Site icon NTV Telugu

Top Headlines @ 5 PM: టాప్‌ న్యూస్‌

Top Headlines @ 5 Pm New

Top Headlines @ 5 Pm New

బెజవాడలో కలకలం.. సిటీ నడిబొడ్డున ఇద్దరు యువకుల దారుణ హత్య..
విజయవాడలో పట్టపగలే.. నగర నడిబొడ్డున ఇద్దరు యువకులు దారుణ హత్యకు గురయ్యారు.. రక్తపు మడుగులో పడి ఉన్న రెండు మృతదేహాలు చూసి స్థానికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు.. కత్తితో పొడిచి హత్య చేసినట్టుగా భావిస్తున్నారు పోలీసులు.. అయితే, హత్య జరిగిన రోడ్డు నుంచి ఓ యువకుడు పరారైనట్టు గుర్తించారు పోలీసులు.. అతనే హంతకూడా..? లేక వేరే వారా..? అని విచారణ ప్రారంభించగా.. రెండు హత్యలు చేసింది కూడా రౌడీ షీటర్‌గా గుర్తించారు బెజవాడ పోలీసులు.. టూ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న కిషోర్ అనే రౌడీ షీటర్ ఈ రెండు హత్యలు చేసి పరారైనట్టుగా పోలీసులు చెబుతున్నారు.. హత్యకు గురైన వారు క్యాటరింగ్ పని చేసే యువకులుగా తేల్చారు.. అయితే, మృతులు మద్యం మత్తులో ఉన్నట్టు గుర్తించారు పోలీసులు.. మొదట ఎవరు హత్య చేసేశారని విషయంపై క్లారిటీ రాకపోగా.. చివరకు ఈ కేసు కీలక మలుపు తీసుకుంది.. రెండు హత్యలు చేసింది రౌడీషీటర్‌గా గుర్తించారు.. ఇక, హత్యకు గురైన యువకులు విజయనగరం, విజయవాడకు చెందిన వారిగా చెబుతున్నారు.. మొత్తంగా విజయవాడలో రెండు హత్యలు స్థానికంగా తీవ్ర కలకలం రేపుతున్నాయి.. అయితే, గవర్నర్ పేటలో క్యాటరింగ్ చేసే యువకులు ఓ ఇంట్లో అద్దెకు ఉంటుండగా.. వీరి దగ్గరికి వచ్చిన రౌడీ షీటర్‌ కిషోర్.. వాగ్వాదానికి దిగాడని.. గొడవ ముదరడంతో కత్తితో ఇద్దరు యువకులను దారుణంగా పొడిచి హత్య చేసినట్టుగా చెబుతున్నారు.. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన బెజవాడ పోలీసులు.. రౌడీ షీటర్ కిషోర్ కోసం గాలింపు చర్యలు చేపట్టారు..

ఇంటర్ విద్యార్థిని వైష్ణవి హత్య కేసులో ట్విస్ట్.. కీలక అంశాలు వెల్లడించిన డీఐజీ..
కడప జిల్లా గండికోటలో జరిగిన ఇంటర్ విద్యార్థిని వైష్ణవి హత్య కేసులో కొత్త ట్విస్ట్‌ వచ్చి చేరింది.. విద్యార్థిని వైష్ణవిని ప్రియుడు లోకేష్‌ హత్య చేశాడని మృతురాలి కుటుంబ సభ్యులు ఆరోపిస్తుండగా.. అసలు, మైనర్ బాలిక హత్య కేసులో ప్రియుడు లోకేష్ ప్రమేయం లేదని కర్నూల్ డీఐజీ కోయ ప్రవీణ్ స్పష్టం చేశారు.. ఇక, ఆ బాలికపై రేప్ అటెంప్ట్ కూడా జరగలేదని హత్య మాత్రమే జరిగినట్లు ఆయన పేర్కొన్నారు… నిన్నటి నుండి మైనర్ బాలికను ఆమె ప్రియుడు లోకేష్ పల్సర్ బైక్ పై ఎక్కించుకుని గండికోటకు వెళ్లిన సీసీ ఫుటేజ్ ఆధారంగా అతనే ఆమెను హత్య చేసి ఉంటాడని కుటుంబ సభ్యులు అనుమానిస్తూ వచ్చారు.. లోకేష్ తమ కుమార్తెను హత్య చేశాడని వైష్ణవి తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు కూడా చేశారు. ఈ కోవలో పోలీసులు లోకేషను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు.. అయితే, ఈ రోజు మధ్యాహ్నం పోలీసులకు వైష్ణవి హత్యపై కీలక సమాచారం లభించినట్లు తెలుస్తోంది.

‘తల్లికి వందనం’ అమ్మకు వద్దు.. నాన్నకు ఇవ్వండి..! చిన్నారుల విజ్ఞప్తి
తూర్పుగోదావరి జిల్లా సీతానగరం మండలం బొబ్బిలంక గ్రామంలో అక్కాచెల్లెళ్ల వినూత్న ఆలోచనతో అధికారులు ఆశ్చర్యానికి గురయ్యారు.. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన తల్లికి వందన పథకం అమ్మ నుంచి పథకం ద్వారా వచ్చే డబ్బులు మా నాన్నకు ఇవ్వండి అంటూ అక్కాచెల్లెళ్లు అధికారులకు వినతి పత్రాలు సమర్పించారు. ఐదేళ్లుగా నాన్న వద్ద ఉంటున్నామని.. తల్లి తమను వదిలి వెళ్లిపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు.. అంతేకాదు, ప్రతిసారి మాకు రావాల్సిన ప్రభుత్వ పథకాలు అమ్మకే వెళ్తున్నాయి.. కానీ, మా చదువుకు, అవసరాల కోసం ఎన్ని సార్లు అడిగినా డబ్బులు ఇవ్వడం లేదంటూ ఆవేదన చెందారు. స్థానిక ఎంపీడీవో కార్యాలయం, పీజీఆర్ఎస్ కార్యాలయం, పోలీస్ స్టేషన్ వద్ద కూడా అర్జీలను ఇచ్చామని బాధిత అక్కా చెల్లెలు వాపోయారు. మరి విద్యార్థినుల అభ్యర్థనపై అధికారులు ఎలాంటి చర్యలు తీసుకుంటారో చూడాలి..

కడప జిల్లాలో ఉప ఎన్నికల నిర్వహణకు రంగం సిద్ధం..
కడప జిల్లాలో ఖాళీగా ఉన్న జడ్పీటీసీ స్థానాలకు ఉప ఎన్నికల నిర్వహణకు అధికారులు రంగం సిద్ధం చేశారు. రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు ఖాళీగా ఉన్న పులివెందుల, ఒంటిమిట్ట జడ్పీటీసీ స్థానాలకు ఉప ఎన్నికలు నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తి చేస్తున్నారు అధికారులు.. ఉప ఎన్నికల కోసం సంబంధిత మండలాల్లో ఓటర్ల జాబితాలను అధికారులు సిద్ధం చేశారు. పులివెందుల మండలంలో మొత్తం 10,601 ఓట్లు నమోదయ్యాయి.. ఒంటిమిట్ట మండలంలో 24,606 ఓట్లు ఉన్నట్టు అధికార వర్గాలు వెల్లడించాయి. ఎన్నికల నిర్వహణకు అవసరమైన పోలింగ్ కేంద్రాల గుర్తింపు కూడా పూర్తయింది. పులివెందులలో 15 పోలింగ్ కేంద్రాలు, ఒంటిమిట్టలో 30 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేయనున్నారు. పోలింగ్ కేంద్రాలపై అభ్యంతరాలు ఉన్నవారు.. జులై 19వ తేదీ వరకు అభ్యంతరాలను సమర్పించవచ్చు. అదే రోజు సాయంత్రంలోగా తుది పోలింగ్ కేంద్రాల జాబితా ప్రకటించనున్నట్టు అధికారులు తెలిపారు. ప్రస్తుత పరిస్థితుల్లో ఏ క్షణమైనా ఉప ఎన్నికల నోటిఫికేషన్ విడుదలయ్యే అవకాశముందని జిల్లా పరిషత్ వర్గాలు పేర్కొన్నాయి.

బీసీ రిజర్వేషన్లు బీజేపీకి ఇష్టం లేదు.. సీతక్క కామెంట్స్
బీజేపీపై మంత్రి సీతక్క హాట్ కామెంట్స్ చేశారు. తాము బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు తీసుకొస్తుంటే బీజేపీ జీర్ణించుకోలేకపోతోందన్నారు. బీసీల రిజర్వేషన్లకు బీజేపీ ఎప్పుడూ వ్యతిరేకమే అని ఫైర్ అయ్యారు. బీసీల సాధికారత కోసం కాంగ్రెస్ కట్టుబడి ఉందన్నారు. ఎట్టి పరిస్థితుల్లో బీసీలకు రిజర్వేషన్లు రావాలన్నారు మంత్రి సీతక్క. ఈ సందర్భంగా తన శాఖ పరిధిలోని అంశాలపై, ఇతర ప్రభుత్వ పథకాలపై మాట్లాడారు. బడి పిల్లల యూనిఫార్మ్ ల ద్వారా మహిళ సంఘాలకు 30 కోట్లు ఆదాయం వచ్చిందని తెలిపారు సీతక్క. తమ ప్రభుత్వం మహిళలకు ఉచిత బస్సు ప్రయాణమే కాకుండా ఆ బస్సులకు ఓనర్లను కూడా చేస్తోందన్నారు. అంబానీ లాంటి కోటీశ్వర్లు నడిపే సోలార్ ప్లాంట్లు కూడా మహిళ సంఘాలకు ఇస్తున్నామని వివరించారు.

మేడిగడ్డమీద కూర్చుని చర్చిద్దాం.. రేవంత్ కు కేటీఆర్ సవాల్..
రేవంత్ రెడ్డికి మాజీ మంత్రి కేటీఆర్ సవాల్ విసిరారు. సీఎం రేవంత్ రెడ్డి పదే పదే మేడిగడ్డ బరాజ్ కూలిందంటున్నారు.. దమ్ముంటే అదే మేడిగడ్డ మీద కూర్చుని చర్చపెడుదాం వస్తావా అంటూ సవాల్ విసిరారు మాజీ మంత్రి కేటీఆర్. తెలంగాణ భవన్ లో బుధవారం జరిగిన దళిత బంధు సాధన సమితి సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ మధ్య సీఎం రేవంత్ రెడ్డి తన తప్పులను కప్పి పుచ్చుకోవడానికి పదే పదే మేడిగడ్డ కూలిందంటున్నాడు. ఆయన ఆరోపణలకు మేం క్లారిటీ ఇస్తాం. రేవంత్ రెడ్డి కూలిందంటున్న మేడిగడ్డ బరాజ్ మీదకే చర్చకు రావాలి. దమ్మంటే రేవంత్ మేము విసిరిన సవాల్ స్వీకరించాలి. మమ్మల్ని చర్చకు రావాలంటూ పారిపోయిన పిరికి వ్యక్తి రేవంత్ రెడ్డి అన్నారు కేటీఆర్.

కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయాలు – రైతులకు గుడ్ న్యూస్!
ఢిల్లీలో ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ అధ్యక్షతన ఇవాళ జరిగిన కేబినెట్ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నట్లు కేంద్రమంత్రి అశ్విని వైష్ణవ్ మీడియాకు తెలిపారు. ఈ సమావేశంలో మొదటగా యాక్డియం 4 మిషన్ సక్సెస్, శుభాంశు శుక్లాను కేబినెట్ అభినందించిందన్నారు. అలాగే, రైతుల అభ్యున్నతి కోసం తమ ప్రభుత్వం ప్రత్యేక చొరవ తీసుకుందన్నారు. ప్రధాని ధన్‌ధాన్య కృషి యోజన పథకానికి మంత్రి మండలి ఆమోదం తెలిపిందన్నారు. ఈ పథకం ద్వారా దేశ వ్యాప్తంగా ఉన్న కోట్ల మంది రైతులకు ప్రత్యక్ష్యంగా లబ్ధి చేకూరేలా ఏడాదికి 24,000 కోట్ల రూపాయలు అందజేస్తామని కేంద్రమంత్రి అశ్విని వైష్ణవ్ పేర్కొన్నారు.

వామ్మో మళ్లీ విజృంభిస్తున్న కరోనా..
ప్రపంచ దేశాలను వణికించిన కరోనా మహమ్మారి లక్షలాది మంది ప్రాణాలను బలి తీసుకుంది. సకాలంలో వ్యాక్సిన్లు అందుబాటులోకి రావడంతో ప్రపంచ దేశాలు ఒక్కసారిగా ఊపిరి పీల్చుకున్నాయి. లేకుంటే మరింత ప్రాణ నష్టం జరిగేది. అయితే, తాజాగా అగ్రరాజ్యం అమెరికాలో కరోనా వైరస్ మరోసారి విజృంభిస్తుండటం కలకలం రేపుతుంది. గత కొన్ని రోజులుగా యూఎస్ లో కోవిడ్ బారిన పడుతున్న వారి సంఖ్య క్రమంగా పెరిగిపోతుంది. ప్రస్తుతం అమెరికాలో సమ్మర్ కావడంతో, సెలవులను ఎంజాయ్ చేసేందుకు పెద్ద ఎత్తున ప్రయాణాలు చేస్తున్నారు ప్రజలు. తీర ప్రాంతాలు, టూరిస్టు ప్రదేశాలకు తరలిపోవడంతో ఈ వైరస్ మరింత వేగంగా వ్యాపిస్తోందని సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ తెలియజేసింది.

మిడ్ రేంజ్ లో ఏ ఫోన్ బెస్ట్..? ఎందుకు..?
ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్‌లు అయిన వన్‌ప్లస్, మోటరోలా తమ మిడ్ రేంజ్ స్మార్ట్‌ఫోన్ సిరీస్‌లో నూతన మోడళ్లను విడుదల చేశాయి. వాటిలో వన్‌ప్లస్ నార్డ్ CE5, మోటోరోలా ఎడ్జ్ 60 ఫుజన్ భారత మార్కెట్లో ప్రధాన ఆకర్షణగా నిలిచాయి. ఇవి రెండూ అత్యాధునిక ఫీచర్లతో, మంచి పనితీరుతో వినియోగదారుల ఆసక్తిని రేపుతున్నాయి. అయితే, మీ అవసరాలకు అనుగుణంగా ఏ ఫోన్ మంచి ఎంపిక అవుతుందో పూర్తి వివరాలతో ఒకసారి చూసేద్దాం.. వన్‌ప్లస్ నార్డ్ CE5 ఫోన్‌లో 6.77 అంగుళాల FHD+ AMOLED డిస్‌ప్లే ఉంది. ఇది 120Hz రిఫ్రెష్ రేట్‌ను సపోర్ట్ చేయడమే కాకుండా, 1430 నిట్స్ పీక్ బ్రైట్నెస్‌ను అందిస్తుంది. ఈ డిస్‌ప్లే గేమింగ్, వీడియోలు, స్మూత్ స్క్రోలింగ్ కోసం అనుకూలంగా ఉంటుంది. ఇక మరోవైపు, మోటరోలా Edge 60 Fusion ఫోన్‌లో 6.7 అంగుళాల కర్వ్డ్ pOLED డిస్‌ప్లే ఉంటుంది. ఇది కూడా 120Hz రిఫ్రెష్ రేట్‌ను అందిస్తుంది. కర్వ్డ్ డిస్‌ప్లే కారణంగా Edge 60 Fusion కి ప్రీమియం లుక్, హ్యాండ్ ఫీల్ లభిస్తోంది. మొత్తంగా, స్క్రీన్ పరిమాణం, బ్రైట్నెస్ పరంగా Nord CE5 మెరుగ్గా కనిపించినా.. రూపం, డిజైన్ పరంగా Edge 60 Fusion ముందుంది.

బ్యాటింగే కాదు.. బౌలింగ్ లోను రప్ప రప్పా.. మరో రికార్డ్ సృష్టించిన ఐపీఎల్ చిచ్చరపిడుగు..!
‘పిట్ట కొంచెం.. కూత ఘనం’ అనేలా ఐపీఎల్ చిచ్చరపిడుగు వైభ‌వ్ సూర్య‌వంశీ తన ఆట తీరును ప్రదర్శిస్తున్నాడు. కేవలం 14 ఏళ్ల వయసులోనే దేశం తరపున చరిత్ర సృష్టిస్తున్న వైభ‌వ్ ప్రస్తుతం ఇంగ్లాండ్ గడ్డపై యూత్ క్రికెట్‌లో తన ముద్ర వేస్తున్నాడు. కేవలం బ్యాటింగ్‌ లో మాత్రమే కాదు.. బౌలింగ్‌ లోనూ ఆకట్టుకుంటూ మరో అరుదైన రికార్డు తన ఖాతాలో వేసుకున్నాడు. తాజాగా ఇంగ్లాండ్ అండర్-19 జట్టుతో జరిగిన తొలి యూత్ టెస్టులో వైభవ్ సూర్యవంశీ అద్భుత ఆల్‌రౌండ్ ప్రదర్శన కనపరిచాడు.

నైజాం సొంత రిలీజ్ కాదు.. రంగంలోకి ‘’అమెరికా సుబ్బారావు’’
హరిహర వీరమల్లు థియేటర్ రైట్స్ వ్యవహారం ఎప్పటికప్పుడు హాట్ టాపిక్ అవుతుంది. ఈ సినిమాకి సంబంధించి నైజాంలో ముందు దిల్ రాజు, మైత్రి సంస్థలు రిలీజ్ చేసేందుకు పోటీ పడగా, చివరికి స్వయంగా ఏఎం రత్నం సినిమాని రిలీజ్ చేసుకుంటున్నారని వార్తలు వచ్చాయి. నిజానికి సినిమా మీద ఉన్న నమ్మకంతోనే రెండు తెలుగు రాష్ట్రాలలో కీలక ఏరియాలో అమ్మకుండా అడ్వాన్స్‌ల మీద పంపిణీ చేయిస్తున్నారని అన్నారు. కానీ ఇప్పుడు తాజాగా హరిహర వీరమల్లు నైజాంలో అమెరికా సుబ్బారావు డిస్ట్రిబ్యూట్ చేయబోతున్నట్లుగా తెలుస్తోంది. నిజానికి క్రౌన్ మూవీస్ బ్యానర్ మీద సుబ్బారావు నీలి శెట్టి అమెరికాలో సుపరిచితుడు.

సాంగేసుకుంటున్న చిరు, నయనతార
సినిమాలు షూటింగ్ చాలా వేగంగా చేస్తాడని పేరు ఉన్న అనిల్ రావిపూడి ఇప్పుడు మెగాస్టార్‌తో సినిమా కూడా అంతే వేగంగా పూర్తి చేస్తున్నాడు. అనుకున్న దానికంటే కాస్త ముందుగానే షూటింగ్ చేసేస్తున్నాడు. ప్రస్తుతం అనిల్ రావిపూడి దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి హీరోగా ఒక కామిక్ ఎంటర్టైనర్ సిద్ధమవుతోంది. ఇక తాజాగా ఈ సినిమాకి సంబంధించిన మూడవ షెడ్యూల్ ఈ రోజు నుంచి కేరళలో మొదలైంది. కేరళలోని అలప్పుజాలో మెగాస్టార్ చిరంజీవి, అయిన తార మీద ఒక సాంగ్ షూట్ చేస్తున్నాడు. రొమాంటిక్ సాంగ్‌గా చెప్పబడుతున్న ఈ సాంగ్‌ని భాను మాస్టర్ కొరియోగ్రఫీ చేస్తున్నాడు. అనంత శ్రీరామ్ లిరిక్స్ అందించిన ఈ సాంగ్ ఒక మెలోడియస్ రొమాంటిక్ నంబర్ అని అంటున్నారు.

Exit mobile version