Site icon NTV Telugu

Top Headlines @ 5 PM: టాప్‌ న్యూస్‌

Top Headlines @ 5 Pm New

Top Headlines @ 5 Pm New

జిల్లా కలెక్టర్లకు సీఎం చంద్రబాబు దిశానిర్దేశం
జిల్లా కలెక్టర్లకు కీలక అంశాలపై దిశానిర్దేశం చేశారు ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు.. సంక్షేమం, పీ4, సూపర్ సిక్స్ అంశాలపై కలెక్టర్ల కాన్ఫరెన్స్‌లో సమీక్షించిన ఆయన.. ఆర్ధికంగా ఇబ్బందులు ఉన్నా సంక్షేమానికి కూటమి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోంది.. సంక్షేమం – అభివృద్ధిని సమతూకంగా నిధులు వ్యయం చేస్తున్నాం.. మూలధన వ్యయం కూడా చేస్తూ అభివృద్ధి దిశగా అడుగులు వేస్తున్నాం.. ఇచ్చిన మాట ప్రకారం అన్నదాత సుఖీభవ పథకం, తల్లికి వందనం అందరికీ అందించాం అని తెలిపారు.. అయితే, ఆర్ధికసాయం లబ్దిదారులకు అందటంలో తలెత్తిన చిన్నచిన్న లోటు పాట్లను కలెక్టర్లు సరిదిద్దాలని సూచించారు.. ఇక, తొలి సంతకంగా చేసిన మెగా డీఎస్సీ కింద యువతకు 16,347 ఉద్యోగాలు వచ్చాయని తెలిపారు.. అయితే, జిల్లాల్లో యువతకు ఉద్యోగాలు వచ్చేలా జాబ్ మేళాలు ఏర్పాటు చేయాలన్నారు.. ప్రభుత్వ విభాగాల్లో ఖాళీలను గుర్తించి భర్తీ చేస్తాం.. అలాగే ప్రైవేటు రంగంలోనూ జాబ్స్ వచ్చేలా పెట్టుబడులు ఆకర్షిస్తున్నాం.. ఇప్పటికే 6 వేలకు పైగా పోలీసు విభాగంలో ఉద్యోగాలు ఇచ్చాం.. ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం స్త్రీశక్తి విజయవంతమైంది. ఈవీ బస్సుల ద్వారా ఖర్చు కూడా తగ్గుతుంది. బస్టాండ్లలో కమర్షియల్ కాంప్లెక్సుల ఏర్పాటు, కార్గో ద్వారా ఆదాయం సమకూర్చుకోవచ్చు అని వెల్లడించారు.

మహిళలతో ఎస్సై చిలిపి మాటలు.. ఆడియో లీక్‌.. ఇప్పటికే 8 మందితో ఎఫైర్‌.. నీ నంబర్‌ 9..!
గుంటూరు జిల్లాలో పోలీసు అధికారులు వరుస వివాదాల్లో చిక్కుకుంటున్నారు. గతంలో నగరంపాలెంలో పనిచేస్తున్న ఓ ఎస్సై.. మహిళతో న్యూడ్ వీడియో లీక్ కావడం కలకలం సృష్టించింది. తాజాగా మరో ఎస్సై ఓ మహిళతో మాట్లాడిన ఆడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ప్రస్తుతం వీఆర్ లో ఉన్న ఆ ఎస్సై.. మహిళతో అసభ్యంగా మాట్లాడాడు. ప్రస్తుతం నాకు ఎనిమిదిమంది మహిళలతో సంబంధం ఉంది. నువ్వు తొమ్మిదో దానివంటూ మాట్లాడాడు. ఈ విషయం ఎవ్వరికీ చెప్పడం లేదు.. నీకు మాత్రమే చెబుతున్నాను. నీతో షేర్ చేసుకోవాలనిపించింది. అందుకే చెబుతున్నానని చెప్పుకొచ్చాడు.. సరే ఇదే విషయాన్ని మహిళ ఎస్పీకి చెబుతానంటే ఆయన బాధల్లో ఉన్నాడని ఎస్సై చెప్పాడు. నీ ఇష్టం వచ్చినట్లు చేసుకో మహా అయితే సస్పెండ్ చేస్తారు.. అంతే కదా? అంటూ వీఆర్ లో ఉన్న ఆ ఎస్సై మహిళతో చెప్పడం సంచలనం సృష్టిస్తుంది. నువ్వు మాట్లాడుతున్న మాటలు రికార్డ్ చేస్తే ఏం చేస్తావని ఆ మహిళ ప్రశ్నిస్తే.. నువ్వు గతంలో కూడా రికార్డు చేశావు కదా? అంటూ సమాధానమిచ్చాడు. అక్కడితో ఆగని ఎస్సై తాను ఇక పోలీస్ డ్రెస్ వెయ్యనంటూ మహిళతో మాట్లాడాడు. నీకు వేరే ప్రాంతానికి బదిలీ చేస్తే అక్కడకు రమ్మంటావా..? అని అడిగితే.. తాను ఇక యూనిఫాం వెయ్యనని చెప్పడంతోపాటు రాజకీయాల్లోకి వస్తానని చెప్పడం సంచలనం సృష్టిస్తుంది. దీనిపైనే పోలీస్ డిపార్ట్‌మంట్‌లో తెగ చర్చ నడుస్తుంది.

చరిత్ర చెరిపేస్తే చెరగదు.. మెడికల్‌ కాలేజీల ఘనత జగన్‌దే..!
మెడికల్‌ కాలేజీల వ్యవహారంలో ఏపీలో పొలిటికల్‌ రచ్చ సాగుతూనే ఉంది.. ఈ అంశంపై స్పందించిన వైఎస్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి విడదల రజిని కీలక వ్యాఖ్యలు చేశారు.. చరిత్ర చెరిపేస్తే చెరగదు.. రాష్ట్ర చరిత్రలో ఒకేరోజు ఐదు మెడికల్ కళాశాలలు ప్రారంభించిన ఘనత మా నాయకుడు జగన్ కే దక్కుతుందన్నారు.. 8500 కోట్లతో 17 మెడికల్ కళాశాలలు తెచ్చేందుకు ప్రణాళికలు సిద్ధం చేసుకున్నాం.. యుద్ధ ప్రాతిపదికన కళాశాలల నిర్మాణం పూర్తి చేసి పేదలకు విద్య, వైద్యం అందుబాటులోకి తేవాలని చూసాం.. మూడు ఫేజ్ లలో 17 మెడికల్ కళాశాలల నిర్మాణం చేపట్టాలని రూట్ మ్యాప్ తో ముందుకు వెళ్ళాం. 500 కోట్లతో ఒక్కొక్క కళాశాల నిర్మాణం చేయాలని చూసాం. దీనిమీద అనేక బురదచల్లే ఆరోపణలు చేశారని మండిపడ్డారు.. కళాశాలలు అన్నీ రకాల ఫైనాన్సియల్ అసిస్టెన్స్ తోనే పనులు ప్రారంభించి ముందుకు వెళ్ళాం.. ప్రణాళికాబద్ధంగా పనులు పూర్తిచేసే దిశగా అడుగులు వేశాం. అన్ని అనుమతులు లేవని ఇవాళ అర్థరహిత ఆరోపణలు చేస్తున్నారని ఫైర్‌ అయ్యారు.

రాష్ట్రంలో వీధిదీపాల నిర్వహణకు కొత్త దిశ.. సీఎం రేవంత్ కీలక సూచనలు
రాష్ట్రంలో వీధిదీపాల ఏర్పాటు, నిర్వహణలో సమూల మార్పులు తీసుకురావాలని ముఖ్యమంత్రి ఏ. రేవంత్‌రెడ్డి స్పష్టం చేశారు. ఈ మేరకు ఐసీసీసీ (ఇంటిగ్రేటెడ్‌ కమాండ్‌ అండ్‌ కంట్రోల్‌ సెంటర్‌)లో మున్సిపల్‌, పంచాయతీ రాజ్‌, జీహెచ్‌ఎంసీ అధికారులతో ఆయన సోమవారం సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో సీఎం సలహాదారు వేమ నరేందర్‌రెడ్డి, సీఎంఓ ముఖ్య కార్యదర్శి శేషాద్రి, సీఎంఓ కార్యదర్శి మాణిక్‌ రాజ్‌, పంచాయతీ రాజ్‌ శాఖ ముఖ్య కార్యదర్శి ఎన్‌. శ్రీధర్‌, మున్సిపల్‌ శాఖ కార్యదర్శి శ్రీదేవి, కోర్‌ అర్బన్‌ ఏరియా మున్సిపల్‌ సెక్రటరీ ఇలంబర్తి, జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ ఆర్వీ కర్ణన్‌తో పాటు అనేక ఉన్నతాధికారులు పాల్గొన్నారు. సీఎం రేవంత్‌ రెడ్డి మాట్లాడుతూ, రాష్ట్రంలో వీధిదీపాల ఏర్పాటు, నిర్వహణ కోసం పెద్ద కంపెనీల నుండి టెండర్లను పిలవాలని సూచించారు. దీనివల్ల పారదర్శకత పెరిగి, సేవల నాణ్యత మెరుగుపడుతుందని ఆయన అభిప్రాయపడ్డారు. అలాగే, వీధిదీపాల కోసం సౌరశక్తి (Solar Power) వినియోగం సాధ్యాసాధ్యాలను లోతుగా పరిశీలించాలని అధికారులకు ఆదేశాలు ఇచ్చారు.

ఈసీ తప్పు చేస్తే మొత్తం ప్రక్రియను రద్దు చేస్తాం..
సుప్రీంకోర్టులో సోమవారం బీహార్‌లో ఓటర్ల జాబితా స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (SIR)పై విచారణ జరిగింది. జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ జోయ్‌మ్లయ బాగ్చిలతో కూడిన ధర్మాసనం మాట్లాడుతూ.. ఏ దశలోనైనా కేంద్ర ఎన్నికల సంఘం తప్పుడు పద్ధతిని అవలంబించిందని తేలితే, ఆ పరిస్థితిలో మొత్తం SIR ప్రక్రియను రద్దు చేస్తామని పేర్కొంది. బీహార్ SIRపై తాము ముక్కలుముక్కలుగా అభిప్రాయాన్ని ఇవ్వలేమని స్పష్టం చేసింది. బీహార్‌లోనే కాకుండా భారతదేశం అంతటా SIR ప్రక్రియకు వర్తిస్తుందని ధర్మాసనం తేల్చి చెప్పింది. బీహార్‌ ఓటర్ల జాబితాల SIR ప్రక్రియలో ఓటర్ల గుర్తింపు రుజువుగా ఆధార్ కార్డును ‘తప్పనిసరి’గా చేర్చాలని సెప్టెంబర్ 8న జరిగిన విచారణలో సుప్రీంకోర్టు ఆదేశించిన విషయం తెలిసిందే. ఈ ఉత్తర్వును సెప్టెంబర్ 9 నాటికి అమలు చేయాలని కోర్టు ఎన్నికల కమిషన్‌ను ఆదేశించింది. రాజ్యాంగంలోని ఆర్టికల్ 324 ప్రకారం ఓటర్ల జాబితాల తయారీ, ప్రతి రాష్ట్ర పార్లమెంటు, శాసనసభ ఎన్నికల నిర్వహణను పర్యవేక్షించడం, అక్కడ ఎటువంటి పొరపాట్లు జరగకుండా నియంత్రించడం ఈసీ బాధ్యత అని ఎన్నికల కమిషన్ తన కౌంటర్ అఫిడవిట్‌లో పేర్కొంది. “ఈ రాజ్యాంగ నిబంధన ఓటర్ల జాబితాల తయారీ, ఎన్నికల నిర్వహణకు సంబంధించిన అన్ని విషయాలలో కమిషన్ పూర్తి అధికారానికి ఆధారం” అని అఫిడవిట్‌లో పేర్కొంది. బీహార్‌లో SIR చెల్లుబాటుపై తుది వాదనలను వినిపించడానికి అక్టోబర్ 7కు సుప్రీంకోర్టు విచారణను వాయిదా వేసింది.

హిందూ మతంలో సమానత్వం ఉంటే.. మతం ఎందుకు మారుతున్నారు?
కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య మత మార్పిడులపై చేసిన వ్యాఖ్యలతో రాజకీయ వివాదం చెలరేగింది. హిందూ సమాజంలో సమానత్వం ఉంటే, ఎవరైనా ఎందుకు మతం మారుతారు? అని ఆయన అన్నారు. సమానత్వం ఉంటే, అంటరానితనం ఎందుకు వచ్చింది? మనం అంటరానితనాన్ని సృష్టించామా? అని ప్రశ్నించారు. ఇస్లాం, క్రైస్తవ మతం లేదా ఏ మతంలోనైనా అసమానతలు ఉండవచ్చని.. తాము లేదా బీజేపీ ఎవరినీ మతం మారమని అడగలేదన్నారు. కానీ ప్రజలు మతం మారుతున్నారని.. అది వారి హక్కు అన్నారు. ముఖ్యమంత్రి హిందూ మతాని లక్ష్యంగా చేసుకుని వ్యాఖ్యలు చేసినందుకు బీజేపీ నాయకులు మండిపడుతున్నారు. శాసనసభలో బీజేపీ ప్రతిపక్ష నాయకుడు ఆర్. అశోక సీఎం వ్యాఖ్యలపై విమర్శలు చేశారు. సమానత్వం అంశంపై మీరు ఎల్లప్పుడూ హిందూ మతాన్ని లక్ష్యంగా చేసుకుంటారు. సమానత్వంపై ముస్లింలను ప్రశ్నించే ధైర్యం మీకు ఉందా? అని ప్రశ్నించారు. పహల్గామ్ ఉగ్రవాద దాడి, మసీదులలో మహిళలపై ఆంక్షలు, ట్రిపుల్ తలాక్‌ను నిషేధించడానికి వ్యతిరేకత నిరసనలపై ప్రశ్నించారు.

పాక్ ఆర్మీ టార్గెట్‌గా ఐఈడీ పేలుడు.. స్పాట్‌లో ఎంత మంది చనిపోయారంటే..
పెద్దలు ఎప్పుడో చెప్పారు.. నువ్వు ఏం చేస్తే అదే నీకు తిరిగి వస్తుందని.. అచ్చం పాక్‌స్థాన్‌కు ఇప్పుడు అలాగే జరుగుతుంది. పాక్ పాలుపోసి పెంచిన ఉగ్రవాదాన్ని ప్రపంచం మీదకు ఉసిగొట్టిన పాపం ఇప్పుడు ఆ దేశాన్నే పట్టిపీడిస్తుంది. తాజాగా పాకిస్థాన్‌లో ఆ దేశ ఆర్మీ టార్గెట్‌గా ఐఈడీ బాంబు పేలుడు జరిగింది. ఈ దాడిలో స్పాట్‌లోనే ఐదుగురు పాక్ ఆర్మీ అధికారులు మరణించినట్లు సమాచారం. బలూచిస్థాన్‌లోని మాండ్లోలో పాకిస్థాన్ ఆర్మీ అధికారులు టార్గెట్‌గా ఐఈడీ పేలుడు సంభవించిన ఘటన వెలుగులోకి వచ్చింది. ఈ ప్రమాదంలో పాక్ సైన్యానికి చెందిన 5 మంది సైనికులు మరణించినట్లు సమాచారం. మాండ్లోని షాండ్ ప్రాంతంలో పాక్ ఆర్మీ ప్రయాణిస్తున్న ఒక వాహనాన్ని లక్ష్యంగా చేసుకుని ఈ పేలుడు జరిగింది. ఈ దాడిలో కెప్టెన్ వకార్ కాకర్, నాయక్ జునైద్, నాయక్ ఇస్మత్, లాన్స్ నాయక్ ఖాన్ ముహమ్మద్, సిపాయి జహూర్ మరణించారని అధికారులు పేర్కొన్నారు. పేలుడు తర్వాత ఈ ప్రాంతంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది.

Flipkart Big Billion Days 2025లో నథింగ్ ఫోన్ 3a, CMF ఫోన్ 2 ప్రో, నథింగ్ ఇయర్‌పై భారీ ఆఫర్స్!
ప్రముఖ ఈ-కామర్స్ ప్లాట్ ఫామ్ ఫ్లిప్ కార్ట్ సంవత్సరంలోనే అతిపెద్ద సేల్ అయిన బిగ్ బిలియన్ డేస్ సేల్ 2025ను సెప్టెంబర్ 23న ప్రారంభించనుంది. ఈ సేల్ లో వివిధ రకాల ఉత్పత్తులపై భారీ డిస్కౌంట్లు అందుబాటులో ఉంటాయి. ముఖ్యంగా స్మార్ట్ ఫోన్ లు వాటి సాధారణ మార్కెట్ ధరల కంటే తక్కువ ధరకు లభించనున్నాయి. ఈ సేల్ కు ముందుగానే నథింగ్ (Nothing)సంస్థ తన ఉత్పత్తులైన ఫోన్ 3a ప్రో, CMF ఫోన్ 2 ప్రో, నథింగ్ ఇయర్, ఇతర వాటిపై అందించే ఆఫర్లను ప్రకటించింది.

ఆ ఫ్లైట్ లో సౌందర్యతో పాటు నేనూ వెళ్లాలి.. మీనా కామెంట్స్
దివంగత స్టార్ హీరోయిన్ సౌందర్య ఫ్లైట్ యాక్సిడెంట్ లో చనిపోయిన విషయం తెలిసిందే. అప్పట్లో ఓ ఎన్నికల ప్రచారం కోసం వెళ్తున్న టైమ్ లో జరిగిన ప్రమాదంలో ఆమె కన్నుమూశారు. సౌత్ లో తిరుగులేని స్టార్ ఇమేజ్ సంపాదించుకున్న సౌందర్య.. క్రేజ్ ఉన్నప్పుడే మరణించారు. అయితే ఆమె ఫ్లైట్ యాక్సిడెంట్ గురించి తాజాగా సీనియర్ హీరోయిన్ మీనా స్పందించింది. జగపతి బాబు హోస్ట్ గా చేస్తున్న జయమ్ము నిశ్చయమ్మురా ప్రోగ్రామ్ కు ఆమె గెస్ట్ గా వచ్చారు. ఇందులో ఆమె మాట్లాడుతూ.. నేను పాప పుట్టిన రెండేళ్లకే సినిమాల్లోకి వెళ్లాల్సి వచ్చింది. దృశ్యం సినిమాను నన్ను దృష్టిలో పెట్టుకుని మలయాళంలో రాసుకున్నారు. వేరే వాళ్లతో చేయలేమని చెప్పడంతో చివరకు నేనే చేయాల్సి వచ్చింది. నా జీవితంలో ఎన్నో అనుకోని సంఘటనలు ఉన్నాయి. సినిమాలు కూడా అలాగే వచ్చాయి. దివంగత హీరోయిన్ సౌందర్య వెళ్లిన ఫ్లైట్ లోనే నేను కూడా ఎన్నికల ప్రచారానికి వెళ్లాల్సి ఉంది. కానీ నేను షూటింగ్ వల్ల నేను వెళ్లలేకపోయా. ఆ ఫ్లైట్ కు అలా జరిగిందని తెలుసుకుని చాలా బాధపడ్డా. నేను వెళ్లలేనందుకు సంతోషపడ్డాను. కానీ సౌందర్య వెళ్లిందని తెలుసుకుని చాలా బాధపడ్డాను అంటూ ఎమోషనల్ అయింది మీనా. తన భర్త చనిపోయే టైమ్ లో కూడా అస్సలు ఊహించలేదని తెలిపింది. అనుకోకుండా అలా జరిగేసరికి కోలుకోవడానికి నాకు టైమ్ పట్టింది. కానీ మంచి ప్రయత్నం ఎప్పుడూ మనల్ని ముందుకు నడిపిస్తుందనే నమ్మకం నాకు ఉంది. అదే నన్ను మళ్లీ సినిమాల్లో రాణించేలా చేస్తోంది అంటూ తెలిపింది మీనా.

విశాఖపట్నంలో ‘కలర్స్ హెల్త్ కేర్ 2.O’.. ప్రారంభించిన హీరోయిన్ సంయుక్త మీనన్
ప్రముఖ హెల్త్ కేర్ సంస్థ ‘కలర్స్ హెల్త్ కేర్’ (Kolors Healthcare) సంస్థ‌ విశాఖపట్నంలో తన నూత‌న‌ బ్రాంచ్‌ను ప్రారంభించింది. రామ్‌నగర్‌లో ఏర్పాటు చేసిన ‘కలర్స్ హెల్త్ కేర్ 2.O’ను హీరోయిన్ సంయుక్త మీనన్ ఆవిష్కరించారు. ఆధునిక సాంకేతికతతో రూపొందించిన సౌకర్యాలను ఆమె పరిశీలించి, నిర్వాహకుల ప్రయత్నాలను అభినందించారు. ఈ సందర్భంగా సంయుక్త మీనన్ మాట్లాడుతూ – “ఆక‌ర్ష‌ణీయ న‌గ‌రం విశాఖ‌ప‌ట్నంలోని ప్ర‌జ‌ల‌కు అందం, ఆరోగ్యం అందించేందుకు ‘కలర్స్ హెల్త్ కేర్ 2.O’ను ప‌రిచ‌యం చేయ‌డం గ‌ర్వ‌కార‌ణంగా ఉంది. నేను కెరీర్ స్టార్ట్ చేసిన‌ప్పుడు వెయిట్ లాస్‌కు ఇప్పుడున్నంత టెక్నాల‌జీ లేదు. హెల్తీ బాడీ అంటే స‌రైన మ‌జిల్స్ ఉండాలని ఇప్పుడు తెలుస్తుంది. ఇటీవ‌ల ట్రెక్కింగ్ కోసం మేఘాల‌యా వెళ్లాను. ఆ జ‌ర్నీ నేను చాలా ఎంజాయ్ చేశాను. బ్రీతింగ్ స‌మ‌స్య కూడా లేదు. కానీ అక్క‌డ కొంత మందిలో స‌రిగ్గా బ్రీతింగ్ లేదు, ఆరోగ్యం స‌హ‌క‌రించ‌లేదు. ప్ర‌పంచంలోని ప‌లు ప్ర‌దేశాల‌ను చూడాలి, ప్ర‌కృతిని ఎంజాయ్ చేయాలంటే హెల్త్‌ను మెంటాయిన్ చేయాలి. ప్ర‌తి ఒక్క‌రూ ఫిట్‌గా ఉండాలలి అస‌ర‌మైన ట్రీట్‌మెంట్ తీసుకోవాలి. నాణ్యమైన సేవలను ఆధునిక టెక్నాలజీతో అందిస్తున్న కలర్స్ హెల్త్ కేర్‌కు అభినందనలు. దేశ వ్యాప్తంగా విస్త‌రిస్తున్న కలర్స్ హెల్త్ కేర్.. ఇప్పుడు విశాఖ ప్ర‌జ‌ల చెంత‌కు రావ‌డం ఆనందంగా ఉంది” అని అన్నారు.

మన శంకర వరప్రసాద్ గారు పండక్కి పూర్తి చేస్తున్నారు!
ప్రముఖ దర్శకుడు అనిల్ రవిపూడి తన చిత్రాల షూటింగ్‌ను సమయానికి పూర్తి చేస్తాడని అందరికీ తెలుసు. లెంతీ షెడ్యూల్స్‌ను ప్లాన్ చేసి, ఎలాంటి పెద్ద బ్రేక్‌లు లేకుండా షూటింగ్‌ను పూర్తి చేసే అనిల్ తన తాజా చిత్రం ‘మన శంకర వర ప్రసాద్ గారు’ షూటింగ్‌ను కూడా అదే ఉత్సాహంతో ముందుకు తీసుకెళ్తున్నాడు. మెగాస్టార్ చిరంజీవి ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ చిత్రం, యూనియన్ సమ్మె కారణంగా కొంత ఇబ్బంది ఎదుర్కొన్నప్పటికీ, ప్రస్తుతం సక్రమంగా సాగుతోంది. అనిల్ రవిపూడి మరియు అతని బృందం అక్టోబర్ చివరి నాటికి మొత్తం షూటింగ్‌ను పూర్తి చేయాలని ప్రణాళిక వేస్తున్నారు. ఈ చిత్రం కోసం అక్టోబర్‌లో 25 రోజుల లెంతీ షెడ్యూల్‌ను ప్లాన్ చేశారు. ఈ షెడ్యూల్‌తో సినిమా షూటింగ్ పూర్తవుతుందని సమాచారం. అవసరమైతే, నవంబర్‌లో కొన్ని ప్యాచ్‌వర్క్ పనులు చేయడం జరుగుతుంది. సీనియర్ నటుడు వెంకటేష్ కూడా అక్టోబర్‌లో ఈ చిత్ర సెట్స్‌లో చేరనున్నారు. వెంకటేష్ తన సన్నివేశాలను ఒకే షెడ్యూల్‌లో పూర్తి చేయనున్నారు. అంతేకాదు, చిరంజీవితో కలిసి ఒక పాటలో కూడా వెంకటేష్ కనిపించనున్నారు.’మన శంకర వర ప్రసాద్ గారు’ ఒక సంపూర్ణ కుటుంబ వినోద చిత్రంగా తెరకెక్కుతోంది. ఈ సినిమా 2026 సంక్రాంతి పండుగ సందర్భంగా ప్రేక్షకుల ముందుకు రానుంది.

Exit mobile version