రాంచరణ్ తేజ దీక్ష విరమణ చేయబోతున్నారు అని తెలుస్తోంది. దీక్ష విరమణ అనంతరం రెగ్యులర్ అవుట్ ఫిట్ లోనే ఆయన ఫ్రీ రిలీజ్ ఈవెంట్ లో కనిపించబోతున్నట్లుగా తెలుస్తోంది. ఇక ఈ సినిమాలో రామ్ చరణ్ తేజ సరసన కియారా అద్వానీ హీరోయిన్ గా నటించింది. శ్రీకాంత్ సహా పలువురు సీనియర్ నటీనటులు ఈ సినిమాలో భాగమయ్యారు. సంక్రాంతి టార్గెట్గా ఈ సినిమా బరిలోకి దిగుతున్న నేపథ్యంలో భారీ వసూళ్లు నమోదు చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి.