NTV Telugu Site icon

Top Headlines @ 5 PM: టాప్‌ న్యూస్‌

Top Headlines @ 5 Pm New

Top Headlines @ 5 Pm New

పీసీబీ ఫైల్స్ దహనం కేసులో ట్విస్ట్..
ఆంధ్రప్రదేశ్‌లో సంచలనం సృష్టించిన పీసీబీ ఫైల్స్ దహనం కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది.. బెజవాడ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు కార్యాలయంలో దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు.. పీసీబీలో ఏడు సెక్షన్లకు సంబంధించిన అధికారులను విచారిస్తున్నారు.. పీసీబీ సెక్షన్ కార్యాలయంలో ఉండాల్సిన ఫైల్స్ బయటకు రావడంపై సంబంధిత అధికారులను ప్రశ్నిస్తున్నారు.. కార్యాలయంలో ఉండాల్సిన ఫైల్స్, హార్డ్ డిస్క్ లు బయటకు వెళ్లటంలో అధికారుల పాత్రపై విచారణ కొనసాగుతోంది.. ఫైల్స్ లో ఉన్న అంశాలు, వాటి ప్రాధాన్యత గురించి స్టేట్ మెంట్స్ రికార్డు చేస్తున్నారు పోలీసులు.. శాఖ ఫైల్స్ బయటకు ఎలా వెళ్లాయి అనే అంశంపై అధికారులను పూర్తిస్థాయిలో ప్రశ్నిస్తున్నట్టుగా తెలుస్తోంది. ఇక, ఈ కేసు విచారణలో పోలీసులకి OSD రామారావు చుక్కలు చూపించినట్టుగా ప్రచారం సాగుతోంది.. ఆ డాక్యుమెంట్స్ పనికిరావని పోలీసులకి విచారణలో చెప్పారట రామారావు.. కానీ, ఆ ఫైల్స్ పడేయాలని చెప్పిన వారి గురించి మాత్రం రామారావు నోరు విప్పలేదట.. ప్రభుత్వ డాక్యుమెంట్స్ డిస్పోజ్ చేసేందుకు ఉన్న ప్రొసీజర్ ఎందుకు ఫాలో అవ్వలేదో కూడా రామారావు చెప్పలేదని తెలుస్తోంది.. పోలీసులు స్వాధీనం చేసుకున్న డాక్యుమెంట్స్ లో కొన్ని పీసీబీ వెబ్ సైట్ లో ఓపెన్ డాక్యుమెంట్స్ గా ఉన్నట్టు పోలీసులు గుర్తించారు.. ఇక, దహనం చేసేందుకు ప్రయత్నించిన ఫైల్స్ లో కీలకమైనవి ఏమన్నా ఉన్నాయా అనే గుర్తించే పనిలో పడిపోయారు పోలీసులు.. కాగా, పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ రికార్డుల దగ్ధం కేసు కలకలం రేపింది.. ఈ కేసులో ఓఎస్డీ ఎస్వీ రామారావుని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు.. సగం కాలిన రికార్డులు, హార్డ్ కాపీలను కూడా గన్నవరం తీసుకెళ్లారు పోలీసులు. ఎక్సైజ్ శాఖలో సుదీర్ఘ కాలం పనిచేసిన రామారావుపై.. గతంలోనూ అవినీతి ఆరోపణలు ఉన్నాయి. మరోసారి ఫైల్స్ దగ్ధం ఘటనలో రామారావు పేరు రావడంపై ఎక్సైజ్ శాఖలో చర్చగా మారిన విషయం విదితమే.

రేపు భోగాపురం ఎయిర్‌పోర్ట్‌కు సీఎం చంద్రబాబు.. ఏర్పాట్లను పరిశీలించిన కలెక్టర్..
ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రేపు విజయనగరం జిల్లాలో పర్యటించనున్నారు.. ఇక, సీఎం చంద్రబాబు పర్యటన ఏర్పాట్లను క‌లెక్టర్ డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ప‌రిశీలించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు 11వ తేదీన అంటే రేపు.. భోగాపురం అంత‌ర్జాతీయ విమానాశ్రయ నిర్మాణ ప‌నుల‌ను ప‌రిశీలించ‌నున్నారు. ఈ నేప‌థ్యంలో ఎయిర్‌పోర్టు ప్రాంతంలో క‌లెక్టర్ ప‌ర్యటించి, ఏర్పాట్లపై అధికారుల‌తో స‌మీక్షించారు. భ‌ద్రతా ఏర్పాట్లపై ఎస్పీ దీపికా పాటిల్‌తో చ‌ర్చించారు. ఇప్పటికే నిర్మిత‌మైన ర‌న్‌వేపై ఏర్పాటు చేస్తున్న హెలీప్యాడ్ స్థలాన్ని క‌లెక్టర్ ప‌రిశీలించారు. అక్కడి నుంచి ఎక్స్‌పీరియ‌న్స్ సెంట‌ర్ వ‌ద్దకు చేరుకొని వివిధ శాఖ‌ల అధికారుల‌తో మాట్లాడారు. ఫొటో ఎగ్జిబిష‌న్‌, వీఐపీ లాంజ్ ఏర్పాట్లపై ప‌లు సూచ‌న‌లు చేశారు. వ‌ర్షాకాలం కావ‌డంతో, జెర్మన్ హేంగ‌ర్లతో ప‌టిష్టమైన షెడ్లను నిర్మించాల‌ని సూచించారు. అనంత‌రం టెర్మిన‌ల్ భ‌వ‌నం వ‌ద్దకు చేరుకొని ఏర్పాట్లపై స‌మీక్షించారు. టెర్మిన‌ల్ భ‌వ‌న నిర్మాణ ప‌నుల ప‌రిశీలించనున్నారు. తొలిసారిగా ముఖ్యమంత్రి హోదాలో చంద్రబాబు.. జిల్లా ప‌ర్యటనకు వస్తున్న నేప‌థ్యంలో ఏర్పాట్లు ప‌క్కాగా ఉండాల‌ని, ఎక్కడా ఎటువంటి పొర‌పాట్లు జ‌ర‌గ‌డానికి వీల్లేద‌ని అధికారుల‌ను ఆదేశాలు జారీ చేశారు కలెక్టర్..

ఏపీలో దారుణం.. తొమ్మిదేళ్ల చిన్నారిపై అత్యాచారం ఆపై హత్య..!
ఏపీలో మరో దారుణమైన ఘటన వెలుగు చూసింది.. తొమ్మిదేళ్ల చిన్నారి.. ఆడుకుంటానని బయటకు వెళ్లింది.. ఎంతకీ ఇంటికి తిరిగి రాలేదు. కళ్లు కాయలు కాసేలా ఎదురు చూశారు తల్లిదండ్రులు.. కానీ, నాలుగు రోజులైంది.. జాడ తెలీలేదు. చివరికి ఆ చిన్నారిపై అత్యాచారం చేసి హత్యచేసారనే సమాచారంతో తల్లిదండ్రుల గుండెలు గుబేలుమన్నాయి.. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. నంద్యాల జిల్లా పగిడ్యాల మండలం ముచ్చుమర్రిలో సుజాత, మద్దిలేటి దంపతులకు ఇద్దు కుమార్తెలు, ఒక కుమారుడు. కూలిపనులు చేసుకొని జీవనం సాగిస్తున్నారు.. రెండవ కుమార్తె వాసంతి 5వ తరగతి చదువుతోంది.. అయితే, ఆదివారం సెలవు కావడంతో ఉదయం ఆడుకుంటానని ఇంటికి దగ్గరలోనే ఉన్న పార్కులోకి వెళ్ళింది. మధ్యాహ్నం దాటినా ఇంటికి రాలేదు. ఎక్కడుందోనని వెతికారు, కనిపోయించలేదు. చీకటి పడింది.. అయినా జాడ దొరకపోవడంతో పీఎస్ లో ఫిర్యాదు చేశారు.ఇక, ఆ తరువాత రోజే ఎంపీ బైరెడ్డి శబరి విజయోత్సవ సభ నందికొట్కూరులో ఉండగా ఆమెకు బాలిక అదృశ్యంపై సమాచారం ఇచ్చారు. వెంటనే ఆచూకీ కనుక్కోవాలి పోలీసులను ఆదేశించింది. రెండు రోజులపాటు వెతికినా ఆచూకీ దొరకలేదు. మూడవ రోజు పోలీస్ జాగిలాలతో ముచ్చుమర్రిలో పరిశీలించారు. పోలీసు జాగిలం పార్కు వద్ద నుంచి 2 కిలోమీటర్ల దూరంలోని ముచ్చుమర్రి లిఫ్ట్ అప్రోచ్ కెనాల్ వరకు వెళ్లింది. బాలిక ఆడుకున్న పార్కులో విచారించారు. ముగ్గురు మైనర్ బాలురపై అనుమానం రావడంతో వారిని అదుపులోకి తీసుకొని తమదైన స్టయిల్ లో విచారించారు పోలీసులు.. అందులో ఒకరు బాలిక వాసంతిపై అత్యాచారం చేసి మల్యాల ఎత్తిపోతల కాలువలో పడేసినట్లు ఒప్పుకున్నట్లు సమాచారం. అనుమానితులు ముగ్గురు 15 ఏళ్ల లోపు వారే.. ముచ్చుమర్రి కి చెందిన వారే. వారిని కాలువ వద్దకు తీసుకువెళ్లి ఎక్కడ పడేసింది చూపించమన్నారు. దర్యాప్తులో అప్పటికే చీకటి పడడంతో మృతదేహం కోసం గాలింపు చర్యలకు అంతరాయం కలిగింది. మరుసటి రోజు ముచ్చుమర్రి ఎత్తిపోతల కాలువలో బాలిక మృతదేహం కోసం గాలింపు చేపట్టారు. ఎంపీ బైరెడ్డి శబరి కూడా కాలువలో బోటులో వెళ్ళింది. ఎమ్మెల్యే జయసూర్య, టీడీపీ నేత, మాజీ ఎమ్మెల్యే బైరెడ్డి రాజశేఖరరెడ్డి, ఎస్పీ రఘువీర్ రెడ్డి గాలింపును పర్యవేక్షించారు.

తెలంగాణ నూతన డీజీపీగా జితేందర్ నియామకం
తెలంగాణ నూతన డీజీపీగా సీనియర్‌ ఐపీఎస్‌ అధికారి జితేందర్‌ను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతం డీజీపీ రవిగుప్తాను హోమ్ శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీగా బదిలీ చేసింది. పంజాబ్‌కు చెందిన జితేందర్‌ 1992 బ్యాచ్‌కు చెందిన ఐపీఎస్ అధికారి జితేందర్‌.. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత తొలి డీజీపీ అయ్యారు. తెలంగాణ డీజీపీగా నియమితులైన సందర్భంగా సచివాలయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని సీనియర్ ఐపీఎస్ అధికారి జితేందర్ మర్యాదపూర్వకంగా కలిశారు. పంజాబ్‌లోని జలంధర్‌లో సాధారణ రైతు కుటుంబంలో జన్మించిన జితేందర్ ఆంధ్రప్రదేశ్ కేడర్‌కు ఎంపికయ్యారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో నిర్మల్ ఏఎస్పీగా పనిచేసిన తర్వాత బెల్లంపల్లి అదనపు ఎస్పీగా విధులు నిర్వర్తించారు. నక్సల్స్ ప్రభావం ఎక్కువగా ఉన్న మహబూబ్ నగర్, గుంటూరు జిల్లాలకు ఎస్పీగా పనిచేశారు. ఢిల్లీలో సీబీఐలో కొంత కాలం పనిచేశారు. 2004-06 మధ్య గ్రేహౌండ్స్ బాధ్యతలుచేపట్టారు. విశాఖపట్నం రేంజ్ డీఐజీగా బాధ్యతలు నిర్వర్తించారు. తెలంగాణ ఉద్యమం సమయంలో వరంగల్ రేంజ్ డీఐజీగా పనిచేశారు. ప్రస్తుతం ఆయన హోంశాఖ ముఖ్య కార్యదర్శిగా ఉన్నారు.

ఫోన్ ట్యాపింగ్ విషయంలో తీవ్రంగా స్పందించిన తెలంగాణ హైకోర్టు
ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో తెలంగాణ హైకోర్టు తీవ్రంగా స్పందించింది. జడ్జీలు, వారి కుటుంబ సభ్యుల పేర్లు ఫోన్‌ నెంబర్లు, ఫోటోలు బహిర్గతం కావడంపై హైకోర్టు అసహనాన్ని వ్యక్తం చేసింది. ఇక మీద ఇలా జరిగితే కోర్టు ఉల్లంఘనల కిందకు వస్తుందని మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది. ఫోన్‌ ట్యాపింగ్‌ విషయంలో సంయమనం పాటించాలని, వ్యక్తిగత జీవితాల్లోకి వెళ్లి అనవసర రాద్ధాంతాలు చేయొద్దని ఉన్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. ఈనెల 23న కౌంటర్‌ దాఖలు చేస్తామని కేంద్రం హైకోర్టుకు వెల్లడించింది. ఈ క్రమంలో తదుపరి విచారణను 23కు హైకోర్టు వాయిదా వేసింది.

ఆర్టీసీలో 3035 కొలువులు.. ఉద్యోగార్థులకు ఎండీ వీసీ సజ్జనార్ కీలక అలర్ట్
తెలంగాణ ఆర్టీసీలో భర్తీ చేసే ఉద్యోగాలపై ఎండీ వీసీ సజ్జనార్ కీలక అప్‌డేట్ ఇచ్చారు. ఉద్యోగ నోటిఫికేషన్ల పేరిట ఆన్‌లైన్‌లో వస్తున్న లింకులను నమ్మవద్దని ఆయన కోరారు. ఆర్టీసీలో ఉద్యోగాల భర్తీ కోసం ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ ఉద్యోగాల భర్తీకి సంబంధించి ఎండీ వీసీ సజ్జనార్ కీలక అలర్ట్ ఇచ్చారు. ఆర్టీసీ ఉద్యోగార్థులకు ముఖ్య గమనిక అంటూ ఆయన అప్‌డేట్ ఇచ్చారు. రాష్ట్ర ప్రభుత్వ అనుమతి మేరకు సంస్థలో 3035 కొలువుల భర్తీకి సంబంధించిన కసరత్తును టీజీఎస్‌ఆర్టీసీ ప్రారంభించిందని సజ్జనార్‌ పేర్కొన్నారు. “3035 పోస్టులకు నోటిఫికేషన్ విడుదలైందని, ఆన్లైన్ లో దరఖాస్తు చేసుకోవాలంటూ కొన్ని లింక్ లు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఉద్యోగార్థుల అర్హతలు, దరఖాస్తు ఫీజు, తదితర వివరాలను అందులో పేర్కొన్నారు. అవన్నీ ఫేక్. ఆ లింక్‌లను ఉద్యోగార్థులు నమ్మొద్దు. క్లిక్ చేసి వ్యక్తిగత వివరాలను నమోదు చేయొద్దని టీజీఎస్‌ఆర్టీసీ యాజమాన్యం విజ్ఞప్తి చేస్తోంది.” అని ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ అలర్ట్ ఇచ్చారు.

ట్రైనీ ఐఏఎస్ ఓవరాక్షన్.. మూల్యం చెల్లించుకున్న అసిస్టెంట్ కలెక్టర్‌
పూజ ఖేద్కర్ అనే ఒక మహిళా ప్రొబేషనరీ ఐఏఎస్.. పూణెలో అసిస్టెంట్ కలెక్టర్‌గా విధులు నిర్వర్తిస్తోంది. ప్రొబేషనరీగా ఉన్నప్పుడు ఆమెకు సౌకర్యాలు ఉండవు. కానీ ఆమె మాత్రం అన్ని ఏర్పాట్లు చేసేసుకుంది. ఉన్నతాధికారుల అనుమతి లేకుండానే ప్రైవేటు ఆడి కారు, పైన రెడ్-బ్లూ బీకన్‌ లైట్లు, మహారాష్ట్ర ప్రభుత్వం అని రాసి ఉన్న నేమ్‌బోర్డు పెట్టేసుకుంది. అంత మాత్రమే కాదు.. వీటితో పాటు తనకు ప్రత్యేక వసతి సౌకర్యాలు కల్పించాలని, తగినంత సిబ్బంది, కానిస్టేబుల్‌తో ఓ అధికారిక ఛాంబర్‌ను ఏర్పాటు చేయాలని డిమాండ్‌ చేసింది. ఇక అంతటితో ఆగకుండా అదనపు కలెక్టర్‌ అజయ్‌ మోర్‌ లేని సమయంలో ముందస్తు అనుమతి తీసుకోకుండా ఆయన ఛాంబర్‌లో ఆమె నేమ్‌ప్లేట్‌ పెట్టుకుని దాన్ని తన ఛాంబర్‌గా మార్చేసుకుంది. పాత కుర్చీలు, సోఫాలు, టేబుల్‌లతో సహా అన్ని మెటీరియల్‌లను తొలగించేసింది. లెటర్ హెడ్, విజిటింగ్ కార్డ్, పేపర్ వెయిట్, నేమ్‌ప్లేట్, రాజముద్ర, ఇంటర్‌కామ్ అందించాలని రెవెన్యూ అసిస్టెంట్‌ను ఆదేశించారు. ఇక ఆమె తండ్రైన రిటైర్డ్ అడ్మినిస్ట్రేటివ్ అధికారి తన కుమార్తె డిమాండ్లను నెరవేర్చాలని కలెక్టర్ కార్యాలయ అధికారులను ఒత్తిడి చేశారు. లేదంటే వారిపై తగిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ వ్యవహారం మహారాష్ట్ర ప్రభుత్వం దృష్టికి వెళ్లడంతో చర్యలు చేపట్టింది. పూణె కలెక్టర్‌ డాక్టర్ సుహాస్ దివాసే.. ప్రభుత్వ చీఫ్ సెక్రటరీ దృష్టికి తీసుకువెళ్లడంతో పూజా ఖేద్కర్‌ను పూణె నుంచి వాషిమ్‌కు బదిలీ చేశారు. ఆమె తన ప్రొబేషన్‌ కాలం పూర్తయ్యే వరకు వాషిమ్ జిల్లాలో సూపర్ న్యూమరరీ అసిస్టెంట్ కలెక్టర్‌గా వ్యవహరిస్తారని ఉన్నతాధికారులు పేర్కొన్నారు.

“గాజా సిటీని వెంటనే ఖాళీ చేయాలి”.. భారీ దాడికి సిద్ధమైన ఇజ్రాయిల్..
ఇజ్రాయిల్-హమాస్ పోరు రోజురోజుకు తీవ్రమవుతోంది. అక్టోబర్ 7 నాటి హమాస్ దాడికి ప్రతీకారంగా హమాస్ మిలిటెంట్ సంస్థను పూర్తిగా నేలకూల్చే వరకు ఇజ్రాయిల్ విశ్రమించేలా కనిపించడం లేదు. ఇప్పటికే ఈ యుద్ధం ద్వారా లక్షల సంఖ్యలో ప్రజలు ప్రభావితమయ్యారు. 30 వేలకు పైగా పాలస్తీనియన్లు చనిపోయారు. అక్టోబర్ 7 నాటి దాడిలో 1200 మందిని హతమార్చిన హమాస్ మిలిటెంట్లు, 251మందిని బందీలుగా గాజలోకి పట్టుకెళ్లారు. అప్పటి నుంచి బందీలను రక్షించేందుకు ఇజ్రాయిల్ మిలిటరీ ఆపరేషన్స్ చేస్తూనే ఉంది. తాజాగా గాజా స్ట్రిప్‌లో ప్రధాన నగరమైన గాజా సిటీ నుంచి ప్రజలు వెళ్లిపోవాలని ఇజ్రాయిల్ సైన్యం బుధవారం వేల కరపత్రాలను సిటీపై విసిరేసింది. గాజాలో ఉన్న ప్రతీ ఒక్కరు నగరం నుంచి దక్షిణాన ఉన్న సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని, హమాస్ లక్ష్యాలను సైన్యం టార్గెట్ చేయడంతో ఈ ప్రాంతం ప్రమాదకరమైన పోరాట ప్రాంతంగా మిగిలిపోతుందని కరపత్రాల్లో హెచ్చరించింది. జూన్ 27న ఇజ్రాయిల్ ప్రజలను తరలించాలని ఉత్తర్వులు జారీ చేసింది, ఆ తర్వాతి రోజుల్లో మరో రెండుసార్లు నగరాన్ని విడిచిపెట్టాలని ఆదేశించింది. గాజా నగరం నుంచి దీర్ అల్-బలాహ్ మరియు అల్-జావియాలోని శిబిరాలకు రెండు సురక్షిత మార్గాల ద్వారా తనిఖీలు లేకుండా ప్రజలు చేరుకోవచ్చని తెలిపింది.

ప్రణీత్ హనుమంతు అరెస్ట్
గత కొంతకాలంగా సోషల్ మీడియాలో అనేక చర్చలకు కారణంగా నిలిచిన యూట్యూబర్ కం నటుడు ప్రణీత్ హనుమంతు అరెస్టు అయినట్లుగా తెలుస్తోంది. పి హనుమంతు అనే పేరుతో ఒక యూట్యూబ్ ఛానల్ నడుపుతున్న ప్రణీత్ హనుమంతు తండ్రి కూతుళ్లు కలిసి ఉన్న ఒక వీడియోని సోషల్ మీడియాలో రోస్ట్ చేస్తూ అభ్యంతరకరమైన వ్యాఖ్యలు చేశారు. తండ్రి కూతుళ్ళ బంధానికే మచ్చ తెచ్చే విధంగా చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చకు కారణమయ్యాయి. సాయిధరమ్ తేజ్ మొదలు మంచు మనోజ్ సహా అనేకమంది తెలుగు హీరోలు ఈ విషయం మీద స్పందిస్తూ చర్యలు తీసుకోవాలంటూ తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలను కోరారు. ఏకంగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సహా డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కూడా స్పందిస్తూ అతని మీద చర్యలు తీసుకుంటామని వెల్లడించారు.

తెలంగాణాలో భారతీయుడు 2 టికెట్ రేట్లు పెంపు ఎంతంటే?
సుమారు 28 ఏళ్ల క్రితం వచ్చిన భారతీయుడు సినిమా ఎంత పెద్ద హిట్ అయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ముఖ్యంగా సినిమాలోని పాటలు ఇప్పటికీ చాలామందికి హాట్ ఫేవరెట్. ఏఆర్ రెహమాన్ సంగీత దర్శకత్వంలో శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా అప్పట్లో ఒక కల్ట్ క్లాసిక్ సినిమాగా నిలబడింది. కమల్ హాసన్ ద్విపాత్రాభినయం చేసిన ఈ సినిమాలో మనీషా కొయిరాలా హీరోయిన్గా నటించగా కస్తూరి వంటి వాళ్ళు ఇతర పాత్రల్లో నటించారు. అలాంటి సినిమాకి సుమారు 28 ఏళ్ల తర్వాత భారతీయుడు 2 అనే పేరుతో ఒక సీక్వెల్ చేశారు. త్వరలోనే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. శంకర్ దర్శకత్వంలో కమల్ హాసన్ ఈ సినిమాలో కూడా నటిస్తున్నారు. ఇక ఈ సినిమాలో సిద్ధార్థ, రకుల్ ప్రీత్ సింగ్, బాబీ సింహా, సముద్రఖని, ఎస్ జె సూర్య వంటి వాళ్ళు ఇతర కీలకపాత్రలలో నటిస్తున్నారు. ఇక తాజాగా ఈ సినిమాకి తెలంగాణ ప్రభుత్వం సినిమా టికెట్ రేట్లు పెంచుకునే అమ్ముకునే అవకాశం కల్పించింది. మల్టీప్లెక్స్ లో 75 రూపాయలతో పాటు సింగిల్ స్క్రీన్స్ లో 50 రూపాయలు పెంచుకునే అమ్ముకునే అవకాశం కల్పించారు. ఈ మధ్యనే రేవంత్ రెడ్డి సినిమా టికెట్ రేట్లు పెంచి అమ్ముకోవాలంటే యాంటీ డ్రగ్స్ క్యాంపెయిన్ చేయాలని ఈ మేరకు హీరో హీరోయిన్లతో వీడియోలు రిలీజ్ చేయించాలని కోరారు. అందులో భాగంగా ఈ సినిమాలో నటించిన కమల్ హాసన్, సిద్ధార్థ, సహ సముద్ర ఖని వంటి వాళ్ళు డ్రగ్స్ వినియోగం తప్పంటూ వీడియో రిలీజ్ చేశారు. ఈ మేరకు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేయగా ప్రభుత్వం 75 రూపాయలు మాక్సిమం 50 రూపాయలు మినిమం పెంచుకుని అమ్ముకునేలా అవకాశం కల్పించింది. అలాగే ఉదయాన్నే మరో షో వేసుకునేందుకు కూడా అవకాశం కల్పించింది. అయితే ఏపీలో ఎలా పెంచబోతున్నారు అనే విషయం మీద క్లారిటీ లేదు. తెలంగాణలో ఈ సినిమాని సురేష్ ప్రొడక్షన్స్ సంస్థ రిలీజ్ చేస్తుంది.

10 ఏళ్ల క్రితమే పెళ్లి.. అబార్షన్లు.. మారు పేరుతో విదేశీ ట్రిప్పులు.. రాజ్ తరుణ్ కేసులో సంచలనాలు
రాజ్ తరుణ్ లావణ్య కేసులో కొత్త ట్విస్ట్ తెర మీదకు వచ్చింది. తనను పదేళ్ల క్రితమే రాజ్ తరుణ్ పెళ్లి చేసుకున్నాడని పదేళ్లుగా తనతో కాపురం చేస్తున్నాడని లావణ్య పేర్కొంది. రాజ్ తరుణ్ అబార్షన్ చేయించాడని నార్సింగ్ పీఎస్ లో మరో ఫిర్యాదు చేసింది. నన్ను రెచ్చగొట్టి ఉద్దేశ పూర్వకంగా నా ఆడియోలు రికార్డ్ చేశాడని లావణ్య పేర్కొంది. మాల్వీ మల్హోత్రాతో రాజ్ తరుణ్ విదేశాలకు వెళ్లేందుకు ప్రయత్నాలు చేసున్నాడని కూడా లావణ్య చెబుతోంది. 170 ఫోటోలు, టెక్నీకల్ ఎవిడెన్స్ ను నార్సింగ్ పోలీసులకు అప్పగించింది లావణ్య. ఈ క్రమంలో ఆధారాలు లేవని కేసు నమోదు చేయని పోలీసులు రాజ్ తరుణ్ పై ipc 493 తో పాటు మరి కొన్ని సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. మొత్తం రాజు తరుణ్ పైన మూడు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. Ipc 420 సెక్షన్, 506, 493 సెక్షన్లపై కేస్ నమోదు చేసిన నార్సింగి పోలీసులు. తాను అన్విక పేరుతో రాజ్ తో కలిసి అనేక విదేశీ ట్రిప్పులకి కూడా తీసుకు వెళ్లాడని కూడా ఆమె చెబుతోంది. ఇక కేసు నమోదు చేసిన పోలీసులు త్వరలో రాజ్ తరుణ్ కి నోటీసులు ఇచ్చి విచారించనున్నారు నార్సింగ్ పోలీసులు. మరోపక్క లావణ్య పై సినీ నటి మాల్వి మల్హోత్రా ఫిర్యాదు చేసింది. ఫిలింనగర్ పోలీస్ స్టేషన్లో తన సోదరుడికి లావణ్య అనుచిత సందేశాలను పంపుతోంది అంటూ లావణ్య పై మాల్వి మల్హోత్రా ఫిర్యాదు చేశారు. మరోవైపు తనపై తప్పుడు ప్రచారం చేస్తుందంటూ మాల్వి మల్హోత్రా ఫిర్యాదు చేసింది. మల్హోత్రా ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకునే దర్యాప్తు చేస్తున్నారు ఫిలింనగర్ పోలీసులు.