Site icon NTV Telugu

Top Headlines @ 5 PM: టాప్‌ న్యూస్‌

Top Headlines @ 5 Pm New

Top Headlines @ 5 Pm New

కడప మాజీ మేయర్ సురేష్ బాబుకి హైకోర్టు షాక్
కడప మాజీ మేయర్ సురేష్ బాబుకు ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టు షాక్‌ ఇచ్చింది.. మాజీ మేయర్ సురేష్ బాబు దాఖలు చేసిన పిటిషన్‌పై ఆంధ్రప్రదేశ్ హైకోర్టు కీలక తీర్పు ఇచ్చింది. మేయర్ ఎన్నికలపై రాష్ట్ర ఎన్నికల కమిషన్ (ఈసీ) విడుదల చేసిన నోటిఫికేషన్‌ను సవాలు చేస్తూ సురేష్ బాబు హైకోర్టును ఆశ్రయించారు. రేపు జరగాల్సిన కడప మేయర్ ఎన్నిక కోసం ఈ నెల 4న ఎన్నికల సంఘం నోటిఫికేషన్ జారీ చేసిన విషయం తెలిసిందే. అయితే, ఈ నోటిఫికేషన్‌ను రద్దు చేయాలంటూ మాజీ మేయర్ సురేష్ బాబు కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. వాదనలు విన్న అనంతరం హైకోర్టు.. సురేష్‌ బాబు దాఖలు చేసిన పిటిషన్‌ను డిస్మిస్ చేసింది. దీంతో ఈసీ జారీ చేసిన నోటిఫికేషన్ అలాగే అమల్లోకి రావడంతో, మేయర్ ఎన్నికలు నిర్ణీత తేదీకి నిర్వహించేందుకు అడ్డంకులు తొలగిపోయినట్టు అయ్యింది..

చంద్రబాబువి పిచ్చి, కాకి లెక్కలు.. కేవలం తాను చెప్పినవే నిజాలు అన్నట్టుగా కామెంట్స్..
ఆంధ్రప్రదేశ్‌ ఆర్థిక పరిస్థితి, అప్పులపై మరోసారి కూటమి ప్రభుత్వం.. గత వైసీపీ ప్రభుత్వ నేతలపై మాటల యుద్ధం నడుస్తోంది.. సీఎం నారా చంద్రబాబు నాయుడుపై మాజీ ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఇటీవల చంద్రబాబు విడుదల చేసిన స్థూల ఉత్పత్తి లెక్కలు పూర్తిగా తప్పుదారి పట్టించేలా ఉన్నాయని ఆయన ఆరోపించారు. చంద్రబాబు ఎప్పటిలాగే పిచ్చి లెక్కలు, కాకి లెక్కలు చెబుతున్నారు. ప్రజలు ఇవి నమ్మరు అని విమర్శించారు. ప్రభుత్వం చేపట్టిన చర్యల వల్ల ఆర్థిక వ్యవస్థ విధ్వంసం అయిందని చంద్రబాబు వ్యాఖ్యానించడం వ్యూహాత్మక ప్రచారం తప్ప మరేమీ కాదన్నారు. ఏడాదిన్నర గడిచినా కూడా చంద్రబాబు ఇంకా గత ప్రభుత్వంపైనే విమర్శలు చేస్తుండటం బాధాకరమని బుగ్గన మండిపడ్డారు.. మీ పాలనలో మీరు 4.5 శాతం కేంద్రానికి ఇచ్చారు. కోవిడ్ ఉన్నా కూడా మా ప్రభుత్వం 4.8 శాతం ఇచ్చింది.. మరి ఎవరు బాగా ఇచ్చారో అర్థం అవుతుంది అని వివరించారు.. తలసరి ఆదాయం తగ్గిందనే చంద్రబాబు వ్యాఖ్యలకు కౌంటర్‌ ఇస్తూ.. జాతీయ స్థాయిలో ఆదాయం తగ్గినా వైసీపీ పాలనలో పెరిగిందని చెప్పారు. ఆర్బీఐ, కంఫ్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ లెక్కలు తప్పు అంటూ, కేవలం తాను చెప్పినవే నిజమన్నట్టు చంద్రబాబు మాట్లాడటం విచిత్రమని బుగ్గన ఎద్దేవా చేశారు..

తిరుమల పరకామణి చోరీ కేసులో ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు
సంచలనంగా మారిన తిరుమల పరకామణి చోరీ కేసులో ఆంధ్రప్రదేశ్ హైకోర్టు కీలక ఆదేశాలను జారీ చేసింది. చోరీ కేసుకు సంబంధించి దర్యాప్తు వేగవంతం చేయడంతో పాటు, సంబంధిత విభాగాలకు అనుసరించాల్సిన సూచనలను కూడా కోర్టు స్పష్టంగా తెలియజేసింది. చోరీ కేసు విషయంలో ఎఫ్ఐఆర్ నమోదు చేసి, చట్టప్రకారం అవసరమైన చర్యలు తీసుకునేందుకు సీఐడీ, ఏసీబీ డీజీలకు హైకోర్టు పూర్తి వెసులుబాటు కల్పించింది.. కేసులో నిందితుడు రవికుమార్ ఆస్తులపై దర్యాప్తు కొనసాగించాలని ఆదేశించింది. ఈ కేసు ఒక దశలో లోక్‌ అదాలత్‌లో రాజీ వివాదం జరిగినప్పటికీ, అది దర్యాప్తులో అడ్డంకిగా పరిగణించరాదని కోర్టు స్పష్టం చేసింది. కేసు పూర్తి స్థాయిలో వెలుగులోకి రావడానికి రవికుమార్ ఆస్తులపై విచారణను కొనసాగించాల్సిందేనని తీర్పు ఇచ్చింది. దర్యాప్తు సమర్థవంతంగా సాగేందుకు ఇరు సంస్థలు సేకరించిన ఆధారాలు, సమాచారం, వివరాలను పరస్పరం పంచుకోవాలని హైకోర్టు సూచించింది. ఇది కేసు నిజానిజాలు వెలికితీయడంలో కీలకంగా ఉంటుందని కోర్టు పేర్కొంది. కోర్టు మరో కీలక నిర్ణయంగా, అప్పటి టీటీడీ CVSO వై. సతీష్‌కుమార్ పోస్టుమార్టం సర్టిఫికేట్‌ను సీల్డ్‌ కవర్‌లో హైకోర్టు రిజిస్ట్రార్ జ్యుడీషియల్‌కు అందజేయాలని సీఐడీకి ఆదేశించింది. ఈ రిపోర్ట్ కేసు దర్యాప్తులో ఎంతో ముఖ్యమైన పాత్ర పోషించనున్నట్లు సూచనలు ఉన్నాయి. ఇక, దర్యాప్తు సమయంలో అవసరమైతే సేకరించిన సమాచారం, ఆధారాలను ఆదాయపు పన్ను శాఖ (Income Tax Department), ఈడీ (Enforcement Directorate) తో పంచుకోవచ్చని కోర్టు స్పష్టంచేసింది. ఈ చర్య ద్వారా ఆర్థిక అక్రమాలపై మరింతగా వెలుగు పడే అవకాశం ఉంది. సీఐడీ మరియు ఏసీబీ డీజీలు సమర్పించిన నివేదికలను పరిశీలించిన అనంతరం హైకోర్టు ఈ కీలక ఆదేశాలను జారీ చేసింది. విచారణలో తదుపరి చర్యల దిశగా ఇది ముఖ్యమైన మలుపు అని న్యాయవర్గాలు భావిస్తున్నాయి. ఈ కేసుపై హైకోర్టు తదుపరి విచారణ ఈ నెల 16వ తేదీకి వాయిదా వేసింది. అప్పటికి మరిన్ని నివేదికలు, ఆధారాలు సమర్పించాల్సి ఉండొచ్చు.

ఇప్పుడే కాదు.. ఎప్పుడూ చంద్రబాబు నైజం అంతే.. బొత్స ఫైర్‌
ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పై తీవ్రస్థాయిలో మండిపడ్డారు శాసన మండలి ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ.. విజయనగరంలో మీడియాతో మాట్లాడిన ఆయన.. వైద్య విద్యను ప్రయివేటు చేతుల్లో పెట్టే ప్రభుత్వ నిర్ణయంపై ఆందోళన వ్యక్తం చేస్తూ, ప్రభుత్వ వైఖరిపై విమర్శలు గుప్పించారు.. వైద్యాన్ని ప్రయివేటు పరం చేయొద్దు అని ప్రజల్లో అవగాహన కల్పించేందుకు విస్తృత ఉద్యమం చేపట్టినట్టు బొత్స తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా 26 జిల్లాల్లో కోటి సంతకాల సేకరణ కార్యక్రమం నిర్వహిస్తున్నట్టు వెల్లడించారు. ఈ సంతకాల పత్రాలను త్వరలోనే జగన్ మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో గవర్నర్‌కి అందజేస్తామని చెప్పారు. ప్రపంచంలో ఎక్కడా వైద్యాన్ని ఇలా పూర్తిగా ప్రయివేటు వారికి అప్పగించడం జరుగదు అన్నారు బొత్స.. ప్రభుత్వం ప్రజా ప్రయోజనాలు పక్కనపెట్టి, కార్పొరేట్ స్వార్థం కోసం నిర్ణయాలు తీసుకుంటోందని ఆరోపించారు. చంద్రబాబు ఎప్పుడూ కార్పొరేట్ వారికే మొగ్గు. ఇది కొత్తేం కాదు.. ఆయన నైజం ఎప్పటినుంచో ఇదే అన్నారు. ప్రభుత్వ వైద్య కళాశాలలు తగ్గితే, పేదలకు వైద్య విద్య అందడం కష్టమవుతుందని బొత్స హెచ్చరించారు. తమ ప్రభుత్వం మెడికల్ కళాశాలలను తీసుకువచ్చినదే పేదలకు అవకాశాలు కల్పించడానికేనని పేర్కొన్నారు. ఈ ప్రభుత్వం ఒక పిడికెడు బుగ్గి కూడా ఈ మెడికల్ కాలేజీల కోసం ఖర్చు పెట్టలేదు. ఇలా కొనసాగితే MCI అనుమతులే రాకపోవచ్చు అని అన్నారు.

ఇది గ్లోబల్ సమ్మిట్ కాదు.. గోబెల్స్ సమ్మిట్
తెలంగాణ ప్రభుత్వం నిర్వహించిన గ్లోబల్ సమ్మిట్‌పై మాజీ మంత్రి హరీష్ రావు తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ఈ సమ్మిట్‌ను ఆయన ‘గ్లోబల్ సమ్మిట్ కాదు, గోబెల్స్ సమ్మిట్’ అంటూ విమర్శించారు. సీఎం రేవంత్ రెడ్డి విద్యాశాఖ మంత్రిగా, ముఖ్యమంత్రిగా పూర్తిగా విఫలమయ్యారని హరీష్ రావు ఆరోపించారు. “రేవంత్ రెడ్డి ఏం చేస్తున్నారు.? ఈరోజు రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నాడు. దాన్ని మేము వ్యతిరేకిస్తున్నాం,” అని ఆయన అన్నారు. గ్లోబల్ సమ్మిట్ ముసుగులో రియల్ ఎస్టేట్ వ్యాపారానికి తెరలేపారని ఆయన విమర్శించారు. బీఆర్‌ఎస్ ప్రభుత్వం హయాంలో ఫార్మసిటీ కోసం సేకరించిన భూములను ప్రభుత్వం ఇష్టం వచ్చినట్లు పరిశ్రమలకు కట్టబెడుతోందని హరీష్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఫార్మసిటీ ఏర్పాటు చేసి ఉంటే ఎంతో మందికి ఉద్యోగాలు లభించేవని ఆయన గుర్తు చేశారు. డొల్ల పెట్టుబడులు, గ్రౌండ్‌కు కాని ప్రాజెక్టులు.. ప్రభుత్వం ప్రకటించిన పెట్టుబడులన్నీ ‘పేపర్ల మీద మాత్రమే’ ఉన్నాయని, అందులో ఒక్కటి కూడా గ్రౌండ్ అయ్యే అవకాశం లేదని హరీష్ రావు అన్నారు. గతంలో దావోస్ సమ్మిట్ గురించి కూడా ఇలాగే చెప్పారని, కానీ ఒక్కటి కూడా వాస్తవ రూపంలోకి రాలేదని ఆయన పాత ఉదాహరణలను ప్రస్తావించారు.

కాంగ్రెస్ నేతలకు గుడ్ న్యూస్.. ఈ నెలాఖరుకు కార్పొరేషన్ చైర్మన్లు..
టీపీసీసీ అధ్యక్షులు, ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ కాంగ్రెస్ పార్టీ నేతలకు శుభవార్త చెప్పారు. ఈ నెలాఖరులోగా కార్పొరేషన్ చైర్మన్లు, మిగిలిన చైర్మన్ పదవులు, బోర్డు పదవుల భర్తీ ప్రక్రియను పూర్తిచేస్తామని స్పష్టం చేశారు. బుధవారం మీడియాతో చిట్‌చాట్ లో మహేష్ గౌడ్ మాట్లాడుతూ.. రాష్ట్రంలో నిర్వహించిన గ్లోబల్ సమ్మిట్ ఘన విజయం సాధించిందని తెలిపారు. ఈ సమ్మిట్ ద్వారా రాష్ట్రానికి దేశ, విదేశాల నుంచి భారీగా పెట్టుబడులు వచ్చాయని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విజన్, దూరదృష్టికి గ్లోబల్ సమ్మిట్ నిదర్శనమని ఆయన వ్యాఖ్యానించారు. సమ్మిట్ విజయంపై కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, మల్లికార్జున ఖర్గే శుభాకాంక్షలు తెలిపారని చెప్పారు. పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో రాష్ట్రానికి ఎంత పెట్టుబడులు వచ్చాయో చెప్పాలని బీఆర్ఎస్ నేతలను ప్రశ్నించారు. గ్లోబల్ సమ్మిట్ సక్సెస్‌ను చూసి హరీష్ రావుకు గుబులు పట్టిందని విమర్శించారు. దావోస్ సమ్మిట్ వలన దాదాపు లక్ష 70 వేల కోట్ల పెట్టుబడులు వచ్చాయని గుర్తు చేశారు. ఫోర్త్ సిటీ చారిత్రాత్మక నిర్ణయమని, ఫ్యూచర్ సిటీ, ఫోర్త్ సిటీ రెండూ ఒకటేనని మహేష్ గౌడ్ స్పష్టం చేశారు. అన్ని రంగాలకు కేంద్రంగా ఫ్యూచర్ సిటీని అభివృద్ధి చేయాలన్న లక్ష్యంతో ప్రభుత్వం ముందుకు వెళ్తోందని చెప్పారు. ఫ్యూచర్ సిటీతో దేశం చూపు తెలంగాణ వైపే మళ్లిందని అన్నారు.

తొలి విడత పంచాయతీ ఎన్నికలకు సర్వం సిద్ధం..
తెలంగాణ రాష్ట్రంలో తొలి విడత గ్రామపంచాయతీ ఎన్నికల నిర్వహణకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రాణి కుముదిని వెల్లడించారు. గురువారం జరగనున్న తొలి విడత సర్పంచ్, వార్డు సభ్యుల ఎన్నికలు ప్రశాంతంగా, పారదర్శకంగా జరగేలా విస్తృత చర్యలు తీసుకున్నట్లు తెలిపారు. తొలి విడతలో మొత్తం 189 మండలాలు, 4,236 గ్రామపంచాయతీలు, 37,440 వార్డులు ఎన్నికల ప్రక్రియలో భాగంగా ఉన్నాయి. ఇందుకోసం రాష్ట్రవ్యాప్తంగా 37,562 పోలింగ్ స్టేషన్లు ఏర్పాటు చేయగా, తొలి విడతలో 56,19,430 మంది ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. వీరిలో 27,41,070 మంది పురుషులు, 28,78,159 మంది మహిళలు, 201 మంది ఇతరులు ఉన్నారు. ఎన్నికల నిర్వహణ కోసం సుమారు లక్ష మంది ఎన్నికల సిబ్బందిని నియమించామని కమిషనర్ తెలిపారు. ఇందులో 3,591 మంది రిటర్నింగ్ అధికారులు (ROs), 93,905 మంది పోలింగ్ సిబ్బంది ఉన్నారు. అలాగే ఎన్నికల ప్రక్రియను పర్యవేక్షించేందుకు 2,489 మైక్రో ఆబ్జర్వర్లను (మూడు దశల కోసం) నియమించారు. పారదర్శకత కోసం 3,461 పోలింగ్ స్టేషన్లలో వెబ్‌కాస్టింగ్ నిర్వహించనున్నట్లు తెలిపారు. మొత్తం 45,086 బ్యాలెట్ బాక్సులు వినియోగించనున్నారు. ఓటర్ సౌలభ్యం దృష్ట్యా 99 శాతం ఓటర్ స్లిప్పుల పంపిణీ పూర్తయ్యిందని కమిషనర్ వెల్లడించారు. మిగతా ఓటర్లు ‘టీఎస్ ఈ-పోల్ మొబైల్ యాప్’ ద్వారా కూడా తమ ఓటర్ స్లిప్‌ను డౌన్‌లోడ్ చేసుకునే అవకాశం ఉందన్నారు. అలాగే ఓటింగ్ కేంద్రం తెలుసుకునేందుకు అదే యాప్ ఉపయోగపడుతుందని తెలిపారు.

ఎన్డీయే కూటమిలోకి ఓపీఎస్, దినకరన్..? హింట్ ఇచ్చిన అన్నాడీఎంకే..
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలకు మరికొన్ని నెలలు మాత్రమే సమయం ఉంది. ఈ నేపథ్యంలో ఆ రాష్ట్రంలో కీలకమైన రాజకీయ మార్పులు చోటు చేసుకుంటున్నాయి. 2026 అసెంబ్లీ ఎన్నికల్లో ఎలాగైనా గెలవాలని అన్నాడీఎంకే పార్టీ భావిస్తోంది. దీని కోసం ఇప్పటికే బీజేపీతో పొత్తు పెట్టుకుంది. మరోవైపు, పార్టీ నుంచి బహిష్కరించబడిన నేతలు ఓ. పన్నీర్ సెల్వం(ఓపీఎస్), టీటీవీ దినకరన్‌లు మళ్లీ ఎన్డీయే గూటికి వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. డీఎంకేకు వ్యతిరేకంగా సాంప్రదాయ అన్నాడీఎంకే ఓట్ బ్యాంక్ చీలిపోకుండా ఉండేందుకు తెర వెనక బీజేపీ ప్రయత్నాలు మొదలుపెట్టినట్లు తెలుస్తోంది. అన్నాడీఎంకే అధినేత ఎడప్పాడి కే పళని స్వామి(ఈపీఎస్) ఈ ఇద్దరు నేతల్ని నేరుగా తన పార్టీలోకి తీసుకోకపోయినా, ఎన్డీయే కూటమిలోకి తిరిగి రావడానికి బీజేపీ అనుమతిస్తోందని ఊహాగానాలు వ్యక్తమవుతున్నాయి. జయలలిత మరణించిన తర్వాత వరసగా మూడు ఎన్నికల్లో అన్నాడీఎంకే ఓడిపోయింది. ఈసారి మాత్రం విజయం సాధించాలనే పట్టుదలతో ఉంది. మరోవైపు, తమిళనాడులో ఎన్డీయే పొత్తులపై ఈపీఎస్ కు సంపూర్ణ అధికారం ఉంది. ఈ అధికారాన్ని జనరల్ కౌన్సిల్ ఆయనకు కట్టబెట్టింది. ఉమ్మడి ప్రత్యర్థి అయిన డీఎంకేను ఓడించేందుకు భావసారూప్య పార్టీలు ఎన్డీయేలో చేరుతాయని ఇటీవల జనరల్ కౌన్సిల్ ఒక హింట్ ఇచ్చింది. ఇది ఓపీఎస్, దినకరన్ గురించే అని అంతా అనుకుంటున్నారు.

ఛీ ఇదేం పని రా.. మహిళా జర్నలిస్టుకు కన్నుకొట్టిన పాక్ ఆర్మీ ప్రతినిధి..
నిత్యం అబద్ధాలు, అనవసరపు ప్రగల్భాలు పలికే పాకిస్తాన్ నుంచి ఇంతకు మించి ఏం ఆశించగలం. తాజాగా, ఒక ప్రెస్ మీట్‌లో పాకిస్తాన్ సైన్యం ప్రతినిధి మహిళా జర్నలిస్టును చూసి ‘‘కన్నుకొట్టిన’’ సంఘటన వైరల్‌గా మారింది. పాకిస్తాన్ ఇంటర్-సర్వీసెస్ పబ్లిక్ రిలేషన్స్ డైరెక్టర్ జనరల్, లెఫ్టినెంట్ జనరల్ అహ్మద్ షరీఫ్ చౌదరి విలేకరుల సమావేశంలో మహిళా జర్నలిస్టును చూసి కన్నుగీటుతున్నట్లు చూపించే వీడియో వెలువడిన ఆయనపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. సోషల్ మీడియాలో విస్తృతంగా షేర్ చేయబడిన ఈ వీడియోలో, జైలులో ఉన్న మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌పై వచ్చిన ఆరోపణల గురించి, జర్నలిస్ట్ అబ్సా కోమల్ అహ్మద్ షరీఫ్ చౌదరిపై ఒత్తిడి తెస్తున్నట్లు కనిపిస్తోంది. ఇమ్రాన్ ఖాన్ జాతీయ భద్రతకు ముప్పు అని, దేశ వ్యతిరేకి అని, ఢిల్లీకి అనుగుణంగా వ్యవహరిస్తున్నారని ఆర్మీ ప్రతినిధి ఆరోపించారు. ఈ సమయంలోనే అతను కోమల్ వైపు చూస్తూ, నవ్వుతూ ‘‘కన్నుకొట్టాడు’’.

రూ.1,44,000 పైగా భారీ తగ్గింపుతో Sony BRAVIA 3 Series 75 అంగుళాల 4K Google TV..!
సోనీ (Sony) కంపెనీ నుంచి వచ్చిన అత్యాధునిక BRAVIA 3 సిరీస్ 75 అంగుళాల 4K అల్ట్రా HD AI స్మార్ట్ LED Google TV (మోడల్: K-75S30B) ప్రస్తుతం అమెజాన్‌లో భారీ డిస్కౌంట్‌తో అందుబాటులో ఉంది. ఈ టీవీ అసలు ధర రూ. 2,69,900 కాగా, ఏకంగా 54% తగ్గింపుతో కేవలం రూ. 1,24,990.00 ధరకు విక్రయించబడుతోంది. ఇది అమెజాన్ ‘ఛాయిస్’ ఉత్పత్తిగా కూడా ఉంది. ఈ మోడల్ 75 అంగుళాల స్క్రీన్ సైజు, 4K అల్ట్రా HD (3840 x 2160 పిక్సెల్స్) రిజల్యూషన్, 60 Hz రిఫ్రెష్ రేట్‌తో కూడిన LED 4K HDR డిస్‌ప్లేను కలిగి ఉంది. దీనిలో 4K HDR Processor X1 ప్రాసెసర్, గూగుల్ టీవీ ఆపరేటింగ్ సిస్టమ్ ఉన్నాయి. ఇక ఇందులోని ముఖ్యమైన ఫీచర్లలో గూగుల్ అసిస్టెంట్, క్రోమ్ క్యాస్ట్ బిల్ట్ ఇన్, బిల్ట్ ఇన్ మైక్, గేమ్ మెనూ, ALLM/eARC (HDMI 2.1 Compatible), ఆపిల్ ఎయిర్ ప్లే, ఆపిల్ హోమ్ కిట్, అలెక్స సపోర్ట్ ఉన్నాయి. ఇంకా ఇందులో 20 Watts స్పీకర్ అవుట్‌పుట్, డాల్బీ ఆడియో, డాల్బీ ఆటమ్స్ ఆడియో టెక్నాలజీలతో కూడిన ఈ టీవీ కనెక్టివిటీ కోసం బ్లూటూత్, HDMI, USB (2 పోర్ట్‌లు), Wi-Fi, ఈథర్నెట్ పోర్ట్‌లను కలిగి ఉంది. ఇంకా ఇది 178 డిగ్రీల వీక్షణ యాంగిల్, 20.7 kg బరువుతో భారతదేశంలో తయారైన ఈ టీవీని EMI ద్వారా రూ. 6,060 నుంచి కొనుగోలు చేయవచ్చు.

తొలి భారత బ్యాట్స్‌మన్‌గా తిలక్ వర్మ రేర్ రికార్డు!
మంగళవారం రాత్రి ఒడిశాలోని కటక్‌లో భారత్, దక్షిణాఫ్రికా మధ్య తొలి టీ20 మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్‌లో టీమిండియా 101 పరుగుల భారీ తేడాతో విజయం సాధించింది. ఈ విజయంతో ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో భారత్ 1-0 ఆధిక్యంలో నిలిచింది. ఈ అద్భుతమైన విజయంతో పాటు ఈ మ్యాచ్‌లో భారత ఆటగాళ్లు అనేక రికార్డులను నెలకొల్పారు. ఈ మ్యాచ్‌లో భారత్ దక్షిణాఫ్రికాను 74 పరుగులకే ఆలౌట్ చేసింది. దక్షిణాఫ్రికా టీ20 చరిత్రలో ఇదే అత్యల్ప స్కోరు. ఈ మ్యాచ్‌లో భారత బౌలర్లు అద్భుతంగా రాణించారు. ప్రతి బౌలర్ కనీసం ఒక వికెట్ తీశారు. గతంలో దక్షిణాఫ్రికా అత్యల్ప స్కోరు 87. 2022లో రాజ్‌కోట్‌లో ఈ స్కోర్ నమోదైంది. టీ20 చరిత్రలో దక్షిణాఫ్రికా నాలుగు అత్యల్ప స్కోర్లు చేస్తే.. అందులో మూడుసార్లు ప్రత్యర్థిగా టీమిండియానే ఉంది. హార్దిక్ పాండ్యా టీ20ల్లో 100 సిక్సర్లు బాదాడు. దీంతో రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ క్లబ్‌లో చేరాడు. భారత్ తరఫున టీ20ల్లో అత్యధిక సిక్సర్లు బాదిన రికార్డు రోహిత్ పేరిట ఉంది. టీ20ల్లో హిట్‌మ్యాన్ 205 సిక్సర్లు బాదాడు. సూర్య 155 సిక్సర్లతో రెండవ స్థానంలో ఉన్నాడు. విరాట్ 124 సిక్సర్లు బాదాడు. ఆ తర్వాత 100 సిక్సర్లతో హార్దిక్ పాండ్యా ఉన్నాడు. కేఎల్ రాహుల్ 99 సిక్సర్లు బాది అరుదైన క్లబ్‌లో చేరేందుకు సిద్దమయ్యాడు.

కమెడియన్ సత్య సరసన మిస్ యూనివర్స్
టాలీవుడ్ తెరపై తనదైన కామెడీ టైమింగ్‌తో ప్రేక్షకులను కడుపుబ్బా నవ్విస్తూ, టాప్ కమెడియన్‌గా దూసుకుపోతున్న నటుడు సత్య ఇప్పుడు హీరోగా మారబోతున్నాడు. సత్య కెరీర్‌లో బిగ్గెస్ట్ బ్రేక్ ఇచ్చింది ‘మత్తు వదలరా’ ఫ్రాంచైజీ. దర్శకుడు రితేష్ రానా రూపొందించిన ఈ చిత్రంలో సత్య పోషించిన ‘యేసు దాసు’ పాత్ర అద్భుతం. ఈ పాత్రలో సత్య జీవించాడని చెప్పవచ్చు. ఈ సినిమాలో హీరో శ్రీసింహా కంటే కూడా సత్యకే ఎక్కువ పేరు, ప్రశంసలు దక్కాయి. ‘మత్తు వదలరా 2’ ప్రమోషన్స్ సమయంలో, దర్శకుడు రితేష్ రానా “సత్యను మెయిన్ హీరోగా పెట్టి ఒక సినిమా చేస్తాను” అని హామీ ఇచ్చారు. ఇప్పుడు ఆ మాటను నిలబెట్టుకుంటూ రితేష్ రానా తన నాల్గవ చిత్రానికి హీరోగా సత్యను అధికారికంగా ప్రకటించారు. ‘సత్య ఈజ్ నాట్ జెట్లీ’ “ఇక కామెడీ నాతో కాదు!” – ఈ ట్యాగ్‌లైన్ చూస్తుంటే, ఈ సినిమాలో సత్యను కొత్త కోణంలో, బహుశా సీరియస్ లేదా డిఫరెంట్ రోల్‌లో చూడబోతున్నామని అర్థమవుతోంది. ఈ చిత్రంలో హీరోయిన్‌గా కొత్త టాలెంట్‌ను పరిచయం చేయబోతున్నారు. మిస్ యూనివర్స్ ఇండియా 2024 రియా సింఘా ఈ సినిమాతో హీరోయిన్‌గా టాలీవుడ్‌కు పరిచయం కానుంది. రియా సింఘా భారతీయ మోడల్ మరియు అందాల పోటీ టైటిల్ హోల్డర్. ఆమె భారతదేశంలోని జైపూర్‌కు చెందినది. ఆమె 2024 సెప్టెంబర్ 22న మిస్ యూనివర్స్ ఇండియా 2024 టైటిల్‌ను గెలుచుకుంది. 2024 నవంబర్ 16న మెక్సికోలో జరిగిన మిస్ యూనివర్స్ 2024 పోటీలో ఆమె భారతదేశానికి ప్రాతినిధ్యం వహించింది. అక్కడ ఆమె టాప్ 30 సెమీ-ఫైనలిస్టులలో ఒకరిగా నిలిచి దేశానికి గర్వకారణంగా నిలిచింది. మిస్ యూనివర్స్ ఇండియా విజయానికి ముందు, ఆమె మిస్ టీన్ ఎర్త్ 2023 టైటిల్‌ను కూడా గెలుచుకుంది. త్వరలోనే ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించిన మరిన్ని వివరాలు వెల్లడయ్యే అవకాశం ఉంది.

కలిసొచ్చిన ఆలస్యం . . రికార్డు అడ్వాన్స్ బుకింగ్స్!
నందమూరి బాలకృష్ణ, మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను కాంబినేషన్‌లో వస్తున్న మోస్ట్ అవైటెడ్ సీక్వెల్ ‘అఖండ 2: తాండవం’ డిసెంబర్ 12న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. గత వారం విడుదల వాయిదా పడినప్పటికీ, ఆ అనూహ్య పరిణామం సినిమాపై హైప్‌ను మరింత పెంచేసిందనే చెప్పాలి. విదేశాల్లో, ముఖ్యంగా USA లో అడ్వాన్స్ బుకింగ్స్ ఊహించని విధంగా ఉన్నాయి. ‘అఖండ 2’ సినిమాకు సంబంధించి యూఎస్‌ఏలో అడ్వాన్స్ బుకింగ్స్ ఓపెన్ అయిన కొద్ది గంటల్లోనే టికెట్లు హాట్‌కేకుల్లా అమ్ముడవుతున్నాయి. మేజర్ సిటీస్‌లో టికెట్ల విక్రయం ఉప్పెనలా ఉంది. తాజా సమాచారం ప్రకారం, కేవలం ఆరు గంటల్లోనే ప్రీ-సేల్స్ ద్వారా $125 వేల డాలర్లు (సుమారు కోటి రూపాయలకు పైగా) వసూలు చేసి, తెలుగు సినిమా చరిత్రలోనే అత్యంత వేగంగా ఈ మార్కును చేరుకున్న సినిమాగా ‘అఖండ 2’ నిలిచింది. ఈ రికార్డ్ బాలయ్య క్రేజ్ ఏ స్థాయిలో ఉందో తెలియజేస్తోంది. ప్రీమియర్ షోల కోసం ప్రవేశపెట్టిన $16 కొత్త ధర వ్యూహం అద్భుతమైన సానుకూల ప్రభావాన్ని చూపింది. అభిమానులు మరియు సినీ ప్రేమికులు ఈ ఆఫర్‌ను అందిపుచ్చుకుని, తమ ఫేవరేట్ హీరో సినిమాను ముందుగానే వీక్షించడానికి ఉత్సాహం చూపుతున్నారు. ఈ జోరును కొనసాగిస్తూ, యూఎస్‌ఏలో డిసెంబర్ 11 రాత్రే ప్రీమియర్ షోలు ప్రదర్శితం కానున్నాయి. డిసెంబర్ 5న విడుదల కావాల్సిన ఈ సినిమా ఆర్థిక, న్యాయపరమైన వివాదాల కారణంగా చివరి నిమిషంలో వాయిదా పడింది. అయితే, ఈ గందరగోళం సినిమాకు అదనపు ప్రచారాన్ని తీసుకురావడమే కాక, బాలయ్య అభిమానుల్లో ఆసక్తిని పతాక స్థాయికి చేర్చింది.

Exit mobile version