Site icon NTV Telugu

Top Headlines @ 5 PM: టాప్‌ న్యూస్‌

Top Headlines @ 5 Pm New

Top Headlines @ 5 Pm New

సాంకేతిక పరంగా చారిత్రాత్మక మైలు రాయిని అధిగమించాం.. భారత్ ఏఐ ప్రయాణం ప్రారంభం..
విశాఖలో 1 గిగావాట్‌ హైపర్‌ స్కేల్‌ డేటా సెంటర్‌ ఏర్పాటు కోసం ఢిల్లీ వేదికగా ఏపీ ప్రభుత్వం.. గూగుల్‌తో చారిత్రక ఒప్పందం కుదుర్చుకున్న విషయం విదితమే.. ఏపీ సీఎం చంద్రబాబు, కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, ఐటీ, కమ్యూనికేషన్ల శాఖల మంత్రి అశ్వినీ వైష్ణవ్, ఏపీ మంత్రి నారా లోకేష్‌, గూగుల్‌ క్లౌడ్‌ సీఈవో థామస్‌ కురియన్ సహా పలువురు గూగుల్ ప్రతినిధులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.. దీనిపై సోషల్‌ మీడియా వేదికగా ఆసక్తికర ట్వీట్ చేశారు నారా చంద్రబాబు నాయుడు.. “సాంకేతిక పరంగా ఆంధ్రప్రదేశ్‌లో ఈ రోజు చారిత్రాత్మక మైలు రాయిని అధిగమించాం.. గూగుల్ తో 15 బిలియన్ల యూఎస్ డాలర్ల ఒప్పందానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సంతకం చేసింది.. గిగావాట్- స్కేల్ ఏఐ డేటా సెంటర్ ను విశాఖపట్నంలో ఏర్పాటుకు ఈ ఒప్పందం జరిగింది.. భారతదేశ మొట్టమొదటి ఏఐ సిటీ, అతి పెద్ద ఏఐ డేటా హబ్ ఏర్పాటు కానుంది.. అమెరికాకు వెలుపల ఈ స్ధాయిలో ఈ రంగంలో పెట్టుబడులు రావడం ఇదే ప్రథమం.. దీనికి తోడు గూగుల్స్ కేబుల్ ల్యాండింగ్ స్టేషన్‌కు విశాఖపట్నం ఆతిధ్యం ఇవ్వనుంది.. తద్వారా డిజిటల్ నెట్ వర్క్ లో ఇండియా బలోపేతం కానుంది..” అని పేర్కొన్నారు.

విజయవాడ మెట్రోరైల్‌ ప్రాజెక్ట్‌ టెండర్ల గడువు పొడిగింపు
విజయవాడ మెట్రోరైల్‌ ప్రాజెక్ట్‌ టెండర్ల గడువును పొడిగించింది ఆంధ్రప్రదేశ్‌ మెట్రోరైల్‌ కార్పొరేషన్‌.. మెట్రో రైల్‌ ప్రాజెక్టు టెండర్ల గడవు నేటితో ముగుస్తున్న నేపథ్యంలో.. మరో 10 రోజులు పొడిగిస్తున్నట్టు ప్రకటించింది.. దీంతో.. ఈ నెల 24వ తేదీ వరకు టెండర్లు దాఖలు చేసుకునే అవకాశం కల్పించింది ఏపీ మెట్రోరైల్‌ కార్పొరేషన్‌.. దీంతో, టెండర్లు వేసేందుకు సిద్ధమవుతున్న కంపెనీలకు కాస్త ఉపశమనం లభించినట్టు అయ్యింది.. ఇక, విజయవాడ మెట్రో టెండర్ల కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నాయి ప్రధాన ఇన్‌ఫ్రా కంపెనీలు.. కాంట్రాక్టు సంస్థల అభ్యర్థనల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్టు ఆంధ్రప్రదేశ్‌ మెట్రోరైల్‌ కార్పొరేషన్‌ (APMRC) పేర్కొంది..

జగన్‌ మార్గదర్శకత్వంలో జోగి రమేష్‌ నకిలీ మద్యం వ్యాపారం.. టీడీపీ ఎమ్మెల్యే సంచలన ఆరోపణలు..
వైఎస్‌ జగన్‌ మార్గదర్శకత్వంలో జోగి రమేష్‌, జనార్ధన్‌రావు నకిలీ మద్యం వ్యాపారం చేశారంటూ సంచలన ఆరోపణలు చేశారు మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్‌.. జోగి రమేష్‌ ఇంటి సీసీ కెమెరాలు బయటపెడితే మరెన్నో వాస్తవాలు తెలుస్తాయన్నారు.. నకిలీ మద్యంపై జోగి రమేష్‌ అనుచరుడే సమాచారం ఇచ్చారు.. జోగి రమేష్‌ అనుచరుడు సురేష్‌ ఎక్సైజ్‌శాఖకు తెలిపింది వాస్తవం కాదా? అని ప్రశ్నించారు.. జోగి రమేష్‌పై రాజద్రోహం కేసు నమోదు చేసి అరెస్టు చేయాలని డిమాండ్‌ చేశారు.. కుట్రలు చేసి టీడీపీ నాయకులపై నెట్టడం వైఎస్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ నేతలకు వెన్నతో పెట్టిన విద్య అంటూ మండిపడ్డారు ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్..

కల్వకుంట్ల కవిత తెలంగాణ యాత్ర.. ఎప్పుడంటే..?
తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత కీలక నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రవ్యాప్తంగా యాత్ర చేయనున్నట్లు తెలిపారు. తెలంగాణ యాత్ర పేరిట రాష్ట్రంలో అన్ని జిల్లాల్లో యాత్ర చేపట్టనున్నట్లు ఆమె పేర్కొన్నారు. అక్టోబర్ చివరి వారంలో తెలంగాణ యాత్ర ప్రారంభించనున్న కవిత తెలిపారు. ఇదిలా ఉంటే.. యాత్ర పోస్టర్లలో కేసీఆర్ ఫోటో లేకుండా, ప్రొఫెసర్ జయశంకర్ ఫోటోతో విడుదల చేయనున్నట్లు తెలుస్తోంది. ఇది యాత్రలో విద్యావంతులు, మేధావులతో భేటీలను మరింత ప్రతిష్ఠాత్మకంగా మార్చే విధంగా ఉండనుంది. కవిత ఈ యాత్రలో తెలంగాణ సాంప్రదాయ, విద్యా, సాంకేతిక రంగాల్లో కృషిచేసిన వేతరులను, ప్రముఖ మేధావులను కలుస్తూ ప్రజలకు ప్రత్యక్షంగా సందేశాలు చేరుస్తారని తెలుస్తోంది. రేపు యాత్రకు సంబంధించిన పోస్టర్‌ను ఆమె అధికారికంగా విడుదల చేయనున్నారు. ఈ యాత్రకు సంబంధించిన అన్ని వివరాలు, షెడ్యూల్‌లు, సమావేశాల వివరాలు త్వరలో ప్రకటించనున్నారు.

ప్రజలు బీఆర్ఎస్‌కి గట్టి బుద్ధి చెప్పబోతున్నారు
జూబ్లీహిల్స్ అసెంబ్లీ ఉప ఎన్నికల్లో ప్రజలు భారత రాష్ట్ర సమితికి (బీఆర్ఎస్‌) గట్టి బుద్ధి చెప్పబోతున్నారని మంత్రి పొన్నం ప్రభాకర్ వ్యాఖ్యానించారు. ఆయన మాట్లాడుతూ.. గత పదేళ్లుగా ఆ పార్టీ పాలనలో జూబ్లీహిల్స్ నియోజకవర్గం అభివృద్ధి పరంగా ఏ మాత్రం ముందుకు సాగలేదని, ఇప్పుడు ప్రజలే ఆ విఫలతకు తీర్పు ఇవ్వబోతున్నారని అన్నారు. అంతేకాకుండా.. “జూబ్లీహిల్స్‌లో బీఆర్ఎస్ పార్టీ గూబ గుయ్యిమనేట్లు ప్రజలు తీర్పు ఇవ్వబోతున్నారు. ఈ ఉప ఎన్నికతో ఆ పార్టీ చిరునామా గల్లంతవుతుంది. పదేళ్ల పాలనలో అభివృద్ధి పేరుతో ఒక్క రోడ్డు సరిచేయలేని బీఆర్ఎస్ నేతలు ఇప్పుడు ఓట్ల కోసం నటన చేస్తున్నారు,” అని ఎద్దేవా చేశారు. అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో ప్రజలు ఇప్పటికే ఆ పార్టీకి గట్టి షాక్ ఇచ్చారని గుర్తుచేశారు. “అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలు బీఆర్ఎస్‌ను ఓడగొట్టారు. పార్లమెంట్ ఎన్నికల్లో సున్నా సీట్లు ఇచ్చారు. కంటోన్మెంట్ ఉప ఎన్నికల్లో కూడా బుద్ధి చెప్పారు. అయినా ఇంకా నేర్చుకోలేదు,” అని పొన్నం వ్యాఖ్యానించారు.

ఉద్యోగులకు దీపావళి బహుమతి.. బోనస్ ప్రకటించిన రాష్ట్ర ప్రభుత్వం..
దీపావళి వస్తుందంటే చాలు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఉద్యోగులకు బోనస్ లు ప్రకటిస్తూ ఉంటాయి. ప్రైవేట్ సంస్థలు కూడా గిఫ్టులు ఇస్తూ ఉద్యోగుల ఆనందంలో పాలుపంచుకుంటాయి. తాజాగా ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ దీపావళి శుభ సందర్భంగా రాష్ట్ర ఉద్యోగులకు బహుమతిని ప్రకటించారు. 2024-25 ఆర్థిక సంవత్సరానికి బోనస్ ప్రకటించారు. ఈ నిర్ణయం ఉద్యోగుల కృషి, అంకితభావానికి రాష్ట్ర ప్రభుత్వం కృతజ్ఞతను సూచిస్తుందని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. రాష్ట్ర పురోగతిలో ప్రభుత్వ ఉద్యోగులు కీలక పాత్ర పోషిస్తారు. ప్రభుత్వం ప్రతి స్థాయిలో వారి సంక్షేమానికి కట్టుబడి ఉందని తెలిపారు. ముఖ్యమంత్రి సూచనల మేరకు ఆర్థిక శాఖ జారీ చేసిన ఉత్తర్వుల ప్రకారం.. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఉత్పాదకత ఆధారిత బోనస్ ఆమోదించింది. ఈ బోనస్ నెలవారీ జీతం పరిమితి రూ. 7,000 ఆధారంగా ఇవ్వనున్నారు. ఇది 30 రోజుల జీతం ఆధారంగా లెక్కిస్తారు. దీని ఫలితంగా అర్హత కలిగిన ప్రతి ఉద్యోగికి రూ. 6,908 ప్రయోజనం లభిస్తుంది. దీపావళికి ముందు ఈ ఆర్థిక ప్రయోజనం ఉద్యోగుల కుటుంబాలకు ఆనందం, ఉత్సాహాన్ని తెస్తుందని, పాలన, పరిపాలనలో కొత్త శక్తిని నింపుతుందని ముఖ్యమంత్రి పేర్కొన్నారు.

మరో ఆపరేషన్ సిందూర్‌ను తట్టుకోలేరు .. పాక్‌కు భారత సైన్యం వార్నింగ్..
పాకిస్తాన్, భారత్‌పై మరోసారి పహల్గామ్ తరహా దాడికి పాల్పడితే పరిస్థితులు చాలా తీవ్రంగా ఉంటాయని భారత్ సైన్యం వార్నింగ్ ఇచ్చింది. ఆపరేషన్ సిందూర్ 2.0 మరింత ప్రమాదకరంగా మారుతుందని పాకిస్తాన్‌ను హెచ్చరిస్తూ భారత్ వెస్ట్రన్ కమాండ్ జనరల్ ఆఫీసర్ కమాండింగ్-ఇన్-చీఫ్ (GOC-in-C), లెఫ్టినెంట్ జనరల్ మనోజ్ కుమార్ కటియార్ మంగళవారం అన్నారు. జమ్మూ లో విలేకరులతో మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఆపరేషన్ సిందూర్ సమయంలో పాకిస్తాన్ వైమానిక స్థావరాలు, సైనిక పోస్టుల్ని చాలా తక్కువ సంఖ్యలో ధ్వంసం చేశామని, మరోసారి పాక్ దుస్సాహసానికి పాల్పడితే భారత ప్రతిస్పందన చాలా ఎక్కువగా ఉంటుందని కటియార్ అన్నారు. పాకిస్తాన్ ఆలోచనా విధానం మారకపోతే విధ్వంసం తప్పదని హెచ్చరించారు.

పాక్ ఆర్మీ చీఫ్‌పై ట్రంప్ ప్రశంసలు.. మోడీ గురించి ఏమన్నారంటే..
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ ఫీల్డ్ మార్షల్ ఆసిమ్ మునీర్‌పై తన అభిమానాన్ని ప్రదర్శించారు. ఈజిస్ట్ షర్మ్ ఎల్ షేక్‌లో జరిగిన శాంతి సదస్సులో ట్రంప్ మాట్లాడుతూ.. ఆసిమ్ మునీర్‌ను తన ‘‘ అభిమాన ఫీల్డ్ మార్షల్’’ అంటూ పిలిచారు. గాజాలో శాంతి నెలకొల్పడంలో పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్‌కు తనకు మద్దతు తెలిపారని, అందుకు ఆయనకు థాంక్స్ అని ట్రంప్ అన్నారు. ‘‘పాకిస్తాన్ ప్రధాని మీకు నేను చెప్పాలి. నాకు ఇష్టమైన ఫీల్డ్ మార్షల్ ఇక్కడ లేరు. కానీ ప్రధాని ఇక్కడ ఉన్నారు’’ అంటూ ట్రంప్ అన్నారు. ఇజ్రాయిల్-హమాస్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందంపై సంతకం చేయడానికి షర్మ్ ఎల్ షేక్ వేదికగా సమావేశం జరిగింది. అయితే, అదే సమయంలో ట్రంప్ మాట్లాడుతూ.. భారతదేశాన్ని కూడా ప్రశంసించారు. ప్రధాని నరేంద్రమోడీ చాలా మంచి స్నేహితుడు అని, ఆయన అద్భుతమైన పని చేశారని అన్నారు. ట్రంప్ నుంచి ఈ వ్యాఖ్యలు రాగానే పాకిస్తాన్ ప్రధాని షరీఫ్ చాలా ఇబ్బంది పడ్డారు.

E20 పెట్రోల్‌ వల్ల మైలేజీ తగ్గుతుందా..? సర్వేలో షాకింగ్ నిజాలు..!
దేశవ్యాప్తంగా 20% ఇథనాల్ కలిగిన E20 పెట్రోల్ వాహన యజమానులకు తలనొప్పిగా మారుతోంది. ప్రభుత్వం దీనిని గ్రీన్ ఎనర్జీ వైపు చారిత్రాత్మక అడుగుగా అభివర్ణిస్తుండగా.. సాధారణ ప్రజలు మాత్రం దీన్ని తిరస్కరిస్తున్నారు. దేశవ్యాప్తంగా జరిగిన ఓ సర్వే ప్రకారం.. ఈ కొత్త మిశ్రమ ఇంధనం వాహన మైలేజీని తగ్గించి ఖర్చులను పెంచిందని చెబుతున్నారు. లోకల్ సర్కిల్స్ సర్వే ప్రకారం.. 2022లో లేదా అంతకు ముందు కొనుగోలు చేసిన వాహనాలకు చెందిన పది మంది యజమానులలో ఎనిమిది మంది ఈ పెట్రోల్ పై అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. 2025 నాటికి తమ వాహనాల ఇంధన సామర్థ్యం తగ్గిందని నివేదించారు. దేశవ్యాప్తంగా 323 జిల్లాల నుంచి 36,000 మంది వాహన యజమానులు ఈ సర్వేలో పాల్గొన్నారు. వీరిలో 69% మంది పురుషులు, 31% మంది మహిళలు. ఇందులో దాదాపు సగం మంది టైర్-1 నగరాలకు చెందినవారు. మిగిలిన వారు టైర్-2, చిన్న పట్టణాలు లేదా గ్రామీణ ప్రాంతాలకు చెందినవారు.

ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్ లో 300 జాబ్స్.. మంచి జీతం
ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న వారికి గుడ్ న్యూస్. ఏకంగా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాన్ని పొందే ఛాన్స్ వచ్చింది. ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్ ఎగ్జిక్యూటివ్ పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. ఈ రిక్రూట్ మెంట్ ద్వారా మొత్తం 348 పోస్టులను భర్తీ చేయనున్నారు. దరఖాస్తు చేసుకోవడానికి, అభ్యర్థులు గుర్తింపు పొందిన సంస్థ నుంచి బ్యాచిలర్ డిగ్రీని పూర్తి చేసి ఉండాలి. అదనంగా, ఇతర అర్హత ప్రమాణాలను కలిగి ఉండాలి. ఎగ్జిక్యూటివ్ పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి అభ్యర్థుల కనీస వయస్సు ఆగస్టు 1, 2025 నాటికి 20 సంవత్సరాలు. అభ్యర్థుల గరిష్ట వయస్సు 35 సంవత్సరాలు. ఈ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ. 30,000 జీతం అందిస్తారు. దరఖాస్తు చేసుకోవడానికి అభ్యర్థులు రూ. 750 దరఖాస్తు ఫీజు చెల్లించాలి. దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది. అర్హత, ఆసక్తి ఉన్నవారు అక్టోబర్ 29 వరకు ఆన్ లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవచ్చు. పూర్తి సమాచారం కోసం..

Exit mobile version