NTV Telugu Site icon

Top Headlines @ 5 PM: టాప్‌ న్యూస్‌

Top Headlines @ 5 Pm New

Top Headlines @ 5 Pm New

పోసానిపై పోలీసులకు ఫిర్యాదు.. సభ్య సమాజం సిగ్గుపడేలా..!
సినీ రచయిత, నటుడు, దర్శకుడు, నిర్మాత.. వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ నేత పోసాని కృష్ణ మురళిపై విజయవాడ పోలీసులకు ఫిర్యాదు చేశారు జనసేన నేతలు.. వైసీపీ హయాంలో పోసాని ఇష్టంవచ్చినట్టు మాట్లాడారని.. అయితే, తాము పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని.. జనసేన అధినేత, ప్రస్తుత డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌.. ఆయన కుటుంబ సభ్యులను కించపరిచేలా పోసాని మాట్లాడరని మండిపడ్డారు.. సోషల్‌ మీడియా వేదికగా పోసాని చేసిన వ్యాఖ్యలు సభ్య సమాజం సిగ్గుపడేలా ఉన్నాయన్నారు జనసేన పార్టీ ఆంధ్ర జోన్‌ కన్వీనర్‌ బాడిత శంకర్‌.. ఈ సందర్భంగా జనసేన పార్టీ ఆంధ్ర జోన్ కన్వీనర్ బాడిత శంకర్ మాట్లాడుతూ.. గత ప్రభుత్వ హయాంలో వైసీపీ పంచన చెరి సినీ నటుడు పోసాని కృష్ణ మురళి ఇష్టం వచ్చినట్లు మాట్లాడారు అని ఫైర్‌ అయ్యారు.. ప్రస్తుత ఉప ముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్‌, ఆయన కుటుంబ సభ్యులను కూడా కించపరిచేలా మాట్లాడాడు.. సోషల్ మీడియా వేదికగా ఆయన చేసిన వ్యాఖ్యలు సభ్య సమాజం సిగ్గుపడేలా ఉన్నాయని మండిపడ్డారు. దీనిపై అప్పట్లో పోలీసులకు ఫిర్యాదు చేసిన పట్టించుకోలేదన్నారు.. ఈ క్రమంలో పోసాని కృష్ణమురళి వ్యాఖ్యలను ఖండిస్తూ ఆయనపై భవానిపురం పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాం.. సోషల్ మీడియాలో పోసాని కృష్ణ మురళి వ్యాఖ్యలు తీసివేయాలని పోలీసులను కోరామన్నారు జనసేన పార్టీ ఆంధ్ర జోన్ కన్వీనర్ బాడిత శంకర్.

వాళ్లకు బాధ్యత లేదు.. మనం ప్రజలకు జవాబుదారీగా పనిచేద్దాం
వాళ్లకు బాధ్యత లేదు.. కానీ, మనకు ఉంది.. మనం ప్రజలకు జవాబుదారీగా పనిచేద్దాం అని సూచించారు ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు.. అసెంబ్లీలో స్పీకర్ చింతకాయల అయ్యన్న పాత్రుడు అధ్యక్షతన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల వర్క్ షాప్ జరిగింది.. అసెంబ్లీ సమావేశాలు, బడ్జెట్ వంటి అవకాశాలపై వర్క్ షాప్ నిర్వహించారు.. తొలిసారి ఎమ్మెల్యేలైన వారికి బడ్జెట్ పై అవగాహన కోసం వర్క్ షాప్ నిర్వహించారు.. బడ్జెట్ పై పీఆర్ఎస్ లెజిస్లేటివ్ రీసెర్చ్ సంస్థ ప్రతినిధుల ప్రజెంటేషన్ ఇచ్చారు.. ఇక, ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు మాట్లాడుతూ.. బడ్జెట్ సమావేశాలపై ఎమ్మెల్యేలకు అవగాహన ఉండాలన్నారు.. ప్రభుత్వం తెచ్చే బిల్లులు, పాలసీలపై ప్రతి ఎమ్మెల్యే అధ్యయనం చేయాలని సూచించారు. పబ్లిక్ గవర్నెన్స్ లో ఎమ్మెల్యేలనూ భాగస్వామలను చేస్తాం.. ప్రజలు మనపై అనేక ఆశలు పెట్టుకున్నారు.. నమ్మకం పెట్టుకున్నారు.. ప్రజల నమ్మకం మేరకు వారి సమస్యలపై సభలో చర్చించాలి. అర్థవంతమైన చర్చలకు సభ వేదిక కావాలని సూచించారు.

40 ఏళ్లుగా రాజకీయాల్లో ఉన్నా.. ఇంకా నేర్చుకోవాల్సింది చాలా ఉంది..
నేను 40 సంవత్సరాలుగా రాజకీయాల్లో ఉన్నాను.. కానీ, ఇంకా నేర్చుకోవాల్సినవి చాలా ఉన్నాయి అన్నారు ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ స్పీకర్‌ చింతకాయల అయ్యన్న పాత్రుడు.. అసెంబ్లీలో ఈ రోజు స్పీకర్‌ అయ్యన్నపాత్రుడు అధ్యక్షతన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో వర్క్ షాప్ నిర్వహించారు.. ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పాల్గొన్నారు. ఇక, స్పీకర్ అయ్యన్న పాత్రుడు వర్క్ షాప్‌ను ఉద్దేశించి మాట్లాడుతూ.. నేను 40 సంవత్సరాలుగా రాజకీయాల్లో ఉన్నా, ఇంకా నేర్చుకోవలసినవి చాలా ఉన్నాయని వెల్లడించారు.. ఇప్పుడు మొదటి సారి ఎమ్మెల్యేలైన వారికి ఈ వర్క్ షాప్ ఎంతో ఉపయోగపడుతుందన్నారు.. అసెంబ్లీ రూల్స్ ప్రతి ఒక్క ఎమ్మెల్యేకు తెలియాలి. సభలో ఏమి చేయాలో, ఏమి చేయకూడదో తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు.. రోజుకి పది ప్రశ్నలకే సమయం సరిపోతుంది.. కానీ, జీరో హవర్స్‌లో హ్యాండ్ రైజ్ చేస్తే వారికి నేను అవకాశం ఇస్తాను అని పేర్కొన్నారు స్పీకర్‌ అయ్యన్నపాత్రుడు..

ఎన్‌హెచ్‌ఆర్సీలో ఫిర్యాదు.. ప్రతి కార్యకర్తకు అండగా నిలబడతాం..
ఆంధ్రప్రదేశ్‌ రాజకీయాల్లో ఇప్పుడు సోషల్ మీడియా పోస్టులు కాకరేపుతున్నాయి.. ఇదే సమయంలో.. కేసులు, అరెస్ట్‌లు జరుగుతున్నాయి.. అయితే, అధికార కూటమి వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీని టార్గెట్‌ చేసి అరెస్ట్‌లు చేస్తున్నారనే విమర్శలు ఉన్నాయి.. ఈ ఘటనలపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ నేత వైవీ సుబ్బారెడ్డి మాట్లాడుతూ.. వైసీపీ సోషల్ మీడియా కార్యకర్తలను పోలీసులు వేధిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.. అయితే, ప్రతి కార్యకర్తకు మేం అండగా నిలబడతాం అన్నారు.. ఇప్పటి వరకు రాష్ట్రంలో 57 మంది సోషల్ యాక్టివిస్టులపై అక్రమ కేసులు బనాయించారు.. 12 మంది కార్యకర్తల ఆచూకీ తెలియడం లేదన్నారు.. హైదరాబాద్‌లో ఉండే పెద్దిరెడ్డి సుధారాణి అనే మహిళను అరెస్టు చేయకుండా ఐదు రోజులపాటు అక్రమంగా నిర్బంధించారని మండిపడ్డారు.. మా ఎంపీలు, మాజీ ఎమ్మెల్యేలను నియోజకవర్గంలో తిరగకుండా ప్రయత్నాలు చేస్తున్నారని ఫైర్ అయ్యారు. ఈ అంశాలన్నింటిని మానవ హక్కుల సంఘంలో ఫిర్యాదు చేశామని వెల్లడించారు.. మా కార్యకర్తలను హింసించి వారి నుంచి అనుకూల స్టేట్మెంట్లు తీసుకుంటున్నారు.. తక్షణమే ఈ అంశంలో జోక్యం చేసుకోవాలని జాతీయ మానవ హక్కుల సంఘాన్ని కోరామని తెలిపారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ నేత వైవీ సుబ్బారెడ్డి..

ఫిరాయింపు ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్‌పై హైకోర్టులో వాదనలు పూర్తి.. తీర్పు రిజర్వ్
తెలంగాణలో పార్టీలో ఫిరాయించిన ఎమ్మెల్యేలకు అనర్హత విధించేందుకు సంబంధించి హైకోర్టులో మంగళవారం విచారణ ముగిసింది. అసెంబ్లీ కార్యదర్శి దాఖలు చేసిన అప్పీల్‌పై హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి (సీజే) ధర్మాసనం వాదనలు విని తీర్పును రిజర్వు చేసింది. ఈ సందర్భంగా, బీఆర్‌ఎస్‌ (BRS) తరఫున సీనియర్ న్యాయవాది మోహన్‌రావు వాదనలు వినిపించారు. సింగిల్‌ జడ్జి తీర్పుపై అప్పీల్‌ చేసే అర్హత అసెంబ్లీ కార్యదర్శికి లేదన్నారు. అసెంబ్లీ స్పీకర్‌ పక్షాన నిర్ణయం తీసుకోవాల్సిన బాధ్యత ఉందని చెప్పారు. అలాగే, అసెంబ్లీ కార్యదర్శి దాఖలు చేసిన అప్పీల్‌కు విచారణ అర్హత లేదు అనే వాదనను కూడా హైకోర్టుల న్యాయమూర్తి ముందుకు పెట్టారు. ఇప్పటికే, ఈ కేసు పై సింగిల్ జడ్జి తీర్పు వచ్చిన నేపధ్యంలో, స్పీకర్‌కు అనర్హత పిటిషన్లపై సకాలంలో నిర్ణయం తీసుకోవాల్సిన బాధ్యత ఉన్నట్లు సూచించబడింది. ఇరు పక్షాల వాదనలు విన్న హైకోర్టు ధర్మాసనం, మరింత విచారణ చేపట్టకుండా తీర్పును రిజర్వు చేసింది.

సౌదీ అరేబియాలోని రియాద్ మెట్రోను నడపనున్న హైదరాబాద్‌ మహిళ
ప్రస్తుత కాలాన్ని నారీ శక్తి యుగంగా చెప్పుకోవచ్చు. ఇప్పుడు కూడా మహిళలు అన్ని రంగాల్లో రాణిస్తున్నారు. ఈ కారణంగానే మహిళలు బలవంతులని చెబుతారు. సౌదీ అరేబియాలోని రియాద్ మెట్రో నడపడానికి హైదరాబాద్‌కు చెందిన ఓ మహిళ ఎంపికైంది. అవును, లోకో పైలట్‌గా పనిచేస్తున్న ఈ మహిళ ఇప్పుడు సుదూర సౌదీ అరేబియాలో మెట్రో రైలు నడపబోతోంది. ఈ వార్త ఇప్పుడు వైరల్ అవుతోంది. హైదరాబాద్‌కు చెందిన ఇందిరా ఈగలపాటి అనే 33 ఏళ్ల మహిళ సౌదీ అరేబియాలోని రియాద్ మెట్రోలో పని చేయడానికి ఎంపికైంది. దాదాపు 5 సంవత్సరాలుగా లోకో పైలట్ , స్టేషన్ ఆపరేషన్ మాస్టర్‌గా పనిచేస్తున్న ఇందిర సౌదీ అరేబియాలోని రియాద్ మెట్రోను నడపడానికి ఎంపికయ్యారు , ఈ ప్రపంచ స్థాయి, ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్‌లో నేను కూడా భాగమని చెప్పడానికి నేను చాలా గర్వపడుతున్నానని ఆమె తెలిపారు. ఇందిరా ఆంధ్రప్రదేశ్‌లోని గుంటూరు జిల్లాకు చెందిన దుమ్ముగూడెం నివాసి, 2006లో హైదరాబాద్‌లో స్థిరపడ్డారు. మెకానిక్ అయిన అతని తండ్రి ఇందిరతో సహా తన ముగ్గురు పిల్లలకు మంచి విద్యను అందించాడు. మంచి చదువు చదివిన ఇందిర అక్క టీచర్, ఇందిరతో పాటు ఇందిర తమ్ముడు ఇంజినీరింగ్ పట్టభద్రుడై హైదరాబాద్ మెట్రోలో లోకో పైలట్ ఉద్యోగం సంపాదించాడు. అలా నిరుపేద కుటుంబం నుంచి పెరిగిన ఇందిర ఇప్పుడు అంతర్జాతీయ స్థాయిలో లోకో పైలట్ గా గుర్తింపు తెచ్చుకుంది.

రూ. 60 దొంగతనం.. 30 ఏళ్ల తర్వాత చిక్కిన నిందితుడు..
తమిళనాడు మధురైలో ఆసక్తికరమైన ఘటన చోటు చేసుకుంది. 1997లో రూ.60ని దొంగిలిచిన వ్యక్తిని 27 ఏళ్ల తర్వాత అరెస్ట్ చేశారు. పరారీలో ఉన్న నిందితుడిని ప్రత్యేక పోలీసుల బృందం గుర్తించింది. శివకాశికి చెందిన 55 ఏళ్ల పన్నీర్ సెల్వం అనే వ్యక్తిని మధురై జిల్లా పోలీసులు అరెస్ట్ చేసింది. దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న ఈ కేసును గుర్తించేందుకు అసిస్టెంట్ కమిషనర్ సూరకుమార్ ఆధ్వర్యంలో ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేశారు. పరారీలో ఉన్న నిందితులపై ప్రత్యేక సబ్‌ఇన్‌స్పెక్టర్లు సంతానపాండియన్‌, పన్నీర్‌సెల్వన్‌ నేతృత్వంలో బృందం దృష్టి సారించింది.ఈ కేసు 1997లో తెప్పకులం అనే పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. బాధితుడిని నుంచి పన్నీర్ సెల్వం రూ. 60ని దొంగిలించి పరారీలో అయ్యాడు. ఈ కేసును దర్యాప్తు చేసిన అధికారులు ఇటీవల జక్కతొప్పును సందర్శించిన సమయంలో, పనీర్ సెల్వం శివకాశి వెళ్లినట్లు గుర్తించారు. పెళ్లి చేసుకున్న నిందితుడు రహస్య జీవితాన్ని గడిపాడు. జనాభా సర్వేయర్ల ముసుగులో వెళ్లిన పోలీసులు అతడి కుటుంబాన్ని వివరాలు అడిగారు. గుర్తింపు నిర్ధారించుకున్న తర్వాత, నేరం జరిగిన 27 ఏళ్లకు వ్యక్తిని అరెస్ట్ చేశారు.

భారత మద్దతుదారుడే అమెరికా విదేశాంగ కార్యదర్శి.. ట్రంప్ కీలక ఎంపిక..!
డొనాల్డ్ ట్రంప్ ఘన విజయం తర్వాత తన అడ్మినిస్ట్రేషన్ కూర్పును సిద్ధం చేసుకునే పనిలో ఉన్నారు. ముఖ్యంగా భారతీయ అనుకూల అమెరికన్లకు ట్రంప్ పెద్దపీట వేస్తున్నారు. ఇప్పటికే జాతీయ భద్రతా సలహాదారుగా మైక్ వాల్ట్జ్‌ని నియమించుకున్నారు. యూఎస్ సెనెట్‌లో ఇండియా కాకస్ అధిపతిగా ఉన్నారు. ఇండియాకు గట్టి మద్దతుదారుగా వాల్ట్జ్‌కి పేరుంది. దేశ రక్షణ వ్యవస్థని మరింత పటిష్టం చేస్తానని గతంలో చాలా సార్లు వాల్ట్జ్ పేర్కొన్నారు. ట్రంప్‌కి ఈయన లాయలిస్ట్‌గా ఉన్నారు. 2023లో ప్రధాని మోడీ అమెరికా పర్యటన సందర్భంగా క్యాపిటల్ హిల్‌లో చారిత్రత్మక ప్రసంగాన్ని ఏర్పాటు చేయడంలో మైక్ వాల్ట్జ్ కీలక పాత్ర పోషించారు. మైక్‌కి సైనికపరంగా చాలా అనుభవం ఉంది. ఫ్లోరిడా గార్డ్స్‌లో పనిచేయడానికి ముందు ఆయన నాలుగు ఏల్లు సైన్యంలో పనిచేశాడు. 50 ఏళ్ల వాల్ట్జ్ ఫ్లోరిడా నుంచి మూడు సార్లు అమెరికన్ కాంగ్రెస్‌కి ప్రాతినిధ్యం వహించారు.

డిప్లొమా అభ్యర్థులకు హెచ్‌ఏఎల్ ఉద్యోగాలు.. ఇరవై వేలకు పైగా జీతం
హిందూస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ (HAL)లో ఉద్యోగాలు చేయాలనుకునే యువతకు నోటిఫికేషన్ రానే వచ్చేసింది. హెచ్‌ఏఎల్ నాన్ ఎగ్జిక్యూటివ్ డిప్లొమా టెక్నీషియన్, ఆపరేటర్ పోస్టుల భర్తీకి ఆన్‌లైన్ దరఖాస్తులను ఆహ్వానించింది. అధికారిక వెబ్‌సైట్ https//hal-india.co.inలో 7 నవంబర్ 2024 నుండి దరఖాస్తు ప్రక్రియ కూడా ప్రారంభించబడింది. దీనిలో అర్హత గల అభ్యర్థులు 24 నవంబర్ 2024 వరకు అప్లై చేసుకోవచ్చు. కేవలం ఆన్‌లైన్ ద్వారా మాత్రమే దరఖాస్తులు చేసుకోవాలి. హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ (HAL) అనేది భారత ప్రభుత్వం ఒక ప్రధాన ఏరోనాటిక్స్ కంపెనీ. దీనిలో ఉద్యోగం చేయడానికి ఇది ఒక గొప్ప అవకాశం. ఖాళీకి దరఖాస్తు చేయడానికి, అభ్యర్థులు గుర్తింపు పొందిన బోర్డు నుండి 10+3 సిస్టమ్‌ను కలిగి ఉండాలి. అంటే సంబంధిత రంగంలో 3 సంవత్సరాల డిప్లొమాతో 10వ ఉత్తీర్ణత/NAAC 3 సంవత్సరాలు ఆపరేటర్‌కు లేదా ITIకి 2 సంవత్సరాలు సంబంధిత సబ్జెక్ట్, NCTVT మొదలైనవాటితో అర్హత కలిగి ఉండాలి. అభ్యర్థులు అధికారిక రిక్రూట్‌మెంట్ నోటిఫికేషన్ నుండి వివరణాత్మక అర్హత సంబంధిత సమాచారాన్ని తనిఖీ చేయవచ్చు. పూర్తి వివరాల కోసం https://hal-india.co.in/backend//wp-content/uploads/career/TBO%20NOTIFICATION%2007.11.2024_1730975399.pdf డౌన్‌లోడ్ చేసుకోండి.

మీకు అలా జరిగిందా? అయితే బ్యాంకు మీకు రోజుకు రూ.100 చెల్లించాల్సిందే
మీరు ATMకి డబ్బు తీసుకోవాడిని వెళ్ళినప్పుడు పొరపాటున కానీ.. లావాదేవీ విఫలమై ఖాతా నుంచి డబ్బు కట్ అవుతూ ఉంటాయి. ఈ మధ్యకాలంలో ఇది తరచుగా జరుగుతుంది. అందుకే, ఆర్‌బీఐ కఠిన నిబంధనలు రూపొందించింది. ఎవరికైనా ఏదైనా నగదు లావాదేవీ విఫలమైతే, పరిమిత వ్యవధిలో బ్యాంక్ తిరిగి చెల్లిస్తుంది. కానీ, ఇది జరగకపోతే బ్యాంకు తన కస్టమర్ కు జరిమానా చెల్లించాల్సి ఉంటుంది. అవును, విఫలమైన లావాదేవీపై ఖాతా నుండి తీసివేయబడిన డబ్బును బ్యాంక్ వాపసు చేయాల్సి ఉంటుంది. బ్యాంకు ఇలా చేయకుంటే రోజుకు రూ.100 జరిమానా చెల్లించాల్సి ఉంటుంది. దీనిపై బ్యాంకింగ్ రెగ్యులేటర్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) యొక్క కఠినమైన నియమాలు ఏంటో ఒకసారి చూద్దాం. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గత నెలలో ఒక సర్క్యులర్‌ను జారీ చేసింది. ఇందులో TATని సమం చేయాలని అంటే.. సమయానికి తిరిగి కస్టమర్‌లకు పరిహారం చెల్లించాలని సూచనలు ఇవ్వబడ్డాయి. ఆర్‌బిఐ ప్రకారం లావాదేవీ విఫలమైతే డెబిట్ చేసిన డబ్బును గడువులోపు బ్యాంకు రివర్స్ చేయకపోతే.. దానిపై బ్యాంకు పెనాల్టీ చెల్లించాల్సి ఉంటుంది. బ్యాంకు ఎన్ని రోజులు ఆలస్యం చేస్తే పెనాల్టీ రోజువారీగా పెరుగుతుంది.

ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ది మంత్‌ ఎవరిని వరించిందో తెలుసా..?
అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) మంగళవారం ప్లేయర్ ఆఫ్ ద మంత్‌ను ప్రకటించింది. పురుషుల విభాగంలో పాకిస్థాన్ స్పిన్నర్ నోమన్ అలీకి ఈ నెల (అక్టోబర్‌)లో ప్లేయర్ ఆఫ్ ద మంత్ అవార్డు లభించింది. అలాగే.. మహిళల విభాగంలో అద్భుతమైన ప్రదర్శన కనబరిచిన న్యూజిలాండ్ స్టార్ ఆల్ రౌండర్ అమేలియా కెర్‌కు ప్లేయర్ ఆఫ్ ద మంత్ అవార్డు దక్కింది. గత నెలలో ఇంగ్లండ్‌తో జరిగిన టెస్ట్ సిరీస్‌లో నోమన్ అద్భుతమైన బౌలింగ్ చేసి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. దీంతో.. స్వదేశంలో ఇంగ్లండ్‌తో జరిగిన మూడు టెస్టు మ్యాచ్‌ల సిరీస్‌ను పాకిస్థాన్ 2-1తో కైవసం చేసుకుంది. నోమన్ రెండు మ్యాచ్‌ల్లో 13.85 సగటుతో మొత్తం 20 వికెట్లు తీశాడు. తొమ్మిదేళ్ల తర్వాత ఇంగ్లండ్‌పై పాక్‌ టెస్టు సిరీస్‌ కైవసం చేసుకుంది. నోమన్ అలీ (38) దక్షిణాఫ్రికా ఫాస్ట్ బౌలర్ కగిసో రబడా, న్యూజిలాండ్ స్పిన్నర్ మిచెల్ సాంట్నర్‌లను అధిగమించి ఈ అవార్డును గెలుచుకున్నాడు. ఏడాదికి పైగా రోజుల తర్వాత పాకిస్థానీ ఆటగాడు ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ద మంత్ అవార్డును గెలుచుకున్నాడు. గతేడాది ఆగస్టులో బాబర్ ఆజం ఈ అవార్డును గెలుచుకున్నాడు. ఈ సందర్భంగా నోమన్ మాట్లాడుతూ.. “నేను ఐసీసీ పురుషుల ప్లేయర్ ఆఫ్ ది మంత్‌గా ఎంపికైనందుకు సంతోషిస్తున్నాను. నా అత్యుత్తమ ప్రదర్శనను అందించడంలో నాకు సహాయం చేసిన నా సహచరులందరికీ నేను చాలా కృతజ్ఞతలు తెలుపుతున్నాను. పాకిస్తాన్ ఇంగ్లాండ్‌పై చారిత్రాత్మక టెస్ట్ సిరీస్‌ను గెలుచుకుంది.” అని తెలిపాడు.

విడుదలకు ముందే కేరళలో కంగువ రికార్డ్
స్టార్ హీరో సూర్య నటిస్తున్న ప్రెస్టీజియస్ మూవీ ‘కంగువ’. ఈ చిత్రాన్ని భారీ పీరియాడిక్ యాక్షన్ ఫిల్మ్ గా దర్శకుడు శివ రూపొందిస్తున్నారు. దిశా పటానీ, బాబీ డియోల్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ‘కంగువ’ సినిమాను హ్యూజ్ బడ్జెట్ తో ప్రముఖ నిర్మాణ సంస్థలు స్టూడియో గ్రీన్, యూవీ క్రియేషన్స్ బ్యానర్స్ పై కేఈ జ్ఞానవేల్ రాజా, వంశీ, ప్రమోద్ నిర్మిస్తున్నారు. ఈ సినిమాను నైజాం ఏరియాలో మైత్రీ మూవీ డిస్ట్రిబ్యూటర్స్ రిలీజ్ చేయబోతున్నారు. ‘కంగువ’ సినిమా నవంబర్ 14న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు వస్తోంది. మరో రెండు రోజుల్లో రిలీజ్ కానున్న కంగువ బుకింగ్స్ ఓపెన్ చేసారు. తెలుగు, తమిళ్ లో డీసెంట్ గా సాగుతున్న ఈ సినిమా అడ్వాన్స్ బుకింగ్స్ కేరళలో దుమ్ము దులుపుతున్నాయి. కేరళ అడ్వాన్స్ బుకింగ్స్ ను ఓ సారి పరిశీలిస్తే ఇప్పవరకు రూ. 1. 05 కోట్లు రాబటట్టింది. ఇది హీరో సూర్య కెరీర్ లోనే హయ్యెస్ట్  బుకింగ్స్. గతంలో సూర్య సినిమాకు సంబందించిన ఈ రికార్డు (ET ) సినిమా పేరిట ఉంది. 2022లో వచ్చిన ఈ సీనియా కేరళలో అడ్వాన్స్ బుకింగ్స్ లో రూ. 25 లక్షలు రాబట్టింది. ఈ రికార్డును రిలీజ్ కు ఇంకా రెండు రోజులు ఉండగానే బ్రేక్ చేసాడు. భారీ అంచనాల మధ్య రాబోతున్న కంగువ కేరళలో భారీ ఎత్తున రిలీజ్ కానుంది. ఇప్పటికే తెల్లవారు జామున ఫ్యాన్స్ షోస్ తో హంగామా సృష్టిస్తున్నారు సూర్య ఫాన్స్.  రిలీజ్ నాటికి అడ్వాన్స్ రూపంలో మరింత కలెక్షన్ రాబట్టే అవకాశం ఉంది.

సినిమాలు తీసి మీ డబ్బును వృధా చేసుకుంటారు ఎందుకు
తొలి సినిమా ‘హీరో’తో ఆకట్టుకున్న యంగ్ హీరో అశోక్ గల్లా తన సెకెండ్ మూవీ ‘దేవకీ నందన వాసుదేవ’తో వస్తున్నారు.   అర్జున్ జంధ్యాల దర్శకత్వంలో, లలితాంబిక ప్రొడక్షన్స్ పతాకంపై సోమినేని బాలకృష్ణ నిర్మించారు. నల్లపనేని యామిని సమర్పిస్తున్నారు. తాజగా ఈ  చిత్ర ట్రైలర్ లాంఛ్ వేడుకలో  ఈ సినిమాకు కథ అందించిన స్టార్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ కీలక వ్యాఖ్యలు చేసారు. డైరెక్టర్ ప్రశాంత్ వర్మ మాట్లాడుతూ.. అందరికి నమస్కారం. ప్రతి కథ మీద హీరో పేరు రాసి ఉంటుంది. ఈ కథపై అశోక్ పేరు రాసి ఉంది. సినిమా చూసినప్పుడు చాలా హ్యాపీగా అనిపించింది. మేమేదైతే అనుకున్నామో అర్జున్ గారు ఇంకా బాగా డెవలప్ చేసి చాలా అద్భుతంగా చూపించారు, నిర్మాత బాల  నాకు బాగా కావాల్సిన వారు. అయన ఇండస్ట్రీలోకి వస్తాను అంటే ఎందుకు అండి వద్దు, సినిమా ఇండస్ట్రీ వద్దు, కస్టపడి సంపాదించారు. ఇటు రాకండి. మీ డబ్బును వృధా చేసుకోకండి సినీ చెప్పను. కానీ చాలా మంచి సినిమా చేయాలని చాలా వెయిట్ చేసి ఈ సినిమాని చాలా అద్భుతంగా నిర్మించారు. సినిమా చూశాను చాలా అద్భుతంగా ఉంది. అశోక్, మానస అందరూ చాలా బాగా పెర్ఫార్మ్ చేశారు.  మంచి ఫ్యామిలీ ఫిలం. లవ్ స్టోరీ, యాక్షన్, ఎమోషన్స్ అన్ని ఉన్నాయి. ట్రైలర్లో ఏదైతే ఎనర్జీ చూసారో సినిమా లో ఆ ఎనర్జీ ఉంటుంది. అశోక్ ఈ సినిమాతో మరో మెట్టు పైకెక్కాలని కోరుకుంటున్నాను. అర్జున్ గారు ఈ సినిమాతో నెక్స్ట్ లెవెల్ కి వెళ్లాలని, పెద్ద యాక్టర్స్ తో పనిచేయాలని కోరుకుంటున్నాను. యంగ్ టీం ని ఎంకరేజ్ చేయండి. అందరూ కష్టపడి పని చేశారు. ఈ సినిమా మంచి సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాను’ అని అన్నారు.