Site icon NTV Telugu

Top Headlines @ 5 PM: టాప్‌ న్యూస్‌

Top Headlines @ 5 Pm New

Top Headlines @ 5 Pm New

ఇండియాపై ట్రంప్ పెత్తనమేంటి..?
ఇండియాపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్ పెత్తనమేంటి..? అని మండిపడ్డారు సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి డి. రాజా.. ఆంధ్రప్రదేశ్‌ పర్యటనలో ఉన్న ఆయన.. తిరుపతిలో మాట్లాడుతూ.. ప్రధాని నరేంద్ర మోడీ నేతృత్వంలో భారతదేశం సురక్షితంగా లేదు.. అంటూ ఆందోళన వ్యక్తం చేశారు.. అయితే, భారత్ కు ట్రంప్ సలహాలు అవసరం లేదన్న ఆయన.. అసలు ఇండియాపై ట్రంప్ పెత్తనమేంటి..? అని నిలదీశారు.. మరోవైపు, అఖిలపక్షం ఏర్పాటు చేస్తే మోడీ ఎందుకు రావడం లేదు..? అని ప్రశ్నించారు.. అఖిలపక్ష సమావేశానికి వస్తే ప్రతిపక్షాలు ప్రశ్నిస్తారనే భయం ప్రధాని మోడీలో ఉందన్నారు రాజా.. ఉగ్రవాదులకు మేం వ్యతిరేకం అని స్పష్టం చేశారు డి. రాజా.. పహల్గామ్‌ ఉగ్రవాదుల దాడిలో భారతీయులపై దాడి బాధాకరమన్న ఆయన.. భారత్ లోకి ఉగ్రవాదులు ప్రవేశించేంత వరకు కేంద్ర నిఘా వర్గాలు ఏం చేశాయి..? అని ప్రశ్నించారు.. భారత్ లో పర్యాటకుల మృతిపై ప్రతిపక్షాల ప్రశ్నలకు ప్రధాని మోడీ సమాధానం చెప్పడం లేదని దుయ్యబట్టారు.. పహల్గామ్‌ ఘటనపై పార్లమెంట్ లో ప్రత్యేక చర్చ జరగాల్సిన అవసరం ఉందని.. చర్చ జరిగితే పార్లమెంటు వేదికగా మోడీని నిలదీస్తారని వ్యాఖ్యానించారు. ఇక, మావోయిస్టులపై కేంద్రప్రభుత్వం ప్రతాపం చూపిస్తానంటోంది.. ఉగ్రవాదులను పిలిచి మాట్లాడాలనుకునే కేంద్రం.. మావోయిస్టులను ఎందుకు పిలిచి మాట్లాడరు? అని ప్రశ్నించారు. చర్చలకు వస్తానంటున్న మావోయిస్టులను ఎందుకు చిన్నచూపు చూస్తున్నారని నిలదీశారు సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి డి. రాజా..

వల్లభనేని వంశీకి ఊహించని ఝలక్.. మరో కేసులో పీటీ వారెంట్‌..
వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ్ నేత, గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ మోహన్‌కు ఊహించని ఝలక్‌ తగిలినట్టు అయ్యింది.. వల్లభనేని వంశీపై హనుమాన్ జంక్షన్ పోలీసులు పీటీ వారెంట్ దాఖలు చేశారు.. వంశీపై మొత్తం ఆరు కేసులు నమోదు కాగా.. ఇప్పటికే ఐదు కేసుల్లో వంశీకి బెయిల్, ముందస్తు బెయిల్ మంజూరు అయ్యాయి. గన్నవరం టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో మాత్రం.. వంశీ బెయిల్ పిటిషన్ పై రేపు తీర్పు వెల్లడించనుంది కోర్టు.. అయితే, ఈ సమయంలో బాపులపాడులో నకిలీ ఇళ్ల పట్టాల పంపిణీ వ్యవహారంలో మాజీ ఎమ్మల్యే వల్లభనేని వంశీపై నమోదైన కేసులో ఇవాళ పోలీసులు పీటీ వారెంట్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ పై న్యాయమూర్తి ఇవాళ అనుమతి ఇస్తే.. వల్లభనేని వంశీకి రేపు బెయిల్ వచ్చినా.. జైలు నుంచి విడుదలయ్యే అవకాశం ఉండదన్నమాట… ఇవాళ పీటీ వారెంట్ పై న్యాయమూర్తి ఆదేశాలు ఇస్తారా..? లేదా రేపటికి వాయిదా పడుతుందా అనేది ఈ రోజు తేలిపోనుంది..

టర్కీ, అజర్‌బైజాన్‌లకు బిగ్‌ షాక్‌.. ఏపీ టూర్స్ & ట్రావెల్స్ అసోసియేషన్ సంచలన నిర్ణయం
పహల్గామ్‌ ఉగ్రదాడికి ప్రతీకారంగా ఇండియన్‌ ఆర్మీ ఆపరేషన్‌ సిందూర్‌ చేపట్టింది.. దీంతో, భారత్-పాకిస్థాన్ మధ్య యుద్ధమే జరిగింది.. ఈ సమయంలో.. పాక్‌ను అండగా నిలిచిన టర్కీ మరియు అజర్ బైజాన్‌పై భారతీయులు అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు.. ఆయా దేశాలకు పర్యటనలు రద్దు చేసుకుంటూ తమ నిరసన వ్యక్తం చేస్తున్నారు.. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌ నుంచి కూడా ఆ రెండు దేశాలకు బిగ్‌ షాక్‌ తగిలింది.. టర్కీ, అజర్ బైజాన్ కు ఝలక్ ఇస్తూ.. సంచలన నిర్ణయం తీసుకుంది టూర్స్ & ట్రావెల్స్ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్ర ప్రదేశ్ .. ఆ దేశాలకు టూరిజం, ట్రావెల్ బాయికాట్ చేస్తూ టూర్స్ & ట్రావెల్స్ అసోసియేషన్ ఆఫ్ ఏపీ నిర్ణయం తీసుకుంది.. అందులో భాగంగా రేపటి నుంచి ఇస్తాంబుల్ టూర్ ప్యాకేజీలు రద్దు చేస్తున్నట్టు ఏపీ టూర్స్ & ట్రావెల్స్ అసోసియేషన్ ప్రకటించింది.. అయితే, ఆంధ్రప్రదేశ్‌ నుంచి 12 వేల మందికిపైగా పర్యాటకులు అక్కడి వెళ్తారు.. ఈ ప్యాకేజీ ద్వారా దాదాపు వెయ్యి కోట్లు ఆదాయం ఇస్తున్నారు ఏపీ టూరిస్టులు… కానీ, ఇప్పుడు టర్కీ మరియు అజర్ బైజాన్‌కు షాకిస్తూ ఈ నిర్ణయం తీసుకున్నారు.. భారత్ ప్రభుత్వం తరుపున సానుకూల సంకేతాలు వచ్చే వరకు ఈ బ్యాన్ కొనసాగుతుంది అని స్పష్టం చేశారు టూర్స్ & ట్రావెల్స్ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షుడు విజయ్ మోహన్..

అందాల భామలపై నీళ్లు పోస్తే కాళ్లు కడిగినట్టేనా? బీఆర్‌ఎస్‌పై మంత్రి ఫైర్
తెలంగాణ మహిళలతో అందాల భామల కాళ్లు కడిగిస్తారంటూ బీఆర్ఎస్ నేతలు రాష్ట్ర ప్రభుత్వం తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. రాష్ట్రానికి ఇది తీవ్ర అవమానకరమని బీఆర్ఎస్ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. బుధవారం మిస్ వరల్డ్ పోటీదారులు ములుగు, రామప్ప దేవాలయ పర్యటన చేపట్టారు. ఈ సందర్భంగా రామప్ప దేవాలయంలోకి వెళ్లే ముందు అందాల భామలు కాళ్లు కడుక్కుని వెళ్లారు. ఈ సందర్భంగా తెలంగాణ మహిళలు నీళ్లు పోయడం వివాదాస్పదమైంది. తాజాగా ఈ వ్యవహారంపై మంత్రి సీతక్క స్పందిస్తూ బీఆర్ఎస్ నేతలపై మండిపడ్డారు. వరంగల్ జిల్లాలో అందాల భామల హెరిటేజ్ వాక్ సక్సెస్ కావడంతో బీఆర్ఎస్ నేతలు కళ్లల్లో నిప్పులు పోసుకుంటున్నారని ధ్వజమెత్తారు. కావాలనే కోడి గుడ్డు మీద ఈకలు పీకే ప్రయత్నం చేస్తున్నారని ధ్వజమెత్తారు. ఇవాంక ట్రంప్ హైదరాబాద్‌ వచ్చినప్పుడు ఆమె వెంట తిరిగిన నాయకుడు ఎలాంటి సంస్కృతి సంప్రదాయాలు పాటించారో అందరికీ తెలుసన్నారు. గిరిజన సంప్రదాయంలో గుడిలోకి వెళ్లే ముందు కాళ్లు కడుగుకొని వెళ్లడం సంప్రదాయం.. అదే అక్కడ పాటించారన్నారు. ఆ సమయంలో ఒక ఈవెంట్ మేనేజ్‌మెంట్ అమ్మాయి.. కాళ్లకు నీళ్లు పోసిందని.. దాన్ని పట్టుకుని నిస్సిగ్గుగా అబద్ధాలు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. ఒక వేళ తెలంగాణ ప్రభుత్వం కాళ్లు కడిగిస్తే.. అందరి కాళ్లు కడిగించాలి కదా? కానీ అక్కడ అలా జరగలేదన్నారు. అయినా దాన్ని ప్రభుత్వానికి అంటగట్టడం సిగ్గు అనిపించడం లేదా? అని బీఆర్ఎస్ నేతలపై ఫైరయ్యారు.

‘‘లొంగిపోవాలని ఉగ్రవాదిని కోరిన తల్లి’’.. ఎన్‌కౌంటర్‌లో హతం..
పహల్గామ్ ఉగ్రవాద దాడి తర్వాత, జమ్మూ కాశ్మీర్ వ్యాప్తంగా భద్రతా బలగాలు ఉగ్రవాదుల కోసం జల్లెడ పడుతున్నాయి. ఈ క్రమంలోనే ఈ రోజు త్రాల్‌లో ఎన్‌కౌంటర్ జరిగింది. ఈ ఎన్‌కౌంటర్‌తో భద్రతా బలగాలు విజయం సాధించాయి. ముగ్గురు ఉగ్రవాదుల్ని హతమార్చింది. ఈ రోజు ఉదయం జరిగిన ఎన్‌కౌంటర్‌కి ముందు, ఉగ్రవాది అమీర్ నజీర్ వానితో అతడి తల్లి వీడియో కాల్‌లో మాట్లాడింది. లొంగిపోవాలని వేడుకుంది. ఆ సమయంలో నజీర్ ఏకే-47 గన్‌తో కనిపించాడు. తల్లి లొంగిపోవాలని చెప్పినప్పటికీ అతను ఒప్పుకోకపోవడంతో చివరకు ఎన్‌కౌంటర్‌లో హతమత్యాడు. తన తల్లితో మాట్లాడుతూ.. సైన్యం ముందుకు రానివ్వండి, అప్పుడు నేను చూస్తాను అని ఉగ్రవాది చెప్పడం వీడియో వినవచ్చు. జమ్మూ కాశ్మీర్ పుల్వామా జిల్లాలోని త్రాల్‌ ప్రాంతంలోని నాదిర్ గ్రామంలో భద్రతా బలగాలు జరిపిన కాల్పుల్లో ముగ్గురు జైషే మహ్మద్ ఉగ్రవాదులు మరణించారు. ఎన్‌కౌంటర్‌లో మరణించిన ఉగ్రవాదుల్ని సిఫ్ అహ్మద్ షేక్, అమీర్ నజీర్ వాని, యావర్ అహ్మద్ భట్‌గా గుర్తించారు. వీరందరూ పుల్వామా జిల్లా నివాసితులు. ఎన్‌కౌంటర్‌కి ముందు అమీర్ నజీర్, తను దాక్కున్న ఇంటి నుంచి తల్లి, సోదరితో వీడియో కాల్‌లో మాట్లాడాడు. ఉగ్రవాదులను లొంగిపోవాలని భద్రతా దళాలు కోరినప్పటికీ, వారు వినకుండా కాల్పులు జరిపారు. భద్రతా బలగాల కాల్పుల్లో ముగ్గురు హతమయ్యారు.

వక్ఫ్ చట్టం పిటిషన్లపై మే 20న సుప్రీం విచారణ..
1995 చట్టంలోని ఏవైనా నిబంధనలపై స్టే విధించాలని కోరుతూ దాఖలైన ఏ పిటిషన్‌ని కూడా స్వీకరించబోమని, వక్ఫ్ సవరణ చట్టం-2025 అమలును తాత్కాలికంగా నిలుపుదల కోరుతూ నమోదైన పిటిషన్లను పరిగణలోకి తీసుకునే అంశంపై మే 20న నిర్ణయం తీసుకుంటామని సుప్రీంకోర్టు గురువారం తెలిపింది. భారత ప్రధాన న్యాయమూర్తి బి.ఆర్. గవై నేతృత్వంలోని డివిజన్ బెంచ్, చట్టంలోని మూడు వివాదాస్పద అంశాలపై మధ్యంతర ఉత్తర్వు అవసరమా..? కాదా..? అనే విషయాన్ని నిర్ణయిస్తుంది. వక్ఫ్ బై యూజర్, వక్ఫ్ కౌన్సిల్, బోర్డులో ముస్లిమేతరులను నామినేట్ చేయడం, వక్ఫ్ కింద ప్రభుత్వ భూముల్ని గుర్తించడం వంటి వాటిపై పలువురు పిటిషన్లు దాఖలు చేశారు. అయితే, వీటిని నిలిపివేస్తూ మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాలని పిటిషనర్లు సుప్రీంకోర్టుని కోరారు. ఇటీవల కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన కొత్త చట్టాన్ని సవాల్ చేస్తున్న పిటిషన్ల తరుపున సీనియర్ న్యాయవాది కపిల్ సిబల్ వాదిస్తున్నారు. కేంద్రం తరఫున సోలిసిటర్ జనరల్ తుషార్ మెహతా వాదిస్తున్నారు. సోమవారం ఉదయం నాటికి తన రాతపూర్వక నోట్‌ని సమర్పించాలని తుషార్ మెహతాని సుప్రీం ధర్మాసనం కోరింది.

భారీ లాభాలతో ముగిసిన స్టాక్ మార్కెట్
దేశీయ స్టాక్ మార్కెట్ భారీ లాభాలతో ముగిసింది. గురువారం ఉదయం ప్లాట్‌గా ప్రారంభమైన సూచీలు మధ్యాహ్నం వరకు నష్టాల్లోనే కొనసాగాయి. అంతర్జాతీయ మార్కెట్‌లో మిశ్రమ సంకేతాలు కారణంగా ఇన్వెస్టర్లు అప్రమత్తంగా వ్యవహరించారు. అనంతరం క్రమక్రమంగా పుంజుకుంటూ చివరి గంటలో మరింత ఊపు కొనసాగించింది. అన్ని రంగాల సూచీలు గ్రీన్‌లో కొనసాగాయి. ఇక ముగింపులో సెన్సెక్స్ 1,200 పాయింట్లు లాభపడి 82, 530 దగ్గర ముగియగా.. నిఫ్టీ 395 పాయింట్లు లాభపడి 25, 062 దగ్గర ముగిసింది. ఇక నిఫ్టీలో హీరో మోటాకార్ప్, జెఎస్‌డబ్ల్యూస్టీల్, ట్రెంట్, టాటా మోటార్స్, హెచ్‌సీఎల్ టెక్నాలజీస్ అత్యధికంగా లాభపడ్డాయి. రియాల్టీ, ఆయిల్ అండ్ గ్యాస్, మెటల్, మీడియా, ఐటీ, ఆటో, బ్యాంక్ 1-2 శాతం చొప్పున పెరిగాయి. బీఎస్‌ఇ మిడ్‌క్యాప్ ఇండెక్స్ 0.6 శాతం, స్మాల్‌క్యాప్ ఇండెక్స్ 0.9 శాతం పెరిగాయి.

WTC ఛాంపియన్స్‌, రన్నరప్‌కు రికార్డు బద్దలు కొట్టే ప్రైజ్ మనీ.. ఐసీసీ ప్రకటన
వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్ ప్రైజ్ మనీని ప్రకటించింది అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ICC).. WTC ఛాంపియన్స్ మరియు రన్నరప్‌లకు రికార్డు బద్దలు కొట్టే ప్రైజ్ మనీని ఇవ్వనున్నట్టు వెల్లడించింది.. దక్షిణాఫ్రికా మరియు ఆస్ట్రేలియా మధ్య జరిగే వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్ కోసం ప్రైజ్ పూల్‌ను ఐసీసీ ఈ రోజు ప్రకటించింది.. 2025 వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ (WTC) విజేతలకు 3.6 మిలియన్‌ యూఎస్‌ డాలర్లు అంటే.. భారత కరెన్సీ ప్రకారం.. 30.79 కోట్ల రూపాయలు అందజేయనుంది.. ఇది గత ఎడిషన్ల ప్రైజ్ మనీ కంటే రెట్టింపు.. ఇక, రన్నరప్‌కు 2.1 మిలియన్ల యూఎస్‌ డాలర్లు.. అంటే ఇండియా కరెన్సీలో 17.96 కోట్లు లభిస్తాయి, ఇది గత సంవత్సరం ఓడిపోయిన ఫైనలిస్టులు 2023లో పొందిన డబ్బు కంటే దాదాపు మూడు రెట్లు ఎక్కువ కావడం విశేషంగా చెప్పుకోవాలి.. అయితే, జూన్ 11వ తేదీ నుండి జూన్ 15వ తేదీ వరకు లండన్‌లోని ఐకానిక్ లార్డ్స్ క్రికెట్ స్టేడియంలో ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్‌లో డిఫెండింగ్ ఛాంపియన్స్ ఆస్ట్రేలియా – దక్షిణాఫ్రికా జట్లు తలపడనున్నాయి.. 2023లో భారత క్రికెట్ జట్టును ఓడించి విజేతగా నిలిచిన ఆస్ట్రేలియా అప్పట్లో 1.6 మిలియన్లు యూఎస్‌ డాలర్లు సంపాదించగా, రన్నరప్ రోహిత్ శర్మ నేతృత్వంలోని టీమిండియా 800,000 యూఎస్‌ డాలర్లు అందుకుంది. అయితే, “టెస్ట్ క్రికెట్‌కు ప్రాధాన్యత ఇవ్వడానికి ఐసీసీ చేస్తున్న ప్రయత్నాల్లో భాగంగానే ప్రైజ్‌ మనీని ఐసీసీ భారీగా పెంచి ఉంటుందని క్రికెట్‌ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు..

అతని మ్యూజిక్ వింటూ ఎమ్మారై స్కాన్ చేయించుకున్నా
విజయ్ దేవరకొండ నటిస్తున్న లేటెస్ట్ మూవీ కింగ్ డమ్. త్రినాథ రావు నక్కిన డైరెక్షన్ లో వస్తున్న ఈ సినిమాకు అనిరుధ్ మ్యూజిక్ అందిస్తున్నాడు. విజయ్ సినిమాకు ఫస్ట్ టైమ్ అనిరుధ్ మ్యూజిక్ ఇస్తున్నాడు. తాజాగా ఓ ప్రముఖ యూట్యూబ్ ఛానెల్ కు ఇంటర్వ్యూ ఇచ్చిన విజయ్.. ఇందులో అనిరుధ్ గురించి ఆసక్తికర కామెంట్లు చేశాడు. ఇందులో అతను మాట్లాడుతూ.. ‘అనిరుధ్ తో పనిచేయాలని ఎప్పటి నుంచో ఉండేది. చాలాసార్లు నా సినిమాలకు అతన్ని తీసుకోవాలని అనుకున్నాం. కానీ కుదరలేదు. చివరకు ఇప్పుడు కుదిరింది. అనిరుధ్ మ్యూజిక్ అంటే నాకు చాలా ఇష్టం. వీఐపీ సినిమాకు అతని మ్యూజిక్ విని స్టన్ అయిపోయాను. కింగ్ డమ్ సినిమాలో అతని మ్యూజిక్ కు నేను నటిస్తున్నట్టు నాకు అనిపించేది. అంత అద్భుతంగా మ్యూజిక్ అందించాడు అనిరుధ్. నాకు ఓ సారి భుజానికి గాయం అయింది. ఎమ్మారై స్కాన్ తీయించుకోమన్నారు. దానికి 40 నిముషాలు ఎమ్మారై మిషిన్ లోనే ఉండాలని చెప్పారు. అంతసేపు ఉండాలంటే బోర్ కొడుతుందని.. నేను మ్యూజిక్ వింటానని వాళ్లకు చెబితే సరే అన్నారు. అందులో ఉన్నంత సేపు నేను అనిరుధ్ మ్యూజిక్ వింటూ గడిపాను. అతని పాటలు నాకు చాలా ఇష్టం. ఒకవేళ నేను రాజునైతే గనక అనిరుధ్ ను కిడ్నాప్ చేస్తాను. నాకు ఇష్టమైన ఆర్టిస్టులను కిడ్నాప్ చేయించి నా సినిమాలకు మాత్రమే పనిచేసేలా చూస్తాను’ అంటూ తెలిపాడు విజయ్ దేవరకొండ.

ఉస్తాద్ భగత్ సింగ్ లో పవన్ పాల్గొనేది అప్పటి నుంచే..!
పవన్ కల్యాణ్‌ మళ్లీ సినిమాల్లో యాక్టివ్ అవుతున్నారు. ఏపీ ఎన్నికల సమయం నుంచి ఆగిపోయిన సినిమాలను మళ్లీ కంప్లీట్ చేసే పనుల్లో ఫుల్ బిజీగా ఉంటున్నారు. ఇప్పటికే హరిహర వీరమల్లు సినిమాను కంప్లీట్ చేసేశారు. ఇప్పుడు ఓజీ సినిమాకు కంటిన్యూగా డేట్లు ఇచ్చేశారు. రెండు రోజుల నుంచి పవన్ కల్యాణ్‌ ఓజీ షూట్ లో పాల్గొంటున్నట్టు తెలుస్తోంది. ఈ మూవీ తర్వాత ఉస్తాద్ భగత్ సింగ్ మూవీని కూడా కంప్లీట్ చేయాలని భావిస్తున్నారంట పవన్ కల్యాణ్‌. జూన్ 12 నుంచి ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా షూట్ లో పాల్గొంటారంట పవన్ కల్యాణ్‌. 28 రోజుల పాటు ఓజీ షూట్ లో పాల్గొన్న తర్వాత.. ఉస్తాద్ సినిమాను కూడా కంప్లీట్ చేయాలని చూస్తున్నారంట. ఉస్తాద్ భగత్ సింగ్ విషయంలో ఇప్పటికే హరీశ్ శంకర్ ఓ క్లారిటీ ఇచ్చారు. ఉస్తాద్ కోసం అన్నీ రెడీ చేశామని పవన్ కల్యాణ్‌ రావడమే ఆలస్యం అంటూ తెలిపారు. పవన్ ఎప్పుడు వస్తే అప్పటి నుంచి ఫాస్ట్ గా షూటింగ్ చేసేస్తామని చెబుతున్నాడు హరీశ్ శంకర్. ఆయన చెప్పిన దాని ప్రకారం జూన్ నుంచి జులై ఎండింగ్ వరకు పవన్ కల్యాణ్‌ పై కీలక సీన్లు షూట్ చేసే అవకాశం ఉందని కనిపిస్తోంది. ఇప్పటి వరకు పవన్ కల్యాణ్‌ ఒప్పుకున్న సినిమాలను మాత్రమే కంప్లీట్ చేయాలని చూస్తున్నారంట. కొత్తవి ఇప్పట్లో పెట్టుకునేలా కనిపించట్లేదు.

నాగచైతన్య సినిమాకి అదిరే డీల్.. అమ్మేశారు!
నాగచైతన్య హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ఒక ఆసక్తికరమైన డీల్ కుదుర్చుకున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం నాగచైతన్య, ‘విరూపాక్ష’ సినిమా దర్శకుడు కార్తీక్ దండు దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ కేవలం 10 శాతం మాత్రమే జరిగింది. ఇంకా ఫస్ట్ కాపీ కూడా రాలేదు. కానీ, అప్పుడే ఈ సినిమా అమ్ముడైనట్లు తెలుస్తోంది. అంటే, వరల్డ్‌వైడ్ థియేటర్ హక్కుల కొనుగోలు జరిగిపోయింది. ఏపీ, నైజాం, సీడెడ్, ఓవర్సీస్, అలాగే ఇండియాలోని ఇతర రాష్ట్రాలన్నీ కలిపి హోల్‌సేల్‌గా సితార నాగవంశీ కొనుగోలు చేశారు. ఆయన మంచి రేటుకు సినిమాను కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. దాదాపు 35 కోట్ల వరకు సినిమాను కొనుగోలు చేసినట్లు ప్రచారం జరుగుతోంది. నిజానికి ఈ సినిమా ఇంకా 10% షూటింగ్ మాత్రమే పూర్తి చేసుకుంది. ఇప్పటికిప్పుడు డీల్ ఫిక్స్ చేసుకోవాలంటే సగానికి పైగా పేమెంట్ చేయాల్సి ఉంటుంది. వడ్డీ లెక్కలు వేసుకున్న నాగవంశీకి ఇది ప్రాఫిటబుల్ వెంచర్‌గా నిలిచే అవకాశం ఉందని అంటున్నారు. ‘విరూపాక్ష’ సూపర్ హిట్ కావడం, ఇటీవల నాగచైతన్య నటించిన ‘తండేల్’ సినిమా కూడా బ్లాక్‌బస్టర్ హిట్ కావడం ఈ సినిమాకు బాగా కలిసి వచ్చిందని చెప్పొచ్చు. కంటెంట్ ఉంటే సినిమా సెట్స్ మీద ఉండగానే ఇబ్బంది లేకుండా అమ్మకాలు జరిగిపోతాయనడానికి ఇదొక ఉదాహరణగా చెప్పవచ్చు.

Exit mobile version