Site icon NTV Telugu

Top Headlines @ 5 PM: టాప్‌ న్యూస్‌

Top Headlines @ 5 Pm New

Top Headlines @ 5 Pm New

కోర్టు వద్ద మరోసారి చెవిరెడ్డి హల్‌చల్‌.. ఇది న్యాయం కాదు.. దేవుడు ఉన్నాడు..
విజయవాడలో కోర్టు వద్ద మరోసారి హల్‌చల్‌ చేశారు వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌ రెడ్డి.. ఏపీ మద్యం స్కాం కేసులో అరెస్ట్ అయిన ఆయన.. అప్పటి నుంచి కోర్టుకు తీసుకొచ్చిన ప్రతీసారి.. ఏదో హల్‌ చల్‌ చేస్తూ వస్తున్నారు.. అయితే, తాను ఏ తప్పు చేయకపోయినా కేసు నమోదు చేసి జైల్లో పెట్టారంటూ ఆవేదన వ్యక్తం చేశారు.. మీడియాలో కూడా ఇష్ట రీతిన అసత్య వార్తలు రాస్తున్నారని.. వారిపై న్యాయపోరాటం చేస్తానన్నారు చెవిరెడ్డి.. తానెప్పుడూ మద్యం వ్యాపారం చేయలేదని.. మద్యం నుంచి ఒక్క రూపాయి ఆదాయం కూడా ఆశించలేదని.. ప్రమాణానికి సిద్ధంగా ఉన్నానని తెలిపారు.. “మనసా వాచా కర్మణా” లిక్కర్ జోలికి ఎప్పుడు పోలేదు.. లిక్కర్ కేసుతో నాకు సంబంధం లేదని పేర్కొన్నారు. నేను ఏడో తరగతి చదివేటప్పుడే మా నాన్న తాగుడు వల్ల మా అమ్మ ఆత్మహత్య చేసుకుంది.. ఇదే తాగుడు వళ్ల మా నాన్న చనిపోయాడు.. తాడుగుతోనే మా తమ్ముడు చనిపోయాడు.. దాంతో.. నేను లిక్కర్‌ను ధ్వేషిస్తాను.. లిక్కర్ జోలికి పోను అన్నారు చెవిరెడ్డి.. చిన్నప్పటి నుంచి ఇది ఉద్దేశంతో ఉన్నాను.. లిక్కర్ ని ద్వేషించే నన్ను లిక్కర్ కేసులో అరెస్ట్ చేయడం నాకు బాధేసింన్నారు.. పత్రికల్లో విచచక్షణారహితంగా అసత్యాలు రాస్తున్నారు..10 శాతం తప్పు చేస్తే 90 శాతం యాడ్ చేయండి.. కానీ, 100 శాతం యాడ్ చేయొద్దు అని సూచించారు.. మనసుకు బాధ వేస్తుంది.. అరెస్టు చేసినందుకు బాధ లేదు.. లిక్కర్ కేసులో అరెస్ట్ చేసినందుకు బాదేస్తుందన్నారు..

పవన్‌ కల్యాణ్‌పై వంగవీటి ఫైర్‌.. లక్షల పుస్తకాలు చదివిన మీరు రాజ్యాంగాన్ని చదివారా..?
జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌పై ఫైర్‌ అయ్యారు వైసీపీ అధికార ప్రతినిధి వంగవీటి నరేంద్ర.. రాజ్యాంగం గురించి మాట్లాడే పవన్ కల్యాణ్‌కు అసలు ఆంధ్రప్రదేశ్‌లో జరుగుతున్న దారుణాలు కనడుతున్నాయా? అని ప్రశ్నించారు.. సుగాలి ప్రీతి కుటుంబానికి న్యాయం గురించి ఎన్నికలకు ముందు మీరు మాట్లాడిన మాటలను గుర్తు చేస్తే దాడి చేస్తారా? అని నిలదీశారు.. ఇదేనా రాజ్యాంగ బద్దమైన పాలన అంటే? అని ఫైర్‌ అయ్యారు.. లక్షల పుస్తకాలు చదివిన పవన్ కల్యా్ణ్ అసలు రాజ్యాంగాన్ని చదివారా? అని మండిపడ్డారు.. మచిలీపట్నం మంగినపూడిలో మా పార్టీ నేత గిరిపై జనసేన నేతల దాడి అమానుషం అన్నారు.. పెద్దమనిషిని మోకాళ్లపై పెట్టి దాడి చేయమని ఏ రాజ్యాంగం లో ఉంది? అని ఆగ్రహం వ్యక్తం చేశారు.. 30 వేల మంది మహిళలు అదృశ్యం అయ్యారన్న మీ వ్యాఖ్యలకు మీరే సమాధానం చెప్పాలి అని డిమాండ్ చేశారు.. ఈ ప్రశ్న అడిగితే మా పార్టీ నేతపై దాడి చేశారు. జగన్ కు రాజ్యాంగం తెలుసు కాబట్టే ప్రతిపక్ష హోదా అడిగారని తెలిపారు వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధికార ప్రతినిధి వంగవీటి నరేంద్ర..

నేపాల్‌లో చిక్కుకున్న 44 మంది నంద్యాల వాసులు..
నేపాల్‌లో ‘జెన్‌జీ’ ఉద్యమం తీవ్ర ఉద్రిక్తతలు, విధ్వంసానికి దారి తీసింది.. నేపాల్‌లో కొనసాగుతున్న ఉద్రిక్తతల వేళ.. అక్కడ చిక్కుకున్న తెలుగు వారిని క్షేమంగా తీసుకురావడానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం తీవ్రంగా కృషి చేస్తుండగా.. ఈ సమయంలో.. ఏపీకి చెంది మరో 44మంది టూరిస్టులు అక్కడ చిక్కుకున్న వార్తలు కలవరపెడుతున్నాయి.. నంద్యాల నుండి ముక్తినాథ్‌ యాత్రకు వెళ్లి , నేపాల్ లో చిక్కుకున్నారు 44 మంది యాత్రికుల బృందం.. దీంతో, మంత్రి ఫారూఖ్ ను ఆశ్రయింయారు యాత్రికుల కుటుంబ సభ్యులు.. వెంటనే హోంమంత్రి అనిత , జిల్లా కలెక్టర్ రాజకుమారితో మాట్లాడిన మంత్రి ఫరూక్.. ఆ కుటుంబ సభ్యులకు ధైర్యాన్ని చెప్పారు.. ఇక, 14వ తేదీన యాత్రికులను రప్పించడానికి ఏర్పాట్లు చేశారు కలెక్టర్ రాజకుమారి.. అయితే, షోలే ట్రావెల్స్ ద్వారా 3వ తేదీన 12 రోజుల ముక్తినాథ్‌ యాత్రకు బయలుదేరి వెళ్లింది 44 మంది భక్తుల బృందం.. ఈ టీమ్‌లో నంద్యాల, కర్నూలు, ప్రొద్దుటూరు, పోరుమావిళ్ల, సున్నిపెంటవాసులు ఉన్నట్టుగా చెబుతున్నారు.. నేపాల్‌లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో.. రాజధాని ఖాట్మాండ్ లో రెండు రోజులుగా రూమ్‌లకే పరిమితమయ్యారు యాత్రకులు.. మొత్తంగా మంత్రి ఫారూఖ్‌ చొరవతో యాత్రికులను రప్పించడానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి.. రేపు ఖాట్మాండ్ నుండి నేపాల్ – ఇండియా సరిహద్దుల్లోని భైరవ్ ప్రాంతానికి విమానంలో బయలుదేరనున్నారు యాత్రికులు.. అక్కడినుండి వోల్వా బస్సులో యూపీలోని గోరకపూర్ కు , అక్కడి నుండి విమానంలో హైదరాబాద్ కు వస్తారు.. ఈ నెల 14వ తేదీ సాయంత్రం హైదరాబాద్ చేరుకోనుంది యాత్రికుల బృందం.. యాత్రికులు క్షేమంగా ఉన్నారని , కుటుంబ సభ్యులు ఎవరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు మంత్రి ఫరూఖ్..

రైతులు ఆందోళన చెందవద్దు.. సరిపడా ఎరువులు ఉన్నాయి..
రాష్ట్రంలో ఎరువులు ఎటువంటి కొరత లేకుండా అందుబాటులో ఉన్నాయ‌ని ఏపీ వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు స్పష్టంచేశారు. రైతులు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని భరోసా ఇచ్చారు. విజ‌య‌వాడ‌లోని క్యాంప్ ఆఫీస్ లో మాట్లాడుతూ.. రాష్ట్రంలో ప్రస్తుతం యూరియా, డీఏపీ, పొటాష్, కాంప్లెక్స్ ఎరువులు సహా అన్నిరకాల ఎరువులు సరిపడా నిల్వలుగా ఉన్నాయని తెలిపారు. జిల్లాల వారీగా ఎరువుల నిల్వలను పరిశీలిస్తూ, కలెక్టర్లు, వ్యవసాయ శాఖాధికారులతో ప్రతిరోజూ సమీక్షలు జరుగుతున్నాయ‌ని అన్నారు. మార్కెట్‌లో ఎరువుల కొరత లేకుండా, రైతుల అవసరాలకు అనుగుణంగా సరఫరాలు కొనసాగుతున్నాయని స్పష్టం చేశారు. రైతుల కోసం కూటమి ప్రభుత్వం ఎల్లప్పుడూ అండగా నిలుస్తుందని, ఒక్క రైతు కూడా ఇబ్బందులు పడకుండా చూడటమే లక్ష్యమని మంత్రి పేర్కొన్నారు. రైతు సంతోషంగా ఉంటేనే రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది. అందుకే రైతుల సమస్యల పరిష్కారం మా మొదటి కర్తవ్యం అని మంత్రి స్పష్టం చేశారు.

ఈ ప్రభుత్వం ఇవాళో, రేపో కూలిపోతుందన్న కేటీఆర్.. మంత్రి జూపల్లి స్ట్రాంగ్ కౌంటర్
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలకు సిగ్గుందా? అనే వ్యాఖ్యలపై మంత్రి జూపల్లి కృష్ణారావు తీవ్రంగా మండపడ్డారు. ఎమ్మెల్యేలను సిగ్గుందా అని కేటీఆర్ అనడం దారుణమన్నారు. తెలంగాణ కోసం వందలాది మంది యువకులు ప్రాణత్యాగం చేసినా, మీరు సిగ్గులేని పనులు ఎన్నో చేశారని ఆరోపించారు. చెప్పులు మోసే సంతోష్ రావుకు ఎంపీ పదవి ఇచ్చినప్పుడు మీకు సిగ్గురాలేదా?.. వేల కోట్లు అక్రమార్జన చేశారని కవితే చెప్పింది కదా.. ఆమె ఏం లేకుండా మాట్లాడిందా? అని ప్రశ్నించారు. కవిత, కేటీఆర్ ఇద్దరూ ఒకటే.. సిగ్గుశరం అనే పదం వారందరికీ వర్తించాలని మంత్రి జూపల్లి అన్నారు.

2023 నుంచి మణిపూర్లో హింస.. తొలిసారి వెళ్తున్న ప్రధాని మోడీ
మణిపూర్‌లో 2023లో ప్రారంభమైన మైతి – కుకీల మధ్య జాత్యహంకార ఘర్షణల్లో సుమారు 200 మందికి పైగా ప్రాణాలు కోల్పోయిన తర్వాత, మొదటి తొలిసారి మణిపూర్ లో భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ సందర్శించనున్నారు. రెండు సంవత్సరాలుగా మణిపూర్ ను ప్రధాని సందర్శించలేదని పెద్ద ఎత్తున ప్రతిపక్షాలు విమర్శలు గుప్పించారు. అయితే, మణిపూర్ లోని చురాచాంద్‌పూర్‌లో రూ.7,300 కోట్ల విలువైన పలు అభివృద్ధి పథకాలకు రేపు ( సెప్టెంబర్ 13న) ప్రధాని మోడీ భూమిపూజ చేయనున్నారు. చురాచాంద్‌పూర్‌ 2023 హింసలో అత్యంత ప్రభావితమైన ప్రాంతాల్లో ఒకటి. ఇక, ప్రధాని పర్యటనకు కేవలం రెండు రోజుల ముందు గురువారం నాడు అక్కడ ప్రధాన మంత్రి పర్యటన కోసం చేసిన ఏర్పాట్లను గుర్తు తెలియని వ్యక్తులు ధ్వంసం చేసినట్లు తెలుస్తుంది.

మెట్రోలో పరుగులు పెట్టిన గుండె.. రెండోసారి కూడా సక్సెస్
నిజంగా ఇది అద్భుతం. మెట్రోలో గుండె పరుగులు పెట్టింది. ఏంటి ఇది సాధారణం అని ఆలోచిస్తున్నారా.. ఈ గుండెను వైద్యులు ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి తరలించడానికి మెట్రోను ఉపయోగించారు. ఇది అసలు ముచ్చట. కర్ణాటకలోని బెంగళూరులో ఈ ఘటన వెలుగుచూసింది. ట్రాఫిక్‌ సమస్య నుంచి తప్పించుకోడానికి, సరైన సమయానికి గుండెను చేర్చాల్సిన చోటుకు చేర్చడానికి మెట్రోను ఎంచుకున్నట్లు వైద్యులు తెలిపారు. మీకు తెలుసా ఈ విధంగా ఒక గుండెను మెట్రో ద్వారా విజయవంతంగా రవాణా చేయడం ఇది రెండవసారి. బెంగళూరులోని యశ్వంత్‌పూర్‌లోని స్పార్ష్ ఆసుపత్రి నుంచి శేషాద్రిపురంలోని అపోలో ఆసుపత్రికి గురువారం వైద్య బృందం గుండెను తరలించింది. మొదట స్పార్ష్ ఆసుపత్రి నుంచి యశ్వంత్‌పూర్ ఇండస్ట్రీ మెట్రో స్టేషన్‌కు అంబులెన్స్‌లో హృదయాన్ని తీసుకువచ్చారు. తర్వాత అక్కడి నుంచి మెట్రో ద్వారా సంపిగే రోడ్ మెట్రో స్టేషన్‌కు తీసుకెళ్లి.. అక్కడి నుంచి అపోలో ఆసుపత్రికి గుండెను అంబులెన్స్‌లో చేర్చారు. ఈ సంఘటనకు సంబంధించిన వీడియో కూడా బయటికి వచ్చింది.

మెడికల్ మాఫియా..? రూ.20కి వచ్చే దగ్గు మందు.. రూ.100కి విక్రయిస్తున్నారు?
ప్రస్తుత కాలంలో రోగాలు పెరుగుతున్నాయి. ప్రతి చిన్నదానికి ఆసుపత్రి, మెడికల్ షాపులకు పరుగులు తీస్తుంటాం. కానీ.. అక్కడ జరిగే మోసాల గురించి ఎవ్వరికీ తెలియదు. మనం కొనే మందుల అసలు ధర, దానిపై వచ్చే లాభం సామాన్యులకు అర్థం కాదు. ఉదాహరణకు ఓ దగ్గు మందును రూ. 100కి కొనుగోలు చేశామనుకుందాం.. మెడికల్ స్టోర్ యజమానికి అదే మందును ఎంతకు కొనుగోలు చేస్తాడు? దానిపై ఎంత మార్జిన్ వస్తుందో తెలిస్తే మీరు షాక్ అవ్వాల్సిందే. ఈ సమాచారాన్ని తెలుసుకోవడానికి ఓ జాతీయ మీడియా సంస్థ మందుల పంపిణీదారుడి వివరణ తీసుకుంది. మందులు అమ్మడం ద్వారా ఎంత మార్జిన్ వస్తుందో ఆ వ్యక్తి విపులంగా వివరించారు. మందులలో లాభాల మార్జిన్ కంపెనీలు, ఔషధ రకంపై ఆధారపడి ఉంటుందట. మందులలో 4-5 రకాల లాభాల మార్జిన్లు ఉన్నాయని తెలిపారు.

భారత పర్యాటకుల బస్సుపై దాడి, దోపిడి..
రాజకీయ అవినీతికి వ్యతిరేకంగా నేపాల్ యువత చేపట్టిన నిరసన కార్యక్రమాలు హింసాత్మకంగా మారిన సంగతి తెలిసింది. ఈ అల్లర్ల నేపథ్యంలో ప్రధాని కేపీ శర్మ ఓలితో పాటు చాలా మంది మంత్రలు తమ పదవులకు రాజీనామా చేశారు. మరోవైపు, అల్లర్లలో చాలా మంది లూటీలకు తెగబడ్డారు. ప్రైవేట్ ఆస్తులను ధ్వంసం చేశారు. ఈ అల్లర్లలో ఇప్పటి వరకు 51 మంది మరణించారు. మరణించిన వారిలో ఒక భారతీయురాలు కూడా ఉంది. ఇదిలా ఉంటే, ఖాట్మాండ్ లోని పశుపతినాథ్ ఆలయాన్ని సందర్శించి తిరిగి వస్తున్న భారతీయ యాత్రికుల బృందంపై గురువారం దాడి జరిగింది. ఉత్తర్ ప్రదేశ్ రిజిస్ట్రేషన్ నంబర్ కలిగి బస్సు భారతదేశానికి తిరిగి వస్తుండగా ఈ దాడి జరిగింది. దుండగులు బస్సుపై రాళ్లు విసిరి, అద్దాలనుు పగలగొట్టారు. బ్యాగులు, నగలు, నగదు, మొబైల్ ఫోన్‌లతో సహా ప్రయాణికుల వద్ద ఉన్న వస్తువులను దోచుకున్నారు. ఈ సంఘటనలో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన చాలా మంది ప్రయాణికులు గాయపడ్డారు.

ఈ క్రేజ్ వేరే లెవల్ అయ్యా.. రూ.4 లక్షల ప్రైజ్ టికెట్స్ కూడా సోల్డ్ అవుట్!
భారత్, పాకిస్తాన్ మ్యాచ్ చూడడానికి క్రికెట్ అభిమానులు భారీ ఎత్తున ఎగబడతారు. దాయాదులు బరిలోకి దిగినప్పుడు ఏ స్టేడియం అయినా నిండిపోతుంది. ఈ క్రమంలోనే ఇండో-పాక్ మ్యాచ్ టిక్కెట్లకు ఉండే క్రేజ్ మరో లెవల్లో ఉంటుంది. టికెట్స్ రిలీజ్ చేసిన క్షణాల్లోనే హాట్ కేకుల్లా అమ్ముడైపోతుంటాయి. అయితే ఈసారి పరిస్థితి కాస్త బిన్నమైనా.. చివరకు భారీ ప్రైజ్ టికెట్స్ కూడా మొత్తం అమ్ముడుపోయాయి. రూ.4 లక్షల టికెట్స్ కూడా ఇప్పుడు అందుబాటులో లేవు. ఆసియా కప్ 2025లో భాగంగా భారత్, పాకిస్తాన్ మధ్య సెప్టెంబర్ 14న దుబాయ్ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో మ్యాచ్ జరగనుంది. పహల్గాం దాడి, ఆపరేషన్ సిందూర్ కారణంగా మ్యాచ్ జరుగుతుందో లేదో అనే అనుమానాలు ఇటీవలి రోజులో నెలకొన్నాయి. బాయ్‌కాట్‌ ఆసియా కప్ సోషల్ మీడియాలో ట్రెండ్ అయింది. దాంతో మ్యాచ్ టికెట్లపై ప్రభావం పడింది. ఆగష్టు 29న టికెట్స్ బుకింగ్ ఓపెన్ అయినా.. 3-4 రోజుల క్రితం వరకు సగానికి పైగా టికెట్స్ సేల్ కాలేదు. మ్యాచ్ రద్దు చేయాలంటూ ఇటీవల సుప్రీంకోర్టులో కూడా ఓ పిల్ దాఖలైంది. ఇది కేవలం ఆట అని సుప్రీంకోర్టు కొట్టిపారేసింది. మ్యాచ్‌పై నీలినీడలు తొలగిపోవడంతో టికెట్స్ అమ్మకాలు జోరందుకున్నాయి.

విజయ్ తో ఎంగేజ్ మెంట్.. తానే అందరికీ చెప్తానన్న రష్మిక..
రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ వరుస ప్రాజెక్టులతో ఫుల్ బిజీగా ఉన్నాడు. అటు రష్మిక పాన్ ఇండియా సినిమాలతో చాలా బిజీ అయిపోయింది. ఈ ఇద్దరి గురించి ఏ చిన్న మ్యాటర్ లీక్ అయినా సోషల్ మీడియా ఊగిపోతుంది. వీరిద్దరూ ప్రేమలో ఉన్నారని.. త్వరలోనే పెళ్లి చేసుకుంటారంటూ లెక్కలేనన్ని రూమర్లు వస్తున్నాయి. పైగా ఇద్దరూ బయటకు వెళ్లిన ప్రతిసారి దొరికిపోతున్నారు. కానీ రిలేషన్ మీద ఎవరూ మాట్లాడట్లేదు. అయితే తాజాగా రష్మిక సైమా అవార్డుల కోసం దుబాయ్ కు వెళ్లింది. ఆ ఈవెంట్ లో తన వేలికి ఓ రింగ్ పెట్టుకుంది. అది చూసిన వారంతా.. ఆమె ఎంగేజ్ మెంట్ విజయ్ తో అయిపోయిందని కామెంట్లు పెడుతున్నారు. ఇది కాస్త సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అయిపోతోంది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న రష్మికకు ఈ విషయంపై ప్రశ్న ఎదురైంది. ఆమె మాట్లాడుతూ.. అది జస్ట్ నా సెంటిమెంట్ ఉంగరం. నాకు ఎవరితోనూ ఎంగేజ్ మెంట్ జరగలేదు. ఒకవేళ నిజంగానే ఎంగేజ్ మెంట్ అయితే నేనే స్వయంగా చెబుతాను. అప్పటి వరకు ఎవరూ ఇలాంటివి నమ్మొద్దు అంటూ చెప్పుకొచ్చింది రష్మిక. కానీ విజయ్ తో తన రిలేషన్ పై డైరెక్ట్ గా బయట పెట్టలేదు. మొత్తానికి అమ్మడి కామెంట్స్ చూస్తుంటే నిజంగానే విజయ్ తో రిలేషన్ లో ఉందని తేలిపోతోంది. ఇక వీరిద్దరూ త్వరలోనే ఓ సినిమాలో కనిపించబోతున్నారంటూ తెలుస్తోంది. ప్రస్తుతం విజయ్ దేవరకొండ మైత్రీ మూవీ మేకర్స్ తో పాటు దిల్ రాజు నిర్మాణంలో సినిమాలు చేస్తున్నాడు.

ఎక్కడ మొదలెట్టానో అక్కడికే.. అనుష్క కీలక ప్రకటన
ఇటీవల అనుష్క ‘ఘాటీ’ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. సినిమా టాక్ యావరేజ్‌గా ఉన్నా, కలెక్షన్స్ విషయంలో మాత్రం వెనుకబడింది. గంజాయి సాగు నేపథ్యంలో రూపొందించబడిన ఈ సినిమాకు ఆశించిన మేర ఫలితాలు రాలేదు. అయితే, తాజాగా అనుష్క తన సోషల్ మీడియా వేదికగా ఒక ప్రకటన చేసింది. “ట్రెడింగ్ బ్లూ లైట్ టు క్యాండిల్‌లైట్, కొన్నాళ్లపాటు సోషల్ మీడియా నుంచి దూరంగా ఉండాలని అనుకుంటున్నాను. ఈ ప్రపంచంతో కనెక్ట్ అయ్యి, స్క్రోలింగ్ నుంచి దూరంగా ఉండాలనుకుంటున్నాను. ఎక్కడైతే నేను మొదలైయ్యానో, అక్కడ కొన్నాళ్లపాటు ఉండాలనుకుంటున్నాను,” అంటూ తన యోగా జీవితం గురించి హింట్ ఇచ్చింది. “మిమ్మల్ని త్వరలోనే మరిన్ని కథలతో కలవబోతున్నాను,” అంటూ కూడా ఆమె పేర్కొంది. “ఎల్లప్పుడూ మీ ప్రేమతో, మీ ప్రేమకై ఉండే అనుష్క శెట్టి,” అంటూ ఆమె ఒక లేఖ రాసి, దాన్ని సోషల్ మీడియా వేదికగా షేర్ చేసింది. క్రిష్ డైరెక్షన్‌లో రూపొందిన ‘ఘాటీ’ సినిమాలో అనుష్క శీలావతి అనే పాత్రలో నటించింది. ఆమె సరసన విక్రమ్ ప్రభు హీరోగా నటించాడు. ఇక ఈ సినిమాలో జగపతి బాబు, చైతన్య రావు వంటి వారు ఇతర కీలక పాత్రలలో నటించారు.

Exit mobile version