ప్రేమోన్మాది అరెస్ట్.. యాసిడ్ దాడి చేసిన 24 గంటల్లోనే పట్టుకున్న పోలీసులు..
అన్నమయ్య జిల్లాలోని గుర్రంకొండలో యువతిపై ప్రేమోన్మాది యాసిడ్ దాటి ఘటన కలకలం సృష్టించింది.. అయితే, ప్రేమోన్మాది గణేష్‌ను అరెస్ట్ చేశారు పోలిసులు. నిందితుడు గణేష్ ను మీడియా ముందు ప్రవేశ పెట్టి వివరాలు వెల్లడించారు జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు… ఘటన జరిగిన 24 గంటల్లోనే నిందితుడు గణేష్ ను అరెస్టు చేశామని.. పక్కా పధకం ప్రకారమే గౌతమిపై గణేష్ దాడికి పాల్పడ్డినట్లు తెలిపారు ఎస్పీ.. దాడి చేయాలని ఉద్దేశంతోనే ముందు రోజే బాత్ రూమ్‌లు శుభ్రం చేసే యాసిడ్ బాటిల్ కొనుగోలు చేశాడు.. ఇక, మరుసటి రోజు తెల్లవారుజామునే బాధితురాలి ఇంటికి వెళ్లి.. ఒంటరిగా ఉన్న సమయం కోచి వేచిచూశాడని.. ఆ తర్వాత కత్తితో దాడి చేసి తర్వాత తన వెంట తెచ్చుకున్న యాసిడ్ ను గౌతమి నోట్లో పోసి, తాగించేందుకు ప్రయత్నించాడన్నారు. అసమయంలో గౌతమి కొంతవరకు ధైర్యంగా ప్రతిఘటించిందన్నారు.. ఇక, గణేష్, గౌతమి ఇద్దరూ డిగ్రీలో స్నేహితులని వెల్లడించారు.. అయితే, తనను ప్రేమించాలంటూ తన వెంట పడుతోన్న గణేష్‌ను తొలి నుంచి సదరు యువతి దూరం పెడుతూ వచ్చింది.. ప్రేమించాలని ఒత్తిడి తెచ్చినా.. నిరాకరించింది.. అయితే గౌతమికి వివాహం ఖాయమైందని తెలిసే ఈ దాడికి పాల్పడినట్టు పేర్కొన్నారు.. ఇక, పూర్తి స్థాయిలో కేసును దర్యాప్తు చేస్తామన్నారు ఎస్పీ.. మహిళలపై దాడులను ఎట్టి పరిస్థితుల్లో క్షమించబోమని వార్నింగ్ ఇచ్చారు అన్నమయ్య జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు..
హామీలన్నీ అమలు చేస్తాం.. ఇదే జగన్‌కు నా హామీ..
కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలన్నీ ఖచ్చితంగా అమలు చేస్తామని మాజీ సీఎం వైఎస్ జగన్‌కు నా హామీ అంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.. ఏపీ బీజేపీ మాజీ అధ్యక్షులు సోము వీర్రాజు.. ఢిల్లీలో మీడియాతో మాట్లాడిన ఆయన.. కష్టపడి బటన్ నొక్కి అన్ని హామీలు అమలు చేసినా.. మిమ్మల్ని ఎందుకు ప్రజలు ఓడించారో తెలపాలి అంటూ వైఎస్ జగన్‌ను నిలదీశారు.. ఓటమి కారణాల పై చర్చ జరగాలని సూచించారు. పాలనలో కక్ష సాధింపులు, వ్యవహర శైలినే ప్రజలు గమనిస్తారు. ఏపీలో కూటమి ఇచ్చిన హామీలను అమలు చేస్తూనే ఉన్నాం.. పూర్తిగా అమలు చేస్తామని స్పష్టం చేశారు.. నాలుగు లక్షల కోట్ల రూపాయల విలువైన ప్రాజెక్టులను ప్రధాని నరేంద్ర మోడీ ఆంధ్రప్రదేశ్‌కి ఇచ్చారని వెల్లడించారు.. పోలవరం ప్రాజెక్టు ఎత్తు తగ్గిందని జగన్ మాట్లాడడం, కోడిగుడ్డుపై ఈకలు పీకటం లాంటిదే అని దుయ్యబట్టారు.. మరోవైపు, సరైన రీతిలో వైఎస్ జగన్ ప్రతిపక్ష పాత్ర నిర్వహించడం లేదని ఎద్దేవా చేశారు.. గతంలో ప్రతిపక్ష నాయకుడి హోదా లభించినా అసెంబ్లీకి హాజరు కాలేదని.. కానీ, ఇప్పుడు ప్రతిపక్ష నాయకుడి హోదా కావాలని జగన్ అడగడం శోచనీయమని మండిపడ్డారు సోము వీర్రాజు.. కాగా, సంక్షేమ పథకాల అమలు విషయంలో ఆంధ్రప్రదేశ్‌లో కూటమి నేతలు, వైసీపీ మధ్య నిత్యం మాటల యుద్ధం నడుస్తూనే ఉన్న విషయం విదితమే.
వల్లభనేని వంశీ మొబైల్ ఎక్కడ..? నిరాశగా వెనుదిరిగిన పోలీసులు
వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత, గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ వ్యవహారం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారిపోయింది.. వంశీ మొబైల్‌లో కీలక ఆధారాలు లభ్యమవుతాయని భావిస్తున్న ఏపీ పోలీసులకు ఓ రకంగా షాక్ తగిలినట్టు అయ్యింది.. హైదరాబాద్‌లోని వల్లభనేని వంశీ మోహన్ ఇంట్లో విస్తృతంగా సోదాలు నిర్వహించారు విజయవాడలోని పటమట పోలీసుల సోదాలు.. దాదాపు రెండు గంటలపాటు వంశీ ఇంట్లో సోదాలు చేశారు పటమట పోలీసులు.. వంశీ ఫోన్ కోసం ఆయన ఇంట్లో విస్తృతంగా గాలించారు.. అయితే, వంశీ ఇంట్లో ఫోన్ లభించకపోవడంతో నిరాశగా వెనుదిరిగారు ఆంధ్రప్రదేశ్ పోలీసులు.. కాగా, చివరగా వంశీ ఇంట్లోనే సెల్‌ఫోన్ టవర్ లొకేషన్ చూపించినట్టుగా పోలీసులు చెబుతున్నారు.. కానీ, అయినా.. ఆయన ఇంట్లో విస్తృతంగా తనిఖీలు నిర్వహించినా వల్లభనేని వంశీ మొబైల్ ఫోన్ లభించలేదు..
త్వరలో సూర్యాపేట, గద్వాల్లో భారీ బహిరంగ సభలు..
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీలో పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీతో సీఎం రేవంత్ రెడ్డి భేటీ అయ్యారు. కేబినెట్ విస్తరణపై ముఖ్యమంత్రి రాహుల్ గాంధీతో చర్చిస్తున్నారు. మరోవైపు.. నిన్న తెలంగాణ ఇంఛార్జ్ దీపాదాస్ మున్షీని ఏఐసీసీ మార్చింది. కొత్త ఇంఛార్జ్ నియామకం నేపథ్యంలో రాహుల్‌తో సీఎం రేవంత్ రెడ్డి భేటీకి ప్రాధాన్యత నెలకొంది. అంతేకాకుండా.. ఖాళీ కానున్న ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ కోటా అభ్యర్థుల ఎంపికపై కూడా రాహుల్ తో సీఎం చర్చిస్తున్నారు. ఇదిలా ఉంటే.. త్వరలో సూర్యాపేట, ఏప్రిల్‌లో గద్వాల్‌లో భారీ బహిరంగ సభలు నిర్వహించనున్నట్లు ముఖ్యమంత్రి తెలిపారు. తెలంగాణలో కులగణన పూర్తి అయిన సందర్భంగా సూర్యాపేటలో భారీ బహిరంగ సభ నిర్వహించాలని ఇప్పటికే నిర్ణయం తీసుకున్నట్లు సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. సూర్యాపేట సభకు రావాలని రాహుల్ గాంధీని స్వయంగా ఆహ్వానించనున్నామని ముఖ్యమంత్రి తెలిపారు.
పేరుకే ముగ్గురు మంత్రులు, అభివృద్ధిలో మాత్రం శూన్యం
ఖమ్మం జిల్లాలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత పర్యటించారు. బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో సంత్ సేవాలాల్ జయంతి వేడుకల్లో ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ఈరోజు ఖమ్మం రావడం పార్టీ కార్యాలయంలో కార్యకర్తలను కలవడం సంతోషకరం అని తెలిపారు. సేవాలాల్ జయంతి వేడుకలు అధికారికంగా జరుగుతుంది అంటే కేసీఆర్ చలువేనని అన్నారు. కేసీఆర్ రాకముందు పేద ఇంటి ఆడపిల్ల పెళ్లి చేయాలి అంటే ఎంతో ఇబ్బంది పడేవారు.. కేసీఆర్ వచ్చిన తర్వాత కళ్యాణలక్ష్మీ పథకం పెట్టి పేదింటి ఆడపిల్లల పెళ్ళిళ్ళు సులభతరం చేశారని పేర్కొన్నారు. గిరిజనులకు 10 శాతం రిజర్వేషన్ ఇచ్చిన ఘనత కేసీఆర్‌దేనని వెల్లడించారు. సబ్బండ వర్ణాల ప్రజలను కలుపుకుని ముందుకు పోయిన వ్యక్తి కేసీఆర్ అని కవిత అన్నారు. ఖమ్మం జిల్లాలో పేరుకే ముగ్గురు మంత్రులు, అభివృద్ధిలో మాత్రం శూన్యమని ఎమ్మెల్సీ కవిత దుయ్యబట్టారు. అభివృద్ధి చేయలేని ముగ్గురు మంత్రులు రాజీనామా చేయాలని మండిపడ్డారు. గులాబీ సైనికులు వెంట పడి తరుముతూ సంక్షేమ పథకాలు అమలు చేసేలా చేస్తామని కవిత తెలిపారు. కురచ రాజకీయాల కోసం ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తుందని ఆరోపించారు. నీటిని ఉపయోగించుకోవడం లేదు.. రైతులు ఇబ్బంది పడుతున్నారని అన్నారు. ఎన్నికల్లో ఓడిపోవడం, గెలువడం జరుగుతాయి.. ప్రజల అంచనాలకు మించి కేసీఆర్ ప్రభుత్వం పని చేసిందని కవిత పేర్కొన్నారు.
ప్రియురాలి పేరెంట్స్ వేధింపులకు ప్రియుడు బలి..
తాను ప్రేమించిన అమ్మాయి కుటుంబీకుల వేధింపులు భరించలేక ఓ యువకుడు ఆత్మహత్యకు పాల్పడ్డ సంఘటన హైదరాబాద్ పాతబస్తీ సంతోష్ నగర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధి ఖలందర్ నగర్‌లో చోటు చేసుకుంది. ఖలందర్ నగర్‌కు చెందిన మొహమ్మద్ ఇమ్రాన్ అనే యువకుడు చాంద్రాయణగుట్టకు చెందిన ఓ అమ్మాయిని ప్రేమించాడు. అయితే.. వీరిద్దరి ప్రేమ విషయం అమ్మాయి తండ్రి మహమ్మద్ అబిడ్ అలీకి తెలియడంతో గత మూడు రోజుల క్రితం ఇమ్రాన్ ఇంటికి వచ్చాడు. ఇమ్రాన్ తల్లిదండ్రులతో మాట్లాడి పెళ్లి విషయంపై చర్చిద్దాం అని వెళ్ళిపోయాడు. కాగా.. నిన్న చాంద్రాయణగుట్ట పోలీస్ స్టేషన్‌లో యువకుడు ఇమ్రాన్ తమ అమ్మాయిని వేధిస్తున్నాడని అమ్మాయితో ఫిర్యాదు చేయించి పోలీస్ స్టేషన్‌కు ఇమ్రాన్‌ను పిలిపించాడు. దీంతో.. చాంద్రాయణగుట్ట పోలీసులు ఇమ్రాన్‌కు కౌన్సిలింగ్ ఇచ్చి ఇంటికి పంపించారు. దీంతో.. మనస్తాపానికి గురైన ఇమ్రాన్ ఇంటికి వచ్చి సీలింగ్ ఫ్యాన్‌కు ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. తన మృతికి కారణం తాను ప్రేమించిన అమ్మాయి పేరెంట్స్.. ముఖ్యంగా అమ్మాయి తండ్రి మొహమ్మద్ అబిడ్ అలీ ప్రధాన కారకుడు అని సూసైడ్ నోట్ రాసి ఆత్మహత్య చేసుకున్నాడు. వారిపై చర్యలు చేపట్టాలని పోలీసులను కోరుతూ సూసైడ్ చేసుకున్నాడు. ఈ ఘటనపై సంతోష్ నగర్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
స్థానిక సంస్థల ఎన్నికలపై కూనంనేని కీలక వ్యాఖ్యలు..
స్థానిక సంస్థల ఎన్నికలపై సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివ రావు కీలక వ్యాఖ్యలు చేశారు. లోకల్ బాడీ ఎన్నికల్లో కాంగ్రెస్ శిత్తశుద్ధితో లేకపోతే ఇబ్బందులు తప్పవని కాంగ్రెస్‌కు చురకలు అంటించారు. ఢిల్లీలో ఆప్‌కు, కాంగ్రెస్‌కు అదే ఎదురైందని అన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో ఇచ్చిన హామీలపై శ్వేత పత్రం విడుదల చేయాలి.. అనేక హామీలు ఇచ్చారు అవి అలాగే ఉన్నాయని తెలిపారు. దీని మీద వివరణ ఇచ్చిన తరువాతనే ఎన్నికలకు వెళితే బాగుంటుందని కూనంనేని సూచించారు. మరోవైపు ప్రధాని మోడీపై తీవ్ర విమర్శలు గుప్పించారు. మోడీ ఫ్యూడల్ వ్యవస్థ నుండి బయటకు రావడం లేదు.. అక్షరాస్యత పెరిగేతేనే దేశంలో పురోగతి ఉంటుందని కూనంనేని సాంబశివ రావు తెలిపారు. ఉచితాలు అంటూ ప్రధాని మోడీ అపహస్యం చేస్తున్నారు.. మోడీ వ్యాఖ్యలు దేశ స్థితిగతులకు అనుగుణంగా లేవని ఆరోపించారు. పరోక్ష టాక్స్ ద్వారా రూ.22 లక్షల కోట్లు వస్తే 90 శాతం పేదలు కడుతున్నారని అన్నారు. బడా బాబులు కట్టిన 10 శాతం దేశానికి ఎలాంటి ఉపయోగం లేదని వివరించారు.
రైల్వేలో 32,438 గ్రూప్‌డి జాబ్స్.. కొన్ని రోజులే ఛాన్స్.. అప్లై చేశారా?
ప్రభుత్వ సెక్టార్ లో ఉద్యోగం సాధించడం గగనమైపోయింది. గవర్నమెంట్ జాబ్స్ కు కాంపిటిషన్ హెవీగా ఉంటోంది. ఇలాంటి తరుణంలో భారతీయ రైల్వే గుడ్ న్యూ్స్ అందించింది. వేల సంఖ్యలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. రైల్వేలో 32,438 గ్రూప్‌డి జాబ్స్ ను భర్తీ చేయనున్నారు. రైల్వేలో జాబ్ కోసం చూస్తున్న వారికి లక్కీ ఛాన్స్. అయితే ఈ పోస్టుల కోసం ఇప్పటికే దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది. మరికొన్ని రోజుల్లో అంటే ఫిబ్రవరి 22న అప్లికేషన్ గడువు ముగియనున్నది. ఇంకా అప్లై చేసుకోని వారు వెంటనే అప్లై చేసుకోండి. 32,438 ఉద్యోగ ఖాళీల్లో.. 13,187 ట్రాక్ మెయింటైన్ పోస్టులు, పాయింట్స్ మెన్ ఉద్యోగాలు 5,058, అసిస్టెంట్ ఉద్యోగాలు 3,077 ఉన్నాయి. వీటితో పాటు మరికొన్ని విభాగాల్లోనూ ఖాళీలను భర్తీ చేయనునున్నారు. RRB గ్రూప్ D పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు గుర్తింపు పొందిన బోర్డు/సంస్థ నుంచి 10వ తరగతి ఉత్తీర్ణులై ఉండాలి. NCVT నుంచి నేషనల్ అప్రెంటిస్‌షిప్ సర్టిఫికేట్ (NAC) కలిగి ఉండాలి. ఐటీఐ ఉన్నవారు దరఖాస్తు చేసుకోవచ్చు. అభ్యర్థి కనీస వయస్సు 18 సంవత్సరాల కంటే తక్కువ ఉండకూడదు. గరిష్ట వయస్సు 36 సంవత్సరాల కంటే ఎక్కువ ఉండకూడదు.
ఏబీఎస్‌తో బజాజ్ కొత్త పల్సర్ NS125.. ధర ఎంతంటే?
పల్సర్ బైకులకు క్రేజీ డిమాండ్ ఉంటుంది. బైక్ లవర్స్ పల్సర్ బైకులకే ఇంపార్టెన్స్ ఇస్తుంటారు. స్టన్నింగ్ లుక్, మైలేజ్, క్వాలిటీ పరంగా బెస్ట్ గా ఉంటుండడంతో ఈ బైకులకు మార్కెట్ లో మంచి డిమాండ్ ఉంటుంది. కస్టమర్ల అభిరుచులకు తగ్గట్టుగా అప్ డేటెడ్ వర్షన్ లతో బజాజ్ కంపెనీ సరికొత్త బైకులను మార్కెట్ లోకి తీసుకొస్తున్నది. తాజాగా బజాజ్ కంపెనీ తన పాపులర్ బైక్ పల్సర్ ఎన్ఎస్ 125ను కొత్త అప్ డేట్ లతో రిలీజ్ చేసింది. మరి ఈ బైక్ ధర ఎంతో ఇప్పుడు చూద్దాం. పల్సర్ ఎన్ఎస్ 125 బైక్ కొత్త వేరియంట్లలో డిస్క్ బ్రేక్ తో పాటు యాంటీ లాక్ బ్రేకింగ్ సిస్టమ్(ఏబీఎస్) అందించారు. ఈ ఫీచర్ తో ఈ బైక్ మరింత సురక్షితంగా మారింది. ఈ బైక్ మార్కెట్ లో హీరో ఎక్స్ ట్రీమ్ 125ఆర్ కు గట్టిపోటీనిస్తుంది. పల్సర్ ఎన్ఎస్ 125లో ఎల్ఈడీ డేటైమ్ రన్నింగ్ లాంప్ లతో కొత్త హెడ్ ల్యాంప్ లు అదించారు. బజాజ్ ఆటో నుంచి వచ్చిన ఈ కొత్త పల్సర్ ఎన్ఎస్ 125 ధర దాదాపు రూ. 1.6 లక్షలు(ఎక్స్ షోరూం)గా కంపెనీ నిర్ణయించింది.
రెమ్యునరేషన్స్ ఎఫెక్ట్.. జూన్ 1 నుంచి షూటింగ్స్ బంద్..
మలయాళ చిత్ర పరిశ్రమ తీవ్ర సంక్షోభంలో కూరుకుపోతోంది! యాక్టర్ల పారితోషికాలు మామూలుగా లేవు. ఏకంగా సినిమా బడ్జెట్‌లో 60 శాతం రెమ్యునరేషన్స్ అందజేస్తున్నారు. ఇండస్ట్రీపరంగా నటీనటులు, టెక్నీషియన్ల పారితోషికాలు భారీగా పెరిగాయి. కొత్తగా ఇండస్ట్రీలోకి అడుగు పెడుతున్న యాక్టర్లు, డైరెక్టర్లు కూడా ఎక్కువ రెమ్యునరేషన్స్ డిమాండ్ చేస్తున్నారు. 2024లో విడుదలైన చిత్రాల్లో 176 చిత్రాలు వసూళ్లపరంగా నష్టాన్ని తెచ్చిపెట్టాయి. ఈ ఏడాది ఒక్క జనవరిలోనే రూ. 101 కోట్లు నష్టం వాటిల్లింది. అంతే కాకుండా.. సినిమా పరిశ్రమ 30 శాతం పన్ను కడుతోంది. ఏ ఇతర ఇండస్ట్రీలపై ఇంత శాతం పన్నుల వేటు వేయడం లేదు! ఈ 30 శాతంలో జీఎస్‌టీ కాకుండా అదనంగా వినోదపు పన్ను కూడా మోపుతున్నారు. ఇదే కాదు.. 50 రోజుల్లోనే పూర్తి చేయడానికి వీలున్న సినిమాలు 150 రోజులు చేస్తున్నారట. దీనివల్ల నిర్మాణ వ్యయం భారీగా పెరిగిపోయి నష్టాలు వస్తున్నాయి. ఈ పరిస్థితులు మాలీవుడ్‌కి కలిసి వచ్చేలా లేవు. నిర్మాతలు తీవ్ర ఒత్తిడికి గురవుతున్నారు. ఇలాగే కొనసాగితే చిత్ర పరిశ్రమ ప్రశ్నార్థంకంగా మారుతుంది. ఈ కారణాల వల్ల జూన్ 1 నుంచి సంపూర్ణంగా షూటింగ్స్, అలానే సినిమాలకు సంబంధించిన ఇతర కార్యకలాపాలను నిలిపివేయాలని, చివరికి సినిమాల ప్రదర్శనలను కూడా ఆపాలని కేరళ కేరళ చిత్ర నిర్మాతల మండలి, కేరళ చిత్ర పంపిణీదారుల సంఘం, కేరళ చలన చిత్ర కార్మికుల సమాఖ్య, కేరళ సినిమా ఎగ్జిబిటర్ల సంఘం నిర్ణయం తీసుకున్నాయి. నటీనటుల పారితోషికం తగ్గింపు, తక్కువ రోజుల్లో సినిమా పూర్తి చేయడం వంటి డిమాడ్లు లేవనెత్తుతున్నారు. పన్ను తగ్గింపు లేదా ఎత్తివేతను కోరుతూ మలయాళ చిత్రసీమకు చెందిన కీలక శాఖల అధ్యక్షులు త్వరలో కేరళ రాష్ట్ర ముఖ్యమంత్రి పినరయి విజయన్‌ని, ఇతర సంబంధిత మంత్రులను కలిసి ఓ వినతి పత్రాన్ని సమర్పించడానికి సన్నాహాలు చేస్తున్నారని సమాచారం.
కుంభ్ మోనాలిసాకి డైమండ్ నెక్లెస్.. ఇచ్చిందెవరో తెలిస్తే షాక్!
మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌కు చెందిన మోని భోంస్లే దండలు అమ్మడానికి మహాకుంభ మేళాకు వచ్చింది. అక్కడ రాతన మెరిసే కళ్ళతో ఉన్న ఆ అమ్మాయి, క్షణాల్లో సోషల్ మీడియాలో వైరల్ అయింది. తరువాత, వివిధ ప్రాంతాల నుండి చాలా మంది ఆ అమ్మాయిని చూడటానికి, ఫోటోలు మరియు వీడియోలు తీసుకోవడానికి వచ్చారు. ఆ వీడియో, ఫోటోలు అందరి దృష్టిని ఆకర్షించడంతో, మోనాలిసాకు సినిమాల్లో నటించే అవకాశం కూడా లభించింది. సనోజ్ మిశ్రా దర్శకత్వం వహిస్తున్న బాలీవుడ్ చిత్రం ‘ది డైరీ ఆఫ్ మణిపూర్’లో ఆమె నటించనుంది. ఈ సినిమాకి గాను మోనాలిసా 21 లక్షల రూపాయలకు సంతకం చేసిందని నివేదికలు చెబుతున్నాయి. ఇక ఈ క్రమంలోనే హానీ రోజ్ లైంగిక వేధింపులు అంటూ ఫిర్యాదు చేసిన బాబీ చెమ్మనూర్ మోనాలిసాను కోజికోడ్ కు తీసుకువచ్చాడు. ఆమెకు బాబీ చెమ్మనూర్ వాలెంటైన్స్ డే బహుమతిని ఇచ్చాడు. బాబీ మోనాలిసాకు ఒక డైమెండ్ నెక్లెస్ హారాన్ని బహుమతిగా ఇచ్చాడు. కానీ బాబీ తరువాత మోనాలిసాకు పది వేల రూపాయల విలువైన నెక్లెస్ ఇచ్చానని చెప్పాడు. పూసలమ్ముకునే మోనాలిసా తన లుక్‌లో చాలా చేంజ్ ఓవర్ తో కేరళకు చేరుకుంది. కూలింగ్ గ్లాసెస్, నల్లటి దుస్తులు ధరించి స్టైలిష్ గా కనిపిస్తూ విమానాశ్రయానికి వచ్చింది. మోనాలిసాతో పాటు ఆమె సోదరుడు కూడా ఉన్నారు. కేరళకు వచ్చిన ఆమె సినిమాలో నటించే అవకాశం లభించడం సంతోషంగా ఉందని అన్నారు. మోనాలిసాను కేరళకు తీసుకురావడానికి బాబీ చెమ్మనూర్ రూ.15 లక్షలు ఖర్చు చేసినట్లు సమాచారం.