వైఎస్ జగన్‌పై మంత్రి ఆనం సంచలన వ్యాఖ్యలు.. ఉనికి కోల్పోతానన్న భయంతోనే..!
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, వైఎస్ జగన్‌పై మంత్రి ఆనం రామనారాయణరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు.. ప్రకాశం జిల్లా పర్యటనలో ఆయన మాట్లాడుతూ.. జగన్‌కు రైతులపై అకస్మాత్తుగా ప్రత్యేకమైన ప్రేమ పుట్టుకొచ్చిందని ఎద్దేవా చేశారు.. జగన్ అధికారంలో ఉన్న సమయంలో ఒక్క రైతుని కూడా పరామర్శించలేదన్న ఆయన.. మొంథా తుఫాను ఎదుర్కొనేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు అహర్నిశలు శ్రమించారని, తుఫాను సమయంలో ప్రభుత్వం చక్కగా పని చేసిందని ప్రజలంతా ప్రశంసిస్తున్నారని తెలిపారు. అయితే ఉనికి కోల్పోతానన్న భయంతో వైఎస్ జగన్ అసత్య ఆరోపణలు చేస్తున్నాడని అన్నారు. ప్రతిపక్ష నేత అర్హత కూడా జగన్ సంపాదించుకోలేకపోయారని విమర్శించారు. ప్రభుత్వం పనిచేయకపోతే అసెంబ్లీలోకి వచ్చి చర్చించాలన్నారు. జగన్ ప్రభుత్వంలో చేసిన పనులు, కూటమి ప్రభుత్వం చేస్తున్న పనులు అసెంబ్లీలో చర్చిస్తే ప్రజలకు స్పష్టత వస్తుందని తెలిపారు మంత్రి ఆనం.. వైఎస్ జగన్ పార్టీలో గెలిచిన పది మంది ఎమ్మెల్యేలను ప్రజలు కూడా మర్చిపోయారని వ్యాఖ్యానించారు.. కొత్త జిల్లాలు, కొత్త రెవెన్యూ డివిజన్‌ల ఏర్పాటు విషయంలో మంత్రి వర్గ ఉపసంఘం పని చేస్తోందని తెలిపారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు జిల్లాల ఏర్పాటుపై ముఖ్యమంత్రి చంద్రబాబు తుది నిర్ణయం తీసుకుంటారని చెప్పారు మంత్రి ఆనం రామనారాయణరెడ్డి..
చంద్రబాబుది టార్చ్ లైట్ పాలనైతే.. జగన్ ది టార్చ్ బేరర్ పాలన..
ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పాలనపై సెటైర్లు వేశారు వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి కొండా రాజీశ్ గాంధీ.. చంద్రబాబుది టార్చ్ లైట్ పాలనైతే.. జగన్ ది టార్చ్ బేరర్ పాలన అని పేర్కొన్నారు.. విశాఖపట్నంలో మీడియాతో మాట్లాడిన ఆయన.. వీధిలైటు వెలగకపోతే తనకు తెలుస్తుందన్న చంద్రబాబుకు కేజీహెచ్ లో 12 గంటలు కరెంటు లేదన్న విషయం ఎందుకు తెలియ లేదు..? అని ప్రశ్నించారు.. పేదల ఆరోగ్యం మీద ప్రభుత్వానికి బాధ్యత లేదు అని మండిపడ్డారు.. ఐదు జనరేటర్లు పెడితే కేజీహెచ్ కు కరెంటు వచ్చేది.. లక్ష రూపాయల ఖర్చు చేస్తే రోగులు ఇబ్బంది పడేవారు కాదు.. జనరేటర్ కూడా ఏర్పాటు చేయలేని దుస్థితిలో కూటమి ప్రభుత్వం ఉంది అని విమర్శించారు.. కూటమి పాలనలో హాస్పిటల్‌లో రోగులకు.. దేవాలయాల్లో భక్తులకు రక్షణ లేకుండా పోయిందన్నారు.. పలాస వెంకటేశ్వర స్వామి దేవాలయంలో భక్తులు చనిపోతే ప్రభుత్వ పరిధిలో దేవాలయం కాదన్నారు.. మరి కేజీహెచ్ ప్రభుత్వ ఆస్పత్రి కాదా? అని నిలదీశారు.. దేవి అనే మహిళ చనిపోతే ఎవరు బాధ్యత వహిస్తారు..? అని ఫైర్ అయ్యారు వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి కొండా రాజీశ్ గాంధీ.
వీడియోతో పోలీసులకు సవాల్ విసిరిన బైక్ దొంగ.. అరెస్ట్ చేసి చుక్కలు చూపించిన పోలీసులు..
గుట్టు చప్పుడు కాకుండా అందినకాడికి దండుకొని ఎంజాయ్ చేసే దొంగలు ఉన్నారు.. అయితే, ఏ దొంగ అయినా.. ఇప్పుడు కాకపోతే.. కొంత కాలానికైనా దొరకకుండా తప్పించుకోలేడు.. మరికొందరైతే పోలీసులకే సవాల్ విసిరే వాళ్లు ఉన్నారు.. తాజాగా, పోలీసులకు సవాల్ విసిరిన ఓ దొంగను పట్టుకుని.. చుక్కలు చూపించారు పోలీసులు.. బైక్ చోరీలకు పాల్పడడమే కాదు.. చోరీ చేసిన బైకులను అమ్మగా వచ్చిన డబ్బులతో జల్సా చేస్తూ పోలీసులకే సవాల్ విసిరాడు ఓ దొంగ.. 100 బైకులు చోరీ చేశా.. తనపై రెండు కేసులు ఉన్నాయి.. ఏం చేస్తారో చేయండి అంటూ మద్యం మత్తులో పోలీసులకే సవాల్ విసిరాడు ఓ దొంగ.. అయితే, దొంగ మాట్లాడిన మాటలను ఏలూరు పోలీసులు సీరియస్‌గా తీసుకున్నారు. వీడియో వైరల్ అయిన కొద్ది రోజుల్లోనే ఏం చేస్తారో చేయండి అంటూ మాట్లాడిన బైక్ దొంగ దలాయి గణేష్ తో పాటు బైక్ చోరీలకు పాల్పడుతున్న మరో నలుగురిని పోలీసులు అరెస్టు చేశారు. నిందితుల దగ్గర నుంచి తొమ్మిది లక్షల విలువ చేసే పన్నెండు బైక్‌లను ఏలూరు పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పోలీసులకు సవాల్ విసిరిన దొంగను మీడియా ముందు ఉంచి గతంలో చెప్పిన డైలాగులు చెప్పాలంటూ ఏలూరు జిల్లా ఎస్పీ ప్రతాప శివ కిషోర్ అడగడం ఆసక్తికరంగా మారింది..
ఫుడ్ పాయిజన్ ఎఫెక్ట్.. సొంత ఊర్లకు ఎస్‌ఆర్‌ఎం వర్సిటీ విద్యార్థులు..
గుంటూరు జిల్లాలోని ఎస్ఆర్ఎం యూనివర్శిటీలో ఫుడ్ పాయిజన్ ఘటన కలకలం రేపింది. నాలుగు రోజుల క్రితం కాలేజీ హాస్టల్‌లో జరిగిన ఫుడ్ పాయిజన్ ఘటనలో సుమారు 300 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. అయితే, ఈ ఘటనపై ప్రభుత్వం సీరియస్‌గా స్పందించింది. గుంటూరు జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో విచారణ కమిటీని ఏర్పాటు చేసింది. ఈ నేపథ్యంలో యూనివర్శిటీ రిజిస్ట్రార్ సెలవులు ప్రకటించారు.. ఇవాళ్టి నుంచి ఈ నెల 23వ తేదీ వరకు రెండు వారాలపాటు సెలవులు పేర్కొన్నారు ఎస్ఆర్ఎం యూనివర్శిటీ రిజిస్ట్రార్.. అయితే, యూనివర్సిటీలో మొత్తం శానిటైజేషన్ డ్రైవ్ నిర్వహించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. యూనివర్సిటీ నిర్ణయంతో ఇప్పటికే విద్యార్థులు హాస్టల్‌లు ఖాళీ చేసి తమ సొంత ఊర్లకు పయనమయ్యారు. కాగా, ఎస్ఆర్ఎం యూనివర్సిటీలో ఫుడ్ పాయిజన్ ఘటన తీవ్ర కలకలం రేపింది.. చివరకు ప్రభుత్వం స్పందించి గుంటూరు జిల్లా కలెక్టర్ నేతృత్వంలో విచారణ కమిటీ ఏర్పాటు చేయడంతో పాటు.. వెంటనే నివేదిక అందించాలని ఆదేశాలు జారీ చేసిన విషయం విదితమే.
హైదరాబాద్‌లో కొత్త సినీ పండుగకు శ్రీకారం.!
హైదరాబాద్ నగరం మరో అంతర్జాతీయ సినీ వేడుకకు వేదిక కానుంది. హైదరాబాద్ ఇంటర్నేషనల్ షార్ట్ ఫిలిం ఫెస్టివల్ (HISFF) వెబ్‌సైట్‌ను అధికారికంగా ప్రారంభించారు. ఈ వెబ్‌సైట్‌ను తెలంగాణ ఫిల్మ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ (TFDC) చైర్మన్ దిల్ రాజు, ఎఫ్డీసీ మేనేజింగ్ డైరెక్టర్ ప్రియాంక సంయుక్తంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా దిల్ రాజు మాట్లాడుతూ..హైదరాబాద్‌కు ఉన్న సినీ గుర్తింపును మరింత అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లడమే ఈ షార్ట్ ఫిలిం ఫెస్టివల్ ఉద్దేశ్యం అని అన్నారు. షార్ట్ ఫిలిం మేకర్లకు ఇది తమ ప్రతిభను ప్రపంచానికి చూపించే గొప్ప వేదిక అవుతుందన్నారు దిల్ రాజు. ఈ ఫెస్టివల్ డిసెంబర్ 19, 20, 21 తేదీల్లో ఘనంగా జరగనుంది. హైదరాబాద్ ఐమాక్స్ థియేటర్ ఈ అంతర్జాతీయ షార్ట్ ఫిలిం ఉత్సవానికి వేదిక కానుంది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న షార్ట్ ఫిలిం మేకర్లందరికీ ఇందులో పాల్గొనే అవకాశం ఉంది. పాల్గొనదలచిన వారు 3 సెకన్ల నుంచి 25 నిమిషాల వరకు నిడివి గల షార్ట్ ఫిలిమ్స్ తయారు చేసి, HISFF అధికారిక వెబ్‌సైట్ hisff.in ద్వారా నేరుగా అప్‌లోడ్ చేయాలి. ఫెస్టివల్‌లో భాగంగా ఇంటర్నేషనల్ స్థాయి ఆర్టిస్టులు, సాంకేతిక నిపుణులు, దర్శకులు పాల్గొననున్నారు. ఫెస్టివల్ చివరి రోజున తెలంగాణ ముఖ్యమంత్రిని ఆహ్వానించే ప్రయత్నం చేస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు.
సైబర్ ముఠా రహస్యాలు వెలుగులోకి.. బిగ్ ఆపరేషన్..!
సైబర్ నేరగాళ్లపై హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు బిగ్ ఆపరేషన్ చేపట్టారు. నగరంలో పెరుగుతున్న సైబర్ మోసాలను అరికట్టేందుకు పోలీసులు దాదాపు నెలరోజుల పాటు ప్రత్యేక దర్యాప్తు, ఆపరేషన్ నిర్వహించారు. ఈ ఆపరేషన్‌లో భాగంగా అక్టోబర్ నెలలో మొత్తం 196 ఎఫ్‌ఐఆర్‌లు నమోదు చేసి, దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాలకు చెందిన 55 మంది నిందితులను అరెస్టు చేసినట్లు అధికారులు వెల్లడించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఈ నెలలోనే సైబర్ మోసగాళ్ల వివిధ బ్యాంక్ ఖాతాల్లో రూ.107 కోట్ల లావాదేవీలు జరిగినట్లు గుర్తించారు. దర్యాప్తులో భాగంగా బ్లాక్ చేయించిన ఖాతాలు, ఫ్రీజ్ చేసిన లావాదేవీల ద్వారా ఇప్పటి వరకు బాధితులకు రూ.62.34 లక్షలు తిరిగి చెల్లించినట్లు తెలిపారు. సైబర్ మోసాలు ఏ రకంగా జరుగుతున్నాయో పోలీసులు వివరించారు. వీటిలో ప్రధానంగా ఇన్వెస్ట్‌మెంట్ స్కామ్‌లు, ఫేక్ ట్రేడింగ్ యాప్‌లు, సోషల్ మీడియా ఫ్రాడ్‌లు, డిజిటల్ అరెస్టు స్కామ్‌లు ఉన్నట్లు వెల్లడించారు. చైనా పౌరుల సహకారంతో నడుస్తున్న డిజిటల్ అరెస్టు మోసం పెద్ద ఎత్తున జరుగుతోందని, దీనిపై ప్రత్యేకంగా దృష్టి సారించినట్లు అధికారులు చెప్పారు.
సాంకేతిక లోపంతో నిలిచిపోయిన 300 విమానాలు.. ఎక్కడో తెలుసా..?
దేశ రాజధాని ఢిల్లీ విమానాశ్రయం (IGI) లో ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ (ఏటీసీ) వ్యవస్థలో సాంకేతిక లోపం కారణంగా 300కి పైగా విమానాలు నిలిచిపోయాయి. దీంతో ప్రయాణికులు తీవ్ర అవస్థలు పడుతున్నారు. అయితే, దేశంలోనే అత్యంత రద్దీగా ఢిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం.. ప్రతిరోజూ 1,500కి పైగా విమాన రాకపోకలు కొనసాగుతాయి. కానీ, గురువారం సాయంత్రం నుంచి సాంకేతిక సమస్యలు తలెత్తడంతో.. శుక్రవారం కూడా అదే సమస్య కొనసాగుతుంది. దీని వలన విమాన రాకపోకల్లో తీవ్ర జాప్యం చోటు చేసుకుంది. ఇక, సమయానికి గమ్యస్థానాలకు చేరుకోకపోవడంతో వందలాది మంది ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. సమస్యను త్వరగా పరిష్కరించాలంటూ సోషల్ మీడియా వేదికగా అధికారులను ప్యాసింజర్లు కోరుతున్నారు.
అమెరికాకు సవాల్ విసిరిన చైనా! మూడో యుద్ధ నౌక ప్రవేశం..
అగ్రరాజ్యం అమెరికాతో చైనా నౌకాదళం పోటీ పడుతుంది. ఈ సందర్భంగా తన ఆయుధ సంపత్తిని విస్తరించేందుకు ప్లాన్ చేసింది. అందులో భాగంగా అత్యంత సామర్థ్యం కలిగిన ‘ఫుజియాన్’ యుద్ధ నౌకను తాజాగా అందుబాటులోకి తీసుకొచ్చింది. పూర్తిగా స్వదేశీ పరిజ్ఞానంతో తయారు చేసిన ఈ విమాన వాహన నౌకను చైనా ప్రెసిడెంట్ షీ జిన్‌పింగ్ ప్రారంభించినట్లు సమాచారం. అయితే, బుధవారం హైనాన్ ద్వీపంలోని సైనిక నౌకాశ్రయంలో దీనికి సంబంధించిన సెలబ్రేషన్స్ జరిగినట్లు స్థానిక మీడియా కథనాలను ప్రసారం చేసింది. ఈ సందర్భంగా జిన్‌పింగ్ యుద్ధ నౌకను పరిశీలించినట్లు అందులో పేర్కొనింది. ఫుజియాన్ చైనాకు చెందిన మూడో అత్యంత అధునాతన యుద్ధ నౌకగా అభివర్ణించారు. విద్యుదయస్కాంత ఆధారిత వ్యవస్థ అయిన ఎమాల్స్‌ను అందులో ఉపయోగించారు. 316 మీటర్ల పొడవు, 80 వేల టన్నుల బరువు ఉన్న ఈ ఫుజియాన్‌కు దాదాపు 50 విమానాలను సులభంగా మోసుకెళ్లే సామర్థ్యం ఉంది.
ఆ సెలెక్టర్ నన్ను లైంగికంగా వేధించాడు.. పీరియడ్స్ టైం అడిగేవాడు..
బంగ్లాదేశ్ మహిళల క్రికెట్ జట్టు పేసర్ జహనారా ఆలమ్ సంచలన ఆరోపణలు చేసింది. 2022 మహిళల వన్డే వరల్డ్ కప్ సందర్భంగా మాజీ సెలెక్టర్ మంజురుల్ ఇస్లాం.. లైంగిక వేధింపులకు పాల్పడ్డాడని పేర్కొనింది. ప్రస్తుతం జహనారా బంగ్లా జట్టుకు దూరంగా ఉండగా.. మంజురుల్ ఇస్లాం చేసిన ప్రతిపాదనకు తాను ఒప్పుకోకపోవడంతో తన కెరీర్ తీవ్రంగా నష్టపోయిందన్నారు. నేను ఒకసారి కాదు.. అనేక సార్లు ఇలాంటి అసభ్యకరమైన ప్రతిపాదనలు ఎదుర్కొన్నాను అన్నారు. మేం టీమ్ లో ఉన్నప్పుడు చాలా విషయాల గురించి మౌనంగా ఉండాల్సి వచ్చేది.. నిరసన కూడా తెలిపే అవకాశం ఉండదు.. బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డ్‌లోని చాలా మంది సీనియర్ అధికారుల సపోర్టు కోరడానికి ట్రై చేశాను.. మహిళా కమిటీ ఛైర్‌పర్సన్ నాదెల్ చౌదరి, బీసీబీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ నిజాముద్దీన్ చౌదరి దృష్టికి ఈ విషయాన్ని తీసుకెళ్లాను అని జహనారా ఆలమ్ వెల్లడించింది.
ఫస్ట్ టైమ్ అలాంటి పని చేస్తున్న జక్కన్న.. మహేశ్ ఫ్యాన్స్ టెన్షన్
రాజమౌళి ఎక్కువగా తనకు కలిసొచ్చిన యాంగిల్ లోనే సినిమాలు చేసుకుంటూ పోతాడు. కొత్తగా ప్రయోగాలు చేయడం ఇప్పటి వరకు చూడలేదు. మరీ ముఖ్యంగా ఆయన సినిమాలు చూస్తే.. ఓ స్టూడెంట్ల నెంబర్ వన్, సై, విక్రమార్కుడు, బాహుబలి, త్రిబుల్ లాంటి కథలే కనిపిస్తాయి. అంటే ఇందులో ఎక్కడా టెక్నాలనీ బేస్డ్ గా సినిమా కనిపించదు. ఆయన సినిమాల్లో కథా బలమే కనిపిస్తుంది. బలమైన ఎమోషన్, కళ్లు చెదిరే యాక్షన్, కథలో కొత్తదనం మాత్రమే మనకు కనిపిస్తాయి. ఒక ప్రేక్షకుడికి అందులోనూ తెలుగు ప్రేక్షకులకు ఎలాంటి కథలు, ఎమోషన్స్, యాక్షన్ నచ్చుతాయో వాటినే హైలెట్ చేస్తాడు జక్కన్న. అదే ఆయన స్పెషాలిటీ. అయితే ఇప్పుడు మహేశ్ బాబుతో తీయబోతున్న సినిమాలో ఫస్ట్ టైమ్ టెక్నాలజీని ఎక్కువగా వాడుతున్నట్టు కనిపిస్తోంది.
‘నీకేం తెలుసు’ అని అమ్మాయిలను అవమానిస్తారు.. రష్మిక కామెంట్స్
రష్మిక మంధాన, దీక్షిత్ శెట్టి జంటగా నటించిన ‘ది గర్ల్ ఫ్రెండ్’ సినిమా నవంబర్ 7న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. రాహుల్ రవీంద్రన్ దర్శకత్వం వహించిన ఈ మూవీ విడుదలైన తర్వాత మంచి స్పందన అందుకుంటోంది. ఈ సందర్భంగా రష్మిక సినిమా సక్సెస్‌కి ధన్యవాదాలు తెలుపుతూ ఓ ఎమోషనల్ లవ్ లెటర్‌ను పంచుకుంది. ఆ లెటర్‌లో రష్మిక మాట్లాడుతూ “‘అమ్మాయివి నీకేం తెలుసు’ అనే మాటలు మనకు చాలా సార్లు వినిపిస్తాయి. కానీ నేటి అమ్మాయిలు తమకేం కావాలో బాగా తెలుసుకుంటున్నారు. నేనూ ఆ దశలోంచే వచ్చాను. నాకు కూడా అలాంటి అవమానాలు ఎదురయ్యాయి. కానీ వాటిని తట్టుకుని ముందుకు వచ్చాను. ఈ సినిమా ప్రతి అమ్మాయి మనసును తాకుతుంది. ఈ సినిమాను ఎంతో కష్టపడి చేశాను. అమ్మాయిలు ఎదుర్కుంటున్న సమస్యలే ఇందులో కీలకం. ఇదంతా లవ్ స్టోరీ మూవీ అనుకుంటున్నారు. కానీ ఇందులో ఒక అమ్మాయిగా తనకేం కావాలి.. తాను తెలుసుకోవాల్సింది ఏంటి అనేది చూపించాం” అని చెప్పింది. ఇక రష్మిక నటన, రాహుల్ రవీంద్రన్ సున్నితమైన కథనం, రొమాంటిక్ ఎమోషన్‌ల మేళవింపుతో ‘ది గర్ల్ ఫ్రెండ్’ సినిమా ప్రేక్షకుల హృదయాలను గెలుచుకుంటోందని సినీ వర్గాలు చెబుతున్నాయి. రష్మికకు ఈ సినిమాకు గాను నేషనల్ అవార్డు రావాలంటూ అల్లు అరవింద్ చేసిన కామెంట్లు వైరల్ అవుతున్నాయి. మరి గర్ల్ ఫ్రెండ్ కమర్షియల్ గా ఏ మేరకు సక్సెస్ సాధిస్తుందో చూడాలి.
